Tuesday, February 26, 2013

"కడప కథ" పుస్తకం పై త్రివిక్రమ్ సమీక్ష

కడప జిల్లాలో మొట్టమొదటి కథారచయిత భారతం నాదమునిరాజు. ఆయన 1956 లో రాసిన నీలవేణి నుంచి 2006 వరకు యాభయ్యేళ్ళ కాలంలో 55 కు మించిన కథారచయితలు రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన 46 కథల సంకలనం కడప కథ. సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డి. కడప జిల్లాలో కథాసాహిత్యం గురించి 1992లో కేతు విశ్వనాథరెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం వీటికి అదనం. ఐతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పదైదేండ్లలో వచ్చిన కథల గురించి కూడా రాయించి ఉన్నట్లైతే సమగ్ర విశ్లేషణకు అవకాశముండేది.

ఇక కథల విషయానికొస్తే,ఈ 47 కథల్లో తొలి 34 సంవత్సరాల (1956 -1989 మధ్య) కాలానికి చెందినవి 14 మాత్రమే ఉండగా మిగిలిన 33 కథలు తర్వాతి 16 సంవత్సరాల (1990-2006 మధ్య) కాలానికి చెందినవి. అంటే గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో కడప జిల్లాలో కొత్త రచయితలు ఎక్కువ మంది కలం పట్టడమో, సీనియర్ రచయితలు మరింత ఉత్సాహంతో కథలు రాయడమో జరిగిందన్నమాట. మొదటి వర్గంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్, వేంపల్లి గంగాధర్ లాంటివాళ్ళుండగా చక్రవేణు, దాదా హయత్, సొదుం జయరాం, పి. రామకృష్ణారెడ్డి (తులసీకృష్ణ), మొదలైనవారు రెండవ వర్గం.
వంశీకృష్ణ అన్నట్లు ఈ సంకలనంలో “అంతర్లీనంగా కనిపించేది ఒకే ఒక అంశం. అది భూమికీ, మనిషికీ, పశువుకీ మధ్య, ఇతరేతర సామాజిక, రాజకీయ అంశాలకీ మధ్య స్పష్టాస్పష్టంగా, విడదీసీ విడదీయరాని విధంగా కనిపించే బంధాన్నీ, దాన్ని నిలుపుకోవడంలో ఎదురయ్యే అనేకానేకాంశాల పట్ల పెంపొందించుకోవలసిన అవగాహన గురించిన సమ్యక్ పరిశీలన.”
అందులోనూ ప్రత్యేకించి కడప అనగానే గుర్తొచ్చేవి కరువు, కక్షలు, కువైట్ (బతుకుతెరువు కోసం కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ). అందుకు తగినట్లే ఈ సంకలనంలో కరువు యొక్క భిన్నపార్శ్వాలను చూపే కథలు అలికిడి (శశిశ్రీ), జీపొచ్చింది (వేంపల్లి షరీఫ్), కడుపాత్రం (తవ్వా ఓబుల్ రెడ్డి రాసిన ఈ కథ సన్నపురెడ్డి నవలిక తోలుబొమ్మలాట కు మాతృక), జీవసమాధి (ఇబ్రహీం), కొత్తచిగురు (దేవిరెడ్డి వెంకటరెడ్డి), కరువురాగం (సొదుం రమణ); కక్షలకు సంబంధించి కూలిన బురుజు (కేతు విశ్వనాథరెడ్డి), చుక్క పొడిచింది (పాలగిరి విశ్వప్రసాద్), చంద్రగ్రహణం (నాగులారపు విజయసారథి), సింహము-కుక్క-పులి (చెరువు అనంతకృష్ణశర్మ), గాయం (రాధేయ); కువైట్ కథలు కువైట్ సావిత్రమ్మ (చక్రవేణు), మున్నీ బేగం (ఎన్.ఎస్.ఖలందర్), చీకటి సవ్వడి (డి.రామచంద్రరాజు), మొదలైనవి ఉన్నాయి.
ఈ సంకలనంలోని మొదటి కథ “నీలవేణి”లో కథకుడు ఒక రచయిత. అతడు నీలవేణి అనే ఒక యువతి గురించి కథ రాయడానికి కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఐతే విద్యావంతురాలైన ఈ నీలవేణి కథకుడనుకున్నట్లు బేల కాదు. ఆమె తెలివితేటలకేం కొదవలేదు. తేడా వస్తే ‘ఎవరినైనా’ నిలదీసి ముక్కుమీద పిడికిలి ఝాడించే రకం.
అంతేకాదు, ఆమె మంచి మాటకారి కూడా. చిన్నప్పుడు మత్తుపదార్థాలకే మాత్రం తీసిపోని చౌకబారు పుస్తకాలు విపరీతంగా చదివినమ్మాయే కానీ వయసొచ్చాక వాస్తవపరిస్థితులను ఆకళింపు చేసుకుని, తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుంది. ఉద్యోగం సంపాదించుకుని తనకు నచ్చినవాణ్ణే చేసుకుంది. ఐతే ఆ విషయాలేవీ తెలుసుకోకుండా ‘అలవికాని ఆశల్ని రేపుకుని జీవితంలో నికరంగా ఓడిపోయిన నీలవేణి’ కథ రాస్తూ, ‘స్త్రీపాత్ర కాబట్టి’ ఆమె మీద సానుభూతి కనబరచడం, సానుభూతి చిహ్నంగా ఆమెను చంపడం తన కర్తవ్యంగానే గాక అదొక ఫ్యాషన్ కూడా అని భావించి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడమా లేక పిచ్చిదాన్ని చేసి రాళ్ళు రువ్వించి చంపడమా అని ఆలోచిస్తున్న కథకుడికి ఆమె ధోరణి మింగుడుపడదు. ‘ఇది మీకు ధర్మమేనా మాష్టారూ?’ అని స్వయంగా ఆ నీలవేణే కట్టెదుటికి వచ్చిఅడిగినా “విద్యావివేకాలుండి కూడా వెర్రితలలు వేసేవారు, వంచింపబడి ఆత్మహత్యలకు దిగేవారు విద్యావంతులైన స్త్రీలలో లేరా?” అని ఎదురుప్రశ్నిస్తాడు. దానికామె “ఎవరో కొందరలాంటివారున్నారని స్త్రీజనోద్ధరణ అనే గోచర్మాల్ని కప్పుకుని ‘నస్త్రీ స్వాతంత్ర్యమర్హసీ’ అని గర్జించవయ్యా! పోయిందేముంది?” అని యెద్దేవా చేసి జవాబునాశించకుండా వెళ్ళిపోతుంది నీలవేణి. కడప జిల్లాలో కథాసాహిత్యం ఆలస్యంగానే ఐనా సాహిత్య ప్రయోజనమేమిటో సూచిస్తూ, ఎలాంటి సాహిత్యం రావలసిన అవసరముందో దిశానిర్దేశం చేసే నీలవేణితో మొదలై అతి త్వరలోనే శిఖరాగ్రస్థాయినందుకుంది.
నీలవేణి ప్రేరణతోనేనా అన్నట్లు ఈ సంకలనంలోనే ఉన్న ‘యంత్రం’ (రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని) కథలో ఒక వంచితురాలు అధైర్యపడిపోకుండా తనలాగ ముళ్లకంచెలో ఇరుక్కుని విలవిలలాడుతున్న అభాగినులకు చేయూతనివ్వడానికి నిశ్చయించుకుంటుంది.
‘కాలచక్రం’ (రచయిత డి.లక్ష్మీకరరాజు) కథలో ఒకప్పుడు దొంగతనం చెయ్యడాన్ని చీత్కరించుకున్నవాడే మారిన పరిస్థితుల్లో గత్యంతరం లేక దొంగతనం చేయబోయి పట్టుబడి పోలీసు కస్టడీలో ఇలా తర్కించుకుంటాడు: “ఆకలిగొన్న కడుపుకు అన్నం పెట్టనివారేనా తనను చితకబాదింది? తనలాగ వారికి ఆకలి వేస్తే దోపిడీ దొంగలను మించి దోపిడీ చేసేవారేనేమో?” ఈ ఆలోచనల్లో నుంచి “కష్టాల్లో గానీ మనిషి నిజస్వరూపం బయటపడదు.” అని తెలుసుకుంటాడు.
దీని తర్వాతిది రాచమల్లు రామచంద్రారెడ్డి ‘నీతిగానుగ’ కథ. తనకు ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్ళికి రెండు గంటలు ముందు జరిగిన పరిణామాల్లో పెళ్ళికూతురు కాసేపు కనిపించకుండా పోయి తిరిగిరావడం, ఆ సమయంలో పెళ్ళికొడుకు అక్క అక్కడికెళ్ళడం, దాని ఫలితంగా కట్నం ఎవరూ అడక్కుండానే అప్పటికప్పుడు రెండువేలు పెరగడం, చివరి నిమిషాల్లో కట్నం ఎక్కువిస్తామని ఎందుకు అంటున్నారో, అసలేం జరిగిందో తెలియని అయోమయంలో పెళ్ళి కొడుకు, అతడికి అసలు విషయం తెలియనివ్వకుండా పెళ్ళి జరిగేలా చూసేందుకు అతడి అక్క, నాన్న పడే ఆరాటం, ఫలితంగా జరగరానిదేదో జరిగిందని ఊహించి, ఈ పెళ్లితో తన పరువు మొత్తం గంగపాలైందని ఏడుచుకుంటూనే పెళ్ళి చేసుకుని, అసలేం జరిగిందో తెలియకపోయినా శోభనం రాత్రి భార్యతో డాంబికంగా “నువ్వు చెయ్యరాని తప్పు చేసినావు. ఐనా నిన్ను ఉదారంగా పెండ్లి చేసుకున్నాను.” అనే పెళ్ళికొడుకు, తన ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అప్పటికే తీర్మానించుకున్న పెళ్లి కూతురు.
స్థూలంగా ఇదీ కథ. ఈ కథ మధ్యమధ్యలో చైతన్యస్రవంతి ధోరణిలో నడుస్తుంది. తన సాహితీజీవితంలో శిల్పానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినవాడు రారా. ఐతే చక్కటి కథనసామర్థ్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా, కథలోని పాత్రలన్నిటి చేత నీతి’గానుగాడించిన’ ఈ కథ రాసేటప్పుడు మాత్రం శిల్పాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనబడదు.
ఇక సొదుం గోవింద రెడ్డి రాసిన “ప్రేమ” అనే అద్భుతమైన రెండు పేజీల కథలో ఒక పెద్దమనిషి ప్రేమ అనేది సిరిసంపదలు కలవారి సొత్తేనని (‘దీనురాండ్రను ప్రేమించడానికి తమబోంట్లకు తాహతుంది’), అవి లేనివారు ప్రేమను ప్రకటిస్తే అది ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించేనని (‘ఉత్తినే ప్రేమ ఒలకబోసుకునేందుకు దానికేమంత సిరిసంపదలు కారిపోతున్నాయని!’) భావించి దారుణంగా దెబ్బతింటాడు. (‘దయ, ప్రేమ, కరుణ – అనే గుణాలు అటు వైపు నుంచి రావడం మంచిది కాదు!’ అని తీర్మానిస్తాడు కానీ వాటిని ఎలా అడ్డుకోవాలో అతడికి తోచదు.)
ఇది పేదవారి ప్రేమకు సంబంధించిన కథైతే పేదవారి నిజాయితీకి సంబంధించిన కథ ‘జవాబులేని ప్రశ్న’ (టి.వి.బ్రహ్మం). ఆసుపత్రిలో ఉన్న తన మనవడికి జబ్బుగా ఉందని, మందుకు సరిపోయేంత డబ్బులేదని, రెండురోజుల్లో తెచ్చిస్తానని, ప్రస్తుతానికి మందిమ్మని తన మందుల షాపుకు వచ్చి వేడుకున్న ముసలామె ముక్కూ మొహం ఎరక్కపోయినా నమ్మి మందులిస్తాడు కిషన్ కుమార్. ఐతే మందు తీసుకెళ్ళి పదిరోజులైనా ఆమె తిరిగిరాదు. ఇక రాదని నిరాశ చేసుకున్న తర్వాత ఒక రోజు డబ్బివ్వడానికే వస్తుంది ఆమె. అన్నిరోజులూ ఎందుకు రాలేదో తెలుసుకున్న తర్వాత ఆమె గుర్తుపెట్టుకుని తిరిగొచ్చినందుకు కిషన్ కళ్ళలోనే కాదు పాఠకుల కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయి.
‘గట్టిగింజలు’ కథారచయితగా ప్రసిద్ధుడైన వై.సి.వి.రెడ్డి రాసిన ‘దొంగబర్రెగొడ్లు’ దీని తర్వాతి కథ. చిన్న, సన్నకారు రైతులు పండించే పంటకు బర్రెగొడ్లను మించిన ముప్పు ఎవరివల్ల కలుగుతుందో తేటతెల్లం చేస్తుంది.
పాఠకుల మనసులను కదిలించేలా మోహ్న రాసిన “రాముల వారి గుడి ముందు” కథ ఇంతకుముందు సీమకథలు సంకలనంలో కూడా వచ్చింది. ఆదెన్న అనే చాకలి రంగారెడ్డి దగ్గర నూర్రూపాయలకు చిల్లర తెచ్చుకుంటాడు. ఆ నోటును మడిచి జోబీలో పెట్టుకున్న రంగారెడ్డి ఆ విషయం మర్చిపోయి ఆదెన్న నోటివ్వలేదని ఫిర్యాదుచేస్తే, ఊళ్ళోని పెద్దలు కలిసి ఆదెన్న చెప్పేది వినిపించుకోకుండా “వాడు సెప్పేదేంది? రంగారెడ్డేం నూర్రూపాయల కాడ యింతమందిలో అపద్ధం సెప్తాడా? రంగారెడ్డి సిల్లరిచ్చి నోటడిగేది మర్చిపోయినాడు. యిదే సందని వీడు సిల్లర తీస్కొనొచ్చి యిప్పుడు యిచ్చినానని తప్పుడుకూతలు కూస్తాండాడు…సొలకాల తెగేట్లు కొడ్తే వాడే వొప్పుకుంటాడు.” అని తీర్మానిస్తారు. అప్పటికీ ఆదెన్న “తప్పు” ఒప్పుకోకపోవడంతో అతణ్ణి “కర్రు దూయమనడం” (మడక్కర్రు ఎర్రగా కాగబెట్టి దేవునిగుడికాడ రెండుసేతుల్తో పట్కోని దుసల్ల. నాను సుల్ల (అబద్ధం) సెప్పింటే నా సేతులు కాల్తాయి. నాను దొంగతనం సేసిండననుకో నా సేతులు కాలవ్), అసలు జరిగిందేమిటో ప్రత్యక్షంగా చూసిన రంగారెడ్డి జీతగాడు తన యజమానురాలి బెదిరింపుకు జడిసి నోరు మెదపలేకపోవడం, ఈ దుర్మార్గాన్నంతటినీ దగ్గరనుంచి చూసినా ఎవురికీ సెప్పను అని దేవున్తోడు ప్రమాణం చేసిన శివు అనే బడిపిల్లాడికి పంచాయతీలో ఆదెన్న మాత్రమే ఎందుకు కర్రు దూసాడో, పెద్దమనుషులు మామనెందుకు కర్రుదూయమని చెప్పలేదో, నిజం చెప్పినా ఆదెన్న చేతులెందుకు కాలాయో అర్థంకాక వొళ్ళుతెలీని జ్వరమొస్తుంది.
కుట్ర కథల రచయితగా ప్రసిద్ధుడైన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి రాసిన ‘ఓబిగాడు’ కథ ప్రత్యేకించి పేర్కొనదగ్గది. ఈ కథ ద్వారా ఈయన సాహితీలోకంలో చిరస్మరణీయుడైనాడు. కేతు చెప్పినట్లు కుసంస్కారం పట్ల వెగటు కలిగించగలిగిన పద్మనాభుడి ప్రాతినిధ్య కథగా నిలచిన ఈ కథలో విషాద, బీభత్స వాతావరణం పఠితలను ఊపిరి సలుపుకోనివ్వకుండా కమ్ముకొస్తుంది.
తెలుగు కథాసాహిత్యంలో ‘కువైట్ సావిత్రమ్మ’, ‘కసాయి కరువు’ లాంటి మాస్టర్ పీస్ లను సృష్టించిన గొప్ప కథకుడు చక్రవేణు. వాటిలో నుంచి కువైట్ సావిత్రమ్మ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కథల్లోనుంచి సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి పొందిన ‘చనుబాలు’ కథ ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి. ఉన్న ఊళ్ళో జీవనాధారం దొరక్క పొట్ట చేతపట్టుకుని కువైట్ తదితర దేశాలకు వెళ్ళేవారి వెతల గురించి మరింత మంది కథారచయితలు దృష్టిపెట్టి కథలు రాయడానికి ప్రేరణగా నిలిచిన కథ కువైట్ సావిత్రమ్మ. ఇక వ్యక్తిగతంగా తాను ఒక దళిత మహిళ చనుబాలు తాగి పెరిగినందుకే తోటివారి ముందు కించపడే ఆ ఊరి ప్రెసిడెంటుకు, దళిత-భూస్వాముల సంబంధాల గురించిన స్వస్వరూపజ్ఞానం కలగడం చనుబాలు కథాంశం. సన్నపురెడ్డి కథల్లో ఇదొక మైలురాయి.
పెన్నేటి కతల రచయితగా ప్రసిద్ధుడైన పి. రామకృష్ణారెడ్డి రాసిన ‘మనిషీ-పశువూ’ మరో గొప్ప కథ. ఈ కథలో రైతుకు-పశువుకు మధ్యనున్న అనుబంధం; రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఈ అనుబంధం వ్యక్తమయ్యే తీరులోని తేడాలే కాకుండా రాయలసీమలో స్థితిమంతులైన రైతు కుటుంబాల్లో సైతం పశువులను ఇంట్లోనే కట్టెయ్యడం, మనుషులు వాటితో సహజీవనం చెయ్యడం, బయటి ప్రాంతాల వాళ్లకు అది అనారోగ్యకారకంగానేగాక అనాగరికంగా అనిపించడం – ఇవేకాకుండా ఇక్కడ ఎవరికీ విడిగా పడగ్గదులు లేకపోవడంలోని వైచిత్రి, ఇబ్బందులను గురించి కూడా వివరంగా, నిష్పాక్షికంగా చర్చిస్తారు రచయిత.
ఇవే కాకుండా ఈతరం వారికి తమ కుటుంబాలను, జీవితాలను ధ్వంసం చేసిందని సేద్యం పైన కసిపెరగడం తట్టుకోలేని మనుషుల్లో భవిష్యత్ రైతాంగంపై, పల్లెలపై భయం గూడుకట్టుకుని ‘కరువురాగం’(సొదుం రమణ) ఆలపిస్తే, నిరుద్యోగుల వెతలను ‘అలకపాన్పు’ (ఎన్.సి.రామసుబ్బారెడ్డి), ‘రెకమెండేషన్’ (మలిశెట్టి జానకీరాం) కథలు రెండుకోణాల్లో ఆవిష్కరిస్తాయి. హాస్యానికో, లేక తమ ప్రత్యేకతలను బట్టో ఏర్పడే మారుపేర్లను అడ్డం పెట్టుకుని “ఒక బక్కోని బతుకుమింద బలవంతులేసిన మచ్చ”ను ఎత్తిచూపే ‘మచ్చ’ (కొమ్మద్ది అరుణారమణ), ముసలితనంలో తమవాళ్లనుంచే ఎదురయ్యే దయనీయమైన సమస్యలను విశదీకరించిన కరుణరసాత్మకమైన కథలు ‘ఈ గుండె కరగదు’ (ముంగర శంకరరాజు), ‘అంతరం’ (బిజివేముల రమణారెడ్డి). భూస్వామ్య భావజాలం ఎంతలోతుగా పాతుకుని ఉందో తెలిపే ‘తొందరపడి ఒక కోడి ముందే కూసింది’ (ఆరవేటి శ్రీనివాసులు), మతసామరస్యాన్ని చాటే కథ ‘మతాతీతం’ (మల్లెమాల వేణుగోపాలరెడ్డి), రాజకీయాల రైల్వేస్టేషన్లో వస్తున్న మార్పులను సూచిస్తూ అసలైన గాంధేయవాదులను లోపలికి రావద్దని హెచ్చరించే ‘రెక్కమాను’ (ఎం.వి.రమణారెడ్డి), అధికారమున్నవాడు అది లేనివాళ్లకు చేసే దుర్మార్గమైన అన్యాయాన్ని కళ్లకు కట్టే ‘ఎల్లువ’ (దాదా హయత్), ఈ ప్రాంతపు ఆచారాలకు, సంస్కృతికి సంబంధించిన కథలు ‘పాడె’ (సొదుం జయరాం), ‘శిలబండి’ ( వేంపల్లి గంగాధర్ & చెన్నా రామ్మూర్తి), ‘జీవసమాధి’ (ఇబ్రహీం), ‘కడుపాత్రం’ (తవ్వా ఓబుల్ రెడ్డి), ఒక భయానకమైన అనుభవాన్ని వివరించే ‘సిన్నిగాడి సికారి’ (బత్తుల ప్రసాద్), ‘వీడా నా కొడుకటంచు..’ అన్న మాటలను గుర్తుకుతెచ్చే ‘కుక్కకు కోపమొచ్చింది’ (రాణీ పులోమజాదేవి), ఒకే ఘటన గురించి మూడు కోణాల నుంచి చెప్పే ‘ఆ ముగ్గురూ!’ (డి.కె.చదువులబాబు), రియల్ ఎస్టేట్ ప్రభంజనంలో కొత్త భవంతుల నిర్మాణం కోసం ఉన్న కొంపలు కూల్చేస్తుంటే వాటితోబాటే కనీస మానవత్వం, అనుబంధాలు కూడా కూలిపోయి నిలువనీడ కోల్పోతున్న వారి కథ ‘కాసింత నీడ’ (ఎస్.పి.మహమూద్), విభిన్న ప్రణయకథ ‘యంగముని వ్యవసాయం’ (డా. ఎన్.రామచంద్ర) – ఇలా గొప్ప వస్తువైవిధ్యంతో అలరారే ఈ కథలన్నీ విలువైనవే. తప్పక చదవాల్సినవే.
ఐతే ఈ కథల్లో లోపాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కేశవగోపాల్ రాసిన ‘సంస్కరణ’ కథలో చెప్పదలచుకున్న విషయం మంచిదే అయినా పార్వతమ్మ కొడుకైన సీతాపతికి గతం తెలియనంతమాత్రాన నీతి, అవినీతి పట్ల అంత కరడుగట్టిన భావాలుండడం, గతం తెలిసినప్పుడు అతడు అంత తీవ్రంగా స్పందించడం అసహజంగా ఉంది.అలాగే ‘పొగ(రు) మంచు’ (కేతు బుచ్చిరెడ్డి) కథ కూడా వాస్తవానికి దూరంగా ఉంది.
కథనంలో గొప్ప చమక్కులున్న కథలు పొగ(రు) మంచు, చమత్కారం ఆధారంగా నడచిన కథలు ‘మావూరి దేవర’ (గుండం రామచంద్రారెడ్డి), ‘మార్జాలోపాఖ్యానం’ (కొమ్మిశెట్టి మోహన్) లాంటివి ఉన్నాయి. ఇవేగాక ‘అబల’ (ఆచార్య పి. నరసింహారెడ్డి) చివరికి నవ్వు తెప్పించినా ఈ సంకలనంలో పూర్తిస్థాయి హాస్యకథలు లేవు.
రారా, కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, చక్రవేణు, దాదా హయత్, పాలగిరి విశ్వప్రసాద్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, లాంటి గొప్ప కథకులు రాసినవాటిలోంచి ఒక్కొక్కటే ఎంచుకోవలసిరావడం ఏ సంకలనకర్తలకైనా కష్టమే. ఐనా కడప జిల్లాకు చెందిన కథా రచయితల గురించి, వారి రచనల గురించి, కడప జిల్లావాసుల జీవితాల గురించి తెలుసుకోవడానికి అద్భుతంగా ఉపకరించే గ్రంథం ఈ కడప కథ. అంతే కాదు, మంచి తెలుగుకథలు చదవాలనుకునేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం కూడా.
ఈ పుస్తకంలో అచ్చుతప్పులు పెద్దగా లేనప్పటికీ మాండలిక పదాలు, పదబంధాలు ఉన్నచోట్ల – యారముట్లను యూరముట్లని, “సంకలు ఎగేస్చండ్రు” అనడాన్ని “వంకలు ఎగేస్చిండ్రు” అని ఉండకుండా – మరింత జాగ్రత్తగా ప్రూఫులు చూసిఉండవలసింది.ఏమైనా ఇంత మంచి కథాసంకలనాన్ని పాఠకులకందించిన సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణకర్త “నందలూరు కథానిలయం ” రాజేంద్రప్రసాద్ అభినందనీయులు.
కడపకథ సంకలనకర్త తవ్వా ఓబుళరెడ్డి కడప.ఇన్ఫో (http://kadapa.info) వెబ్సైటుకు గౌరవ సంపాదకులు. (బ్లాగు: http://kadapainfo.blogspot.com) ఇంటర్నెట్ ప్రభావశీలతను సరిగ్గా గుర్తించిన ఈయన ఇక మీదట ఇలాంటి సంకలనాల్లోగానీ, లేదా దీంట్లోనే “మా మాట”లో చెప్పినట్లు మలికూర్పులో గానీ మరింత సమగ్రత కోసం ఇంటర్నెట్ లో వచ్చే కథలను (ఉదాహరణకు రానారె రాసిన “నత్వం శోచితుమర్హసి”) కూడా పరిగణిస్తారని ఆశించవచ్చు.
ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో లభిస్తుంది. http://kadapa.info ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. లేదా నేరుగా నందలూరు కథానిలయం, నందలూరు-516150, (కడప జిల్లా) నుంచి తెప్పించుకోవచ్చు. 419 పేజీలు గల ఈ పుస్తకం సాదా ప్రతి వెల 200/-, లైబ్రరీ ఎడిషన్ 250/-.

