Thursday, June 27, 2013

కరువు సీమకు కావాలి జలకళ! -ఇమాం (కదలిక)

ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగస్వామిగా సుదీర్ఘ కాలం దాదాపు 250 సంవత్స రాలు కొనసాగిన
రాయలసీమ ను కర్నూలు రాజధానిగా 1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసి విడగొట్టారు. ఆ తరువాత 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ పేర సమైక్య రాష్ట్రం ఏర్పరిచారు. కుట్రలు, కుతంత్రాలకు నిర్ల క్ష్యానికి గురైన ఫలితంగా వెనుకబడిన ప్రాంతంగా రాయ లసీమ ఉన్నదని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ధృవీకరిం చింది. 1901లో 300 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతల పెట్టిన మెకంజీ స్కీంను అనేక మార్పులు, చేర్పులతో గం డికోట ప్రాజెక్టుగా మార్చి సీమవాసులను తీరని అన్యా యానికి గురిచేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమ సందర్భంగా కోస్తాంధ్ర నాయక త్వంతో సీమవాసులకు కుదిరిన అవగాహన శ్రీబాగ్ ఒప్పందం’ 1937లో బుట్ట దాఖలా అయింది. నెల్లూరు జిల్లాతో సహా సీమవాసుల ప్రయోజనాలు నెరవేర్చిన తరువాత మాత్రమే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేసి, ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేశారు. 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును తెలుగు ప్రజల ప్రయో జనాల పరిరక్షణ పేరిట నిలువరించారు.

ఈ పథకం ఆనాడే కేంద్ర జలవనరుల మండలి ఆమోదాన్ని పొందిం ది. ఈ ప్రాజెక్టు బదులు నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మిం చారు. అలాగే సీమవాసుల దృష్టి మళ్లించేందుకు ఖోస్లా కమిషన్‌ను నియమించారు. నేటి శ్రీశైలం ప్రాజెక్టు స్థానం లో సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఖోస్లా కమిషన్ సూచించింది. అలాగే కె.సి. కాలువ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 3 వేల క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచాలని, గండికోట ప్రాజెక్టు 60 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించాలని ప్రతిపాదించింది. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరి-నగరి పేరుతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కృష్ణా-పెన్నార్, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల ప్రతిపాదనలలో ఉన్నవే. మద్రాస్‌కు చెంగల్పట్టు జిల్లా ప్రయోజనాల పేర తాగునీటిని అందించే పథకం కూడా కృష్ణా-పెన్నార్ ప్రాజె క్టులో ఇమిడి ఉంది. ఈ పథకాలన్నీ రాయలసీమ, కోస్తాం ధ్ర, తెలంగాణ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతిపాదించినవే! నిరంతరాయంగా కరువులకు గురవుతూవచ్చిన రాయలసీమ ప్రజలు తాగునీటికి, సాగు నీటికి జరిపిన పోరాటం అసాధారణం.

తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘకాలం అభివృద్ధిలో సమగ్రత లోపించిన కారణంగా అన్ని రంగాలలో అసమానతలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా తాము తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గుర య్యామనే భావన తెలంగాణ, రాయలసీమ ప్రజల్లో నాటుకుపోయింది. తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధి నినాదంగా మిగిలిపోయింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తన 17 ఏళ్ల పాలనలో ప్రాంతాల మధ్య భావసమైక్యతను సాధించలేక పోయింది. పైగా టీడీపీ పాలనలో 1983 నుంచి 89 దాకా, 1997 నుంచి 2004 దాకా జలవనరులలో వాటా కోసం రాయలసీమలో ప్రజా ఉద్యమాలు నడిచాయి. మరోవైపు తెలంగాణ సోదరులు తమకు ప్రత్యేక తెలంగాణ నినా దంతో ఉద్యమిస్తున్నారు. వర్షాధార ప్రాంతాలైన రాయల సీమ, తెలంగాణ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ప్రజలు తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రాలే పరిష్కార మార్గమని భావిస్తున్నారు.

వెఎస్సార్‌సీపీ ఎదుగుదలను నిలువరించడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బలహీనపరచడానికి యూపీఏ ప్రభుత్వం రాయలసీమ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, లేదంటే రాయల తెలంగాణ యోచన వంటి ప్రతిపాదనలతో ప్రజలలో అలజడిని సృష్టిస్తున్నాయి. తెలుగు ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, ఒక పార్టీకి, ఆ పార్టీ అధ్య క్షునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభనష్టాల దృష్టితో ఎత్తుగడలు పన్నితే ఆ పార్టీ ప్రజలకు మరింత దూరంకాక తప్పదు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని 60 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్నది. అలాగే ప్రత్యేక తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరిం చాలో కూడా శ్రీకృష్ణ కమిటీ సూచించింది. రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమాలకు నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశం పునాదిరాయిగా ఉందనే అంశం గమనార్హం. నీటి వనరుల కేటాయింపునకు సంబంధించి మూడు ప్రాంతా లకు మధ్య పరస్పరం నెలకొని ఉన్న అనుమానాలు, అపోహలు, వివాదాలు పరిష్కరించగల దివ్యౌషధమే జలయజ్ఞం’. కోటి నలభై లక్షల ఎకరాల సేద్యపు నీటి వసతి కల్పనకు కోటి డెబ్భై ఐదువేల కోట్లతో బృహత్ ప్రణాళికను రూపొందించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథునిగా నిలిచారు. విద్యుత్, పారిశ్రామిక, వ్యవసాయరంగాల పురోభివృద్ధికి ప్రాము ఖ్యమిచ్చి రాష్ట్ర పురోగమనానికి గట్టి పునాదులు వేశారు. జలవనరుల వినియోగంలో అసమానతలు భిన్న ప్రాంతా లకు చెందిన జనం మధ్య విభేదాలు కల్పిస్తున్న సంగతి గ్రహించడంవల్లే ఐక్యతను అదే జలవనరులతో సాధించేం దుకు వైఎస్ ప్రతిష్టాత్మక జలయజ్ఞానికి అంకురార్పణ చేశారు. దివంగత నేత మరణానంతరం రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? 2009 డిసెంబర్ చివరన కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం సమైక్యవాదం, ప్రత్యేకవాదం బలంగా ముందుకువచ్చాయి. నేటికీ ఈ రెండు పరిణా మాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థి తులలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
*Coutesy- Sakshi daily

