Wednesday, April 2, 2014

సీమ విషాదమూ,నవ వాల్మీకులూ- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

1985లో కేవలం ఒకటి రెండు తాండాలలో మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే వ్యభిచార నరక కూపంలో ఇరుక్కుపోవడం జరిగింది. అలా ప్రారంభమైన ఈ వ్యవహారం తరువాత కాలంలో వందల గ్రామాలకు విస్తరించింది... అమాయకులైన అమ్మాయిలను పశువులను సంతలో కొన్నట్లుగా ఇరవై వేలకో, ముప్పై వేలకో కొని వ్యభిచార గృహాలకు సాగనంపడం మొదలైంది.  

తీవ్ర కరువులకు గురవుతుండడంతో వేరే ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితులలో తెలిసి కొందరు, తెలియకుండా కొందరు ఇందులోకి ప్రవేశించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.రాయలసీమలో దశాబ్దాల కాలం నుంచి పట్టి పీడిస్తున్న సమస్య కరువు. ఈ ప్రాంతం పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి రావడంతో పంటలు నమ్మశక్య ంగా పండుతాయనే ఆశ లేదు. ఇక్కడి చాలామంది రైతులకు బావుల క్రింద ఒక ఎకరానికి మించి పొలం ఉండదు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో బావులు ఎండిపోయి కనీసం ఒక ఎకరాకైనా నీళ్లు అందవు. వర్షాధారమైన పం టగా వేరుశెనగ మాత్రమే సాగుచేసుకొని జీవనం సాగించాలి. ఒక సంవత్సరం పండితే నాలుగు సంవత్సరాలు వరుస కరువులతో పెట్టిన పెట్టుబడులూ రాక వడ్డీలు చెల్లించలేక దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్న సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. బుట్ట చేతపట్టుకొని నగరాలకు ఉపాధికై వలసబాట పట్టాల్సి వస్తోంది. అక్కడ అంతో ఇంతో పొందే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. కొన్నేళ్ల క్రితం పనుల కాలంలో మాత్రం పల్లెల్లో వుండి, మిగతా కాలమంతా నగరాలలోనే పనులు చేసుకొనేవారు. నేడు పల్లెలను, పంటలను పూర్తిగా వదిలేసి పట్టణాలలోనే చాలీచాలని బతుకులీడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో ఈ పరిణామం 1980లలో మొదలై తరువాత దశాబ్దకాలంలో పూర్తిగా పాదుకుంది.

భూములున్న రైతుల పరిస్థితి ఇలా వుంటే, భూములు ఏమాత్రం లేని నిరుపేద రైతు కూలీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వ్యవసాయ పనులు ఆధారం లేకపోవడం చేత, నిరంతర అభద్రతతో, వలసలతో జీవితం గడిపాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, రాయచోటి పరిసర ప్రాంతాలు పూర్తిగా కొండగుట్టలతో కూడి వుంది. అతి తక్కువ వ్యవసాయ యోగ్యమైన భూములతోనే జీవనం కొనసాగించాల్సి ఉంది. పైన పేర్కొన్న పరిస్థితులకు ఈ ప్రాంతం అద్దం పడుతుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ భాగం గిరిజన తాండాలు ఉన్నాయి. ఇక్కడి మొత్తం జనాభాలో వారు దాదాపు పది శాతం వరకూ ఉంటారు. వారిలో ఏ కొద్ది కుటుంబాలకు మాత్రమే కొంత వ్యవసాయ భూమి ఉంటుంది. మిగతావారు వ్యవసాయ కూలీలుగా, అడవి ఆధారంగా, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తారు. విద్యకు దూరంగా, మూఢనమ్మకాలతో వారి జీవితం ముడిపడి ఉంటుంది. సీమలో ఏర్పడే కరువుల ప్రభావం మిగతా వారికన్నా వీరినే అధికంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పట్టణాలకు వలసలు పోయి బతుకీడ్చడం ఒక ఎత్తైతే, దీనికి భిన్నంగా మహానగరాలలో ఈ ప్రాంతంలోని ప్రత్యేకించి కొన్ని గిరిజన కుటుంబాలలో, బలహీన వర్గాలలో నుంచి యువతులు వేశ్యా గృహాలకు అమ్ముడుపోయే పరిస్థితులు దాపురించడం అమానవీయం.