మూడు తరాల ‘సీమ’ కథా సేద్యం

మూడవ తరం కథకులు ప్రపంచీకరణ ప్రభావాన్ని, దళితుల ఆవేదనల్ని, స్ర్తీల అభ్యుదయ భావాలను అక్షర బద్ధం
చేశారు. కరవు,కక్షల కథలతో పాటు ఎన్నో సామాజిక సమస్యలపై విస్తృతంగా కథలు రాస్తున్నారు. ఇవాళ రాయలసీమలో దాదాపు మొత్తం 220మంది కథకులు ఉన్నారు. వీరిలో 177 మంది కథారచయితలు కాగా, 43 మంది రచయిత్రులున్నారు
వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు రాయలసీమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి. ఆధునిక కథా సాహిత్యం 1901లో బండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి కథతో ప్రారంభమైందని భావిస్తే, రాయలసీమలో మొదటి కథ 1941 వరకు పుట్టనే లేదు. కథ కోసం సీమ ప్రాంతం 40 సంవత్సరాలు ఎదురు చూడక తప్పని పరిస్థితులు.1941 మార్చి 26న ప్రచురితమైన అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణ రాసిన చిరంజీవికథ మొదటికథగా వెలుగులోకి వచ్చిం ది. సీమలో ఆధునిక జీవితమే ఆలస్యంగా మొదలు కావడం ఇందుకు మరో కారణం.

రాయలసీమ నుంచి కథారచయితలుగా కీర్తి పొందిన ‘మొదటితరం కథకులు’ మధ్యతరగతి జీవితాలను కథావస్తువులుగా స్వీకరించి కథలను నిర్మింతం చేశారు. ఆర్ధికంగా మారుతున్న జీవన వైరుధ్యాలను కథాంశాలుగా మార్చారు. 1941 నుంచి 1970 వరకు కె. సభా, జి. రామకృష్ణ, మధురాంతకం రాజారాం, రాచమల్లు రామచంద్రారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, సోదుం జయరాం, వల్లంపాటి వెంకట సుబ్యయ్య, పి. రామకృష్ణారెడ్డి, కలువకొలను సదానంద, పులికంటి కృష్ణారెడ్డి, భారతం నాదమునిరాజు, ముంగర శంకర రాజు తదితరులను పేర్కొనవచ్చు. కథాశిల్పంపై రాచమల్లు రామచంద్రారెడ్డికి ఉన్న పట్టు, నమ్మకం ఎటువంటిదో వారి ‘అలసిన గుండెలు’ కథా సంకలనంలోని కథలు చదివితే అర్ధమవుతుంది. మధ్యతరగతి జీవితాల్లోని మార్పులను కేంద్రంగా స్వీకరించి అత్యుత్తమ కథలకు ప్రాణం పోశారు. తన కథల గురించి తానే రాసుకున్న వ్యాసాన్ని చదివితే రారా దృష్టిలో కథఃటే ఎంతటి బలమైన సాధనమో మనకు విశదమౌతుంది.

తర్వాత మనకు అదే స్థాయిలో శక్తిమంతమైన కథకుడిగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కన్పిస్తారు. వీరి జప్తు, ఇచ్ఛాగ్ని, అమ్మవారి నవ్వు కథాసంకలనాల్లోని కథలు ప్రపం చ స్థాయి కథానికల కోవకు చెందినవిగా చెప్పుకోవచ్చు. పీర్లసావిడి, గడ్డి, దాపుడుకోక, జప్తు, ఇచ్ఛాగ్ని, నమ్ముకున్న నేల, విరూపం కథలు చారిత్రాత్మకమైన హోదాను కలిగి ఉండి పాఠకుడి మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని ఏర్పరచుతాయి. బలమైన కథా మూలాల్లోంచి పాఠకుడు సాంఘిక, సామాజిక చరిత్ర కోణాన్ని చూస్తాడు.
తర్వాత చిత్తూరు జిల్లానుంచి కథలందించిన కె. సభా స్థానికత, ప్రాంతీయతకు పట్టం కట్టారు. వీరు దాదాపు 300కు పైగా కథలు రాసినట్టు తెలుస్తోంది. వాటిలో కొన్ని- బంగారు, పాతాళగంగ, నీటి దీపాలు పేరుతో కథాసంకలనాలుగా వచ్చాయి. వీరు పిల్లల కథలు కూడా ఎన్నో రాశారు. ‘దామల చెరువు పెద్దాయన’గా గుర్తింపు పొందిన మధురాంతకం రాజారాం చిన్న వయస్సులోనే ‘వీరోచిత వర్తకం’ అనే కథ రాశారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎదురైన అనుభవాల ఆధారంగా ఎన్నో పాత్రకలు రూపం పోసి కథలు రాశారు.

వర్షించిన మేఘం (1961), తాను వెలిగించిన దీపాలు (1963), పునర్నవం (1968), కళ్యాణ కంకిణి (1968), కమ్మ తెమ్మెర (1968), వక్రగతులు (1968), వగపేటికి (1977), వినోద ప్రదర్శనం (1978), రేపటి ప్రపంచం (1975), నిర్వచనం (1995), పాఠశాల (1993), హాలికులు కుశలమా (1994), కూనలమ్మ కోన (1995), కథా సంపుటాలు వెలువడ్డాయి. సీమ కథకు కొత్త అర్ధం చెప్పిన కథకులుగా మధురాంతకం పేరొపొందారు. కడప జిల్లాకు చెందిన సోదుం జయరాం అపారమైన జీవితానుభవం ఉన్న రచయిత. వాడిన మల్లెలు, సింహాద్రి స్వీట్‌ హోం, సోదుం జయరాం కథలు అనే మూడు కథా సంపులాలు వెలువడ్డాయి. కొకు, రారా వంటివారి ప్రశంసలు అందుకున్నారు వీరు.
వాడిన మల్లెలు శీర్షికతోనే జయరాంతో పాటు రారా, ఆర్‌. వెంకటేశ్వరరావు (ఆర్వియార్‌) కూడా సంవేదన పత్రికలోనే వేర్వేరు దృక్కోణాలతో కథ రాసి ప్రయోగం చేశారు.

అలాగే పెన్నేటి కథలు, మనిషీ- పవువూ కథా సంపుటాల ద్వారా పి. రామకృష్ణారెడ్డి సీమ కథలకు అక్షర రూపం ఇచ్చారు. కడప మాండలికంలోని యాస, వేగం, కారుణ్యాన్ని వీరి కథల్లో చూడొచ్చు. విమర్శకుడిగా గుర్తింపు పొందిన వల్లంపాటి వెంట సుబ్యయ్య 1962లో ‘అన్యధా శరణం నాస్తి’ కథ ద్వారా కథకుడుగా కూడా సాహిత్యరంగానికి పరిచయమయ్యారు. రైల్వేలో ఉద్యోగిగా ఉంటూ ‘గూడు కోసం గువ్వలు’ కథ ద్వారా పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లానుంచి ముందుకొచ్చారు. కోటిగాడు స్వతంత్రుడు, పులికంటిథావాహిని, పులికంటి దళిత కథల ద్వారా సీమ కథా సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను పులికంటి సాధించారు.

వస్తువులో నవ్యత్వం, శిల్పంలో వైవిధ్యంతో కలువ కొలను సదానంద (చిత్తూరు జిల్లా) పిల్లల పుస్తకాలతో పాటు, రక్తయజ్ఞం (1965), పైరు గాలి (1967), ఓండ్రింతలు (1975), నవ్వే పెదవులు- ఏడ్చే కళ్ళు (1975), రంగు రంగుల చీకటి (1995), అనే ఐదు కథా సంపుటాలు వెలువరించారు.
1970 నుంచి 1995 వరకు సీమ నుంచి రెండవ తరం కథకులు రంగ ప్రవేశం చేశారు. వీరు రైతులకు సంబంధించిన ఇతివృత్తాలతో పాటు కరవు, గ్రామీణ కక్షలు (ఫ్యాక్షన్‌), వ్యవసాయ సంక్షోభాల పైన విస్తృతంగా కథలు రాశారు. సామాజిక చరిత్రను నమోదు చేశారు. ఇనాక్‌, సింగమనేని నారాయణ, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, ఎంవిఆర్‌, శశిశ్రీ, డా కేశవరెడ్డి, మధురాంతకం నరేంద్ర, మహేంద్ర, చిలుకూరి దేవపుత్ర, శాంతి నారాయణ, రాసాని, దాదా హయత్‌ తదితరులను రెండవ తరం సీమ కథకులుగా పేర్కొనవచ్చు. మార్క్సిస్టు తాత్వికత కోణం నుంచి ఆధునిక సీమ కథకు శ్రీకారం చుట్టిన కథకులు సింగమనేని నారాయణ. జూదం (1988), కథలు (1999) పేర్లతో రెండు సంపుటాలు వచ్చాయి. వీరి మొదటి కథ 17 ఏళ్ళ వయస్సులో రాసిన ‘న్యాయం ఎక్కడ?’ 1960 జూలై 2న ఒక పత్రికలో ప్రచురితమయింది.

ఉచ్చు, ఊబి, అడుసు, ఫిరంగిలో జ్వరం, అగాధం, మకర ముఖం, నిషిద్ధం, హింస కథలు మళ్ళీ మళ్ళీ చదవాలనే భావనను కలిగిస్తాయి. మానవ సంబంధాలను ఆవిష్కరించే కథలుగా వీరి కథలు గుర్తింపు పొందాయి. ఎనిమిది కథా సంపుటాలు వెలువరించడం ద్వారా కీర్తి పొందిన కొలకలూరి ఇనాక్‌ ఊరబావి (1983), సూర్యుడు తలెత్తాడు (1988), కట్టడి (2007) కథాసంపుటాల్లోని కథలు దళిత కోణం నుంచి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. దళిత కథళకు కొత్త ఊపిరిగా, కుల వివక్షను, సాంఘిక దోపిడీని, జీవన సంఘర్షణను వీరు కథల్లో బలంగా చిత్రించారు. చిలుకూరి దేవపుత్ర ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, బందీ, వొకర టింకర ఒ కథలు విలువైనవి. బండి నారాయణ స్వామి ‘వీరగల్లు’ కథా సంకలనం ప్రకటించారు.వీరి చమ్కీదండ, పద్దపాదం, రంకె, పల్లె మాదిగ, సావుకూడు, నీళ్ళు, నడక, ఇరుసు... వంటి కథలు ప్రతిష్ఠాత్మకం. శక్తిమంతమైన కథలు రాసిన కథకుడు స్వామి.

19070లో తొలి కథా సంకలనంగా ‘రక్తపు ముద్ద పిలిచింది’ ద్వారా శాంతి నారాయణ కథా క్షేత్రంలోకి అడుగు మోపారు. చిత్తూరు జిల్లాలో నామిని తన మొదటికథ ‘మళ్ళీ జన్మించు మహాత్మా’ ద్వారా పరిచయమయ్యారు. 1985లో పచ్చనాకుసాక్షిగా కథల ద్వారా, 1986లో పాలపొదుగు కథలు,1987లో సినబ్బ కథ లు, 1988లో మునికన్నడి సేద్యం, 1990లో మిట్టూరోడి కథల ద్వారా నామిని సీమ కథా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. మధురాంతకం రాజారాం కుమారుడు నరేంద్ర కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, ప్రహేళిక, వెదురు పువ్వు కథా సంపుటాల ద్వారా పేరు పొం దారు. ‘కనుపించని కోయిల’ కథా సంపుటి ద్వారా మహేంద్ర కూడా ఉత్తమ కథకుడిగా కీర్తి పొందారు.

పూతలపట్టుకు చెందిన డా కేశవరెడ్డి సీమ కరవు నేపథ్యంలో ‘వక్ర ప్రకృతి’ కథ రాశారు. ది రోడ్‌, భగవాన్‌ వాచ కథలను కూడా వీరు అందించి కథాసాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు.1995 నుంచి నేటి వరకు సీమ మూడవ తరం కథకులుగా విభజించుకుంటే పాలగిరి విశ్వప్రసాద్‌, సన్నపు రెడ్డి వెంకట్రామిరెడ్డి, నాగప్పగారి సుందర్రాజు, రాప్తాడు గోపాల కృష్ణ, సుంకోజి, ఎం. హరికిషన్‌, తుమ్మల రామకృష్ణ, గీపినీ, జి.ఆర్‌. మహర్షి, తవ్వా ఓబుల్‌రెడ్డి, జి.వెంకట కృష్ణ, చక్రవేణు, డా వేంపల్లి గంగాధర్‌, ఎస్‌.వి. ప్రసాద్‌, షరీఫ్‌ వంటివారు కనుపిస్తారు. మూడవ తరం కథకులు ప్రపంచీకరణ ప్రభావాన్ని, దళితుల ఆవేదనల్ని, స్ర్తీల అభ్యుదయ భావాలను అక్షర బద్ధం చేశారు. కరవు, కక్షల కథలతో పాటు ఎన్నో సామాజిక సమస్యలపై విస్తృతంగా కథలు రాస్తున్నారు. ఇవాళ రాయలసీమలో దాదాపు మొత్తం 220 మంది కథకులు ఉన్నారు. వీరిలో 177 మంది కథారచయితలు కాగా, 43 మంది రచయిత్రులున్నారు.
వీరి కథలన్నీ సేకరించి, విశ్లేషించి వీరి జీవిత విశేషాలతో పాటు- నా పరిశోధన గ్రంథం ‘రాయలసీమ కథా సాహిత్యం’లో పొందుపరచే అవకాశం నాకు దక్కింది. రాయలసీమ ప్రాంత జీవితాలను, జీవనాన్ని ఈ కథలు రికార్డు చేశాయి. తెలుగు కథా సాహితీ చరిత్రలో సీమ కథ తగిన ప్రాధాన్యతను, గుర్తింపును, హోదాను కలిగి ఉంది. సీమ కథ ఆలస్యంగా మొదలైనప్పటికీ అత్యద్భుతమైన పరిణతి సాధించింది. ఇదొక గొప్ప ప్రయత్నం. సీమ కథలో పరిపూర్ణత ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ‘కోటి గొంతుల కిన్నెర- కోటి గుండెల కంజరి’కి ఇవే కథా కుసుమాల అభినందన చందనాలు.

సీమకోయిలా పాటెందుకు పాడవు?



annamayyaరాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమ లోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను పురస్కరించారు. జెైన మత ప్రచారం కోసం మత ప్రచారకులు స్థానిక భాషలను ప్రోత్సహించడమే ఇందుకు ముఖ్య కారణం. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు సామాజిక నిర్మాణం భాషాభివ్యక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటారు. సహజంగానే భాషాభివ్యక్తి కూడా సామాజిక నిర్మాణం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆనాటి మత ప్రచార గేయాలు నేడు లభించడం లేదు.

ఆ నాటి రాయలసీమ ప్రజానీకానికి, జానపద కళాకారులకు ఆచెైతన్యం లేకపోయింది. ఆ తర్వాత దాదాపు వెయ్యి సంవత్సరాలకు రాయలసీమ జానపద గేయానికి గజ్జెకట్టి కంజీర మోగించిన జానపద వాగ్గేయకారుడు అన్నమయ్య. తెలుగులోనే మొదటి జానపద వాగ్గేయకారుడు. ఆనాటి రాజుల్ని వారి ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ వ్యతిరేకతను పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్దప్ప వంటి జానపద వాగ్గేయకారులే కాక ధూర్జటివంటి పండిత కవులు కూడా కొనసాగించారు. దిశమొలతో దేశమంతా సంచరిస్తూ శాస్త్రీయమైన జీవన తాత్త్వికతను కవిత్వం చేసిన వేమన సరేసరి! అయితే ఆ జానపద వాగ్గేయకారుల వారసత్వం ఆధునిక కాలంలో రాయలసీమకు లేకపోవడం ఒక ఆశ్చర్యం. సమకాలీన తెలంగాణలో సుద్దాల హనుమంతు, గద్దర్‌, గోరేటి వెంకన్న, ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు వంటి జానపద వాగ్గేయకారులున్నట్లు రాయల సీమలో అటువంటి కళాకారులు కనిపించకపోవడం విస్మయం కలి గించే వాస్తవం.

vతిరుగుబాటు తత్త్వంలోనే కాక సామాన్యుని జానపద భాషకు సంగీతాన్ని సమన్వ యించి తెలుగు సంకీర్తనకు ప్రాణం పోసిన అన్నమయ్యకు తెలంగాణలో రామదాసు, కోస్తాలో క్షేత్రయ్య వంటివారు వారసులయ్యారు. కానీ రాయలసీమలో భాషలో, భావ జాలంలో వారసత్వం లేకపోవడానికి చాలా కారణాలే కన్పిస్తాయి.విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత రాయలసీమ అంతటా పాలెగాళ్ళు పాలకులయ్యారు. అప్ప టికే నిర్మితమైన చెరువుల వంటి ఆదాయ వనరులను కేంద్రంగా చేసుకొని అనతి కాలంలోనే బలపడ్డారు. తమకు తామే గొప్పవాళ్ళమనుకునే ఆధిపత్య భావజాలంలో మునిగితేలుతూ తమలో తాము కలహించుకుంటూ ఈ ప్రాంతాన్ని రావణకాష్ఠం చేశారు. పాలెగాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధాల్లో ఓడిపోయిన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని రాయలసీమలోని కైఫీయత్తులు సాక్ష్యం చెబుతాయి.

