Tuesday, December 31, 2013

సీమ భవితవ్యంపై నీలినీడలు - లెక్కల వెంకటరెడ్డి

రాష్ట్ర విభజన అంశం శరవేగంతో దూకుసువెళ్తూ చరమాంకంలో ప్రవేశించింది. జిఓఎం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పలు దఫాలుగా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు సూచనలు సేకరించి తనదైన శైలిలో విభజన బిల్లు ముసాయిదాను రూపొందించింది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలతో అది పార్లమెంటుకు చేరి ఆమోదం పొందడంతో చట్టరూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో జి.ఓ.ఎం. కాని దాని ముందటి ఆంటోని కమిటీ గాని విభజన అంశాలపై విస్తృత చర్చలు జరిపినట్లు చెప్పుకున్నప్పటికీ అదంతా కాంగ్రెస్‌ అధినేత్రి కనుసన్నల్లోనే జరిగిందనేది తిరుగులేని వాస్తవం! బిల్లు రూపకల్పన గాని, ముసాయిదాపై జరిగిన ఉత్తుత్తి చర్చగాని అధినేత్రి అభీష్ఠం మేరకే సాగింది. ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే!నామ్‌కే వాస్తేగా జరిగిన ఈ విభజన బిల్లు మొత్తం వ్యవహారంలో రాయలసీమ గురించి ఎలాంటి చర్చ జరుగకుండా పోయింది. కనీసం దాని ఊసైనా చర్చల్లో రాకుండా పోవడమనేది రాయలసీమ వాసులకు మింగుడుపడని అంశం! ముసాయిదా చర్చల్లో నామమాత్రంగానైనా పాలుపంచుకున్న రాజకీయ శక్తులు, వ్యక్తులు రాయలసీమ అంశాన్ని ప్రస్తావించకపోవడం, ముసాయిదాగా మూలవిరాట్టు అయిన అధినేత్రి కూడా ఆ అంశాన్ని స్పృశించకపోవడాన్ని రాయలసీమ బిడ్డలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వివక్ష ధోరణి రాయలసీమ ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని వారు భావిస్తున్నారు. అంతేగాకుండా చాపక్రింద నీరులా సీమ భవిష్యత్తు పై నీలినీడలు కమ్ముకొస్తున్నాయనే దానికి ఇది ఒక సంకేతమని వారు తలుస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రం అవతరణ కాని, విశాలాంధ్ర ఆవిర్భావం కాని రాయలసీమ ప్రజల అనన్యసామాన్య త్యాగనిరతితోనే సాధ్యం అయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సులభంగా జరుగలేదు. దాని వెనుక దశాబ్దాల ఉద్యమ పోరాటం ఉంది. రాయలసీమ వాసుల సహకారం లేనిదే ఆంధ్రోద్యమం ప్రారంభం కాలేదు. రాయలసీమ వాసుల విశ్వాసాన్ని చూరగొనేందుకు కోస్తాంధ్రులు ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నారు. లెక్కకుమించి ఎత్తులు, ప్రయత్నాలు చేశారు. చివరకు వారికి ఇష్టంలేకపోయినా గత్యంతరం లేని పరిస్థితులలో శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకొనకతప్పలేదు. మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌ భవనంలో 1937 నవంబర్‌ 16న జరిగిన ఈ ఒడంబడిక అప్పుడూ -ఇప్పుడూ ఏనాడూ ఆవగింజంత కూడా అమలుకాలేదు. అయితే ఆనాటి ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని చారిత్రక పట్టణం కర్నూలు రాజధాని కాగలిగింది. కోస్తాంధ్రుల తీవ్ర నిరసనల మధ్య రాజధాని నగరం కాగలిగిన కర్నూలు దాన్ని మూన్నాళ్ళముచ్చటగా మూడేళ్ళ వరకే పొందగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావంతో దాన్ని హైదరాబాద్‌ తన్నుకుపోయింది. ఈ మూన్నాళ్ళ ముచ్చటైన రాజధాని హోదా తప్ప శ్రీబాగ్‌ ఒడంబడిక ద్వారా రాయలసీమ ఇతర ఎలాంటి ప్రయోజనం పొందలేదు. కాగా సాగునీటి విషయంలో అయితే ఒప్పందం ఘోరంగా ఉల్లంఘించబడింది. ఈ ఒప్పందంలోని అంశాలలో సగమైనా అమలై ఉంటే రాయలసీమ ఇంతటి ఘోర వెనుకబాటుతనానికి గురై ఉండేదికాదు.
శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ప్రస్తావించడం నాటి ఆంధ్ర రాష్ట్రం అవతరణలో అప్పటి తరం రాయలసీమ నేతల గణనీయ పాత్రను, వారి త్యాగశీల ఉదార స్వభావాన్ని గుర్తు చేయడానికే! కొన్ని ప్రధానమైన నిర్ణయాలలో సీమ ప్రజలు ద్వితీయశ్రేణి పేరిటగా పరిగణించబడ్డారు కూడా! ఆంధ్ర అనే పదం దానికి కోస్తా నాయకులు అర్థం పర్థం లేని వాదనలు లేవదీసి ప్రాథమిక దశలోనే దాన్ని త్రోసిపుచ్చారు. అయినా ఆంధ్ర రాష్ట్ర సాధనకు రాయలసీమ వాసులు మనస్ఫూర్తిగా సహకరించారు. అందుకు శ్రీబాగ్‌ ఒడంబడిక కంటే తెలుగు ప్రజల ఐక్యతా ఆకాంక్ష ప్రధాన కారణమై నిలిచింది. రాష్ట్ర విభజన అంశం బలంగా రూపుదిద్దుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సీమవాసులు సమైక్య ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషించారు. గత ఆగస్టు నుండి మహోగ్రంగా సాగిన సమైక్య ఉద్యమం కోస్తాలో కంటే రాయలసీమలోనే ఉధృతంగా సాగిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు పత్రికల కథనాలు. టీవీ ఛానెళ్ళ ప్రసారాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సమైక్యంలో సీమకు ఎలాంటి ప్రయోజనం కలుగకపోయినా విడిపోతే కోస్తాంధ్రుల కుట్రలకు