1985లో కేవలం ఒకటి రెండు తాండాలలో మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే ఇలాంటి నరక కూపంలో ఇరుక్కుపోవడం జరిగింది. అలా ప్రారంభమైన ఈ వ్యవహారం తరువాత కాలంలో వందల గ్రామాలకు విస్తరించింది. తొలిదశలో ఢిల్లీ, ముంబయి, పూణే తదితర ప్రాంతాలలో వేశ్యా గృహాలకు వెళ్లినవారే తరువాత కాలంలో ఘర్‌వాలీలుగా (వేశ్యాగృహాల నిర్వాహకులు) మారిపోయారు. వారికి మరింత మంది యువతులు అవసరం ఉండడంతో ప్రతి గ్రామంలోనూ బ్రోకర్లను, ఏజెంట్లను ఉంచి మాయమాటలతో, ఉపాధి చూపిస్తామనే ఆశతో, మోసపుచ్చటంతోను ఇలా పలురకాల ప్రలోభాలకు గురిచేసి, అమాయకులైన అమ్మాయిలను పశువులను సంతలో కొన్నట్లుగా ఇరవై వేలకో, ముప్పై వేలకో కొని వ్యభిచార గృహాలకు సాగనంపడం మొదలైంది. తీవ్ర కరువులకు గురవుతుండడంతో వేరే ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితులలో తెలిసి కొందరు, తెలియకుండా కొందరు ఇందులోకి ప్రవేశించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రకంగా బలైన వారిలో ఎక్కువ భాగం గిరిజన యువతులు కావడం ఆలోచించాల్సిన విషయం. వీరి భాష హిందీ భాషను పోలి ఉండడం, రూపంలో అందంగా ఉండడం, వీటన్నింటికి మించి వారి అమాయకత్వం ఆసరాగా ఈ సమస్యలోకి వారు ఎక్కువ భాగస్వాములు కావటానికి అవకాశం ఏర్పడింది. ఇలా వెళ్లిన వారు ఐదారు సంవత్సరాలకే అనేక వ్యాధులకు గురై, శరీరం కృశించి తిరిగి సొంత పల్లెలకు వెనుదిరుగుతారు. అప్పటికే ఎయిడ్స్ బారినపడిన వారు అతి తక్కువ కాలంలోనే మృత్యువుతో పోరాటం మొదలవుతుంది. వేశ్యాగృహాల నుంచి తిరిగి వచ్చేవారి ప్రభావంతో మామూలుకన్నా ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తృతంగా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించి కబళిస్తోంది. ఈ దశాబ్దకాలంలో ఈ ప్రాంతం నుంచి వివిధ నగరాలలోని వేశ్యా గృహాలకు రెండు వేల మంది దాకా వెళ్లి వుంటారని స్వచ్ఛంద సంస్థల అంచనా. ఐదు వందల మందిదాకా మృత్యువాత పడివుంటారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ముప్పై మంది దాకా ఘర్‌వాలీలు, వంద మంది దాకా బ్రోకర్లు ఈ అమాయక యువతుల శరీరాలతో వికృత వ్యాపారం చేసి లక్షాధికారులయ్యారు.
వైయుక్తికంగా ఈ సమస్య ప్రారంభమై ఒక సామాజిక జాఢ్యంగా పరిణామం చెందింది. అన్ని నగరాలలోనూ వ్యభిచార గృహాలు ఉండడం సహజం. అందులో వేరువేరు నేపథ్యాలతో ఆ వృత్తిలోకి ప్రవేశించడం మామూలే. కానీ వ్యవసాయాధారిత నేపథ్యం, సంప్రదాయ గ్రామీణ జీవితంలోని, ప్రత్యేకించి ఒక ప్రాంతంలో, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఈ సమస్య బారిన పడుతుండడం, దాని ప్రతిఫలనాలను అనుభవిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఈ సమస్య పట్ల సామాజిక బాధ్యత గల ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం సమస్య కొంత తగ్గుముఖం పట్టింది. అయినా ఆ మూలాలు ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదు.