ఓడిపోయిన గ్రామాల్లోని ప్రజల ఆస్తులు, తిండి గింజలతోపాటు, మాన ప్రాణాలకు కూడా రక్షణలేదు. అందువల్ల ప్రత్యర్థి పాలెగాళ్లనే ప్రజలు శత్రువులుగా చూశారు తప్ప, ఈ సమస్యకు మూలకారణమైన వ్యవస్థమీద వ్యతిరేకత లేకపోయింది. హైదరాబాద్‌ నిజాం సైన్య సహకార పద్ధతి కింద రాయలసీమను బ్రిటిష్‌వారికి దత్తత చేయడం పరిస్థితిని బాగా దిగజార్చింది. థామస్‌ మన్రో పాలెగాళ్ళను అంతమొందించే సమయంలో కొందరు స్థానిక పాలెగాళ్ళ మీద ప్రజల సానుభూతి కూడా వెల్లువెత్తింది. మహా లింగారెడ్డి అనే పాలెగాణ్ణి బ్రిటిష్‌ పోలీసులు హతమార్చినప్పుడు ఆ నాటి అజ్ఞాత జానపద కళాకారుడు ఆలపించిన ‘కొడుకో మా లింగారెడ్డి’ అనే స్మృతి జానపద గేయం (ఊౌజూజు ఉజ్ఛ్ఛూడ) వందల సంవత్సరాల తర్వాత కూడా నేటికీ రాయలసీమ నాలుక మీద సజీవంగా ఉంది. ఈ పరిణామాల ప్రభావంతో ఈసమయంలో పాలెగాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించే జానపద సాహిత్యం ఆవిర్భవించలేదు.

బ్రిటిష్‌ ప్రభుత్వం కేవలం పాలెగాళ్ళను అంతమొందించింది తప్ప పాలెగాళ్ళ వ్యవస్థను రూపు మాపలేదు. ప్రజల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ఈ వ్యవస్థను మరో రూపంలో ప్రోత్సహించింది. ఈ పాలెగాళ్ళ వ్యవస్థ ఆధునికతను సంతరించుకొని ఫ్యాక్షన్‌ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ సంధి దశలోని ఒక చిన్న పరిణామాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సందర్భంలో భయంకర కరవులు ఏర్పడినప్పుడు ధనవంతుల్ని, భూస్వాముల్ని దోచి ప్రజల ఆకలి తీర్చిన దివిటీల మల్లుడు వంటి దారిదోపిడీ దొంగల్ని అజ్ఞాత జానపద కళాకారులు కీర్తించిన కొన్ని జానపద గేయాలు లభిస్తున్నాయి (దివిటీల మల్లుగాడు/ దీటిబట్టి వచ్చినాడు/ గుఱ్ఱమెక్కి గూడమొచ్చి/ గంజి గటక కాచి కాచి/ సానికల్లో పోసినాడు/ ధాతుకరువు భూతమయ్యె/ దొర కొడుకుల దొరతనం మల్లు ముందు దిగదుడుపురా నాసామిరంగా). అయితే ఇది తాత్కాలికమే అయింది. ఫ్యాక్షన్‌ వ్యవస్థ తీవ్రంగా పాదుకొని గ్రామాన్ని రెండు ముఠాలుగా మార్చేసింది.

1930వ దశకంలోనే ఈ ఫ్యాక్షన్‌ ప్రభావం పుట్టపర్తి నారాయణాచార్యులు ‘మేఘదూతం’ గేయంలోనే కనిపిస్తుంది. స్వాతం త్య్రానంతరం ఫ్యాక్షనిస్టులే రాజకీయ నిర్ణాయకులుగా మారిపోయారు.
ఈ రాయలసీమ పరిస్థితులకు- తెలంగాణ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. నామమా త్రమైన గోల్కొండ నిజాం పాలనలో తెలంగాణ గ్రామాలకు జమీందార్లు, పటేళ్ళు, పట్వారీలు ప్రత్యక్ష పాలకుల య్యారు. బానిసత్వాన్ని పెంచి పోషించారు. నిజాం వ్యతిరేకతతో పాటు స్వాతంత్య్ర ఉద్యమ ప్రభా వంతో తెలంగాణ విమోచన ఉద్య మంలో జానపద వాగ్గేయకారులూ కీలక పాత్ర నిర్వహించారు. ‘మా నిజాం తర తరాల బూజు’, ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని/ తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రతనాల వీణ’’

(దాశరథి కృష్ణమాచార్య) అన్న పండిత కవుల మాదిరిగానే జానపద కవీ ఘాటుగానే స్పందించాడు (‘నెైజాం సర్కరోడా నాజీల మించినోడా/ యమ బాధలు పెడితివి కొడుకో, నెైజాం సర్కరోడా’... ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవు కొడుకో నెైజాం సర్కరోడా’).తెలంగాణ విమోచన ఉద్యమానికి ముందున్న దొరల వ్యవస్థ సామాన్యుల బానిసత్వం, తెలంగాణ గ్రామాల అస్తిత్వాలకు దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్ళు’, వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’ వంటి నవలలు మంచి సాక్ష్యాలు. రాయల సీమలోని అతి పేద దళితుడు కూడా కాస్తో కూస్తో భూమిని కలిగి ఉన్నాడు. కరవులు చుట్టిముట్టినా భూమి మీద సర్వాధికారాలు అతనివే. రాయ లసీమలో గ్రామం రెైతు పోషితం.

తెలంగాణలో భూములు చాలా వరకు జమీందారులవే. వారి దయా దాక్షి ణ్యాల మీద గ్రామం ఆధారపడి ఉంది. తెలంగాణలో గ్రామం దొరల పోషితం. ఈ ప్రత్యేక పరిస్థితులే తర్వాత కాలంలో సాయుధ పోరాటానికి మూలకారణమయ్యాయి. సాయుధ పోరాటానికి పాట ప్రధాన వాహిక. ఈ సాయుధ పోరాటమే గద్దర్‌ వంటి వారిని తయారు చేసింది. ఈ పరిస్థితులే తెలంగాణా నుండి ‘మనిషి లోపల విధ్వంసం, అతడు’ (అల్లం రాజయ్య) వంటి కథలూ జన్మించడానికి ఆస్కారమయ్యాయి. ఇటువంటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉండడం వల్ల ‘యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) వంటి కథ రావడానికి, వంగపండు వంటి జానపద వాగ్గేయకారులు తయారు కావడానికి దోహదం చేశాయి.
ఇటువంటి పరిస్థితులు రాయలసీమలో లేనందువల్ల అటువంటి జానపద వాగ్గేయకారుల ఆవిర్భావానికి అవకాశమే లేకపోయింది. ఏ సమాజమైనా తనకు అవసరమయ్యే కళల్ని తనే రూపొందించుకుంటుంది. రాయలసీమకున్న ప్రత్యేక పరిస్థితులపట్ల జానపద గేయాల ఆవిర్భావం జరుగుతోంది. వాటిలో ఉద్యమ చెైతన్యమూ లేదు, సహజమైన వాగ్గేయకారుల అభివ్యక్తీ లేదు. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానించినట్లు సామాజిక నిర్మాణం, భాషా నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భాషంటే కేవలం మాటలు కాదు కదా! ఒక జీవన విధానం, ఒక సంస్కతి, ఒక ప్రాంత అభివ్యక్తి!!
May 27, 2012-Surya daily

సీమ కథకు చిరునామా-


తెలుగు కథా సాహిత్యంలో విభిన్నమైన ఇతివృత్తాలను ఎంపిక చేసుకుని కథలుగా నిర్మితం చేసినవారు అరుదుగా కనుపిస్తారు. కథలను కథలుగానే చెప్పి నిజాయితీగా పక్కకు తప్పుకునే కథకులు తక్కువమందే. వారిలో ఒకరు వేంపల్లి గంగాధర్‌.

vempalli-gangadharరాయల సీమ నుంచి పుంఖాను పుంఖాలుగా ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. వాటన్నిం టినీ ఒక చోట పేర్చి చూస్తే, సగం కరవు- మిగిలిన సగం కక్షల ఇతివృత్తాలతో ఉంటాయి. ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సీమలో కథాంశాలుగా చేయాల్సిన, చేయదగిన ఇతివృత్తాలు ఇంకేమీ లేవా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషిస్తున్నప్పుడే ‘మొలకల పున్నమి’, ‘దేవర శిల’ కథా సంకలనాలు దృష్టిలోకి వస్తాయి. ఇవి రాయలసీమ కథలకు అతీతంగా సామాజికాంశాలను స్పృశిస్తాయి. కరవు, కక్షల పరిధిని దాటించి సీమ కథా స్థాయిని పెంచిన సంకలనాలు ఇవి. వీటి రచయిత వేంపల్లి గంగాధర్‌. పాత్రల స్వభావంలో, రచనా శైలిలో, భాషా మాండలికంలో వైవిధ్యాన్ని అందించడం వీటి ప్రత్యేకత.

Hiranya-rajyam---bookప్రకృతికి, మనిషికి, నైతిక విలువలకు పట్టం కడుతూ చిత్రించిన ‘వాన రాయుడి పాట’ గంగాధర్‌ మరో సృజన. ఈ కథకు గురజాడ కథా పురస్కారం దక్కింది. గుర్రం మీద పట్టు వస్త్రాలతో గ్రామాలలో తిరుగుతూ వర్షాల కోసం పూజలు చేసే వేమయ్య స్వాముల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందిం చిన కథ ‘వేమయ్య సామి గుర్రం’. రాయల సీమలోని భూస్వామ్య, పెత్తందార్ల అరాచకాలను, దౌర్జన్యాలను ‘శిల బండి’ కథ చిత్రిస్తుంది. ఈ కథకు ‘జాతీయ కథా ఫౌండేషన్‌, న్యూఢిల్లీ’ పురస్కారం లభించింది. ఈ కథలకు భిన్నంగా భారత స్వాతంత్య్ర సమర కాలంలో రాయలసీమ ప్రాంతంలోని బ్రిటిష్‌ వ్యవస్థ గురించి ‘ఏడు లాంతర్ల సెంటరు’ కథ వివరిస్తుంది.

kathanam---bookసీమ కక్షలకు మాత్రమే నెలవు కాదని, త్యాగాలకు కూడా సిద్ధపడుతుందని చెప్పే కథే ‘దీప మాను’. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను సీమవాసులు ఎలా ఆదరించి చిరకాలం గుర్తు పెట్టుకుంటారో ఈ కథలో చూపుతాడు గంగాధర్‌. సాధారణంగా ఎవరి ఊహకూ, తలంపునకూ రాని వారు మంత్రసానులు. గ్రామాలలో తిరుగుతూ పురుళ్ళు పోసే మంత్రసానుల గురించి, వారి జీవితాలను గురించి ‘మంత్రసాని వైద్యం’ కథ వివరిస్తుంది.

molakala-punami-ఈ కథకుని మరో కథనం ‘ నేల దిగని ఊడ’. ఎద్దుల కాళ్ళకు నాడాలు కొడుతూ జీవనం సాగించేవారి జీవితాలు ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. మరో కోణంలో- ఎర్ర చందనం కొయ్య తో బొమ్మలు తయారు చేసుకుని బతుకు సాగించేవారిని అటవీ అధికారులు ఎలా వేధిస్తారో ‘కొయ్య బొమ్మలు’ కథ చిత్రిస్తుంది.సమాజంలో నెకొన్న మరో దుస్థితి- అమ్మాయిలను రెడ్‌ లైట్‌ ప్రాంతాలకు పంపే వైనం. పూణే, ముంబాయి వంటి నగరాల్లోని రెడ్‌ లైట్‌ ప్రాంతాకు అమ్మాయిల్ని సరఫరా చేస్తే- అటువంటి వారి జీవితాలు ఎలా నలిగిపోతున్నాయో వివరిస్తూ, వారి వ్యథలను ‘మైనం బొమ్మ’ కథ కళ్ళకు కడుతుంది. ఈ కథకు అమెరికన్‌- తెలుగు అసోసియేషన్‌ (ఆటా) బహుమతి లభించింది. ఫ్యాక్షన్‌ ఇతివృత్తంగా పచ్చని పల్లెలు కక్షల చిచ్చుకు ఎలా బలి అవుతాయో వివరిస్తుంది ‘కొలిమ్మాను’ కథ. ఈ కథకు ఆర్‌.ఎస్‌. కృష్ణ మూర్తి ఫౌండేషన్‌ కథా పురస్కారం దక్కింది.

గంగాధర్‌ మరో కథ ‘ఎడారి ఓడ’. వీధుల వెంట తిరుగుతూ ఒంటె మీద సవారి చేస్తూ గడిపే జీవితాలను కళ్ళముందు ఉంచుతుంది ఈ కథ. కూటికోసం కోటి విద్యలన్నట్టుగా జీవనాన్ని సాగించే ప్రజల దైనందిన జీవితాలు గంగాధర్‌ కథల్లో దర్శనమిస్తాయి. అలాంటి కోవకు చెందినదే ‘అంజన సిద్ధుడు’ కథ. ఈ కథ తమ జీవన భృతి కోసం అరచేతిలో అంజనం వేసి ప్రజల్ని నమ్మిస్తూ జీవితాల్ని నెట్టుకొచ్చేవారి గురించి వివరిస్తుంది. మరో కథలో మేక పేగును వాద్య పరికరంగా చేసి వాయించే వ్యక్తి మరణించిన తర్వాత, ఆ విద్యను ఎవరూ నేర్చుకోక పోవడంతో వాద్య పరికరం మాత్రం మిగులుతుంది గాని దానిని వాడే విధానం ఎవరికీ తెలియదు. ఈ ఇతివృత్తంతో సాగుతుంది ‘వాడొక్కడు’ కథ.

devera-sila-bookసమాజంలోని అమానవీయత, మూఢనమ్మకాలు, నరబలులను నిరసిస్తూ ‘తూరుపు కొమ్మలు’ కథ సాగుతుంది. కన్న బిడ్డను బలి ఇచ్చారని తెలుసుకున్న తండ్రి హృదయ విదాకరక మౌన వేదన, నా బిడ్డను చూశారా అంటూ అడిగే తల్లి ఆవేదనను గంగాధర్‌ కళ్ళకు కట్టినట్టు చిత్రించాడు. అంతేకాదు, మాండవి అనే నది ఎండిపోతే ఆ నదిని నమ్ముకుని ఉన్న ప్రజలు ఎలా జీవిస్తారో ‘మాండవ్యం’ కథ వివరిస్తుంది. గంగాధర్‌ మరో కథ ‘శరణాగతుడు’. సీమలో చెరకు రైతుల కష్టాలను వివరిస్తూనే ఆ రైతులు చెరకు ఫ్యాక్టరీలలో ఎదుర్కొనే సమస్యల్ని ఈ కథ చిత్రించింది.

ముస్లిం జీవితాలకు అద్దం పడుతూ సీమ ప్రాంతాల నుంచి గల్ఫ్‌ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ తమ కుటుంబాల కోసం పడే వేదనను ‘ఉరుసు’ కథ వివరిస్తే, సీమలో దళితుల ఆవేదన, ఆక్రందన మానసిక సంఘర్షణ, జీవన పోరాటం- ఇత్యా ది అంశాలను ప్రధానంగా చేసుకుని ‘పొద్దు పుట్టింది’, ‘నల్ల ఛత్రి’ కథలు కనుపిస్తాయి. వ్యక్తుల మానసిక స్థితిని, వారి ఊహలను కాలానికి అతీతంగా ముందుకు నడిపించేదిగా ‘నీడలు’ కథ వివరిస్తుంది.

సీమలో బయటపడ్డ యురేనియం గనుల కోసం గ్రామాలను ఖాళీ చేయించే ఇతివృత్తంతో రూపొందిన కథ ‘నెత్తుటి మాన్యం’. మనిషి సంపాదన కోసం నైతిక విలువలను ఫణంగా పెట్టి ఎదుగుతున్న వైనాన్ని ‘ఏడు తలల నాగు’ కథ చిత్రిస్తుంది. ఈ కథలన్నీ విభిన్న ఇతివృత్తాలకు ఉదాహరణలే. తెలుగు కథా సాహిత్యంలో ఇంత విభిన్నమైన ఇతివృత్తాలను ఎంపిక చేసుకుని కథలుగా నిర్మితం చేసినవారు అరుదుగా కనుపిస్తారు.

raamకథలను కథలుగానే చెప్పి నిజాయితీగా పక్కకు తప్పుకునే కథకులు తక్కువమందే. వారిలో ఒకరు వేంపల్లి గంగాధర్‌.‘మొలకల పున్నమి’ కథా సంకలనానికి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ముందుమాట ప్రస్థావనార్హం.గంగాధర్‌ ‘నెత్తుటి మాన్యం’ కథకు విపుల కథా పురస్కారం, ‘తూరుపు కొమ్మలు’ కథకు సాహిత్య నేత్రం కథా పురస్కారం, ‘మొలకల పున్నమి’ సంకలనానికి విశాల సాహితీ అకాడమీ- బి.ఎస్‌. రాములు కథా పురస్కారం, ‘పొద్దు పుట్టింది’ కథకు తేజ వీక్లీ రూ.10 వేల ప్రధమ బహుమతి పురస్కారం లభించాయి. సీమ కథకు చిరునామాగా ఈ కథలన్నీ నిలచిపోతాయి.

బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

Dr-Thirmala-ramachandra తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది- పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచె్చైనాయి.ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు. ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు.

రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా- ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా- సహాయ సహకారాలు అర్ధించగా- జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (‚అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని- తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

డెభె్భై ఏళ్ళ కిందనే �తెలంగాణ� అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ- ఈ సంస్మరణ వ్యాసరచయితకు రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు.ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రసక్తం కాలేదు.ఇప్పుడు ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీ కరించినా ఆయనతో మొట్టమొదటి ఇంటర్వ్యూ, చిట్టచివరి ఇంటర్వ్యూ చేయడం ఈ వ్యాస రచయితకే దక్కిందని ఇతడి అభిప్రాయం. ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో ఈ వ్యాసరచయిత ఎంతో విపులంగా ఆయన జీవిత వృత్తాంతం సేకరించాడు. తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు �కమలాపురం నుంచి క్వెట్టాదాకా� లేదా �హంపీ నుంచి హరప్పా దాకా� అని ఉం టే- ఏది ఎక్కువ బాగుంటుందని ఆయన ప్రసక్తం చేయ గా- రెండోపేరు ఆకర్షకంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా, ఆయనతో ఇంకొక విపులమైన ఇంటర్వ్యూ ఈ వ్యాస రచయితే నిర్వహించడం జరి గింది. ఆ సందర్భం ఏమంటే- అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచం ద్రగారి జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచు కున్న రచనలు మొదలైన వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఆయన �మూడు వా ఞ్మయ శిఖరాలు� అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.

మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు, మీరు ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని అడగగా ఆయన �మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి� అని చెప్పారు. అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు.
తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇంకొక ఏడాదిలో ఆయన శతజయంతి వత్సరంకూడా రాబోతున్నది.
ఆయన గ్రంథాలు �మన లిపి- పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా�ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండే దని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ- ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని ఈ వ్యాస రచ యిత ఆయనతో చేసిన రెండు ఇంటర్య్వూల్లో- ఆయన చెప్పారు. ఈ రచయిత వాటి ఆధారంగా ఆయన గూర్చి రెండు జీవిత చరిత్రలు, ఇరవై దాకా వ్యాసాలు ప్రచురిం చడం తన సాహిత్యాభిరుచి సార్థకతగా భావిస్తున్నాడు. ఆయనతో తానే మొదటిదీ, చివరిదీ అయిన ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తు చేసుకుంటున్నాడు.



akkiraju
October 24, 2010 Surya daily

‘కరువు’ తీరా సీమ కవితలు

srinrvas-anki1951-53 మధ్య భయంకరమైన మరొక కరువు దాపురించింది. ఇది 1944 కరువు కంటే చాలా దారుణమైనది.
20వ శతాబ్దంలోనే అత్యంత భయానకమైనది. రష్యా గోధుమలు, బియ్యం ఈ కరువు సహాయార్థం అందజేసింది. ప్రతిరోజు 2.04 లక్షల మంది 448 గంజి కేంద్రాల్లో తమ ప్రాణాల్ని నిలుపుకు న్నారు. ఈ కరువు గురించి అనంతపురం జిల్లా పద్యకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారు 1954లో ప్రచురించిన ‘‘తపోవనము’’ అనే పద్యకవితా సంకలనంలో ‘‘గంజి కేంద్రం’’ ఖండికతో రాసిన ఐదు పద్యాలు ఆంధ్రదేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి
రాయలసీమ నుండి 1960 ముందు ఆవిర్భవించిన కవిత్వంలో కొన్ని పరి మితులు కనిపిస్తాయి.

కట్టమంచిగారి ‘‘ముసలమ్మ మరణము’’ కావ్యం లో సీమలోని సహజమైన కరువుల ప్రస్తావన లేదు. ఇందులో వర్ణించే చెరువుల వర్ణనలు మహాసముద్రాల్ని తలపిస్తాయి. అయితే కావ్య వస్తువు కవికున్న స్థానిక మమకారాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు స్థానిక చైతన్యాన్ని ప్రతిబింబించే ‘‘పెనుగొండపాట’’, ‘‘పెనుగొండలక్ష్మి’’ వంటి కావ్య వస్తువుల్ని స్వీకరించినప్పటికీ కరువుల గురించి మాట్లా డలేదు. అయితే పుట్టపర్తిగారి ‘‘మేఘదూతం’’లో కరువు ప్రస్తావన కలిగిన కొన్ని వాక్యాలున్నాయి. ‘‘క్షామపీడిత గ్రామములు వణుకాడ/ నీ మొగము వీక్షింతుర నీరందక తెలుగుప్రజ...’’ అని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూసే రాయలసీమ జీవన చిత్రం కనిపిస్తుంది.

