Wednesday, April 3, 2013

రతనాల జాడను వెతికి చూపిన 'రాయలసీమ వైభవం''

అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట.. అంటూ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయలసీమ అనుభవించిన సంపదలను గురించి కవులు వర్ణించడం
అందరికీ తెలుసు. అయితే గతమెంతో ఘనకీర్తి కలవాడా అంటూ చరిత్రను పారాయణం చేయడం కాకుండా, ఆ ఘనకీర్తి ఏమిటో ప్రతి కొత్త తరానికీ తెలియాలి. సమిష్టిగా జరగాల్సిన ఈ బృహత్ కృషిలో పాలుపంచుకునే వారు.. అందరి కృషిని సమన్వయించి సారథ్యం వహించగలిగిన వారు ఇప్పుడు చాలా అవసరం. ఒకనాడు మెరిసిన రాయలసీమ వైభవాన్ని గురించి టముకు వాయించడం కాకుండా దాని విశేషాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చి, సీమ ఘనచరిత్రను జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేసిన వారు తవ్వా ఓబుల్ రెడ్డి. 'రాయలసీమ వైభవం' అనే పేరుతో ఆయన ఇటీవల తీసుకువచ్చిన అరుదైన పుస్తకం సీమలోని నాలుగు జిల్లాల -కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం-లోని ప్రకృతి వనరులు, పుణ్య క్షేత్రాలు, సీమ గడ్డపై జన్మించిన మహనీయులు ఇలా అన్నింటినీ పరిచయం చేస్తూ.. సీమ సంస్కృతి, సాహిత్యం, కళల గురించి ఓబుల్ రెడ్డి విజ్ఞులతో మంచి వ్యాసాలు రాయించారు.

ఈ పుస్తకంలో.. నాటి మొల్ల, అన్నమయ్యలు మొదలుకుని, మొన్నటి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు నుంచి నిన్నటి తరానికి చెందిన తిరుమల రామచంద్ర, మధురాంతకం రాజారాం, రాచమల్లు రామచంద్రారెడ్డి వరకు సీమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఎందరో పండితోత్తములను పరిచయం చేశారు. వసుచరిత్ర, మనుచరిత్ర వంటి ఎన్నో మహాకావ్యాలు కవుల ఘంటాలనుంచి జాలువారింది కూడా ఇక్కడే అని ఈ పుస్తకంలో అందరికీ గుర్తు చేశారు. మరోవైపున నాటకరంగం అనగానే గుర్తుకు వచ్చే బళ్లారి రాఘవ నుంచి.. తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయులైన కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి లాంటి మహనీయుల వరకు మాత్రమే గాక, రాజకీయ రంగంలో ముఖ్యమంత్రులైన వారి నుంచి, రాష్ట్రపతులైన వారి దాకా పలువురు దిగ్ధంతుల వివరాలు ఈ పుస్తకంలో తెలియపర్చారు.

అన్నిటికన్నా మించి ఈ పుస్తకం ముందుమాటలో సీమ ప్రజల స్వభావాన్ని పట్టి చూపించే మెరుపు వాక్యాలను పొందుపర్చటం విశేషం. ....మాట కటువైనా మనసు వెన్న.. ఆప్యాయతలూ అనురాగాలూ రాయలసీమ ప్రజల నైజాలు. అన్ని మతాల ప్రజలు ఐకమత్యంగా జీవించడం ఇక్కడ విశిష్టత...

ఈ పుస్తకం చదివితే పై వాక్యాలు అక్షర సత్యాలని ఎవ్వరైనా ఒప్పుకుంటారు మరి.
-శివ శంకర్ ప్రణవం

రాయలసీమ వైభవం
సంపాదకులు : తవ్వా ఓబుల్ రెడ్డి
పుటలు 130. వెల: రూ. 150

రాయలసీమ కథాసారథి - కె.సభా

రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన
బహుముఖ ప్రజ్ఞాశాలి కీ.శే. కె.సభా. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి సీమ వాడి, వేడి, జిగి, బిగి, ఆర్ద్రత, ఆప్యాయతల స్థాయిని చాటిన సభా బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. ఆంధ్రప్రభ, జమీన్‌ రైతు, నాగేలు, వాహిని పత్రికల్లో సంపాదకవర్గంలో పనిచేసి దేవదత్తం వారపత్రికను స్వయంగా నడిపారు. పాంచజన్యం అనే ఆంగ్లపత్రికను నిర్వహించారు. సమకాలీన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై వందల కొద్దీ వ్యాసాలను ప్రచురించడమే కాక విమర్శకుడిగా అనేక విమర్శనావ్యాసాలు, పుస్తక సమీక్షలు వెలయించారు.
చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1న సభా జన్మించారు. 8వ తరగతి తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి 16 సంవత్సరాల వయస్సులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. బి.ఏ వరకు ప్రైవేటుగా చదివారు. శ్రీ రమణ పబ్లికేషన్స్‌ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. సభా తండ్రి చెంగల్వరాయుడు వీధిబడి ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తల్లి పార్వతమ్మ పాలు, నెయ్యి అమ్మి కుటుంబానికి తోడ్పడేది. సభా కొంతకాలం పశువులు కాశారు. అయిదో తరగతి పాఠ్యపుస్తకాలను కొనడానికి ఎరువును సేకరించి అమ్మారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య పట్టుదలతో చదివి ఎదిగిన సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు. 1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించిన సభాకు రైతులలో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తమకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభా అనుభవంలో రైతు కష్టాల్ని రంగరించుకున్నారు. గొడ్డూ గోదా మేత కోసం వాటితో పాటు మండుటెండల్లో కాపరిగా తిరిగిన ఆయనకు ఆకలి బాధేమిటో అవగతమైంది. మద్యనిషేధం ఎత్తివేతతో ఛిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీలయాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.
1923 -1980 ల మధ్య జీవించిన సభా చిత్తూరు -జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో సభ్యులుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి. పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి. పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాల్ని సేకరించి ప్రచురించిన సభా లెక్కకుమించిన రేడియో ప్రసంగాలు చేశారు.
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. 'పిచ్చిదంపతులు' అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. 'అంబా' కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. 'అంతరంగం' కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. 'చుక్కలవరాలు' కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.

-- -తిరునగరి శ్రీనివాస్‌
(తిరుపతిలో నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌బిటి) ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత కీ.శే. కె.సభా కథా సాహిత్య సంచిక ఆవిష్కరణోత్సవం ఈ నెల 9న జరిగిన సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం)
Andhra Prabha daily, 10 September 2011 artical on K.Sabha writer of Rayalaseema

Tuesday, April 2, 2013

రాయలసీమ ప్రాంత చైతన్య కవిత్వము- సుంకి రెడ్డి నారాయణ రెడ్డి

1980 థకంలో సీమ చైతన్య ఉద్యమాలు ప్రారంభమయిన తర్వాత కొత్తతరం కవులు వచ్చినారు. సీమ వాస్తవికతను రచనలుగా మలచడం అధికమైంది. రాయలసీమ చరిత్రలో నూతనాధ్యాయం మొదలయ్యింది. కవులే కాక, కథారచయితలు, మేధావులు, కూడా సీమ వేదనను కవిత్వంలో ఆవిష్కరించారు. రాయలసీమ జీవితమే ఇతివృత్తంగా జూపల్లి ప్రేంచంద్‌ ''ఆవేద'' రఘుబాబు ''సంఘటిత స్పర్శ'' వై.శ్రీరాములు ''జలగండం'' అనే దీర్ఘ కవితలు రాసినారు. ఈ రెండు థాబ్ధాల కాలంలో వచ్చిన కవుల లిస్టు చాలా పెద్దదే. కొంతమందిని పేర్కొంటాను. పులికంటి కృష్ణారెడ్డి, శాంతినారాయణ, ఎస్‌.మునిసుందరం, రాచపాలెం చంథ్రేఖరరెడ్డి, సూర్యసాగర్‌, శ్రీనివాసరెడ్డి, హెచ్చార్కె, దాదాహయత్‌, రాప్తాడు గోపాలకృష్ణ, వి.ఆర్‌.రాసోని, నరాల రామిరెడ్డి,సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, రాధేయ శశిశ్రీ, గుడ్లపల్లి చిదంబరరెడ్డి, మల్లెల నర్సింహ్మామూర్తి, ఎస్‌.జయ, ఏ.ఎన్‌.దస్తగిరి, కెఎం.రాముడు, గోపిని కరుణాకర్‌, నాగప్పగారి సుందర్రాజు, సుంకోజు దేవేంద్రాచారి, నూకా రాంప్రసాదరెడ్డి, జి.వెంకటకృష్ణ, శాంతికుమార్‌, ఎస్‌. రామచంద్ర, రాజారామ్‌, బిక్కికృష్ణ. షమీవుల్లా, నిర్మలారాణి, శశికళ, సాయిప్రసాద్‌ మొ|| వారు.
ఇక ఈ కవులు రాయలసీమ తమ కవిత్వంలో ఎట్లా పట్టుకున్నారో పరిశీలిద్దాం.
ఆదురు చూపుల ఎడారి వాసులకు ఎండమావి
శ్రీభాగ్‌ ఒప్పందం
స్వార్ధం పులుముకొని రంగులు మార్చే
రాజకీయ ఊసరవెల్లులు
అభివృద్ధికి వారసులై
మిమ్ము నిస్సహాయంగా గెంటేసి నపుడు
ఒప్పందాలు నీటిమీద రాతలే
నెత్తురు కార్చేసీమ -నేల పగిలిన సీమ (ఏ.ఎన్‌)
రాయలసీమ అభివృద్ధికి మూలం కావలసిన శ్రీభాగ్‌ ఒప్పందంలో ప్రధానాంశం నదులపై ప్రాజెక్టులు నిర్మించడం. అది జరుగలేదని ఇక్కడ కవి ఆగ్రహిస్తాడు.