Monday, June 17, 2013

పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర

సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర
తిరుమల రామచంద్ర వ్రాసిన 'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు' అయినా, 'నుడి-నానుడి' అయినా 'సాహితీ సుగతుని

తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం 'మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు'. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం - 'నుడి-నానుడి'. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప - వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. 'సాహితీ సుగతుని స్వగతం', 'మరుపురాని మనుషులు' మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.

ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ - శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.

మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.

తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి 'హిందువుల పండుగలు-పర్వాలు', 'తెలుగు పత్రికల సాహిత్య సేవ', మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.

పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.స్వగతం' అయినా, 'మరుపురాని మనీషులు' అయినా, 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే 'పులిట్జర్' అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన 'హంపీ నుంచి హరప్పాదాకా' జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.
సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు - తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు. తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన 'పలుకుబడి'కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
- టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)



.
Andhra Jyothy daily 16-06-2013

వ్యవస్థ క్రౌర్యాన్ని ప్రశ్నించిన కథంచిన కథకుడు కె. సభా- నాగసూరి వేణుగోపాల్‌

  పాతాళగంగ - కె.సభా కథను వినగానే మరోసారి చదవాలనిపించింది. మేము కడప ఆకాశవీదిలో సీమకథలను
డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌  
ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం, అందులో విన్న తర్వాత. నిజానికి కె.సభా కథలను నేను పెద్దగా చదవలేదు అనటంకంటే అసలు చదవలేదనటం సబబుచాయన తన కథల్లో వాస్తవాన్ని ఎంత చక్కగా, గొప్పగా పరిశీలించాడు, చిత్రించాడు అనిపించింది. రచయితకు వ్యక్తుల పట్ల లాలిత్యం ఉన్నా- వ్యవస్థ పట్ల కాఠిన్యం ఉంది. అది వ్యంగ్యంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రాంతీయమైన పద సంపద కొన్నిచోట్ల పరిమళిస్తే, మరికొన్నిచోట్ల కలంతో చిత్రించిన మనోహర జీవన దృశ్యాలు గొప్పగా తారసపడతాయి. జైజవాన్‌, జైకిసాన్‌, జైభారత్‌ వంటి నినాదాల్ని తీసుకుని జీవన విషాదాన్ని, వ్యవస్థ వికృతాన్ని నింపి అద్భుతంగా కథను మలిచారు. వట్టి నినాదం మూలబిందువుగా అంతగొప్పగా వాస్తవిక కళారూపాన్ని కె.సభా ఎలా మలచగలిగారా అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది.
పంజాబు ప్రాంతంలో పాకిస్తాన్‌తో పోరాడుతున్న సీమ యువకుడు అబ్బోతు (ఆనందం). సీమ ప్రాంతంలో పాతాళగంగ కోసం బావి తవ్వుతున్న అబ్బోతు తండ్రి బేటప్ప. యుద్ధంలో తన కొడుకూ, పాతాళగంగను సాధించడంలో తన భర్త విజయం కైవశం చేసుకోవాలని తపించే చెంగమ్మ. ఈ ఇద్దరి విజయాలు ఆశించి, అసలు వాస్తవాలు దాచుకుని తల్లడిల్లే కన్నెపిల్ల- చెంగమ్మ అన్న కూతురు కస్తూరి. ఈ నాలుగు పాత్రలే కథానంతా పరుచుకుని ఉంటాయి. ఈ పాత్రలు నాలుగు పూర్తిగా తప్పుకుని ముగింపును మహావిషాదం చేస్తాయి. దాంతో పాఠకుల మనసు వికలమవుతుంది, క్రోధపూరితమవుతుంది, జుగుస్సాభరితమవుతుంది.