మరింత బలికావాల్సి ఉంటుందనేది సీమవాసుల అభిప్రాయం! అందుకు ఆంధ్ర రాష్ట్రంలోని అనుభవాలే వారిని ఆలోచింపచేస్తున్నాయి. అంతేగాకుండా ఒక ఉదాత్త భావజాలంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ చీలికకు గురై భావోద్వేగ అనుభూతులను అదృశ్యం చేసుకోకూడదనే తపన కూడా ఒక ప్రధాన కారణం! విభజన చర్చలు ఊపందుకొని నెలల తరబడి చర్చలు జరిగిన సందర్భంలో విడిపోయే పక్షంలో రాయలసీమ విషయం ఏమిటనేది చర్చల్లో పొరపాటున కూడారాలేదు. ఆ మార్గంలో ఆంటోని కమిటీ గాని, జిఓయం గాని చర్చలకే అవకాశమివ్వలేదు. అసలు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో తెలంగాణా, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ ఒకటున్నదనే స్పృహే కలుగలేదు. సీమాంధ్రలో దాన్ని మిళితం చేసి రాయలసీమ ప్రాంతాన్నే తెరమరుగుచేశారు. చాలామంది రాయలసీమ ప్రజాప్రతినిధులు కేంద్రానికి, కోస్తాంధ్రులకు ఊడిగం చేసేందుకే సిద్ధపడ్డారు తప్ప శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో రాయలసీమ వెనుకబాటును గుర్తించలేదు. విడిపోతున్న భాగానికి తెలంగాణా మిగిలిన భాగానికి సీమాంధ్రగా ఇప్పటికే నామకరణం వారికి వారే చేసుకున్నారు. సీమాంధ్ర స్థానంలో రాయలసీమ నేతలు గతంలో సూచించిన విధంగా రాయలాంధ్ర పేరును సూత్రప్రాయంగా నైనా ఎత్తకపోవడం కోస్తావారి కుత్సితబుద్ధికి నిదర్శనం కాక మరేమిటి పైగా సీమాంధ్ర అనే పేరుకు రాయలసీమ పేరులోని ఆఖరు పదాన్ని తీసుకొని ఆంధ్ర పదానికి ముందు కలిపామని ఒక వికృత వివరణ అదే నిజమని అనుకుంటే కోనసీమ, దివిసీమ లాంటి కోస్తా ప్రాంతాలలోని ఆఖరు పదం మాటేమిటి ఆంటోని కమిటీ ముందు గాని, జిఓఎం ముందుగాని రాజకీయ పార్టీలు చేసిన సూచనలు, సమర్పించిన నివేదికల్లో రాయలసీమ ఊసే కనిపించదు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు విభిన్న ప్రాంతాలలో రాయలసీమ ఒకటి అనే విషయం కూడా ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపూ ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలదే చర్చ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో, అది ఆంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందే దశలో రాయలసీమ అవసరం ఎంతో కన్పించింది. రాయలసీమ నిరంతరం చర్చల్లో ఉండేది. వారి త్యాగాలకు గాలంవేసి రాయలసీమ నేతలను ఆపద్భాంధవులుగా చూసుకున్నారు. ఆ అవసరం ఎప్పుడో తీరిపోయింది. ఇప్పుడా అవసరం ఎటుచూసినా కన్పించడంలేదు. అందుకే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో రాయలసీమను, సీమవాసులను కరివేపాకుగా మార్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోలవరం, భద్రాచలంపై జరిగిన మొత్తం చర్చలో రాయలసీమ పై ఆవగింజంత కూడా చర్చ రాకపోవడం అసంబద్ధమైన పరిణామం! రాయలసీమ అస్థిత్వాన్ని, చరిత్రను ధ్వంసం చేసే విధంగా భారీ స్థాయిలో క్యాబినెట్‌ సమావేశం వరకు తీసుకుపోయిన రాయలసీమ ప్రతిపాదనలోని రాయల పద ధ్వనిని భరించడం రాయలసీమ వాసులకు గుండెలపై సమ్మెటపోటు లాంటిది. అంతకంటే నిలువునా అగ్నికి ఆహుతి కావడం వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. విభజన తర్వాత మిగిలిన భూభాగానికి రాయలాంధ్రగా మార్పు చేయాలని ఆలోచించకపోవడం అవగాహన లోపం కాదు. రాజధాని ప్రాంత గుర్తింపుకు సం బంధించి ఇప్పటికీ వచ్చిన రెండు మూడు ప్రతిపాదనలలో సీమ ప్రాంతం లేకపోవడం యాధృచ్ఛికం కాదు. నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నగరం సీమప్రాంతం లోనిదే అనే విషయం మరిచిపోయారా పోలవరానికి జాతీయ హోదా ప్రధానమైనప్పుడు సీమలోని సాగునీటిప్రాజెక్టులకు నీటి కేటాయింపు ప్రధానం కాదా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2013 లో రాయలసీమను భాగంగా పేర్కొనకపోవడమటుంచి కనీసం ప్రస్తావన కూడా లేకపోవటం రాయలసీమి చరిత్రను ప్రాంత వైశిష్ట్యాన్ని సీమ త్యాగనిరతిని సమాధిచేయటమే! రాయలసీమ భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా యివ్వని రాష్ట్ర విభజన రాయలసీమకు శాపగ్రస్తమే! విభజన అనివార్యంగా కనిపిస్తోన్న ఈస్థితి రాయలసీమ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపనుంది. కోస్తాంధ్రులతో రాయలసీమవాసులు కలిసి జీవించవలసి వస్తే శ్రీబాగ్‌ ఒడంబడిక పూర్తిస్థాయిలో అమలుకు ఒత్తిడి తీసుకురావాలి. అది సాధ్యం కానప్పుడు పాత రాయలసీమ ప్రాంతంతోపాటు ఇతర భౌగోళిక సారూప్య ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు సీమవాసులు,సీమఉద్యమసంస్థలు సీమ రాజకీయ పార్టీలు, నాయకులు నడుంకట్టి ఉద్యమించాలి.
-లెక్కల వెంకటరెడ్డి 
రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు
Andhra Prabha daily (31-12-2013)

