Sunday, December 24, 2017

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన సామినేని ముద్దునరసింహం నాయుడు తన వ్యాసాలను 'ప్రమేయాలు'గా పేర్కొన్నాడు. బందరు నుండి వెలువడే 'హితవాది' పత్రికలో 1842 నుండి 1847 వరకు ఇవి ప్రచురిత మయ్యాయి. 1862లో 'హితసూచిని' పేర అవి పుస్తకంగా  వెలువడినాయి. హేతువాద దృక్పథంతో, సంఘసంస్కరణ ఇతివృత్తంగా ఈ వ్యాసాలు కొన సాగాయి. లభిస్తున్న ఆధారాలలో తెలుగు వ్యాసరచయితలలో వీరు ప్రథములు. తరువాత తరాలకు మార్గదర్శకులు కూడా.
ఏదైనా ఒక విషయాన్ని వివరించి రాయటమే వ్యాసం. విషయ ప్రధానంగా, సులభంగా అర్థమయ్యేలా, సంగ్రహంగా రాయటం వ్యాస ప్రధాన లక్షణం. ఫ్రెంచ్‌ రచయిత మాంటెన్‌ 1571లో తాను రాసిన వచన రచనకు ఫ్రెంచ్‌భాషలో 'ఎస్సె' అని పేరు పెట్టాడు. ఫ్రాన్సిస్‌ బేకన్‌ దీనిని స్వీకరించి ఆంగ్ల సాహిత్యంలో ఈ ప్రక్రియను విస్తృతపరిచాడు.
తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన సామినేని ముద్దునరసింహం నాయుడు తన వ్యాసాలను 'ప్రమేయాలు'గా పేర్కొన్నాడు. బందరు నుండి వెలువడే 'హితవాది' పత్రికలో 1842 నుండి 1847 వరకు ఇవి ప్రచురిత మయ్యాయి. 1862లో 'హితసూచిని' పేర అవి పుస్తకంగా  వెలువడినాయి. హేతువాద దృక్పథంతో, సంఘసంస్కరణ ఇతివృత్తంగా ఈ వ్యాసాలు కొన సాగాయి. లభిస్తున్న ఆధారాలలో తెలుగు వ్యాసరచయితలలో వీరు ప్రథములు. తరువాత తరాలకు మార్గదర్శకులు కూడా.
విజయనగరానికి చెందిన పరవస్తు వెంకటరంగాచార్యులు 1872లో 'సంగ్రహం' పేరుతో వ్యాసాలు రాశాడు. భారతీయ మత, సాహిత్య అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. పోతం జానకమ్మ తన ఇంగ్లాండు పర్యటన గురించి వ్యాసరూపకంగా 1874లో 'ఆంధ్రభాషా సంజీవని' పత్రికలో వ్యాసాలు రాశారు. బెంగుళూరులో ఆంధ్రోపాధ్యాయులుగా ఉండిన జీయర్‌సూరి 1875లో వ్యాసాలను రాసి ' స్త్రీ కళాకల్లోలిని' పేర వ్యాససంపుటిని ప్రచురించాడు. స్త్రీల కు సంబంధించిన అంశాలే ఇందులో ప్రధానంగా ఉన్నాయి.