చేదలో గంగ సాక్షాత్కరించిందని ఎంతమందో భ్రమలో పడి, కృష్ణయ్య వంటివారి చెప్పుడు మాటలు విని, బావి తవ్వడమనే ఊబిలో చిక్కుకుని, భార్య నగలు, ఎడ్లు, బండి, పొలం, తన నగలు, కోడలు నగలు త్యాగం చేసి- మొత్తం కుటుంబం పాతాళంలోకి పోవడం కథావస్తువు. భాష, వ్యక్తీకరణ పూర్తిగా స్థానికం.
ఈ పదచిత్రణలు చిలికించిన దృశ్యాలు ఏమిటో అందుకోండి :
'అప్పుడే పొంగుతూ ఉన్న పాలపై నీళ్ళు చల్లి దించిపెడుతున్న చెంగమ్మ చెవుల్లో ఈ శుభవార్త పడగానే ఆమె కళ్ళు, చెవూలూ కలిసిపోయినవి. ఎలా తెలుసుకున్నదో పాలు తాగుతూ ఉండిన లేగదూడ పరుగుతో వచ్చి చెంగమ్మ చీరకొంగును కసకసమని నమిలేస్తుంది. ఆనందం పట్టలేక ఆ ఇల్లాలు లేగను అమాంతంగా ఎత్తి ముద్దెట్టుకుని వాకిట్లో దించి తిన్నెపై తవుడు బుట్టలో ఉన్న ఎన్నెర్ర చివుళ్ళను దాని నోటికందిస్తూ, పెదిమల్ని మెదపగానే...-' గ్రామీణ దృశ్యాన్నీ పరమాద్భుతంగా చిత్రించిన సన్నివేశమిది. పశుసంపదను గ్రామ ప్రజానీకం ఎంతగా ప్రేమిస్తారో, తమ ఆనందాన్ని వాటితో ఎలా పంచుకుంటారో మహోన్నతంగా వ్యక్తీకరించారు. కె.సభా.
'అబ్బోతి మాట వినగానే పసుపు కొమ్మువలె నిగనిగలాడే కస్తూరి తనూలత కుంకుమ వన్నెల విసనకర్ర అయి కమ్మని వలపు వాసనలను దశదిశలకు పంచి పెట్టింది. ఇంటికొప్పుపై నర్తిస్తున్న ఉడతల జంట ఎవరికీ తెలియని విశేషాలనేమో ఎంతో గోప్యంగా ముచ్చటించుకుంటున్నది. ఎన్నుగాటికి ఉత్తరపు కొనలో ఊరపిచ్చుకలు అంతకంటే మక్కువతో దాచుకొంటున్నవి.'
ఇది చిత్రం కాదు, వీడియో. పల్లె పట్టు ప్రకృతితో మమేకమైన పర్యావరణ సౌందర్యాన్నీ, కన్నెమనసు పులకరింతనూ కలిపి మేళవించడం కె.సభా కథన కౌశలం.
రచయితకు పరిశీలించగలిగే శక్తీ, వ్యక్తీకరించగలిగే యుక్తీ ఉంటే పాఠకుడు అదృష్టవంతుడు. మామూలుగా ఈ వాస్తవాన్ని పాఠకుడు తన కళ్ళెదుటున్నా చూడలేకపోవచ్చు ఇక్కడ రచయిత మనోక్షేత్రం పాఠకునికి మార్గదర్శకమవుతుంది.
'ఆరో మట్టులో కూడా బండనే పరచుకున్న బావి 'అం..' అని చెరువంతనోరు తెరుచుకొని తొంగిచూచిన వారినెల్లా మింగుతానంటున్నది.'
'దగ్గుదగ్గుగానే ఆగకుండా చెంగమ్మలో ఏదో ఆయాసం ముంచుకు వచ్చింది. మంచంపై బల్లిలా కరుచుకుపోయింది. ఇల్లాలు నేలబడగానే బేటప్పలో ధైన్యం ఆవేశించినది. ఆ పది గుంటలమ్మిన పైకం సైతం కర్పూరంలా కరిగిపోయింది. కస్తూరి జీలుగబెండువలె ఎండిపోతూంది.'
'అది బ్రహ్మముహూర్తం,. ఈశాన్య మూల నుంచి ఏదో ధ్వని విన్పించింది. పదేళ్ళ క్రితం విన్న తలకోన జర్తెలోని ప్రణనాన్ని స్మృతికి తెచ్చింది. మరీ దగ్గరికి జరిగి చెవినిచ్చి విన్నాడు. ఆ మూలనే ముక్కోలు మట్టిత్తులో సప్త స్వరాల సమ్మేళనం వలె పాతాళగంగ పాడుతున్న పాట వినిపించింది.'
.... ఇలా రచయిత సభా నేర్పరితనానికి చాలా మచ్చుతునకలు కనబడతాయి.
'చేదలో గంగ పడిందనీ, కరణం చెప్పాడనీ, సబ్సిడీ లోనుతో బావి పూర్తవుతుందనీ దిగిన బేటప్పకు బండరాళ్ళే ఎదురయ్యాయి. సబ్సిడీ రాలేదు, లోనూ రాలేదు.. పట్టుదల ఆగలేదు.. తొలుత గజ్జెలడ్డిగె కుదవ బెట్టాడు. అది చెంగమ్మదని చెప్పనక్కర లేదు. తర్వాత ఒక్కోక్కటి బావి ఖర్చులో పోతూ వచ్చాయి. ఆ క్రమం ఇలా ఉంది : ఎద్దులు, నాలుగు ఆవులు, 22 మేకలు, చెంగమ్మ చెవుల్లో కర్నపూలు, గూచపట్లు, బొందుపోగులు, నోముల ముళ్ళు, కస్తూరి తెల్లరాళ్ళ కమ్మలు, నీలాల తొంగటాలు; బేటప్పకు తెలియకుండా చెంగమ్మ తన కమ్మీలూ మాటీలు కుదువబెట్టడం ; ఏటికాలవమడి, ఊట కాలవ మాన్యం... మిగిలిన పది గుంటల నేల కూడా అమ్మి చెంగమ్మను ఆస్పత్రిలో చేర్పించడం, రెండెద్దుల బండి అమ్మకం, తాటి చెట్లు, చింత మాను, బేటప్ప వెండి మొలతాడు, పనసకాయ 
డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌    
Mon, 17 Jun 2013, Prajasakti daily