Thursday, December 19, 2013

తప్పదు ప్రత్యేక రాయలసీమ - బండి నారాయణస్వామి

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?... సీమాంధ్ర కాదు. రాయల తెలంగాణ కాదు. మరి ప్రత్యేక రాయలసీమా? ఔను! మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!

సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ వేర్పాటువాదానికి వ్యతిరేకమైన ఉద్యమం. ప్రపంచంలో ఉద్యమాలు అనేకం ఉన్నాయి గానీ సమైక్యాంధ్ర వంటి ప్రతి ఉద్యమం ఎక్కడా కనబడదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేకుండా, తెలంగాణ ఉద్యమం ఉంటుందిగానీ, తెలంగాణ ఉద్యమం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి అస్తిత్వం లేదు. స్వీయ అస్తిత్వమున్న తెలంగాణ ఉద్యమానికీ స్వీయ అస్తిత్వం లేని సమైక్యాంధ్ర ఉద్యమానికీ మధ్య చాలా అంతరాలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో విడిపోవాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక ఆత్మగౌరవ సమస్య ఉంది. తెలంగాణ ఉద్యమం గతకాలపు నేలమాళిగల్లో దాగిన తెలంగాణ చారిత్రక ఘటనలెన్నిటినో వెలికితీసింది. రైతాంగ సాయుధ పోరాటం, పటేల్ పట్వారీలూ, రజాకార్లూ, నిజాం పాలన, హైదరాబాద్ స్టేట్ మీద పోలీసు చర్య మొదలైన అనేక చారిత్రక అంశాల్ని కొత్త వెలుగులో పునర్మూల్యాంకనం చేసింది. ఆధునిక విద్య విస్మరిస్తున్న స్థానిక సంస్కర్తల్నీ, కవుల్నీ, పోరాట యోధుల్నీ తెలంగాణ ప్రజలకు పునఃపరిచయం గావించింది. భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, కొమురం భీం, సమ్మక్కసారక్క వంటి చరిత్రాత్మక వ్యక్తుల్ని, వారి జ్ఞాపకాల్నీ పచ్చపచ్చగా చిగుర్లెత్తించింది. తెలంగాణ కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ, సామాజిక వాగ్గేయకారుల్నీ కదం తొక్కించింది. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, పండగలూ పబ్బాలూ అన్నిటినీ గర్వంగా తలెత్తి చాటుకుంది.

ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే తెలంగాణ ఉద్యమ కాలాన్ని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంగా అంచనా వేయొచ్చు. (ప్రత్యేక తెలంగాణలో కూడా ఈ పునరుజ్జీవనం కొనసాగేనా?)
సమైక్యాంధ్ర ఉద్యమంలో కలిసుండాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక సెంటిమెంటు ఉన్నా అంతకంటే అమితంగా విడిపోవడంలో ఎదురయ్యే నష్టాలే ఉద్యమ ప్రాధాన్యం వహించాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్థానికత సున్నా కావడం వల్ల గాంధీ నెహ్రూల వేషధారణలకు పరిమితం కావడం తప్ప మనదైన స్థానిక ఉద్యమ సంస్కృతిని నిర్మించుకోలేకపోయింది. అటు రాయలసీమ ముఖమూ తొడుక్కోలేక ఇటు కోస్తాంధ్ర ముఖమూ తొడుక్కోలేక రెండిటికీ చెడిన రేవడిగా మారి, స్థానికంగా ఆర్థిక చారిత్రక సాంస్కృతిక లోతుల్ని కోల్పోయింది. సమైక్య ఉద్యమానిది ప్రాదేశిక ప్రత్యేకత లేని టోకు దృష్టి మాత్రమే! ఒక్కమాటలో చెప్పాల్సివస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని యథాతథవాద ఉద్యమంగా అంచనా వేయొచ్చు.