నాగరికతలు నీళ్ళలోనే ప్రవహిస్తాయి. చరిత్రను ఏటి అలలే రాస్తాయి నీళ్ళ కారణంగానే, నీటి ప్రాజెక్టుల కారణంగానే కోస్తాంధ్ర 'నాగరిక' ప్రాంతమైనందున అవి లేని కారణంగానే సీమ అనాగరికమైందని ముని సుందరంగారంటున్నారు. గౌతమి, కృష్ణవేణులు సాగరంలో పడి ఆత్మ హత్యంచుకుంటున్నాయి

రాయలసీమ కరువు సీమగా విసిరేసి నదులున్న ధగా సముద్రంలో కలుస్తున్న వైనాన్ని జూపల్లి ప్రేంచంద్‌ కవితాత్మకంగా చెప్పినాడు. నీటి ప్రాజెక్టులు కట్టని పాలకుల నిర్లక్ష్యాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. ఇక్కడి ఊర్లపేర్లన్నింటి చివర సముద్రమే కాని సముద్రమెక్కడా లేదంటాడు మరోకవి.
వానమాట విన్పిస్తే చాలు
చెవులు అలుగుల్ని సవరించుకునే చెరువులవుతున్నాయి. అన్న సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, పై కవులూ ఇంకా చాలా మంది కవులు వర్షాధార ప్రాంతమైన సీమకు నీరెంత ముఖ్యమో వాన ఎంత ప్రాణప్రదమో వైశ్రీరాములుఈ నీళ్ళ మీదనే కావ్యం రాశాడు. ఇటు ప్రాజెక్టులు కట్టక, అటు చాలాకాలంగా వానలు పడక సీమ గిలగిల కొట్టుకుంటున్నది. ఈ స్థితిని కవులు హృదయ విదారకంగా చిత్రించినారు.
రాజకీయం నెత్తుటి మడుగు :
అందులో దాహం తీర్చుకునే ప్రతిఫలినీ అడుగూ.........
డేగల రాజ్యంలో / 
కోయిల ఊసెక్కడిది....../ 
సీమ నిర్మల భూముల్లో / 
రైతు రాతి వాసన వేస్తాడు....... నాగలి/ 
ఆకలితో జచ్చిన పాముల్లా పడి వుంటుంది. రాళ్ళవలేనాన్ని జ్వాలకు / 
అనువాదం నా కవిత్వం..... కరువును కవితాత్మకంగా చెప్పిన మల్లెల నరసింహ్మామూర్తి ''వర్తమాన రాయలసీమ కవుల్లో ప్రముఖుడు.
నా సీమ వర్తమాన చరిత్ర 
జీవరసం ఇంకి
పోయిన మట్టి చరిత్ర 
 నేతల నిర్లక్ష్యపు చూపు
ల్లోంచి జారినపాత్ర. అంటాడు రాధేయ -
కాసంత వానపడదా - అని 
తోట్లో కాసుకుని
కూకుండే
కాసిన పూత రాలిపాయే 
వావికండ్లు
మాత్రం కాయలు కాసే'' 
అంటాడు సడ్లపల్లి చిదంబరం రెడ్డి.
''ఈ ఎడారిలో మొలిచే ప్రతి ఇసుక రేణువు చేజారి పోతున్న ఒక సంకటి ముద్దకు ఆనవాల్లు'' అంటాడు దాదా హయత్‌.
నాన్నను ఆశపెట్టని బావి
ఇప్పుడు నిన్ను మోసం చేస్తుందా తమ్ముడూ అంటున్నది. ఎస్‌.జయ.

రాయలసీమ మా తల్లి......
పది మట్లబావులు కూడా బావురుమంటున్న వెత నీది
సుగ్గిలో కూడా ఆకలి తీరని అభాగ్యం నీది'' 
అంటాడు సూర్యసాగర్‌.
''రుతువులైన్నైనా మారాళ్ళసీమకు ఒకే రుతువు -కరువు రుతువు 
 కాలాలెన్నైనా మా బీళ్ళ సీమకు ఒకే కాలం - ఎండాకాలం'' 
అంటాడు వై. శ్రీరాములు.
 ''సేద్యం జూదమై పోయింది 
మా అమ్మ మెడలోని తాళిబొట్టు పసుపు కొమ్మైంది... 
మా తాత బస్టాండులో బిచ్చగాడై పోతు'' 
అంటాడు గోపిని కరుణాకర్‌.
''ఇక్కడ నీళ్లు లేవు 
 కన్నీళ్ళు లేవు 
 సిరి సంపదలు లేవు
 చలువ పందిళ్ళు లేవు
 తరాల బండరాళ్ళ వలె
 మొండి బ్రతుకులున్నాయ్‌ - 
అంటాడు మునిసుందరం.
కడుపులో ఆకలిని 
డప్పు అంచుతో అణచి పెడుతున్నట్టు
పొట్టకు హత్తుకొని డప్పువాయిస్తున్నాడు''
అంటాడు వి.ఆర్‌.రాసాని.
వురితాడు పేనిన పత్తి
 పురుగు మందు తాపిన వుల్లిగడ్డ 
బతుకులా బజారు పాలైన
 రేటు పలుకని టమోటా.......
వూడలు దిగని వేరు శెనగ
బోరులో పడ్డ బాల్యంలా వుక్కిరి బిక్కిరి చేసి చంపుతున్నది
 సేద్యం బతుకు సీమ రైతును ఆదుకొని ప్రతి పంటా మృత్యు హస్తం కావటాన్ని బలంగా చెబుతాడు జి.వెంకటకృష్ణ. 1998 నుండి మొదలై వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాస్తవానికి వ్యక్తీకరణ ఈ పంక్తులు.

ఈ సీమ వస్త్ర కళానైపుణ్యంలో 
 రూపుదిద్దుకున్న ధర్మవరం పట్టు చీరెలు
ఆకలి చావులకు ఆలవాలమై అని కరువుకూ చేనేత కార్మికుల చావుకు గల సంబంధాన్ని చెబుతాడు రాధేయ.

ప్రాజెక్టులు కట్టక, వానలు గురువక కరువులో తల్లడమల్లడమైన రైతులు తమ ప్రాణంలో ప్రాణమైన పశువుల్ని, తమకు జీవనాధారమైన పశువుల్ని కబేళాలకు తెగనమ్మిన దృశ్యాన్ని, చనిపోయిన దృశ్యాన్ని ఇక్కడి కవులు కళ్ళకు కట్టినారు.
బతుకు అప్పుల పాలై
కండ్ల బావుల్లో కన్నీరు ఒకతా వుండేది
తల్లి పాలకు నోసుకోని నీకు పాలిచ్చి
నీ ప్రాణాలను నిలబెట్టిన పెద్దావు
బర్రెముకలు బయటపడి
నీ ఫోటో కల్ల జూస్తా పాణిమిడిసిందిరా........
అని తండ్రి గోపినికి రాసిన మాటలు
తడారిన గొంతుతో నేనూ నేల
గడ్డి కోసమని కసాయి వాని వెంట నడిచిన పశువులు.
అన్న నూకా రాంప్రసాద్‌ రెడ్డి మాటలు కరువు సీమ మనుషుల్నే కాదు పశువుల్లో ఎట్లా తరిగిందో తరిమిందో చెబుతాయి.
 కవులు ఈ దృశ్యాల్ని చిత్రించకపోతే లోకాని కెలా తెలుస్తుంది. సీమ అంటే లోకానికి ఒకనాటి రతనాల సీమో, ఇప్పటి బాంబుల సీమో అనేదే తెలిసి వుండేది. అందుకని కవి ఆయా కాలాన్ని రికార్డ్‌ చేసే చరిత్ర కారుడు కూడా.

మాకు 
కరువు చావుకన్నా
ఆకలి చావు కన్నా
వరద ఎంతో సుఖమనిపిస్తుంది.
 అన్న రాచపాలెం కవిత్వంలో చాలా లోతయిన అర్ధముంది.
వరద చావు క్షణాల్లో జరిగి పోతుంది. యాతన వుండదు. పైగా సానుభూతిని సంపాదిస్తుంది. మిగిలిన వాల్లకైనా వరద సహాయ నిధులు అందుతాయి. లోకం అయ్యో అంటుంది. కాని కరువు చావు నలిపిన రోగిలా మెల్లమెల్లగా జరుగుతుంది. లోకం దృష్టినీ, సానుభూతినీ, నిధుల్ని ఆకర్షించదు. ఎప్పుడు వరదలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల్నుండి వరద సహాయం ఒక రోజు జీతం వసూలు చేసి వాళ్ళకు పంపిస్తుంది. కాని కరువు సహాయంగా ఎప్పుడన్న చేసిందా? రెండు చావులే కాని సీమ చావులు ఆదరణ పొందని చావులు రాయలసీమ లోని మరొక ముఖ్య సమస్య ఫ్రాక్ష్యనిజం. శతాబ్ధాల కింద ఏర్పడే పాలెగాళ్ళ వ్యవస్థ స్థానంలో ఆధునిక ప్రజాస్వామిక విలువలు రాక పోవడం కూడా దీనికి కారణం. ఈ సమస్య గురించి సీమకవులు సరియైన రీతిలో స్పందించారు.
''ఇక్కడ విత్తనాలు చల్లినా 
 మొలిచేది కొడవళ్ళు,
గొడ్డళ్ళు 
 ఇక్కడ 
 రేపటి బిడ్డ పలికేది బి.ఫర్‌ బుక్కుకాదు బి.ఫర్‌ బాంబ్‌ 
అన్న రాచపాలెం మాటల్లో పిల్లలు దాగుడుమూతలాడు తుంటాయి నాటు బాంబులు. అని ప్రొ|| శ్రీనివాసరెడ్డి వాక్యాల్లో మా ఫ్రాక్షనిజం పట్ల అసహానం ఆగ్రహం కన్పిస్తుంది.

రాయలసీమ భాషను కథా రచయితలు పట్టుకున్నట్లుగా కవులు పట్టుకోలేదు. కవిత్వంలో అక్కడక్కడ మాత్రమే కన్పిస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం..........
సిన్నోడికి పాలు బడదామంటె
ఆలి చన్నులు వడబారి యాలబడినాయి
అమ్మకడుపుకాడ సెర్మం (బీడు బడిన నేల మాదిరి గుండాది .....వాన కురిసే ...పల్లె తడిస్చె) కాల్వలు పద్దాలు పాడ్తే......పైన గడిమోడమొస్చే ) నా ఆలికి సీరగా సుట్టుదామని కాసుక్కూచునుండా ) వాన వస్తదో రాదో అన్న మహమూద్‌ కవితలోనూ... ధాన్యం తూర్పోయడానికి...... దడాన కానీండ్రా....... తూర్పోసారు. మూటలు నింపారు...... కొట్ట డీ యిల్లు భర్తీ చేశారు...... (అబ్బబ్బ ఒళ్ళంత నొప్పులు ( పై కావువత్తు కుంటుందెమో........) / రెండు పిచ్చల వింత పండుని/ రెండు ఉప్పరాల్ని.......అన్న దస్తగిరి కవిత ల్లోనూ ఇంకా గోపిని వంటి కవుల కవితల్లోనూ సీమ భాషను చూడవచ్చు. కోస్తాంధ్రులు తమ భాషను సంస్కృతిని తక్కువ చూస్తున్నారని 1931 లోనే గమనించిన సీమ వాసులు తమ భాష పట్ల అభిమానం పెంచుకోలెందుకో తెలియదు. సీమలోని దారిద్రానికి, కరువుకు, వివిధ రంగాల వెనుక బాటుకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారంగా వాళ్ళు భావించలేదు. వాళ్ళ అసంతృప్తిని అసహనాన్ని అగ్రహాన్ని రాజకీయాల మీద ప్రదర్శించినారు. ఈ కింది కవితలు ఆ విషయాన్ని తెలుపుతున్నది.