Sunday, June 9, 2013

సీమ తొలి కథా రచయిత్రులు పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ

1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు. ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ,డి. పాపమ్మలను చెప్పవచ్చు.


పరదేశీయుల రాకతో భారత సమాజంలోని అన్నిరంగాలలోనూ ఆధునిక భావాలు ప్రారంభ మయ్యాయి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ, ఆంగ్లభా షను ప్రవేశపెట్టడం, స్ర్తీ సంస్కరణలతో ఆధునికత మొదలైంది. దీనితో స్ర్తీకి గృహహింస నుండి, సంప్రదాయ ముళ్ళ పొదలనుండి, పురుషాధిక్యత నుండి కొంతవరకు రక్షణ ఏర్పడింది. అక్షరాభ్యాసం ద్వారా స్ర్తీలు కొన్ని ప్రాపంచిక విషయాలు తెలుసుకోగలిగారు. ఇదంతా 19వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దానికి కాస్తమెరుగైంది. నేడు అది పరిపూర్ణత చెందే దశకు చేరింది. ఇప్పటికీ స్ర్తీలు కొన్ని చోట్ల అణచివేతకు, దోపిడీకి గురవుతున్నప్పటికి స్ర్తీ సామాజిక స్థాయి, గౌరవం పెరిగిందనే చెప్పవచ్చును. అయితే ఆధునిక మహిళలు ఈ స్థాయికి రావడానికి అలనాటి తొలితరం స్ర్తీలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.స్ర్తీలు ఒకవైపు- కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త, తమ కడుపున పుట్టిన పిల్లలచే నిరాదరణకు గురౌతూ మరోవైపు తమ చుట్టూ ఉన్న సమాజంతో అణచివేతకు గురవుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు.

స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. పురుషులతో సమానంగా జైళ్ళలో మగ్గారు. సంఘసంస్కరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. అలాగే కలం పట్టి ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రాంతాలతో పోల్చితే కోస్తా ప్రాంతం ఆర్థికంగా పరిపుష్ఠి సాధించటంతో ఆధునిక సాహిత్యం అక్కడ కొంత ముందుగానే అడుగేసింది. అక్కడ పురుషులతో పాటు కొందరు స్ర్తీలు ఆధునిక సాహిత్యంలో కృషిచేశారు. కానీ రాయలసీమ సామాజిక నేపథ్యం అందుకు భిన్నం. రాయలసీమలో స్ర్తీలు పురుషుల శాసనాలకు లోబడి అణిగి మణిగి జీవిస్తుంటారు. నేటికి అనేకమంది గ్రామీణ నిరక్షరాస్య స్ర్తీల దుస్థితి ఇంతే. అయినా రాయలసీమ ఆధునిక సాహిత్య ప్రక్రియల నిర్మాణంలో స్ర్తీల తోడ్పాటును విస్మరించలేము.ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఒకటైన కథానిక మొట్టమొదట స్ర్తీ కలం నుండే వెలువడింది. 1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు.

ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను చెప్పవచ్చు. అనంతపురానికి చెందిన కస్తూరి వెంకట సుబ్బమ్మ 1926లో ‘కథామంజరి’ పేరుతో పురాణ ఇతిహాసాల వస్తువులతో కూడిన కథల సంపుటి రాశారు. అందులో బలిచక్రవర్తి చరిత్రం, భీష్మోదయం, గరుడచరిత్రం వంటి కథలున్నాయి. రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు చేసిన తొలిప్రయత్నమిది. తరువాత ఆధునిక సామాజిక వస్తువును నేపథ్యంగా స్వీకరించి తొలి కథలు రాసినది- ప్రొద్దుటూరుకు చెందిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ. 1927 ఆగస్టు భారత కథానిధి మాసపత్రికలో వరకట్నం కేంద్రంగా పూండి చెల్లమ్మ ‘సీతాబాయి’ అనే కథ రాశారు. ఇందులో సీతాబాయి, ఆమె భర్త రామస్వామి తమ కూతురికి పెండ్లిచేయాలనుకుంటారు.