సమైక్య ఉద్యమం ఒక గుంజ చుట్టూ తిరిగే విసర్రాయి మాదిరి హైదరాబాదు చుట్టూనే గిరగిరా తిరుగుతూ వచ్చింది. ఇందులో కోస్తా మధ్యతరగతి, సీమ మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కాంక్ష వ్యక్తమైనప్పటికీ, బైటికి వ్యక్తంకాని రాయలసీమ గ్రామీణ సమస్య ఒకటుంది. అది నీళ్ళ సమస్య! రాయలసీమలోని డెబ్బై శాతం గ్రామీణ ప్రజల జీవిక సమస్య!! ఈ సమస్య కోస్తా రైతాంగ ప్రజలకు లేదు (కోస్తా ప్రాంతాలకు కూడా నీటి కష్టాలు లేవా అని తర్కించే వాళ్ళను చూస్తే ఆకులోడూ ఏడ్చేదే! ఉప్పోడూ ఏడ్చేదే అనే సామెత గుర్తుకొస్తుంది). సమైక్య ఉద్యమంలోని సీమ, కోస్తాలు ఈ సాగునీటి సమస్య దగ్గరే మౌలికంగా విడిపోతాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీమ, కోస్తాలు మానసిక ఆవరణంలో కూడా విడిపోతున్నాయి. రాయలసీమ నాయకులు జరిగిపోయిన చరిత్రను కెలికి శ్రీబాగ్ ఒడంబడిక(1937, నవంబర్ 16)లోని రాయలసీమ రాజధాని జిల్లాను బైటికి తీసి చూపేసరికి కోస్తా నాయకులు ఎగతాళిగా నవ్వి పక్కకు తప్పుకున్నారు. పైగా రాయలసీమలోని రాజధాని గురించి చారిత్రక వాగ్దానాన్ని తప్పించుకోవడానికి (అట్లా తప్పుకోవడం వాళ్ళకు మామూలే) ఎత్తులు వేయడం కూడా ప్రారంభించారు. సీమలోని నీటి సమస్యను మిషగా చూపి, అందుకు విరుగుడు అన్నట్లు అనంతపురం, కర్నూలు రెండు జిల్లాలనూ తెలంగాణలో కలిపేయడాన్ని బలపరిచారు. ఇంక రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక బాధ్యత కోస్తాకు ఉండదు కదా అని వారి పన్నాగం. ఇది అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుంది గానీ, తాము రెండు పంటలకు మారుగా ఒక పంటకు పారబెట్టుకుని, మరో పంటకు భూగర్భ జలాల మీద ఆధారపడితే రాయలసీమకు కనీసం తాగు నీరు ఇవ్వొచ్చు కదా అన్న బాధ్యతా బుద్ధి మాత్రం వీళ్ళకుండదు.

రాయలసీమలోని పట్టణ మధ్యతరగతికీ, పల్లెల రైతాంగానికీ ఆసక్తులలో తేడా ఉంది. పట్టణ మధ్యతరగతి సమైక్య ఉద్యమం హైదరాబాదు దగ్గర ఆగిపోతే, పల్లెల్లోని రైతాంగం మాత్రం సాగునీటి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది. తమకు సాగునీరు రావడానికి ఎవరైతే అడ్డుపడరో వాళ్ళతో కలిసి ఉండడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు.

అది సీమాంధ్ర అయితేనేంగాక!
రాయల తెలంగాణ అయితేనేంగాక!!
... కానీ విషాదమేమిటంటే రాయలసీమ ఆసక్తులను మన్నించి కలుపుకోవడానికి అటు కోస్తాంధ్ర సిద్ధంగా లేదు ఇటు తెలంగాణ కూడా సిద్ధంగా లేదు. ఆశ్చర్యకర పరిణామమేమిటంటే; తుంగభద్ర నీళ్ళు వస్తాయంటే అనంతపురం రైతు ప్రజలు కర్ణాటకలో కలిసిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. తెలంగాణ పోరాటానిది స్థానిక సంస్కృతిని రక్షించుకునే ఆత్మగౌరవ పోరాటమైతే; కేవలం బతకడం కోసమే తమ సంస్కృతిని ఫణంగా పెట్టడానికైనా సిద్ధపడిన జీవికపోరాటం రాయలసీమ రైతులది!
సమైక్యాంధ్రలో రాయలసీమ మాత్రమే ఎక్కువ వెనకబడటానికి గల కారణాల్లో వర్షాభావమూ, భూగర్భ జలాలే కాకుండా ఒక రాజకీయ కారణం కూడా ప్రధానంగా ఉంది.
తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే, రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు తక్కువ. కోస్తాంధ్రలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు ఇంకా తక్కువ. ఈ క్రమంలో; ఆంధ్రప్రదేశ్‌ను ఏ ముఖ్యమంత్రి పరిపాలించినా ఎమ్మెల్యే స్థానాలు అధికంగా ఉన్న ప్రాంతపు ఆసక్తులకే తన రాజకీయ లబ్ధి కోసం పెద్దపీట వెయ్యక తప్పదు. అదే జరిగింది. నీలం సంజీవరెడ్డి పరిపాలించినా, చంద్రబాబు నాయుడు పరిపాలించినా, రాజశేఖర రెడ్డి పరిపాలించినా, ఇంకా ఏ రాయలసీమ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండినా; కోస్తాంధ్ర తెలంగాణ ప్రయోజనాలవైపే వాళ్ళు మొగ్గు చూపక తప్పింది గాదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

మైనారిటీ రాయలసీమ-
సీమాంధ్రలో చేరినా మళ్ళీ అదే వివక్షే!
రాయల తెలంగాణలో చేరినా మళ్ళీ అదే వివక్షే!!
అందుకే ఇప్పుడు కావలసింది
సీమాంధ్ర కాదు.
రాయల తెలంగాణ కాదు.
మరి ప్రత్యేక రాయలసీమా?
ఔను!
మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!
- బండి నారాయణస్వామి

