Sunday, April 28, 2013

కొడవటిగంటి, రారా బాటలో సింగమనేని

సింగమనేని నారాయణ కథా నవలా రచయిత. ఆయన విమర్శ కూడా ఈ రెండింటి మీదనే ఎక్కువ. కొల్లాయి గట్టితేనేమి?, జానకి విముక్తి వంటి నవలలు, చాసో, రారా, రాజారాం తదితర కథకుల మీద సింగమనేని చేసిన విమర్శ... తెలుగు సాహిత్య విమర్శలోని ఆరోగ్యకర ధోరణికి, నిబద్ధతకు నిదర్శ నాలు. సమాజ సాహిత్య సంబంధం, సాహిత్య ప్రయోజనం, సాహిత్యకారుల కర్తవ్యంపై స్పష్టత ఉన్న ఆయన సాహిత్య విమర్శలో నిక్కచ్చితనం కనిపిస్తుంది. ఆయన రాసే విమర్శ పరిమితం, చర్చిం చేది అపరిమితం. ఆయన విమర్శను చదివితే ఆయన మరో రారాలా కనిపి స్తారు. విమర్శలో కరుకుదనాన్ని రారా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. రారా మాదిరిగానే సింగమనేని కూడా పాఠకుడి దృష్టి కోణం నుంచి రచనను అంచనా వేస్తారు. ఏ రచనను విమర్శించినా అది పాఠకుడి మీద ఎలాంటి ప్రభావం చూపు తుందో చెబుతారు. రచయిత, రచనలో నచ్చిన అంశాన్ని ఎంత మక్కువతో చెబుతారో నచ్చని దాన్ని అంత కటువుగా చెబుతారు. అలాగే రచయిత ఎంత పేరున్న వ్యక్తి అయినా వ్యతిరేకించాల్సి వచ్చిన ప్పుడు ఏ మాత్రం ఉపేక్షించరు.
రారా సాహిత్యం పాఠకుని సంస్కారం మీద ప్రభావం చూపుతుందని బాగా ప్రచారం చేశారు. సింగమనేని ఆయన మార్గంలో ఈ అభిప్రాయాన్ని అనేక విమర్శ, వ్యాసాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. 'రారా కథలన్నీ చదివింతర్వాత పాఠకుడి సంస్కార స్థాయి ఒక మెట్టు అయినా పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు' (పాఠకుడి సంస్కార స్థాయిని పెంచే రారా కథలు). 'స్త్రీవాద కథలు ముఖ్యంగా పురుష పాఠకులను చాలా డిస్టర్బ్‌ చేశాయి'(తెలుగు కథ, 1990 తర్వాత). 'చాసో గారి- ఎందుకుపారేస్తాను నాన్నా' కథలో పన్నెండేళ్ల కృష్ణుడి అంతరంగం, ఆ తండ్రి సంఘర్షణ, ఆర్థిక అసహాయత పాఠకుణ్ణి కలచివేస్తాయి'(చాగంటి సోమయాజులు కథలు). 'కల్లేటి వంక' కథలోని అనైతిక సంబంధాల చిత్రణను గురించి చెబుతూ, వాటిని చదివిన 'పాఠకులు మూర్చ పోవలసిందే' అంటారు. డాక్టర్‌ వి.చంద్ర శేఖర రావు 2002లో రాసిన కథలలోని శిల్పాన్ని గురించి చెబుతూ 'పిడికెడు విమర్శకుల మెప్పు కోసమే కథలు రాస్తూ అనంతమైన పాఠకుల్ని మరచిపోయారు చంద్రశేఖరరావు'(తెలుగు కథ 2002) అన్నారు. ఇలాంటి అభిప్రాయాన్ని చదివినప్పుడు బాగా చదువుకున్న సాహిత్య విమర్శకుడు సామాన్య పాఠకుని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని పిస్తుంది. రంగనాయకమ్మ, చంద్రశేఖర రావు, గోపిని కరుణాకర్‌ వంటి రచయితల లోని గుణాగుణాలను నిజాయతీగా విశ్లే షించిన సింగమనేని నిబద్ధ విమర్శకుడు.
సింగమనేని సాహిత్యవిమర్శనం తటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్య యనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసివస్తాయి. సాహిత్య సృజనకైనా, విమర్శకైనా ఆ అభిప్రాయాలు బాగా దోహదం చేస్తాయి. సామాజిక సాహిత్య విమర్శకుల్లో కట్ట మంచి నుంచి లెక్కవేసుకుంటే నాలుగు తరాల వాళ్లు కనిపిస్తారు. మార్క్సిజం స్పర్శలేకుండా సమాజ జీవితానికి సాహి త్యం దర్పణంగా ప్రతిఫలంగా భావించే కట్టమంచి తరంలో రాళ్లపల్లి, పుట్టపర్తి వంటి వాళ్లు వస్తారు. మార్క్సిజం తెలుగు వాళ్లకు పరిచయమైన తర్వాత పునాది ఉపరితల సిద్ధాంతం ప్రకారం సాహిత్యం, కళలు ఉపరితలాంశాలుగా భావించే తరం శ్రీశ్రీ, కొకు, ఎంఆర్‌ చంద్ర, పుచ్చలపల్లి వంటి వాళ్లది. ఆ సిద్ధాంతాలు మరింత స్పష్టతతో ముందుకు తీసుకుపోయిన తరం రారా, వల్లంపాటి, కేతు, కొలకలూరి, చేరా, వివి, త్రిపురనేని మొదలైన వాళ్లు. ఆ తర్వాత తరంలో వేణు, సింగమనేని, చెంచయ్య, తెలకపల్లి, ఎస్వీ, కాత్యాయని విద్మహే వంటి వాళ్లు ఉన్నారు. ఈ తరంలో దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలు తమవైన ప్రమా ణాలతో తెలుగు సాహిత్యం, విమర్శలోకి ప్రవేశించాయి. సింగమనేని వీళ్లందర్నీ అధ్యయనం చేశారు.. చేస్తున్నారు.
సింగమనేని.. సాహిత్యంలోని వస్తువు లోనే కాదు, శిల్పంలో కూడా వాస్తవికతే ప్రధానంగా ఉండాలని భావిస్తారు. ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువు అందకుండా అడ్డుకునే ప్రయోగాలు, పాఠకుడ్ని బోల్తా కొట్టించే మలుపులను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అందుకే 'స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంటే మెలోడ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చు' అంటారాయన (రాయలసీమ కథా చిత్రం). సిద్ధాంతాల కోసం రచన చేయడాన్ని కోకు మాదిరిగానే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామాజిక మూలాలు తవ్వి తీయాలిగాని, రచనలు సిద్ధాంతాలు వల్లిం చకూడదంటారు. రచయితలు సాధించ దలచుకున్న ప్రయోజనం కోసం పాత్రల్ని బలిపెట్టకూడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే రచనలో పనిగట్టుకొని ఉపన్యాసా లివ్వడాన్ని, ఆ రకంగా కళాధర్మాలను అతిక్రమించడాన్ని సింగమనేని పూర్తిగా తిరస్కరిస్తారు. శిల్ప మర్యాదాతిక్రమణ లను ఆమోదించని నిబద్ధ విమర్శకుడు సింగమనేని. అందుకే ఆయనకు క్లుప్తతకు మారుపేరైన చాసో అంటే మహా ఇష్టం. 'ఏ కథలో కూడా (చాసో) రచయిత ప్రవక్త స్థానంలో కూచోడు' అని ప్రశంసించిందిం దుకే. సినిమాల్లో లాగా కల్పనా సాహిత్యం లో కూడా రచయితలు ఆదర్శీకరణ అనే బలహీనతకులోనై పాత్రల చైతన్య స్థాయికి విరుద్ధంగా వాటిని చిత్రిస్తూ ఉంటారు. పెద్దపెద్ద మాటల్ని చెప్పించడం, అసంబ ద్ధమైన త్యాగాలు చేయించడం వంటివి చేయిస్తారు. సింగమనేని ఈ అతిపాత్రీ కరణను వాస్తవికతా విరుద్ధమైనదిగా భావిస్తారు. అందుకే అల్లం రాజయ్య 'అతడు' కథలో మితిమీరిన వీరపూజను చూశారు సింగమనేని.
ఎంత విస్తృతంగా రచనలు చేసేవా ళ్లైనా పునరుక్తులు చేయడం, మూస ధోరణిలో పడిపోవడం ఉపేక్షించదగింది కాదని సింగమనేని భావన. సహజత్వం, అనివార్యత, వైవిధ్యం.. ఇవి రచనకు ప్రాణభూతాలైన లక్షణాలుగా సింగమనేని భావిస్తారు.విశ్వసనీయత దెబ్బతింటే రచనా ప్రయోజనం దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తారు. రచనంతా చదివిన తర్వాత దానిలో ఏమి చెప్పదలచుకున్నది పాఠకుడికి తెలియకపోతే ఆ రచన దండగని కూడా సింగమనేని నిష్కర్షగా చెబుతారు.
సాహిత్య రచనలో రచయిత సామా జిక సమస్యల్ని ఆవిష్కరించి పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించి పరిష్కారాలను వారికే వదిలేయాలే తప్ప పరిష్కారం చెప్పే బాధ్యతను రచయితలు తీసుకోరాదు అని భావించడంలో సింగమనేని 1935-45ల నాటి కొడవటిగంటి అభిప్రాయాన్నే సమర్థిస్తారు. చాసోను సింగమనేని బాగా మెచ్చుకునేది ఈ కారణంగానే. ప్రజల సమస్యలకు రచయితలు పరిష్కారాలు చెప్పబూనడం ఔత్సాహిక లక్షణమని ఆయన అభిప్రాయం.
మంచి సాహిత్య పఠనం పాఠకుల్ని ప్రభావితం చేసి, వాళ్ల సంస్కారంలో మార్పులు తీసుకొచ్చి, వాళ్లను చెడ్డ సాహిత్య పఠన ప్రభావం నుంచి కాపాడు తుందని సింగమనేని అభిప్రాయం. యద్ధనపూడి సులోచనారాణి 'కీర్తికిరీటాలు' నవల గురించి 'ప్రజావ్యతిరేక సాహిత్యాన్ని తిప్పికొట్టగల చైతన్యం పాఠకుడు సాధించి నప్పుడు ఇలాంటి నవలలు తుక్కుకుం డీలలో చేరుకుంటాయి' అని.. రంగ నాయకమ్మ 'జానకి విముక్తి' నవలను గురించి 'పాఠకుల్ని భ్రమల్లో ముంచే రంగురంగుల ప్రేమల నుంచి మన సాహి త్యం విముక్తి చెందాలి అన్న స్ఫూర్తిని స్తుంది' అని ఆయన వ్యాఖ్యానించడంలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉత్తుత్తి కథ, ఉత్త కథ అని రెండు రకాల కథలుం టాయిన చెప్పిన కొకు.. సింగమనేని ఆవేశించినట్లనిపిస్తారు ఇలాంటి చోట్ల.
సాహిత్యం భావప్రచారానికి బలమైన సాధనం అన్న అభిప్రాయంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. అలాగే రారా లాగే ప్రచార వాఙ్మయమంతా సాహిత్యం కాదని, సాహిత్యంలో ప్రచార గుణంతోపాటు కళాత్మకత అత్యంత ముఖ్యమైన భాగమని గట్టిగా నమ్ముతారు. కొకులాగే తత్వో పదేశం కోసం శిల్ప మర్యాదలు అతిక్ర మించరాదని ప్రబోధిస్తారాయన. పాఠకుల్ని భ్రమల్లోకి నెట్టకుండా వాస్తవికతా మార్గంలో నడిపించే రచయితల్ని ప్రశంసిం చారాయన. కేతు విశ్వనాథరెడ్డి కథల్ని గురించి చెబుతూ 'రచయితలు ప్రపంచం నుండి వాస్తవిక ప్రపంచలోకి పాఠకుణ్ణి నెట్టుతారు' అనడం ఈ దృష్టితోనే. పాఠకుల్ని ఏడిపించడం సాహిత్య కర్తవ్యం కాదన్న కొడవటిగంటి అభిప్రాయాన్ని సింగమనేని గట్టిగా విశ్వసిస్తారు. చెడుపై అయిష్టత, కోపం, వ్యతిరేకత కలిగించడమే రచయిత చేయాల్సిన పని అని సింగమనేని నమ్ముతారు. వస్తువులోనైనా, శిల్పంలో నైనా రచయితలు చేసే కల్పనలు, ప్రదర్శిం చే విన్యాసాలకు సామాజిక ప్రయోజనం దెబ్బతినని ఐక్యత, అర్థం పరమార్థం ఉం డాలని సింగమనేని కోరుకుంటారు. రచనను స్థల కాలబద్ధమైన మానవ జీవిత ప్రతిఫలంగా సింగమనేని భావిస్తారు. అందుకే రచయిత జీవితంతో ముడిపెట్టే రచనను విశ్లేషిస్తారు. అలాగే రచయిత స్థల కాలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొల్లాయిగట్టితేనేమి (మహీధర రామమోహనరావు) నవల మీద రాసిన వ్యాసంలో దానిని గొప్ప రాజకీయ చారిత్రక నవలగా నిర్వచిస్తూ ఆ నవల కథాకాలాన్ని, రచనా కాలాన్ని సమన్వయించుకున్నారు.
సింగమనేని విమర్శలో విస్తృతమైన అధ్యయనం, శాస్త్రీయమైన విశ్లేషణ, విజ్ఞానాత్మక సమన్వయం, ఆలోచనాత్మక సూత్రీకరణలు వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. సరళమైన వాక్యాలు, చక్కని తర్కం, సమాజం పట్ల మక్కువతో కూడిన వివరణ, సింగమనేని విమర్శ శైలి పాఠకులను ఆకర్షిస్తుంది.
రాసింది పరిమిత విమర్శ అయినా ఆరోగ్యకరమైన, నేటికి కావలసిన ఆలోచ నలు కలిగి ఉన్న సాహిత్య విమర్శకులు సింగమనేని. ఆయనది వాస్తవికతావాద విమర్శ.. ప్రగతిశీల మార్గం. కొడవటి గంటి, రారాల మార్గం అంటే ప్రజా మార్గం, శాస్త్రీయ మార్గం.
- డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
Visaalaandhra Daily 29-04-2013