కట్నంగా ఇవ్వాల్సిన డబ్బు లేకపోవడంతో దిగాలుగా ఉంటారు. రామస్వామి కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉద్యోగి. అయినా ఆ జీతం పెళ్లికి చాలదు. రామస్వామి భార్య సీతాబాయి తన పుట్టింట నేర్చుకున్న వైద్యంతో తన ఇరుగు పొరుగు వారికి వైద్యం చేసి డబ్బు కూడబెడుతుంది. అలాగే కలెక్టర్‌ కూతురికి కూడా నయంకాని జబ్బును నయంచేసి రెండువేల రూపాయలు సంపాదిస్తుంది. ఆ డబ్బుతో కూతురు పెళ్లి ఘనంగా చేస్తారు. ఇందులో సీతాబాయి స్వయంకృషి వల్ల తను నేర్చుకున్న వైద్యంతో కూతురు పెళ్లి చేసింది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా సంపాదించగలరని, ఆర్థిక సంపాదనలో పురుషులకు స్ర్తీలు ఏమాత్రం తీసిపోరనే సందేశాన్ని అందించారు రచయిత్రి. మరో రచయిత్రి డి. పాపమ్మ రాసిన ‘అత్తగారు రేడియో తెలిసికొంటిరా’ అనే కథ 1927 నవంబరు భారత కథానిధి పత్రికలో ప్రచురితమైంది. ఇందులో చలపతి అనుమానంతో ఒక బిడ్డ పుట్టిన తరువాత తన భార్యను ఇంట్లోనుంచి గెంటేస్తాడు. భర్త నిరాదరణకు గురైన ఆమె ఒక బాలికల పాఠశాలను స్థాపిస్తుంది.

బాలికలకు విద్యనందిస్తుంది. కొందరికి ఉద్యోగం కూడా కల్పిస్తుంది. భర్తచెంత పెరిగిన తన కూతురికి పెళ్లి అవుతుంది. భర్త చెంత పెరిగినప్పటికీ కూతురిపై ప్రేమతో పెళ్లయిన తన కూతురికి, అల్లునికి ఆ స్కూల్లోనే ఉద్యోగాలిచ్చి వారిని పోషిస్తుంది. ఈ కథ స్ర్తీలందరికి ఆదర్శం. పురుషుడి నిరాదరణకు గురైన స్ర్తీ ఆ రోజుల్లో స్వశక్తితో ఒక పాఠశాలను స్థాపించడం సామాన్య విషయం కాదు. ఇందులో పురుషుల దయా దాక్షిణ్యాలపై కాకుండా స్ర్తీలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడాలని చెప్పినట్టయింది.ఈ సీమ కథారచయిత్రులలో కాలక్రమాన్ని బట్టి చూస్తే- 1926లో కథలు రాసిన కస్తూరి వెంకట సుబ్బమ్మను తొలి సీమ కథా రచయిత్రిగా భావించవలసి ఉంటుంది.

కానీ ఆమె కథలు పురాణ ఇతిహాసాలకు సంబంధించినవి కాబట్టి, 1927లో ఆధునిక సామాజిక వస్తువు నేపథ్యంగా కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను రాయలసీమ తొలి కథా రచయిత్రులుగా గుర్తించవచ్చు. తెలుగు కథాసాహిత్యం ప్రారంభంనుండి రచయిత్రులు తమ వంతు సాహిత్య కృషి నిర్విరామంగా చేస్తున్నారు. వారితో పాటుగా 1926-27 మధ్యకాలంలో ప్రారంభమైన రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. దీనితో మిగిలిన తెలుగు ప్రాంతపు రచయిత్రులకు రాయలసీమ స్ర్తీలు ఏ మాత్రం తీసిపోకుండా గొప్ప సామాజిక వస్తువులతో కథలు రాసినట్లయింది. వీరిని భావితరాల స్ర్తీలు స్పూర్తిగా స్వీకరించి గొప్ప రచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Monday, June 3, 2013

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడాప్రచురితమ య్యాయి. అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, మీసరగండంరామాచార్యుల దంపతులకు విశ్వరూప శాస్త్రి 1915 అక్టోబర్‌ 21న జన్మించాడు. ప్రాథమిక విద్య తరిమెలలో పూర్తి చేసి, సంస్కృతాన్ని శంకరశర్మ వద్ద అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్‌’ను అందుకొని ‘విద్వాన్‌ విశ్వం’ అయ్యాడు. కాశీ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఖండ కావ్యాలపై పరిశోధన చేయడానికి వెళ్లి అనారోగ్య కారణాల రీత్యా వెనుదిరిగి వచ్చాడు.

ఆ విశ్వవిద్యాలయంలోనే తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్‌ రెడ్డిల సహచర్యంతో విద్వాన్‌ విశ్వంపై సామ్యవాద భావాలు ప్రభావం చూపాయి. 1935లో విరికన్నె లఘుకావ్యాన్ని రాసి నీలం సంజీవరెడ్డి వివాహ సందర్భంగా ఆవిష్కరించాడు. ‘పాపం, నా హృదయం, ఒకనాడు’ లఘు కావ్యాలతో పాటు, రాతలు గీతలు అనే పద్య సంకలనాన్ని ప్రచురించాడు. ‘ఆకాశవాణి’ అనే రహస్య పత్రిక ప్రచురణలో తన వంతు పాత్ర పోషించాడు.1938లో నవ్యసాహిత్యమాల స్థాపించి సామ్యవాద భావాలను ప్రచారం చేస్తూ ఎన్నో ప్రచురణలను వెలువరించాడు. 1945లో నవ్యసాహిత్య పరిషత్‌కు కార్యనిర్వాహకుడిగా కొనసాగాడు. 1945లో ‘మీజాన్‌’ పత్రికకు ఉప సంపాదకుడిగా పాత్రికేయ రంగంలో ప్రవేశించాడు. భారతి పత్రికలోనూ అనేక వ్యాసాలు రాశాడు. ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికకు 1952లో సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ‘మాణిక్యవీణ’ అనే శీర్షికను ఆకట్టుకొనేలా నడిపాడు.1956లో రాయలసీమ జీవన స్థితిగతులకు అద్దం పట్టే ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని వ్రాశాడు.