''మమ్ము / పీనుగులను చేసి ఆడుకునే శత్రువులు ఇద్దరే ఇద్దరు(ఒకరు కరువు రక్కసి మరొకరు రాజకీయ వ్యూహం'' రఘుబాబు. ఐదేండ్లకు ఒకసారి ఆవులించే విమోచన సమితి అడ్డపంచకింద అణుబాంబులు భద్రపరిచింది.
- నాగప్ప గారి సుందర్రాజు.
పదవి ఊడిన వాడి నోట సీమ బాదల బోసిపాట నాలోపల నేను పెను వికటహాసమవుతాను - హెచ్చార్కె (హనుమంతరెడ్డి).
అక్కడక్కడ కవులు తిరుగుబాటును ఆశించారు.
ఉదా|| తాను నాటేప్రతి గింజమీద
గిట్టుబాటు ధర ముద్రించక పోతే
ఆధునిక దోపిడి అందమైన ముఖాన్ని
ఖండఖండాలుగా చీల్చేందుకు
నాగలి మొన నూరుతున్న వీరుడు
ఇది సంక్షిప్త రాయలసీమ ప్రాంత చైతన్య కవిత్వము.


చరిత్రలో రాయలసీమ- భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి( భూమన్ )

 
భూమన్
నంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కంభం, తాలూకాలు  రాయలసీమగా వ్యవహరింపబడుతున్నాయి. చరిత్రలో ఈ ప్రాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హెచ్‌.డి. సంకాలియా తెలియజేసినారు. ''మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల మీద చెక్కబడ్డ కళానైపుణ్యాన్ని కనుగొన్నాడు. ఆ పనితనాన్ని ఆయన అదే రోజుల్లో ఫ్రాన్స్‌ గుహల్లో కనుగొన్న పనితనంతో పోల్చినాడు. ఆ కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞుల 'పాత రాతియుగం ఉన్నతి దశ' అంటారు.

దురదృష్టవశాత్తూ పుట్‌ సేకరించినవేవీ నేడు లభ్యం కావటం లేదు. అయితే ఆ తవ్వకాలలో దొరికిన సమాచారం ఆధారంగా మనం గట్టి ప్రయత్నం చేస్తే అభివృద్ది చెందిన వేటగాడి దశలోని మానవుని ఉనికి గురించి అనేక ముఖ్యమయన ఆధారాలు కర్నూలు గుహల్లో తప్పక దొరుకుతాయని, ఈ కృషిలో చిత్తూరు, మద్రాసు పరిసరాల గుహలు కూడా ఉపయోగపడవచ్చనని నాకు గట్టి నమ్మకం' (హెచ్‌.డి. సంకాలియా) కర్నూలు జిల్లాలోని నదులు, వాగుల వెంబడి పాతశిలా యుగపు పనిముట్లు ఎన్నో దొరికినాయి. బెలుంగుహల్లో పాత శలా యుగపు ఉత్తర దశకు సంబంధించిన జనావాసాలు దొరికినాయి. ఇక్కడ మెల్లో వేసుకునే దంత హారాలు, కొన్ని వంపటెముకలు దొరికినాయి. కడప జిల్లా రాయచోటి తాలూకా సరస్వతిపల్లె, ముక్రావులపల్లె, ఇతర ప్రాంతాలకు చెందిన కనుమలోపల్లె, చిట్వేల్‌, కలసపాడులలోను, అనంతపురం జిల్లా గుంతకల్లు స్టేషన్‌లో నైరుతి దిక్కుగా వున్న దిబ్బలోను విడపనకల్లు కోటలో, వేల్పుమడుగు గుట్టల్లో, లత్తవరం, కరుకు ముక్కల కొత్తకోటకు పడమరగా వున్న మిట్టమీద, ఉరవకొండ ప్రాంతంలోను పాత శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ సమీపంలోని పుట్‌ స్నేహతులొకరికి ఒక కర్రాపన్నె దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ లభించని ప్రాచీన కుడ్య చిత్రాలు బెలుం గుహల్లో వున్నాయి. రాయదుర్గం కొండ మీద చెక్కడపు పనులు చిల్రేఖనం లభించినాయి. కర్నూలు జిల్లాలోని బెలుంగుహల్లో ఆనాటి మానవునికి నిప్పు చేయటం తెలిసివుందనటానికి కావల్సిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి.
  అనంతపురం జిల్లాలో 25 జనావాసాల్ని బ్రూస్‌పుట్‌ బయటికి తీసినాడు. లత్తవరం కొండమీద పిండి విసరడాానికి వుపయోగించిన అనేక బండలు కనిపించినాయి. గింజల్ని నూరేందుకు అక్కడి ప్రజలు మంచి అందమయిన రంగుగల ఒక పిస్టసైట్‌ రాయి మీద ఎక్కువ మోజు చూపినారు. అక్కడికి కొంచెం దూరంలో కొండ కింద ఒక పొడవాటి రాతి బండ వుంది. దాని మీద , అరిగి, లొత్తబడి నునుపుదేరిన 14,15 పెద్ద గుట్టలున్నాయి. ఇక్కడ జనం ధాన్యం దంచుకుంటూ వుండి వుంటారు. (పుట్‌) కొండ మీద పెద్ద తిరుగలి రాళ్లు కనిపించినాయి. విడపనకల్లు కొండ మీద కత్తులు, ఉలులవంటివేగాక చెకుముకి రాయితో తయారు చేసిన పరికరాలు కూడా దొరికినాయి. ఈ గుట్ట మీద వెడల్పయిన పట్టాకత్తి, ఉలి, ఎర్రచెకుముకి రాతితో తయారు చేసిన వడిసెలరాయి, జాస్పర్‌ రాతితో చేసిన కోరం దొరికినాయి. తాడిపత్రి దేవాలయం వద్ద వన్నె చిన్నెలు గల మంచి రకం కుండ పెంకులు, నలుపు, పసుపు, ఎరుపు జాస్టర్‌ రాళ్ల పెద్ద పోగు కనిపించాయి. కలమెడె నూరు కొండ మీద నూతన శలాయుగపు జనావాసం కనిపించింది. ఇనుపు యుగం ప్రారంభమవుతున్న ఛాయలు అక్కడ కనిపించినాయి. అక్కడ లాంటి ఆయుధాలే వజ్రకరూరు, ఉరవకొండ, కరకుముక్కల, భోగసముద్రం, హావలిగెమిట్ట, ముచ్చుకొట, జంబులదిన్నె మిట్ట, ఎర్రగుడిమిట్ట, అనంతపురం పట్టణాలలో కూడా దొరికినాయి.

పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.
కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్‌లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్‌ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.
అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్‌లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్‌లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది. శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.
కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.
కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. "పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు'' అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.

13వ శతాబ్దంలో మొదట్లో యదవసింగన పరిపాలన కాలం నాటి అనంతపురం జిల్లాలో వ్యవసాయదారుల సంఘం గురించిన సమాచారం వుంది. ఆ సంఘం పేరు ''చిత్రమేలి''. ఇది స్థానిక రైతులు ఏర్పరచుకున్న సంఘం. ఇటువంటి సంఘం ప్రసక్తి ఇక్కడ తప్ప మరెక్కడా కనబడదు. క్రీ.శ. 1136 నుండి 1650 వరకు అధికారంలో వున్న విజయనగర సామ్రాజ్యంలో రాయలసీమ ప్రాంతం ప్రముఖ పాత్ర వహించింది. విజయనగర రాజుల కాలంలో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందిందని ప్రతీతి. విజయనగర రాజులు అంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా వ్యవసాయాన్ని అభివృద్ది పరిచారు. నీటి పారుదల ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అనేక చెరువులు, కాల్వలు, ఆనకట్టలు కట్టించారు. ఆనాడు పళ్లు, పత్తి, చెరకు, కొబ్బరి, తమలపాకు, పోక, ధాన్యం, పప్పుదినుసులు, మొదలైన అనేక రకాల వ్యాపార పంటలు విస్తారంగా పండేటివి. విజయనగర కాలంలో1) నికొలాయే కాంటి-ఇటలీ-1420, 2)అబ్దుల్‌రజాక్‌ -పర్షియా-1422-45, 3) లుడోవికోడ్‌-వార్థేమా-ఇటలీ-1505-09, 4)దార్తే బార్బోసా-పోర్చుగీసు-1504-14,5)నన్నీజ్‌-పోర్చుగీసు-1535-37, 6) సీజర్‌ ఫ్రెడలి-కూవెన్నీస్‌-1563-67,7) ఫిలిప్పీ-ఇటలీ-1584-85, 8)సాస్పెట్టీ-ఇటలీ-1584-85, 9) పీజ్‌: మొదలయిన విదేశీయులు విస్తృతంగా పర్యటించి నాటి పరిపాలనను ఘనంగా కీర్తించారు. ఆనాటి రాజులే గాక రాణులు, ఉద్యోగులు అనేక చెరువులు కట్టించినట్టుగా ఆధారాలున్నవి.