Saturday, April 20, 2013

భాష విషయంలో దారి తప్పుతున్నాం జాగ్రత్త! - డా.యం.వి.రమణారెడ్డి

ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 డా.యం.వి.రమణారెడ్డి
ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. ప్రామాణిక భాషలో కథ వ్రాసి, దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది.
మనకు హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహముంది. కొంతమంది ఆ విగ్రహాన్ని చూడగానే, ఈమె విజయవాడనుండో కాకినాడనుండో వచ్చిన ఆడమనిషి అనుకుంటున్నారే తప్ప, తల్లి అనే భావనతో చూడకపోవడం గమనిస్తే మనసు చివుక్కుమంటుంది. వాళ్ళు పరాయివాళ్ళయినా కాదు. తెలుగు బిడ్డలే. మరి వాళ్ళకు ఈ వికారం ఎందుకు కలిగింది? కుటుంబం నుండి విడిపోవాలనే భావన వాళ్ళకు కలిగింది కనుక. కలిసుంటామా విడిపోతామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్నదమ్ములు కలిసున్నా విడిపోయినా తల్లి మారదు.
విడిపోవాలనే భావం కలిగినంత మాత్రాన తల్లిని మార్చుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన ఇది వరకు ఎక్కడా వినలేదు. కలిసున్నా విడిపోయినా మనకు తల్లి మాత్రం ఒకటే ఉంటుందని చాటిచెప్పే విధంగా, తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన నా తమ్ముళ్ళను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడనుకున్నామే, ఈ రాజకీయప్రభాలు, ఈ ప్రాంతీయ విభేదాలు, ఇవి కలిగించే ప్రకంపనాలు, తెలుగు సాహిత్యాన్ని గూడా సోకినా యి. అది తప్పదు. అది మనకు ఇక్కడ కొత్తగా జరుగుతున్న విశేషమేంగాదు. ప్రపంచంలో అన్ని చోట్లా జరిగేదే. సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది.
తెలుగు సాహిత్యంగూడా మార్పును స్వీకరించింది. అనేకమంది రచయితలు, ముఖ్యంగా కథా రచయితలు, తమ ప్రాంతీయ మాండలికంలో రాయడం మొదలుపెట్టినారు. నిన్నా మొన్నటివరకూ ప్రామాణికభాషనే మనమంతా ఉపయోగించాం. కానీ, ఈ తరం రచయితలు దాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. రాజకీయాలు కానివ్వండి, ప్రాంతీయ మనస్తత్వం కానివ్వండి, కారణం ఏదైనా, నా ప్రాంతంలో వాడే మాండలికాన్నే నేను రాస్తాను, నా ప్రాంతంలో వాడే యాసలోనే రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు వ్రాయాల?-అనే పరిస్థితి వచ్చేసింది.
ఇంకొకరి భాష అంటే కోస్తావాళ్ళ భాష అనే అర్థంలో, ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను. ఎందుకు అనే వివరణకు పోయేముందు ఈ పరిస్థితి దాపురించడానికి దోహదం చేసిన కారణాలు కొద్దిగా చర్చించుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాటిల్లో మొదటిది మన కోస్తాసోదరుల ప్రవర్తన. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను.
రాయలసీమ ప్రాంతంలో తండ్రి తల్లిని ‘జేజి’ అంటారు. కోస్తాలో ‘నాయనమ్మ’ అంటారు. నాయనమ్మ అనేది తేలికైన రెండు పదాల కలయిక. చిన్నపిల్లలు, ఇంకా భాష సరిగారానిసమయంలో నాయనకు అమ్మకాబట్టి నాయనమ్మ అంటూ తేలిగ్గా వాళ్ళకు వాళ్ళు కూర్చున్నమాట. జేజి పదం అలా తయారైంది కాదు. అది తెలుగుభాష ప్రత్యేకతను సూచించే పదం. సంస్క¬ృతానికీ తెలుగుకూ ఉన్న తేడాను తెలియచేసే పదం. కుటుంబ సంబంధాలను విడివిడిగా, స్పష్టంగా తెలియజేసే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అత్త, కోడలు వంటి పదాలు సంస్కృతానికి లేవు. అవి తెలుగులోనే దొరుకుతాయి.
మన భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించే పదాల్లో జేజి అనే పదం కూడా ఒకటి. అందువల్ల అది మనం పోగొట్టుకోవడానికి కూడా వీల్లేని మేలిమి. అలాంటి పదా న్ని చులకన చేసి ‘జేజి ఏమిటండీ జేజి. చక్కగా నాన మ్మా అని పలకలేరా?’ అంటూ ముఖం చిట్లించుకుంటారు కోస్తా సోదరులు. వెంటనే మనం చిన్నబోతాం. మనం కూడా ‘నానమ్మ ఏంటండీ నానమ్మ. చక్కగా జేజి అని పలకలేరా?’ అని అడగచ్చు. కానీ అడగలేం. ఎందుకంటే నా భాష తప్పేమో అనే గిలి మనను వెనక్కు లాగుతుంది. నాది ప్రామాణిక భాష కాదు అనే మానసిక బానిసత్వం మననుజవాబు చెప్పే పరిస్థితిలో లేకుండా గొంతునొక్కేస్తుంది.
ఇలాంటి పోట్లు కోస్తా సోదరుల చేతుల్లో ఇతర ప్రాంతాల రచయితలూ సామాన్యులూ లెక్కలేనన్ని సార్లు అనుభవించారు. ఈ పరిస్థితి ఇలావుంటే, పుండుమీద కారం చల్లినట్టు చేస్తున్నాయి తెలుగుసినిమాలు. రౌడీకి రాయలసీమ యాస, విదూషకునికి తెలంగాణ యాస, హీరోకు కోస్తా యాస ఉపయోగించడం సినిమా రచయితలకు అలవాటైపోయింది. ఇక సినిమా కథలందామా, ఏదోవొక ఫైన్‌మార్నింగ్‌ ఆ రచయిత తలకాయలో ఒక క్రైమ్‌ కథ మొలుస్తుంది. అది ఏ ప్రాంతంలో జరిగినట్టు తడుతుందంటే రాయలసీమలో జరిగినట్టు తడుతుంది.
ఆ మొలిచిన కథకీ, రాయలసీమ వాస్తవిక జీవితానికీ ఏ మాత్రం పొత్తుండదు. ఆ రచయిత రాయలసీమలో గడపటానికి తన జీవితంలో అర్ధరోజైనా కేటాయించి ఉండడు. అతనికి రాయలసీమజీవితం తెలియదు, భాష తెలియదు, సంస్క¬ృతీ తెలీదు. కోస్తా యాజమాన్యాల గుత్తాధిపత్యంలో నడిచే పత్రికల ద్వారా సంపాదించిన తప్పుడు సమాచారంతో రాయలసీమను ఊహించి తన బుర్రలో పుట్టిన క్రైమ్‌నంతా రాయలసీమమీద రుద్దుతాడు. ప్రతినిత్యం అంతపెద్ద తెరమీద, అంత విస్తృతమైన మీడియాలో రాయలసీమ పేరుబెట్టి అడ్డమైన వాచకాలు వాగుతూంటే చూసేవాళ్ళకు ఎలాగుంటుందండీ? వాస్తవంగా అది రాయలసీమ జీవితాన్ని ప్రతిబించేదే అయితే మనకు సంతోషమే! రాయలసీమ సంస్కృతినో, బాధలనో ప్రతిబింబించేదైతే సంతోషమే. కానీ అలా జరగడం లేదు.
ఉద్దేశపూర్వకంగా రాయలసీమను కించపరిచే పద్ధతి లో తయారైన సినిమాను అంతపెద్ద తెరమీద చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండెల్లో మండుతుంది. కాబట్టి, అందరికిలాగే మన రచయితలకు కూడా మండింది.వాళ్ళ భాషలో నేనెందుకు వ్రాయాలి. నా భాషలోనే, నా ప్రాంతంలోనే వాడే మాండలికంలోనే నేను వ్రాయాలి-అనే పట్టుదల పెరిగింది. ఈ వాదన తో నేను పూర్తిగా ఏకీభవించలేనని ఇది వరకే సూచించాను. ఎందుకంటే మనం ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణికభాషను ఎవడో కోస్తావాడు వచ్చి ఇది నా భాష అంటూ దొమ్మీగా లాక్కుపోతుంటే చూసి ఊరుకోటానికి నేను సిద్ధంగా లేను.
నాకు తెలిసి మనం ఉపయోగిస్తున్న ప్రామాణికభాషను యధాతథంగా వాడుతున్న జిల్లా ఒక్కటైనా నాకు కోస్తాలో కనిపించలేదు. జిల్లా జిల్లాకూ యాసమారుతుంది. వ్యవహారశైలి మారుతుంది. ఐతే, ఒక్క విషయం మనం అంగీకరించకతప్పదు. మనం ఉపయోగించే ప్రామాణికభాష కోస్తా వ్యవహారానికి దగ్గరగా ఉండటం వాస్తవం. దానికి చారిత్రిక కారణాలు చాలా ఉన్నాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నామాండలికానికి కూడా హోదాకావాలనే పట్టుదల పెరిగింది. మంచిదే. ఆ ప్రయత్నం మొదలెట్టండి. వాడిదొద్దు వీడిదొద్దు అనుకంటూ ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటే నష్టం తప్ప లాభముండదు.
అలాకాకుండా అచ్చమైన తెలుగుపదాలకోసం గ్రామసీమల్లో వెదకండి. పాశ్చాత్యనాగరికతకు దూరంగా ఉండే గ్రామసీమల్లో వెదకండి. సామాన్యమైన మానవ సంబం« దాలు, దినసరి వ్యవహారాలు నెరపటానికి అవసరమైన పదాలు ప్రతిభాషకూ ఉంటాయి, మనకూ ఉన్నా యి. అలాంటి పదాలు వెదికి తీయండి. అపభ్రంషంగా మారిన పదాలు ఉంటే వాటిని సంస్కరించండి. అప్పుడు మాండలికపదాల భాండాగారం తయారౌతుంది. రాయలసీమ గ్రామాల్లో, తెలంగాణ గ్రామా ల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణికభాషలో చేరేట్టు చూడండి. దానివల్ల తెలుగుభాష పరిధి పెరుగుతుంది. తెలుగు భాష విస్తృతమౌతుంది.
అయితే, ఆ దిశగా మన కృషి ఏ మేరకు జరుగుతూందంటే, దాదాపు జరగడం లేదనే చెప్పుకోవాలి. ప్రాంతీయ ప్రాముఖ్యత కావాలని కోరుకొనే రచయితలు ఎన్నుకుంటున్నది ఆ ప్రాంతంలో వాడే మాండలిక పదాలు కాదు, మాండలిక యాస మాత్రమే. అదైనా అందరికీ చేతనౌతూందా? పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకు తప్ప, మిగతావారికి అదిగూడా చేతకావడం లేదు. ఎందుకు చేతగాదంటే, ఏ పల్లెటూర్లో ఆ యాసవాడుతున్నారో, ఆ పల్లెతో నీ బొడ్డు తెగిపోయింది. కానీ, నా మాండలికంలో రాయాలనే కుతి పెరిగింది.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. అది వ్రాయటానికి ఏం చేస్తున్నావ్‌? మొట్టమొదట నువ్వు అలవాటుపడిన ప్రామాణిక భాషలో కథ వ్రాసి, ఆ తరువాత దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. దానివల్ల, కథలో అనవసరమైన కృత్రిమత్వం చోటుచేసుకుంటూందే తప్ప, యాస కుదరటం లేదు. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది. ప్రాంతీయ ప్రాముఖ్యతకోసం యాసను కోరుకుంటున్నాం గదా. మరి నువ్వు కలగనే ప్రాంతానికంతా ఒకే యాసలేదే.
రాయలసీమ తీసుకుంటే చిత్తూరులో ఒక యాస, కడపలో మరో యాస, అనంతపురంలో ఒక యాస, కర్నూలుది మరోయాస. ఒకే జిల్లాలో కూడా ఐదారు రకాల యాసలు మనకు కనిపిస్తాయి. కడపయాసలో రాసింది పక్కనున్న చిత్తూరు, అనంతపురాలకు చదవడమే కష్టమౌతుంది. దానివల్ల పాఠకుల సంఖ్య కుదించుకుపోతుంది. పాఠకుల సంఖ్య తగ్గితే ఆ సాహిత్యం వల్ల సమకూరే ప్రయోజనం ఎంత అనేది నా సందేహం. కాబట్టి, మనం ఒక దిశగా చెయ్యవలసిన ప్రయాణాన్ని మరో దిశగా, చేరవలసిన గమ్యానికి సరిగ్గా వ్యతిరకమైన దిశగా చేస్తున్నామేమోనని నా అనుమానం.
ఇదేదో కొత్త ప్రయోగమని మనం మొదలెట్టామే, ఈ మాండలిక ప్రయోగం చాలా చాలా పురాతనమైనది. బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకరకంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. అందులో 43రకాల ఉచ్చారణా తేడాలు ఉన్నాయి. బెర్నార్డ్‌ షా రచించిన ‘పిగ్మ్యాలియన్‌’ నాటకం చదివితే కొంతవరకూ తెలిసొస్తుంది. ‘డయలెక్ట్స్‌’తో వేగలేక వాళ్ళు కూడా చివరకు ‘ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌’ పేరుతో ప్రామాణిక భాషను రూపొందించుకునే అవసరం కలిగింది. చారిత్రికంగా అది తప్పనిపరిస్థితి. ఈపరిణామాలను గమనించకుండా ఇప్పుడు మనం ఒక ఎమోషనల్‌ మూడ్‌లో మాండలిక తెలుగును ఉద్ధరించటానికి మారుగా, మాండలిక యాసకోసం పాకులాడుతున్నాం.
కాబట్టి, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, ఒక ప్రామాణికభాష అవసరాన్ని గుర్తించ వలసిందిగా సభకు విజ్ఞప్తిచేస్తూ- ఆ ప్రామాణిక భాష కోస్తాదా, రాయలసీమదా, తెలంగాణదా లేక అందరికీ సమ్మతమైన మరొకటా అనేది తరువాతి సంగతి. ముందు తెలుగుభాష బతికుంటే కదా నీ మాం డలికమా, నా మాండలికమా అని తేల్చుకోవాల్సిన సమస్య ఉత్పన్నమయ్యేది! తెలుగు వ్యాకరణం పేరుతో మనం బోధించే పుస్తకాలను చూస్తే, మన భాష స్థాయి ఏమిటో మనకు కనువిప్పు కలుగుతుంది.
పదాలను విభజించినప్పుడు మనకు మొట్టమొదట తారసపడేది ‘తత్‌ సమము’. తత్‌ అంటే ఏమిటో మీకందరికీ బాగా తెలుసు. సంస్కృతానికి సమానమైన పదానిది మన తెలుగు వ్యాక రణంలో మొదటిస్థానం. ఆ తరువాతది ‘తత్‌ భవము’. అంటే సంస్కృతంనుండి పుట్టిన పదానిది ద్వితీయ స్థానం. నువ్వు అచ్చతెనుగు అనుకుంటున్నావే, దానికి నీ వ్యాకరణంలో ఇచ్చింది మూడోస్థానం. నువ్వు విప్లవాత్మకంగా భావిస్తున్నావే, ఆ మాండలికం నాల్గవస్థానంలో గ్రామ్యంగా ముచ్చటించబడి, సాహి త్యానికి అనర్హమైన భాషగా వెలివేయబడింది. మరి ఆ వ్యాకరణాన్నే భావితరాలకు బోధిస్తున్నాం. ఇకపోతే నిఘంటువులు.
అవి పేరుకు మాత్రమే తెలుగు నిఘంటువులు. పాత గ్రాంధికభాషా సాహిత్యాన్ని ముం దేసుకుని, ఆ పురాతన కవులు వాడిన సంస్కృతపదాలకు అర్థం చెప్పడం, ఉదాహరణలు చూపడం తప్ప తెలుగు వాసనే వాటికి లేదు. మరి చుట్టూ ఇన్ని తప్పులు పెట్టుకుని, వాటిని సవరించే ప్రయత్నం చేయ కుండా, నా తెలుగో నా తెలుగో అని పేద అరుపులు అరిస్తే ప్రయోజనం ఏముంది? ఈ ఆధునిక యుగం లో ముందుకు పోవటానికి నీ భాషకు ఇప్పటిదాకా సరైన నిఘంటువు లేదు, సరైన వ్యాకరణం లేదు, దానికి తోడు ప్రామాణిక భాషను గూడా లేకుండా చేసుకోవడం మంచిదో కాదో సభికులే ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను.
(వివిధ, 11 ఫిబ్రవరి 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)

Friday, April 19, 2013

‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించిన "మైసూరా"

మైసూరారెడ్డిని బాగా ఎరిగినవాళ్లతో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం కొంత అర్థమవుతుంది. ఆయనకు
డా. ఎం.వి.మైసూరా రెడ్డి
జనాన్ని ఆకర్షించేంతటి వాగ్దాటి లేకపోయినా, సబ్జెక్టును స్టడీ చేసి మెప్పించే ఓపిక ఉంది. ఈగోయిస్ట్‌గా కనబడినా, ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో ఉన్నా ‘రాజకీయం’ చేయరు. ఫ్యాక్షన్ గొడవలకు దూరం పాటిస్తారు. పైగా సెన్సిటివ్. అందువల్లే ఆయన గౌరవనీయ నాయకుడయ్యారు. అయితే ఈ లక్షణాలే ఆయన్ని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా చేశాయా? ‘ఎక్కడో పల్లెటూళ్లో పుట్టి, ఈ స్టేజ్‌కు వచ్చినాము కదా, ఇది చాలదా!’ అంటారు.

  కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరా ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి 2004లో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే...

మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి మా అబ్బ నిడిజివ్వికి ఇల్లటం వచ్చినాడు. మా వూల్లల్లో తండ్రి తండ్రిని అబ్బ అంటాము. తల్లి తండ్రిని తాత అంటాము. మా తండ్రి చనిపోయేంతవరకు అన్‌అపోజ్డ్‌గా గ్రామ సర్పంచిగా చేసినాడు. మా అమ్మ అన్నగారు(మాజీ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ ఊటుకూరి రామిరెడ్డ్డి) కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చినాడు. అలా మొదట్నుంచీ రాజకీయాలతో సంబంధాలుండేవి.
ప్రొద్దుటూరు దగ్గర తాళమాపురం అనే ఊరుంది. అక్కడ ఉన్న గ్రామదేవత మైసూరమ్మ. అందుకే మైసూరయ్య, మైసూరప్ప, మైసూరమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు మీదనే నాకూ మైసూరారెడ్డి అని పెట్టినారు. మానాన్న కూడా బాలమైసూరారెడ్డి. బయటి ప్రాంతాల్లో ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదో మైసూరు ఉంది కదా, అదేమో అనుకుంటారు.

మేము నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు చెల్లెళ్లు. అందర్ల్లోకీ నేనే పెద్దోణ్ని. నిడిజివ్విలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల స్కూలు. గొప్పలకు ఎందుకు పోవాల? యావరేజ్ స్టూడెంట్‌నే. తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివిన. అప్పట్లో దాన్ని డబ్బా రేకుల కాలేజీ అనేవాళ్లు.

ఫీజులేని డాక్టరుగా...
మా కుటుంబంలోగానీ, మా బంధువుల్లోగానీ ఎవరూ పెద్ద చదువు చదివింది లేదు. మా తండ్రి కోరిక ఏమంటే నేను డాక్టర్ చదవాలని. ఎంబీబీఎస్ డొనేషన్ కోసం లెక్క కూడా కూడబెట్టినాడు. గుల్బర్గాలో అయితే ఐదువేలు, కాకినాడలో అయితే పదివేలు. అయితే నాకు 82 శాతం మెరిట్ మీదనే కర్నూలు కాలేజీలో సీటు వచ్చినాది.

హౌస్ సర్జెన్సీ అయిపోతానే ఐదు సంవత్సరాలు ఎర్రగుంట్లలో ప్రాక్టీస్ చేసినాను. పరీక్ష చేయిచ్చడమూ, వాళ్లకు కావాల్సిన మందులో, ఇంజెక్షన్లో రాయిచ్చడమో చేసేవాణ్ని. కన్సల్టేషన్ ఫీజు తీసుకునేది లేదు. మొదట్నుంచీ ఉన్నోళ్లమే కాబట్టి, వాళ్లిచ్చే రెండ్రూపాయలో, మూడ్రూపాయలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది నాకు కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రాక్టీస్ మానేసినాను. కొందరైతే సలహా గూడా ఇచ్చినారు, ‘రోజూ ఓ గంటన్నా ప్రాక్టీస్ చేయగూడదా’ అని. న్యాయవాది రాజకీయాల్లో ఉన్నాగని ఫరవాలేదు. డాక్టర్‌కు ఏడ కుదురుతుంది? క్లైంట్ వెయిట్ చేస్తాడుగానీ పేషెంట్ ఆగలేడు కదా!

పుస్తకం చదువుకుని బాధ్యతలు తెలుసుకున్నా...

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కాబట్టి, మెడికల్ కాలేజీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉంటి. తండ్రి చనిపోయిన తర్వాత ఊరికి సర్పంచ్‌గా చేసినాను. తర్వాత కమలాపురం సమితి అధ్యక్షుడిగా పదివేల ఓట్లతో గెలిచినా(1981-85). అప్పుడు నాకు 32 ఏళ్లు. చిన్నవయసుగదా ఏం చేస్తాడో, ఎట్ల చేస్తాడో అని అందరికీ అనుమానముండె.

స్థానిక సంస్థల విధులేమిటి, ప్రెసిడెంటుగా ఏం చెయ్యాలి, అని రూల్స్ బుక్కు తీసుకోని చదివి, ఫస్ట్ మీటింగుకు పోతనే అధికారులతో మాట్లాడినా. అందులో ఉన్న బాధ్యతల ప్రకారం రివ్యూ చేసి, ‘ఫలానా చోట ఉంది చూసుకోలేదా?’ అనంగనే, ‘ఓయమ్మ ఈయన అసాధ్యుడే’ అనుకున్నారు. గ్రామాల్లో తిరగటం, మట్టిరోడ్లు వేయించటం, చదువు చెప్తాండారా లేదా అని స్కూళ్లు ఇన్‌స్పెక్ట్ చేయడం... అట్ల మంచిపేరే వచ్చింది.

స్టేజ్ ఫియర్‌తోనే రాయలసీమ ఉద్యమంలోకి...

ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వం తెలుగుగంగ పనులు మొదలుపెట్టింది. తెలుగుగంగ పేరు మీద నెల్లూరుకు, మద్రాసుకు దొంగదారిన నీళ్లు పోతాయి, రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయం మొదలైంది. ‘రాయలసీమ విమోచన సమితి’ అని మొదలుపెట్టి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, లక్కిరెడ్డిపల్లె రాజగోపాలరెడ్డి, బద్వేలు వీరారెడ్డి రాయలసీమంతా పర్యటిస్తాన్నరు(కొంతకాలానికి రా.వి.స. ఆగిపోయింది. తర్వాత రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి బలం పుంజుకుంది).

ఎన్.శివరామిరెడ్డి, ఎన్.సి.గంగిరెడ్డి, మాసీమ రాజగోపాలరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు, అందులో సీపీఐ, కాంగ్రెస్, అన్ని పార్టీలవాళ్లున్నరు. ‘యువకుడు కదా, ఓపిగ్గా తిరుగుతాడు, అఖిలపక్షం కన్వీనర్‌గా మైసూరారెడ్డిని పెడదాం’ అని పెద్దవాళ్లంతా నిర్ణయించినారు. అయితే నాకు స్టేజ్ ఫియరుండేది. ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అరగంట ఆలోచించి ప్రిపేర్ అయ్యేవాణ్ని. తర్వాత స్టేజి మీద మాట్లాడడం అలవాటయ్యింది.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పదివేల క్యూసెక్కులు పెట్టినారు. దాని సామర్థ్యం పెంచాలనేది ప్రధాన డిమాండు. తర్వాత శ్రీశైలం కుడికాలువ చిత్తూరు జిల్లాకు పొడిగించాలనీ, ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, కృష్ణానది నికర జలాల్లో వాటా కావాలనీ, రేణిగుంట నుంచి గుంతకల్లుకు రైల్వే డబ్లింగ్ లైన్ కావాలనీ, కడప ఆకాశవాణిని అభివృద్ధి చేయాలనీ, థర్మల్ స్టేషన్ కావాలనీ డిమాండ్లు పెరిగిపోయినాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం కోరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నొక్కి చెబుతున్నా... రాష్ట్రంలో ఉంటూనే అభివృద్ధి కావాలనుకున్నాం.

పాదయాత్రలు ఎట్ల జేస్తారు?
ఉద్యమంలో భాగంగా రాయలసీమ ఉద్యోగుల సంఘాలతో కలిసినాం. యూనివర్సిటీ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థులను కూడగట్టినాం. పత్రికల ఎడిటర్లను కలిసి సమస్యలు ఏమిటో వివరించినాం. నాలుగు జిల్లాల్లో ధర్నాలు చేసినం. సభలు జరిపినం. అయితే డిమాండ్లను ఎట్ల ప్రజల్లోకి తీసుకొనిపోవాల? పాదయాత్ర చేస్తే గ్రామగ్రామాన చెప్పొచ్చు కదాని ఆలోచించినాం.


మరి పాదయాత్రలు ఎట్లా జేస్తారు? ఏదో మఠాధిపతులు చేయడము చూసినాముగానీ రాజకీయ నాయకులు పాదయాత్ర ఏరకంగా చేస్తారో తెలీదు కదా! గాంధీజీ దండి సత్యాగ్రహం బుక్కు గూడా సంపాదించి చదివినా. ఏయే ఊర్లున్నాయి, ఎట్ల నడవాలి, ఎక్కడ ఆగాలి అని ప్లాన్ వేసినాం. తిరుపతి నుంచి కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా పోతిరెడ్డిపాడు వెళ్లాలని ఐడియా. ఇదే వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పినాం. ఎంవీ రమణారెడ్డి కూడా మంచి ఆలోచనే అన్నాడు. అప్పుడింకో సమస్యొచ్చింది. ఇంతమంది నాయకులు ఎట్ల వెళ్లడం?


అందుకే మరో ఆలోచన జేసి, తిరుపతి(నేను), లేపాక్షి (వైఎస్
రాజశేఖరరెడ్డి), కళ్యాణదుర్గం(ఎం.వి.రమణారెడ్డి), ఆదోని(రఘునాథరెడ్డి), కదిరి(సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి) నుంచి ప్రారంభమయ్యేట్టుగా ఐదు గ్రూపులు చేసినాం. అన్ని గ్రూపులూ నంద్యాలలో కలిసి ఆడనుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్లాలనేది ఆలోచన. అదే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు నాంది అని చెప్పుకోవచ్చు. రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. ఒకరోజు 18 రావొచ్చు, ఒకరోజు 22 రావొచ్చు, కాని మొత్తంగా 420 కిలోమీటర్లను 22 రోజుల్లో పూర్తిచేయాలి.

వెంబడి టెంట్లు, భోజనాలు ఇలా ఏమీ తీసుకెళ్లింది లేదు. కొంచెం పెద్ద గ్రామం చూసుకోవడం, అక్కడే గ్రామస్తులు వండిపెట్టిన పులగమన్నమో, పప్పో తినడం, బడి లాంటిది చూసుకుని పడుకోవడం... వెళ్తూ గ్రామస్తులకు సమస్యలు అర్థమయ్యేట్టు జెప్పడం... దీంతో రాయలసీమ ఉద్యమానికి ఒక ఊపొచ్చింది. తర్వాత వివిధ దశల్లో, వివిధ ప్రభుత్వాల్లో మేము పెట్టిన డిమాండ్లు చాలామట్టుకు పూర్తవుతూ వచ్చినై.

బొక్కల దవాఖాన
సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలైంది. అది సహజంగానే రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. అందువల్లే కమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నిక సేఫ్ ల్యాండింగ్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ హవా ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి సీతారామయ్య మీద 35,000 మెజారిటీతో గెలిచినాను(1985).పాత బిల్డింగులో శాసనసభ మొదటి సమావేశం. బీజేపీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతున్నాడు. నిజాం ఆర్థొపెడిక్ హాస్పిటల్ గురించిన అంశం అనుకుంటా. బొక్కల దవాఖాన అన్నాడు. ఇదేంది బొక్కలు అంటాండడు అనుకున్నా. ‘ఏంది ఇంద్రసేన్ ఏదో బొక్కలు అంటివి?’ అని అడిగితి. ‘బొక్కలు బొక్కలు అవే బోన్స్’ అన్నాడు. ఓహో, శాసనసభలో మన భాష మనం మాట్లాడుకోవచ్చు!