సంస్కృతంలోని రఘువంశం, శిశుపాలవధ, కాదంబరి, మేఘసందేశం, దశకుమారచరిత్ర మొదలైన ఎన్నో రచనలను తెలుగు వచన రచనలుగా అనువాదం చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంవారి రచనలకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు. విద్వాన్‌ విశ్వం 24 సంవత్సరాల వయస్సులో, అనంతపురం కేంద్రంగా 1926 నుండి పప్పూరి రామాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీసాధన’ వారపత్రికకు తొలి కథలు రాశాడు. విద్వాన్‌ విశ్వం తొలినాటి ఆలోచనాధోరణులకు ఈ కథలు అద్దంపడతాయి. 1939 ఆగస్టు12న ‘నా పెండ్లి సంబరం’ అనే కథలో, పెళ్ళీడు వచ్చిన అమ్మాయి పెళ్ళి సంబరం గురించి తమాషాగా, ఊహాలోకంలో కలలుకనే దశ నుండి అది ఒక అవసరంగా మారి, సర్దుబాటు చేసుకొనే మనస్థితిని తెలియజేస్తుంది. సరైన సంబంధం కోసం వేచి ఉండే క్రమంలో ఆ యువతిలో కలిగే మానసిక ఆందోళనల్ని ఈ కథ వివరిస్తుంది. జీవిత భాగస్వామి ఎంపికలో యువతి అభిప్రాయానికి స్థానం లేకపోవడాన్ని సూచిస్తూ ‘అతడెవరో యే సంగతో మా వాళ్ళు చెప్పారు.

కానీ నా చెవిలో అవేవీ దూరలేదు. యెటూ నేను పరీక్ష చేసి తగినవాడా? కాదా? అని తేల్చుకునే హక్కులేప్పుడు అవన్నీ తెలుసుకొనే లాభం! యెటూ మావారి మాటే కదా? యేదో ఒక ఆశ్రయం కోసం పరితపిస్తుండే లత యే చిన్న పుల్ల దొరికినా గట్టిగా నాలుగైదు చుట్లు చుట్టుకొని అల్లుకుపోవడానికెలా ఆతురపడుతుంటుందో అలా ఉంది నా మనసు’ అని యువతితో కథకుడు వెలిబుచ్చాడు. ఆగస్టు 26న రాసిన ‘మొగమహారాజు’ కథలో పురుషుల చేతిలో అమాయకులైన అమ్మాయిలు మోసపోతున్న వైనాన్ని చిత్రించాడు. ‘అమాయకులైన అమ్మాయిలకు’ ఈ కథను అంకితం చేశాడు. తల్లి, కొడుకు, కూతురుగల ఒక చిన్న బీద కుటుంబం ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉంటుంది. ఒక యువకుడు వారికి సహాయ సహకారాలందిస్తూంటాడు. ఆ యువకుడు పట్నానికి వలస వెళితే అతన్ని నమ్మి ఆ కుటుంబం కూడా వలస వెళుతుంది. పట్నంలో పాఠశాలలో కూతుర్ని చేర్పిస్తారు. ఆ యువకుడు అమ్మాయికి ట్యూషన్‌ చెప్పటం, అవసరమైనవి తెచ్చివ్వటం చేసేవాడు. ఆ అమ్మాయిపై ప్రేమ ఉన్నట్లు, భవిష్యత్తులో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు అందుకు అమ్మాయి తల్లి అనుమతించినట్లు ఆ యువకుడు ఒక సందర్భంలో తెలియజేస్తాడు.

అమ్మాయి అతని ప్రేమను నమ్మింది. ఇద్దరు మూడేళ్ళపాటు శరీరాలు స్వాధీనం తప్పి ప్రవర్తించారు. ఉద్యోగం రాగానే ఆ యువకుడు వేరే ఊరు వెళ్లిపోతాడు. అప్పటికే అమ్మాయి మూడు నెలల గర్భంతో ఉంటుంది. అతను వస్తాడని ఎదురు చూస్తుంటుంది. ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకుతుంది. ఆమెకు ప్రతి పిల్ల వెధవా ప్రేమ లేఖలు రాస్తుండటం చూసి ‘ఎంత నీచులో, ఆడవాళ్ళంటే అంత పశువులను కొన్నారా? అంగడిలొ అమ్మే వస్తువులనుకున్నారా?’ అని మధనపడుతుంది. చివరకు బడిమానేస్తుంది. ఆ యువకుడికి పెళ్లి కుదిరిందని తెలుసుకొని ‘అన్నయ్య భావి జీవితాన్ని, అమ్మ ఆందోళనను, కుటుంబ గౌరవాన్ని, ఆయన చేసిన అమానుషకృత్యాన్నీ, అర్థం లేని సంఘ మర్యాదలను, హృదయంలేని పశుప్రవృత్తిని, అమ్మాయిలలో ఉన్న వాంఛను కారణంగా చేసుకొని ఆత్మీయ తాత్కాలిక సౌఖ్యాన్ని పరిపూర్తి చేసకొనజూచే మగవాళ్ల స్వార్థపరతత్వాన్ని పురస్కరించుకొని వాని కోసం తనని తాను వంచించుకొని’ మరొకరిని పెండ్లి చేసుకుంటుంది.