ఆధునిక వ్యాసనిర్మాణానికి నిర్ధిష్ట రూపం తీసుకువచ్చి సంఘసంస్కరణ, సమాజ చైతన్యం ఇతివృత్తాలుగా దాదాపు రెండువందలకుపైగా కందుకూరి వీరేశలింగం పంతులు వ్యాసాలు రాశాడు. 1875 నుండి 1879 వరకు వివిధ పత్రికలలో వీరి వ్యాసాలు 'ఉపన్యాసాలు' గా ప్రచురించారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, కందుకూరి వీరశలింగం గారి వ్యాసాలను విమర్శిస్తూ అనేక వ్యాసాలు రాశాడు. అవి 1910లో పుస్తకాలుగా వెలువడ్డాయి. ఫ్రాన్సిన్‌ బెకన్‌ ఉపన్యాసాలను 'బెకన్‌ ఉపన్యాసములు' గా 'కిళాంబి రామానుజచార్యులు' తెలుగు లో అనువాదం చేశారు. 1900 నుండి వ్యాసమనే పేరు తెలుగులో వాడుకలో ప్రారంభమైంది. 1901లో పి.ఎ.ప్రణతార్థి హరిశాన తన వ్యాస సంపుటికి 'వ్యాసమంజరి' అని 'వ్యాసం' పదాన్ని ప్రయోగించాడు.
    భాష, సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, సామాజికఅంశాలు తదితర విభిన్న రంగాలలో తొలితరం వ్యాసకర్తలుగా పైన పేర్కొన్నవారితో పాటు మానవల్లి రామకృష్ణ కవి, చిలుకూరి వీరభద్రారావు, కోరాడ రామకృష్ణయ్య, వేలూరి శివరామశాస్త్రి, వేదం వెంకటరామయ్య శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, బండారు తమ్మయ్య, గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ అప్పారావు, జయంతి రామయ్య, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కొమర్రాజు లక్ష్మణరావు, అచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ , నడుకుదుటి వీరరాజు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వేంకటరమణయ్య, కందూరి ఈశ్వరదత్తు, ఖండవల్లి లక్ష్మీ రంజనం, సురవరం ప్రతాపరెడ్డి, మట్నూరు కృష్ణారావు, చిలుకూరి నారాయణ రావు, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పప్పూరు రామాచార్యులు తదితరులెందరో కృషిచేశారు.
    1835 నుండి 'తెలుగు పత్రిక'లు ప్రారంభమయ్యాయి. తొలిదశలో మత, సాంప్రదాయ అంశాలకు పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. 19వ శతాబ్ధం చివరి దశ నుండి పత్రికలలో సంఘసంస్కరణ, భాష, సాహిత్య, చారిత్రక రాజకీయ, జాతీయోద్యమ తదితర అనేక అంశాలు వ్యాసాలుగా రావడానికి అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి.
తెలుగు సాహిత్యంలో వ్యాసాలు అనగానే అప్రయత్నంగా గుర్తుకు వచ్చేది పానుగంటి లక్ష్మీనరసింహారావు వారి 'సాక్షి వ్యాసాలు'. రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో 1865 సంవత్సరాన జన్మించిన పానుగంటి లక్ష్మీనరసింహారావు బి.ఏ.చదివి, ఉపాధ్యాయుడిగా, లక్ష్మీనరసాపురం ఎస్టేట్‌ దివాన్‌గా, పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా కొనసాగారు. నాటక రచయితగా తెలుగు సాహిత్యంలో వీరు ప్రముఖ స్థానం పొందారు. 1913లో తన నలభై ఎనిమిదో యేట 'సాక్షి వ్యాసాలు' ను 'సువర్ణలేఖ' వారపత్రికలో ప్రకటించడం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు అవి కొనసాగాయి. తిరిగి 1920,1922లలో, 1927,1933 సంవత్సరాలలో 'ఆంధ్రపత్రిక' సారస్వతానుబంధాలలో 'సాక్షి వ్యాసాలు' ప్రచురితమవుతూ వచ్చాయి.
    ఆంగ్లసాహిత్యంలో 'రిచర్డ్‌ స్టీల్‌' 1709 ఏప్రిల్‌ 12 నుండి 1711 జనవరి 2 దాకా రెండేళ్లపాటు వారానికి మూడు రోజులు 'టాట్లర్‌' వ్యాసాలను పత్రికగా కొనసాగిస్తూ ప్రచురించాడు.  తరువాత కాలంలో జోసెఫ్‌ అడిసన్‌తో కలిసి 1711 మార్చి 1 నుండి 1712 దాకా 'స్పెక్టేటర్‌' పేరున దినపత్రికగా వ్యాసాలను ప్రచురించారు. 1914లో స్టీల్‌తో సంబంధం లేకుండా అడిషన్‌ వారానికి మూడు రోజుల పాటు 'స్పెక్టేటర్‌' పత్రికను ఆరునెలల పాటు నడిపాడు. ఈ మొత్తం వ్యాసాలు ఎనిమిది సంపుటాలుగా తరువాత కాలంలో ప్రచురించ బడినాయి. ఆనాటి సాంఘిక దురాచారాలు, సామాజిక స్థితిగతులను ఇవి తెలియజేస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ఈ వ్యాసాలకు విశేషప్రధాన్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఈ వ్యాసాలు ప్రభావితం చేశాయి.
పానుగంటి లక్ష్మీనరసింహారావు కూడా ఈ వ్యాసాలతో ప్రభావితుడై 'స్పెక్టేటర్‌' పేరునే 'సాక్షి'గా అనువదించుకొని వ్యాసాలను ప్రచురించాడు. 'సాక్షి వ్యాసాల'లో తెలుగు దేశీయతే ప్రధాన జీవంగా కొనసాగాయి. గ్రాంధిక భాషలో సాగిన మొత్తం నూటాయాభై సాక్షి వ్యాసాలలో సంఘసంస్కరణ, మూఢవిశ్వాసాల ఖండన, దేశీయత, దేశాభ్యుదయం, లోకవ్యవహారాలు, భాషా,సాహిత్య, సాంస్కృతిక, సమకాలీన సమాజం తదితర అనేక అంశాలను అవి ప్రతిబింబిస్తాయి. అధిక్షేపంగా, వ్యంగ్యంగా, హాస్యాత్మకంగా ఇవి కొనసా గాయి. సాక్షి వ్యాసాలు ఉపన్యాసరూపకంగానూ, అయిదుగురు సాక్షి సంఘ సభ్యుల మధ్య సంభాషణల రూపంగాను, లేఖల రూపంగాను నడుస్తాయి. వ్యాసంలో ఉపన్యాసశైలి కొనసాగించటం వలన విషయంపట్ల పాఠకులలో మరింత ఆసక్తి కలిగించ వచ్చని ఆ పద్ధతిలో రాసి ఉండవచ్చు. పద్యం రాసినవాడే కవిగా గుర్తింపు పొందుతున్న ఆ రోజులలో గద్యం రాసి పండిత పామరుల చేత పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు మెప్పు పొందారు.
1917కు ముందు దాకా తెలుగు సాహిత్యంలో వ్యాసప్రక్రియ వికాసం పత్రికల ఆధారంగా ఆయా వ్యక్తులుగా చేసిన కృషిగా కనిపిస్తుంది. అందుకు భిన్నంగా 1917 ఆగస్టు 1 నుండి అనంతపురం పట్టణం కేంద్రంగా 'స్టూడెంట్స్‌ క్లబ్‌ అనంతపురం' పక్షాన విద్యార్థులు సమిష్ఠిగా 'వదరుఁబోతు' పేరున వ్యాసాలను  కరపత్రాల రూపంలో ప్రచురించడం ప్రారంభించారు. 1709లో 'రిచర్డ్‌ స్టీల్‌' ప్రచురించిన 'టాట్లర్‌' పేరును 'వదరుఁబోతు'గా అనువదించుకొని ఈ విద్యార్థులు  ప్రచురించారు. ''ఈ వ్యాసకర్తలు ఆ మొదటి  'సాక్షి' (1913) పేరును తెలిసియుండలేదని స్పష్టముగాఁ జెప్పవచ్చును .కావున 1917లో 'వదరుఁబోతు'  జననమునకు 'సాక్షి'తో నేసంబంధమును లేదనుట నిక్కము '' అని 1932లో పుస్తక రూపంలో వెలువడిన 'వదరుఁబోతు' పీఠికలో పేర్కొన్నారు. 1913 నాటి 'సువర్ణలేఖ' పత్రికలు వీరి దృష్టికి వచ్చి వుండక పోవచ్చు. ఒకవేళ వచ్చినా తప్పులేదు. 'సాక్షివ్యాసాలు' నలభైఎనిమిది సంవత్సరాల పండితుడు రాసినవి, పత్రిక ఆధారంగా వెలువడినవి. వదరుఁబోతు వ్యాసాలు ఇరవైలలోని విద్యార్థులు, యువకులు రాసి కరపత్రాల రూపంలో వెలువడినవి. దేని ప్రాధాన్యత దానిదే!. అదే పీఠికలో ''చేతడబ్బు ఎక్కువలేక, అధికారములేమియూ లేక యున్నవారు ఆ కాలములో పక్షమునకొకతూరి క్లుప్తముగా నాలుగైదు పుటల వ్యాసమును ముద్రింపించు భగీరథ ప్రయత్నమాపని, చేసినవారు తప్ప నితరులెఱుఁగలేరు. ఎట్లో కష్టపడి ముద్రింపించి వ్యాసములను కాలణాకొకటిగా వీధిలో అమ్మి, పోస్టు ఖర్చులు పెట్టుకొని బైటి కెందఱకో  ఉచితముగా పంపి, ఎన్నో ప్రతులు తిరిపెము పంచి, సుమారు రెండేండ్లకు మించి దీనిని నడిపి తుదకు సుప్రసిద్ధ కారణములచేత, వదరుఁబోతు వాయి మూసికొనెను'' అని పేర్కొన్నారు. దీనిని బట్టి వీరి శ్రమ అర్థమవుతుంది. 'సాక్షి','వదరుఁబోతు' వ్యాసకర్తలిరువురూ 'స్పెక్టేటర్‌, టాట్లర్‌' వ్యాసరచనల ధోరణికి ప్రభావితమైనవారే. చిన్నవయసులోని విద్యార్థులు, యువకులు సమిష్ఠిగా కరపత్రాల రూపంలో 'వదరుఁబోతు' వ్యాసాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తూ సమాజమార్పే ఆశయంగా కొనసాగించడం ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన అంశం.