సమకాలీన సమాజ సమస్యల పట్ల సాహిత్యకారులు ఎంతో మహత్తర బాధ్యతతో సమస్య స్వరూపస్వభావాల్ని, పరిణామాలను ముందుగా విశ్లేషించి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని కవులు, రచయితలు, కళాకారులు, వ్యాసకర్తలు వారి పరిధిలో వారు ఈ సమస్య పట్ల చైతన్యం కలిగించేందుకు గతంలో వివిధ రూపాలలో కొంతమందైనా ప్రయత్నం చేశారు. అలా వెలువడిన సాహిత్యాన్ని ఇందులో పరిశీలిద్దాం...
-కవిత్వం
-వ్యాసరచయిత 2004, నవంబర్ 1న రాసిన 'అనంతసుఖం' అనే కవిత ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా సంచికలో ప్రచురితమైంది. అందులో కరువులు, కక్షలు, రైతుల ఆత్మహత్యలు మొదలైన సమస్యలు ప్రస్తావించడంతో పాటు ఈ ప్రాంత యువతులు వేశ్యా గృహాలకు అమ్ముడుపోయి, నలిగిపోతున్న తీరును సూచిస్తూ...
'గతుకు కరువుతో/ శీలం వేలంగా/ కామాంధ గృహాలలో కేళిగా/ మదినలిగిన అమానుషత్వంతో/ గన్నేరు పుష్ప నేస్తాలుగా/ వాడుతున్న మల్లెలను కాపాడలేరా'... అని ప్రశ్నిస్తాడు. కరువుల కారణంగా యువతులు శరీరాలను అమ్ముకొనే పరిస్థితి రావడం, చివరకు ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకడంతో వారు మరణం అంచులకు చేరుకోవటాన్ని 'గన్నేరు పుష్పనేస్తాలు'గా ప్రతీకం చేశాడు. వాడుతున్న ఆ మల్లెలను కాపాడాలని కోరటం ఇందులో కనిపిస్తుంది.
- కవితలోనే చివరలో... 'శోకమే శ్లోకంగా/ ఈ అరుపుల ఆర్తిని/ ప్రతిధ్వనించే పత్రాలకై/ నవవాల్మీకులమైనప్పుడే/ అనంత సుఖం'... అని ఈ సమస్య పట్ల కవులు, రచయితలు చేపట్టాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు.
2006 ఫిబ్రవరిలో ప్రచురితమైన 'సీమనానీలు' అనే నానీల కవితా సంపుటిని 'ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి' వెలువరించారు. సీమ జీవితంలోని అనేక పార్శ్వాలను ఈ నానీలు ప్రతిబింబించాయి. అందులో వేశ్యాగృహాలకు తరలిపోతున్న -ప్రాంత యువతుల సమస్యలపై... 'కరువా/ నీకెంత శక్తే/ పరువాన్ని సైతం/ అంగడిపాలు చేశావ్!'.. అని ఈ సమస్యకు మూలకారణం కరువని కవి సూత్రీకరించాడు. 'కదిరి నుంచి/ రైలు బయలుదేరిందా?/ బొంబాయి గాలులు/ వీస్తున్నాయి చూడు!'... నానీలో కదిరి పరిసర ప్రాంతాలలో ఈ సమస్య విస్తరించటాన్ని సూచించాడు. 'రైలు తిరిగొచ్చిందే/ కదిరికి/ ఆమె/ పాజిటివ్వేమో చూడండి!'.. నానీలో వేశ్యాగృహాల నుంచి తిరిగొచ్చేవారు ఎయిడ్స్ బారిన పడుతుండటాన్ని తెలియజేశాడు. ఈ విధంగా రాచపాళెం ఈ సమస్య స్వరూపాన్ని స్థూలంగా నానీలతో వ్యక్తీకరించాడు.
2008 మార్చి 16న 'విజయస్వప్నం' పత్రికలో 'బిక్కి కృష్ణ' రాసిన 'దగ్ధగీతం' కవిత ప్రచురితమైంది. పేదరికంతో యువతులు వేశ్యాగృహాల పాలవుతున్న వాస్తవం జీర్ణించుకోలేక రాసిన కవితగా కవి ప్రకటించాడు.