Monday, December 9, 2013

కె.సభా కంటే ముందే చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన

' సూర్య ' అక్షరం పేజీలో 2013 నవంబర్‌ 11 న చిత్తూరు జిల్లా కథానిక పేరుతో శిబ్బాల ప్రకాష్‌ చిత్తూరు జిల్లా కథ ప్రారంభ, కొనసాగింపు, చరిత్ర వివరించే వ్యాసం రాశారు. ఆయన తన వ్యాసంలో కథానిక నిర్వచనం, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మధ్య కథానిక స్వరూపం కథానిక ఆవిర్భావం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. బాగుంది. కానీ, రాయలసీమ కథాచరిత్రను గురించి చెప్పకుండా ఉండడం కొంత వెలితిగా అనిపించింది. ఒక్క రాయలసీమలోనే గాక ఆంధ్రదేశంలోనే చిత్తూరు జిల్లాది ఒక ప్రత్యేక స్థానం. భౌగోళికంగా, రాజకీయ చిత్ర పటంలో, భాషలో వైవిద్యం కలిగి ఉంది. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానిక, నవల, విమర్శలలో తనదైన గుర్తింపు పొందిన జిల్లా చిత్తూరు.

చిత్తూరు జిల్లా కథానిక గురించి మాట్లాడితే- తెలుగు కథా సాహిత్యంలో గొప్ప కథకులుగా చెప్పుకోదగిన కొందరు కథకులు ఈ జిల్లాకు చెందినవారే. వారిలో కె. సభా, మధురాంతకం రాజారాం, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, పులికంటి క్రిష్ణారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటివారు ఉన్నారు. అయితే, రాయలసీమ కథా ప్రారంభం కె. సభాతో జరిగిందని విమర్శకుల అభిప్రాయం. ఈ ప్రభావం వలననే ప్రకాష్‌ కూడా కె. సభానే చిత్తూరు జిల్లా ప్రారంభ కథకులుగా పేర్కొన్నారు. ఇదే పత్రికలో (సూర్య- అక్షరం) 2012 డిసెంబర్‌ 31న ‘తొలి రాయల సీమ కథ’ పేరుతో రాయలసీమ కథాసాహిత్యం గురించి వ్యాసం వచ్చింది. రాయలసీమలో కె. సభాకంటే ముందు- చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన జరిగింది. ఆ కథకులలో ఎమ్‌.వి. పాపన్న గుప్త, చింతా నరసింహా రెడ్డి, టి.కె. రంగస్వామి అయ్యంగార్‌, మామిడి రుక్మిణమ్మ, పూతలపట్టు శ్రీరాములరెడ్డి లను పేర్కొనవచ్చు.

ఈ కథకులు చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా చెప్పుకుంటున్న కె. సభా కంటే ముందే ఆదర్శవంతమైన కథావస్తువులతో కథలు రాశారు. పైన పేర్కొన్న కథకులందరూ భారత కథానిధి మాసపత్రికలో 1927 లోనే కథారచన సాగించారు. చిత్తూరు జిల్లా తొలి కథ ‘శారద’ కథకుడు యమ్‌. వి.పాపన్న గుప్త- 1927 జనవరి, హైమావతి 1928, మలి కథలు- ‘సుందరి’ మామిడి రక్మిణమ్మ- 1927జనవరి; ‘ప్రేమానుబంధం’ చింతా నరసింహారెడ్డి-1927 జూలై; ‘ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర’ పూతల పట్టు శ్రీరాములరెడ్డి- 1928 డిశెంబర్‌; ‘నా చిట్టి తల్లి’ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌-1929 నవంబర్‌. ఈ కథలన్నీ 1926లో ప్రొద్దుటూరు నుండి వెలువడిన భారత కథానిధి పత్రికలో ముద్రితమైనవే. వీరిలో కొందరు కథకులనే విషయం సాహిత్య ప్రపంచానికి ఇంతవరకూ తెలియక పోవడం మన దురదృష్టం. వీరు కాక విద్వాన్‌ నెత్తం నరసింహులు కూడా హాస్య కథావళి పేరుతో 1965లో హాస్య కథలు రాశారు. ఆయన తప్ప తక్కిన పై వారందరూ కె. సభాకంటే ముందే చిత్తూరు జిల్లా కథా సాహిత్యానికి కృషిచేసినవారే. పై వారు రాసిన కథలను ఒకటి రెండింటిని పరిశీలిస్తే- 1927ప్రాంతంలోనే చిత్తూరు జిల్లాలో ఎంతటి ఆదర్శమైన కథాసాహిత్యం వెలువడిందో అర్ధమవుతుంది.