కోస్తా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ కవి బాలగంగాధర తిలక్‌ ‘‘అమృతం కురిసిన రాత్రి’’లో ‘‘భూలోకం’’ పేరుతో ఒక కవిత రాశారు. 1941-44 మధ్య వచ్చిన బెంగాల్‌ కరువు కరాళ నృత్యాన్ని పత్రికల్లో చదివి ఈ కవిత రాశారు. ఆ కరువు సమయంలో రాయలసీమ బీభత్సమైపోయింది. ప్రజ ల మానాభిమానాల్ని ప్రశ్నార్థకం చేస్తూ ధరించడానికి దుస్తులు కూడా లేని దౌర్భాగ్యపుస్థితి! ఈ క్షామక్షోభాన్ని విని మైసూరు మహారాజా వారు గొప్ప విరాళం పంపారట. అనేకమైన చౌక దుకాణాల్ని తెరిచి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మవలసి వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన బలమై న పత్రికలు నాడు లేకపోవడం వల్ల రాయలసీమ గురించి బయట ప్రపం చానికి తెలిసే అవకాశం లేకపోయింది.

అంతేకాక స్వాతంత్రోద్యమానికి బెంగాల్‌ స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తున్నందున తిలక్‌ బెంగాల్‌ కరు వు మీద కవిత్వం రాశారు. ఆ కరువు సమయంలో రాయలసీమ కవులెవ్వరూ స్పందిం చలేదు. స్థానికంగా కవులకు ఆ చైతన్యం లేకపోయింది. ఈ కరువు 1946 వరకు ఈ ప్రాంతంలో కొనసాగింది. 1947 ఆగష్టూ 15 నాటి అర్ధరాత్రి స్వాతంత్రోత్స వాలకు కంటి మేఘాలు ద్రవించి కన్నీటి చినుకులు కురిసాయి తప్ప ఆకాశం నుండి మాత్రం వర్షం రాలేదు. అందుకే భూమన్‌ అన్నట్లు ‘‘అధికారం ఒక చేతి నుండి మరొక చేతికి మారగానే కరువు మటుమాయమైపోతుందని వారేమీ కలగనలేదు.’’1951-53 మధ్య భయంకరమైన మరొక కరువు దాపురించింది. ఇది 1944 కరువు కంటే చాలా దారుణమైనది. 20వ శతాబ్దంలోనే అత్యంత భయానకమైనది. రష్యా గోధుమలు, బియ్యం ఈ కరువు సహాయార్థం అందజేసింది. ప్రతిరోజు 2.04 లక్షల మంది 448 గంజి కేంద్రాల్లో తమ ప్రాణాల్ని నిలుపుకున్నారు.

ఈ కరువు గురించి అనంతపురం జిల్లా పద్యకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారు 1954లో ప్రచురించిన ‘‘తపోవనము’’ అనే పద్యకవితా సంకలనంలో ‘‘గంజి కేంద్రం’’ ఖండికతో రాసిన ఐదు పద్యాలు ఆంధ్రదేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టిం చాయి. ప్రస్తుత డిగ్రీ రెండవ సంవత్సరం తెలుగు వాచకంలో ఈ అయిదు పద్యాల్ని చేర్చారు.గంజి కేంద్రం వద్దనున్న జనసమూహం యొక్క దీనస్థితిని ఈ పద్యాలు తెలియజేస్తాయి.‘‘ముదుసళ్ళు స్త్రీలు పురుషులు/ పెదవులు తడియారు చంటి బిడ్డలు మెయిప/య్యెదలేమి సిగ్గుమరచిన/సుదతులు గలరిందు క్షుదకు సోలి నడచుచున్‌’’ అన్ని వయసుల వారు ఆకలితో అల్లాడుతూ వస్తున్నారు.

పెదాలు తడియారిపోయిన పసిబిడ్డలు కూడా! పరిస్థితి ఎంత తీవ్రంగా వుందంటే స్త్రీలు పమిట వేసుకునే స్థితిలో లేరు. సిగ్గు అభిమానం వంటి మర్యాదలు మరచి పోయారు. భారతీయ స్త్రీకి కొంగు చాలా జాగ్రత్తగా చూసుకునే వస్త్రవిశేషం. దానిని కూడా గమనించే స్థితి లేదు. ఆకలి అభిమానాన్ని చంపేస్తుంది. ఇటువంటివే మిగిలిన పద్యాలు కూడా! అయితే బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారి నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ‘‘తపోవనం’’ సంకలనంలోనే ‘‘రాయల సీమ’’ పేరుతో మరొక్క ఐదు పద్యాలు రాశారు.
ఇందులో రాయలసీమ గొప్ప ఋషివాటికగా వర్ణించారు.

‘‘కలగీతంబులు పల్కు పక్షులిచటన్‌ కంఠస్వరంబెత్తి ని/ర్మల శీతానిల వీచికల్‌ వెలయు నీ ప్రాంతంబులన్‌ భావమం/జుల లీలన్‌ ప్రవహించు నిర్ఘరిణులిచ్చో కొండలు దుండి రా/యలసీమా స్మరింపజేతు ఒక దివ్యానందమేనాటిదో’’. మిగిలిన పద్యాలు ఈస్థాయి వర్ణన కలిగినవే! ఈ పద్యాల్లోని పరిస్థితులు కవి జీవించిన నాటికి అక్షరాలా లేవు. ఒకవైపు గుండె ద్రవించే రాయలసీమ దుర్భర పరిస్థితులు చెప్పి, మరొక వైపు రాయలసీమ పరిస్థితులు గొప్పవంటూ చెప్పడం కవి నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కరువు మీదనే భైరపురెడ్డి నారాయ ణరెడ్డి ‘‘రాయలసీమ రైతు’’ అనే ఒక సంపూర్ణ పద్యకావ్యాన్ని రాశారు. ఈయన స్వయం గా రైతు. చెమటను నాగలి చాళ్ళలో నింపిన అనుభవాలనుండి ఈ కావ్యాన్ని రాశారు. 1955 ప్రాంతంలో రచించినప్పటికీ చాలా ఆలస్యంగా 1976లో ప్రచురించడం జరిగింది. సాంప్ర దాయ సౌందర్య అలంకారికతో చాలా ఫ్రౌడంగా రాశారు. కడప జిల్లా రాయచోటి తాలూకా బహుదానది తీరంలోని ఒక చిన్నపల్లె కథా స్థలం. స్థలాభావం వల్ల ఇక్కడ విశ్లేషించే అవకాశం లేదు.

ఎన్ని కావ్యాలు వచ్చినా, వాస్తవ చిత్రణలో, సహజ అభివ్యక్తిలో రాయలసీమకు నిజమైన ప్రాతినిథ్య కావ్యం విద్వాన్‌ విశ్వంగారి ‘పెన్నేటిపాట’! ‘‘కవితావేశంలో మహాప్రస్థానానికి ధీటైనదిగా, 20వ శతాబ్దిలో కండగల కావ్యభాషను సృష్టించు కున్న అతితక్కువ కావ్యాల్లో పెన్నేటిపాట ఒకటి’’గా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అన్నారు. పెన్నేటిపాట గొప్పదనం ప్రత్యేకంగా చర్చించాలి.
రాయలసీమ నేపథ్యంగా వచ్చిన మరొక సాంప్రదాయ పద్యకావ్యం ‘‘అనిల సందేశం’’ దీన్ని పాలా వెంకటసుబ్బయ్యగారు రచించారు. ఈ కావ్య శిల్పం పూర్తి గా పుట్టపర్తివారి మేఘదూతం వంటిదే. మేఘుడు నాయకుడు, భూదేవి నాయికగా అత్యంత సాంప్ర దాయకంగా ఆధునిక ధృక్ఫథానికి విరుద్దంగా రచించడం జరిగింది.

సాధారణంగా రాయలసీమ కరువు మీద సాంప్రదాయిక కవిత్వం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది నండూరి రామకృష్ణమాచార్యుల పద్యం. ‘‘క్షామము దాపు రించి పలుమారులు చచ్చెను జంతు సంతతుల్‌/వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు చరిత్రలోపలన్‌/ క్షామములు ఎన్నివచ్చినా రసజ్ఞత మాత్రం చావలేదు జ్ఞా/నామృతవృష్టికిన్‌ కొరతనందని రాయలసీమ లోపలన్‌’’ రాయలసీమ సాహిత్యాన్ని గురించి ఆవేశంగా మాట్లాడేవారంతా ఈ పద్యంతోనే తమ ప్రసంగాలను ప్రారంభిస్తారని రాచపాలెం అన్నారు. అయితే నండూరి వారు పేర్కొన్న రాయల సీమ రసజ్ఞత ఏది, ఎలాంటిది. నండూరి వారి దృష్టిలోని రసజ్ఞత పౌరా ణిక ప్రాబంధిక రసజ్ఞతే సుమా. కొంత ఉదారవాదుల యితే కావచ్చుకాని సారాంశంలో ఆయన ప్రబంధీకులే. అదేవిధంగా చాలామంది అవధానులు అవధాన సంద ర్భాల్లో పృచ్ఛకుల కోరికమేరకు పద్యాలు వ్రాశారు.

1977-78 ఏ.ఎన్‌. నాగేశ్వర్‌రావు ‘‘కరు వు’’ అనే దీర్ఘకవిత రాశారు. కరువులలో సామాన్యుని గుండెకోత ఎలాంటిదో సామాన్యు ని భాషలోనే రాశారు. ‘‘కరువుకు పుట్టిన కొదమ బిడ్డలం/చీకటి పోరులో బతికిన కుసు మాలం’’ అని ‘‘కరువు పిడికిలి’’ బిగించారు. ‘‘జలగ వర్గాలు తమ నోటితో/రాళ్ళసీమ నెత్తుటిగానే కాదు/కన్నీళ్ళను కూడా’’ పీలుస్తారనే వాస్తవాన్ని విశ్లేషించారు. ‘‘ఊపిరి పీల్చిన ప్రతి సెకను చచ్చి బ్రతికిన కాలమిది’’ అనే ఏ.ఎన్‌. మాట సీమ లోని వాస్తవ దృశ్యం. ‘‘దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు’’ అని ఇక్కడ ప్రసిద్ధి చెందిన సామెత.‘‘స్వప్నాలన్నీ నిద్రించేవాళ్ళకే’’ నంటూ రాధేయ ‘‘పోరాటంలో ముందుండవలసిన యోధులంతా/ పల్లకీలు మోసే బోయిలుగా మారడమే/ ఇక్కడ అతిపెద్ద విషా దం... అమ్మ స్తన్యం కోసం బొట్ల కోసం/ ఎండిపోయి పిడచకట్టుకు పోయి/ నాలుకను చాస్తున్నాడు...

ఇక్కడ తగలబడేవి అడవులు మాత్రమే కాదు ఆకలి దేహాలు కూడా’’ అని రాయలసీమ ‘‘క్షతగాత్రాన్ని’’ రాధేయ గానం చేశారు. అందుకే రాచపాళెంగారు ‘‘ఈ సీమ ఆస్తులు లేని వీలునామా’’ అని వాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలు జరగడానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది. ఆహార పంటల స్థానంలోకి వ్యాపార పంటలు రావడం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆగి పోవడం, సరళీకరణ, ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు, జీవిత విధ్వంసం వంటివి చాలా వున్నాయి. అందుకే రాచపాళెంగారు ‘‘రైతుకు ఉరితాడు బిగిసింది/ఊపిరి పోవడం ఎప్పుడో మొదలైంది’’అని అన్నారు. ఈ వాస్తవాన్ని చూసి వై.శ్రీరాములు ‘‘ఆకాశంలోకి ఎడారి పాకింది/చెట్లకు పుట్లకే కాదు/అనంతపురంలోని మట్టికే చెదలు పట్టింది/ఇక్కడి చరిత్ర పుటల్లోని ప్రతి అక్షరం/రైతుల సమాధుల ఫలకాలపై మండే భాస్వరం’’ అని ఆవేశపడ్డారు.
వ్యవసాయమంటే తిండిగింజల ఉత్పత్తి కాదు. జీవితాన్ని సృష్టించడం. జీవనానికి ప్రాణం పోయడం. నాగలి చాలులో నాగలి తీసిన ఊపిరి నుండే అన్ని రకాల కళలు జీవన విధానాలు పురుడు పోసుకుంటాయి. ‘‘దున్నడం నీవు ప్రారం భించిన నాటినుంచే కదా/ అన్ని కళలూ అవతరించింది, అందచందాలొలికిం చిందీ/అందుకే సకల కళలకూ నవనాగరికతలకూ నీవే ధాతవూ తాతవూ’’ అని పి.ఎల్‌.శ్రీనివాసరెడ్డిగారు రైతుకు పట్టం కట్టారు. అజ్ఞానపు అంధయుగంలో ఆకలి లో పుట్టిన మనిషి యొక్క జీవిక అవగాహన నుండి వ్యవసాయం ఆవిర్భవించింది. వ్యవసాయం నుండే అన్ని రకాల ఇతర వ్యవస్థలూ జన్మించాయి. అందుకే ఆంగ్లనై ఘంటికకారుడు వెబ్‌స్టర్‌ ఇలా అంటాడు "Cultivation of the Earth is the most important labour of man. When tillage begins other arts follow. There fore let us never forget that the farmers are the founders of Civilization".
April 9, 2012 -surya daily

1941కి ముందూ సీమ కథ-- తవ్వా వెంకటయ్య

బండారు అచ్చమాంబ మొదలు గురజాడ దాకా పురిటి నొప్పులు పడ్డ తెలుగు కథ 1910 నాటికి ఒక సలక్షణమైన రూపాన్ని సంతరించుకుంది. నూరేళ్ల తెలుగు కథాశిల్పంలో వాస్తవిక శిల్పమే సర్వ పాఠక ఆమోదాన్ని పొందింది. కథానిక ప్రారంభం నుండి నేటి దాకా అనేక పరిణామాత్మక మార్పులను చవిచూసిన కథ వాస్తవికతకు భంగం కలిగించని రీతిలో అనేక రూపాల్ని సంతరించుకుంది.


భారతదేశంలో మొదటి కథానిక 1805లో పశ్చిమ బెంగాల్‌లో 'తాతాఇతిహాస్' పేరిట చండీచరణ్ రచించాడు. కానీ తెలుగులో మాత్రం 1910లో గురజాడ వారి 'దిద్దుబాటు' పేరుతో తొలి కథానిక వచ్చిందని మొన్నటిదాకా విమర్శకుల అభిప్రాయం. కానీ బండారు అచ్చమాంబ రచించిన 'ధనత్రయోదశి' అనే కథానిక 1902 నవంబర్‌లో 'హిందూ సుందరి' పత్రికలో వచ్చింది. కనుక అదే తొలి కథానిక అని ఇటీవల స్థిరపడింది. మొత్తంగా చూస్తే 1902-10 మధ్యకాలంలో తొలి తెలుగు కథానిక రూపుదిద్దుకొంది.

మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు రాయలసీమలో కథానిక పుట్టుక కొన్ని దశాబ్దాలు వెనుకబడిందని, అందుకు రాయలసీమ కోస్తా ప్రాంతం కంటె ఆర్థికంగా వెనకబడి ఉండడమే కారణమని విమర్శకుల అభిప్రాయం. రాయలసీమ సాహిత్యం గురించి ప్రాంతీయ దృక్పథంతో ఆలోచించిన మొదటి విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి మొదలు నేటి విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వరకు అందరూ కోస్తా ప్రాంతం కంటే రాయలసీమ కథా సాహిత్యం కొన్ని దశాబ్దాలు వెనుకబడిందన్నారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, శాంతి నారాయణ, మధురాంతకం రాజారాం, కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ వంటి సాహిత్యకారులందరూ వివిధ సందర్భాలలో రాయలసీమ తొలి కథా చర్చ చేశారు.

అందరిలోనూ 'తొలి తెలుగు కథ దిద్దుబాటు (1910) తర్వాత మూడు దశాబ్దాల వరకు రాలయసీమలో కథా రచన జరగలే'దనే భావన వ్యక్తమైంది. 1941లో విజయవాణి పత్రికలో వచ్చిన రామకృష్ణ రాసిన 'చిరంజీవి' కథ తొలి రాయలసీమ కథానికగా విమర్శకులందరిచే గుర్తింపు పొందింది. అయితే రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి 'అనంత కథకుల దళిత కథనం' (ఆంధ్రభూమి, 26 అక్టోబర్ 1999) అనే వ్యాసంలో రాయలసీమ తొలి కథానికను ప్రస్తావిస్తూ 'రాయలసీమలో కథానిక సంబంధించి 1940 ప్రాంతాలలో పురిటి నొప్పులు మొదలైనా 1950 తరువాతనే సలక్షణమైన కథానిక పుట్టింది. ఆధారాలు లభిస్తున్నంతలో 1941 'విజయవాణి' పత్రికలో వచ్చిన జి.రామకృష్ణ రాసిన 'చిరంజీవి' కథ తొలి రాయలసీమ కథ' అన్నారు. 'ఆధారాలు లభిస్తున్నంతలో' అనడం వల్ల తొలి రాయలసీమ కథా చర్చ పూర్తి కాలేదన్న స్పృహ ధ్వనిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర ప్రాంతాలలో పోల్చి చూసినప్పుడు రాయలసీమలో కథానిక చాలా వెనకబడిందనేది విమర్శకుల అభిప్రాయంగా భావించవచ్చు. 1910 నుంచి 1940 మధ్య సీమలో వెలువడిన పత్రికలు కూడా కథానికను ఆదరించలేదని విమర్శకులన్నారు.

20వ శతాబ్దంలో సీమ నుంచి శంకర విజయం (1910), పినాకిని (1922), మాతృసేవ (1924), భారత మహిళ (1925), భారతజ్యోతి (1940) వంటి పత్రికలు వచ్చినా, అవి ఏవీ సీమలో కథానికను ప్రోత్సహించలేదు. సీమ గురించి మొట్టమొదటి కథ రాసింది చింతా దీక్షితులు (సుగాలి కుటుంబం - 1921). ఈయన సీమ వాసి కాదు. కానీ సీమ ప్రాంతపు కరువు గురించి కథ రాసింది ఈయనే. తర్వాత అనంతపురానికి చెందిన జర్నలిస్టు జి.రామకృష్ణ 'చిరంజీవి' కథానిక ప్రచురితం అయ్యింది. ఇప్పటివరకు రాయలసీమ తొలి కథకులుగా జి.రామకృష్ణ (అనంతపురం), కె. సభా (చిత్తూరు), భారతం నాధమునిరాజు (కడప) సముద్రపు శ్రీ మహావిష్ణువు (కర్నూలు)లను సాహిత్యలోకం గుర్తిస్తుంది.

స్వాతంత్య్రానికి ముందు సీమ నుంచి వచ్చిన చాలా పత్రికలు కథానికను ఆదరించలేదు. ఇది వాస్తవమే. అయితే అలాగనీ అసలు కథానికను ప్రోత్సహించిన పత్రికలే సీమలో లేవనడం సత్యదూరం. నాకు లభించినంత వరకు 'భారత కథానిధి' మాసపత్రిక కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి 1926 జూలై నుండి 1930 ఆగస్టు వరకు వెలువడింది. 40 సంచికలు వెలువడ్డాయి. వీటిల్లో దాదాపు 50 కథలు వచ్చాయి. వీటిని 25 మంది కథకులు రాశారు. వీరిలో ఎక్కువమంది సీమవాసులు కాగా కొందరు సీమేతరులు.

సీమ తొలి కథకులుగా చెప్పబడుతున్న జి.రామకృష్ణ, కె.సభా, భారతం నాదమునిరాజుల కంటే ముందు చాలామంది రచయితలున్నారు. వారినందర్నీ భారత కథానిధి పత్రిక పరిచయం చేసింది. అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్యశ్రేష్ఠి, వెల్లాల మైసూరయ్య, భూతపురి నారాయణస్వామి, దోమా వెంకటస్వామి గుప్త, యం.వి.పాపనగుప్త, హెచ్.మహబూబ్ వియ్యూక్, రూపావతారం శేషశాస్త్రి, అవధానం సుందరం, ఆలూరి శేషాచార్లు, యాలేటి వేంకటరావు మొదలైన రచయితలెందరో కథలు రాశారు. వీరంతా నాటి సమకాలీన సామాజిక అంశాలపై కథలు రాశారు.

ఇంతవరకు జరిగిన పరిశోధనలో తొలి సీమ కథకులుగా అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్యశ్రేష్ఠి లను గుర్తించవచ్చు. నరసింహమూర్తి 1926 జూన్ 'భారత కథానిధి' పత్రికలో 'మతభేదం' అన్న కథ రాశారు. ఇది పూర్తిగా కడప జిల్లా పెండ్లిమర్రి పరిసరాలకు సంబంధించింది. ఇందులో మాధవరాయుడు, వెంకటసుబ్బమ్మల కొడుకు నాగరాజు కోడలు సుగుణవతి. ఓ రోజు నాగరాజుకు తీవ్ర జ్వరం వచ్చి లేవలేని స్థితిలో ఉంటాడు. సుగుణవతి తన భర్తకు వైద్యం చేయించాలని ఆ ఊరి సాహెబును తీసుకొస్తుంది. సుగుణవతి అత్త వెంకటసుబ్బమ్మ సాహెబును లోనికి రానియ్యదు. తాము బ్రాహ్మణులమని సాహెబులను రానివ్వమంటుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో సుగుణవతి అత్తను ఎదిరించి తోసివేసి తనకు మతాలు ముఖ్యం కాదని తన భర్త ప్రాణాలు ముఖ్యమని చెప్పి సాహెబుతో తన భర్తకు వైద్యం చేయిస్తుంది.