'వదరుఁబోతు' వ్యాసాల ప్రచురణలో క్రియాశీలక బాధ్యత, బరువు మోసింది పప్పూరు రామాచార్యుల వారు.1896 నవంబర్‌ 8న అనంతపురంలో  రామా చార్యులు జన్మించారు. ప్రాథమిక విద్య ఇక్కడే కొనసాగింది. తన బావగారైన కుంటిమద్ది రంగాచార్యులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాలలో  అధ్యాపకుడిగా  ఉద్యోగం చేస్తుండడంతో అక్కడ వారి ఇంటనే ఉంటూ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసారు. అప్పటికి రామాచార్యుల వయస్సు పదహేడు సంవత్సరాలు. తన బావగారి ద్వారా వీరేశలింగం పంతులుగారితో పప్పూరు రామాచార్యులవారికి కొంత పరిచయం కూడా ఉండేది. రాజమహేంద్ర వరంలోని సాహిత్య, సంఘసంస్కరణ తదితర అంశాల పట్ల కొద్దోగొప్ప పరిచయం రామాచార్యులకు కలిగి ఉంటాది. 1914-1916లలో ఇంటర్మీడి యట్‌ను మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో చదివాడు. పత్రికలు, ఆంగ్ల సాహిత్యం, దేశ వర్తమాన స్థితిగతుల పట్ల అవగాహన విస్తరించడానికి మద్రాసు వాతావరణం వీరికి తోడ్పడింది. 1916లో అనంతపురంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రారంభమైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తదితర పండితులు ఈ కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఉన్న ఊర్లోనే చదువుకోవచ్చని 1917లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బి.ఏ. కోర్సులో చేరాడు. ఈ సమయంలోనే తన ఇరవయ్యేవయేట పప్పూరు రామాచార్యులు తన సహచరులు, మిత్రులు, యువకుల సహకారంతో 'వదరుఁబోతు' వ్యాసాలను ప్రచురించడం మొదలు పెట్టారు.