రాయలసీమ భాషంటే జంకూగొంకు ఉండే. ఉంటాదిగదా! అప్పట్నుంచీ భాష ఏం మాట్లాడతాండరు అని ఎప్పుడూ ప్రాధాన్యం ఇయ్యలే. వాళ్లు మాట్లాడేదాంట్లో సబ్జెక్టుందా లేదా ఇదే చూస్తాంటి. తర్వాత మైసూరారెడ్డి మాట్లాడితే సామెతలు, పిట్టకథలు చెబుతాడని నా భాష కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు ఏదైనా కొత్త అంశం మాట్లాడగలమా? అని ఆలోచన జేస్తా. ఒకసారి రాజ్యసభలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది.

అందులో అస్సెట్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నింది. ఏందిరా అనంటే హైకోర్టు జడ్జీలు, కిందిస్థాయి జడ్జీలు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తేమో రాష్ట్రపతికిస్తాడు. ఇవన్నీ ఎలా ఇస్తారు? సీల్డు కవర్లలో! అందరూ సీల్డు కవర్లలో ఇస్తే ఇంగేంటికి? ఇంట్లో బీరువాలో పెడితే పోతాదిగదా అని పాయింట్ లేవనెత్తినాను. దాంతో బిల్లు వెనక్కిపోయింది. అప్పుడు బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ‘రెడ్డీ, హౌ డిడ్ యు గెట్ దట్ పాయింట్? అర్ యు యాన్ అడ్వొకేట్ ఆర్ వాట్?’ అన్నారు.

చీటీలో మంత్రిపదవి
అప్పుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కాకి మాధవరావు ఆయన పర్సనల్ సెక్రటరీ. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రాజభవన్‌లో ప్రమాణస్వీకారం అయిపోయి, గ్రూప్‌ఫొటో అయిపోతానే, ‘పోండి, మీ పోర్టుఫోలియోస్ ఆ రూములో ఉన్నాయి చూసుకోపోండి’ అన్నాడు మాధవరావు. వినూత్నంగా ఉండాలని వాళ్లు రాత్రే చీటీల్లో రాసిపెట్టినారు. ఆ రూములో కొంచెం లైటింగ్ తక్కువుంది. చూస్తే హోమ్ అని ఇంగ్లీషులో నాలుగక్షరాలే కనపడినాయి.

బయటికి వస్తానే చెంగారెడ్డి, అడ్వకేట్‌గదా, ‘ఏమయ్యా హోంమంత్రీ, సీఆర్‌పీఎఫ్ తెలుసునా, ఐపీఎస్ తెలుసునా’ అనే. యాదో తెలిసినకాడికి తెలుసులే, లేకపోతే వాళ్లే నేర్పిస్తారుగదాంటి. (లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి) అప్పటికి అది అంత ప్రాధాన్యత గల శాఖ కాదు. మావాళ్లంతా గూడా ఇదేంటికి, చిన్న శాఖైనా సరే ఇంకేదైనా మార్పించుకో అన్నారు. సర్లేబ్బా ఏదో ఇచ్చినారు, దాన్నే మెప్పించేట్టు పనిచేసుకుందాం అంటి.


నేదురుమల్లి నన్ను హోం మినిస్టర్‌గా ఎంపిక చేయడమే కాకుండా, ఫ్రీహ్యాండ్ ఇచ్చినాడు. నిజాయితీపరున్నని ఆయనకు ప్రత్యేక అభిమానం. అప్పుడు ఐజీ(లా అండ్ ఆర్డర్) వీరనారాయణరెడ్డి ఉండే. దూరపు బంధువు గూడా. ఏదో మీటింగ్ అయిపోయాక చనువుకొద్దీ
‘హోంమంత్రి అయినావుగదా, రాయలసీమ ఆందోళనలో నిన్ను చిత్తూరులో లాకప్‌లో ఏసి కొట్టినాడుగదా, ఆయన గుర్తున్నాడా? ఆయనదేమైనా పనివుంటే జేస్తావా?’ అన్నాడు. రూల్స్ ప్రకారముంటే ఆయనకొచ్చేది ఆయనకిద్దామంటి. ఆయన ప్రమోషన్ పెండింగులో ఉండే. ఓకే చేస్తి. దాంతో నేనేదైనా నార్మ్స్ ప్రకారం చేస్తానని పోలీసుల్లో అభిమానం పెరిగింది.
అట్లనే అప్పుడు నక్సల్స్ యాక్టివిటీస్ ఎక్కువ. ల్యాండ్‌మైన్స్‌లో పోలీసులు చనిపోతాండిరి. దాంతో పోలీసుల్లో భయం ఉంటుండె. చనిపోయినా వాళ్ల శాలరీ కంటిన్యూ అయ్యేట్టుగా నిర్ణయం తీసుకుంటిమి. అలాగే ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటే ఆ ప్రమోషన్ శాలరీ ఇచ్చేది. రిటైర్ అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేట్టు చేస్తిమి. ప్రాణం ఇవ్వలేముగాని ఉద్యోగ భద్రత కల్పించినాం. దాంతో పోలీసుశాఖలో గౌరవం పెరిగింది. ఈ విధానాన్నే తర్వాత కేంద్రం ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో అమలుచేస్తోంది.


వైఎస్ నన్ను ‘డాక్టర్’ అని సంబోధించేవారు
రాజశేఖరరెడ్డిని నేను ‘సార్’ అనీ, ‘ఏమండీ’ అనీ పిలిచేవాణ్ని, ఆయన నన్ను ‘డాక్టర్’ అని పలకరించేవారు. కడపలో అందరమూ కాంగ్రెస్‌వాళ్లమే అయినా కందుల ఓబుల్‌రెడ్డిది ఒక వర్గం. బద్వేలు శివరామకృష్ణయ్య, రఘురామిరెడ్డి, నేను... మేమంతా వైఎస్ వర్గం. అయితే 1989,90 ప్రాంతం నుంచి నాకూ, వైఎస్‌కూ కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది.

అయినాగూడా వైఎస్ నా రెండో కుమారుడి పెళ్లికి వచ్చినాడు. ఒకసారి అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒకే ఫ్లైట్‌లో వస్తుంటే కలిసినాము. కరువు ప్రాంతాలకోసం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. నేను పశువుల గడ్డి, తాగునీరుకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పాను. అదే అనుకుంటా ఆయన్తో చివరిసారి మాట్లాడటం.




ప్రొఫైల్...
పూర్తి పేరు : మూలె వెంకట మైసూరారెడ్డి
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, బాల మైసూరారెడ్డి
జన్మదినం : 28.2.1949
జన్మస్థలం : కడప జిల్లా నిడిజివ్వి
వృత్తి : కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు.
భార్య : స్వరూప
పిల్లలు : ఇద్దరు కుమారులు; హర్షవర్ధన్‌రెడ్డి, రఘుకార్తీక్‌రెడ్డి (ఒకరు ఇంజినీరింగ్, మరొకరు డిగ్రీ చదివారు. మైనింగ్ బిజినెస్‌లో ఉన్నారు.)
నియోజకవర్గం : కమలాపురం
ఎమ్మెల్యే : 1985-94; 1999-2004
హోం, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ : 1990-94
సందర్శించిన దేశాలు : చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.

బైరెడ్డి సీమ ఉద్యమం ప్రచ్ఛన్న సమైక్య ఉద్యమం-- పాణి

బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రతిరోజూ మాట్లాడుతున్నదాంట్లో తార స్థాయిలో తెలంగాణ వ్యతిరేకత తప్ప రాయలసీమ సమస్యల గురించి ఏమీ లేదు. ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. విడిపోతే రాయలసీమ ఇవ్వాలి అని తప్ప రాయలసీమకు ఇంతకాలం ఎవరి నుంచి అన్యాయం జరిగిందో, ప్రత్యేక రాయలసీమ ఎందుకు కావాలో ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు.

రాయలసీమ ప్రాంత పరిరక్షణ కోసం, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలులో ప్రారంభించిన మేల్కొలుపు దీక్ష ఈ రోజుతో ముగియనుంది. రాయలసీమ ప్రాంత సమస్యలపై ఆయన గతంలో కూడా ఇట్లాగే కొంత కాలం హడావిడి చేసినట్లు గుర్తు. అయితే ఈసారి ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని కూడా అందుకున్నారు. మంచిదే. ప్రత్యేక రాయలసీమ అనే నినాదం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో పీలగా కొంచెం వినిపించింది. మళ్లీ దాని ఊసు కనిపించలేదు. 1980లలో సీమ సమస్యలపై ఆందోళన జరిగినా అందులో ప్రత్యేక రాష్ట్ర నినాదం లేదు. ఈ ఆకాంక్షను చాలా కాలం తర్వాత రాయలసీమ విద్యావంతుల వేదిక బైటికి తీసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పోటీగా రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సమైక్య వాదం వీధుల్లో మురికి కాలువలాగా పోటెత్తినప్పుడు కొద్ది మంది ప్రజాస్వామికవాదులు రాయలసీమ విద్యావంతుల వేదికగా ఏర్పడ్డారు. గతంలో సీమ సమస్యలపై జరిగిన పోరాటాల్లోని అవగాహనకు పూర్తి భిన్నమైన వైఖరిని ఈ వేదిక తీసుకున్నది. దానికి సీమలోని సమైక్యవాదుల నుంచి తీవ్ర అభ్యంతరమే వచ్చింది.కొద్ది మంది ప్రజాస్వామికవాదుల నుంచి, ముఖ్యంగా దళిత బహుజన శ్రేణుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమలోని ఫ్యాక్షనిస్టులు పేదలను, దళిత బహుజనులను బతకనియ్యరని.. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఫ్యాక్షనిస్టులకు అప్పగించినట్టవుతుందని అన్నారు. దాని మీద వేదిక చాలా విశ్లేషణ ఇచ్చింది. శక్తి మేరకు దాన్ని నాలుగు జిల్లాల ఆలోచనాపరుల్లోకి తీసుకెళ్లింది. ఎమ్మార్పీఎస్ కూడా దీనికి గొంతు కలపడం వల్ల సహజంగానే ఆ నినాదానికి కొంచెం బలం వచ్చింది. రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక రాష్ట్రంలోనే ఉందని ప్రచారం చేయగలిగింది.

ఆ సమయంలో రాయలసీమ హక్కుల పోరాటం చేస్తున్న మంత్రి టీజీ వెంకటేశ్ అంత దాకా సమైక్య ఉద్యమ సారథిగా ఉంటూ హఠాత్తుగా ప్రత్యేక రాయలసీమ అనడం మొదలు పెట్టారు. తెలంగాణ ఇచ్చేటట్లయితే రాయలసీమ రాష్ట్రం కూడా ఇవ్వాలని గొడవ ప్రారంభించారు. గ్రేటర్ రాయలసీమ అనే కబ్జా వాదం ముందుకు తెచ్చారు. పనిలో పనిగా కొందరు రాయల తెలంగాణ కావాల్సిందే అని కూడా అన్నా రు. ఇది తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకమేగాక, సీమ అస్తిత్వాన్ని తుడిచిపెట్టేసే వాదన. ఆ కాలమంతా సీమ గురించి ఏమీ మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు ఏకంగా రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి దీక్షలకు దిగారు. ఒక విషయం మీద ఎవరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ ఏం మాట్లాడుతున్నారనేదే ముఖ్యం. గత నెలా నెలన్నరగా ఈ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లోగాని, ఈ దీక్షల సందర్భంగాగాని బైరెడ్డి విమర్శలన్నీ తెలంగాణ ఉద్యమం మీదనే. కేసీఆర్ గురించి ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే బైరెడ్డి రాయలసీమలో ఏ వర్గానికి చెందినవాడో తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వర్గానికి చెందిన వాడు.

క్లాసికల్ భాషలో చెప్పాలంటే ఇద్దరూ ఆయా ప్రాంతాల బూర్జువా వర్గానికి చెందినవారు. కాకపోతే దశాబ్దాలుగా భంగపడుతూ, పోరాడుతూ ఉన్న తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్ష గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణ ఎట్లా తెస్తారు? తెచ్చాక ఆయన ఆ రాష్ట్రాన్ని ఏం చేస్తారనే విషయంలో సందేహమే అక్కర్లేదు. అక్కడొక ఫక్తు బూర్జువా పాలన కొనసాగడం తప్ప వేరే అద్భుతం జరగదు. కాకపోతే పంపకాలు కొంచెం న్యాయంగా జరిగితే అక్కడి ప్రజలకు ఆ మేరకు మేలు జరుగుతుంది. అంతకు మించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డం ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవ సమస్య కాబట్టి తరతరాల ఆ కోరిక తీరుతుంది. ఆ రకంగా అవి చిన్నవేమీ కాదు. బైరెడ్డికి ఇవేవీ రుచించవు. సమైక్య రాష్ట్రంలోని ప్రాంతాలను, ప్రజలను దోచుకోవడానికి ఇప్పటిలా తెలంగాణ రాష్ట్రంలో వీలుకాదు. అదే ఆయన అభ్యంతరం. అదే ఆయన చేపట్టిన రాయలసీమ ఉద్యమ పరమార్థం. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా కేసీఆర్ తదితర తెలంగాణ నాయకులను విమర్శించడమేగాక ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఇవ్వనని గట్టి హామీ ఇస్తే తాను సీమ ఉద్యమం చేయనని దాపరికంలేకుండా ప్రకటించుకుంటున్నారు. ఆయన ప్రతిరోజూ మాట్లాడుతున్నదాంట్లో తార స్థాయిలో తెలంగాణ వ్యతిరేకత తప్ప రాయలసీమ సమస్యల గురించి ఏమీ లేదు.

ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. విడిపోతే రాయలసీమ ఇవ్వాలి అని తప్ప రాయలసీమకు ఇంతకాలం ఎవరి నుంచి అన్యాయం జరిగిందో, ప్రత్యేక రాయలసీమ ఎందుకు కావాలో ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. గత మూడు రోజుల దీక్షలో తెలంగాణ వ్యతిరేకత.. తన సాంస్కృతిక స్థాయికి తగిన భాషలో తెలంగాణ వాళ్లను తిట్టడం తప్ప మరో ముచ్చట లేదు. కనీసం ఇప్పటికి ఆయన నోటి వెంట శ్రీబాగ్ ఒడంబడిక ప్రస్తావనే రాలేదు. కర్నూలు రాజధానిని తెలంగాణ వాళ్లు ఎత్తుకపోయారనే ఊకదంపుడు ప్రసంగం తప్ప ఆ సందర్భంగాగాని, అంతక ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడుగాని సీమ ప్రయోజనాల కోసం జరిగిన ఎన్నెన్ని ఒప్పందాలు ఏమైపోయాయో ప్రస్తావనే లేదు. వాటిని కోస్తా పాలకులు ఎందుకు ఉల్లంఘించారో, వాటి వల్ల ఆ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో ఊసే లేదు. ఇవేవీ ఆయనకు తెలియవని అనడం కంటే- వాటిని ఉల్లంఘించి సీమను దుంపనాశనం చేసిన కోస్తా పాలకవర్గాల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం ఆయన ప్రారంభించిన రాయలసీమ ఉద్యమ వ్యూహాత్మక లక్ష్యం. రాయలసీమకు దశాబ్దాలుగా కోస్తా ప్రాంత పాలకులు అన్యాయం చేస్తున్నారని మాట వరసకు కూడా అనకుండా సీమను పరిరక్షిస్తానని ఉద్యమాలకు దిగడం ఎంత ధూర్తత్వం! రాయలసీమ వాళ్లకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను శతృవుగా చూపడం తప్ప ఈ ఆందోళనలో రాయలసీమ ప్రయోజనాలు ఇసుమంత కూడా లేవు.

కేసీఆర్‌తో బైరెడ్డి ఏమైనా గొడవపడవచ్చు. వాళ్లిద్దరూ నిజంగానే సమ ఉజ్జీలు. కానీ తెలంగాణ వ్యతిరేకతే సీమ ప్రయోజనాల పరిరక్షణ అవుతుందా? రాయలసీమ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కూడా ఆలోచించాలి. విచిత్రమేమంటే నిజంగానే సీమ ప్రయోజనాలపట్ల అనురక్తి ఉంటే ఆయన దాడి చేయాల్సింది లగడపాటి వంటి కోస్తా పాలకులతో. కానీ బైరెడ్డి వాళ్ల ప్రస్తావన కూడా తీసుకరాడు. ఎందుకంటే ఆయన సీమ ఉద్యమం ప్రచ్ఛన్న సమైక్య ఉద్యమం. కోస్తా పాలకులతో సీమ ప్రాంతీయ బూర్జువావర్గం చెట్టాపట్టాలేసుకొని తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యం. ఈ మొత్తంలో ఘోరంగా వంచనకు గురవుతున్నది సీమ ప్రజలు. ఆ ప్రాంతానికి తరాతరాలుగా కోస్తా పాలకులు అన్యాయం చేస్తూ ఒక కన్ను పొడిచేస్తే ఇప్పుడు స్థానిక పాలకులు రెండో కన్ను కూడా పొడిచేస్తున్నారు. తెలంగాణ వేరైతే కృష్ణా నది నీటి పంపకం విషయంలో ఆ ప్రాంతం వాళ్లకు, రాయలసీమ వాళ్లకు మధ్య ప్రజాస్వామిక ఒప్పందాలు జరగాల్సి ఉంటుంది. ఈ ఇచ్చిపుచ్చుకొనే అవసరాలు సీమ ప్రజలకు తెలంగాణతోనే ఉంటాయి. ప్రత్యేక రాయలసీమ కోరేటట్టయితే ఇలాంటి విషయాల పట్ల చాలా దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. హైదారాబాదు వంటి విషయాల్లో కూడా సీమ ప్రజల భయ సందేహాలను తీర్చి, సీమ ప్రత్యేక రాష్ట్రానికి ఒక నగరం, రాజధాని ఎలా? ఉండే అవకాశం ఉందో చర్చించాల్సి ఉంటుంది. ఇట్లాంటి ప్రజాస్వామిక దృక్పథంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నప్పుడు తెలంగాణ ఎంత న్యాయమో అర్థమవుతుంది.

కానీ రాయలసీమకు తెలంగాణను శతృవుగా నిలబెట్టి బైరెడ్డి ఉద్యమం సాధించేదేమీ లేదు. ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. తమ ప్రాంతానికి ఇంత కాలం నష్టం చేస్తున్నది కోస్తా వాళ్లనీ, రేప్పొద్దున తెలంగాణ వచ్చాక సీమకు కోస్తా పాలకుల వల్లనే తీవ్ర నష్టాలు వస్తాయనీ, ఆందువల్ల ప్రత్యేక సీమ తప్పనిసరి అని తెలుసుకోవలసి ఉంది. తెలంగాణ వ్యతిరేక రాయలసీమ ఉద్యమం సారాంశంలో సమైక్య ఉద్యమమే అవుతుంది. ఈ దీక్షలు సమైక్య వాదుల మేలుకొలుపుగా తెలంగాణ వాళ్లు ఎట్లాగూ గుర్తించగలుగుతారు. సీమ ప్రాంతీయులు కూడా ఈ సమైక్య ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంది. ఇవేవీ సీమ ప్రజలకు తెలియవనుకొని ఉద్యమాన్ని నడపాలనుకోవడం నిజంగానే ఎంత తెంపరితనం!
- పాణి,  ఆంధ్ర జ్యొతి దినపత్రిక 10-08-2012