'హృదయం దుఃఖాగ్ని పుష్పం/ నయనం కురుస్తున్న అశ్రుమేఘం/ కరువు శిల్పి చెక్కిన వేశ్య జీవితం/ నిత్యం రగులుతున్న అగ్ని సరస్సు/ ఓ కవి! ఎలా రాస్తావు ఆమె కావ్యం?'... అంటూ వేశ్యాగృహాలలో బలవుతున్న స్త్రీల హృదయవిదారక పరిస్థితులను దృశ్యమానం చేశాడీ కవి. 'ఓ కవి! ఆమె ఆకలికి శీలం అమ్ముకుంది/ కరువు తోడేలు కొరికిన మేక పిల్ల ఆమె!'... అంటూ కరువు, ఆకలికి ఈ ప్రాంత స్త్రీలు తలొగ్గిపోవాల్సి వస్తుందని తెలియజేస్తాడు. దుఃఖాన్ని ఎదుర్కోవటానికి మానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి రావటాన్ని తెలియజేస్తూ... 'దుఃఖానికి మానం లేదు' అని దుఃఖిస్తాడు కవి.
పై పత్రికలోనే ఉద్దండం చంద్రశేఖర్ రాసిన 'జాలిప్రశ్న' కవితలో... 'ఇళ్ళంతా బాధల సాలేగూడైనప్పుడు/ నా ఒళ్ళంత చీకటికి అప్పగించి/ మెల్లగా కళ్లు మూసుకుంటాను!/ తెల్లారే సరికి అది గాయాల పురిటిల్లు./ ఆకలిచేత అత్యాచారం చేయబడిన/ గాయాల సమాధి నేను'... అంటూ బాధలు, ఆకలి కుటుంబాన్ని ఆవరించినపుడు ఆ వృత్తిలోకి దిగి ఆమె గాయాల పురిటిల్లుగా, గాయాలసమాధిగా మారటాన్ని చిత్రించాడు.
'వంటిపైకెగబాకే సర్పాల స్పర్శల్ని/ పంటి బిగువుతో మౌనంగా భరిస్తున్నదాన్ని!/ ఎండిన పేగులను తడిచేసుకోవడానికి/ ఎయిడ్స్ శాల్తీలను నిర్భయంగా/ కౌగలించుకుంటున్న దాన్ని!'... అని ఆ సందర్భంలో ఏర్పడే శారీరక బాధను, శరీరాన్ని ఆవరించే ఎయిడ్స్ వ్యాధిని కవి తెలియజేశాడు.
'నా పాలిండ్లను పీల్చిపిప్పిచేశారు/ పాలకోసం విలపించే నా బిడ్డకు/ ఏమని జవాబు చెప్పాలిప్పుడు?'.. అని కవి వ్యక్తీకరించినతీరు హృదయాన్ని కలచివేస్తుంది.
'అమ్మా మళ్లీ బొంబాయి కెళతావా?/ బుజ్జిగాడి జాలి ప్రశ్న!'...లో జీవిత పోరాటానికి ఆ మార్గం తప్ప వేరేదారి లేకపోవటాన్ని సూచిస్తుంది.
-కథా సాహిత్యం
2000 నవంబరులో 'జి. నిర్మలారాణి' రాసిన 'గాజుకళ్ళు' కథ 'ప్రజాసాహితి'లో ప్రచురితమైంది. ఈ కథలో కరువుకు తాళలేక పదేళ్ళ క్రితం ఊరు వదిలిపోయి పొట్టనింపుకోవడానికి దొంగగా మారిన నాగప్ప తిరిగి ఊరొస్తాడు. దొంగతనాలు మాని వస్తే ఇక్కడి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఊరి స్వరూపం మారిపోయి ముసలివాళ్ళు, పిల్లలు మాత్రమే ఉంటారు. తినటానికి తిండిలేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తుంటారు.