ఎమ్‌.వి. పాపన్న గుప్త రాసిన ‘శారద’ కథలో మూఢనమ్మకాలతో కూడిన సంప్రదాయాలు ప్రసాద రావు ప్రాణాలు ఎలా బలితీసున్నాయో తెలుపుతుంది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన శారదకు తల్లి కాంత లక్షుమ్మ ప్రసాదరావు కొడుకు క్రిష్ణారావుతో పెళ్ళిచేస్తుంది.ప్రసాదరావు పూర్వాచార పరాయణుడు. చెడ్డ నక్షత్రంలో కోడలిని కాపురానికి తెచ్చుకో కూడదని- కొడుకు కోడలు కలిసి ఉండకూడదని ఆక్షేపిస్తాడు. క్రిష్ణారావు బి.ఎ. చదువుకున్నాడు. తహశీల్దార్‌ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ నిర్వహణలో వేరే ఊరులో ఉంటాడు. పెళ్ళై రెండు సంవత్సరాలైంది. తండ్రి మాట ప్రకారం భార్యను తెచ్చుకోలేదు. తండ్రికి చెప్పకుండా ఓరోజు అత్తగారింటికి పోతాడు. తాను పూర్వాచారముల మన్నించువాడను కాదని వెంటనే తన వెంట శారదాను పంపవలయును- అని తన అత్తగారితో చెప్పి భార్యను తెచ్చుకొని కాపురం చేస్తుంటాడు.

ఈ విషయం తెలిసిన తండ్రి ప్రసాదరావు తన మాట వినకుండా శారదను తెచ్చుకున్నందుకు కోపంతో- ‘ఇక నీ గతి నీది, నా గతి నాది, లోక నింద పడజాలను గాన నేను పాషానణము గొని ఈ లోకంను బాయుచున్నాను’ అని ఉత్తరం రాసి ఆత్మహ త్య చేసుకుంటాడు. ఎందుకూ పనికిరాని సంప్రదాయాలకు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోయే వారికి ప్రసాదరావు ప్రతినిధి. మూఢనమ్మకాలను విస్మరించి సమాజాన్ని ముందుకు తీసుకుపోయేవారికి ప్రతినిధి క్రిష్ణారావు. భారత దేశంలో బాల వితంతువుల సమస్యకు బాల్య వివాహాలే కారణం అనే విషయం చర్చగా సాగే కథ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌ రాసిన ‘నా చిట్టి తల్లి’. ‘బ్రాహ్మణులలో కోమటి వారలలో ఉన్నంత మంది చిన్న వయసులోని ముండ మోపులు కాపువారిలో లేరు. ఇందుకు కారణము చిన్నతనపు పెళ్ళిళ్ళే. అందుకే శారద బిల్లు. అది ఇప్పుడు చట్టమైంది. ఇం మనకు బాగుం డును- అని సుందరి ఒక సన్యాసితో చెపుతుంది.

సుందరి ఆ సన్యాసే తన తండ్రి అని తెలుసు కుంటుంది. వితంతువైన సుందరి- అందుకు కారణం, తాను చిన్ననాడే పెళ్ళి చేసుకోవడంగా తండ్రికి చెబుతుంది.తరువాత తండ్రి కూతుర్లు ఒకరినొకరు తెలుసుకుంటారు. 1928-1929 మధ్య వచ్చిన శారదా చట్టం చిత్తూరు జిల్లా కథకులపైన ప్రభావం చూపిందనడానికి ఈ కథ సాక్ష్యం.చింతా నరసింహారెడ్డి 1927లో రాసిన ప్రేమానుబంధంలో ఆర్థిక సంబంధాలు మనుషులను ఎలా దూరం చేస్తాయో తెలుపుతుంది. ఒక అమాయకుడైన దళితుని కథ పూతల పట్టు శ్రీరాముల రెడ్డి రాసిన- ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర. తరువాత మరో చరయిత్రి మామిడి రుక్మిణమ్మ రాసిన- సుందరి- కథ. ఈ కథలన్నీ 1944లో కథారచన ప్రారంభించిన కె. సభా కంటే ముందే జరిగిన కథా రచనలు. కాలక్రమంగా పరిశీలిస్తే ఆధారాలు లభిస్తున్నంత వరకూ ఎమ్‌.వి. పాపన్న గుప్తా చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా, శారద కథ చిత్తూరు జిల్లా తొలి కథగా గుర్తించవలసి ఉంది.
-తవ్వా వెంకటయ్య 
December 9, 2013, Andhrajyothy daily "vividha".