Thursday, April 18, 2013

విశ్వనాథరెడ్డి సాహిత్య సామాజిక నిబద్దతకు కొలబద్ద "వేర్లు, బోధి" నవలలు

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు " వేర్లు ", " బోధి " అనే రెండు నవలను రచించారు. ఆ నవలలపై  శ్రీ ఎ.కె.ప్రభాకర్
గారి విశ్లేషణ ఇది..!
“…మధ్య తరగతిలో పుట్టి రచయిత జీవితవైరుధ్యాలను అర్థం చేసుకొని వొక స్పష్టమైన సామాజిక అవగాహనను యేర్పరచుకోవడం చాలాకష్టమే, వొకవేళ జీవిత వైరుధ్యాలు అర్థమైనా, సామాజిక అవగాహన యేర్పడినా జీవితాన్ని వాస్తవంగా, శిల్పసంపన్నంగా, హృదయ సంస్కార ప్రేరకంగా చిత్రించడం మరొక పెద్దచిక్కు సృజనాత్మక శక్తీ, విమర్శనా దృష్టీ దీనికి కావాలి. వీటికి తోడు శాస్త్రీయ దృక్పథమూ, చిత్తశుద్ధీ వుంటేనే తప్ప వాస్తవికతావాద సాహిత్య సృష్టి చేయడం అసాధ్యం”.
-కేతు విశ్వనాథరెడ్డి (‘జప్తు’ కథాసంపుటికి ముందుమాట-1974)
అది కథ కావచ్చు, నవల కావచ్చు మధ్య తరగతి నేపథ్యం నుంచి ఎదిగొచ్చిన రచయితగా సృజనాత్మక సాహిత్య రచనలో తానెదుర్కొన్న సవాళ్ళ గురించి, వాటినుంచి బయటపడడానికి తాను సమకూర్చుకొన్న పరికరాల గురించే కేతువిశ్వనాథరెడ్డి చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. స్వీయానుభవ ప్రపంచానికి బయటనున్న జీవితాన్ని వాస్తవికతవాద సాహిత్యంగా మలచడంలో యే రచయిత అయినా యెదుర్కోనే యిబ్బందే యిది దాన్ని అధిగమించగల ప్రాపంచిక దృక్పథం కలిగివుండడం వల్లనే విశ్వనాథరెడ్డి సమకాలీన రచయితల్లో అగ్రగామిగా నిలబడగలిగారు.
కథారచయితగా మొదలై, కథకుడిగానే ప్రస్థానం కొనసాగిస్తూ రాయలసీమ ప్రాతినిధ్య రచయితగా కీర్తిగడించిన విశ్వనాథరెడ్డి రచించిన అరుదైన నవలలు -వేర్లు, భోధి. ఈ రెండు నవలలు రెండు భిన్న ప్రపంచాలకు చెందినవి. జీవితానికి చెందిన తాత్త్వికతని రెండు వేర్వేరు కోణాల్లోంచి ఆవిష్కరించినవి. ఉన్నత విద్యనభ్యసించి విశ్వవిద్యాలయం నుండి బయటపడ్డ భిన్న సామాజిక వర్గాలకు చెందిన యిద్దరు నిరుద్యోగ యువకుల వుద్వేగభరితమైన సంక్లిష్ట జీవితాన్ని, మానసిక సంఘర్షణని విమర్శనాత్మకంగా కళ్ళకు కట్టిన యీ రెండు నవలలూ ఆయన కథల నీడలో వెలుగులోకి రాలేదంటే తప్పుకాదేమో!
జీవిత వైరుధ్యాల్ని అర్థం చేసుకోగల సామాజిక అవగాహన, శాస్త్రీయ దృక్ఫథం, చిత్తశుద్ధి వొక నిబద్ధ రచయితకుండాల్సిన అర్హతలన్నీ కేతులో నిండుగా వున్నాయనడానికి యీ రెండు నవలలూ నిలువెత్తు వుదాహరణలే అయినప్పటికీ ‘వేర్లు’ నవల చదువుతున్నంతసేపూ ప్రత్యక్ష 80లోనూ అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘వేర్లు’ రాసేనాటికి (1978) విశ్వనాథరెడ్డి కథకుడిగా తెలుగు సాహిత్యంలో యింకా తనదైన ముద్రని వేసే ప్రయత్నంలోనే వున్నారు. ఆయనకి పేరుతెచ్చిన ‘నమ్ముకొన్ననేల’, ‘కూలిన బురుజు’ లాంటి కథలు ఆ తర్వాతే వచ్చాయి. ‘వెనకా ముందూ’ లాంటి కథల్లో ఆయన చేసిన నిష్పాక్షికమైన విలువల ప్రకటనలు ఆయనలోని నిర్భీతి తత్వాన్ని తెలియజేసాయి. ‘మార్పు’, ‘సానుభూతి’ కథల ద్వారా రచయితగా తానెటు నిలబడదల్చుకొన్నారో, తన సాహిత్య దృక్పథం యేమిటో నిర్ధ్వంద్వంగా స్పష్టం చేశారు. అయినప్పటికీ వొక దళిత యువకుడి జీవిత సంఘర్షణని నవలకు యితివృత్తంగా యెన్నుకొని తనది కాని ప్రపంచాన్ని, తనవి కాని అనుభవాల్ని రాయడానికి పూనుకోవడం వొకవిధంగా సాహసమే. అదేకాలంలో కేశవరెడ్డి ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’ (1977) దళిత జీవితాన్ని చిత్రించినప్పుటికీ ఆ నవల సంఘటన ప్రధానంగా సాగింది. విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ సంఘర్షణ ప్రధానంగా రూపొందింది.
ఈ నవలలో నాయకుడు వెంకట్రాముడు ఆంత్రోపాలజిలో పి.జి. చేసిన వొక మాదిగ యువకుడు. తాను చదివిన చదువువల్ల అతడు తన కులంలో యిమడలేదు.సామాజిక ఆర్థిక అసమానతల చట్రంలో స్వశక్తితో యెదిగే ప్రయత్నంలోనలిగిపోయి, జీవితానికి సంబంధించిన అన్ని రకాల అభద్రతనీ అనుభవిస్తాడు. తనకు తెలియకుండానే పరాయీకరణకు గురై దాన్నుంచి బయటపడే దారులు కనపడక జీవితాన్ని ఓడిపోతాడు. చివరకు యిదంతా యిలా ఎందుకు జరుగుతోందని అతనిలో ‘సత్యశోధన’ మొదలవుతుంది. స్థూలంగా ఇదీ వేర్లు నవలలోని కథ.
తెలుగు నేలమీద దళితుని పరాయీకరణను- అందులోని హింసనీ అమానవీయతని యింత లోతుగా చిత్రించిన నవల అంతకుముందు రాలేదు. తాను చదువుకొన్న చదువులవల్ల తాను తన యింట్లోనే పరాయి వాణ్ణయిపోయనన్న స్పృహ వెంకట్రాముడికి వుంది. సొంత మనుషులకు అతను మానసికంగా, సాంస్కృతికంగా దూరమైపోయాడు. శరీరశ్రమలో సైతం పాలుపంచుకోలేని నిర్వ్యాపారతకు గురయ్యాడు. తండ్రి మాదిరి కుల వృత్తి చెయ్యలేడు. అన్న మాదిరి ముగ్గురాళ్ళగని పనిలోకి వెళ్ళలేడు. చదువు అబ్బని ఇద్దరు తమ్ముళ్ళ మాదిరి రైతుల యిళ్ళల్లో పేడకళ్ళు తియ్యలేడు. గంజు యెత్తలేడు, గొడ్డుకాయలేడు.తల్లి చెల్లెళ్ళ మాదిరి ముగ్గురాళ్ళ గ్రేడింగ్‌కు తాను వెళ్ళలేడు, మాదిగవాడ, అక్కడి మనుషుల జీవితం, సంస్కృతి అతనికి భరింపరానివీ, జగుప్స కల్గించేవి అయ్యాయి. ‘తనకూ తన వాళ్ళకూ మధ్యయేదో అంతరం’ అతని అనుభవానికి వస్తుంది గానీ ఆ సంబంధాలను నిలుపుకొనే ప్రయత్నం అతను చెయ్యడు. హింసాపూరితమైన యీ పరాయీకరణకి మూలాలు ఎక్కడ వున్నాయో అతనికి తెలియదు.తన జాతిగురించి, సమూహం నుంచి తనను తాను స్వయంగా వెలివేసుకుంటాడు. తోటి మనుషుల్లో కలవలేని రోజుల్లోనే మొదలైంది. కులం పేర్న యెదురయ్యే అవహేళనల్ని, అవమానాల్ని తప్పించుకొనేందుకు అతను పుస్తకాల్లో తల దాచుకొన్నాడు. అవి కూడా క్లాసు పుస్తకాలే. మానవశాస్త్రంలో మాస్టర్స్‌ చేసినా అతనికి అంబేద్కర్‌ జీవిత చరిత్ర వంటి పుస్తకాల వునికి కూడా తెలియదు. కులాల సమాజం అతణ్ణి లోలోపలికి ముడుచుకుపోయేలా చేసింది. జీవితాన్ని జయించాలనే తపనలో అతను జీవితాన్నే కోల్పోయాడు.
మీదిపెంట్ల గ్రామం, జిల్లా కేంద్రం కడప, రాజధాని హైదరాబాదు-మూడు కథాస్థలాల్లోనూ వెంకట్రాముడు కులపరంగా ఎదుర్కొన్న న్యూనత, దాన్ని జయించడానికి పడిన సంఘర్షణ భయంకరమైనవి. చచ్చిన గొడ్డు మాంసం తినేవాళ్లు, మడత నాలికగాళ్ళు, గవర్నమెంటు దత్తపుత్రులు, స్కాలర్‌షిప్‌లతో వొళ్ళు బలిసి వాళ్ళు వంటి ముద్రలతో చిన్నప్పటినుంచి -ఊళ్ళో, స్కూల్లో, హాస్టల్లో, యూనివర్సిటిలో అనుభవించిన కులహైన్యం, అవమానాలు అతనిలో క్రోధానికి కారణమయ్యాయి. సొంతపేర్లు సైతం లేని అస్తిత్వవేదనలో అతను రగిలిపోయాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే ‘ఆ రకమైన రొంపి అనుభవానికొస్తే గానీ, అందులోని యాతన అర్థంకాదు…’ తిరగబడలేని తమ తరతరాల కుల రక్తం మీద, కుల మనస్తత్వం మీద, గుండెను దహించే ఆత్మన్యూనతాభావం మీద అసహ్యం’ కలిగింది. గ్రూప్‌ వన్‌ ద్వారా ఆర్‌డివో అయి తమని సాంఘికంగా అణచివేసే వాళ్ళ మీద అధిపత్యం సాధించాలనుకొంటాడు.
ఉద్యోగం వేట కూడా ఎండమావులవెంట పరుగేనని చివరికి గ్రహిస్తాడు.తన అభివృద్ధికి అడ్డం తగిలేది రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన తన కులంలోని క్రీమీలేయర్‌లో వున్న ఎమ్మెల్యే పెంచలయ్య. డిఆర్వో ఓబయ్య లాంటి స్వార్థ శక్తులేనని గ్రహించి విస్తుపోతాడు. వాళ్ళందరికీ ‘కులనిర్మూలన సమితి’ వంటి సంస్థలు మాస్క్‌లుగా ఉపయోగపడతాయనే అవగాన కూడ కలుగుతుంది. వాసు వంటి అగ్రకులానికి చెందిన సానుభూతిపరుల చేతుల్లోనూ, చలపతి వంటి రాజకీయ నాయకుల కనుసన్నల్లోనూ నడిచే ‘కుల నిర్మూలన సమితి’ని దగ్గరగా చూశాకా దాన్ని నిర్వహించే మనుషుల స్వార్థం, వాళ్ళ ఆలోచనల్లోని డొల్లతనం మాత్రమే కాదు. ఆ సంఘం పరిమితిలు కూడా అతనికి తెలుస్తాయి. కానీ వాస్తవాల్ని స్వీకరించే చైతన్యం అతనికి యేర్పడలేదు. క్లాస్‌మేట్‌ చంద్రవతి చూపిన కాలక్షేపం అభిమానాన్ని ప్రేమ అనుకొని కులాంతర వివాహం ద్వారా కులహీనతని అధిగమించవచ్చనే భ్రమలో వుంటాడు.
పరాయీకరణని జయించే ప్రయత్నంలో వెంకట్రాముడిలాండి వాళ్ళు మరింత పరాయీకరణలో కూరుకుపోవడాన్ని ఆయాసందర్భాల్లో కేతు అద్భుతంగా పట్టుకోగలిగారు.
వెంకట్రాముడికి దిశానిర్దేశం చేసే సామాజిక ఉద్యమాలు ఆ రోజుల్లో రాయలసీమలో లేవు. ఆదేకాలంలో ఉత్తర తెలంగాణ పల్లెలు రైతుకూలి పోరాటాలతో అట్టుడికి పోతున్నాయి. ఆ కల్లోల దశాబ్దంలోనే అల్లం రాజయ్య వెలుగులోకివచ్చారు. వెంకట్రాముడి లాంటియువకులు ఉద్యమాల్లో మమేకమయ్యారు. రాజయ్య కొలిమంటుకొన్నది (78-79) నవల నిర్థిష్ట సమాజంలో చోటు చేసుకొన్న సామూహిక కల్లోలాన్ని రికార్డు చేస్తే, విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ వ్యక్తుల మానసిక సంఘర్షణకు అద్ధం పట్టింది.
ముప్పై సంవత్సరాలకు వూర్వం – దళిత అస్తిత్వ స్పృహ వంటి మాటలు సైతం లేని రోజుల్లో దళితాంతరంగ కల్లోలాన్ని, మానసిక సంఘర్షణని, అస్తిత్వ వేదనని అద్భుతంగా ఆవిష్కరించగలగడానికి కేతు యీ నవలని కేవలం దళిత సానుభూతితో మాత్రమే రాయలేదు. అనితరసాధ్యమైన వొక సహానుభూతితో రచయితగా ఆయన దళిత హృదయానికి దగ్గర కాగలిగారు. దళిత సంస్కృతిని కడుపులో తిప్పే కసరు వాసనల్తో సహా చూడగలిగారు.
ఆ సహానుభూతి నుంచే సంక్షేమ హాస్టళ్ళని పట్టణాల్లో నగరాల్లో వెలసిన వెలివాడలుగా అర్థం చేసుకోగలిగారు. అక్కడివిద్యార్థులు ఎదుర్కొనే దుర్భర, దయనీయ పరిస్థితుల్ని ఎత్తి చూపారు. 1978లో ‘వేర్లు’ నవలలో కేతు వర్ణించిన హాస్టళ్ల పరిస్థితికి, 2005లో వచ్చిన కనుంపల్లి రాజారాం ‘ఎదురగ్గి’ నవలలో పరిస్థితికి తేడా యేంలేదు. అధికార మార్పిళ్ళు ఎన్ని జరిగినా సంక్షేమంలో అవినీతి మారలేదు. దళితులపై అణచివేత రాజకీయలు మారలేదు.వాటిని ఎదుర్కొని నిలవరించే ‘వీరదాసు’లాంటి వ్యక్తుల చైతన్యమే తర్వాతి కాలంలో రాయలసీమలో సైతం సామూహిక ఉద్యమంగా రూపొందింది. సంక్షేమ హాస్టళ్ళు విప్లవ విద్యార్థి రాజకీయాలకు పురిటి గదులయ్యాయి, వాటి బీజాల్ని కేతు నికార్సయిన వాస్తవికతావాదిగా ‘వేర్లు’ లో దర్శించగలిగారు.
‘దండోరా’ వంటి ఉద్యమాల్లో సైతం నిర్లక్ష్యానికి గురయిన మాదిగ సాంస్కృతిక కోణాల్ని కేతు విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ నవల ద్వారా అపూర్వంగా అవిష్కరించారు. అందులో భాగంగానే వెంకట్రాముడి తండ్రి సుబ్బడు చెప్పిన ఆది జాంబవుడి కథ ఈ నవలలో వొక ప్రయోజనాన్ని వుద్దేశించి చోటుచేసుకొంది. మాలమాదిగల సాంస్కృతిక మూలాల్ని తెలిపే యీ సమాంతర పురాణం దళితలు ఆత్మగౌరవ ప్రకటనకు మరో రూపం. ‘మనంలేంది రైతులు బతకలేరు, మనంలేంది దేవర్లు లేవు. అందుకనే మన గొప్ప మనది’ అన్న సుబ్బడి ముక్తాయింపులో యిది వ్యక్తమౌతుంది. ‘సరే, మరి -వాళ్ళెందుకు మనల్ని హీనంగా చూస్తారు?’ అన్న వెంకట్రాముడి ప్రశ్న తరతరాలుగా దళితులపై అమలయ్యే అణచివేతకు మూలాల్ని అన్వేషిస్తుంది. ఈ అన్వేషణే ‘వేర్లు’ నవల నిండా పరచుకొని వుంది. మార్క్సు చెప్పిన శ్రమ పరాయికరణ సూత్రం యిక్కడ సమాధానం అవుతుంది. దాని తెలుసుకొనే దిశగానే వెంకట్రాముడి ‘సత్యశోధన’ సాగుతుంది. ఆ సూత్రాన్ని జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు మాత్రమే ‘హరిజనుల జీవితం ఎన్ని రూల్సుకు లోబడి వుంది’ అని అతన్లో పుట్టిన మరో ప్రశ్నకు కూడా సమాధానం లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఊళ్ళో రెడ్ల కుటుంబాల అధిపత్యపోరులో, ముఠా రాజకీయాల్లో కింది కులాలకు చెందిన మాలోళ్ళు వడ్లోళ్ళు, గొల్లోళ్ళు పావులుగా మారి మట్టికొట్టుకుపోయిన వైనాన్ని సైతం అతను అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే రోషిరెడ్డి చేతుల్లో మోసపోయిన దేవదానం చెల్లెలు మేరిపట్ల సానుభూతి చూపగలుగుతాడు. అప్పుడు మాత్రమే తను పుట్టి పెరిగిన సమాజంలో, వాళ్ళ కష్టాల్లో తను భాగం కాగలడు. వాళ్ళ గొడ్డు జీవితం పట్ల అనుకంప చూపగలడు. చదువుతో, చదువు పెంచిన వేరు సంస్కారంతో, స్కాలర్‌షిప్‌లతో, అవి పెంచిన దయ్యాల మర్రిచెట్టు ఊడల్లాంటి భ్రమలతో, స్వార్థంతో, దురాశతో తను కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి నిలబెట్టుకోగలడు. అప్పుడు మాత్రమే తన చుట్టూ వున్న జీవితానికీ, తను కొత్తగా యేర్పరచుకొన్న సంస్కారానికి పునాదులేవో ఆలోచించుకోగలుగుతాడు.
ప్రస్తుతం అమల్లోవున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ చట్రాలు వెంకట్రాముడి లాంటి వాళ్ళు తమ వాళ్ళనుండి దూరమవడానికీ దోహదం చేస్తాయి. ఆ చట్రాన్ని బద్దలు చేయగల వీరదాసుల్ని నవల్లో పాత్రలుగా చేయడం ద్వారా కేతు భవిష్యత్తుని చూడగలిగారు. దళితోద్యమాలు వీరదాసు -వెంకట్రాముల కలయికతోనే బలపడతాయి. అయితే ఆ వెంకటేశు, పెదవోబులు, మునిమామ, సుబ్బడు లాంటి వాడదళితుల్ని వదిలి యింకా ఓబయ్య, పెంచలయ్య, పుల్లమ్మ, చలపతుల చుట్టూనే తిరుగుతున్నాయి కదా అనే ఆవేదన సైతం నవలని యివాళ్టి పరిస్థితులకు అన్వయించుకొన్నపుడు కలగకమానదు.
ఆ విధంగా మార్క్సిజం వెలుగులో దళితుల పరాయికరణని చిత్రించిన ‘వేర్లు’ యివాళ్టికి కూడా ప్రాసంగికంగానే వుంది. మాదిగ ఆత్మగౌరవ పోరాట స్పూర్తితో నాగప్పగారి సుందర్రాజు బోడెద్దుకత (మాదిగోడుకతలు)కి రెండు దశాబ్దాల వూర్వమే మాదిగ వాడల్లోకి వెళ్ళి గొడ్డు మాంసం కోతని కేతు వర్ణించగలిగారు. మాలపిల్ల మాదిగవాడల్లో రెండు కులాలకు వేర్వేరు మంచి నీళ్ళ బావులుండే విషయాన్ని ప్రస్తావించడమే కాదు. దానిలోని అమానుషతని ప్రశ్నించారు. వీటన్నిటినీ సాహిత్యీకరించగలగడానికి కారణం అయనకున్న ప్రాపంచిక దృక్పథమే- ఆ దృక్పథం ఆయనకు మార్క్సిజం తత్త్వశాస్త్రంగా ఆధ్యయనం చేయడంవలనే కలిగింది. రారాలాంటి వారి సాహచర్యం అందుకు తోడ్పడిన మాట నిజమే కానీ సృజనాత్మక శక్తికి విమర్శనాదృష్టిని, పరిశోధనాభినివేశాన్ని జోడించడం ద్వారానే అది సాధ్యమైంది. రచయితగా తన చుట్టూ వున్న మానవ సమాజంలోని చలనాన్ని పట్టుకోగల శాస్త్రీయ దృక్పథం, సైద్దాంతిక అవగాహన కేతులో మెండుగా వుండటంవల్లనే ‘వేర్లు’ నవల అచ్చమైన శిల్పసంపన్నమైన దళితనవలగా రూపొందింది.
విశ్వనాథరెడ్డి రెండోనవల ‘బోధి’
విశ్వనాథరెడ్డి రెండోనవల ‘బోధి’ 1984లో వెలువడింది కథాకాలం -1962కి కొంచెం అటూఇటూ. బోధిలో ప్రధాన పాత్ర చెన్నకేశవ – మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. జీవితంలో నైతిక విలువలగురించి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో వెల్లివిరియాల్సిన స్వచ్ఛమైన ప్రేమ గురించి చెన్నకేశవ మనసులో కలిగే ఆలోచనలు, అతని జీవిత ఆచరణ నవలకు ప్రధాన వస్తువు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనామిక్స్‌ చేసి హైదరాబాదులో చోటమోటా జర్నలిస్టుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టిన చెన్నకేశవ మిత్రులు శ్రీపతి అజీజ్‌ల దృష్టిలో కుటుంబరావుని చదివి చెడిపోయినవాడు. వాళ్ళిద్దరూ చలాన్ని అడ్డం పెట్టుకొన్న స్వేచ్ఛా జీవులు. చెన్నకేశవకు చలంపట్ల, ప్రేమ పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.
‘ప్రేమ పరస్పర సాహచర్యం-ఇద్దరి జీవితాన్ని వెలిగించేది – ఇద్దరి సంస్కారాన్ని పెంచేదీ’ అనే చెన్నకేశవకు తండ్రి వివాహేతర సంబంధాలపట్ల అసహ్యం వుంది. తండ్రి ప్రవర్తనలవల్ల యింట్లో జరిగే ఘర్షణలను చూసి అటువంటి దాంపత్య జీవితం తనకు వద్దని అనుకొంటాడు.
నిజమైన ప్రేమ లేకుండా స్త్రీని తాకకూడదు – అని నిర్దారణకు వస్తాడు. ‘ఒక మగవాడు ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమిస్తే లోకం ఏమీ అనుకోనప్పుడు ఒక స్త్రీ ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమించకూడదా’ అన్న క్లాస్‌మేట్‌ రాణి గాలివాటం జీవితం పట్ల సానుభూతి కల్గివుంటాడు. స్త్రీ పురుషుల విశృంఖల శృంగారాన్ని అంగీకరించాడు. అన్ని విలువల్ని వదిలి అక్రమ మార్గాల్లో పైకెదిగే మిత్రుల్ని ద్వేషించే వాళ్ళని వదులుకొంటాడు. వాళ్ళతో నింఫోమానియక్‌ అని నిందకు గురైన రాణి స్నేహంలో మంచినే చూశాడు. రాణి పరిచయం చేసిన ప్రసూనకు మానసికంగా దగ్గరయి తాను నిర్వచించుకొన్న నిజమైన ప్రేమను ఆచరణలో పెడతాడు.
ఈ నవల ఒక విధంగా విశ్వనాథరెడ్డి స్వీయానుభవాల్లోంచి పుట్టినట్లుంటుంది. చెన్నకేశవలోని ఆదర్శభావాలు, కమ్యూనిస్టు భావజాలంవైపు ఆకర్షణ, జర్నలిస్టు జీవితం, తర్వాత ఆధ్యాపకవృత్తి యివన్ని ఆయన తన జీవితం నుంచే తీసుకొన్నారు. నవలలో చర్చించిన విషయాల్లో చలానికి కుటుంబరావుతో చెక్‌ చెప్పినట్టు తోస్తుంది. చలం 1972 ఫిబ్రవరి 5న సంభవించే జగత్‌ ప్రళయం నుంచి తప్పించుకోడానికి శ్రీశ్రీని అరుణాచలం రమ్మని చెప్పిన ఉదంతాన్ని హేళన చెయ్యడం రచయితలోని హైతిక దృష్టికి వొక ఉదాహణ మాత్రమే. ఏక కాలంలో స్త్రీ పురుషుల మధ్య బహుసంబంధాల గురించి మిత్రులు శ్రీపతి, అజీజ్‌లతో, ప్రసూనతో చెసిన చర్చలు కూడా హేతుబద్దంగానే సాగినప్పటికీ -అవి ఉద్వేగ ప్రధానంగా కూడా వుంటాయి. ఆ ఉద్వేగ గుణమే అతణ్ని ప్రసూనకు మరింత దగ్గర చేస్తుంది.
రాణి స్వేచ్చావర్తనని సింహం నోట్లో తలపెట్టే సర్కస్‌ ఫీట్‌గా పేర్కొన్నప్పటికీ ఆమె మరణం చెన్నకేశవని ఎంతో కదలిస్తుంది. చలం స్త్రీలు కూడా ఎక్కడా సుఖపడలేదు. – పైగా చివరికి శిక్షలనుభవించారని – విమర్శకుల్లో ఒక అభిప్రాయం వుంది. విశ్వనాథరెడ్డి రాణికి చావుని విధించకుండా వుంటే బాగుండేది. చెన్నకేశవ కూడా సంతోషించేవాడు. ఒక మంచి విలువని గెలిపించడానికి – చెడ్డ విలువని ఓడించాలి గానీ – ఆ వ్యక్తిని కాదు.
ఈ నవల పేరుని రచయిత వాచ్యం చేస్తారు. చెన్నకేశవ తన ఊరికి ఎగువ తోటలవైపు వెళ్ళే దారిపక్క రావి చెట్టు దగ్గర క్షణికమైన కామోద్రేకాలకు- శాశ్వత ప్రేమకు సంబంధించిన సంఘర్ణణకు లోనవుతాడు. యౌవనోద్వేగంలో వొకబలమైన ఆకర్షణలో రాధా అనే అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపానికి గురువుతాడు. దరిమిలా ప్రేమ విషయమై స్వచ్ఛత గురించి కొన్ని తీర్మానాలు చేసుకొంటాడు. బోధివృక్షం జ్ఞానోదయానికి పాదయింది. ఆ జ్జానం చెన్నకేశవ ఆచరణలో ప్రతిఫలిస్తూ వుంటుంది.తను ప్రేమించిన ప్రసూనతో ఆ జ్ఞానాన్ని ఎంతో నిజాయితీ పంచుకొంటాడు.
కథనాయకుడు దృష్ట్యా ‘బోధి’ మోదాంతనవల. ‘వేర్లు’ వెంకట్రాముడి ఓటమి విషాదం కలిగిస్తుంది గానీ – ఆ తర్వాతి అతని ఆచరణ గురించి పాఠకుడిలో ఆలోచన మొదలౌతుంది.
నిజానికి చెన్నకేశవ వెంకట్రాముల జీవితానికి, ఆలోచనలకు చాలా తేడా వుంది. వెంకట్రాముడిది అస్తిత్వ సమస్య. చెన్నాకేశవది ఆదర్శాల, విలువల సమస్య. కరువుల రాయలసీమలోనే పుట్టినప్పటికీ చెన్నకేశవకు కులం, పొలం బలం వున్నాయి. వెంకట్రాముడు కూడా యవ్వన సహజమైన ప్రేమలో కూరుకుపోయినప్పటీ కులం కారణంగా అది అపహాస్యానికి గురవుతుంది. మాదిగవాడలో చెన్నకేశవలాంటి వాళ్లు కోరుకునే లేదా వెంకట్రాముడు కొత్తగా నేర్చుకొన్న సంస్కారంతో ఆశించే ప్రేమలకూ, కన్నీళ్లకూ, బాధపడడాలకూ తీరిక వుండదు. అది వెంకట్రాముడికి స్వయంగా అనుభవంలోకి వచ్చిన కఠోర సత్యం. ఇద్దరూ సమకాలీనులే అయినప్పటికీ వారి మన: ప్రపంచాల్లో కదిలే ఆలోచనలు వేరు. ఒకే సమాజంలోని రెండు ప్రపంచాల జీవన సంక్లిష్ఠతని రెండు నవలలు పాఠకుల ముందుంచ గలిగాయి.
రూపం దృష్ట్యా రెండు నవలలూ చిన్నవే అయినప్పటికీ విషయ విస్తృతిపరంగానూ పాత్ర చిత్రణ ఇతివృత్త నిర్వహణరీత్య రెండూ నవలా లక్షణాల్ని కలిగివున్నాయి. ప్రచురణ క్రమంలో బోధి 1984లో వెలువడినప్పటికీ రచనా పద్దతి పరిణతి చూస్తే ‘వేర్లు. వెనకసిరి నవలగా తోస్తుంది. నిజానికి వస్తురీత్యా. 70ల నాటికైనా ‘బోధి’లో అంత వైవిధ్యం కనిపించదు. వేర్లు నవలలో లాగా సంఘర్షణ కూడా లేదు. పాత్రల మధ్య వైరుధ్యాలు చిత్రితమైనప్పుటీకీ అవి సంఘటనలకు దారితీయవు. ఇది బోదిలో కనపించే ప్రధానమైన లోటే అనిపించినప్పటికీ జీవితంపట్ల చెన్నకేశవ దృక్పథాలు, నిజాయితీ ముచ్చటగొలుపుతాయి. చెన్నకేశవలో రచయితే అడుగుడుగునా కనపించడంతో కేతు వ్యక్తిత్వం కూడా మనకు యీ నవలల్లో రూపుకడుతుంది. ఇది యీ నవల ప్రత్యేకత.
స్వీయ జీవినానుభవాలను సృజనాత్మకంగా మలచడంలో రచయిత ఎదుర్కొనే వొక రకమైన యిబ్బంది కూడా కేతు బోధి రాసినప్పుడు అనుభవించినట్లు కనిపిస్తుంది. ఎంతో మెలకువతో తాటస్థ్యాన్ని పాటించిన్పటికీ రచయిత కంఠస్వరం చెన్నకేశవలో దొరికిపోతుంది.
రెండు నవలల్లో ప్రసక్తాను ప్రసక్తంగా రాయలసీమలో చోటు చేసుకొంటున్న ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులు కూడా చిత్రితమయ్యాయి. అవే తర్వాతి కాలంలో కేతు కథలకు ప్రధాన వస్తువులయ్యాయి.
రచయితగా కేతు సాహిత్య సామాజిక నిబద్దతనీ, వ్యక్తిత్వాన్నీ అర్థం చేసుకోవడానికీ వేర్లు, బోధి నవలలు ఎంతగానో తోడ్పడుతాయి.
-ఎ.కె.ప్రభాకర్
-"ప్రాణహిత.ఆర్గ్ " సౌజన్యంతో..