1565లో తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానులు విజయం సాధించటంతో, విజయనగర రాజులు తమ రాజధానిని హంపీ నుండి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చుకున్నారు. యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓడినా, పూర్తిగా పతనం కాలేదు. బీజాపూర్,‌ గోల్కొండ నవాబులు బలపడ్డారు. 1650లో వీరు పెనుగొండ మీద దాడిచేసి విజయనగర రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు. నవాబులు సరయిన ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు. రాజ్యం చిన్న చిన్న ప్రభువుల ఆధీనంలో వుండేది. 1677-78 ప్రాంతంలో శివాజీ పాలన కింద, తరువాత నిజాం ఆధిపత్యాన, తరువాత మైసూరు రాజ్యంలో హైదరాలీ కింద, 1792 ఒప్పందంతో నిజాం కిందికి వచ్చాయి. 1800 ఒప్పందంతో నిజాం సీడెడ్‌ జిల్లాలను తూర్పుఇండియా వారికి అప్పజెప్పాడు. రాయలసీమ ప్రాంతం ఆనాటి ప్రత్యేకత పాలెగాళ్ల వ్యవస్థ. విజయనగర సామ్రాజ్యంలో ఈ వ్యవస్థ ఏర్పడింది. విజయనగర పాలనా సౌలభ్యం కొరకు వివిధ ప్రాంతాలుగా విభజించి అధికారులను నియమించారు. పన్నులు వసూలు చేయటం, రక్షణ – కాపలాదార్లుగా వుండటం, రాజుకు అవసరమైన సైన్యాలను సమకూర్చటం వీరి బాధ్యత. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ వ్యవస్థ క్రమేణా దిగజారి అరాచక పరిస్థితి ఏర్పడింది. 18వ శతాబ్దంలో పాలెగాళ్లు నైజాం అధికారాన్ని మన్నించారు.
కానీ అతని బలహీనతను కనిపెట్టి కప్పం చెల్లించటంలో నిర్లక్ష్యం చేస్తూ, నిజాం అధికారాన్ని వ్యతిరేకిస్తూ వుండినారు. సుమారు 80 మంది పాలెగాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించారు. సైనికచర్యలకు అవకాశం కల్పించిన ఈ ధిక్కారంను మొదట ఆదోనికి చెందిన చిన్న గ్రామాధికారి లేవదీసినాడు. కానీ ఇతను కంపెనీ సైన్యం చేతిలో ఓడిపోయాడు. 1803లో కడపలో సుల్తాన్‌ఖాన్‌, చిత్తూరులో నాగేటి పాలెగాళ్ళ తిరుగుబాట్లు జరిగాయి. నాటి ప్రభుత్వం వీరిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. పాలెగాళ్ళ అరాచక పాలన వల్ల ప్రజలు బాగా చితికిపోయారు. సాంఘిక జీవితం అల్లకల్లోలమయింది. భద్రత కరువయింది. అనేకమంది దోపిడిగాండ్రుగా తయారయినారు. ఈ పరిస్థితి రాయలసీమలో విస్తృతంగా వుండేది. ఈ దోపిడి గాండ్రనే ప్రజలు దివిటి దొంగలు అని పిలిచేవారు. కుమ్మరి గుండోళ్లని కూడా కొన్ని ప్రాంతాలలో అని అనేవారు. దత్త మండలాల మొదటి కలెక్టర్‌ థామస్‌ మన్రో వీరిలో కొందరిని లొంగదీసుకున్నాడు. మరి కొందరిని అణచివేసాడు.
విజయనగర రాజుల కాలం నుండి బ్రిటీషు వారి ఆధీనంలోకి వచ్చేంతవరకు ఈ ప్రాంతంలో భూసంబంధాలలో గాని, పంటల విధానంలో గాని, నీటిపారుదలలో గాని, ఎటువంటి మార్పులు లేక పోవటంవల్ల, కరువు కాటకాదులకు గురయి తీవ్రంగా చితికి పోయింది. తూర్పు ఇండియా కంపెనీ వ్యాపారసంస్థ. దీని ఆధీనంలోకి రాయలసీమ జిల్లాలు వచ్చాయి. ఈ కంపెనీకి వ్యాపారం తప్ప మరో ధ్యాస లేదు. తమ బొక్కసం నింపుకోవటమే ప్రధానలక్ష్యం. భూమి మీద విపరీతంగా పన్నులు విధించారు. జమీందారి విధానం ప్రవేశపెట్టడంతో రైతాంగం బాగా చితికి పోయింది. కరువు కాటకాలు వచ్చిన ప్రతీసారి వేలాదిమంది చనిపోయారు. కంపెనీ గుత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి గ్రామాన్ని గ్రామ పెద్దకు గుత్తకు ఇస్తుంది. అతను ఆ గ్రామానికి విధించిన గుత్తను కంపెనీకి చెల్లించాలి. ఈ గుత్త విపరీతంగా వుండేది. థామస్‌ మన్రో రాయలసీమలో రైత్వారీ పద్ధతిని అమలు చేయాలనుకుంటే కంపెనీ డైరెక్టర్లు వ్యతిరేకించారు. గ్రామ గుత్త పద్ధతినే అమలు చేయవలసి వచ్చింది. దీనివల్ల రైతులు గ్రామాలను వదలి వెళ్లి పోయేవారు.
1820లో మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా నియమించబడిన తర్వాత రాయలసీమలో రైత్వారీ పద్ధతి శాశ్వతంగా అమల్లోకి వచ్చింది. రైత్వారీ విధానం అమలుచేయటంలో కంపెనీ అనుసరించిన పద్ధతుల వల్ల రైతాంగం బాగా దెబ్బతిన్నది. రైతులు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. కంపెనీ పరిపాలనా కాలంలో రైతాంగం పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. ''కంపెనీ పాలనకింద వున్న ప్రాంతాలలోని ప్రజల్లో దత్త మండలాల ప్రజలే కడుబీదవారు'' (మన్రో). తూర్పు ఇండియా పరిపాలనలో రాయలసీమ నిత్య కరువు కాటకాదులకు నిలయంగా మారిపోయింది.రాయలసీమ రైతాంగ జీవితంలో కరువులు అంతర్భాగమైపోయాయి.1870లలో కడప-కర్నూలు కాలువలను ప్రారంభించినా అనేక అవకతవకల వల్ల నిర్మాణం 1882 చివరినాటికి గాని పూర్తికాలేదు. ఈ కాల్వను ప్రధానంగా రవాణాకు వుద్దేశించటం వల్ల వ్యవసాయం ఆగిపోయింది. రాయలసీమ మరింత వెనుకబడిపోయింది. కరువు రాయలసీమ రైతాంగానికి జీవన్మరణ సమస్యగా తయారయింది. రాయలసీమ దక్షిణ భారతదేశంలో కరువు ప్రాంతంగా మారిపోయింది.
రాయలసీమ నామకరణం
ప్రస్తుతం రాయలసీమగా పిలువబడే ప్రాంతాలను 1800 ప్రాంతంలో నిజాం తూర్పు ఇండియా కంపెనీకి ఇవ్వటంతో అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సీడెడ్‌ ప్రాంతంగాను లేదా దత్త మండలాలుగాను వ్యవహరిస్తూ వచ్చినారు. దత్త మండలాలుగా పిలువబడుతూ వచ్చిన ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన చరిత్ర వుంది. నిజానికి తెలుగు ప్రజల మొదటి నివాస స్థానం ఈ ప్రాంతమేనని తెలియజెప్పే రుజువులు కూడా వున్నాయి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి హిరణ్యక రాష్ట్రమని, రేనాడు మహారాజువాడి అని పిలిచేవారు.
దీర్ఘకాలం ఈ ప్రాంతం విజయనగర రాజులు పాలన కింద వుండటం వల్ల ఈ ప్రాంతం రాయలసీమగా వ్యవహరింపబడుతూ వస్తుందనేవారు. నిజానికి ఈ ప్రాంతాన్ని ''రాయలసీమ''అని పిలిచిందెవరు? ఆ నామకరణం ఎప్పుడు ఎట్లా జరిగింది? ''రాయలసీమ'' అనే పేరును బాగా ప్రచారంలో పెట్టిన వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కావటం వల్ల ఆయనే ఈ ప్రాంతానికి ''రాయలసీమ'' అని నామకరణం చేసి వుంటారని అనుకుని నేను ఉదయంలో ఒక వ్యాసం రాసినాను. రాయలసీమ పేరు పెట్టింది చిలుకూరి నారాయణరావు గారని రుజువుల్తో అవధానం నాగరాజారావు గారు నా వ్యాసానికి ప్రతిగా ఉదయంలో రాసిన వ్యాసం చదివిన తర్వాత లోతులకెళ్ళి పరిశోధిస్తే చిలుకూరి నారాయణరావు గారే ఈ ప్రాంతానికి ''రాయలసీమ'' అని పేరు పెట్టినట్లుగా తేలింది. 16,17 శతాబ్దాల్లో ఈ ప్రాంతం మట్ల సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. ఈ కాలంలో రాయబడిన ''అభిషిక్త రాఘవము'' అనే ప్రబంధంలో ''రాయలసీమ'' అనే పేరు ఉంది.
''గాయకులశ్వరాయబల భానులు మట్ల అనంతరాజు కౌక్షేయక ధార ద్రెవ్విరని చెప్పె దరింతయ కాక వేలుపున్‌ రాయలసీమలోన చతురంగ బలంబుల తోడ వైరములే పాయక యున్న వారు సరిపాళెము వైచిన మట్ల జస్రమున్‌'' అని ఆ పద్యం. ఈ పద్యం మట్ల అనంతరాజును వర్ణించే సందర్భములోనిది. ఇంత ప్రముఖంగా వున్న రాయలసీమ పేరు ఎందుకనో ఆ తర్వాత మరుగున పడిపోయింది. ఎందుకు, ఎట్లా మరుగున పడిపోయిందనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత రాజకీయంగా సంభవించిన ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రాంతం అనేక సంక్షోబాలకు గురయింది. 1792-99లలో టిప్పు సుల్తాను, తూర్పు ఇండియా కంపెనీ, నిజాం నవాబులు కలిసి చేసిన యుద్ద ఫలితంగా తంజావూరు రాజు పదవీచ్యుతుడయినాడు. అతని కింద వున్న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొంతభాగం తూర్పు ఇండియా కంపెనీ వశమైనాయి. 1800లలో కడప, కర్నూలు, అనంతపురం, మదనపల్లి తాలూకాలు కూడా బ్రిటీషు వారి ఆధీనంలోకి పోయినాయి. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని దత్తమండలం అని, సీడెడ్‌ జిల్లాలని వ్యవహరిస్తూ వస్తున్నారు. దేశంలో జాతీయాభిమానం రగులుతున్న రోజుల్లో తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులవి. అట్లాంటి సమయంలో రాజమహేంద్రవరం నుండి మహా మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారు ఉద్యోగ రీత్యా అనంతపురం వచ్చినారు. ఆయన వచ్చేనాటికి రాయలసీమ వాసుల్లో దత్త అనే మాట ఏవగింపు కలిగింది. ఆ పేరు బానిసత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. చిలుకూరి వారికి కూడా ఈ దత్త అనే పేరు వెగటుగా అనిపించింది. దత్త అనే పేరుతో 128 పంక్తుల్లో మంజరీ ద్విపదలో సీమ ఘనతను గానం చేసినారు.