పదిహేను రోజులకొకసారి 1/8 సైజులో నాలుగు పుటలుగా వదరుఁబోతు కరపత్రం వెలువడేది. కరపత్రం పైభాగానా క్రమసంఖ్య, తేది, వెలతో పాటు 'వదరుఁబోతు' అని ప్రధాన శీర్షిక ఉండేది. 'పబ్లిష్డ్‌ బై ... స్టూడెంట్స్‌ క్లబ్‌ అనంతపురం' అని ఉండేది. ప్రతి కరపత్రం ప్రారంభంలో ఆంధ్రభారతములోని...

గీ|| కార్యగతుల తెఱఁగుగల రూపుచెప్పిన

నధికమతులు దాని నాదరింతు

రల్పబుద్ధులైన యట్టివారలకది

విరసకారణంబు విషము వోలె'' అనే పద్యం ప్రచురించేవారు.

వదరుఁబోతు వ్యాసం చివరన ఆ వ్యాస రచయితలకు గుర్తుగా వారి పేర్లలోని ఒక అక్షరం సంకేతంగా ప్రచురించేవారు. వ్యాసం చివరలో వ్యాసాంశానికి అనువైన సూక్తియో, శ్లోకమో, పద్యపాదమో ప్రచురించేవారు. స్వామివిలాస ప్రెస్‌-అనంతపురం అని ప్రెస్‌వారి పేరు ఉండేది. ఇది వదరుఁబోతు కరపత్రం బాహ్య స్వరూపం.

మొత్తం రెండేండ్ల కాలంలో యాభై వ్యాసాలు ప్రచురించగా అందులో హిందూపురంలోని పక్కా గురురాయాచార్యుల వద్ద లభ్యమైన ఇరవై రెండు వ్యాసాలను 1932లో వదరుఁబోతు పుస్తకంగా సాధన ముద్రణాలయం పక్షాన ప్రచురించారు. పప్పూరు రామాచార్యులవారే ఈ ముద్రణాలయం నిర్వాహకుడు. అందులో ఇరవై వ్యాసాలు వదరుఁబోతు కరపత్రాలు కాగా రెండు వ్యాసాలు పినాకిని పత్రికలో ప్రచురితమైనవి ఉన్నాయి. ''కర్తలు స్థలాంతరములకుఁ బోయి కార్యాంతరములకుఁ జిక్కి పోవుటచేతను, ఒకతూరి వ్రాసి పంచి పెట్టుటచేత తాము తలపెట్టిన పనియైనది గావున నీవ్యాసములను భద్రపఱచి యుంచ వలసినంత యక్కర వారి కంతగా లేకపోవుట చేతను పై వ్యాసములలో ననేక ములు దుర్లభములైనవి'' అని పీఠికలో పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా  ఎంత ప్రయత్నించినా మిగతా ముప్పై వదరుఁబోతు వ్యాసాలు నాకు లభించలేదు. రాయలసీమలో స్వాతంత్య్రం  పొందేనాటికి దాదాపు యాభై పత్రికలు వెలువడినాయి. వాటిలో మనకు ఒకటిరెండు మాత్రమే లభ్యమవు తున్నాయి. కనీసం యాభై ఏళ్ల క్రిందట సీమవాసులు ప్రచురించిన పుస్తకాలు కూడా నేడు అలభ్యాలుగా ఉన్నాయి. వీటిపట్ల సీమవాసులు బాధ్యతగా వ్యవహ రించి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే గత కాలానికి సంబంధించిన ఎంతో విలువైన  సమాచారం  చేజేతులా పోగొట్టుకున్నవారమవుతాము. తమ వద్ద ఉన్న పాతపత్రికలు, పుస్తకాలు అటకలమీదికి ఎక్కించి బూజు, చెదలు పట్టించుట కంటే, గుప్తధనంగా దాచుకొనేకంటే వాటిని లోకానికి వెల్లడిచేయటం ద్వారా, వెల్లడించేందుకు ప్రయత్నించే పరిశోధకులకు తోడ్పడటం ద్వారా రాయలసీమకు మహోపకారం చేసిన వారవుతారు.