ఇక నాగవరదయ్యశ్రేష్ఠి కథ 'మీనాక్షి' 1926లో అదే పత్రికలో వచ్చింది. ఇందులో మీనాక్షికి పన్నెండేళ్లకు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. మీనాక్షి భర్త అనారోగ్యంతో చనిపోతాడు. మేనమామ కృష్ణారావు సంఘసంస్కారి. సంఘంలో బాలవితంతువులకు పెళ్లిళ్లు చేయిస్తుంటాడు. అటువంటి మంచి పని తానే చెయ్యాలని తన కొడుకు నరసింహారావుకు తన చెల్లెలు కూతురైన మీనాక్షిని ఇచ్చి పెండ్లి చెయ్యాలని ఆలోచిస్తాడు. మీనాక్షిని, తన చెల్లెల్ని పెళ్లికి బలవంతం చేసి కర్నూలు నుంచి మద్రాసుకు తీసుకుపోతాడు. అక్కడ నుంచి మీనాక్షి పెళ్లి వద్దని చెప్పి ఇంటికి వస్తుంది. తన మాట వినకపోవటంతో కృష్ణారావు ఇక ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోతాడు.

పై రెండు కథల్లోని కథావస్తువులు, కథాశిల్పం ఏ ఆధునిక కథలకు తీసిపోవు. కాలక్రమాన్ని బట్టి చూస్తే ఈ రెండింటిని రాయలసీమ తొలి కథలుగా ఆ కథకుల్ని తొలి సీమ కథకులుగా గుర్తించవచ్చు.
1941నాటి జి.రామకృష్ణ కంటే ముందు వచ్చిన కథలపై, కథా రచయితల ప్రాంతాలపై మరింత పరిశోధన చేయాల్సి వుంది. అనంతరం సీమ తొలి కథారచయిత ఎవరనేది నిర్ధారణ చేయాల్సి వుంది. పరిశోధన జరుగుతూ వుంది...
- తవ్వా వెంకటయ్య
పరిశోధకులు, తెలుగుశాఖ, యోగివేమన యూనివర్సిటీ

కడపటి పైసా - కథ



తుంగభద్రా తీరము. సాయంకాలమయి రెండు గడియల ప్రొద్దైనది. చీకటులు క్రమ్మనారంభించినవి. కొంతవరకు మబ్బులు నిండి వానవచ్చు చిహ్నములు దోచినవి. ఒకానొక యవ్వన పురుషుడు ఏటిలోని మడువు దగ్గరకు నల్లటి గుండ్ల మీదుగ పయనమగుచున్నాడు. అతని విగ్రహమును వర్ణించుటకు రాదు. అతడు ధరించిన వస్త్రములు మాత్ర మాచీకటిలోను గూడ అతని స్థితిని కొంత యెరుకపరచుచున్నవి. మొలనుగట్టిన దోవతి మోకాళ్లపైననే చిరుగులచే చిందులు ద్రొక్కుచున్నది. బాహువుల మీద ధరించిన శెల్లాయును చిరిగి తోరణమైయున్నది.


మడుగు సమీపించినది. తళుక్కున నొక్క మెరపు మెరసినది. మడుగులో దాని నీడ ప్రతిఫలించినది. గభీలున నీÄౌవ్వనున కేమియో తోచినది. అతడు గట్టిగ గొణగ నారంభించినాడు. ఏమనుచున్నాడో?
"ఏమిటి? ఇంత సాహసమునకు నొడిగట్టితిని. ఏల నొడిగట్టరాదు. న్యాయమార్గానువర్తినై స్వతంత్రముగా జీవనము జరుపుకొనుటకు ప్రయత్నించితిని. నాచేసిన పనిని ఎల్లరును సెబాసనుచు వచ్చిరి. ఎల్లరును నాయుద్యమములులో కోపకారములని భూషించుచు వచ్చిరి. నాస్వాతంత్య్రము నుగ్గడించిరి. కాని అది యేమి లోకచిత్రమో కార్యమునకు వచ్చునప్పటికి ఎల్లరును నోటిమాటలతో రిత్తచూపులతో నూరకుండు వారైరి. దగ్గరి చుట్టాలు సయితము నాశక్తి ప్రతిభలను నాధర్మపరత్వమును నెరింగియు నాకు తోడ్పడక వృధాదూషణలతో నను వేధించిరి. న్యాయముగా బ్రతుకుట కుటుంబీకునకు నీకాలమున దుస్సాధ్యమని ఆలుబిడ్డలను వదలి వచ్చితిని. పని చేయుదమన్న గౌరవమగు పని యిచ్చువారలును గానరారు. పిడికెడు కూటికి పగలెల్లయు నౌకరీ చేయించుకొని ఆ పని తామే చేసినట్లు లోకమును భ్రమింపజేయువారు మహానుభావులైనారు. వారి సంఖ్యయైనను నెక్కువగా గలదా యనిన నదియునుం గానరాదు. మాస మకాలముగ లోకమంతయు ద్రిమ్మరినను పూటకూటికి గడచుట కష్టమైనది. ఈ బ్రతుకుకంటె గంగాభవాని గర్భమున వసించుట, ఆ మాత శరణుజొచ్చుట మేల్కాదా?''

ఒక్క టీకుటాకుల షోకుగాడు సిగరెట్టు పట్టుచు ధూమములను వాతావరణములోనికి వదలుచు నీగొణగునాతనికి బ్రక్కగా వెడలివచ్చినాడు.
వాసన ముక్కు కెక్కినది. పూర్వపు టభ్యాసము స్మరణా పథము నాక్రమించినది. అంతట నాపురుషోత్తమ నాయడు "ఆహా! ఇదిలంక పొగాకుతో నవీనముగా మన మద్రాసు వైశ్యసోదరులు సిద్ధము చేసి యమ్ముచుండు సరస్వతి సిగరెట్టు సువాసన. అరరే. దీని నింకొకమారు స్వయముగా పీల్చి యనుభవింపక దేహత్యాగము చేయనగునా. అయిన, అయిన--ఏల--కడపటి పైసా ఇంకను రొండిననున్నది గదా!''
నాయడు గ్రక్కున వెనుకను దిరిగినాడు. కర్నూలు పురమున కుమ్మరవీధి ప్రవేశించినాడు. అదె యాకొసన పప్పుల వెంకయ్య దుకాణమున్నది. అటబోయి సరస్వతీ సిగరెట్టు కావలయుననినాడు. దొరకలేదు. పెద్దవీధిని బడినాడు. గొప్పషాపొకటి చక్కని దీపాల వెలుగున దృగ్గోచరమైనది. అచ్చట ను సరస్వతీమార్కు సిగరెట్టు లేదు. పేరు పెద్ద ఊరు దిబ్బ యనుకొనుచు పురుషోత్తమ నాయడు మరియొక సందుమొనన నుండిన వక్కలాకుల దుకాణమునకు బోయినాడు. అట పైసాకొక్కటే సిగరెట్టు కొన్నాడు. ముట్టించినాడు. పొగ నిడువ నారంభించినాడు. వాన చినుకులు బడినవి. లోప్రక్కన కొట్టమున్నది. అందులో ఏవో సంచులు పేర్చినారు. అక్కడ విశ్రమించుటకు అంగటివాని వద్ద సెలవు కైకొనినాడు.

పురుషోత్తమ నాయడు పరధ్యానముగా పొగ పీల్చుచుండగా ప్రక్కన గోతాలమీద కూర్చొని మరియిద్దరు వ్యక్తులు గుసగుస లాడుచున్నారు. కొంత గుసగుస నాయని చెవిలోనికి దూరినది. అది ఏమి? మాటలాడుచుండినవారిలో ముసలివాడుగా కన్పించిన వ్యక్తి ఇట్లను.

"నేనెంతో శ్రమపడినాను. వాడు కానరానేలేదు. స్నేహితులకు ఉత్తరాలు వ్రాసినాను. స్వకీయసేవకులను బంపించి అన్వేషించినాను. నేను వెతకించుచున్నానని విని వాడు దాగుకొన్నాడేమోయని వేగులవారిని నియమించినాను. నేనే స్వయముగా కూడ బయలుదేరి చూచుచున్నాను. నన్ను ప్రాతిపెట్టుటకు దగిన యంతయాస్తి. నా డాలోచింపకపోయినందుకింత కడగండ్లు పడవలసి వచ్చినది. వాని ధార్మికత్వము వాడు మరుగైన తరువాత నాకు తెల్లమయినది. ఇప్పుడేమి సేయుదు. ఎట్లు నాకు చిత్తశాంతి గలుగును.''

ఈ వాక్యములు పురుషోత్తమనాయనికి పరిచితమైన ఎలుంగున పల్కబడినవి. అతనికి ననుమాన మంకురించె అంతట నాతడా ముసలివానిం దిలకించి చూచె. ఎచ్చటలేని మైత్రి అతని మానసమున స్వభావసిద్ధముగ దోచినది. దాపరికమునకు మనసు బట్టలేదు.
"తాతా! తాతా! నీవా! నీవా!'' యనినాడు. ముసలివాని యానందము వాక్కుల నణంచినది. అతడు ఒక్క పెట్టున మనుమని నాలింగనము చేసికొనినాడు. బాష్పముల రాల్చినాడు.
మూడు గడియలకు పూర్వము నిరుపేదగ నుండిన పురుషోత్తముడు లక్షాధికారియైనాడు. గంటకు మున్ను గంగాభవాని శరణు జొరనుండిన Äౌవనుడు తాత యాశీర్వచనమున చిరాయువైనాడు. కడపటి పైసా ఘనరక్షయై ధర్మమే జయమనుటను చాటించినది.
(ఈ కథ తొలి రాయలసీమ కథ 1918లోనే ప్రచురిత మయినట్టు కనుగొన్నాను. ఈ కథ పేరు 'కడపటి పైసా'. ఇది 'సౌందర్యవల్లి' పత్రికలో ప్రచురితమయ్యింది. గాడిచర్ల రామా బాయమ్మ సంపాదకత్వంలో ఈ పత్రిక మద్రాసు నుంచి వెలువడింది. ఇందులో కథారచయిత పేరు పేర్కొనలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు.-  సంగిసెట్టి శ్రీనివాస్  -ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్యవేదిక  )

1918లోనే సీమ తొలి కథ! - సంగిశెట్టి శ్రీనివాస్

1921లో చింతా దీక్షితులు రాసిన 'సుగాలీ కుటుంబం' కథనే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించిన తొలి కథగా రికార్డయ్యింది. ఇప్పుడాస్థానాన్ని 1918లో సౌందర్యవల్లి పత్రికలో అచ్చయిన 'కడపటి పైసా' కథ ఆక్రమిస్తుంది. దీని రచయిత పేరు ప్రచురింపబడలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు. 

ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం ఎవరి మూలాల్ని వాళ్లు వెతుక్కునేందుకు దోహదపడింది. ఈ చైతన్యం తోటి వారితో పోల్చుకొని తమ స్థానమెక్కడో లెక్కలేస్తోంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో మరీ ముఖ్యంగా కథా ప్రక్రియలో ఎవరి పాత్ర, స్థానం, దోహదం ఎట్లాంటిదో ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రాంతాల వారీగా పరిశోధనలు ప్రారంభ మయ్యాయి. ఈ కోవలోనే 'తొలి తెలుగు కథలు - భండారు అచ్చమాంబ' పుస్తకాన్ని నేను ప్రచురించాను. ఈ పుస్తక ప్రచురణతో అప్పటి వరకు తొలి తెలుగు కథకుడిగా నిర్ధారించబడ్డ గురజాడ అప్పారావు స్థానం మారింది. శ్రీకాకుళంలో 'కథా నిలయం' ఏర్పాటుతో మొత్తం తెలుగు కథల పరిశోధన తీరు మారింది. ఎంతో కాలంగా అందుబాటులో లేని అనేక అపురూపమైన కథలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అస్తిత్వ స్పృహ నుంచి కొనసాగించిన పరిశోధనలో తవ్వా వెంకయ్య '1941కి ముందూ సీమ కథ' పేరిట 'వివిధ' (21 జనవరి)లో వ్యాసం రాశాడు. 1926 జూన్ నాటి 'భారత కథానిధి' పత్రికలో 'మతభేదం', 'మీనాక్షి' కథలు రాసిన అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్టిలను తొలి రాయలసీమ కథలుగా/ కథకులుగా ఆయన అభిప్రాయ పడ్డాడు. మరింత పరిశోధన జరగాలని, 'సీమ తొలి కథా రచయిత ఎవరనేది' నిర్ధారణ జరగాలని కూడా అన్నాడు. దానికి స్పందనే ఈ వ్యాసం.


రెండు దశాబ్దాల క్రితం 'తెలంగాణ తెలుగు పత్రికలు' అనే అంశం మీద పరిశోధన చేస్తున్న క్రమంలో వివిధ గ్రంథా లయాల్లో అనేక పత్రికలను పరిశీలించడం జరిగింది. నా పరిశీలనలో తొలి రాయలసీమ కథ 1918లోనే ప్రచురిత మయినట్టు కనుగొన్నాను. ఈ కథ పేరు 'కడపటి పైసా'. ఇది 'సౌందర్యవల్లి' పత్రికలో ప్రచురితమయ్యింది. గాడిచర్ల రామా బాయమ్మ సంపాదకత్వంలో ఈ పత్రిక మద్రాసు నుంచి వెలువడింది. ఇందులో కథారచయిత పేరు పేర్కొనలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు. ఏది ఏమైతేనేమి ఇంతవరకు 1921లో చింతా దీక్షితులు రాసిన 'సుగాలీ కుటుంబం' కథనే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించిన తొలి కథగా రికార్డయ్యింది. ఇప్పుడా స్థానాన్ని 'కడపటి పైసా' కథ ఆక్రమిస్తుంది. ఈ సమాజంలో న్యాయంగా, నీతితో బతుకుట అసంభవమనీ అందువల్ల ఆత్మహత్య తప్ప పరిష్కారం లేదు అని తలంచిన పురుషోత్తమనాయుడు అనే వ్యక్తి తుంగభద్రలో దూకి ప్రాణాలర్పించాలని నిర్ణయించుకుంటాడు. అయితే తన ప్రక్కనున్న వ్యక్తి సిగరెట్టు తాగి పొగ వదలడంతో ఆ వాసనకు ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిలో కూడా సిగరెట్టు తాగాలనే బలమైన కోరిక కలుగుతుంది.

సిగరెట్టు కోసం కర్నూలు పట్టణంలోని వీధులన్నీ తిరిగి తన దగ్గరున్న 'కడపటి పైసా'తో సిగరెట్టు కొనుక్కొని తాగుతూ ఉండగా అతని తాత కనబడి అతన్ని ఇంటికి తీసుకెళ్లడంతో కథ ముగుస్తుంది. ఈ కథలోని వర్ణన ఏ ఆధునిక కథకు కూడా తీసిపోదు. "వాసన ముక్కుకెక్కినది. పూర్వపుటభ్యాసము స్మరణాపథము నాక్రమిం చినది. అంతట నాపురుషోత్తమ నాయడు "ఆహా! ఇది లంక పొగాకుతో నవీనముగా మన మద్రాసు వైశ్యసోదరులు సిద్ధము చేసి యమ్ముచుండు సరస్వతి సిగరెట్టు సువాసన. అరరే, దీని నింకొకమారు స్వయముగా పీల్చి యనుభవింపక దేహత్యాగము చేయనగునా. అయిన, ఏల-కడపటి పైసా ఇంకను రొండిన నున్నది గదా!'' అని చెప్పుకొస్తాడు. అలాగే కథలో కర్నూలు పట్టణంలోని కుమ్మర వీధి, పెద్దవీధి, అక్కడి వక్కలాకుల దుకాణము గురించి కూడా వివరించాడు.

సీమ కథ గురించి ఇప్పటికే రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సింగమనేని నారాయణ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వేంపల్లి గంగాధర్ తదితరులు అనేకసార్లు చర్చలు చేశారు. మొదట కె.సభా ను తొలి సీమ కథకుడిగా భావించారు, అనంతరం 1941లో 'చిరంజీవులు' కథ రాసిన జి.రామకృష్ణకు 'తొలి కథకుడి' హోదాను ఇచ్చారు. ఇప్పుడు అయ్యగారి నరసింహ మూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్టి గురించి తవ్వా వెంకయ్య వెలుగులోకి తెచ్చాడు.

సౌందర్యవల్లి పత్రికలో 'కడపటి పైసా' రచన దగ్గర కానీ, ఇండెక్స్‌లో గానీ ఎక్కడా కథకుడి పేరు లేదు. ఈ కథను పత్రిక సంపాదకురాలు రామాబాయమ్మ భర్త, గతంలో మాతృసేవ పత్రికను నడిపించిన జాతీయోద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఆయన అంతకుముందు టాల్‌స్టాయ్ కథకు అనుసరణగా 'మూర్ఖరాజు' కథను రాసిండు కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు కర్నూలు వాడే కావడం కూడా పరిగణనలోకి తీసుకో వాలి. వేంపల్లి గంగాధర్, తవ్వా వెంకయ్యలు చెప్పిన శంకర విజయం (1910), పినాకిని (1922), మాతృసేవ (1924), భారత మహిళ (1925), భారత కథానిధి (1926), సాధన (1926), భారతజ్యోతి (1940) పత్రికలు పూర్తిగా అందుబాటు లోకి వచ్చినట్లయితే 1930కి ముందటి రాయలసీమ కథల గురించి మరింత లోతైన పరిశీలన, పరిశోధన చేయడానికి అవకాశముంటుంది.

వీటికి తోడు చిత్తూరు నుంచి 1937లో 'తెనుగు తల్లి' పత్రిక కుమారదేవ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో కూడా ప్రతి నెలా 'చిన్ని కత' శీర్షికన కథల్ని అచ్చేశారు. అలాగే 'భారత కథానిధి' పత్రికలో అయ్యగారి నరసింహమూర్తితో పాటు బైరెడ్డి గంగారెడ్డి (విశ్వాసపాత్రులు), పి.రామచంద్రరావు (పులిగోరు), సీతాభాయి (పూండి చెల్లమ్మ), ఘడియారం శ్రీరాములు (పంకజాక్షి) తదితర కథలు కూడా అచ్చయ్యాయి. ఈ కథలన్నీ అందుబాటులోకి వస్తేగానీ తొలితరం తెలుగు కథలు, రాయసీమ కథల గురించి విశ్లేషణ చేయడానికి, వ్యాఖ్యానించ డానికి, విమర్శ చేయడానికి వీలుపడదు. అందుకే తెలంగాణ తొలితరం తెలుగు కథల మాదిరిగా 'రాయలసీమ తొలితరం కథలు' అందుబాటులోకి తెచ్చినట్లయితే రాష్ట్రావతరణకు ముందటి కథ గురించి, అందులో ప్రతిఫలించిన ఆనాటి సమాజం గురించి తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ఈ పరిశోధన, ప్రచురణ పని నిరంతరం కొనసాగాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్

ఎ.ఎస్‌. రామన్‌ తెలుగు కథల కోసం శోధించండి!

nagaroతొలి రాయలసీమ కథ పేరున ‘సూర్య’ (2012 డిసెంబర్‌ 31)లో ప్రచురించిన తవ్వా వెంకటయ్య వ్యాసం ఆసక్తికరంగా చదివింప చేసింది. 1926-30 మధ్య కాలంలో పొద్దుటూరు నుంచి వెలువడిన ‘భారత కథానిధి’ పత్రిక ఆధారంగా ఆయన ఇచ్చిన సమాచారం మరింత పరిశోధనకు దారితీసేదిగా కనబడుతోంది. అభినందనలు.నిజానికి లోతైన పరిశోధన జరగలేదనే మాటకు మంచి తార్కాణం ప్రస్తుత చర్చనీయాంశం. ఇటీవలి కాలం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎన్నో మంచి పరిశోధనాత్మక గ్రంథాలుప్రచురితమవుతు న్నాయి. ఒక్క సాహిత్యమే కాదు, ఇతరత్రా పలు రంగాలలో పునాదులుకదులుతు న్నాయి. రాయలసీమలో కూడా అటువంటి శోధన, చూపు సాధ్యమైతే మరెన్నో చారిత్రక వాస్తవాలు వెలుగు చూడవచ్చు. అటువంటి గాలింపు ఎప్పుడు మొదలు అవుతుందో, ఎలా మొదలవుతుందో బోధపడడం లేదు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య 2006లో వెలువరించిన పుస్తకం ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం’ సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ కొంతైనా స్ఫూర్తి కలిగించి ఉండాలి.