దత్త నందురు నన్ను దత్త నెట్లగుదు
రిత్త స మాటలు చేత చిత్తముకలగె
ఇచ్చిన దెవ్వరో పుచ్చిన దెవరొ
పుచ్చుకొన్నట్టి యా పురుషులు నెవరొ
తురక బిడ్డం డిచ్చె దొరబిడ్డ పట్టె
అత్త సొమ్మును గొని యల్లుండు
దాన మమర జేసెనటన్న యట్లున్నదిది
అని ఎద్దేవా చేసినారు. సీమ ప్రాశస్త్యాన్ని కొనియాడారు…
ఆ రోజుల్లో రాయలసీమ వారు తమ హక్కులు, అవసరాల కోసం సంఘటితమవుతున్నారు. బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్న గుత్తి కేశవ పిళ్లైగారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తమ ప్రాంతానికి వచ్చే లాభమేమిటని ప్రశ్నించినారు. ఈ ప్రాంతపు నలుమూలలా రాయలసీమ అవసరాల గూర్చిన ఆలోచన మొదలయింది. 1928 నవంబరు 17,18 తేదీలలో నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. అప్పటికే రాయలసీమ వారి మనోభావాలను పసిగట్టిన కోస్తా ఆంధ్రులు మెళకువగా వ్యవహరిస్తున్నారు. 18వ తేదీన కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ప్రథమ దత్త మండల సమావేశం జరిగింది. ఈ సభలో చిలుకూరి నారాయణరావు గారు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఏం పేరు పెడితే బావుంటుందన్న చర్చ ఈ సభలోనే జరిగింది. చిలుకూరి వారు గబుక్కున ''రాయలసీమ'' అన్నారు. సభలో పప్పూరి రామాచార్యుల వారిచేత ఒక తీర్మానం ప్రతిపాదింపజేసినారు. ఆ తీర్మానాన్ని సభ చేత ఆమోదింపజేసినది చిలుకూరివారే. ఆ పేరు రగులుకుంది. దావానలంలా వ్యాపించింది.
3-1-1946న చిలుకూరివారు ''మన రాయలసీమ భాషా సంపద'' అనే అంశం మీద రేడియో ప్రసంగం చేస్తూ 'రాయలసీమ' అనే పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్టుగా చెప్పుకున్నారు. చిలుకూరి విషయానికి సంబంధించిన రుజువులు టేకుమళ్ల కామేశ్వరరావు గారి 'నా వాఙ్మయ మిత్రులు' అనే గ్రంథంలోను, 1948 నాటి మహోదయ వారపత్రికలోను ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రాయలసీమ నామకరణం చేసినవారు చిలుకూరి వారేనని తెలుస్తున్నది.



వేమనను వెలుగులోకి తెచ్చిన అబే దుబారు

'క విషయం తప్పక పేర్కొనాలి. ఈ దేశంలో ఉన్న తత్వ రచనల్లో అందులోనూ మతం, ఆచారవ్రత నియమాల గురించి సొంపుగా, నిందాగర్భంగా రాసిన వారిలో నాకు తెలిసినంత వరకూ బ్రాహ్మణుడు ఒక్కడూ లేడు. నేను విన్నవీ కన్నవీ అన్నీ శూద్రులు చేసిన రచనలే! ఈ దేశమంతటా అత్యంత విశ్రుతుడు ఒక్క వేమనే! ఈ పద్యాలు తొలుత తెలుగులో రాసినా.. ఇప్పుడవి అనేక ఇతర భాషల్లోకి అనువదించారు. ఈ దార్శనికుడు 150 ఏండ్ల లోపల కడప జిల్లాలో రెడ్ల ఇంట పుట్టినట్లు నిర్ధారణ అయినది. ఆయన పద్యాలు తత్వశాస్త్ర ధోరణిలో రాసినా, చాలా రమ్యాలు, ఆకర్షణీయాలు. దీనిలో గుర్తించవలసిన ఇంకొక గురుతర విషయం ఉంది. నాకు తెలిసినంతవరకు నేను సేకరించిన విషయాలను బట్టి దేశ ఆచార వ్యవహారాలను, మతాన్ని పరిహాసం చేసిన వేదాంతులంతా ఆధునికులే!'

- అబే దుబారు

(సంజీవనాథస్వామి అనే పేరుతో ఫ్రాన్స్‌ దేశానికి చెందిన 'లీ-గాక్‌' అనే క్రైస్తవ మత ప్రచారకుడు 1730లో వేమన పద్యాలను తొలుత సేకరించారు. వాటిని 1931లో ఫ్రాన్స్‌ దేశపు రాజు గ్రంథాలయానికి పంపారు. ఆ దేశానికి చెందిన 'అబే దుబారు' అనే కేథలిక్‌ మత బోధకుడు 1806లో 'హిందువుల ఆచారాలు' అనే పుస్తకాన్ని ఫ్రెంచ్‌ భాషలో రాశారు. దాన్ని ఈస్టు ఇండియా కంపెనీవారు ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు. ఇందులో వేమనను గురించి అబే దుబారు ప్రస్తావించారు. ఈ విధంగా ఇంగ్లిషు వారికి వేమన గురించి మొదటగా తెలిసింది. 1829లో ఆంగ్లేయ సివిల్‌ అధికారి చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 'వేమన నీతి పద్యములు' పేరుతో పుస్తకం వెలువరించారు.) 
Mon.1st April 2013,     Visalandhra Daily



Saturday, March 30, 2013

బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు

తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు.

వందేళ్ల క్రితం 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలోని విద్వత్ కుటుంబంలో నారాయణాచార్యులు జన్మించారు. పుట్టపర్తి శ్రీనివాసులు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు. ఎనిమిదో తరగతి వరకు చదివి బడి మానేశారు. వీధి పిల్లలతో కలసి పెనుగొండ కోటలో తిరుగుతూ ఆటపాటల్లో కాలం వెల్లబుచ్చేవారు పుట్టపర్తి. విద్వత్ కుటుంబంలో జన్మించిన నారాయణాచార్యులు చదువుసంధ్యలు లేక 'పండితపుత్ర శుంఠః' అని ఎక్కడ మారిపోతాడోనని శ్రీనివాసాచార్యులు భయపడ్డారు. ఇక తానే గురువయ్యారు. తెలుగు, సంస్కృతం నేర్పారు. ఆ సందర్భంలోనే ఆ కుటుంబానికి శ్రేయోభిలాషి అయిన టి.శివశంకరం, నారాయణాచార్యులను వెంటతీసుకుపోయి పెనుగొండలోని సబ్‌కలెక్టర్ భార్య అయిన పిట్ దొరసానికి పరిచయం చేశారు. ఆమె ఆంగ్లంలో గొప్ప విద్వాంసురాలు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో షేక్స్‌పియర్, బ్రౌనింగ్ మీద గొప్ప పరిశోధన చేశారామె. ఆమె, ఆచార్యులకు ఆంగ్లభాషను నేర్పడమే కాకుండా గెట్టిగా ఆంగ్లసాహిత్యాన్ని పరిచయం కూడా చేశారు.

అప్పట్లో పెనుగొండలోని నాగనాయని చెరువు గ్రామంలో రంజకం మహాలక్షుమమ్మ అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. ఒకరోజు ఆమె ఇంటి ముందు నుండి ఆచార్యులు వెళుతున్నారు. అప్పుడు శ్రావ్యమైన మువ్వల సవ్వడి వినిపించింది. ఆచార్యులు ఆ ఇంటి కిటికీ నుండి చూశారు. లోపల నర్తకి అద్భుతంగా నృత్యం చేస్తూ కనిపించింది. నృత్యం అయిపోయాక తనను గమనిస్తున్న బాలుడైన ఆచార్యులను ఆమె దగ్గరికి పిలిచింది. 'నృత్యం చేర్చుకుంటావా?' అని అడిగింది. వెంటనే ఆచార్యులు ఔనన్నట్లు తలాడించారు. ఫలితమే ఆచార్యులు ఆమె ద్వారా సంగీతం, నృత్యం రెండు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు.

కేవలం ఇంటి చదువుతో నారాయణాచార్యుల జీవితానికి భవిష్యత్ ఉండబోదని ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు అనుకున్నారు. అప్పట్లో కట్ట మంచి రామలింగారెడ్డి, మైసూర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. ఆయన ప్రత్యేక ఆహ్వానంతో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, అదే యూనివర్సిటీలో తగు హోదాలో పనిచేస్తుండేవారు. ఆ రాళ్లపల్లివారు, పుట్టపరి వారికి దగ్గరి బంధువు. దీంతో ఆచార్యులను ఆయన వద్దకు పంపారు. అక్కడ ఆచార్యులు ప్రాకృతభాష అధ్యయనం చేశారు.