కరపత్రాలుగా వెలువడినప్పుడు వదరుబోతు వ్యాసాలకు శీర్షికలు లేవు.1932 ముద్రణలో చదువరులకు అనుకూలంగా ఉండేందుకు ప్రతి వ్యాసానికి శీర్షికలు ప్రకటించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక రాసారు. ప్రచురణ కర్తలు ఇచ్చిన సమాచారం మేరకు మొదటి కరపత్రాల సంఖ్య ప్రకారం, ఏడవ నెంబరు కరపత్రం 1917 నవంబర్‌ 1న వెలువడినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి మొదటి కరపత్రం 1917 ఆగస్టు 1న వెలువడి వుంటుంది. ఏడవ నెంబరు కంటే ముందువి నాలుగు, ఐదు, ఆరు మాత్రమే లభించాయి. ఒకటి, రెండు, మూడు కరపత్రాలు లభించలేదు. ఇరవైరెండవ కరపత్రం 1917 సంవత్సరం అని మాత్రమే పట్టికలో చివర ఇచ్చారు. ఈ కరపత్రం ఎనిమిదోవ నెంబరు 1917-11-15న దీపావళి సందర్భంగా ప్రకటించబడి వుంటుంది. మొత్తం యాభై కర పత్రాలలో ఇరవై మాత్రమే లభించాయి, మొదటి మూడు, పదహేనవ మరియు చివరి ఇరవైఆరు కరపత్రాలు లభించలేదు. చివరి కరపత్రం 1919 ఆగస్టు 30న వెలువడి ఉంటుంది.

1932 నాటి 'వదరుఁబోతు' పుస్తక పీఠికలో ''ఇదిగాక ఇంచు మించుగా నీ'వదరుబోఁతు' జన్మించిన కాలమందే గుంటూరు నుండి కాఁబోలు నొక్కరు ఇట్లే కొన్ని వ్యాసములు ప్రకటించుచుండిరి. వాని పేరు ప్రకృతము మఱచితిమి. ఎట్లో వారు మకుటముగా నుంచుకొని యుండిన ఈ క్రింది పద్యమొకటి జ్ఞప్తిలో నిలిచినది.

తే. 'ఉద్ధరించెద దేశమేనొక్కరుఁడనె

నిక్కమియ్యది చేయంగ నేర రొరులు

అనుచు విలియము పిట్టను నతఁడు పలికె;

అట్లెయందఱుఁ దలఁచిన నగును శుభము'.

గుంటూరు మిత్రు లొక్కరివద్ద నీ వ్యాసపత్రములు రెండుండఁగాఁ జూచియుంటిమిగాని యితరులీప్రాంతములలో నెవరును వాని నిదివఱకు కనియెఱుఁగరు. వినియెఱుఁగ రన్నను తప్పులేదు'' అని ప్రకటించారు. 1935 నాటి 'వదరుఁబోతు' పుస్తకం పునర్ముద్రణలో పై గుంటూరు వ్యాసపత్రాల సమాచారం తొలగించి ప్రచురించారు. ఆధారాలు లభించని సమాచారం రెండవ ముద్రణలో అవసరం లేదని భావించి ఉండవచ్చు. వీటిపై పరిశోధకులు దృష్టి పెడితే అవి కూడా లభించవచ్చు.