1926 జూన్‌లో ప్రచురించిన అయ్యగారి నరసింహమూర్తి ‘మత భేదం’ కథావస్తువు ఎంతో గొప్పగా కనబడుతోంది. వెంకటయ్య ఈ కథా శిల్పం గురించి కూడా కొంత వివరించి ఉంటే బావుండేది. కథావస్తువు మాత్రం స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. బొగ్గవరపు నాగ వరదయ్య శ్రేష్ఠి రాసిన ‘మీనాక్షి’ కథావస్తువు కూడా వితంతు పునర్వివాహం వంటి అవసరమైన సామాజిక ఆదర్శంతో ఉన్నది కావడం ఆనందదాయకం. 1926-30 మధ్య కాలంలో ‘భారత కథానిధి’ పత్రికలో నలభై సంచికలలో యాభై కథలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణం ఈ కథలన్నింటిని ఒక సంకలనంగా తీసుకు రావలసిన అవసరం ఎంతో ఉంది. తొలుత ఈ కథలు సంకలనంగా అందుబాటులోకి వస్తే పరిశీలన, అధ్యయనం, పరిశోధన తప్పకుండా ప్రారంభమవుతుంది.ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా- ఆంగ్ల వారపత్రిక తొలి భారతీయ ఎడిటర్‌ ఎ.ఎస్‌. రామన్‌. 1919 సంవత్సరంలో ప్రొద్దుటూరులో జన్మించిన ఇతను చాలా మంది భావించినట్టు తమిళుడు కాదు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త సి.వి. రామన్‌ స్ఫూర్తిగా అవధానం సీతారాముడనే తన పేరును ఎ.ఎస్‌. రామన్‌గా మార్చుకున్నారు.

దీనికి సి.వి. రామన్‌ ఆమోదం కూడా ఉంది. ఎ.ఎస్‌. రామన్‌ తండ్రి అవధానం కృష్ణ ముని ప్రొద్దుటూరు నుంచి ‘బ్రహ్మ నందిని’ అనే పత్రికను నడిపారనీ, దీనికి కావ్యకర్త రుర్భాక రాజశేఖర్‌ శతావధాని తోడ్పాటు ఉందని నార్ల వెంకటేశ్వరరావు షష్ఠిపూర్తి ప్రచురనణ ‘స్టడీస్‌ ఇన్‌ది హిస్టరీ ఆఫ్‌ తెలుగు జర్నలిజం’ (1968) పుస్తకంలో ప్రముఖ పాత్రికేయుడు బిజెస్‌.ఆర్‌. కృష్ణ పేర్కొన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందంపై సంతకం చేసినవారిలో ఒకరయిన అవధానం కృష్ణముని గాంధేయవాది. 2001లో ఎ.ఎస్‌. రామన్‌ మరణించిన సందర్భంలో వారి గురించి తెలుగు పత్రికలలో కొన్ని వ్యాసాలు వెలువడ్డాయి. దేవులపల్లి కృష్ణశాస్ర్తితో ఎంతో సాన్నిహిత్యంగల ఎ.ఎస్‌. రామన్‌ భారతి, ఆంధ్రపత్రిక, గృహలక్ష్మి వంటి పత్రికలలో తెలుగు రచనలు చేశారని అంటారు. అవధానం సీతారాముడు పేరుతో కొన్ని కథలు రాశారని చెబుతారు. ఆకాశవాణికి కూడా పలు తెలుగు రచనలు చేశారని చెబుతారు. ఇంగ్లీషు రచనల గురించి చెప్పనక్కరలేదు. భారతీయ కళలకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చిన సంపాదకుడుగా ఎ.ఎస్‌. రామన్‌కు గొప్ప పేరుంది. రామన్‌ రచించిన తెలుగు కథలను ఇప్పుడు వెలికి తీయవలసిన అవసరం ఎంతో ఉంది. రాయలసీమ కథల గురించి రాసినవారెవరూ ఎ.ఎస్‌. రామన్‌ పేరు పేర్కొన్న దాఖలాలు పెద్దగా లేవు.
శ్రీకాకుళంలో జన్మించిన చిలుకూరి నారాయణ రావు అనంతపురంలో స్థిరపడ్డారు. కర్నూలు జిల్లాలో జన్మించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1914లో ఆంధ్రదినపత్రిక అవతరించినప్పుడు తొలి సంపాదకుడు. ఈయన మూడేళ్ళపాటు సంపాదకత్వం నెరిపారు. అంతకు ముందు రాజమండ్రి, మదరాసులలో చదువుకుని బందరునుంచి వెలువడే ‘స్వరాజ్య’ పత్రిక 1908లో ‘విపరీత బుద్ధి’ అనే సంపాదకీయం రాసి తొలి రాజకీయ ఖైది అయ్యారు. ‘హిందూ’ పత్రికలో చాలా కాలం పుస్తక సమీక్షలు రాశారు గాడిచర్ల. అప్పట్లో అనంతపురం నుంచి పప్పు రామాచార్యులు నిర్వహించిన ‘సాధన’ పత్రిక దక్షిణ ఆంధ్రప్రాంతానికి వెలుగు బాసటగా సాగింది.బళ్ళారి రాఘవ, ధర్మవరం కృష్ణమాచార్యులు, బి.ఎన్‌. రెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి అమోఘమైన దిగ్ధంతులు జన్మించిన ప్రాంతం, కాలం ఇదే! వీరు రావడాన్జికి నేపథ్యం కానీ, వీరు కలిగించిన ప్రభావం కానీ స్వల్పంగా ఉండే అవకాశం ఉండదు. అయితే విశేష స్థాయిలో పరిశోధన జరిగితే కానీ అసలు వాస్తవం బయటపడదు. తవ్వా వెంకటయ్య వ్రాసిన వ్యాసం కలిగించిన ఆలోచనలు పంచుకోవాలనే ఈ వ్యాసం. 
January 7, 2013 surya daily

సీమ స్ర్తీ అస్తిత్వం గొప్పదే, అభివ్వక్తి ఏది?


ఆంధ్రదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం. అందుకే స్త్రీ చెైతన్యం  తక్కువ. రెండు, మూడు తరగతులకే ఆడపిల్లల చదువు అటకెక్కుతోంది. అందుకే రేవతీదేవి చెైతన్యాన్ని అందిపుచ్చుకునే స్త్రీవాదులు లేకపోయారు. 2001 తర్వాతనే కొంత మెరుగు. ఆ మధ్య బొంబాయిలోని వేశ్యాగృహాల మీద పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడినవారిలో దాదాపు600 మందిమహిళలు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం వారే... ఇటువంటి పరిస్థితులనే కాదు, కుటుంబంలోని స్త్రీ స్థితిగతుల గురించి చర్చించాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


anke
తెలుగు సాహిత్యంలోకి కవయిత్రులను తొలిగా ప్రవేశపెట్టిన ప్రాంతం రాయలసీమ. తాళ్ళపాక తిమ్మక్క రాయలసీమ కడప ప్రాంతంలోని రాజంపేట సమీపవాసి, ప్రసిద్ధ అన్నమయ్య అర్ధాంగి అన్నది జగద్విదితం. అన్నమయ్య సంకీర్తనల్లో కనపడే అంగాంగ వర్ణనలు తిమ్మక్క కవిత్వంలో మచ్చుకైన కానరావు. మగవాళ్ళపట్ల నాటి మహిళల్లో ఉన్న అభిప్రాయాలకు నిలువుటద్దం తాళ్ళపాక తిమ్మక్క ‘సుభద్రా కళ్యాణం’. ఈ ద్విపద కావ్యంలో సుభద్ర అర్జును నివెంట మెట్టినింటికి వచ్చిన సందర్భంలో ద్రౌపది- సుభద్రల మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరమైనది. బహు భార్యా వ్యవస్థలోని స్త్రీల మనోభావాలు ఎలాంటివో ఆ సన్ని వేశంలో కనిపిస్తాయి.

నిజానికి అన్నమ య్యకున్న ఇద్దరు భార్యల్లో ఒకరెైన తిమ్మక్క స్వానుభవంలోని భావనలే ఆ సన్నివేశంలోని సంభాషణలు.ఆ తర్వాత 16వ శతాబ్దంలోని తెలుగు సాహిత్యంలో అంగాంగ వర్ణనలు శృతిమించి పోయాయి.‘నా కావ్యం చదివితే చవట సన్యాసి కూడా కాము కుడెై పోతా’డని కవులు చెప్పు కున్న దశ! అటువంటి పరిస్థితుల్లో కడప సరిహద్దు ప్రాంతాలనుండి వచ్చిన మొల్ల, సమకాలీన అంగాంగ వర్ణనలకు విరుద్ధంగా చక్కని భావస్ఫోరకమైన శెైలిలో కవిత్వం చెప్పింది. శ్రీరాముని లక్షణాలు చెబుతూ అవే లక్షణాలు లక్ష్మణునికి కూడా ఉన్నాయని, కేవలం ‘రామలక్ష్మణుల మధ్య రంగుమాత్రమే తేడా’ అనడం వంటివి మొల్ల కవిత్వంలోని కావ్య సంఘటనల్లో అల్పాక్షరాలలో అనల్పా ర్థాన్ని సాధించడమేనని సాహిత్యాభిమా నులు భావిస్తారు. చక్కని నాటకీయత, సంక్షిప్తత, తెలుగు నుడికారం మొల్ల కవిత్వంలో మూర్తీ భవిం చాయి.
ఆ తర్వాత కాలంలో తరి గొండ వెంగమాంబ తిరుమల వెంక టేశ్వరుణ్ణి కేంద్రంగా చేసుకొని భక్తిని సాహిత్యంగా సృష్టించింది.19, 20 శతాబ్దాల్లో రాయలసీమ లోకి ఆధునిక సాహిత్యం చాలా ఆలస్యంగా ప్రవేశించింది. కందుకూరి సంస్కరణ వాదం, రాయప్రోలు భావకవితా వీచిక, గురజాడ అభ్యుద యాంశ వంటి కవి దృక్ఫథాలే కాక మాత్రా ఛందస్సు, కథ, నవల, వచన కవిత్వం వంటి ప్రక్రియాభివ్యక్తులు కూడా చాలా ఆలస్యంగానే ప్రవేశించాయి. కందుకూరి యుగం వెళ్ళిపోయిన తర్వాత గురజాడ వారి ‘మధురవాణి’, రాయప్రోలువారి ‘కమ, స్నేహలతాదేవి’ వంటివారు తెలుగు సాహిత్యాన్ని నిర్దేశిస్తున్న దశలోనే శ్రీశ్రీ ‘భిక్షువర్షీయసి’, ‘కడుపు దహించుకుపోయే పడుపుకత్తె’ల గురించి గొప్ప చర్చ జరుగుతున్న దశ అది. కానీ, రాయలసీమ కవి శర్మిష్ఠ, దేవయానిలవద్దే ఆగిపోయాడు. కవితా భారతి అవధానుల చేతుల్లో సర్కస్‌ ఫీట్లు చేసింది. స్వాతంత్య్రోదమ కాంక్షకూడా ప్రాచీన శెైలిలోనే వెలువడింది.

జీవితంలో ఆధునికత లేకపోవడం వల్లనే సాహిత్యంలో కూడా ఆధునికత ప్రవేశా నికి ఆలస్యమైంది. ఇందుకు గల చారిత్రక కారణాలను సింగమనేని నారాయణ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి రాయలసీమ జీవితం ఆధునికం కాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన స్త్రీ వాదానికి మాత్రం రాయలసీమ నుండి బలమైన ప్రాతినిధ్యం లభించింది. తొలి తరం స్త్రీవాదుల్లో ఒకరెైన రేవతీ దేవి స్త్రీ వాదమే ప్రధాన అంశంగా ‘శిలా లోలిత’ పేరుతో కవిత్వం వెలువరించారు. ‘నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన/ జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు’ (అనురాగ దగ్ధ సమాధి) పురుషాధిక్య సమాజంలోని స్త్రీ అస్తిత్వమిది. ‘స్త్రీ భావాల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఏ ముసుగులూ, తొడుగులూ లేకుండా వ్యక్తీకరించిన వెైఖరి కనిపిస్తుంది. రేవతిదేవి భావాల్లో నిజాయితీ, ఆమె ఆవేదనలోని శీలతత్వం, ఆమె ఆలోచనలోని పరిపూర్ణత్వం, ఆమె ఆరాటంలోని అస్థిత్వవాద ధోరణి, ఆమె ఆంతరంగంలోని సంక్షుభిత విలయనృత్యాలు’ అని పి. లక్ష్మి వ్యాఖ్యానించారు.
‘ఇన్నాళ్ళూ గలగల మాట్లాడితే/ నే చెప్పాల్సిందేమీ లేనందున/ నేనేమి చెప్పినా విన్నారు/ చెప్పాల్సిందేదో ఉండి మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు’ అని రేవతీదేవి ‘మూగబోయిన గొంతు’ కవితలో వ్యక్తీకరించిన భావాలు. స్త్రీ మాటమీద ఉండే నిర్బంధమే మూగవోయిన గొంతు. ‘క్షితిజరేఖ వేడి/ వేడిగానే ఉంది/ నిరంతర చిత్తకార్తి కుక్కలు కుక్కల్లాగే తిరుగుతున్నాయి/ వాటినుండి ఆవరించే అనుబంధపు టూదర/ వెచ్చగా కమ్ముకుంటూనే ఉంది/ అయినా/ ఈ హృదయం ఫ్రీజర్‌ లోంచి తీసిన శవం కన్నా చల్లని/ మాంసపు మంచు ముద్ద/ అది కరగడానికి స్పందించడానికి కావాల్సిన/ నిజాయితీ మంచు మంటకి/ ఈ లోకం భగ్గుమని తగలబడిపోతుందట/ అందుకే/ ఈ హృది యెన్నటికీ రగలని చితి’ (హ్రుచ్చితి)- ఈ పంక్తులు మార్మికంగా కనిపించినా చాలా స్పష్టంగానే ఉన్నాయి. హృదయ నిమ్నత మస్తకంలోని వెలగని దీపాల్ని వెలిగిస్తుంది. స్త్రీ భావాల కాంతిని కలిగిస్తుంది. స్త్రీ హృదయం మంచుముద్ద. దాన్ని నిప్పు కాల్చలేదు. నిజాయితీ అనే మంచుమంట మాత్రమే కాల్చగలదు. కానీ, ఆ నిజాయితీకి ఈ లోకమే మండుతుంది.

అందుకే ఈ హృదయం యెన్నటికీ ఆరని చితి. ‘దిగులు/ దిగు లు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే దిగులెందు కు’ తరతరాలుగా స్త్రీ అభివ్యక్తి శబ్దాన్ని గర్భీకరించుకొన్న నిశబ్దాన్ని మోస్తూనే ఉంది. వ్యక్తీకరించలేని స్థితి. అందుకే ఎందుకో చెప్పలేని దిగులు.
రేవతిదేవి తర్వాత స్త్రీ అస్తిత్వం మీద రాయలసీమలో మాట్లాడింది చాలా తక్కువ. అది కూడా స్త్రీ సమ స్యల మీద మగ రచయితలు సాను భూతి తో మాట్లాడిందే! రేవతీదేవి తర్వాత రాయల సీమ నుండి స్త్రీవాద రచయిుత్రులు, కవయిత్రులు చాలా చాలా తక్కువగా వచ్చారు. రెైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుం బాన్ని భుజాన వేసుకొని మోసే స్త్రీ మీద రచించిన సాహి త్యం చాలా స్వల్పం. పసుపులేటి పద్మావ తమ్మ, శిరీష, అరుణ కుమారి వంటి కవ యిత్రులు సీమ నుండి మంచి కవిత్వం రాస్తున్నప్పటికీ స్త్రీవాద నేపథ్యం నుండి రాసింది చాలా తక్కువ.

ఉత్పత్తి సంబంధాల నుండి స్త్రీని దూరం చేసి, స్త్రీతత్త్వాన్ని సహజమంటూ చిత్రిం చడం వల్ల స్త్రీ కేవలం ఇంటికే పరిమి తమైంది. ఉత్పత్తి సంబంధాల నుండి స్త్రీని తప్పించిన తర్వాత సహజం గానే స్త్రీ తన ప్రాధాన్యత కోల్పోయింది. పిల్లల్ని కనే యంత్రంగా మగాడు భావించాడు. ఉత్పత్తి సంబంధాలనేవి స్త్రీలకు సమాజంలో సహ జంగా లభించాల్సిన సమాన త్వాన్ని నిర్దేశిం చడంలో ప్రధానపాత్ర వహిస్తాయి కదా! నాటి మనువు నుండి నేటి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి వరకు స్త్రీలకు సంబంధించి ఒకే రకంగా ఆలోచించడం లోని రాజకీయాల్ని స్త్రీ ఇప్పుడిప్పుడే గమ నిస్తోంది. ‘కువెైట్‌ సావిత్రమ్మ’ (చక్ర వేణు) వంటి స్త్రీ నేపథ్యం నుండి వచ్చిన కథలు మగవాళ్ళు రాసినవే. రెైతు ఆత్మహ త్యల పరిస్థితుల్లో స్త్రీ కేంద్ర బిందువుగా వచ్చిన స్వామి ‘రంకె’ వంటి కథలు మగవాళ్ళే రాయడానికి కారణం చాలా బలమైనదే. 1980 దాకా రాయలసీమలో స్త్రీ అక్షరాస్యత కేవలం 35 శాతం. 2001 నాటికి అది 55 శాతంగా కనిపిస్తు న్నప్పటికీ అది కేవలం లెక్కల్లోనే! వాస్తవం కాదు. దానికి తోడు అభివృద్ధిలేమి.
మొన్నటి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం. అందుకే స్త్రీ చెైతన్యం తక్కువ. రెండు, మూడు తరగతులకే ఆడపిల్లల చదువు అటకెక్కుతోంది. అందుకే రేవతి దేవి చెైతన్యాన్ని అందిపుచ్చుకునే స్త్రీవాదులు లేకపోయారు. 2001 తర్వాతనే కొంత మెరుగు. ఆ మధ్య బొంబాయిలోని వేశ్యాగృహాల మీద పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడినవారిలో దాదాపు 600 మందిమహిళలు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం వారే. ఇంతటి దుర్భర స్థితి గురించి రాయలసీమ మగ సాహిత్యవేత్తలు మాట్లాడింది ఏముంది! ఇటువంటి పరిస్థితులనే కాదు, కుటుంబంలోని స్త్రీ స్థితిగతుల గురించి చర్చించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
 July 1, 2012 Surya daily

రాయలసీమ నవల తొలి దశ

రాయలసీమ నుంచి1950కి ముందే అనేక సాంఘిక, చారిత్రక, పౌరాణిక, అపరాధ పరిశోధక, రాజకీయ, అనువాద నవలలు వచ్చాయి. ‘శ్రీరంగరాజుచరిత్ర’ను మినహాయిస్తే (దానిమీద ఇదివరకే చాలాచర్చ జరిగింది కాబట్టి) దాదాపు 26 నవలలు వచ్చాయి. వాటిని 20 మంది రచయితలు రచించారు. 1872లో ‘శ్రీరంగరాజు చరిత్ర’ వచ్చిన తర్వాత కందుకూరి ‘రాజశేఖరచరిత్ర’ కన్నా ముందే గడియారం రామాశాస్త్రులు రచించిన ‘పేటికాంతర శవం’ అనే అపరాధ పరిశోధక నవల 1874లోనే వచ్చింది. బహుశా తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల ఇదేనేమో! దీని తర్వాత రాయలసీమలో 1905నుంచే నవలలు రాయడం మొదయింది.

ఆధునిక వచనకావ్యంగా ప్యాకెట్‌ థియేటర్‌గా పేరు పొందిన నవల భారతీయ భాషల్లోకి పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ప్రవేశించిందనేది ఇదివరకే అత్యధికులు ఆమోదించిన సత్యం. బెంగాలీ భాషలో 1856లో టేక్‌చంద్‌ ఠాగూర్‌ ‘అలాలేర్‌ ఘరేర్‌దులాల్‌’ (చెడిపోయిన కుమారుడు) అనే నవల తొలి భారతీయ నవల అని చెబుతారు. కానీ భారతీయ నవలా పితామహుడిగా పేరుపొందిన బంకించంద్రఛటర్జీ రాసిన ‘దుర్గేశనందిని’ (1865)తొలి భారతీయ నవల అని ఎక్కువమంది సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. ఏ దృష్టితో చూసినా భారతీయ నవలకు పది సంవత్సరాలు అటూ ఇటూ ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ కాలంలో భారతీయ నవల ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగింది. జాతీయస్థాయిలో, రాష్టస్థ్రాయిలో నవలలు సాహిత్య అకాడమీ పురస్కారాలను, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకొనే దశకు ఎదిగాయి.

విసృ్తతమైన సామాజిక జీవితాన్ని సాధ్యమైనంత సమగ్రంగా చిత్రిస్తున్న ప్రక్రియ నవల.
బెంగాలీ భాషలో పుట్టిన ఏడెనిమిది సంవత్సరాల తర్వాత తెలుగులో నవల పుట్టింది. తెలుగు లో నవల పుట్టడానికి పాశ్చాత్య ప్రభావంతో పాటు బెంగాలీ ప్రభావం కూడా ఉంది. బెంగాలీ గవర్నర్‌ లార్ట్‌ మేయో ప్రకటనను అనుసరించి, కర్నూలు జిల్లాలో రెవిన్యూ ఉద్యోగిగా ఉండిన నరహరి గోపాలక్రిష్ణమ శెట్టి స్థానిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ‘శ్రీరంగరాజు చరిత్ర’ అనే నవలను1872లో రచించాడు. ఆధునిక ప్రక్రియ అయిన నవల పుట్టడానికి ఆధునిక విమర్శకులు చెప్పే ఆధునిక నేపథ్యం ఏదీ లేకుండానే రాయలసీమలో తొలి తెలుగు నవల రావడం అద్భుతమే. అయితే ‘శ్రీరంగరాజు చరిత్ర’లో చారిత్రకాంశం లేదనీ, నవలా లక్షణాలు లేవనీ, అనేక అభివృద్ధి నిరోధక అంశాలున్నాయనీ ఆ నవల ఆద్యతను ఆధునిక నవలా విమర్శకులు తిరస్కరించి, 1878 నాటి కందుకూరి ‘రాజశేఖరచరిత్రను’ తొలితెలుగు నవలగా గుర్తిస్తున్నారు.