అక్కడ ఉన్నప్పుడే పెనుగొండకోట గతవైభవం, ప్రస్తుత దయనీయ స్థితిని దృశ్యమానం చేస్తూ 150 పద్యాలతో 'పెనుగొండ లక్ష్మి' అనే లఘుకావ్యం రచించారు ఆచార్యులు. ఆ కావ్యాన్ని రాళ్ళపల్లి చదివి భవిష్యత్తులో గొప్పకవి కాగలవని దీవించారు. ఆ తరువాత నారాయణాచార్యులు తిరుపతిలోని వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరడానికి వెళ్ళారు. అప్పుడు ఆచార్యుల వయస్సు 16 ఏళ్ళు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రసిద్ధులైన కపిస్థలం కృష్ణమాచార్యులు ఉండేవారు. కాలేజీ అడ్మిషన్ ఇమ్మని ఆచార్యులు ఆయన్ను కోరారు. తగు ధృవీకరణపత్రం చూపమని ప్రిన్సిపల్ అడిగారు. ఉంటేకదా, చూపడానికి. దీంతో అడ్మిషన్ సాధ్యం కాదు పొమ్మన్నారు. ఆచార్యులకు కోపం వచ్చింది. ఆవేశంగా, ఆశువుగా పద్యాలు చెబుతూ బయటికి నడిచారు. ఈ చర్యతో ఆ ప్రిన్సిపల్ దిగ్భ్రమ చెందారు. నారాయణాచార్యులలోని అంతర్గత యోగ్యతను గుర్తించి అడ్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ కూడా పుట్టపర్తివారు కోర్సు పూర్తి చేయకుండానే పెనుగొండకు తిరిగి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కనకవల్లీదేవి (కనకమ్మ)తో పెళ్ళి జరిగింది. అప్పటికి ఆచార్యుల వయసు 20 ఏళ్ళు. ఆ విధంగా అనంతరపురం జిల్లా నుండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు మకాం మారాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులోనే శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయునిగా పనిచేయసాగారు. అప్పటికి ఆచార్యులు ఇంకా విద్వాన్ పూర్తి చేయనే లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం విద్వాన్ అవసరమని స్థానికులైన పెద్దలు సలహా ఇచ్చారు. దీనితో విద్వాన్ పూర్తి చేయడానికి తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో చేరారు. విద్వాన్ పూర్తిచేశాక ప్రొద్దుటూరులోని మునిసిపల్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా చేరారు.

అయితే తిరుపతిలో ఆచార్యులు చదువుకునేటప్పుడు తాను రాసిన కావ్యం 'పెనుకొండ లక్ష్మి' పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాశారు. విచిత్రమేమిటంటే ఆ పరీక్షలో ఆచార్యులు తప్పారు. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకు ఉత్తీర్ణున్ని చేయలేదో చెప్పమని ప్రిన్సిపల్‌ను ఆచార్యులు అడిగారు. ఆ ప్రిన్సిపల్‌కు కూడా ఆశ్చర్యమే అనిపించి జవాబు పత్రం తెప్పించి పరిశీలించారు. అప్పుడు తేలిందేమిటంటే 2 మార్కుల ప్రశ్నకు ఒక సుదీర్ఘ వ్యాసం మాత్రమే జవాబు రాసి వ్యవధి ముగియడంతో పేపరు ఇచ్చేసి రావడంతో పరీక్ష తప్పారన్న విషయం గ్రహించారు. దీనితో ఆచార్యులు అవాక్కయ్యారు. తర్వాత మళ్ళీ రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఆచార్యులు శతాధికంగా గ్రంథాలు రాసినా, ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు సమకూర్చి పెట్టినది ఒక లఘుకావ్యమైన 'శివతాండవ'మే. రంజకం లక్షుమమ్మ వద్ద నేర్చిన నృత్యం, రాళ్ళపల్లి దగ్గర నేర్చుకున్న సంగీతం, కన్నడ భాషా సాహిత్యంలో అధ్యయనం చేసిన రగడ ఛందస్సులోని సాహిత్యం ఆ లఘుకావ్య రచనకు జవజీవాలు పోశాయి. పుట్టపర్తి నారాయణాచార్యులంటూనే ఇప్పటికీ అందరికీ గుర్తుకొచ్చేది ఆయన శివతాండవ కావ్యమే.

శివతాండవ కావ్యం వెలువడ్డానికి పూర్వ నేపథ్యం ఆసక్తికరమైనది ఒకటుంది. అది 1949వ సంవత్సరం. ఆచార్యులు అప్పటికి చాలా గ్రంథాలే రచించారు. ఆధ్యాత్మికంగా చాలా కృషి చేశారు. అష్టాక్షరి మంత్రం 13 కోట్లు మార్లు నియమ నిబంధనలతో జపించారు. అయి నా దైవసాక్షాత్కారం కలగలేదు. దీనితో జీవితంపైనే ఆచార్యులకు విరక్తి కలిగింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక సన్యాసిగా మారి ఉత్తర భారతదేశం వెళ్లిపోయారు. హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు. అప్పటికీ దైవ సాక్షాత్కారం సాధ్యపడలేదు. ఇక జీవితం పరిసమాప్తం చేయాలనుకున్నారు. ఆత్మపరిత్యాగం కోసం ఆ హిమాలయాల్లోని ఒక పర్వతాన్నెక్కి కిందికి దూకి చనిపోవాలనుకున్నారు. ఆ ఆలోచనతో వడివడిగా నడిచి వెళ్లసాగారు ఆచార్యులు.

సరిగ్గా అప్పుడు ఆచార్యులకు ఒక ఆకర్షకమైన స్వరం వినిపించింది. పేరుపెట్టి పిలుస్తున్న ఆ వ్యక్తిని చూశారు. ఆయన ఒక సన్యాసి దగ్గరకు వచ్చి ఆచార్యులతో మాట్లాడి తనతోపాటు ఆశ్రమానికి తీసుకెళ్లారు. చావురాత ఇప్పుడే లేదని సముదాయించి తన వద్ద ఆరు నెలలపాటు పెట్టుకున్నారు. చివరికి ఒకరోజు ఆ ఆశ్రమ పెద్ద తన దేశవ్యాపిత శిష్యులను హిమాలయాలకు పిలిపించుకున్నారు. వచ్చినవారిలో ఎందరో విద్వాంసులున్నారు. వారందరిచేత ఆచార్యుల విద్వత్ శక్తతను పరీక్షింపజేసినారు. పరీక్షించిన వారంతా ఆచార్యుల బహుభాషా పాండిత్య ప్రతిభను శ్లాఘించారు. అప్పుడు, ఆశ్రమపెద్ద నారాయణాచార్యులకు 'సరస్వతీపుత్ర' బిరుదు ప్రదానించి సత్కరించారు. మళ్లీ గృహస్థ జీవితం గడపమని ప్రొద్దుటూరుకు పంపారు. ఆచార్యులను ఆత్మహత్య పాలుకాకుండా కాపాడి, బిరుదుతో సత్కరించి పంపిన ఆ ఆశ్రమపెద్ద ఎవరో కాదు -స్వామి శివానంద సరస్వతి. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామమోహనరావులకు కూడా ఆ స్వామి శివానంద సరస్వతి గురువు.

అలా ఆచార్యులు ప్రొద్దుటూరు చేరాక అక్కడి అగస్తేశ్వర ఆలయానికి ప్రతిరోజు వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం దినచర్యగా చేసుకున్నారు. 40 రోజులు ప్రదక్షిణలు చేశాక ఒకరోజు ఒక అలౌకిక కవితావేశం ఆచార్యులలో పెల్లుబుకింది. అప్పుడు రచించిందే 'శివతాండవం' గేయకావ్యం. ఆ కావ్యం రగడ ఛందస్సులో రచించారు. ఆ కావ్యంలో సంగీతం, సాహిత్యం పోటీపడి అక్షరబద్దమయ్యాయి. ఆ కావ్యం ఆచార్యులకు మారుపేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. కాలపరీక్షలో నిలిచింది. ఇంతచేసి ఆ గేయకావ్యం 70 పేజీలకు మించింది కాదు. అయితేనేం ఆచార్యులకు స్పెస్‌మెన్‌గా నిలిచిపోయింది.

ఆచార్యులు స్వయంగా తానే శివతాండవాన్ని పాడు తూ నృత్యం చేస్తుంటే, ఆ అద్భుత దృశ్యం, ఒళ్లు గగుర్పొడుస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని శివాలయం ప్రారంభోత్సవం జరిగినప్పుడు తిక్కవరపు రామిరెడ్డి ఆచార్యులను ఆహ్వానించారు. ఆరోజు ఆచార్యులు శివతాండవం గానం చేస్తూ, చేసిన తాండవాన్ని చూసినవారంతా, మహాశివుడే శివతాండవం చేస్తున్నట్లు అనుభూతించారని ఆనాటి పెద్దలు చెబుతారు. ఆచార్యులు ఎక్కడికి, ఏ సాహిత్య సభలకు వెళ్లినా శ్రోతలు, తొలుత శివతాండవమే వినిపించమని కోరేవారు. విశేషమేమిటంటే పరమవైష్ణవుని చేతిలో పరమశివుని కావ్యం శివతాండవం రూపుదాల్చడం, ఆచార్యులలోని శివకేశవ అభేద్య భావానికి ప్రతీక.

ఆచార్యులు రచించిన శతాధిక గ్రంథాలలో పెనుగొండ లక్ష్మి, మేఘదూతము, పురోగమనము, శివతాండవము, అగ్నివీణ చాలా కీర్తిప్రతిష్ఠలు ఆయనకు సమకూర్చాయి. ఈ గ్రంథాలన్నీ లఘుకావ్యాలే కావడం విశేషం. ఒక్క పెనుగొండ లక్ష్మి తప్ప మిగిలినవన్ని గేయ కావ్యాలు కావడం, అవన్నీ ఆచార్యులు తన యవ్వనదశలోనే రాసినవి కావడం గమనార్హం. అలాగే ఆచార్యులు 'జనప్రియ రామాయణం' కూడా గేయఛందస్సులోనే రచించారు. అయితే ఈ కావ్యం రెండు సంపుటాలు మాత్రమే వెలువడింది. 1972లో 'పద్మశ్రీ' అందుకున్న ఆచార్యులకు 1975లో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, 1987లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.

భారతీయ సుప్రసిద్ధ సాహిత్య నిర్మాతల్లో పుట్టపర్తి నారాయణాచార్యులకు అరుదైన స్థానం ఉంది. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. అటువంటి మహాకవి, బహుభాషా చక్కవర్తి 'నేను నిత్య విద్యార్థిని' అని జీవితం కడవరకు చెప్పుకున్న నిగర్వసాహిత్యవేత్త. ఆయన ఏ యూనివర్సిటీ గడప ఎక్కకుండానే 14 భాషల్లో పాండిత్యం హస్తగతం చేసుకున్నారు. అది ఆయనకు భాషలపట్ల ఉన్న తడిఆరని దాహం. ఆయన 1990 సెప్టెంబర్ 1న కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పుస్తకాల్ని చదువుతూ కన్నుమూశారు.

ఆచార్యులు జన్మించి వంద వసంతాలు. ఈ సందర్భంగా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా కడపలో 2013 మార్చి 28న ఆచార్యుల శత జయంతికి గుర్తుగా సాహిత్య సదస్సు ఏర్పాటు చేశాయి. ఆ సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించిన ఈ వ్యాసకర్త రచన 'భారతీయ సాహిత్య నిర్మాతలు - పుట్టపర్తి నారాయణాచార్య' గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఆరోజు ఆ గ్రంథం 800 ప్రతుల్ని ఆచార్యుల అభిమానులు కొనుగోలు చేయడానికి ముందస్తు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

                                                                                                                                                      - శశిశ్రీ
93479 14465
ఆంధ్రజ్యోతి "వివిధ" సౌజన్యంతో..  