Wednesday, April 17, 2013

రాయలసీమ వ్యాసరచయిత్రులు- పి.వరలక్ష్మి

థ, నవల, నాటకం, వచన కవిత్వం లాగా వ్యాసం కూడా ఆధునిక ప్రక్రియ. వ్యాసం అనగానే ఆధునిక ఆలోచనలు, ఆధునిక భాష (వ్యావహారిక భాష) అని వెంటనే స్ఫురిస్తుంది. రాయలసీమలో మిగతా ప్రాంతాల కన్నా ఆధునికత ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. కారణం రాయలసీమ సామాజిక రాజకీయ స్థితిగతుల్లో వెతుక్కొవచ్చు. 1800 దాకా అస్థిరతతో, పాలెగాళ్ల కలహాలతో నలిగిపోయింది. గ్రామీణ ప్రాంతాలన్నీ పాలెగాళ్ల చిన్నచిన్న రాజ్యాలు కావడంవల్ల ఇక్కడ బలమైన ఫ్యూడల్ పునాదులున్నాయి. నేటికీ ఆ ఛాయలు బలంగా కనిపిస్తాయి. ఇటువంటి సాంఘిక రాజకీయ వాతావరణంలో మిగతా ప్రాంతాల వలె ఆధునిక విద్యావ్యవస్థ చాలా కాలం వరకు లేదు.
                     ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యను ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని 1813 లో ఒక ప్రయత్నం మొదలు పెట్టినా 1840,1850 ల  నాటి వరకు ప్రాధమిక విద్యకూడా అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు 1820 ల నాటికి మిగతా ప్రాంతాల్లో కాలేజీలు తగు సంఖ్యలో ఉండేవి. మద్రాసులో 1717 లోనే క్రిష్టియన్ మిషనరీలు పాఠశాలలు నడిపారు. రాయలసీమలో కులం పునాది కూడా చాలా బలమైనదే. కింది కులాల వారితో పాటు చదివించడానికి నిరాకరించి తమ పిల్లల్ని పాత సాంప్రదాయ పాఠశాలలకు పంపడం  చాలా కాలం వరకు సహజంగా జరిగేది. తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల కూడా ఎంతో మంది చదువు కొనసాగించలేక పోవడంతో పాఠశాలలు మూతబడ్డ స్థితీ ఉంది. ఇక స్త్రీ విద్య గురించి ఆలోచించే అవకాశమే లేదు. 1920 ల నాటికి  గానీ రాయలసీమ మొత్తానికి ఒక కళాశాల వచ్చింది లేదు. మరో వైపు కోస్తా ప్రాంతంలో 1930 ల నాటికే స్త్రీలు చదువుకొని రచనలు చేశారు. 1930ల్లో ఏడిదపు సత్యవతి “ఆత్మచరితం” అనే పుస్తకం రాశారు. సరళ గ్రాంథికంలో మంచి వచనంతో ఆ రోజుల్లోనే స్త్రీల సమస్యలపై, ముఖ్యంగా పాతివ్రత్యం వంటి ధర్మాలపై విమర్శలు సంధించారు. అట్లాగే గురజాడ “దిద్దుబాటు” కంటే ముందే బండారు అచ్చమాంబ కథల గురించి మనకు తెలుసు. ఇక్కడ స్త్రీలు సరిగా అక్షరాలు దిద్దక ముందే కోస్తా ప్రాంతంలో కనపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్లు మహిళా సమాజాలు నడిపారు. బ్రాహ్మణ కుటుంబాల్లో విద్యకు సంబంధించిన ఒక వాతావరణం ఉండేది. పాఠశాలలకు వెళ్ళి చదువుకోకపోయినా ఇంట్లోనే విద్య నేర్చుకొని రచనలు చేసిన వాళ్ళున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఏమైనా ఉండేదా అని పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది.
రాయలసీమలో ఆధునిక రచనకు దోహదం చేసింది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రభావమే కావొచ్చు. ఉన్న సామాజిక చట్రంలోనే తనంతట తానుగా చైతన్యం పొందే వ్యక్తి ఆధునికతకు ఎంతవరకు దోహదం చేస్తాడు, అట్లాగే సామాజిక ఉద్యమాల పాత్ర ఎంత అన్న పరిశీలన ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్గ చైతన్యంతో వచ్చిన సాహిత్యం ఎంతో అంచనా వేయగలిగితే రాయలసీమ వంటి  ప్రాంతాల సామాజిక రాజకీయ స్థితి గతుల్ని, సాహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చేమో.
నా పరిశీలన కున్న పరిమితిని కూడా చెప్పుకోవాలి. “వ్యాసం” అనగానే సామాజిక రాజకీయార్ధిక, విషయాల్ని అర్ధం చేసుకుంటూ చేసే వ్యాఖ్యానం, విశ్లేషణకే పరిమితమయ్యి అటువంటి రచనల కోసం వెతగ్గా నిరాశే మిగిలింది. అన్ని పత్రికలూ కలుపుకుని నెలకు దాదాపు రెండు వేల వరకు వ్యాసాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. రాయలసీమ రచయిత్రుల వ్యాసాలు చాలా పరిమితంగానే ఉండటం వల్ల ఎక్కువగా సాహిత్య పరిశోధన, విమర్శ వ్యాసాలే లభించడం వల్ల నేననుకున్న ఫ్రేం వర్కులో ఇవి ఇమడలేక పోయాయి. ఏదైమైనా సామాజిక అంశాల మీద రోజువారీ ప్రతిస్పందనలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా రాయలసీమ రచయితలదీ అదే పరిస్థితి. ఇదిలా ఉంటే రాయలసీమలో విమర్శ బాగా అభివృద్ధి చెందింది. రచయిత్రుల్లో పరిణతి చెందిన విమర్శకులు ఉన్నారు.
రాయలసీమలో పద్య సాహిత్యం మీద  అవధానాల మీద మోజు ఇప్పటికీ బాగానే ఉంది. 2008 లో కర్నూలు నుండి వెలువడిన రెండు పుస్తకాలు ఆశావాది ప్రకాశరావు కవిత్వంపై, అవధానం పై వచ్చిన సమీక్షలు ఒక ఉదాహరణ.                డా|| శాంతమ్మ ఈ రెండిటితో పాటు భారతావలోకనం, మహిళా దర్శనం వంటి అనేక వ్యాసాలు సాంప్రదాయ దృష్టితో రాశారు. మహాభారతంలో స్త్రీ పాత్రలు అన్న అంశంపై పరిశోధన చేశారు. శాంతమ్మ గారి భాష ఈ యుగంలో కూడా గ్రాంథిక వాసనలతో ఉంటుంది. “అన్ని వేదాల్లోనే ఉన్నాయష స్త్రీల అణిచివేత కూడా” అన్న అంశంమీద ప్రసాదినీ దేవిగారు ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాలను తీసుకొని స్త్రీల పై అణిచివేత ఎలా మొదలైంది అన్న విషయాన్ని వివరించారు. వీరు ఇంకా మను దృష్టిలో మగువ, విలువల చెరలో మహిళ  అన్న వ్యాసం రాశారు. తిరుపతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ యమ్. విజయలక్ష్మి గారు భాషా శాస్త్రాల మీద చాలా మంచి పరిశోధన చేశారు. 1997 నుండి అనేక వ్యాసాలు ప్రచురించడమే కాక ఎన్నో యు.జి.సి. సెమినార్లలో ప్రసంగించారు. భాషకు సంబంధించి 35 పరిశోధన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. మరొక విశేషమేమిటంటే వీరు తెలుగు జాతీయాల, తెలుగు జాతీయ పర్యాయపదాల నిఘంటువులను నిర్మించారు. నిఘంటువును నిర్మించిన మొదటి భారతీయ మహిళగా (లెక్సికోగ్రాఫర్) రికార్డుల్లో కెక్కారు. “జానపద గేయగాథల్లో స్త్రీ” పైన వీరు చేసిన పరిశోధన ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో జానపదాల్లో స్త్రీ స్వరూప చిత్రణ, స్వభావ చిత్రణ, కుటుంబ జీవితం, సాంస్కృతిక జీవితం వంటి అంశాల వివరాలు నమోదు చేశారు.
దళిత స్త్రీ దృక్కోణం నుండి స్త్రీ వాద సాహిత్యాన్ని సమీక్షించిన అరుదైన విమర్శకులు కొలకలూరి మధుజ్యోతి గారు, నీలి మేఘాల్ని సమీక్షిస్తూ స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి, ఆమెకు మొదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి, ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. అని చెలం చెప్పిన దానిలో మూడో వ్యాక్యమే స్త్రీవాద కవిత్వమంతా అంటారు. ఆమె అనుభవమెన్ని రకాలుగా ఉందనేది “నీలిమేఘాలు” కవితా సంపుటి స్పష్టీకరించింది అంటారు. మరో చోట దళిత స్త్రీ జీవిత కోణాలు ఎన్నో వ్యక్తం కావలసి ఉన్నదని, దానికోసం దళిత రచయిత్రులు కృషి చేయాలని, అప్పుడే సంపూర్ణ దళిత స్త్రీ రూపం, ఆకాంక్షలు తెలుస్తాయంటారు. రచయిత్రుల కథల్ని సమీక్షిస్తూ దళితేతర స్త్రీల రచనల్లో దళిత స్త్రీల సమస్యలు, ఆరాటాలు, ఆవేదనలు తక్కువగా ప్రతిపాదితమైనాయని, దళిత సాహిత్యం విశేషంగా విస్తరించినా ఈ దశ నుండి లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుందని అంటారు. నూతన దశాబ్ది చైతన్యాన్ని పురోగతిని దళిత స్త్రీకి అందివ్వగలిగితే ఈ దేశం పురోగతి సాధించినట్టే అని మధుజ్యోతి గారు ప్రకటిస్తారు. “ఎల్లి” నవలలను విశ్లేషిస్తూ ఎరుకల జీవితంతో స్త్రీకి సముపార్జించే శక్తిగా గుర్తింపు ఉందని, మారు మనువు చేసుకునే అవకాశం కూడా ఉన్నదని అయితే ఇవి స్త్రీల పరిధిలో లేక పురుషాధిపత్యం కింద ఉన్నాయంటూనే సభ్య సమాజం వీటి నుండి నేర్చుకోవలసింది ఉన్నదంటారు.
1950-60 ల  కడప జిల్లా  అరసం (రారా,సోదుం సోదరులు) ప్రభావంతో వచ్చిన సంజీవమ్మ గారి విమర్శా వ్యాసాలు, సామాజిక వ్యాసాలు చెప్పుకోదగ్గవి. అభ్యుదయ, విశాలాంధ్ర పత్రికల్లో అనేక సామాజికాంశాల మీద వ్యాసాలు రాస్తుంటారు. “సమాజ పురోగమన చరిత్రకు సాహితీ వికాస చరిత్రను అన్వయించి పరిశీలించడం మార్క్సిజం నేర్పింది” అంటారు సంజీవమ్మ గారు. విమర్శ గురించి చెప్తూ “రచన మానవీయ సంస్కృతిని పెంచేదిగా, హృదయ సంస్కారాన్ని ఇచ్చేదిగా ఉందో లేదో చెప్పాలి. ఇది తేల్చడానికి విమర్శకునికి స్పందించే మనసు, పరిశీలించే, విశ్లేషించే నిశితమైన బుద్దీ రెండూ ఉండాలి” అంటారు. “స్త్రీ వాద సాహిత్యాన్ని పురుషులే ఎక్కువగా చదవాలని, అప్పుడే వారు సలసల కాగే స్త్రీల మనసును చదవగలుగుతారు” అని స్త్రీ వాద సాహిత్య ప్రాశస్త్యాన్ని చెప్తూ చలం స్త్రీ స్వేచ్ఛను ఒక కోణం నుండి చూస్తే నేటి స్త్రీ వాదం దాన్ని ఎన్నో కోణాల నుండి చెప్పింది అంటారు. సంజీవమ్మ గారి నిశితమైన విమర్శ కథల్లో అనవసర పద ప్రయోగాల్ని ఎత్తి చూపెడుతుంది. సానుభూతిని సంపాదించే పద ప్రయోగాలు అసలే వద్దని, సున్నితమైన భావాలు కథా గమనంలో ఇమిడి పోవాలంటారు. విశ్వనాధ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ విశ్వనాధ గొప్ప పండితుడని అయితే ఫ్యూడల్ సంస్కృతిని సమర్ధించడంలో ఆయన  పాండిత్యం, కష్టం అన్నీ నష్టమైపోయాయంటారు.
కడపజిల్లాకే చెందిన మరొక విమర్శకురాలు కిన్నెర శ్రీదేవి గారు అరసం ప్రవేశపెట్టిన ఒరవడిని అందిపుచ్చుకున్న మూడోతరం రచయిత్రుల్లో ఒకరు. ఓల్గా రచనల్ని విశ్లేషిస్తూ ఓల్గా “రాజకీయ కథ”ల్లో పితృస్వామిక మూలాలను ప్రశ్నించగలిగారని అదే “ప్రయోగం” దగ్గరికి వచ్చేసరికి నిర్మాణ రాహిత్యాన్ని, అంతర్గత స్వేచ్ఛాభావాన్ని, సమాజానికి అతీతమైన జీవితానందాన్ని ప్రతిపాదించారని విమర్శించారు. అయితే కేతు విశ్వనాధ రెడ్డి కథల్ని పరిచయం చేస్తూ “మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే” అన్న సూత్రం రచయితకు తెలుసు అంటూ చాలా మందిలానే మార్క్సిజాన్ని అపరిపక్వంగా సూత్రీకరించారు. అట్లాగే త్రిపుర కథల్ని సమీక్షిస్తూ మనిషి నిర్మించుకున్న యంత్రం మనిషిపైనే ఆధిపత్యం చలాయిస్తూ మానవ విలువల పతనానికి దారితీస్తున్నది అంటారు. ఉత్పత్తి సంబంధాలను, ఉత్పత్తి శక్తుల మీద పెట్టుబడి గుత్తాధిపత్యాన్ని అర్ధం చేసుకోగలిగితే పెట్టుబడిదారీ సంస్కృతి విధ్వంసక రూపాన్ని, సమాజంపై దాని ప్రభావాన్ని అంచనా వేయగలిగితే ఇటు సూత్రీకరణలు రావు.
అంతగా గుర్తింపు పొందక పోయినా, రాసింది కొన్ని వ్యాసాలే అయినా కె. సునందగారిది అద్భుతమైన వచనం. “కథలు కబుర్లు” అని ఇటీవల విడుదలైన వీరి పుస్తకంలో కథలు, కవిత్వంతో పాటు రచయిత సొంత అనుభవాలు, ప్రతిస్పందనలతో 12 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. “అమ్మ” నవల, నటి సావిత్రి అభినయం, రిటైర్మెంట్ జీవితం, క్లాస్ రూం కబుర్లు. ఇట్లా ఎన్నో విభిన్న అంశాలపై పాఠకులతో పంచుకున్న భావాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. పుస్తకం రూపంలో ఒక చోట కూర్చితే గాని పట్టించుకోని ఉదాసీనత వల్ల ఇంకెంతో మంది రచయిత్రుల్ని గుర్తించలేకపోవడం తేలిగ్గా క్షమించే నేరం కాదు. ఆ రకంగా ఇది చాలా అసంపూర్ణ పరిశీలన. కుసుమకుమారి గారి “సామైక వ్యాసాలు” పుస్తకం, “సాహిత్యం స్త్రీ చైతన్యం” కూడా నాకు లభించలేదు. అట్లాగే ప్రసాదిని దేవి గారి వ్యాసాల్ని సేకరించలేక పోయాను.
ఉర్ధూ విదూషీమణుల చరిత్రల్ని మనకు పరిచయం చేస్తున్న ఫాతిమ హుసేన్ గారు కూడా రాయలసీమ (కడప) వారే. వీరి వ్యాసం “స్త్రీ జాతి శిరోభూషణం బక్షీబేగం కడపోత్సవాల సావనీర్ లో ప్రచురించబడింది. కడప జిల్లాకు చెందిన పుట్టపర్తి నాగ పద్మిని గారు సంగీత సాహిత్య స్రవంతి, సాహితీ మంజూష , మదర్ థెరిస్సా, మహిళా నోబెల్ గ్రహీతలు వంటి వ్యాసాలు రాశారు. అట్లాగే స్త్రీ సమస్యలపై, మూడనమ్మకాలపై వ్యాసాలు రాసిన పసుపులేటి పద్మావతమ్మ కూడా కడప జిల్లాకు చెందిన రచయిత.
సామాజిక ఆచరణతో పాటు, అందులో భాగంగా సమకాలీన సామాజిక స్థితిగతుల్ని, స్త్రీ సమస్యల్ని వ్యాసాలుగా రాసిన విష్ణుప్రియ గారు గతంలో మహిళా మార్గం ఎడిటర్ గా పనిచేశారు. లేడీస్ బోగీలో పురుషుల చొరబాటు దగ్గరినుండి ఉద్యమంలో భాగస్వాములైన స్త్రీలపై రాజ్యం అమలు చేసే హింస వరకు అనేక అంశాలపై స్పందిస్తూ ఎన్నో వ్యాసాలు రాసారు. అట్లాగే విప్లవ రచయితల సంఘం సభ్యురాలు శశికళ గారు ఎన్నో పుస్తక సమీక్షలు, వ్యాసాలు రాశారు. శశికళ గారికి కథా రచయితగానే ఎక్కువ గుర్తింపు ఉంది. కాల గర్భంలో కలిసిపోయిన త్యాగాల చరిత్రను కొత్తకోణంలో ఆవిష్కరించాలంటూ ముస్లిం మహిళల సాహస గాధలను పరిచయం చేసినా, అటు అనంతపురం ఇటు మహబూబ్ నగర్ కరువు పల్లెలను పరామర్శించినా, దళితస్త్రీ విముక్తికి అ, ఆ లు దిద్దిన సావిత్రీబాయి ఫూలేను ఆవిష్కరించినా చరిత్రను, సామాజిక చలనాల్ని ఎంత అర్ధవంతంగా విశ్లేషిస్తారో అంతే సున్నితంగా పాఠకుల హృదయాల్ని స్పర్శిస్తారు. శశికళ గారి ప్రోత్సాహంతో అనంతపురం లో వి.సుభాషిణి, నాగరత్న వంటి వారు ఇటీవలే వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అనంతపురానికే చెందిన కోడూరి గిరిజ, కోడూరి అరుణ తమ ఉపాధ్యాయ వృత్తిలోని అనుభవాలను, పాఠశాల విద్యార్ధుల సాదకబాదకాలను దినపత్రికల్లో రాస్తున్నారు. “ప్రియదర్శిని” లో వీరి వ్యాసాలు ప్రచురితమైనాయి.
కథా రచయితగా ప్రసిద్ధి చెందిన నిర్మలా రాణి గారు కూడా అనేక వ్యాసాలు రాశారు. 1995 లో మద్దూరు దళిత స్త్రీల భూపోరాట విజయాల్ని వారి త్యాగాలకు, వారి మనో నిబ్బరానికి గుర్తింపుగా చెప్తూ పోరాట క్రమాన్నంతా వివరించారు నిర్మలారాణి. అనంతపురం జిల్లా కరువు ప్రాంతాలను పర్యటించి అక్కడ నడిచే గాయాలవంటి ప్రజల దుఃఖాన్ని కథల, వ్యాసాల రూపంలోకి  అనువదించారు నిర్మలారాణి గారు. స్త్రీ ఆర్ధిక స్వేచ్ఛ, సమానత్వం గురించేగాక ఉరిశిక్ష వంటి అనాగరిక అవశేషాలను హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ వ్యాసాలు రాశారు.
రచయిత్రుల వ్యాసాలను గురించిన పై పరిచయం “కడప మనలో మనం” రచయిత్రుల సమావేశం కోసం చాలా పరిమితమైన కాల వ్యావధిలో సేకరించగలిగిన వ్యాసాలకు సంబంధించినదే. ఇంకా చేయవలసిన అధ్యయనం చాలానే ఉంది.
                                                                                                                          -  పి.వరలక్ష్మి
. ప్రాణహిత.ఆర్గ్ సౌజన్యంతో..   