్జ్జ్జ

ఈ వ్యాసాలు పరోపకార గుణం, విలువలతో కూడిన విద్య, గ్రంథాలయాలు, కళాశాలల ఆవశ్యకత, దేశాభ్యుదయం, సహజస్వభావశక్తి విశిష్టత, స్వదేశీ వస్తూత్పత్తి, మూఢ మతభక్తి నిరసన, అనర్హగౌరవం, కీర్తికండూతి, ఆడంబర జీవనం, అనవసర ధనవ్యయం, పరాయిసంస్కృతి, పరాయి అనుకరణ వ్యతిరేకత, హాస్యం ఆవశ్యకత, సత్యసంధత, కవిత్వ నాటకతత్త్వం, తెలుగు సంస్కృత సాహిత్యాల వికాసం, ఇలా మానవ ప్రవృత్తికి, సమాజ పోకడలకు సంబంధించిన అనేక అంశాల నేపథ్యంగా 'వదరుఁబోతు' వ్యాసాలు సాగుతాయి.

    వ్యాసాంశానికి లోబడి ఏమాత్రం సంగ్ధిత లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం వీరి ప్రత్యేకత. ఆయా సందర్భాలలో కొన్ని వ్యాక్యాలను గమనిస్తే వీరి ప్రాపంచిక దృక్పథం అర్థమవుతుంది.

''సుగుణ దుర్గుణములకు లింగ వ్యవస్థ యుండదు'',

''క్షుద్రజంతువులును తమ భోక్తను దప్ప యితర మృగములను ద్వేషింపవు. మనుజుఁడన్ననో స్వభావము చేతనే సర్వజంతువులను ద్వేషించును''.

''సంఘమునకుఁ జెఱుపుఁ గలిగించు కార్యములనే గదా వారు నరక హేతువు లగు పాపకార్యములనుట. మనకుఁ జేతనైనంత మట్టున కితరులకు మేలు చేయుచు, సంఘమున కేవిధమగు కీడుఁగలిగింపక నలుగురిలో సజ్జనుఁడని పించుకొన్నచో''

''భావనా శిల్పముల నెఱంగక వ్రాయఁబడు కవితకును గవితయను పేరు చెల్లునేని,యిఁక ప్రపంచమున నూటికి నూరువంతులు కాళిదాసులే యగుదురు గదా? అపుడాడిన మాటలన్నియు నాశుధారలై పాడిన పాటలెల్ల ప్రబంధము లగును''

''అన్ని నీతి శాస్త్రములయు, అన్ని ధర్మశాస్త్రములయు, అన్ని మతగ్రంథములయు సార మీ సత్యసంధతమే. అది లేక యుండెనా మానవుఁడెంత పండితుఁడైనను, ఎంత యాచారవంతుఁడైనను ఏవగింపఁదగిన వాఁడే. 'సత్యము సర్వశ్రేయో మూల'మని పెద్దలే నుడివి యున్నారు''

''యోగ్యత ననుసరించి గౌరవము తనంత రావలయుఁగాని, కొలఁదికి మీఱి యపేక్షించినంత రాదనుట ధ్రువము''

''తెలియని మతములకై యర్థముకాని గ్రంథములఁ జదివి రానిపోని స్వర్గసుఖమున కర్రులు సాచుటకన్న మనయింట మనయూర, మన దేశమున, మన సంఘమున, మన జీవితముల నుపయుక్త ములుగఁ జేయుట మిగుల ముఖ్యమని నాయాశయము ''

''సామాన్య ధర్మములలో రుచిలేక విశేషధర్మము లెఱుఁగక యందు నిందుఁ గొఱగాని యవివేకులగు చదివినవారికన్న నపండితుఁడేమేలని ప్రపంచ తత్వవేత్తల మతము''

''ధనమును మితిలేక వెచ్చించి బాణములగొని తమ ధనుర్విద్యనంతయు నాపయింబెట్టి తగులఁబెట్టినచో వీరికేమి ఫలము? నాకై పాడు చేసిన ద్రవ్యమున  సగబాలుతో నూరూర మంచి గ్రంథాలయములగునే? ఇట్టి ధనమంతయు ప్రోగుచేసినచో నొక గొప్ప జాతీయకళాశాల యేర్పడదా? దేశము బాగుపడదా? ఏమి మౌర్ఖ్యమిది! ఆ బాణములైన తమంత జేసికొను శక్తి వీరికి లేదే ? ఏ జపానుతల్లియో, ఏచీనా సోదరుఁడో, తయారుచేసి వీరికి భిక్ష మివ్వవలసి యుండుటకైన వీరు సిగ్గుపడరు గదా''!

ఈ విధంగా తామనుకున్న భావాలను, నమ్మిన సత్యాలను గొంకు జంకు లేకుండా ప్రకటించడం అనాటికి గొప్ప విషయమే.