బహుభాషా చక్రవర్తి - పద్మశ్రీ పుట్టపర్తి
...మహాకవి, పద్మశ్రీ, డాక్టర్‌ పుట్టపర్తి నారాయణా చార్యుని స్మరించడమంటే, ఆయన సాహితీ విశ్వరూపానికి అక్షరాంజలులు సమర్పించడం తప్ప వేరొకటి కాదు. 2013 మార్చి 28 నాటికి ఆచార్యులు జన్మించి 99 వసంతాలు పూర్తయి, శతజయంతి సంవత్సరం ప్రారంభమైంది.
దేశంలో ఎందరో ప్రతిభా వ్యుత్పన్నత కల్గిన కవులు, పండితులు, విద్యాధికులు, విమర్శకులు, సంగీత కళాకారులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తమ ప్రత్యేక ప్రతిభాపాటవాలు కలిగి ఉంటారు. కానీ, పద్మశ్రీ పుట్టపర్తి అసాధారణమైన సాహితీ విద్యుత్తు కలిగిన శక్తి స్వరూపుడు. ఎంతటి కవియో అంతటి మహాపండితుడు, అంతేకాక, గొప్ప సాహిత్య విమర్శకుడు. అలాగే మంచి సంగీత కళాకారుడు. ఇన్ని ప్రత్యేకతలు ఒకే వ్యక్తిలో ఉండటం అపూర్వం... అనితర సాధ్యంకూడా.
ఆంధ్రము, సంస్కృతము, ప్రాకృత భాషలు, కన్నడ, తమిళ, మలయాళము, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‌ మొదలగు పదునాలుగు భాషలలో ప్రవేశముతో పాటు పాండిత్యం కలిగి ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పుట్టపర్తికే ఆ ఘనత దక్కింది. వారి చివరి దశలో కూడా తన 75వ ఏట కూడా పుట్టపర్తి ఉర్దూ భాషను నేర్చుకోవడానికి పెద్ద కృషి చేశారు.
ఛాందస భావాలు గిట్టనివాడు - దైవాన్ని నమ్మినా సంప్రదాయాలను గుడ్డిగా అనుకరించిన వాడు - బాహ్య వేషంకంటే, అంతర్యం విశిష్ఠమైనదని నమ్మినవాడే పుట్టపర్తి నారాయణాచార్య. ''దైవంతో పాటూ నాకు మానవుడు కూడా కావలెను'' అని అనగల్గిన మహామానవతావాది ఆయన.
తమ గురించి పుట్టపర్తి ఒక పద్యంలో....
''ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖ
రంబైన యభయహస్తంబుమాది!
ఒకనాడు గీర్దేవతా కమ్రకంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది!
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే
చదువు నేర్పినది వంశమ్ము మాది!
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెన్గొండ మాది
తల్లిదండ్రుల మేధ విద్యానిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడపట్టిన రాయలసీమ మాది''
అటువంటి వైభవ ప్రాభవాల చరిత్ర కలిగిన పుట్టపర్తి గారికి ఆర్థిక పరిస్థితి చివరినాళ్ళ వరకు వేధించింది.
పుట్టపర్తి జీవితం, సాహిత్యం ఎన్నో ప్రత్యేకతలతో ముడివేసుకుని ఉండటం గమనార్హం.
అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలో 1914 మార్చి 28న జన్మించిన పుట్టపర్తి - చిన్నప్పుడే పెనుగొండ కోటలోని శిథిల శకలాలు, శిల్పకళా వైభవాలు చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ''పువ్వు పుట్టగానే పరిమళి స్తుందన్నట్లుగా తన 14వ యేట 'పెనుగొండ లక్ష్మి' అనే కావ్యాన్ని రాశారు. ఆ కావ్యం పుట్టపర్తి తెలుగు సాహిత్యానికి అందించిన తొలి ప్రసూనం. అందులో ఒక పద్యం....
''ఉలిలో తేనెల సోనలన్జిలికె
యి యొయ్యారి చిత్రించు, వే -
ళల నాశిల్పికి గన్ను గోనలను
ధారల్గట్టేనేమో జలం -
బులు, జేదోయి సెమర్చి యుండు
ననుకొందున్‌, భావనావేశ, భం-
గులు పైపై జెలరేగ ముద్దుగొని
యుండున్‌ ప్రేమ విభ్రాంతుడై''
ఈ కావ్యాన్ని తొలిసారిగా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు చూచి, ఈ కవికి విస్తారమగు వైభవప్రాభవాలు భవిష్యత్తులో లభిస్తాయని చెప్పారు.
మరో చిత్రమేమిటంటే, తన 19వ ఏట పుట్టపర్తి తిరుపతిలో విద్వాన్‌ చదువుకుంటున్న రోజులలో తాను రాసిన ''పెనుగొండ లక్ష్మి'' కావ్యమే పాఠ్యపుస్తకంగా ఉంది. ఆ సందర్భంగా జరిగిన పరీక్షలో తన కావ్యం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు రాయాల్సి వచ్చింది. జవాబు 40పేజీలకు మించి రాశారు. పరీక్ష తప్పారు. కారణం 2మార్కుల ప్రశ్నకు 40పేజీల జవాబు రాయడమేనని తర్వాత తెల్సుకున్నారు. ఆ తరువాత విద్వాన్‌ పూర్తి చేశారు. ఇటువంటి అద్భుతమైన ఘటన సాధారణంగా ఏ కవి జీవితంలో జరుగదు.
దాదాపు 150 గ్రంథాలకు పైగా పుట్టపర్తి రాశారు. వాటిలో పెనుగొండలక్ష్మి మేఘదూతము, శివతాండవము, షాజీ, పాద్యము, జనప్రియ రామాయణము, పండరీ భాగవతము, శ్రీనివాస ప్రబంధము అలాగే ఇంగ్లీష్‌లో రచించిన ఁుష్ట్రవ ూవaఙవర ఱఅ ్‌ష్ట్రవ ఔఱఅసఁ, ఁుష్ట్రవ నవతీశీఁ జనాదరణ పొందాయి.
పుట్టపర్తి రచనలలో శివతాండవానికి వచ్చినంత కీర్తి ఇతర గ్రంథాలకు లభించకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరులో పుట్టపర్తిగారు నివసించే ఆ రోజులలో ప్రతిదినం స్థానికంగా ఉన్న అగస్తేశ్వర ఆలయానికి వెళ్ళేవారు. ఒకరోజు శివాలయంలో అలౌకికమైన అనుభూతి కవితావేశం కలగడము. ఏకధాటిగా శివతాండవ రచన కావించడం జరిగింది. వైష్ణవుడైన పుట్టపర్తిగారు - శివుని గురించి, శివతాండవ రచన చేయడం పట్ల ఎందరో ఆశ్చర్యానందాలు ప్రకటించారు. శివతాండవం ఆరు విభాగాలు. కథావస్తువు శివపార్వతుల నృత్యము.
ఒకరోజు ప్రకృతి తనను ఒక వేదికగా అలకరించుకొంటోంది. కారణం పరమేశ్వ రుని శివతాండవము జరుగుతుందని, ఆ ప్రకృతి వేదికగా తనను తాను ఎలా సుందరతరం చేసుకుంటున్నదో కవి చూశారు. చూడగానే, భావం రసస్నిగ్థ కవితా ప్రవాహమైంది.
''తలపైని చదలేటి యలలు తాండవమాడ
నలలత్రోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ
మొనసిఫాలముపైని ముంగురులు చెరలాడ
గనుబడొమ్మలో మధురగమనములు నడయాడ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింప
గనుబొమ్మలను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవకంట గటిక నిప్పులురాల
గడుపేర్చి పెదవిపై గటిక నవ్వులు వ్రేల
ధిమిధిమి ధ్వని సరిద్గిరి గర్భముల దూగ
నమిత సంరంభ హాహా కారములురేగ
ఆడెనమ్మా! శివుడు / పాడెనమ్మా! భవుడు''
శివతాండవం రచన పుట్టపర్తి గారికి ఎనలేని యశస్సు నిచ్చింది. సంగీత, సాహిత్య, నృత్య కళారీతులు మూడు తెలిసిన వారికే ఈ కావ్యం పూర్తిగ అవగతం కాగలదు. ఆనందానుభూతి పారమ్యాన్ని చూపగలదు.
ఇది ఇలావుండగా, పుట్టపర్తిగారి ఆంగ్ల రచనలు రెండు. ఒకటి ఁుష్ట్రవ ూవaఙవర ఱఅ ్‌ష్ట్రవ ఔఱఅసఁ కాగా రెండవది ఁుష్ట్రవ నవతీశీఁ ప్రసిద్ధ ఆంగ్ల పండితుడైన హరీంధ్రనాథ్‌ చటోపాధ్యాయవారి ప్రశంశలు అందుకున్న ఆంగ్ల కవితా సంపుటి అందులో కొన్ని వాక్యాలు -
× తీవaస ్‌ష్ట్రవ ఝషతీవస bశీశీసర సayర aఅస అఱస్త్రష్ట్ర్‌ర
Aఅస శ్రీశీర్‌ ఎy రశ్రీవవజూ శీఙవతీ ్‌ష్ట్రవఎ
ుష్ట్రవ షశీతీసర షవతీవ స్త్రశీశీస, bబ్‌ షష్ట్రవతీ ఱర +శీసప
× ్‌బతీఅవస ్‌శీ ఎy ష్ట్రవaత్‌ీ aఅస ఝష ఱఅ ఱ్‌
A రష్ట్రaతీజూ తీay శీట శ్రీఱస్త్రష్ట్ర్‌, ఖీశ్రీఱషసవతీఱఅస్త్ర
్‌శీబ aతీవ ్‌ష్ట్రవ శ్రీఱస్త్రష్ట్ర్‌ ్‌ష్ట్రవ శ్‌ీష్ట్రవతీర a ఖీaఅ్‌aరy
ఒకనాడు 1955లో రాజమండ్రిలో మహాకవి శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారిని చూద్దామని పుట్టపర్తి వెళ్ళారు. అప్పుడు శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రిగారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. విషయం రాయలసీమ కక్షలకు కార్పణ్యాలకే కానీ, కళలకు మృగ్యమని అనుకుంటున్నారు. ఆ మాటలు పుట్టపర్తి చెవిన పడనేపడినాయి.కాసేపటికి శాస్త్రిగారు పుట్టపర్తిని చూచి, ''అబ్బాయిని కవిత్వమేమైనా రాశావా'' అని ప్రశ్నించారు.
సీమవాసి అయిన పుట్టపర్తి వెంటనే ధారాపాత ఆశుకవిత్వాన్ని ఛందోబద్ధంగా ఇలా వినిపించారు.
''హేరాళంబిదేనాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారిన్‌
జూచితి లెమ్ము చెప్పకుము
గొప్పల్‌ విప్పుగా గౌతమీ,
ధారవర్థిత గోస్తనీరస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్వంబుల ముందు తావక
పయఃపానంబు శోభించునా
అని చెప్పేసరికి, శాస్త్రిగారు అబ్బురపడి, రాయలసీమ కవితిలకుడైన పుట్టపర్తిని అలింగనము చేసుకున్నారు.
పుట్టపర్తిగారి వ్యక్తిత్వం చిత్రమైనది. ఎదుటి వ్యక్తి తనను గొప్పవాడంటే, అలాంటిదేం లేదు; ''నా అహం పండితః'' అంటారు. మీకు విషయ పరిజ్ఞానం పెద్దగా తెలిసినట్టులేదే అంటే ఫణీఫణమై తన సారస్వత విశ్వరూపాన్ని చూపుతారు. ఆయన ఒక చిత్ర సారస్వత పురుషుడు.
చివర కొన్ని మాటలు - జ్ఞానపీఠ అవార్డుకు పుట్టపర్తిగారు అన్ని విధాల తగినవాడని విజ్ఞులు భావించినా, అవార్డు వచ్చినట్లే కనిపించి, రాకుండా పోయింది. రాజకీయ పలుకుబడి లేని పుట్టపర్తికి అవార్డు రాకపోవడంతో డాక్టర్‌ గజ్జెల మల్లారెడ్డి ఇలా రాశారు.
''జ్ఞానపీఠ' రాలేదని
గ్లాని చెందిన ఫలమేమి?
'పట్టు' విద్యలో తెరుగని
బాధవల్ల లాభమేమి?
పైరవీలు లేనిది చిరు
పదవిరాదు మహాకవీ!
సామర్థ్యానికి నూకలు
చెల్లినాయి కళారవీ!''
నిజమే. జ్ఞానపీఠం ఆయనకు రానేలేదు. 1990 సెప్టెంబరు 1న కడపలో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన భౌతికంగాలేరు. కానీ అభౌతికంగా ప్రజాహృదయ పీఠాలలో పదిలంగా ఉన్నారు. ఆయన సాహిత్యం కాల పరీక్షలకు ఎదురు నిలిచి పాఠక అభిమానుల ఆదరణ పొందుతుండటం విశేషం.
- శశిశ్రీ 
Mon. 1 st April 2013, IST    Visalandhra daily