నాగప్ప చెల్లెలు లక్ష్మి, తల్లితో 'వాళ్ళు మనుషులు కాదమ్మా, రాక్షసులు! మనుషుల్ని పీక్కుతినే దెయ్యాలకట్లా వాళ్ళు గిరాకితో సరిగ్గా నడుచుకోలేదని యజమానురాలు చావగొడుతుంది. నేనింక చావలేనమ్మా. యాటికైనా పారిపోదాం! అదీ కాకుంటే ఇంత విషంతాగి సచ్చిపోదాం'. అంటూ హృదయాన్ని తూట్లు పొడిచేలా ఏడుస్తూ చెబుతున్న ఆమె మాటల్ని నాగప్ప వింటాడు. నాగప్పకు పరిస్థితి అర్థమవుతుంది. 'ఇట్లాంటి బ్రతుకు బ్రతికే బదులు చావకూడదూ?' అని తనలో తాను నాగప్ప ఆలోచించుకుంటాడు. కానీ తనే పరిస్థితుల్లో దొంగగా మారింది గుర్తుకు తెచ్చుకొని 'తాను చావలేకనే కదా, కడుపుకూటి కోసం చిల్లర దొంగతనాలు చేసింది. ఎవరైనా అంతేనేమో! నీతి నియమాలు పట్టుకుని, కూర్చుంటే కడుపెట్లా నిండాల? తమలాటోళ్ళు బతకేదెట్లా. వళ్ళమ్ముకునే స్థితికి వచ్చినాదంటే జీవితం ఎంతగా చితికిపోయి వుండాలా' అని ఆలోచిస్తూ కృంగిపోతాడు.
ఆ రాత్రినే లక్ష్మి, కుళ్ళాయప్పతో లేచిపోతుంది. బంగారమ్మ అయిదు వేల రూపాయలకు లక్ష్మిని కొని ఉంటుంది. బొంబాయి నుంచి మద్రాసుకు లక్ష్మిని తీసుకువెళుతున్న క్రమంలో ఆరోజున ఊరికి వచ్చి ఉంటారు. ఆ సమయంలోనే లక్ష్మి ఇలా పారిపోవటంతో బంగారమ్మకు ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతోచక లక్ష్మి తల్లి ఆలోచనలో పడిపోతుంది. ఎక్కడైనా అయిదు వేల రూపాయలు తెమ్మని నాగప్పకు చెబుతుంది. నాగప్పకు అది శక్తికి మించిన పని. నాగప్ప తల్లి ఏడుస్తూ ఊరకైపోతుంది. లక్ష్మిని తీసుకెళ్లేందుకు బంగారమ్మ మనుషులు వస్తారు. 'మా లక్ష్మీకి ఖాయలా అయి పట్నం పోయినదన్నా, మళ్లీ రాదు? మద్రాసుకు నేను వస్తాను పదండి' అని ఆమె ముందుకు అడుగు వేసింది. నాగప్ప తాను ఏమి విన్నాడో అర్థం కాక, అయోమయంగా తల్లి ముఖంలోకి చూశాడు. 'వట్టిపోయిన ఆకాశం మాదిరి ఆమె కళ్ళలో చుక్కనీరు లేదు.' అని కథ ముగుస్తుంది.
ఈ కథలో కరువు కారణంగా ఏర్పడిన పరిస్థితులు కుటుంబ వ్యవస్థను ఎంత ఛిన్నాభిన్నం చేస్తాయో తెలియజేస్తుంది. జీవనం కోసం స్త్రీలు ఎలాంటి అమానవీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ కథలో చిత్రితమైంది. క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితుల పట్ల ఎంతో అవగాహన ఉంటేకానీ ఇలాంటి కథను రచయితలు చిత్రించలేరు.