Tuesday, December 3, 2013

రాయలసీమకు ఎన్నాళ్లీ గులాంగిరీ? - కె. రాహుల్ సిద్ధార్థ

దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90 దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు జిల్లాల పరిస్థితి కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది. రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం రాయలసీమలో సాధారణ సగటుకన్నా అత్యల్పంగా ఉంది. ప్రాంత రైతు దుస్థితి రుతుపవనాలలో జూదమాడిన చందంగా ఉంది. తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి దాపురించింది. కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆటకెక్కించారు. సీమ దుస్థితిని చూపి నీటివాటా పొంది రాయలసీమకు మొండిచెయ్యి చూపి కోస్తాంధ్రకు నీటిని తరలించారు. సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రాంతానికి ఒరిగింది మాత్రం శూన్యం. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే.
తెలుగువారంతా కలిసి ఉండాలనే విశాలాంధ్ర భావన మొగ్గతొడిగి 2013తో వందేళ్లు పూర్తి చేసుకొంది. యాదృచ్ఛికంగా సరిగ్గా వందేళ్లకు 2013లోనే తెలుగు నేల ముక్కలు చెక్కలయింది. సమైక్య రాష్ట్రం విచ్ఛిన్నమైంది. తెలుగుగడ్డ రెండు ముక్కలయింది. ఇంతటి కీలకదశలో రాయలసీమ దశ-దిశ ప్రస్తావన లేకుండా చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో రెండే ప్రాంతాలున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపడేశారు. సీమ వేరు, కోస్తాంధ్ర వేరు అనే వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒక ప్రాంత ప్రజలను సంతృప్తి పరచేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మరో ప్రాంతానికి పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జాతీయ హోదాతో నిధులు గుమ్మరించి సర్దుబాటు చేశారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఓట్లు-సీట్లు పరమావధిగా మారిన నేటి కుటిల రాజనీతి సిద్ధాంతంలో రాయలసీమ పట్ల ఎందుకీ వివక్ష? 52 శాసనసభ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 1.5 కోట్ల జనాభా కలిగిన ప్రాంతమంటే ఎందుకింత చిన్నచూపు?
రాయలసీమ సామాజిక జీవన విధానం తెలియని మూర్ఖపు నేతలు చేస్తున్న వితండవాదనే తాజాగా తెరమీదకు వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన. రాయలసీమ అస్తిత్వాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. తమ స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న నేతల స్వార్థపూరిత యోచనకు ఇది నిదర్శనం. 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాజ్యం. కాగా రాయలసీమ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం. ఏనాడూ పొంతనలేని రెండింటినీ విధంగా కలుపుతారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల జీవన విధానాలు పూర్తి భిన్నమైనవి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే సీమ ఉనికి శాశ్వతంగా కనుమరుగవుతుంది. సీమలో ప్రస్తుతమున్న నాలుగు జిల్లాలు వేరుచేయడానికి వీలులేని పరస్పర అంగాలని చెప్పవచ్చు. మత ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలని రాజకీయపక్షం స్వార్థపూరిత డిమాండ్ను ముందుకు తెస్తోంది. మతం ఒక్కటే అయినా... భాష వేరనే కారణంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్లు వేరు కాలేదా? ప్రాంతాల ఏకీకరణకు మతం ఎన్నడూ ప్రాతిపదిక కారాదు. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. వేర్పాటువాదానికి ఊతమిస్తుంది. రాజకీయ నేతల అవతారమెత్తిన పవర్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు రాయల తెలంగాణ అంటూ పల్లవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని సాక్షాత్తు ఇందిరాగాంధీ లోక్సభలో పేర్కొన్నారు. అయినప్పటికీ విభజించు-పాలించు సూత్రాన్ని అవలంబించాలని నేటి సోనియాగాంధీ కాంగ్రెస్ తలపోస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే సరి? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత అవశ్యకం. నాడు శ్రీబాగ్ ఒడంబడికను నిస్సిగ్గుగా ఉల్లంఘించిన కోస్తాంధ్రతో విధంగా కలిసి ఉండమని ఉపదేశిస్తారు? ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నాలను రాజధాని చేయాలని తాపత్రయపడుతున్నారా లేదా? నాటి రాజధాని కర్నూలును లేదా మరో రాయలసీమ జిల్లాను రాజధానిగా చేయాలని పెద్దన్నగా ఎందుకు ఆలోచించరు? ప్రతిపాదిత రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే 8 ఈశాన్య రాష్ట్రాల కన్నా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ కన్నా పెద్ద రాష్ట్రమవుతుంది. 1970లో కర్నూలు జిల్లా నుంచి కొంత భూభాగాన్ని వేరుచేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాల్సి ఉంటుంది. నాడు కోల్పోయిన బళ్లారిని మళ్లీ రాయలసీమలో కలపాల్సి ఉంది. దీనికోసం మరో ఎస్సార్సీ కానీ, ప్రత్యేక కమిషన్ వేసినా ఫర్వాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ మనగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్దిష్ట కాలపరిమితి వరకు మూడు ప్రాంతాలకు పంపిణీ చేయండి. ఈలోగా సీమ స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, లేపాక్షి, అహోబిలం, యాగంటి, కడపదర్గా, వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతమిది.
ఆధ్యాత్మిక పర్యాటకంతో సీమ స్వయం సమృద్ధి సాధిస్తుంది. సీమలో అపార ఖనిజ సంపద ఉంది. ప్రాంత స్వావలంబనకు నిక్షేపాలు ఇతోధికంగా తోడ్పడతాయి. రాయలసీమ నాడు బళ్లారిని కోల్పోయింది. రాజధాని ఉన్న మద్రాసు, కర్నూలును కోల్పోయింది. నేడు హైదరాబాద్ కూడా పరాయిదయిపోయింది. ఇకనైనా రాయలసీమ ప్రజలు జాగరూకత ప్రదర్శించాల్సి ఉంది. లేకపోతే మరోసారి బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకొని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వలసజీవులుగా దుర్భర జీవనాన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. సీమలో తరతరాలుగా అనుభవిస్తున్న గులాంగిరీకి చెల్లుచీటి రాయాల్సిన సరైన తరుణం ఇదే. - కె. రాహుల్ సిద్ధార్థ
ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జనచేతన