ఈ వ్యాసాలు ఉత్తమ పురుషలోను, ఆత్మస్వగతంగా చెబుతున్నట్లు, సర్వసాక్షి దృష్టికోణంగా, సందేశాత్మకంగాను కొనసాగుతాయి. వ్యాసాల ఎత్తు గడలో, విషయచర్చలో,

ఉపపత్తుల సమీకరణలో, ముగింపులలో ఇలా అన్ని సందర్భాలలో నిర్మాణ నైపుణ్యం భావితరాలు అనుసరించదగ్గవి.వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకొనేవారికి నమూనాగా ఈ వ్యాసాలు తోడ్పడుతాయి. అందుకే 1950వ దశకంలో ఉన్నతపాఠశాలల తెలుగు పాఠ్యపుస్తకాలలో 'వదరుఁబోతు' వ్యాసాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి దాకా పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 'వదరుఁబోతు' వ్యాసాల పీఠిక పాఠ్యాంశంగా ఉండింది.

''సుమారు రెండేండ్లకు మించి దీనిని నడిపి తుదకు సుప్రసిద్ధ కారణములచేత వాయి మూసుకొనెను'' అని పీఠికలో ప్రచురించారు. అలాంటి సుప్రసిద్ధ కారణములు పరిశోధకులు ఆలోచించాలి. పత్రిక నిర్వహణ వ్యయం కష్టమవటం, వ్యాసకర్తలైన విద్యార్థులు చదువులో నిమగ్నం కావటం, వ్యాసకర్తలు ఉద్యోగాలలో కొనసాగుతుండటం, ఈ వ్యాసాలపట్ల ఆనాటి ప్రభుత్వాల నిఘా ఇలా కారణాలేవైనా ఉండవచ్చు. చివరి పత్రికలు లభించివుంటే మరింత సమాచారం దొరికేది. ఎట్టకేలకు 1919 ఆగస్టు 30కి 'వదరుఁబోతు' వాయి మూగబోయింది.

'వదరుఁబోతు' ప్రచురణకరైన పప్పూరు రామాచార్యులు 1920లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగానే అనంతపురం కలెక్టర్‌ కచేరిలో చిన్న ఉద్యోగం వచ్చింది. స్వతంత్య్రంగా జీవించాలన్న ఉద్దేశంతో 1921 మార్చి నెలలో ఆ ఉద్యోగం మానివేసారు. ఉద్యోగమైతే మానివేశారుగానీ ఆ తరువాత ఏపని చేయడానికి అవకాశాలు దొరకలేదు. కైప సుబ్రహ్మణ్యశర్మ గారి తోడ్పాటుతో ఇల్లూరు గ్రామంలోని నీలం చిన్నపరెడ్డి కుమారులకు చదువు నేర్పడానికి బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్లకు ఆ గ్రామ కరణం ఐతరాజు నరసప్ప మరియు కైప సుబ్రహ్మణ్యంలతో కలిసి 1922 సెప్టెంబర్‌ 16న 'పినాకిని' పేరున పత్రికను అనంతపురం కేంద్రంగా ప్రచురించడానికి పప్పూరు రామాచార్యులు సిద్ధమయ్యారు. ఆ పత్రికకు 'స్వరాజ్యోదయం' అనే పేరు పెట్టాలని చర్చకు రాగా 'స్వరాజ్యోదయం అనే పేరు కంటే దత్తమండలాలకన్నిటికీ జీవప్రధాయిని అయిన పినాకిని (పెన్నానది)'' పేరు మీదనే పత్రిక నిర్వహిం చాలని రామాచార్యులు చొరవ తీసుకున్నారు.

ఆనాటికే రాయలసీమ ప్రాంతం ఔన్నత్యం, అస్తిత్వానికి సూచకంగా ఈ పేరు ఉంచటం ఆయనకీ ప్రాంతంపట్ల ఉన్న అభిమానం, బాధ్యతను తెలియజేస్తాయి.  'వదరుఁబోతు' వ్యాసాలు ఎంత సార్వజనీనమైనప్పటికీ అందులో స్థానీయ అంశాలు కూడా కనిపిస్తాయి. పినాకిని, కరువుల, జొన్నంబడి, కొర్రకూటికి తదితర ప్రస్తావనలు ఈ ప్రాంత జీవితంతో ముడిపడినవే. 'వదరుఁబోతు' వ్యాసాల పరంపరలోనే పినాకిని పత్రికలో 1922లో రెండు వ్యాసాలను ప్రచురించారు. అవి కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మరిన్ని వ్యాసాలు పినాకినిలో ప్రచురించి ఉంటారు. ఆ పత్రిక అలభ్యంగా ఉంది. 1920లో ఆదోని కేంద్రంగా సి.శ్రీనివాసరావు సంపాదకత్వంలో 'అరుణోదయం' పత్రిక, 1922లో అనంతపురం కేంద్రంగా అనంతగిరి వీరనార్యకవి సంపాద కత్వంలో  'బాలభారతి', 1925లో అనంతపురం కేంద్రంగా యం.సుందరమ్మ సంపాదకత్వంలో 'భారత మహిళ', 1927లో పత్తికొండ కేంద్రంగా వనం శంకరశర్మ సంపాదకత్వంలో 'ఇంద్రావతి' తదితర పత్రికలు రాయలసీమ ప్రాంతంలో వెలువడినాయి.  ఈ పత్రికలలో 'వదరుఁబోతు'  కోవ వ్యాసాలు ప్రచురించి వుండే అవకాశముంది. పరిశోధకులు అలభ్యాలుగా ఉన్న ఆ పత్రికలను అధ్యయనం చేయాల్సి ఉంది.