విమర్శలో రారా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నసింగమనేని-ఆచార్య రాచపాళెం

సింగమనేని నారాయణ గారు సాహిత్యం గురించి సభలలో, సాహితీ మిత్రులతో చర్చించేది అపరిమితం. సాహిత్యం గురించి విమర్శ రాసేది పరిమితం. చర్చల ద్వారా సాహిత్య విమర్శను విస్తరిస్తూ విమర్శ రచన ద్వారా ఉత్తమ సాహిత్యాన్ని, అధమ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు సింగమనేని. ఆయన కథ, నవలా రచయిత. ఆయన విమర్శకూడా ఆరెండింటి మీదనే ఎక్కువ. కొల్లాయి గట్టితేనేమి?, జానకి విముక్తి వంటి నవలల మీద, చాసో రారా, రాజారాం మొదలైన కథకుల మీద సింగమనేని చేసిన విమర్శలో తెలుగు సాహిత్య విమర్శలోని ఆరోగ్యకర ధోరణి, నిబద్ధతకు నిదర్శనాలు. సమాజ సాహిత్యాల సంబంధాలపట్ల, సాహిత్య ప్రయోజనం పట్ల, సాహిత్య కారుల కర్తవ్యం పట్ల స్పష్టమైన అభిప్రాయాలు గల సింగమనేని సాహిత్య విమర్శలో నిక్కచ్చితనం కనిపిస్తుంది. 
సాహిత్యాన్ని గురించి అపారంగా చర్చిస్తూ సాహిత్య సృష్టిని, సాహిత్య విమర్శ సృష్టిని పరిమితంగా చేసే సింగమనేని, విమర్శలో కరుకుదనాన్ని ప్రదర్శించడంలో రారా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లనిపిస్తుంది. ఆయన విమర్శల్ని చదివితే ఆయన్ని మరో రారా అనాలనిపిస్తుంది. ఇలా అనిపించడానికి రెండు కారణాలున్నాయి. 1. సింగమనేని రారా లాగే పాఠకుడి దృష్టికోణం నుంచి రచనను అంచనా కట్టడం. ఏ రచనను విమర్శించినా అది పాఠకుని మీద ఎలాంటి ప్రభావంచూపిస్తుందో చెప్పడం. 2. రచనలో రచయితలో నచ్చిన అంశాన్ని ఎంత మక్కువతో చెబుతారో నచ్చని దాన్ని అంత కటువుగా చెప్పడం, రచయితలు ఎంత పేరుగలిగినవాళ్లైనా వ్యతిరేకించవలసి వచ్చినప్పుడు ఉపేక్షించకపోవడం.
రారా, సాహిత్యం పాఠకుని సంస్కారం మీద ప్రభావం చూపిస్తుందని బాగా ప్రచారం చేశారు. సింగమనేని ఆయన మార్గంలో ఈ అభిప్రాయాన్ని అనేక విమర్శ వ్యాసాలలో ప్రస్తావిస్తూ వచ్చారు. ” రారా కథలన్నీ చదివిన తరువార పాఠకుడి సంస్కార స్థాయి ఒక మెట్టయినా పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు (పాఠకుడి సంస్కారస్థాయిని పెంచే రారా కథలు)” (స్త్రీ వాద కథలు ముఖ్యంగా పురుష పాఠకులను చాలా డిస్టర్బ్ చేశాయి”) ( తెలుగు కథ, 1990 తరువాత) ” చాసోగారు ఎందుకు ‘పారేస్తాను నాన్నా’కథలో పన్నెండేళ్ల కృష్ణుడి అంతరంగం, ఆ తండ్రి సంఘర్షణ, ఆర్ధిక అసహాయత పాఠకుణ్ణి కలచి వేస్తాయి” (చాగంటి సోమయాజులు కథలు) ‘ కల్లేటి వంకా కథ లోని అనైతిక సంబంధాల చిత్రణనుసరించి చెబుతూ, వాటిని చదివిన “పాఠకులు మూర్చ పోవలసిందే” అంటారు. డా. వి. చంద్ర శేఖర రావు 2002లో రాసిన కథలలోని శిల్పాన్ని గురించి చెబుతూ” పిడికెడు విమర్శకుల మెప్పుకోసమే కథలు రాస్తూ అనంతమైన పాఠకుల్ని మరచి పోయారు, చంద్ర శేఖర రావు” అంటారు. (తెలుగు కథ 2002).
ఇలాంటి అభిప్రాయాలన్నీ చదివినప్పుడు బాగా చదువుకున్న సాహిత్య విమర్శకుడు, సామాన్య పాఠకుని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారనిపిస్తుంది. రంగనాయకమ్మ, చంద్ర శేఖర రావు, గోపిని కరుణాకర్ వంటి రచయితలలోని గుణా గుణాలను నిజాయితీగా విశ్లేషించిన సింగమనేని నిబద్ధ విమర్శకుడు.
సింగమనేని సాహిత్య విమర్శనంతటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్యయనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసి వస్తాయి. సాహిత్య సృజన కైనా, సాహిత్య విమర్శకైనా ఆ అభిప్రాయాలు బాగా దోహదం చేస్తాయి. సామాజిక విమర్శకులలో కట్టమంచి నుంచి లెక్క వేసుకుంటే నాలుగు తరాల వాళ్లు కనిపిస్తారు. మార్క్సిజం స్పర్శ లేకుండా సమాజజీవితానికి సాహిత్యం దర్పణంగా, ప్రతిఫలనంగా భావించే కట్టమచి తరంలో రాళ్లపల్లి, పుట్టపర్తి వంటి వాళ్లూ వస్తారు. మార్క్సిజం తెలుగు వాళ్లకు పరిచయమైన తరువాత పునాది ఉపరితల సిద్ధాంతం ప్రకారం సాహిత్యం కళలో ఉపరితలాలుగా భావించే తరం శ్రీ శ్రీ, కొ. కు. ఎం. ఆర్. చంద్ర, పుచ్చల పల్లి వంటి వాళ్లది. ఆ సిద్ధాంతాలను మరింత స్పష్టతతో ముందుకు తీసుకు పోయిన తరం రారా, వల్లంపాటి, కేతు, కొలకలూరి, చేరా, వి. వి. , త్రిపురనేని మొదలైన వాళ్లు. అ తర్వాతి తరంలో వేణు, సింగమనేని, చెంచయ్య, తెలకపల్లి, ఎస్వీ, కాత్యాయని విద్మహే వంటి వాళ్లు ఉన్నారు. ఈ తరంలో మనకు దళిత బహుజన, మైనారిటీ, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వాలు తమదైన ప్రమాణాలతో తెలుగు సాహిత్యం లోకి, విమర్శలోకి ప్రవేశించాయి. సింగమనేని వీళ్లందరినీ అధ్యయనం చేశారు, చేస్తున్నారు.
సింగమనేని సాహిత్యంలో వస్తువులోనే కాదు, శిల్పం లోను వాస్తవికత ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులను, ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువును అందకుండా అడ్డుకునే ప్రయోగాలను, పాఠకుడు ఊహించని మలుపులను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అందుకే ఆయన “స్పష్టమైన ప్రాపంచిక దృక్పధం ఉంటే మెలో డ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చునంటారు (రాయలసీమ కథా చిత్రం). సిద్ధాంతాలకోసం రచన చేయడాన్ని కొడవగంటిలాగే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామాజిక మూలాలు తవ్వి తీయాలి గాని, రచనలు సిద్ధాంతాలు వల్లించకూడదంటారు. రచయితలు సాధించదలచుకున్న ప్రయోజనం కోసం పాత్రల్ని బలిపెట్టకూడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే రచనలో పనిగట్టుకొని ఉపన్యాసాలివ్వడాన్ని, ఆరకంగా కళాధర్మాలను అతిక్రమించడాన్ని సింగమనేని పూర్తిగా తిరస్కరిస్తారు. శిల్ప మర్యాదాతిక్రమణను ఆమోదించని నిబద్ధత విమర్శకులు సింగమనేని. అందుకే ఆయనను క్లుప్తతకు మారుపేరైన చాసో అంటే మహా ఇష్టం. ” ఏ కథలో కూడా (చాసో) రచయిత ప్రవక్త స్థానంలో కూచోడు. “అని ప్రశంసించిందిందుకె. (చాగంటి సోమయాజులు కథలు). సినిమాలలో లాగే కల్పనా సాహిత్యంలో కూడా రచయితల ఆదర్శీకరణ అనే బలహీనతకు లోనై పాత్రల చైతన్య స్థాయికి విరుద్ధంగా పాత్రల్ను చిత్రిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మాటల్ని చెప్పించటం, అసంబద్ధమైన త్యాగాలను చెయ్యించడం వంటి వి చెయ్యిస్తారు. సింగమనేని ఈ అతి పాత్రీ కరణను వాస్తవికత విరుద్ధమైనదిగా భావిస్తారు. అందునే అల్లం రాజయ్య ‘అతడు’ కథలో మితిమీరిన వీరపూజను చూశారు. సింగమనేని (తెలుగు కథ 1990 తరువాత).
ఎంత విస్తృతంగా రచనలు చేసే వాళ్లైనా పునరుక్తులు చెయ్యడం, మూస ధోరణిలో పడిపోవడం ఉపేక్షించదగింది కాదని సింగమనేని భావన. సహజత్వం, అనివార్యత, వైవిధ్యం – ఇవి రచనకు ప్రాణ భూతమైన లక్షణాలుగా సింగమనేని భావిస్తారు. విశ్వసనీయత దెబ్బతింటే రచనా ప్రయోజనం దెబ్బతింటుందని ఆయన హెచ్చరిక చేస్తారు. రచనంతా చదివిన తరువాత రచనలో రచయిత ఏమిచెప్పదలుచుకున్నారో పాఠకుడికి తెలియకపోతే ఆ రచన దండగని కూడా సింగమనేని నిష్కర్షగా చెప్తారు. (తెలుగు కథ 2002).
సాహిత్య రచనలో రచయితలు సామాజిక సమస్యల్ని ఆవిష్కరించి పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి పరిష్కారాలను పాఠకులకే వదిలివేయాలి తప్ప పరిష్కారం చెప్పే భాధ్యతను రచయితలు తీసుకోరాదు అని భావించడంలో సింగమనేని 1935 -40 ల నాటి కొడవగంటి అభిప్రాయాన్ని సమర్ధిస్తారు. చాసో ను ఈ విషయంలో సింగమనేని బాగా మెచ్చుకుంటారు.
మంచి సాహిత్య పఠనం పాఠకుల్ని ప్రభావితం చేసి,వాళ్ళ సంస్కారంలో మార్పులు తీసుకొచ్చి,వాళ్ళను చెడ్డ సాహిత్య పఠన ప్రభావం నుండి కాపాడుతుందని సింగమనేని అబిప్రాయం. యుద్దనపూడి సులోచనారాణి ‘కీర్తి కీరీటాలు’ నవలను గురించి “ప్రజా వ్యతిరేక సాహిత్యాన్ని తిప్పికొట్టగల చైతన్యం పాఠకుడు సాధించినపుడు ఇలాంటి నవలలు తుక్కు కుండీలలోకి చేరుకుంటాయి”అని, రంగనాయకమ్మ “జానకి విముక్తి “నవలను గురించి పాఠకుల్ని భ్రమల్లో ముంచే రంగురంగుల ప్రేమలనుండి మన సాహిత్యం విముక్తి చెందాలి అన్న స్పూర్తినిస్తుందీ అని ఆయన వ్యాఖ్యానించడంలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది
సాహిత్యం భావ ప్రచారానికి బలమైన సాధనం అన్న అభిప్రాయంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. అయితే రారా లాగే ప్రచార వాఙ్మయమంతా సాహిత్యం కాదని సాహిత్యం లో ప్రచార గుణంతో పాటు కళాత్మకత అత్యంత ముఖ్య మైన భాగమని గట్టిగా నమ్ముతారు. తత్వోపదేశంకోసం శిల్ప మర్యాదలను అతిక్రమించరాదని ప్రభోదిస్తారాయన.
ప్రేమ విషయంలోనే కాదు ,ప్రజల జీవితంలో ఏపార్శ్వం పట్లనైనా రచయితలు పాఠకులలో భ్రమలు పెంచరాదన్నది సింగమనేని ధృడమైన అభిప్రాయం. అందుకే ఆయన కాల్పనిక సాహిత్యంలో ఈ బలహీనతను పెంచే రచయితల్ని వ్యతిరేకించారు. పాఠకుల్ని వాస్తవికతా మార్గంలో నడిపించే రచయితల్ని ప్రశంసించారు. కేతు విశ్వనాధ రెడ్డి గారి కథల్ని గురించి చెబుతూ అవి “రంగుల ప్రపంచం నుండి వాస్తవిక ప్రపంచంలోకి పాఠకున్ని నెట్టుతాయి”అనడం ఈ దృష్టితోనే (కేతు విశ్వనాధ రెడ్డి కథలు,ఒక సమీక్ష).
పాఠకులను ఏడిపించి వాళ్లకు కన్నీళ్లు తెప్పించడం సాహిత్య కర్తవ్యం కాదని కొడవగంటి అభిప్రాయం. సామాజిక వాస్తవికత పట్ల, మానవ కార్యం పట్ల అవగాహనకలిగించే క్రమంలో దుఃఖాన్ని వర్ణించడం అవసరమయినా స్త్రీల దుఃఖాన్ని చావుల్ని వర్ణించిపాఠకుల్ని ఏడిపించడం సాహిత్యం ద్వారా సమాజానికి నష్టం చేయడమేనన్నది ఆయన అభిప్రాయం. సింగమనేని ఆతానులో పోగే గనుక ఆ అభిప్రాయాన్నే కలిగియున్నారు. చెడుపట్ల అయిష్టత, కోపం, వ్యతిరేకత కలిగించడమే రచయిత చేయవలసిన పని అనిన సింగమనేని చావును వర్ణించి పాఠకులకు కన్నీళ్లు తెప్పించడం చాసో దృక్పధం కాదు. అని తీర్మానించడంలోని అంతరార్ధమిదే.
రచనలో రచయితలు ఎన్ని కల్పనలు చేసినా ఎన్ని పాత్రలను, సంఘటనలను, సన్నివేశాలను సృష్టించినా వాటి మధ్య అంతర్గత ఐక్యత ఉండాలి. రచయిత రచన మొత్తమ్మీద ప్రతిపాదింప దలుచుకున్న ప్రధాన ప్రయోజనానికి అవి దోహదం చెయ్యాలి. ఇది ప్రాచీన సంప్రదాయ భారతీయ అలంకారికులనుండీ,కట్టమంచి విశ్వనాధ, రారా, కొకుల మీదుగా నేటి దాకా అందరూ చెబుతున్నదే. బహుశా సాహిత్య లోకంలో ప్రాచీనులు ఆధునికులు సంవధించిన ఏకైకాంశం ఇదేననుకుంటాను. సింగమనేని ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. రచయితకుండే మూఢవిశ్వాసాలను పరోక్షంగా పాఠకుడి బుర్రలోకి ఎక్కించాలని ప్రయత్నించే రచయితలకు కొదవలేదు. శిల్పంతో పాఠకులలోకి చాలా చెడును ఎక్కించవచ్చు. అందుకే వస్తువులోనైనా, శిల్పంలోనైననా రచయితలు చేసే కల్పలనను, ప్రదర్శించే విన్యాసాలకు సామాజిక ప్రయోజనం దెబ్బతినని ఐక్యత, అర్ధం, పరమార్ధం ఉండాలని సింగమనేని కోరుకుంటారు. బెజ్జారపు రవీందర్ ” నిత్య గాయాల నది ” కథలోని లోపాన్ని చూపిస్తూ ” వక్త వ్యాఖ్యల మధ్య ఐక్యత లేక పోవటం ఈ కథలోని బలహీనత” అన్నదిందుకే. (కథ 2002).
రాసింది పరిమిత విమర్శ అయినా ఆరోగ్య కరమైన, నేటికి కావలసిన ఆలోచనలు కలిగున్న సాహిత్య విమర్శకులు సింగమనేని. ఆయనది ప్రగతిశీల కొడవగంటి, రారాల మార్గం.
సమాజం పట్ల తనకొక భాద్యత ఉన్నది అని భావించే విమర్శకులెవరూ విమర్శకు రచనే తప్ప రచయిత అతని స్థలకాలాలు, ప్రమాణాలు కావు అని వాదించరు. అనిబద్ధ సాంప్రదాయ విమర్శకులు మాత్రమే అలా వాదిస్తారు. సింగమనేని రచనను ఒక సామాజిక భాధ్యతగా భావించే రచయిత, విమర్శకుడు గనక రచనను స్థలకాల బద్ధమైన మానవ జీవిత ప్రతిఫలనంగా భావిస్తారు గనక, రచయిత జీవితంతో ముడి పెట్టే రచనను విశ్లేషిస్తారు. అలాగే రచయిత స్థలకాలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొల్లాయి గట్టి తేనేమి ( మహీధర రామమోహన రావు ) నవల మీద రాసిన వ్యాసంలో గొప్ప రాజకీయచారిత్రక నవలగా నిర్వచిస్తూ ఆ నవల కథాకాలాన్ని రచనా కాలాన్ని సమన్వయించుకొన్నారు.
ఒక రచయితను గురించో , ఒక రచనను గురించో విమర్శరాయడం చాలా సులువు. ఒక ప్రాంతపు సాహిత్యాన్ని, ఒక కాలపు సాహిత్యాన్ని మొత్తంగా గాని, ఒక ప్రక్రియను గాని విశ్లేషించడం కష్టం. ఈ కష్టమైన పనిని సింగమనేని ” రాయలసీమ కథా చిత్రం” ‘తెలుగు కథ – 1990 తరువాత’, ‘తెలుగు కథ 2002’ వంటి వ్యాసాలలో చేసి చూపించారు. విస్తృతమైన అధ్యయనం, శాస్త్రీయమైన విశ్లేషణ, విజ్ఞానాత్మక సమన్వయం, ఆలోచనాత్మక సూత్రీకరణలు ఇలాంటి విమర్శకు చాల అవసరం. సింగమనేని విమర్శలో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి.
సులభమైన భాషలో, సుందరమైన శైలిలో అభిప్రాయ ప్రకటన, అవసరమైనప్పుడు పదునైన వాక్య నిర్మాణం సాహిత్య విమర్శకు మేలు చేస్తాయి. సింగమనేనిలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. పంటికింది రాళ్లలా పడికట్టు పదాలు లేని భాష సింగమనేనిది. సరళమైన వాక్యాలు, చక్కని తర్కం, సమాజం పట్ల సాహిత్యం పట్ల మక్కువతో కూడిన వివరణ సింగమనేని విమర్శ శైలిని పాఠకులను ఆకర్షిస్తుంది.
సాహిత్య విమర్శ ఎదిగిందా అని రచయితలు, సాహిత్యం ఎదిగిందా? అని విమర్శకులు అప్పుడప్పుడు కుస్తీకి దిగుతుంటారు. ఇవి అనవసరం. వస్తున్న విమర్శను చదువుకొని జల్లెడ పట్టుకుంటే చాలు. అలా జల్లెడ పట్టితే సింగమనేని విమర్శ ఎదుగుతున్న తెలుగు సాహిత్య విమర్శకు ఒక తార్కాణం గా నిలుస్తుంది.
సింగనేనిది వాస్తవికతావాద విమర్శ. అది కొడవగంటి, రారాల మార్గం
-ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి  
ప్రాణహిత.ఆర్గ్ సౌజాన్యంతో.. 

నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు కల్లూరి- -అంకె శ్రీనివాస్

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఆ వారసత్వం నేటికీ కొనసాగుతోంది
. కట్టమంచి రామలింగారెడ్డి నుండి ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైనదని తెలిసిందే. అదేవిధంగా తొలి తరం తెలుగు సాహిత్య చరిత్రకారులెైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి వంటివారి కృషికి కాస్త సమాంతరంగానే రాయలసీమ నుండి కూడా గొప్ప సాహిత్య చరిత్రకారులు తెలుగు చారిత్రక విమర్శ రంగస్థలం మీదికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన తొలి వ్యక్తి ‘కవిత్వవేది’గా పరిచితమైన కల్లూరి వేంకట నారాయణరావు.
కల్లూరి వేంకట నారాయణరావు.

రాయలసీమలో ఆధునిక సాహిత్యం కొంత ఆలస్యంగా ఆవిర్భవించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. అయితే ఆలస్యమై నప్పటికీ ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిలో అపురూపమైన ప్రయోగాలు, అభివ్యక్తులూ జరిగాయి, జరుగుతున్నాయి. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఆ వారసత్వం నేటికీ కొనసాగుతోంది. కట్టమంచి రామలింగారెడ్డి నుండి ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైనదని తెలిసిందే. అదేవిధంగా తొలి తరం తెలుగు సాహిత్య చరిత్రకారులెైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి వంటివారి కృషికి కాస్త సమాంతరంగానే రాయలసీమ నుండి కూడా గొప్ప సాహిత్య చరిత్రకారులు తెలుగు చారిత్రక విమర్శ రంగస్థలం మీదికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన తొలి వ్యక్తి ‘కవిత్వవేది’గా పరిచితమైన కల్లూరి వేంకట నారాయణరావుకవిత్వవేది రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము’ నేటితరం సాహిత్య విద్యార్థులకు, సాహితీ వేత్తలకు అంతగా పరిచయం లేకపోవచ్చుగాని, ఒకప్పుడు విద్వాన్‌, ఎంఏ వంటి ఉన్నత పరీక్షలకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి తమకు ఎంఏలో పాఠ్యపుస్తకంగా వుండేదని ఒక సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

కవిత్వవేది వారే రచించిన ‘19వ శతాబ్దపు ఆంధ్రవాఙ్మయ చరిత్రము’ అనే నామాంతరం కలిగిన ‘వీరేశలింగ యుగం’ అనే పుస్తకం మాత్రం 1999 నుండి 2005 వరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉంది. రాజమండ్రిలో బి.టి. చదివే రోజుల్లో అక్కడి గోదావరి ప్రవాహ ఝరి, నన్నయకు ప్రోత్సాహాన్నిచ్చిన రాజమహేంద్రపుర చరిత్ర వంటివి కవిత్వవేదికి స్ఫూర్తినిచ్చి విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాసుకున్న తెలుగునోట్సే చిన్న చిన్న మార్పులతో ఆంధ్రవాఙ్మయ సంగ్రహంగా అవతరించింది. కళాశాలలో ఆంధ్రపాఠ్య పుస్తకాలెైన ఔౌ ట్చజ్టీటఛఠటడ వంటివే స్ఫూర్తి. ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహాన్ని 1928లో వావిళ్ళ రామశాస్త్రులు వంటి ప్రసిద్ధ ముద్రణాధిపతులు ముద్రించారు. కేవలం 8 సంవత్సరాలకు ద్వితీయ ముద్రణ వేయాల్సి వచ్చిందంటే ఈ గ్రంథానికి కలిగిన ఆదరణే ముఖ్య కారణం.ఈ గ్రంథం సాహిత్య చరిత్ర రచనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ప్రక్రియా భేదాలను, రాజవంశాలను కలిపి రచించారు. ఇందులో నన్నయ యుగం, తిక్కన యుగం వంటి మహాకవుల ప్రభావంవల్ల కూడా యుగవిభజన చేసినట్లుగా సూక్ష్మంగా కనిపి స్తుంది. ఈ యుగ విభజన ఆరుద్ర, జి.నాగ య్య వంటి తరువాతి చరిత్రకారులకు మార్గదర్శకమైంది. ఈ రచన మీద కందు కూరి, గురజాడ శ్రీరామమూర్తి ప్రభా వం ఉంది. కొమర్రాజు విజ్ఞాన సర్వస్వం, చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర వంటి నాటిి పరిమిత చారిత్రక ఆధారాలతోనే ఈ గ్రంథాన్ని రచించారు.

అయితే చరిత్రను, సాహిత్యాన్ని సమన్వయం చేసిన తీరు మాత్రం ముచ్చటేస్తుంది. అందుకే యుగ లక్షణ నిరూపణ చాలా స్వతంత్రంగా చేశారని చిలుకూరి నారాయణరావు పీఠికలో ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు.ప్రథమాధ్యాయంలో (ప్రథమ ఖండం) ఆంధ్రజాతి, ఆంధ్ర భాష ఆవిర్భావ వికాసాల గురించి వివరించారు. కవిత్వం, కళ వంటి వాటి గురించి సనాతన ధృక్ఫథంతోనే చర్చించారు. పాశ్చాత్య కవిత్వ సంప్రదాయాలను, అప్పటికే జన్మించి, ప్రవర్ధమానమవుతున్న ఆధునిక కవిత్వ ధృక్ఫథాన్ని ఏమాత్రం స్పర్శించలేదు. అయితే ప్రాచీన సాహిత్య అలంకారిక సైద్ధాంతిక పునాదిమీదే చర్చించినప్పటికీ పిడివాదిగా కాకుండా జాగ్రత్త పడ్డారు. కవితాశెైలి గురించి ప్రథమాధ్యాయంలో లోతుగా చర్చించిన కవిత్వవేది, తరువాతి అధ్యాయాల్లో కవుల శెైలి గురించి పెద్దగా మాట్లాడక పోవడం కొంత ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. అదేవిధంగా కవిత్వానికి ఛందస్సు ఎంతవరకు అవసరం? అన్నదానిమీద ఆసక్తికరంగా చర్చించి కవి భావనాశక్తిని పద్యం మాత్రమే నిర్ణయించలేదని సంస్కృత బాణుని కాదంబరిని గుర్తు చేశారు.

ఆనాటికి ఇలా వ్యాఖ్యానించడం చాలా గొప్ప విషయమే కాదు, ఆయన వ్యక్తిగతంగా పద్యకవి కూడా?
రావణ ఆంధ్రవ్యాకరణం క్రీ.శ. 12 శతాబ్దాలనాటికే రావడం వల్ల భాషాప్రాచీనత గురించి కొంత అంచనా వేశారు. రావణుడు అనే వెైయ్యాకరణుడు క్రీ.శ.1వ శతాబ్దిలోనే ఒకడుండేవాడనే విషయాన్ని ఆతరువాతి సాహిత్య చరిత్రకారులు ఏమాత్రం పట్టించు కోలేదు.ఈ మధ్యనే రెండు మూడు సంవత్సరాల క్రిందట వెలిదండ్ల నిత్యానందరావు లుప్తమైపోయిన రావణుని వ్యాకరణం గురించి ఒక అపురూప పరిశోధనా వ్యాసం రాశారు. ‘యాప్పరుంగలం’ అనే తమిళగ్రంథం చెప్పిన ‘వాంఛియార్‌’ (రేంచియార్‌) అనే ప్రాచీన తెలుగు లక్షణ ఛందోకారుడు ‘రేచన’ అయ్యిండవచ్చా? అనే ఒక సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా తర్వాతి వారు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే కొన్ని విషయాల్లో శాస్త్రీయత కన్పించదు. నారాయణభట్టు, మల్లికార్జున పండితులకు బంధుత్వం ఉన్నదేమోనని అనుమానపడ్డారు. అందుకు ఆయన చెప్పిన కారణం వారిద్దరూ ‘వానస’ వంశస్థులు కావడం! అదేవిధంగా నన్నేచోడుని గురువు మల్లికార్జునుడు110 సంవత్సరాలు జీవించారని వ్యాఖ్యానించారు.

మల్లికార్జునుడు యోగి కాబట్టి ఎక్కువ కాలం జీవించారని సమర్థించారు. నన్నెచోడుని గురువు జంగమ మల్లికార్జునుడు, మల్లికార్జున పండితుడు వేర్వేరన్న విషయం ఆనాటికి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇటువంటివి అక్కడక్కడ కనిపించినా నేల విడిచి సాము చేయలేదు. ఆనాటికి లభించిన సంక్షిప్తమైన చారిత్రక సమాచారంతో రాయడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగాయి. అందుకే కవుల గురించి, వారి కాలం గురించి అక్కడక్కడా ఇటువంటివి కన్పిస్తాయి.
1910లో ప్రారంభమైన గిడుగు వ్యవహార భాషా ఉద్యమ ప్రభావం 1928లో కవిత్వవేది రాసిన ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము’ మీద చాలా తక్కువ. గాంభీర్యమైన గ్రాంథికంలోనే రచించారు. 37 సంవత్సరాల తర్వాత 1965లో ‘వీరేశలింగ యుగము’ రాశారు. మొదటి రచనకు కొనసాగింపే తర్వాతి రచన. మొదటి గ్రంథంలో ఆధునిక సాహిత్యావిర్భావానికి కారణాలు పెద్దగా చర్చించలేదు. అందువల్లనే రెండవ రచన చేసినట్లుగా కనిపిస్తుంది. రెండు రచనల మధ్య రచయిత ధృక్ఫథంలో కొంత స్పష్టమైన మార్పు కన్పిస్తుంది.

మొదటి రచన మూర్తీభవించిన గ్రాంథికం, రెండవది సరళ గ్రాంథికం. రెండవదాని మీద గిడుగు వ్యవహారిక భాషోద్యమ ప్రభావం ఉంది. రచనలో ఒకటి రెండుసార్లు గిడుగు ప్రస్తావన కూడా కన్పిస్తుంది. సనాతన సంప్రదాయంతో మొదటి రచన చేస్తే, సామాజిక పరిణామాల్ని అవగాహన చేసుకొని రెండవ రచన చేశారు. స్థల కాలాల ప్రభావం రెండవదాని మీద చాలా ఎక్కువ. మొదటి రచనలో కనిపించే అంచనాలు రెండవదానిలో లేవు. ఖచ్చితత్వం రెండవదానిలో చాలాస్పష్టం. 18వ శతాబ్ది రెండవ అర్ధభాగం నుండి 20వ శతాబ్ది మొదటి పాతికవరకూ జరిగిన తెలుగు సాహిత్య కృషిని లోతుగా విశ్లేషించారు. అయితే ఆయన గ్రాంథికంలోనే రాసినా రెండు రచనల మీద రాయలసీమ మాండలిక ప్రభావం మాత్రం ఉంది.‘వీరేశలింగ యుగము’లో రాయలసీమపట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరిచారు. మధ్యాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని, దక్షిణాంధ్రం (రాయలసీమ), ఉత్తరాంధ్రలే వెనుకబడ్డాయని వాపోయారు.

నేటి శ్రీకృష్ణ కమిషన్‌ తేల్చింది కూడా ఇదే కదా! సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి మహానుభావులు తెలంగాణను జాగృతం చేసినట్లు రాయలసీమను జాగృతం చేసే నాయకత్వ లేమికి బాధపడ్డారు. కట్టమంచి రామలింగారెడ్డి గొప్పస్థానంలో ఉండికూడా రాయలసీమకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇక్కడ ఒక ముఖ్యవిషయం గురించి మాట్లాడాలి. నేటి సమకాలీన సాహితీవేత్తలెైన వల్లంపాటి, సింగమనేని, రాచపాళెం వంటివారు రాయలసీమలో ఆధునిక సాహిత్యం ఆవిర్భావం ఆలస్యం కావడానికి గల కారణాల్ని ఈ మధ్యకాలంలో విశ్లేషించారు. ఇందుకుగల రెండు కారణా లను 1965లోనే కవిత్వవేది గుర్తించారు. మాడపాటి, సురవరం వంటి అభ్యుదయ ధృక్ఫథం కలిగిన నాయకులు రాయలసీ మలో లేకపోవడం ఒక కారణంగా చెప్పారు. అంతేగాక ‘ఒక పత్రికగాని, ఒక పరిషత్‌గాని, ఒక భాషోద్యమ నాయకుడుగాని, ఒక గొప్పదాతగాని రాయలసీమలో మచ్చుకైనా లేనప్పుడు ముందంజ వేయుటెట్లు?’ అనే మరో ముఖ్య కారణాన్ని కూడా తెలియజేశారు.

బండారు అచ్చమాంబను తొలితరం సాహితీ వేత్తగా ఏమాత్రం గుర్తించలేదని నేటి సమకాలీన తెలంగాణ వాదులు బాధపడడం చూస్తున్నాం. కవిత్వవేది బండారు అచ్చమాంబను 1965లోనే తమ వీరేశలింగ యుగములో ప్రత్యేకంగా కీర్తించారు.1965 నాటికి జరిగిన 20వ శతాబ్దపు సాహిత్యాన్ని కూడా క్లుప్తంగా ‘వీరేశలింగ యుగము’లో చర్చించారు. శ్రీశ్రీ ‘మహాప్రస్థాన భేరి ధ్వనులలో రాపిడి ఎక్కువెైన అగ్నిజ్వాలల్ని’ మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. శ్రీశ్రీకి అడుగుజాడెైన గురజాడనెైతే నెత్తికి ఎత్తుకున్నారు. ‘అభ్యుదయ కవితా పితామహుడని’ కొనియాడారు. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, కవికొండల, కరుణశ్రీ, చలం, గడియారం, దూర్భాక రాజశేఖర శతావధాని వంటి అనేకమందిని పరామర్శించి ఒక్క జాషువాను వదిలేయడం మాత్రం చాలా శోచనీయం.
ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము 1967నాటికి మూడు ముద్రణలు వేయించుకుంది. కవిత్వవేది రెండు రచనలు పునర్ముద్రణ జరగాల్సిన అవసరం ఎంతెైనా ఉంది.రాయలసీమలో కవిత్వవేది తర్వాత సాహిత్య చరిత్ర రచన చేసినవారు కల్లూరి అహోబలరావు. ‘రాయలసీమ రచయితల చరిత్ర’ పేరుతో నాలుగు సంపుటాలు వెలయించారు. ఇందులో కులం, గోత్రం, వంశం వంటి వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సాహిత్యానికి ఇచ్చినట్లుగా కనిపించదు. కేవలం కవుల రచనలు, ఒకటిరెండు పద్యాలు ఉటంకించడంతోనే నాలుగు సంపుటాలూ కొనసాగాయి. అందువల్ల పెద్దగా జనాదరణ పొందలేదనే చెప్పాలి. వీరిద్దరి తర్వాత కూడా సాహిత్య చారిత్రక కృషి రాయలసీమనుండి గొప్పగా జరిగింది.

కట్టమంచికి అటు, ఇటు- రాయలసీమ సాహిత్య విమర్శ-చీమల లలిత

‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగా రెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి
జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతా రామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు 140 ఏళ్లకు మించిన చరిత్ర ఉంది. 1876లో వచ్చిన కందుకూరి వీరేశలింగం పంతులు ‘విగ్రహతంత్రం విమర్శనము’ అనే గ్రంథం ఆధునిక కాలంలో వచ్చిన తొలి విమర్శ గ్రంథంగా పేరు పొందగా, కట్టమంచి రామలింగారెడ్డి 1914లో ప్రచురించిన ‘కవిత్వ తత్త్వ విచారము’ తొలి తెలుగు ఆధునిక సాహిత్య విమర్శ గ్రంథంగా పేరు పొందింది. అయితే ‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగారెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతారామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగా రెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతా రామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.