Andhra Jyothy 03-12-2013.
దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు జిల్లాల పరిస్థితి కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది. రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం రాయలసీమలో సాధారణ సగటుకన్నా అత్యల్పంగా ఉంది. ఈ ప్రాంత రైతు దుస్థితి రుతుపవనాలలో జూదమాడిన చందంగా ఉంది. తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి దాపురించింది. కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆటకెక్కించారు. సీమ దుస్థితిని చూపి నీటివాటా పొంది రాయలసీమకు మొండిచెయ్యి చూపి కోస్తాంధ్రకు నీటిని తరలించారు. సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతానికి ఒరిగింది మాత్రం శూన్యం. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే.
తెలుగువారంతా కలిసి ఉండాలనే విశాలాంధ్ర భావన మొగ్గతొడిగి 2013తో వందేళ్లు పూర్తి చేసుకొంది. యాదృచ్ఛికంగా సరిగ్గా వందేళ్లకు 2013లోనే తెలుగు నేల ముక్కలు చెక్కలయింది. సమైక్య రాష్ట్రం విచ్ఛిన్నమైంది. తెలుగుగడ్డ రెండు ముక్కలయింది. ఇంతటి కీలకదశలో రాయలసీమ దశ-దిశ ప్రస్తావన లేకుండా చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో రెండే ప్రాంతాలున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపడేశారు. సీమ వేరు, కోస్తాంధ్ర వేరు అనే వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒక ప్రాంత ప్రజలను సంతృప్తి పరచేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మరో ప్రాంతానికి పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జాతీయ హోదాతో నిధులు గుమ్మరించి సర్దుబాటు చేశారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఓట్లు-సీట్లు పరమావధిగా మారిన నేటి కుటిల రాజనీతి సిద్ధాంతంలో రాయలసీమ పట్ల ఎందుకీ వివక్ష? 52 శాసనసభ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రాంతమంటే ఎందుకింత చిన్నచూపు?
రాయలసీమ సామాజిక జీవన విధానం తెలియని మూర్ఖపు నేతలు చేస్తున్న వితండవాదనే తాజాగా తెరమీదకు వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన. రాయలసీమ అస్తిత్వాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. తమ స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న నేతల స్వార్థపూరిత యోచనకు ఇది నిదర్శనం. 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాజ్యం. కాగా రాయలసీమ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం. ఏనాడూ పొంతనలేని ఈ రెండింటినీ ఏ విధంగా కలుపుతారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల జీవన విధానాలు పూర్తి భిన్నమైనవి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే సీమ ఉనికి శాశ్వతంగా కనుమరుగవుతుంది. సీమలో ప్రస్తుతమున్న నాలుగు జిల్లాలు వేరుచేయడానికి వీలులేని పరస్పర అంగాలని చెప్పవచ్చు. మత ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలని ఓ రాజకీయపక్షం ఈ స్వార్థపూరిత డిమాండ్‌ను ముందుకు తెస్తోంది. మతం ఒక్కటే అయినా... భాష వేరనే కారణంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వేరు కాలేదా? ప్రాంతాల ఏకీకరణకు మతం ఎన్నడూ ప్రాతిపదిక కారాదు. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. వేర్పాటువాదానికి ఊతమిస్తుంది. రాజకీయ నేతల అవతారమెత్తిన పవర్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు రాయల తెలంగాణ అంటూ పల్లవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని సాక్షాత్తు ఇందిరాగాంధీ లోక్‌సభలో పేర్కొన్నారు. అయినప్పటికీ విభజించు-పాలించు సూత్రాన్ని అవలంబించాలని నేటి సోనియాగాంధీ కాంగ్రెస్ తలపోస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే సరి? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత అవశ్యకం. నాడు శ్రీబాగ్ ఒడంబడికను నిస్సిగ్గుగా ఉల్లంఘించిన కోస్తాంధ్రతో ఏ విధంగా కలిసి ఉండమని ఉపదేశిస్తారు? ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నాలను రాజధాని చేయాలని తాపత్రయపడుతున్నారా లేదా? నాటి రాజధాని కర్నూలును లేదా మరో రాయలసీమ జిల్లాను రాజధానిగా చేయాలని పెద్దన్నగా ఎందుకు ఆలోచించరు? ప్రతిపాదిత రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే 8 ఈశాన్య రాష్ట్రాల కన్నా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కన్నా పెద్ద రాష్ట్రమవుతుంది. 1970లో కర్నూలు జిల్లా నుంచి కొంత భూభాగాన్ని వేరుచేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాల్సి ఉంటుంది. నాడు కోల్పోయిన బళ్లారిని మళ్లీ రాయలసీమలో కలపాల్సి ఉంది. దీనికోసం మరో ఎస్సార్సీ కానీ, ప్రత్యేక కమిషన్ వేసినా ఫర్వాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ మనగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్దిష్ట కాలపరిమితి వరకు మూడు ప్రాంతాలకు పంపిణీ చేయండి. ఈలోగా సీమ స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, లేపాక్షి, అహోబిలం, యాగంటి, కడపదర్గా, వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతమిది.
ఆధ్యాత్మిక పర్యాటకంతో సీమ స్వయం సమృద్ధి సాధిస్తుంది. సీమలో అపార ఖనిజ సంపద ఉంది. ఈ ప్రాంత స్వావలంబనకు ఈ నిక్షేపాలు ఇతోధికంగా తోడ్పడతాయి. రాయలసీమ నాడు బళ్లారిని కోల్పోయింది. రాజధాని ఉన్న మద్రాసు, కర్నూలును కోల్పోయింది. నేడు హైదరాబాద్ కూడా పరాయిదయిపోయింది. ఇకనైనా రాయలసీమ ప్రజలు జాగరూకత ప్రదర్శించాల్సి ఉంది. లేకపోతే మరోసారి బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకొని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వలసజీవులుగా దుర్భర జీవనాన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. సీమలో తరతరాలుగా అనుభవిస్తున్న గులాంగిరీకి చెల్లుచీటి రాయాల్సిన సరైన తరుణం ఇదే.
- కె. రాహుల్ సిద్ధార్థ
ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జనచేతన

- See more at: http://www.andhrajyothy.com/node/35484#sthash.siMfRpQe.dpuf

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...