పినాకిని పత్రిక మూడున్నరేళ్ల పాటు కొనసాగి నిర్వహణ వైరుధ్యాలవల్ల 1926 మార్చి నాటికి ఆగిపోయింది. పినాకిని పత్రిక దూరం కావటం కన్నబిడ్డకు దూరమైనంత బాధగా ఉందని పప్పూరు రామాచార్యులు వాపోయారు.  పినాకిని పేరునే పత్రికను నడపాలని ఎంతో ప్రయత్నించినా చట్టరీత్యా అది సాధ్యపడ లేదు. ఎట్టకేలకు తన ముప్సైయ్యోవ యేట తాను సంపాదకుడుగా, తన  మిత్రుడైన కర్నమడకల రామకృష్ణమాచార్యులు సహాయ సంపాదకుడుగా 'సాధన' పత్రికను వారపత్రికగా పన్నెండు పుటలతో ప్రచురించడం ప్రారంభించారు. 'వదరుబోతు'లో లాగే ప్రతి సాధన పత్రిక సంచికలోనూ భారతంలోని 'కార్య గతుల' పద్యం ప్రచరరించేవారు. 1972 దాకా నిర్విఘ్నంగా 46 సంవత్సరాల పాటు పప్పూరు రామాచార్యులు సాధన పత్రికను నడిపారు.

'వదరుబోతు' స్ఫూర్తితో అదే పంథాలో సాధన పత్రికలో విభిన్న వ్యాసాలకు విశేష ప్రాధాన్యతనిచ్చారు. పత్రికలో వార్తలు అరభాగం వుంటే వ్యాసాలు అరభాగముండేవి. సాక్షివ్యాసాలను అనుసరించి ఆదోనిలోని కొందరు యువకులు 'ఆదోని పురాణసంఘం'గా ఏర్పడి 1928 ఫిబ్రవరి 2 నుండి రాసిన మూడు వ్యాసాలను 'సాధన' పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు. ఈ వ్యాసాలు ఆనాటి స్త్రీల పరిస్థితులు, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, విధ్వంసమ వుతున్న విలువల గురించి తెలియజేస్తాయి. ఈ వ్యాసాలను కూడా ఈ పుస్తకంలోని అనుబంధంలో ఇవ్వడం జరిగింది. పప్పూరు రామాచార్యులు జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రాయలసీమ బాగోగుల కోసం వందల వ్యాసాలను సాధన పత్రికలో రాసాడు. రాసినవాళ్లవి ప్రచురించారు.ఈ ప్రాంత ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి పాటుపడ్డారు. ఈ విధంగా 'వదరుబోతు' జననంలోనూ, 'వదరుబోతు' కరపత్రాలను రాయడంలోను, ప్రచురణలలోను, వదరుబోతును పుస్తకంగా ప్రచురించడంలోనూ, వదరుబోతు స్ఫూర్తిని పినాకిని, సాధన పత్రికలలో కొనసాగించడంలోనూ పప్పూరు రామాచార్యులకు విడదీయరాని బంధం ఉంది. పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు 1986 సంవత్సరంలో 'వదరుఁబోతు'ను ప్రచురించారు.

ఈ సంవత్సరానికి 'వదరుఁబోతు' వందేళ్లు నిండిన సందర్భంగా నేటికీ ఆ వ్యాసాల ఆవశ్యకత ఉందని భావిస్తూ, నేటి విద్యార్థులకు, యువతకు మహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ 1932, 1935ల నాటి 'వదరుఁబోతు'  పుస్తక ప్రతుల ఆధారంగా ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాను. ఈ పుస్తక అనుబంధంగా పప్పూరు రామాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వదరుఁబోతు తొలి ముద్రణల ముఖచిత్రాలు, కరపత్రాలప్రతులు, ఆదోని పురాణసంఘం వ్యాసాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షివ్యాసాలలోని 'కర్నూలులోని కాటకం' వ్యాసాన్ని, రిచర్డ్‌స్టీల్‌-టాట్లర్‌, జోసఫ్‌ అడిసన్‌-స్పెక్టేటర్‌ ప్రతులను చేర్చడమైనది.

('వదరుబోతు' వ్యాస సంపుటి ముందుమాట నుండి సంక్షిప్తంగా)

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...