కోస్తా ప్రాంతంలో 1878నుండే నవలా సాహిత్యం వస్తున్నది. తెలంగాణలో నవలా సాహిత్యం చాలా ఆలస్యమైందని భావిస్తూఉండిన వాళ్ళు ఇప్పుడిప్పుడే తేరుకొని 1895లోనే తెలంగాణలో నవల పుట్టిందని చెప్పుకొంటున్నారు. రాయలసీమలో కూడా ‘శ్రీరంగరాజు చరిత్ర’ను, కల్వటాల జయరామారావు ‘రేనాటి వీరుడు’ (1925)ను మినహాయిస్తే 1950దాకా నవలలు పుట్టలేదని నవలా విమర్శకులు చెబుతూ వస్తున్నారు.రాయలసీమ సాహిత్యం మీద విశేషమైన కృషిచేసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘శ్రీరంగరాజు చరిత్ర’ను తిరస్కరించి 1925నాటి ‘రేనాటి వీరుడు’ను తొలిసీమ నవలగా ప్రకటించి దానికొనసాగింపుగా 1950దాకా సాధారణ నవలకూడా రాలేదని అభిప్రాయ పడ్డారు. అలాగే ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ‘కొన్ని కావ్యాలు- కొందరు కవులు’ అనే పుస్తకంలో ‘రేనాటి వీరుడు’తో పాటు 1949లో అంతటి నరసిం హం రాసిన ‘ఆదర్శం’ నవలను ప్రస్తావించారు. ఇంకెవరూ రాయలసీమ నవలా పుట్టుకను గురించి, పరిణామాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.

వాస్తవానికి రాయలసీమ నుంచి1950కి ముందే అనేక సాంఘిక, చారిత్రక, పౌరాణిక, అపరాధ పరిశోధక, రాజకీయ, అనువాద నవలలు వచ్చాయి. ‘శ్రీరంగరాజుచరిత్ర’ను మినహాయిస్తే (దానిమీద ఇదివరకే చాలాచర్చ జరిగింది కాబట్టి) దాదాపు 26 నవలలు వచ్చాయి. వాటిని 20 మంది రచయితలు రచించారు. 1872లో ‘శ్రీరంగరాజు చరిత్ర’ వచ్చిన తర్వాత కందుకూరి ‘రాజశేఖరచరిత్ర’ కన్నా ముందే గడియారం రామాశాస్త్రులు రచించిన ‘పేటికాంతర శవం’ అనే అపరాధ పరిశోధక నవల 1874లోనే వచ్చింది. బహుశా తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల ఇదేనేమో! దీని తర్వాత రాయలసీమలో 1905నుంచే నవలలు రాయడం మొదయింది.1905లో జనమంచి శేషాద్రిశర్మ రాసిన ‘మనోరంజిని’ అనే నవల వచ్చింది. ఆ నవల మొదలుకొని 1949నాటి ‘ఆదర్శం’ (అంతటి నరసింహం) నవల దాకా చాలా విలువైన నవలలు వచ్చాయి.ఈ నవలల్ని పరిశీలిస్తే రాయలసీమ నవల ఇప్పటిదాకా భావిస్తున్నంత వెనుకబడి పోలేదని తెలుస్తుంది.

ఈ కాలంలో వచ్చిన రాయలసీమ నవలలు ఇవి.1872 నాటి నరహరి గోపాలకృష్ణమశెట్టి నవల ‘శ్రీరంగరాజుచరిత్ర’ రూపపరంగా ఆధునిక రచన కాకపోయినా వస్తుపరంగా, ప్రక్రియ పరంగా ఆధునిక రచన. ఈ నవలలో ఒక రాజు ఒక లంబాడీ స్ర్తీని ప్రేమించి పెళ్ళాడడం వస్తువు. కులవ్యవస్థ తీవ్రంగా అమలులో ఉన్నకాలంలో ఆ కుల వ్యవస్థను కాపాడే రాజుకు- సభ్యసమాజంలో స్థానం లేకుండా తండాలలో నివసించే లంబాడీ స్ర్తీకి మధ్య ప్రేమను కల్పించడమేకాక పెళ్ళిచేయడంకూడా తిరుగులేని ప్రగతి శీలాంశం. అందువల్ల ‘శ్రీరంగరాజు చరిత్ర’ తొలి తెలుగు నవలగా రాయలసీమనుండి రావడం పేర్కొనదగిన అంశం.అనంతగిరి పేరనార్యకవి 1915లో రచించిన ‘సుశీల’ నవలలో విద్యావంతురాలైన సుశీల తన వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో వచ్చిన సంక్లిష్ట పరిస్థితులను తన తెలివిచేత, ధైర్య సాహసాలచేత, తన వ్యక్తిత్వంచేత అధిగమించి తనకు దూరమైన భర్తను, తల్లిదండ్రులను కలుసుకొని సమస్యనుపరిష్కరించుకొంటుంది. ఇది స్ర్తీ విద్యను ప్రోత్సహించే నవల. సంఘ సంస్కరణ ప్రభావం ఈ నవలమీద ఉంది.

కల్వటాల జయరామారావు 1923లో ‘సువర్ణ కేసరీ కృష్ణసేన’ అనే సాంఘిక నవలను రాశాడు. ఇది స్ర్తీ పురుషుల మధ్య ప్రేమ వివాహాన్ని ప్రతిపాదించే నవల. ఇది రచయిత మొట్టమొదటి రచన. ‘సువర్ణ కేసరీ కృష్ణసేనల ప్రేమ వాళ్ళ తల్లిదండ్రుల కారణంగా సంక్లిష్టతకు గురికాగా వాళ్ళసే్నిహ తుల సహాయంతో అష్టకష్టాల నుండి గట్టెక్కి వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకొంటారు. ఈ నవల ప్రేమకు, స్నేహానికి పెద్దపీట వేసింది. ఈ నవలలో భాగంగా ఆంగ్లేయుల నీచ పరిపాలన, స్ర్తీకి విద్య అవసర మనే వాదన, బెస్తవారి వర్ణన, సమకాలీన బ్రాహ్మణుల తీరు, జూద వ్యసనం, జాతర, మూఢనమ్మ కాలు, ఎండతీవ్రత, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు, ధూమపానం, కరవు, విగ్రహారాధన నిరసన మొదలైననవి సామాజిక అంశాలెన్నింటినో చిత్రించాడు.బూదూరు రామానుజులరెడ్డి 1925లో రచించిన ‘రత్నబాయి’ నవల వరకట్న సమస్యను గర్హిస్తూ వచ్చిన నవల.కన్యాశుల్క, వరకట్న దురాచార ఫలితాలను గమనించిన రత్నాబాయి తమ్ముడు హరికిశోరుడు సంఘ సంస్కర్తయై వాటి నిర్మూలనకు ఉద్యమిస్తాడు.

ఇది కూడా సంఘసంస్కరణోద్యమ నవలే. ‘మాలపల్లి’ నవలకు అద్భు తమైన పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ‘రత్నాబాయి’కీ ముం దుమాట వ్రాస్తూ మాల పల్లివంటి నవలలు అనేకం రావలసి ఉందనీ, ‘రత్నాబాయి’ నవలపైన ‘మాలపల్లి’ నవలా ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు.1927లో దేవమణి సత్యనాథన్‌ రాసిన ‘లలిత’ నవల వచ్చింది. ‘సుశీల’ నవలలాగే ‘లలిత’ నవల కూడా స్ర్తీ విద్యా ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ స్ర్తీ వ్యక్తిత్వాన్ని నిరూపి స్తూ ఉంది. అక్కను, తల్లిని పోగొట్టుకొన్న లలిత, తండ్రి పిచ్చివాడైపోగా, అన్నదమ్ములు బిచ్చగాళై పోగా తనను బలవంతం చేస్తున్న వసంతుని బారినుండి తప్పించుకొని మేనమామ కొడుకైన హరిదాసును అనేకసాహసాలతర్వాత వివాహం చేసుకొంటుంది. సమస్యలనుచూసి బెదిరిపోకుం డా సమాజంలోని మంచివాళ్ళ సహకారంతో సమస్యలనుండి గట్టెక్కిన స్ర్తీ కథ ఈ ‘లలిత’ నవల. గుంటి సుబ్రహ్మణ్యశర్మ రాసిన ‘మాధవాశ్ర మము’ నవల 1933లో వచ్చింది. ఇది జాతీయోద్యమ నవల. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనోద్యమం కొనసాగుతున్న కాలంలో ఈ నవల వచ్చింది.

1933 నాటికి గాంధీజీ నాయకత్వం నడుస్తున్న జాతీయోద్యమంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగేపోరాటం ఒకరకమైతే, నిర్మాణకార్యక్రమాల నిర్వహణ మరొక భాగం. ‘మాధవాశ్రమము’ నవలలో రాయలసీమ ప్రాంతంలోని ముఠాగొడవల నేపథ్యంలో గాంధీజీ నిర్మాణకార్యక్రమాలను రచయిత ప్రతిబిం బించాడు. అదివరకే పెళ్ళైఉన్న మాధవశర్మకి అమ్మాయిపుడితే ఆమెకు ‘భరతమాత’ అనే పేరు పెట్టుకోవడంతో నవల ముగుస్తుంది.అంతటి నరసింహం 1949లో రాసిన సాంఘిక నవల ‘ఆదర్శం’. ఉన్నతకులంలో పుట్టిన కేశవ రావు గాంధీజీ ప్రభావంతో సమాజంలోని దురాచారాలను రూపుమాపాలని నిశ్చయించు కొం టాడు. ఈ నేపథ్యంలో కడపజిల్లా రాజంపేట తాలూకాకు చెందిన కోటగ్రామానికి ఉపాధ్యా యు డుగా వస్తాడు. తోటి ఉపాధ్యాయుడు నారాయణతో కలిసి తన ఆదర్శజీవితాన్ని మొదలు పెడతా డు. శాస్ర్తి మరణించడంతో అతని రెండవ భార్య కామాక్షికి నారాయణతో వితంతు పునర్వివాహం జరిపిస్తాడు కేశవరావు. ఆదర్శాలకు వ్యతిరేకంగా ఉండడం వల్ల- తాను గాఢంగా ప్రేమించిన ప్రియురాలు కమలను కూడా విడిచిపెడతాడు.

ఆదర్శజీవితానికి తన ప్రేమను సైతం త్యాగం చేస్తాడు. అస్పృశ్యత నివారణ, కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహం, దళితు లను ఉద్ధ రించడం వంటి సామాజిక విషయాలు ఎన్నింటినో కేశవరావుపాత్ర ద్వారా అంతటి నరసింహం ఈ నవలలో చిత్రీకరించాడు.19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో తెలుగులో అనువాద రూపంలోగానీ, అనుకరణ రూపంలోగానీ, అనుసృజన రూపంలోగానీ అనేక చారిత్రక నవలలు వచ్చాయి. ఇందుకు భారతజాతీయోద్యమమే ప్రేరణ. రాయలసీమనుండి 1950 లోగా కొన్ని చారిత్రక నవలలు వచ్చాయి. 1917నాటి ‘సిరియాల దేవి’ నవలలో ధర్మవరం దేశాయిశర్మ కాకతీయుల నాటి చరిత్రలో హనుమకొండ రాజ్యాన్ని శుత్రువుల బారినుండి సిరియాలదేవి రక్షించుకోవడం ఇతివృత్తం.1920నాటి ‘చాందసుల్తాన’లో దూబగుంట వేంకటరమణయ్య అక్బరు కాలంనాటి చాందసుల్తాన ధైర్యసాహసాలను చిత్రించారు.

అక్బరును సైతం ఎదిరించి దుండగుల చేతిలో హతురాలైన అహ్మదునగర్‌ పాలకురాలు చాందసుల్తాన. వేంకటరమణయ్య 1925లో రాసిన మరో చారిత్రక నవల ‘తానీషా’. గోల్కొండ ప్రభువైన తానీషా అక్కన్న, మాదన్నల సహాయంతో పరిపాలన సాగిస్తూ ఉంటాడు. వీరిద్దరి మరణంతో తానీషా బలహీనపడతాడు. ఔరంగజేబు అనేక ఎత్తుగడలద్వారా కుట్రలద్వారా గోల్కొండ సామ్రాజ్యాన్ని తానీషానుండి జయిస్తాడు. 1925లో పాలపర్తి సూర్యనారాయణ రచించిన ‘ప్రియదర్శిని’ నవల వచ్చింది. షాజహాన్‌ దగ్గర ఉద్యోగి అయిన జనార్దనసింహుని కూతురు ప్రియదర్శినిని, తన రాజైన షాజహానును ఔరంగజేబు నుండి కాపాడుకోవడం ఇందులోని వస్తువు. ఇది విషాదాంత నవల. జనార్దన సింహుడు, ప్రియదర్శిని ఇద్దరూ మరణిస్తారు.1931లో ఘూళీకృష్ణమూర్తి రచించిన నవల ‘స్వార్థత్యాగము’. చంద్రుడనే రాజు శత్రువుల బారినుండి చిత్తూరు రాజ్యాన్ని రక్షించడం ఇందులోని వస్తువు. ఇప్పటిదాకా పేర్కొన్నవి జాతీయ, రాజకీయాలకు ప్రతిబింబాలైన నవలలైతే, ‘స్వార్థత్యాగము’ తెలుగువారి చరిత్రకు ప్రతిబింబం.

ఇలాంటిదే 1934నాటి అమిద్యాల కృష్ణారావు నవల ‘ఓనామీ’. సరస్వతీదేవి నాలు కపై బీజాక్షరాలు రాయడంతో చదువొచ్చిన ఓనామీ మూడు రాజ్యాలకు రాజై పరిపాలన సాగి స్తాడు. దండిపల్లి వేంకటసుబ్బశాస్ర్తి 1949లో రాసిన చారిత్రక నవల ‘వీర కంకణము’. ఇది కవీశ్వరుడైన జగన్నాథ పండితరాయల జీవితచరిత్రను తెలియజేస్తుంది. తన వంశం వాళ్ళకి శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన ‘వీర కంకణమే’ ఈ నవల చివరిలో ప్రధానాంశంగా నిలుస్తుంది.సమాజంలో జరిగే అపరాధాలను పరిశీలించి ఎంతోమంది రచయితలు వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. అంతేగాక అపరాధం చేసినవారిని శిక్షించేలాసాగే అపరాథ పరిశోధక నవలలు ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా వచ్చాయి. 1917లో రాళ్ళపల్లి గోపాలకృష్ణశర్మ ‘బగళాముఖి’ 1918లో దోమా వెంకటస్వామి గుప్త ‘చంద్రిక’, 1926లో గుంటి సుబ్రహ్మణ్యశర్మ ‘భూతగృహము’,

1929లో ‘రహస్యశోధనము’, పెరుమల రామచంద్రయ్య 1930లో ‘పేటికాంతరశవము’ అనే నవలలు రాశారు.1925లో కల్వటాల జయరామారావు రాసిన రాజకీయ నవల ‘రేనాటి వీరుడు’. బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటుచేసిన ‘పాలెగాళ్ళ’వంశానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి చరిత్రే ఈ నవలా ఇతివృత్తం. నరసింహ్మారెడ్డి కోయిల కుంట్లలోని ఖజానాను దోచుకోవడంతో నవల ప్రారంభమై, అప్పటి బ్రిటిష్‌ అధికారి- రెడ్డిని ఉరితీయడంతో ఈనవల ముగిస్తుంది. రాయలసీమ కరవును గురించి, ముస్లింల దురాగతాలను గురించేకాక 1925నాటి సామాజిక విషయాల్ని ఈనవలలో చిత్రించాడు.1950కి ముందు రాయ లసీమ నవలా ప్రక్రియపై ఆధునిక విమర్శకులు, సాహిత్యకారులు ఇప్పటివరకూ చేసిన పరిశీలన సమగ్రంగా లేదనీ ఈ విషయాల ద్వారా తెలుస్తుంది. 1950కి ముందే రాయలసీమలో సాంఘిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక, అనువాద, అపరాధ పరిశోధక నవలలు ఎన్నోవచ్చాయి. దీనినిబట్టి 1950కి ముందే రాయల సీమలో తొలితరం నవలా ప్రక్రియ జరిగింది. 1950 తర్వాత రాయలసీమలో వచ్చిన నవలల్ని రెండవతరం గానే భావించాలి. రాయలసీమ నవలాప్రక్రియపై ఇంకా జరగాల్సిన పరిశోధన ఎంతోఉందని ఈ అంశాలే రుజువు చేస్తున్నాయి.
-పొదిలి నాగరాజు 
 Surya daily,
January 28, 2013

Monday, February 25, 2013

సీమకు జరిగినది అన్యాయం కాదు, ముమ్మాటికి ద్రోహమే

రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, అక్కడి ప్రజలు సామా జికంగా, ఆర్థికంగా వెనుకుబాటుకు గురై ఉన్నారని శ్రీకృష్ణ కమిటీ నివేదిక స్పష్టంగా తెలిపింది. రాయలసీమకు జరిగినది అన్యాయం కాదు, ముమ్మాటికి ద్రోహమేనని మేధావులు పేర్కొంటున్నారు. కోస్తాంద్ర రాజకీయ నాయకులు, రాయలసీమలోని కొంతమంది నాయకులు ‘సీమాంధ్ర’ అంటూ కొత్త పదాన్ని సృష్టించారు. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలని, ‘సమైక్యాంధ్ర’ అని నినదించే రాజకీయ నాయకులంతా తమ పెట్టుబడులను, ఆస్తులను కాపాడుటునే క్రమంలోనే ఉద్యమాలను ముందుకు తోస్తున్నారని పలువురు విమర్శలు గుప్తిస్తున్నారు.‘రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో రాయలసీమ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిపారు. రాయలసీమను ముక్కలు కానివ్వం అని, విభజిస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కావాలనే డిమాండ్‌ను ముందు పెట్టారు. మొదట్లో గ్రేటర్‌ రాయలసీమ అన్నారు.

ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇస్తే, ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం ఇవ్వాలని రాయలసీమ జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి రాయలసీమ రాష్ర్టసమితి మద్దతు తెలియజేసింది. మొత్తంగా వీరికి రాయలసీమ రాష్ర్టం కావాలా లేదా రాష్ట్ర విభజన వద్దా అనేది స్పష్టం చేయలేదు. తెలంగాణ రాష్ర్టం ఇవ్వడం వల్ల రాయలసీమకు కొత్తగా జరగబోయే నష్టం ఏమీ ఉండదు. దీనితో రాయలసీమను ముడిపెట్టడం అవివేకమైన చర్యే కాకుండా రాయలసీమ ప్రజలకు ద్రోహం చెయ్యడమే అవుతుంది. అంతిమంగా రాష్ట్రంలోని పెత్తందారులకు లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది.రాయలసీమ రాష్ర్టం అవసరమే. నాలుగు జిల్లాలతో కలిపే రాయలసీమ రాష్ర్టం కావాలి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయా ప్రజల ప్రజాస్వామిక అభీష్ఠం మేరకు రాయలసీమ రాష్ర్టం ఏర్పడాలి. అందుకు ముందుగా రాయలసీమకు జరిగిన ద్రోహాన్ని, మోసాన్ని ప్రజల ముందుంచాలి.

మెకంజీ పథకం, శ్రీబాగ్‌ బడంబడిక వంటి ఎన్నో ఒప్పం దాలను అమలు చేయకుండా రతనాల రాయల సీమను ఎడారిగా మార్చిన పాలకవర్గాల స్వార్థ రాజకీయ ఎత్తుగడలను ప్రజల ముందుంచుతూ, సీమ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రజలచేత ప్రజాస్వామ్యయుత ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి.రాయలసీమ గత 160 సంవత్సరాల నుండి తీవ్ర కరువు, కాటకాలలో సతమతమవుతోంది. 200 అడుగుల లోతువరకు బోరు వేసినా నీళ్ళురావు. చాలా చోట్ల 700 అడుగులు వేసినా నీరు లభించని పరిస్థితి. రాజుల కాలంలో నిర్మించిన గొలుసుకట్ల చెరువులే నేటికీ ఆధారం. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగినా సీమ వాసులకు దిక్కు లేకుండాపోయింది. ఈ చెరువుల్ని కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపాకం కోసం ప్లాట్లు వేసి అమ్మేశారు. రాయలకాలం నాటి భూగర్భ జలనిక్షేపాల రక్షణకోసం ఏర్పాటుచేసిన జలాశయాలు శిథిలావస్థలో ఉండిపోయాయి. 1858లో ఈస్టు ఇండియా పరిపాలన, తదనంతరం బ్రిటిష్‌ పరిపాలన వచ్చినా పాలెగాళ్ళ రాజ్యం వచ్చిందికాని, కనీసం వలసరాజ్యపాలన కూడా అమలు జరగలేదు.