2004లో 'వేంపల్లి గంగాధర్' రాసిన 'మైనం బొమ్మలు' కథ ఆంధ్రభూమిలో ప్రచురితమయింది. ఆ సంవత్సరం ఆటా పోటీలలో ఈ కథ బహుమతిని పొందింది. ఈ కథలో చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన పద్మ, ఆమె తమ్ముడు వినోద్, తండ్రి చాటున తాండాలో నివసిస్తుంటారు. పదహారేళ్ల వయసులోనే పద్మను ఆమె తండ్రి 'పూణా బూమ్మ'కు అమ్మేస్తాడు. జరుగుబాటుకాక అదేబాటలో ఆ తాండాలోని యువతులంతా పూణే చేరతారు. తాండా బోసిపోతుంది. తమ్ముని చదువుకోసం పద్మ ఒక్కో రూపాయి కూడబెట్టి హాస్టలుకు పంపుతుంది. వాళ్ల నాన్న ప్రతి నెలా హాస్టలుకూ వెళ్లి డబ్బుకోసం గొడవ చేసేవాడు. చివరకు కొడుకు చదువు మాన్పించి, ట్రాక్టరు పనికి పంపితే డబ్బులు వస్తాయనుకుంటాడు. హాస్టలు వార్డెను వినోద్‌ను వాళ్ళ నాన్న బారి నుంచి కాపాడతాడు. అన్నీ తానై, హాస్టలు వార్డెనే వినోద్‌కు సహాయంగా నిలుస్తాడు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు, ఎంతవరకైనా చదవమని తమ్మునికి పద్మ ఉత్తరం రాస్తుంది. అక్క ఇచ్చిన తోడ్పాటుతో పెద్ద చదువులు చదివి వినోద్ అమెరికాలో స్థిరపడతాడు.
పాతిక సంవత్సరాల తరువాత తన తాండాను, తన జీవితాన్ని నిలబెట్టిన పద్మక్కను చూద్దామని వినోద్ వస్తాడు. వినోద్ కారు పద్మక్క ఉన్న గుడిసె దగ్గరికి చేరుతుంది. నిర్జీవ దేహంతో కరిగిపోయిన మరబొమ్మగా, మంచుబొమ్మగా చివరకు మైనపు బొమ్మగా మారిన పద్మక్కను చూస్తాడు.
ఆమె 'తాండాను చూసి, జీవం పోయమని' వినోద్‌ను కోరుతుంది. తాండాలో అందరికీ వినోద్ ఉపాధి కల్పిస్తాడు. 'పూణా బూమ్మ' తన వెంట వచ్చేవారెవరూ లేరని తిట్టుకుంటూ ఒంటరిగా పూణేకు వెనుదిరుగుతుంది. కరువులు, పేదరికం, అవిద్య, అజ్ఞానం కారణాల వలన విరిసీ విరియని ఆడపిల్లల జీవితం మైనం బొమ్మలుగా మారడానికి వీలులేదని రచయిత కథను ముగిస్తాడు.
బాధ్యతగా ప్రవర్తించాల్సిన తల్లిదండ్రులు డబ్బు కోసం తమ బిడ్డలను అమ్ముకునే దారుణ పరిస్థితిని ఈ కథ తెలియజేస్తుంది. యువతులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమని ఈ కథలో సూచితమయింది. ఈ కథంతా కవితాత్మకంగా నడుస్తుంది. వేంపల్లి గంగాధర్ 2007 జూన్‌లో 'పూణే ప్రయాణం' అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు. క్షేత్ర స్థాయిలో వేశ్యా గృహాలలో బలైన బాధితుల వ్యక్తిగత అధ్యయన కథనాలను అందులో వివరించాడు.
-వ్యాసరచయిత 'సీమకు మరో సామాజిక జాఢ్యం' అనే శీర్షికన 2008 మార్చి 16న 'విజయస్వప్నం' సంచికలో సీమ నుంచి వేశ్యాగృహాలకు వెళుతున్న యువతుల సమస్య నేపథ్యాన్ని, కారణాల్ని, విస్తృతిని, ప్రభావాల్ని, పరిష్కారాల్ని విశ్లేషిస్తూ పరిశోధనాత్మక నివేదికను రాశాడు.
సమకాలీన ఈ సమస్యపై, పైన పేర్కొన్న ప్రక్రియలలో కొంతైనా సాహిత్యం వెలువడింది. రచయితలు మరింత సునిశిత పరిశీలనతో వేశ్యా గృహాలలోని సీమ యువతుల ఇతివృత్తమై నవలా రూపంలో వెలువడితే పాఠకులకు సమస్యపట్ల పూర్తిస్థాయి అవగాహనకు వీలుంటుంది. పాటలు, నాటక రూపాలలో ఈ సమస్యపై సాహిత్యం వెలువడి, సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ప్రదర్శించి, బాధితులలో చైతన్యం తీసుకురాగలిగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి
Andhrajyothy, Vividha- 31 march 2014.

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...