ఆమెను ఆడిపోసుకుంటున్న జనాన్ని చూసి ఆమె మనసులో ‘ఎంత హృదయంలేనిదబ్బా ఈ ప్రపంచం. ఈపాడు ప్రపంచంలో యిన్ని ఘోరాలున్నాయని నాకు తెలీదు. మానవ హృదయాలు పూలగుత్తులనుకొన్నాను. కానీ ముండ్ల కంపలనుకోలేదు. మాటలకూ మనసుకూ సంబంధం లేదు. మానవ పశువులూ సంఘంలో మర్యాదకు లోటులేకుండా పెద్దమనుషులుగా ఉండొచ్చు. మనఃపూర్వకంగా మాలిమి చూపిన మనిషి వంచిస్తే, దిక్కు మొక్కులేని అమ్మాయి ఆశ్రయం కోసం విధిలేక, అర్థంలేని ఆర్థిక నీతులకు దాసురాలై, యింకొకరిని పెళ్లి చేసుకుంటే అందరికీ అపహాస్య భాజనం, అవినీతికరం కావడం. అందరూ నన్ననేవాళ్లే, ఆయన సంగతెవరికి కాబట్టింది? అన్ని నిందలూ ఆడవాళ్ళకే. ఆయన కేమమ్మా మగమహారాజు’ అనుకుంటున్నట్లు కథ ముగుస్తుంది.
మోసపోయిన స్త్రీ, మోసపుచ్చిన పురుషుడు- ఇద్దరి భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, స్త్రీకి అండగా నిలవాల్సిన వ్యవస్థ ఆమెను తప్పుపట్టి, పురుషుని చూసి చూడనట్లు వదిలేస్తే ద్వంద్వ వైఖరిని కథకుడు ఎత్తిచూపాడు. ఆనాడైన, ఈనాడైనా స్త్రీ పురుషులిరువురికి సమదృష్టి, సమన్యాయం అలవడనంత కాలం ఇలాంటి కథలు సజీవంగానే వుంటాయి.

1940 జనవరి 20న రాసిన ‘ఎందుకు ’ కథలో కటిక పేదరికంలో జీవిస్తున్న సమయంలో మనవడికి రోగం సోకటంతో కుమిలిపోయే ముసలమ్మ, అప్పులపాలైన రైతు, సొంత బిడ్డల ప్రేమకు నోచుకోని భూస్వామి, నిరుద్యోగుడైన యువకుడు, మోసపోయిన వేశ్యగా మారిన వితంతు మహిళ, ప్రజా ఉద్యమాలతో జైలుకు పోయి రాజకీయాలలో ఉన్న దంతా కోల్పోయిన నీతిగల నాయకుడు, పుస్తకాలు ప్రచురించుకొని అప్పుల పాలైన రచయిత- మొదలైన ఉపసన్నివేశాల ఆధారంగా సమాజంలో ఘోరాలు, నీచత్వం ఎందుకు జరుగుతున్నాయి? బాధలు ఎందుకు పడుతున్నారు? అంటూ ఈ కథలో ఆలోచింపజేస్తాడు రచయిత. వీటి గురించి ఆలోచించడం వృధా అనే మరీ పెద్దవాళ్లు కొందరు, ఆలోచించి ఎంత మంది తత్వవేత్తలు అడవులకెళ్ళారో అనే కాస్త హృదయంకల వారు కొందరు, స్వార్థపరతత్వాన్ని పరమోచ్ఛ స్థానానికి కొనిపోయే ధనతత్వంవల్ల జరుగుతోందని, ఇందుకు విరుగుడు మానవ సేవయే మాధవ సేవ అంటూ ఊరడింపు ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కొందరని- ఇలా పలు అభిప్రాయాల్ని రచయిత కథలో తెలియజేస్తాడు.

అంతిమంగా సంఘాన్ని మార్చడానికి పునర్మించడానికి వీలుందని ఆ ప్రయత్నంలో ఎన్నో ద్వేషాల్ని, అపహాస్యాల్ని, అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతమాత్రాన ప్రయత్నాన్ని మానుకోరాదని సూచిస్తాడు. ‘ఎందరో ఈ నిరాఘాట ధాటిలో పోతున్న సమాజ జగన్నాథ రథం క్రింద నలిగిపోలవలెను. ఎందరి రక్తంతోను ఈ భూమి తడిసిపోవలెను. ఎందరి ఆత్మలో పిశాచాలై ప్రపంచమంతా ప్రళయ తాండవం చేయవలెను. ఎందరి ఆలు, పిల్లలు అన్నంలేక మలమల మాడిపోవలెను. ఊఱికే మారుతుందా సంఘం. ఆ సమాజ శక్తికే బలికావలెను. అందుకు సర్వసన్నాహాలు చేసుకొని రంగంలోకి దుమికితీరవలెను. ఎందుకంటే ఆ బలికే, ఆ పొలికే’ అంటూ కథ ముగుస్తుంది. సమాజ మార్పుకై బలి అవుతూనే నూతన సమాజం కోసం పొలికి సిద్ధమవ్వాలనే విప్లవకర మార్గాన్ని ఈ కథలో రచయిత నిర్దేశం చేసాడు.శ్రీసాధన పత్రికలో కథానికలు రాసే ఉద్దేశంతో వ్రాయటం ప్రారంభించిన విద్వాన్‌ విశ్వం 1940, జనవరి 27 నుండి రాసిన ‘నీతులు, ఎక్కడికి, ఎక్కడున్నాము’ రచనలలో వ్యాస లక్షణాలు కనిపిస్తాయి.