1876లో సంభవించిన కరవుకు నూటికి నలభై మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్‌ హయాంలో కాటన్‌, మెకంజీ వంటి ఇంజనీర్లతో పరిశోధనలు చేయించి, సాగులో ఉన్న 75 లక్షల ఎకరా లకు నీరు అందించే ప్రణాళికలు రూపొందించినా, వాటిని 40 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పనకోసం మాత్రమే పరిమితం చేశారు. ఈ మేరకు 1890లో కర్నూలు, కడప కాలువ ద్వారా కడప- కర్నూలు జిల్లాలలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది.మెకంజీ తన హయాంలో కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల సంగమంతో ఒక పథకం రూపొందించారు. దీనితో 40 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడు తుంది. కాని ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.1953 వరకు కోస్తా, రాయల సీమ జిల్లాలు మద్రాసు రాష్ర్టంలో ఉండేవి. 1913లో ఆంధ్ర మహాసభ ప్రత్యేక తెలుగురాష్ర్టం కోసం ఉద్యమించింది. ఈ ఉద్యమ క్రమంలో కోస్తా ప్రాంతం లో కలపకుండా రాయలసీమ రాష్ర్టం కావాలనే ప్రజా ఉద్యమం కూడా బయలుదేరింది. దీనితో కంగారుపడిన కోస్తా ప్రాంత రాజకీయ నాయకులు 1937లో ‘శ్రీబాగ్‌’ భవనంలో రాయలసీమ నాయకులతో కోస్తా ప్రాంత నాయకులు ఒక పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే ‘శ్రీ బాగ’ ఒడంబడిక అన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం ఆంధ్రవిశ్వ విద్యాలయానికి రెండు కేంద్రాలు ఏర్పరచి వాటిని వైజాగ్‌, అనంతపురంలలో ఏర్పాటుచేయాలి. రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాన్ని కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నుండి పది సం వత్సరాలు లేదా అవసరమైనంతకాలం ఏర్పాటు చేయాలి. నీటి వివాదాలు వచ్చినా, రాయలసీమ అవసరాలను మొదట తీర్చాలి. అసెంబ్లీ సీట్లు సమాన సంఖ్యలో ఉండాలి. రాష్ర్ట రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. 1953లో ఆంధ్రరాష్ర్టం అవతరించింది. 1944లో మల్లేశ్వరం వద్ద తుం గభద్ర ఆనకట్ట- మెకంజీ పథకానికి పొంతన లేకుండా జరిగింది. దీనివల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. 1951లో కృష్ణా - పెన్నార్‌ ప్రాజె క్టును ఉమ్మడి మద్రాసు రాష్ర్టం రూపొందిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ నాగార్జు నసాగర్‌ కావాలని కోస్తా ప్రాంత నాయకులు ఉద్యమించారు. అందువలన రాయలసీమ మరోమారు అన్యాయానికి గురైంది.

1954లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల వల్ల రాయలసీమకు చారిత్రక ద్రోహం జరిగి శాశ్వత ఎడారిగా మారిపోయింది. రాష్ర్టంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం రాయలసీమ. అనంత పురం జిల్లాలో చాలా పంటపొలాలలో ఇసుక మేటలు వేసింది. రాబోయే సంవత్సరాలలో రాయలసీమ ఎడారి కాబోతోందని నివేదికలు చెబుతున్నాయి. సగటు వర్షపాతం సంవత్సరానికి 30 అంగుళాలకన్నా తక్కువ ఉంటుంది. కోస్తా జిల్లాల్లో 40 లక్షల హెక్టార్ల సాగుభూమికి 20 లక్షల హెక్టార్లకు ప్రాజెక్టుల ద్వారా నీరందుతోంది. రాయలసీమలో 30 లక్షల హెక్టార్ల సాగుభూమికి 3 లక్షల హెక్టార్లకే సాగునీరు అందుతోంది.ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకుంటే రాష్ర్ట ఉద్యోగ కల్పనలో రాయలసీమకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. రాష్ర్ట ముఖ్యమంత్రులు సీమనుండి ముగ్గురు వచ్చినా రాయలసీమకు ఒరిగిందేమీ లేదు. విద్యకు సంబంధించి తిరుపతి దేవస్థానం నిధులతో ఏర్పాటు చేసిన యూనివర్శిటీలు తప్పితే, రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసినవి చాలా స్వల్పం. రాయలసీమ ప్రజల శ్రమతో తయారైన సంపద- రాయలసీమను దాటి బడా పెట్టుబడిదారుల మూలధనంగా మారిపోతోంది.

కృష్ణానది మిగులు జలాలను శ్రీశైలం ప్రాజెక్టు వద్దనుండే తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు - నగరి ప్రాజెక్టులకు మళ్ళించాలి. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని నాయకులు, పాలకులు ఏనాడో మర్చిపోయారు. కడప జిల్లాలోని సహజ వనరులను, అక్రమ గనుల కేటాయింపుతో పాలకవర్గాలు తమ బంధుగ ణానికి కేటాయించి పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశాయి. రాయలసీమను ఏలిన పాలెగాళ్ళే ఈ రోజు పెట్టుబడిదారులుగా, పారిశ్రామిక వేత్తలుగా మారి రాజకీయాల్ని రాష్ర్టంలో శాసిస్తున్నారు.పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, తమ స్వీయ ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు ఒక్కటై సమైక్యాంద్ర, గ్రేటర్‌ రాయలసీమ అంటూ పసలేని వాదనలు ముందుకు తెస్తున్నారు. ప్రజలలోని సున్నితమైన భావాలను రెచ్చగొడుతూ, అపోహల్ని, అభద్రతలను నాయకులు సృష్టిస్తున్నారు. పాలక వర్గాల రాజకీయ ఎత్తుగడులవల్లే ప్రాంతీయ సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రీకృత పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా వల్ల రాష్ర్టంలో తీవ్ర అసమా నతలు ఏర్పడ్డాయి. వీటికి పరిష్కారంగా ప్రాంతీయ ఉద్యమాలను చూపెడు తున్నారు.అయితే భౌగోళికంగా రాష్ర్ట విభజన జరుగవచ్చునేమో కాని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రజలు ఎప్పుడూ ఉద్యమించవలసిందే. ఈ రాష్ట్రాల ఏర్పాటు కూడా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల మేరకే జరగాలని కోరుకుందాం.

-ఎం.కె. కుమార్‌

రాయలసీమ తొలి నవలా రచయిత్రి--పొదిలి నాగరాజు

కోస్తా ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన చాలా కాలానికి కూడా రాయలసీమలో ఆధునిక వాసన
లేనేలేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.
ఆధునిక వచనకావ్యంగా ప్రసిద్ధి చెందిన నవల ప్రపంచస్థాయి నుండి ప్రాంతీయ స్థాయివరకూ అనేక మంది రచయితల్ని ప్రేరేపించింది. నవల భారత దేశంలో 1865లో బంకించంద్ర ఛటర్జీతో మొదలైందని విమర్శకుల అభిప్రాయం. దీనిని మార్గదర్శకంగా తీసుకొని తొలి తరంలోనే (దేశ) నవలా రచయితలు సమాజాన్ని చిత్రించే అద్భుతమైన నవలల్ని మనకు అందించారు. నవలా చరిత్రలో పురుషుల చరిత్ర రికార్డు అయినంతగా నవలలా రచయిత్రుల చరిత్ర రికార్డు కాకపోవడం శోచనీయం. నవలా చరిత్ర రచనల లోపం వల్ల తొలి తరం నవలలా రచయిత్రుల నవలలు సమాజానికి పరిచయం కాలేక పోయాయి.

వీటిపైన పరిశోధన కూడా పరిమితంగానే జరిగింది. కానీ ప్రపంచ నవలా సాహిత్యం ముందుగా రచయిత్రితోనే మొదలయిందనే విషయనాన్ని గమనించాలి. క్రీ..11 శతాబ్దం మొదటి భాగంలోమురాసాకిషకుచుఅనే జపాన్రచయిత్రిగెంజిమోనో గోతారి’ (గెంజిగాథ అనే నవల రాశారు. ప్రపంచ నవలా సాహిత్యంలో నవల మొదటిదని పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయం. నవలగెంజి గాథఅనే పేరు తో తెలుగులోకి అనువాదం అయింది. రచయిత్రితో మొదలైన నవలా సాహిత్యంలో రచయిత్రుల స్థానం పరిమితంగా కనిపించడం ఆశ్చర్యపడాల్సిన విషయం. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా ఉంది. భారతదేశ తొలి నవలా రచయిత్రి విషయం పెద్దగా చర్చకు రాలేదనిపిస్తుంది.

తెలుగులో తొలి నవలా రచయిత్రిజయంతి సూరమ్మఅని సాహిత్యకారుల అభిప్రాయం. రాయలసీమలో తొలితరం నవలా రచయితల గురించి వాదోపవాదా లు జరిగాయి. ప్రస్తుతం పరిశోధనలూ జరుగుతున్నాయి. కానీ సీమ నవలా రచ యిత్రుల గురించి ఎవరూ పేర్కొనడం లేదు. కోస్తా ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన చాలా కాలానికి కూడా రాయలసీమలో ఆధునిక వాసన లేనే లేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.

అయితే తెలుగు సాహిత్యం దీని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇదే పరిస్థితి రాయలసీమ రచయిత్రులకు కూడా పట్టింది. తెలుగులో మొదటి నవలారచయిత్రి కొస్తా ప్రాంతానికి చెందినజయంతి సూరమ్మ’, ఈమె రాసిన నవలసుదక్షిణా చరిత్రము’ (1906). దీని తర్వాత మల్లవరపు సుబ్బమ్మకళావతి చరిత్ర’(1914), .పి.పిరాట్టమ్మశోభా వతి’ (1924), కనుపర్తి వరలక్షుమ్మవసుమతి’ (1924) మొదలైన నవలలు తొలి తరంలో వచ్చినట్లుసమాలోచనంఅనే వ్యాస సంపుటిలో జి. లలితనవల- మహిళఅనే వ్యాసంలో పేర్కొన్నారు. జయంతి సూరమ్మసుదక్షిణా చరిత్రము’ (1906) తర్వాత రాయలసీమకు చెందిన దేవమణి సత్యనాథన్రాసినలలిత’ (1908) నవల వచ్చింది.

నవలల గురించి ఎవ్వరూ ఎక్కడా చర్చించలేదు. పైగా దేవమణి సత్యనాథన్రాసిన తొలి తెలుగు సాంఘిక నవలలలలిత’ (1908)ను, వదిలేసి 1924లో .పి. పిరాట్టమ్మ రాసినశోభావతినవలను తొలి తెలుగు సాంఘిక నవలగా గుర్తించారు సాహిత్యచరిత్రకారులు. కానీ తెలుగులో తొలి సాంఘిక నవలలలితఅని చెప్పవచ్చు. నవలను రాసిన దేవమణి సత్యనాథన్రాయలసీమలో తొలినవలా రచయిత్రి. అంతేకాదు ఆమె తెలుగులో రెండవ నవలా రచయిత్రికూడా అవుతారు. ఆమె గురించి మరో విశేషం- ఆమె తొలి తెలుగు సాంఘిక నవలా రచయిత్రి కూడా.

దేవమణి సత్యనాథన్రాసినలలితనవలనుసీమ నవల తొలిదశఅనే వ్యాసంలో (సూర్య, జనవరి 28, 2013) క్రీ..1927కి చెందినదిగా పేర్కొన్నాను. కానీ అభిప్రా యాన్ని కొంత పరిశోధన ద్వారా మార్చుకోవలసి వచ్చింది. 1927లోలలితనవల ద్వితీయ ముద్రణ జరిగింది. 1928లోలలితనవల10 తరగతి పాఠ్యగ్రంథంగా ఉంది. నవలలోని అంతర్గత ఆధారాన్ని బట్టి నవల మొదటి ముద్రణ 1908లో జరిగినట్లు తెలుస్తుంది.

నవలలోలలితరాజమండ్రిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ బళ్ళారి జిల్లాలోని కమలాపురంలో ఉన్న తన బావ హరిదాసుకు 1908 జూలై 12 ఉత్తరం రాసినట్లు నవలలో ఉంది. దీనినిబట్టి నవల 1908లో వచ్చిఉండ వచ్చునని భావించవచ్చు. అప్పటి ప్రొద్దుటూరు తాలుకా బోర్డు ప్రెసిడెంటు కూరం నరసింహాచార్యులులలితనవలకు ముందుమాట రాశారు. అందులో ఆయన రచయిత్రి గురించి చెబుతూగ్రంథములు వ్రాయుటకిది ప్రథమప్రయత్నం అని గ్రంథకర్తియే చెప్పుచున్నది-రుూ వధూమణి మా మండలములోని స్ర్తీలకు మార్గదర్శినియై యందఱికృతజ్ఞతకు బాత్రురాలగుచు న్నదిఅని అన్నారు.

దేవమణి సత్యనాథన్రచనా ప్రస్థానంలోలలితనవల తొలి ప్రయత్నం. రచయిత్రి దత్తమండలాలలోని రచయిత్రులందరికీ మార్గదర్శకం అవుతుందన్న నరసింహాచార్యులు అభిప్రాయాన్నిబట్టి రచయిత్రికి ముందు రాయలసీమలో రచయిత్రులు లేరని తెలుస్తుంది. కాబట్టి రాయలసీమ తొలి నవలా రచయిత్రి, తెలుగులో తొలి సాంఘిక నవలా రచయిత్రి దేవమణి సత్యనాథన్‌. దేవమణి సత్యనాథన్అనంతపురంజిల్లాలోని ధర్మవరంవాసి అని కూరం నరసిం హాచార్యులులలితనవలకు వ్రాసిన ముందుమాటలో చెప్పారు. తర్వాత ఈమె మద్రాసులో స్థిరనివాసం ఏర్పచుకున్నారు. ఈమెను హన్నమ్మ, డేవిడ్అనే దంప తులు దత్తత తీసుకొని పెంచిపెద్ద చేశారు.

పెంపుడు తల్లిదండ్రులవల్ల ఈమె వ్యక్తిత్వం హిందూ క్రైస్తవ సమన్వయాత్మక మైంది. రచయిత్రి జనన, మరణాల తేదీలు లభ్యం కాలేదు. కానీ ఈమె 20 శతాబ్దానికి పూర్వార్థంలో జీవించిన తొలి తరం రచయిత్రులలో ఒకరనితెలుగు సాహిత్య కోశము’ (1850-1950వరకు) అనే గ్రంథంద్వారా తెలుస్తోంది. రచయిత్రి నవలను తనను పెంచిన తల్లిదండ్రులకు అంకితం చేశారు.
1908
లో దేవమణి సత్యనాథన్రాసినలలితనవల స్ర్తీ విద్య ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ, స్ర్తీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూఉంది. అక్కను, తల్లినీ పోగొట్టుకున్న లలితకు తండ్రికూడా పిచ్చివాడై పోగా, అన్నదమ్ములు బిచ్చగాళ్ళైపోగా తనను బలవంతం చేస్తున్న వసంతుని బారినుండి తప్పించుకొని మేనమామ కొడుకు హరిదాసును అనేక సాహసాలతర్వాత వివాహం చేసుకుంటుంది.

చదువు ఇచ్చిన సంస్కారమువల్ల సమస్యలనుచూసి బెదిరిపోకుం డా సమాజంలోని మంచివాళ్ళ సహకారంతో సమస్యల నుండి గట్టెక్కిన స్ర్తీ కథ లలితనవల. నవలలో హరిదాసుడు, లలిత ప్రధానపాత్రలు. సౌందర్యవతి అయిన లలిత హరిదాసుపై తనకున్న ప్రేమను నిలబెట్టు కోవడానికి, హరిదాసునే పెళ్ళిచేసు కోవడానికి ఎన్నోకష్టాలను ఎదుర్కొంటుంది, చివరికి జయి స్తుంది. లలిత తండ్రి సోమనాథుడు తాగుబోతు. పాత్రద్వారా తాగుడువల్లవచ్చే నష్టాలను, కష్టాలను రచయిత్రి చిత్రించారు.

లలిత నవల సంఘసంస్కార నవలల. ముఖ్యంగా సమాజంలో ని మథ్యపానంవల్ల వచ్చే నష్టాలు, స్ర్తీవిద్యవల్ల కలిగే సుఖాలు నవలలో చిత్రితమయ్యాయి. జూదం, చెడుసావాసాలు, చెడు ఆలోచనలు, ప్రాణహానికి దారితీస్తాయ ని నవలలో రచయిత్రి సూచన ప్రాయంగా తెలియజేశారు. లలిత నవలలో సోమనాథుడు విజయనగరంలో రక్షకభటఉద్యోగి.అయితే మితిమీరిన తాగుబోతు. ప్రభుత్వంఇచ్చే జీతం చాలక పేదలను లంచాలకోసం పీడించేవాడు. సోమనాధుడు పెట్టే బాధలకు ఓర్వలేక ఆటవికులు సోమనాథునిమీద పగతో సోమనాథుని కూతు రైన లలితను కాళికాదేవికి బలి ఇచ్చి సోమనాథునిపై పగతీర్చుకోవాలనుకుంటారు. సోమనాథుడు తాగుడుకోసం ఆటవికులను వేధించడమే వారి పగకు కారణం.

తాగుబోతుల లక్షణాలను రచయిత్రి తెలియజేస్తూ- ‘త్రాగుబోతుల నడవళ్లు శోచ నీయములు. అతడొక్కొక మారు మధువును గ్రోలు చు దానిమూలమున జనించిన మైకముచే దూగుచుండును. చిరపరిచయులగు మధుపాన మిత్రులంగాంచిన, దూలుచు వారివెంట బికారివోలె దిరుగుచుండును. మితిమించిన మత్తుచే గ్రిందపడి పొరలుచుండును. దుర్భాషలనాడుచుండును. లజ్జలేక తిరుగు చుండును. అతిహేయములగు విషయములం జిక్కి యొక్కొకతఱి వెఱ్ఱివానివొలె వెడలు చుండును. వెఱ్ఱివేయివిధ ములన్నట్లాతడిట్లున్మత్తుడగుటచే చెడునడతలకడలి రక్షకభట వర్గమునుండి ప్రభుత్వమువారీతని దొలగించిరి.

ఇపుడు సోమనాథుని పిచ్చి పెచ్చుపెరిగి నితడు వీధివీధులందిరుగజొచ్చెను. చూచినవారిపై నెల్లను బాషాణములంబ్రయోగింపసాగెను. చిరపరిచితులగువారు తన్నుబ్రేమింపజొచ్చిన పలుమాఱు వారిని దిట్టుచుండెను. ఇట్లందఱికయిష్టుడై స్వ కుటుంబమునకు దూరుడై పుత్రులనెన్నక లలితయందలి ప్రీతిని దోలి, హేయ గుణపూరితుడై, తుదకాతుడు దేశముల వెంబడి దిరుగజొచ్చెను. ఆహా! మథుపా నము కుటుంబముల కెట్టియరిష్టమును దెచ్చున్నదో చూడుడు’.

సోమనాథుడి తాగుడువల్ల కూతురు చనిపోగా, భార్యను పొగొట్టుకొని పిచ్చివాడై దేశదిమ్మరి అవుతాడు. రాజమండ్రిలో ఉంటున్న లలిత పిచ్చివాడైన తండ్రిని గుర్తు పట్టి వైద్యం చేయించి మామూలు మనిషిగా చేస్తుంది. సోమనాథుడు రాజమండ్రి న్యాయస్థానంలో ఉద్యోగంచేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. లలితకు ఇష్టంలేని సంబంధంచూసి పెళ్ళిచేసుకోవాలని బలవంతంచేస్తాడు. తన మాటలు వినని లలితపై కేసు పెడతాడు. ఓడిపోతాడు.మళ్ళీతాగుడుబోతై దేశదిమ్మరి అవుతాడు.

దేవమణి సత్యనాథన్‌ ‘లలితనవలలో స్ర్తీ చదువుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి స్ర్తీ చదువు సమాజానికి, కుటుంబానికి చాలా అవసరం. నవలలో లలిత చదువుకోవడంవల్ల ప్రతి విషయంలో సమయస్పూర్తిని పాటించింది. సమ యానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదల నుండి గట్టెక్కింది. పట్టుదలతో తాను ప్రేమించిన బావనే పెళ్ళిచేసుకుంది దేవమణి సత్యనాథన్సృష్టించిన లలిత పాత్ర ఆదర్శవంతమైంది. అందుకేలలితనవల సంఘసంస్కరణ నవల.
దేవమణి సత్యనాథన్‌ ‘లలితనవలలో రాయలసీమ ప్రాంతానికే ప్రాముఖ్యతను ఇచ్చారు. లలిత ఉత్తర సర్కారులోని విజయనగరంలో పుట్టి అక్కడే చదువుకుం టుంది. విజయనగరంలో తల్లి, దండ్రి, అక్క, అన్నదమ్ములు అందరూ దూరమైన తర్వాత దుర్మార్గుడైన వసంతుడు పెట్టే బాధలను భరించలేక ప్రాణ,మాన పరిరక్షణకు పురుషునిగా రూపాన్ని మార్చుకొని తనబావ హరిదాసుడు ఉంటున్న కమలాపు రానికి వస్తుంది.

కమలాపురం రాయలసీమప్రాంతం బళ్ళారి జిల్లాలో ఉంది. లలిత బావ హరిదాసుడు లలితను మరచిపోలేక, తన తండ్రివల్ల ఇంట్లో స్థానం ఇవ్వలేక స్నేహితుడి సహాయంతో లలితను రహస్యంగా కమలాపురంనుండి రాజమండ్రికి చేరుస్తాడు. లలిత రాజమండ్రిలో కష్టాలను ఎదిరించి, గెలిచి చివరికి కమలాపురం చేరుకుంటుంది. అక్కడే తనబావను పెళ్ళిచేసుకుంటుంది.

లలిత విజయనగరంలో పుట్టినా, రాజమండ్రిలో కొంతకాలం నివసించినా మొత్తానికి కమలాపురమే ఆమె జీవితానికి ఆధారమైన ప్రాంతం. కాబట్టి రచయిత్రి నవలలో కమలాపురాన్నే కేంద్రంగాచేసి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చారు. దేవమణి సత్యనాథన్రాయల సీమలో తొలి నవలారచయిత్రి లలితఅనే సాంఘికనవల ద్వారా చెప్పవచ్చు.                                                                           
                                                                                                               -పొదిలి  నాగరాజు  
పరిశోధక విద్యార్థి
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప.  
 

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...