కట్టమంచి రామలింగారెడ్డి విద్యార్థి దశలోనే 1899లో ‘కళాపూర్ణోదయం’ మీద ఆధునిక దృక్పథంతో ప్రసంగించాడు. ఆ ప్రసంగమే 1914లో ‘కవిత్వ తత్త్వ విచారము’గా రూపాంతరం చెందింది. కట్టమంచి ఈ గ్రంథంతో పాటు అనేక వ్యాసాలు, పీఠికలు రాశారు. తాను విమర్శ రాయడమేగాక తెలుగు సాహిత్య విమర్శ విస్తరించడానికి అనేకమందిని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సహించిన వారిలో మొదటి వ్యక్తి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఆయన ‘వేమన’, ‘సారస్వతాలోకము’, ‘నాటకోపన్యాసములు’తో పాటు అసంఖ్యాకంగా పీఠికలు రచించారు. ఆయన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించిన విమర్శకులు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇప్పటిదాకా తెలుగు సాహిత్య విమర్శ అధ్యయనం రాయలసీమ పరిధిలో ప్రధానంగా కట్టమంచి, రాళ్లపల్లి ఈ ఇద్దరి చుట్టే తిరిగింది. కొంతవరకు పుట్టపర్తి అధ్యయనం కూడా జరిగింది.

అయితే రాయలసీమ నుంచి వచ్చిన సాహిత్య విమర్శ ఇంత మాత్రమే కాదు. కట్టమంచికి ముందు- వెనుక ఇంకా చాలా ఉంది. ప్రారంభం నుంచి 1950 దాకా రాయలసీమ సాహిత్య విమర్శ తొలిదశగా గుర్తిస్తూ పైన పేర్కొన్న ముగ్గురికన్నా మించి జరిగినదేమిటో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం. నిజానికి తెలుగు సూర్యుడుగా పేరుపొందిన సి.పి బ్రౌన్‌ వేమన పద్యాలను వెలికి తీసి, వాటిని ఆంగ్లంలోకి అనువదించి, ముందు మాటలు రాయడంతో రాయలసీమ సాహిత్య విమర్శ ప్రారంభమైందని భావించవచ్చు. బ్రౌన్‌ ఈ పనిని 1924-29 మధ్య చేశారు. ఆయన కడప నుంచి పండితుల సహాయంతో గ్రంథ పరిష్కరణ శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. నిఘంటువులు రూపొందించి, వాటిలో వ్యవహారిక పదాలను చేర్చారు. ఛందస్సు, వ్యాకరణం మీద కృషి చేశారు. వేమన పద్యాల సంకలనాలకు ఆయన రాసిన ముందుమాటలు ఆయన కవిత్వ పరిశీలనాసక్తిని తెలియజేస్తున్నాయి.

రాయలసీమలో పుట్టిన తొలి విమర్శకుడు రొద్దం హనుమంతరావు. ఈయన అనంతపురం జిల్లావాసి. ఈయన 1894-1947 మధ్య కొన్ని వ్యాసారాలు రాశారు. అముద్రిత గ్రంథ చింతామణిలో 1894 సంవత్సరం డిసెంబరు నెల సంచికలో అనంతపురం జిల్లాకు చెందిన రొద్దం హనుమంతరావు ‘బిల్వేశ్వరీయ కృతి విమర్శనము’ అనే వ్యాసాన్ని రాశారు. ఇది ప్రసిద్ధ గ్రాంథిక భాషావాది కొక్కొండ వేంకటరత్నం పంతులు రాసిన ‘బిల్వేశ్వరీయ’ కావ్యాన్ని నిశితంగా విమర్శించిన వ్యాసం. బిల్వేశ్వరీయ కావ్యాన్ని భారతం, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన రచనలతో పోల్చి ఇతివృత్తం, వర్ణన, పద్యం, శైలి, ఛందస్సు మొదలైన అంశాలలో కనిపించే లోపాలను ఎత్తి చూపారు. రొద్దం వారి వ్యాసాన్ని ఖండిస్తూ పి. నరసయ్య, దుర్ముఖి సంవత్సరం, శ్రావణ మాసంలో కొక్కొండ వేంకటరత్నం పంతులు సంపాదకత్వంలో వస్తున్న ‘శ్రీ మదాంధ్ర భాషా సంజీవని’ పత్రికకు ఒక లేఖ రాశారు. దానికి స్పందిస్తూ అదేపత్రికలో రొద్దం హనుమంతరావు ‘శ్రీ మదాంధ్రభాషా సంజీవనీ విమర్శనం’ అనే వ్యాసం రాశారు. నరసయ్యలాంటి వారి సహాయంతో కొక్కొండ ప్రతిపక్షాలవారిపై దండెత్తుతున్నాడని కూడా ఆక్షేపించాడు.

‘వాసుదాసు’గా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు రాసిన కావ్యం ‘కుమారాభ్యుదయము’. ఈ కావ్యంమీద 1897 ఫిబ్రవరిలో రొద్దం హనుమంతరావు ‘కుమారాభ్యుదయ కృతి విమర్శనము’ అనే వ్యాసం రాస్తూ అందలి గుణదోష విచారణ చేశారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము’ను వేదం వెంకటరాయశాస్త్రి ‘ఆంధ్రాభిజ్ఞానశాకుంతలము’గా అనువదించారు. దీనిమీద రొద్దం హనుమంతరావు ‘ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలకృతి విమర్శనము’ అనే పేరుతో లేఖ రాశారు. ఇది ప్రశంసాపూర్వకమైన అభిప్రాయం. ఆముద్రిత గ్రంథ చింతామణి ‘మయూఖము’ అనే శీర్షికలో వెలువరించిన లేఖలే శ్రీమధాంధ్ర భాషా సంజీవనీ విమర్శనము, ‘ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలకృతి విమర్శనము’.

కోలాచలం శ్రీనివాసరావు తన తొమ్మిదవ సంవత్సరంలో హంపి దగ్గరున్న కమలాపురం నుంచి 1863లో రాయలసీమ సాంస్కృతిక రాజధానైన బళ్లారికి వచ్చారు.1895వ సంవత్సరంలో ‘సునందనీ పరిణయము’ అనే నాటకాన్ని ప్రచురించారు. వీరినాటకాన్ని అముద్రిత గ్రంథ చింతామణి పత్రికాధిపతి అయిన పూండ్ల రామకృష్ణయ్య అదే సంవత్సరం విమర్శించారు. దానికి సమాధానంగా కోలాచలం శ్రీనివాసరావు 1895 అక్టోబర్‌ 16వ తేదీన ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. (కోలాచలం శ్రీనివాసరావు సంగ్రహజీవిత చరిత్ర19వ పేజి) మళ్ళీ పూండ్ల రామకృష్ణయ్య 1896 ఏప్రిల్‌లో అముద్రిత గ్రంథ చింతామణిలో ఆ గ్రంథం మీద విమర్శ చేశారు. వీరి మరో నాటకం ‘సుఖమంజరీ పరిణయము’.

దీనిని 1897లో పూండ్ల అముద్రిత గ్రంథ చింతామణిలో విమర్శించగా, దానికి సమాధానం ‘శశిరేఖ’ పత్రికలో (ఎస్‌. గంగప్ప, కోలాచలం శ్రీనివాసరావు సంగ్రహజీవిత చరిత్ర, పేజి19) సమాధానమిచ్చారు. కోలాచలం శ్రీనివాసరావు ‘ఖీజ్ఛి ఈట్చఝ్చ్టజీఛి ఏజీటౌ్టటడ ౌజ ్టజ్ఛి గిౌటజూఛీ‘ (ప్రపంచ నాటక చరిత్రము) అనే విమర్శనా గ్రంథాన్ని ఆంగ్ల భాషలో 1908లో ముద్రించారు. ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసి ప్రపంచ నాటక చరిత్రము, నాటక లక్షణాలు మొదలైన వాటిని గురించి వివరించారు.అంతేగాక వేదాలు, భారతం, భాగవతం మొదలైన వాటి గురించి వ్యాసాలు రాశారు.

వీటిని ఆధారంగా చేసుకొని రాయలసీమలో సాహిత్య విమర్శకు సిపి బ్రౌన్‌ తర్వాత పునాదులు వేసిన వారు విమర్శకులు రొద్దం హనుమంతరావు, కోలాచలం శ్రీనివాసరావు అని చెప్పవచ్చు. 19వ శతాబ్ది చివరి రోజుల్లో ఈ కృషి జరిగింది. 1914లో కట్టమంచి ‘కవిత్వ తత్త్వ విచారము’తో తెలుగు సాహిత్య విమర్శనాన్ని ఆధునిక మార్గం పట్టించిన విషయం ఇప్పటికే బాగా స్పష్టమైంది. ఆ తర్వాత ‘వ్యాస మంజరి’ (1947) వచ్చింది.1950లో కట్టమంచి రాసిన ఐదు వ్యాసాల సంకలనమే ‘పంచమి’. ఆయన మరణించిన తర్వాత 1983లో ఆయన పీఠికలు ఒక పుస్తకంగా వచ్చాయి.

కట్టమంచి చేసిన ఈ మొత్తం కృషి తెలుగు సాహిత్య విమర్శ ప్రయాణాన్ని నిర్దిష్ఠం చేసింది. ఇందులో ఆయన అధ్యక్షోపన్యాసం, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడానికి బాటలు వేసింది. ఆ వ్యాసంలోని ఆయన అభిప్రాయాలనే తర్వాత మార్క్సిస్టులు అంది పుచ్చుకున్నారు. కట్టమంచి సామాజికవాదే కానీ మార్క్సిస్టు కాదు. అయినా ఆయన విమర్శ పద్ధతి మార్క్సిస్టు సాహిత్య విమర్శకు తోడ్పడింది. ముఖ్యంగా ‘దేశ చరిత్రము, భాషా చరిత్రము నిత్య సంయోగములు’ వంటి సూత్రాలు ఏ భావజాలం కలిగిన విమర్శకులకైనా నేటికీ అనుసరణీయాలుగా ఉన్నాయి.

కట్టమంచి ప్రోత్సాహంతో ఆయన శిష్యప్రాయుడుగా తెలుగు సాహిత్యరంగంలోకి ప్రవేశించిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ స్వీయ వ్యక్తిత్వం గల విమర్శకుడిగా ఎదిగారు. ‘వేమన’ అనే గ్రంథంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఇవాళ కూడా అనేకులు పునరుద్ఘాటిస్తు న్నారు. 1928 అక్టోబర్‌లో రాళ్ళపల్లి వేమన మీద వరుసగా ఏడు రోజులు అనంతపురం కళాశాలలో చేసిన ప్రసంగాలే ‘వేమన’. ఒక కవి నివసించిన సమాజానికి ఆ కవి సాహిత్యానికి సమన్వయం చెబుతూ విమర్శరాసే పద్ధతికి రాళ్లపల్లి శ్రీకారం చుట్టారు.

‘సారస్వతాలోకనము’ వ్యాసాలు 1931-1949 మధ్య వచ్చాయి. అంతా చదివితే- తెలుగు ప్రబంధ సాహిత్యం కొందరు భావించినట్లుగా శూన్యంలోనుంచి పుట్టలేదని, అప్పటి సామాజిక పరిస్థితుల్లోనుంచే పుట్టిందని ఆయన సిద్ధాంతం చేసినట్లు అర్థమవుతుంది. కట్టమంచిని గౌరవిస్తూనే- ఆయన ప్రతిపాదించిన సహజత్వ సిద్ధాంతాన్ని వినయంగా వ్యతిరేకించినట్లు రాళ్లపల్లి నాటకోపన్యాసాలు రుజువు చేస్తాయి. కట్టమంచి, రాళ్లపల్లి- ఈ ఇద్దరి విమర్శనాకృషి తెలుగులో రెండు పాయలకు పునాది వేసినట్లుగా భావించవచ్చు.

1913లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు ’సాక్షి’ వ్యాసాలు తెలుగు సృజనేతర సాహిత్య ప్రక్రియలలో సంచలనం సృష్టించాయి. అందులో అనేక భాషా సాహిత్యాంశాలు కూడా చర్చకు వచ్చాయి. అంత ప్రాచుర్యం రాలేదు కానీ, అనంతపురం జిల్లానుంచి ‘శ్రీసాధన’ పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యులు రాసిన ‘వదరు బోతు’ వ్యాసాలు సాక్షివ్యాసాలను తలపిస్తాయి. ఈ వ్యాసాల కర్త ృత్వంలో పప్పూరు రామాచార్యులతో పాటు రాళ్లపల్లి సోదరుల (గోపాలకృష్ణమాచార్యులు, అనంతకృష్ణశర్మ) ప్రమేయం కూడా ఉందంటారు.

‘సాక్షి’ వ్యాసాలు వచ్చిన మూడు నాలుగేళ్లకే 1917వ సంవత్సరంలో ‘వదరుబోతు’ వ్యాసాలు కూడా వచ్చాయి. ఈ వ్యాసాలలో సాహిత్యానికి సంబంధించిన అంశాలుకూడా ఉన్నాయి. పాండిత్యం తప్ప ప్రపంచం తెలియని విద్వాంసులు, తెలుగులో అప్పటికే పెరుగుతున్న బిరుదుల వ్యామోహం వంటి అంశాలను ఈ వ్యాసకర్త విమర్శించారు. అలాగే కవిత్వ రచనకు కావాల్సిన సామాగ్రిని గురించి, నాటక రచనను గురించి కూడా చర్చించారు.

1935 ఫిబ్రవరి 16వ తేదీ తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, బళ్లారి రాఘవ భారతదేశ పతనానికి పదకొండు కారణాలు అనే అంశం మీద రాజమండ్రి ట్రైనింగ్‌ కళాశాలలో ఆరుగంటల సేపు ఏకబిగిన ఆంగ్లంలో ప్రసంగించటం. గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో తనను గురించి గొప్పలు చెప్పుకొంటూ, పూణే డెక్కన్‌ కాలేజీలో ‘భారత దేశ పతనానికి పదకొండు కారణాలు’ అనే అంశం మీద ఏకబిగిన మూడు గంటలు లెక్చర్‌ ఇచ్చానని, ఆ లెక్చర్‌ విని అక్కడి ప్రొఫెసర్లు డంగయిపోయారని చెబుతాడు.

అయితే భారత దేశ పతనానికి గిరీశం చెప్పిన పదకొండు కారణాలు ఏమిటో ఎవరికీ తెలియదు. కన్యాశుల్కం నాటకం మీద పరిశోధనలు చేసిన వారు కానీ, విమర్శలు చేసిన వారుకానీ దీని గురించి ఏమీ చెప్పలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా ఉండిన కట్టమంచి రామలింగారెడ్డి ఈ అంశంమీద పరిశోధించి ప్రసంగించే బాధ్యతను బళ్లారి రాఘవకు అప్పజెప్పాడు. తర్వాత 59 సంవత్సరాలపాటు అజ్ఞాతంగా ఉన్న ఈ వ్యాసం 1994లో ఆవంత్స సోమసుందర్‌ అనువదించడంతో వెలుగులోకి వచ్చింది. గిరీశం ఏకబిగిన మూడు గంటలు ప్రసంగించాడో లేదో కానీ బళ్లారి రాఘవ మాత్రం ఆరు గంటలు ఆంగ్లంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం- సాహిత్యం సామాజిక అధ్యయనానికి ఎలా ఉపయోగపడగలదో రుజువు చేసింది.

తెలుగులో వచ్చినటువంటి తెలుగు సాహిత్య చరిత్రల్లో శాస్త్రీయ సూత్రాల మీద ఆధారపడి వచ్చిన తొలిగ్రంథం కల్లూరు వెంకట నారాయణరావు రాసిన ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము’ అని అనేకులు పేర్కొన్నారు. ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని మూడు విభాగాలుగా తెలుగు సాహిత్యాన్ని విభజించి సమాజ చరిత్రకు- సాహిత్య చరిత్రకు గల అవినాభావ సంబంధాన్ని రుజువు చేసిన మొదటి విమర్శ గ్రంథం ఇది. ఈ గ్రంథం 1928లో వచ్చింది. కవుల పేరు మీద, రాజుల పేరు మీద యుగ విభజన చేయకపోవడమే ఈ గ్రంథ మౌలికత. ఈయన అనంతపురం వాసి.

1929లో శ్రీకాకుళం ప్రాంతంనుండి అనంతపురం చేరిన తొలి తెలుగు పి.హెచ్‌.డి. పట్టాదారుడు చిలుకూరి నారాయణరావు గొప్ప పరిశోధకుడు, విమర్శకుడు కూడా. ఈయన 1950 లోపలే హిందీ, సంస్కృతం, తమిళ, కన్నడ, గుజరాతీ సాహిత్య చరిత్రలు రాశారు. ఇతర భారతీయ భాషా సాహిత్య చరిత్రలను అధ్యయనం చేయడం రాయలసీమలో అప్పటికే మొదలయినట్లు గుర్తించాలి.

ప్రసిద్ధ పరిశోధక విమర్శకులు వేటూరి ప్రభాకర శాస్త్రి 1939లో మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండిత పదవిని ముగించుకొని 1940లో శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూటు తెలుగు శాఖాధిపతిగా చేరారు.అనేక పరిశోధనలు చేశారు. విమర్శలు రాశారు. ‘తెలుగు మెరుగులు’, ‘మీగడ తరగలు’, ‘సింహావలోకనం’ అనే వేటూరి గ్రంథాలను టిటిడి ప్రచురించింది. అందులో అనేక భాషా సాహిత్యాంశాలను ఆయన చర్చించారు.

కడపజిల్లా వాసి అయిన జనమంచి శేషాద్రి శర్మ కవి, అనువాదకుడు, విమర్శకుడు. ఈయన 1937లో అల్లసాని పెద్దన మనుచరిత్ర మీద ‘మనుచరిత్ర- హృదయావిష్కరణ’ అనే పేరుతో విమర్శ గ్రంథాన్ని రాశాడు. అల్లసాని పెద్దన నివాస స్థలాన్ని గురించిన చర్చ చేసి మనుచరిత్రలో పెద్దన వర్ణించిన ప్రకృతి హిమాలయ పర్వతాలది కాదు, పెద్దన నివాస స్థలానిదే అని స్పష్టం చేశాడు.
అనంతపురం జిల్లానుంచి వచ్చి కడప జిల్లాలో స్థిరపడిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు 1950లో ‘ప్రబంధ నాయికలు’ అనేపేరుతో గొప్ప విమర్శ రాశారు. వరూధిని, సత్యభామ, గిరిక, ప్రభావతి- ఈ నలుగురిని ఆయా కవులు ఎలా చిత్రించినదీ పుట్టపర్తి విశ్లేషించారు. ఈ వ్యాసాల్లో పుట్టపర్తి ప్రభావవతిని తప్ప ముగ్గురిని అమోదించినట్లు కనిపిస్తుంది.

పుట్టపర్తి కనకమ్మ ‘వాల్మీకి ప్రకృతి వర్ణనలు’ అనే ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఇది- రాజమహేంద్రవరంలోని ‘ఆంధ్ర యువతీ కళాశాల’లో ఆనాటి కార్యాధికారిగా ఉన్న ‘శ్రీమతి బత్తుల కామాక్షమ్మ షష్టిపూర్తి అభినందన సంచిక’లో మార్చి 1947వ సంవత్సరంలో ప్రచురితమైంది. ఇందులో వాల్మీకి రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైంది మొదలు అతని రచనా విశేషాలు, శైలి, అలంకారాలు, ఉపమాలంకార ప్రియత్వం, ఉపమాలంకారాల రకాలు మొదలైన వాటిని గురించి ఆమె పరామర్శించారు.

కర్నూలు జిల్లా పాండ్యం నివాసి అయిన భూపతి లక్ష్మీ నారాయణరావు 1949లో ‘భారతము తిక్కన రచన’ అనే విమర్శన గ్రంథాన్ని, మరికొన్ని వ్యాసాలను రచించారు. ఇందులో తిక్కన రాసిన పదహైదు పర్వాల భారతాన్ని నిశిత పరిశీలన చేశారు. భూపతి లక్ష్మీనారాయణ రావు, పదుహైదు పర్వాలలో విరాటపర్వానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ పర్వం కంటే తిక్కన కవితా ప్రతిభ యుద్ధ, శాంతి, మౌసల పర్వాలలో ఎక్కువగా కనిపిస్తుంది.అయితే విరాటపర్వంలాగా ఈ పర్వాలు ప్రాచుర్యం పొందక పోవడానికి గల కారణాలను ఇందులో పేర్కొన్నారు, భూపతి.
ఈ సమాచారాన్నంతా క్రోడీకరించి ఆలోచిస్తే రాయలసీమ నుంచి వచ్చిన తెలుగు సాహిత్య విమర్శ సిపి బ్రౌన్‌తో మొలకెత్తి, రొద్దం హనుమంతరావు, కోలాచలం శ్రీనివాసరావులతో పనలు తొడిగి, కట్టమంచితో తీగలు సాగి, ఆతర్వాత 1950లోపల పుష్ప ఫలవంతమైందని చెప్పవచ్చు.
అయితే ఈ అర్ధశతాబ్ది రాయలసీమ సాహిత్య విమర్శ అంతా ఒక భావజాలంతో వచ్చింది కాదని కూడా గుర్తించాలి. ఎక్కువ భాగం సంప్రదాయ మార్గంలో, పరిమిత భాగం ఆధునిక మార్గంలో వచ్చింది. గురజాడ ప్రగతిశీల మార్గం తాత్కాలికంగా మౌనం వహించి అభ్యుదయ సాహిత్యంద్వారా పునరుజ్జీవనం పొందినట్టే! కట్టమంచి మార్గం వెంటవెంటనే వేగవంతం కాకుండా కొంత నెమ్మదించి రాయలసీమను అభ్యుదయ సాహిత్యం తాకడంతో పునరుజ్జీవనం పొంది విస్తరించింది. ఇది రాయలసీమ తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో తొలిదశ. 
-చీమల లలిత
పరిశోధక విద్యార్థిని
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప. 

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...