సామ్యవాద భావాలపై పాఠకులలో మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.1940, జనవరి 27న వ్రాసిన ‘నీతులు’ అనే రచన- సమాజానికి, వ్యక్తికీ ఉన్న సంబంధాన్ని చక్కగా ఒడిదొడుకులు లేకుండా జరిగేటట్లు చేయడం కోసం వేదాలు, కావ్యాలు, నీతికథలు, మతాలు మొదలుకొని రాజ్యాంగాలు, తత్వశాస్త్రాలవరకు ఆయా కాలాలలో ఉన్నాయి. సమాజ స్థితికి అనుగుణంగా సమరసతను చేకూర్చేటందుకై అవి కొంత వరకు ఉపయోగపడినాయని పూర్తిగా నెరవేరలేదని- ప్రారంభమవుతుంది.సమాజానికి, వ్యక్తికి సామరస్యాన్ని కలిగించే నీతి నియమాలు ఆదర్శాలు కావని అవి సాధనాలని, వాటిని ఆచరణలో పెట్టటానికి తగిన సమాజ నిర్మాణం జరగాలని అందుకు పరిసర పరిస్థితులు అనుగుణంగా ఉండాలని, ఒక వేళ ఆచరణలో లేనప్పుడు ఆ సిద్ధాంతాలు ఆడంబరాలుగానే మిగిలిపోతాయని కథకుడు వివరిస్తాడు.

ఒక భూస్వామికి అతని మనస్సులో ఏమాత్రం కూలివాని నోరుకొట్టాలని ఇష్టంలేకున్నా మన సమాజ విధానమే అతని శ్రమను దోచుకునేటట్లు చేస్తోందని తెలిపాడు. యంత్రప్రాయమైన ఆర్థిక నిర్మాణం, అస్థిరమైన స్వేచ్ఛా వ్యాపారం ఫలితంగా పోటీలు, దివాళాలు, పీడనలు, ధనకేంద్రీకరణలు, యుద్ధాలు, దేశ స్వతంత్రతకి భంగాలు కలుగుతాయి. పరిస్థితులలో మార్పులు తేకుండా భావవాదులు మనసులో మార్పులు తెచ్చుకున్నంత మాత్రానా ప్రపంచం ఏమాత్రం శాంతంగా ఉండదని వివరించాడు. ఒకరిని పీడించడానికి అనువయ్యే భౌతిక వాతావరణం లేకపోతే ఆ తరువాత మానసికంగా కూడా వ్యక్తుల్లో పరపీడనేచ్ఛ నశిస్తుంది. ఒక్కతూరే పోకపోవచ్చు కానీ ఆ కొత్త వాతావరణం కొన్నాళ్లలో మానసిక ప్రపంచంలోను ఈ దుర్గుణాలను తుడిచిపెట్టివేస్తుంది. పీడితులు, పీడకులు అనే భేదం, పరస్పర వైరుధ్యం పోయి వర్గరహిత సమాజం ఏర్పడిన తరువాత నీతి, నియమాలు కేవలం ఆదర్శాలుగా కాక ఆచరణలో ఉండేటట్లు చేయవచ్చని కథ ముగుస్తుంది.సామ్యవాద సిద్ధాంతంలోని మూలసూత్రాలన్నింటిని సమకాలీన సమాజానికి అనువర్తితం చేస్తూ సమర్థవంతంగా, సైద్ధాంతికంగా ఈ రచన సాగుతుంది.

ఫిబ్రవరి 3న వ్రాసిన ‘ఎక్కడికి’ రచనలో పాత కాలంలోనే అన్నీ ఉన్నాయనే భ్రమలు వదులుకొని, అందులోని మంచిని మాత్రమే స్వీకరించాలని, జీవన విధానంలో, సమాజ పరిణామక్రమంలో కొత్త ఆలోచనలకు, మార్పులకు స్థానం ఇవ్వాలని తెలియజేస్తుంది. ఫిబ్రవరి 10న వ్రాసిన ‘ఎక్కడున్నాము’? రచనలో ఆర్థిక, సామాజిక, విద్యారంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో తూలనాత్మకంగా వివరించాడు. సామ్రాజ్యతత్వ బంధనాల నుండి విడిపోయి సహకార పద్థతిపై దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకోవాలని అందరూ స్వరాజ్యం కోసం పోరాడాలని అప్పుడన్నీ సాధ్యమవుతాయని తెలియజేస్తుంది. విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయి. 
డా.ఆప్పిరెడ్డి హరినాథ రెడ్డి 
surya daily 03-06-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...