Monday, March 18, 2013

ఆధునిక సాహిత్యంలో రాయలసీమ వెనుకబడలేదు

తవ్వా వెంకటయ్య
మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోల్చితే రాయలసీమ సాహిత్యంలో ఆధునికత చాలా ఆలస్యంగా ప్రవేశించిందని విమర్శకుల అభిప్రాయం. ఇది నిజమా, కాదా అనేది ఓ పరిశోధనాంశం. రాయలసీమ సాహిత్యం గురించి ప్రాంత ధృక్పథంతో ఆలోచించిన మొదటి విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆయన ‘ఈనాటి కడప జిల్లా స్థూల రేఖలు’ అనే వ్యాసంలో రాయలసీమలో ఆధునిక సాహిత్యం వెనుకబ డిందని పేర్కొంటూ అందుకు కారణాలను కూడా వివరించారు. సర్కారు ప్రాంతంలో ఆధునికత తొందరగా ప్రవేశించడం వల్ల అక్కడ ఆధునిక సాహిత్యం ముందుగా ప్రవేశించిందని రా.రా. అభిప్రాయపడ్డారు. అంతేగాక నూతన చారిత్రక శక్తులు కోస్తా జిల్లాల్లో ముందు తలెత్తడం వల్లనే ఈ వ్యత్యాసం ఏర్పడిందని, ప్రజాజీవితంలో విప్లవాత్మకమైన పరిణామాలు ముందు ఆ జిల్లాలలో ప్రారంభమయ్యాయని అన్నారు. ఆధునిక సాహిత్యం పుట్టుకకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే కారణమని అందరూ పేర్కొన్నారు.

ప్రసిద్ధ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం- సామాజిక సాంస్కృతిక విశ్లేషణ’ అనే గ్రంథంలో ‘ఆధునిక సాహిత్యం రాయలసీమలో ప్రారంభం కాకపోవడానికిగానీ, కోస్తా జిల్లాలలో ప్రారంభం అయ్యాక కూడా అది రాయలసీమకు విస్తరించకపోవడానికి గానీ- రాయలసీమ కవి పండితుల ప్రతిభారాహిత్యం ఎంత మాత్రం కారణం కాదు. కొత్తదనాన్ని గురించి ఆలోచించగల వాతావరణం రాయలసీమలో నిర్మాణం కాకపోవటమే అందుకు నిస్సందేహమైన కారణం’ అన్నారు. నాటి సామాజిక రుగ్మతల్ని నిర్మూలించే సాహిత్య ప్రయత్నం జరగలేదని, అందుకు ఆధునిక భావాలు ఏమాత్రం లేవని ఆయన అభిప్రాయం.

ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఆధునిక సాహిత్యం గురించి చెప్తూ, సమాజంలో ఆధునికత ప్రవేశించకుండా ఆధునిక సాహిత్యం రావడం అసాధ్యమన్నారు. ఆధునికత గురించి వివరిస్తూ, పారిశ్రామిక ప్రగతి, నీటిపారుదలాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి తద్వారా ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఆధునికత అన్నారు. జీవితంలోకి ఆధునికత ప్రవేశించకుండా మానసికంగా ఆధునికతలో పరిపూర్ణత సాధించలేమని, జీవితం నుంచి సాహిత్యాన్ని వేరుచేయలేమని అన్నారు. రాచపాళెం అభిప్రాయంలో సమాజ ఆర్ధికాభివృధ్ధే ఆధునిక సాహిత్యానికి ప్రేరణగా భావించాలి.

వీరేగాక, రాయలసీమకు చెందిన పలువురు నవ, కథా రచయితలందరూ- రాయలసీమలో ఆధునికత ఆలస్యంగా ప్రవేశించడంవల్లనే ఆధునిక సాహిత్యం వెనుకబడిందన్నారు. వీరి అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునికత ప్రజా జీవితం లోకి ప్రవేశిస్తే తప్ప ఆధునిక సాహిత్యం వ్యాపించిందనే విషయం అవగతమౌతుంది. అయితే ఇక్కడ తెలియవలసింది ఆధునికత అంటే ఏమిటనే విషయం.
ఆధునికత అనే పదం కాలానికి, స్వభావానికి సంబంధించినదిగా, 19వ శతాబ్దం తరువాత వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యంగా విమర్శకులు భావిస్తున్నారు. ఆధునిక శబ్దం కాలాన్ని సూచిస్తుందా, స్వభావాన్ని సూచిస్తుందా? అనే విషయం ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, రాచపాళెం అన్నట్టు పారిశ్రామిక ప్రగతి ఆధునికతకు మార్గం వేసింది. యూరోపియన్ల రాకతో భారత దేశంలో ఆధునిక భావాలు మొదలయ్యాయి. భారతీయ సాహిత్యంలోగానీ, తెలుగు సాహిత్యంలోగానీ ఆధునికతను తెలుసుకునే ముందు, ప్రపంచ ఆధునిక యుగ లక్షణాలను తడమాలి. ఆధునికత రూపు దిద్దుకుంది యూరప్‌ లోనే.

గ్రీకు సంస్కృతిని యూరప్‌ నాగరికతకు మార్గదర్శకంగా భావిస్తాం. ‘కానిస్టాంట ్‌నోపుల్‌’ను గ్రీకు సంస్కృతికి నిలయంగా చెప్పుకుంటాం. క్రీ.శ 1453లో టర్కీ సుల్తాన్‌ కానిస్టాంట్‌ నోపుల్‌ పై దండెత్తి ఆక్రమించుకున్నాడు. దీంతో గ్రీకు పండితులు తమ సాహిత్యగ్రంథాలను తీసుకుని యూరప్‌కు పారిపోయారు. పారిపోయిన పండితులు తమ సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరణకు పూనుకున్నారు. ఈ ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ పని ఇటలీలో కానిస్టాంట్‌నోపుల్‌ పతనం కంటే ముందే జరిగింది. ఆనాటి రచయితలు పెట్రార్క్‌, డాంటే, భాకాషియో మొదలైనవారు తమ దేశాల ప్రాచీన సాహిత్యాన్ని చదవమని ప్రజల్ని ప్రేరేపించారు. అందుకోసం వారు అనేక నూతన పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. తమ ప్రజలు మాట్లాడే ప్రాంతీయభాషలోనే తమ రచనలు చేయడం ప్రారంభించారు. బైబిల్‌ను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. దీంతో మూఢనమ్మకాలు, మూఢాచారాలు తగ్గాయి. సాంస్కృతిక పునరుజ్జీవం ఫలితంగా నాటి యూరోపియన్‌లు ప్రతి విషయాన్ని తర్కించి, ప్రశ్నించి, పరిశోధించి శాస్ర్తీయ పద్ధతులద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. రాజకీయ, సామాజిక, మత రంగాలలోని ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాందిగా చెప్పవచ్చు.

యూరోపియన్‌ల రాకతో భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఆధునిక యుగభావాలు వెలిశాయి. యూరోపియన్‌లు క్రీ.శ 1498లో భారత్‌లో ప్రవేశించారు. కానీ వాస్తవంగా 1757 జూన్‌23న రాబర్ట్‌క్లైవ్‌ బెంగాల్‌పై సాధించిన విజయంతో భారతదేశంపై యూరోపియన్‌లు రాజకీయ అధికారాన్ని సాధించారు. దీనితో భారతీయులపై బ్రిటిష్‌వారి ప్రభావం ప్రారంభమైంది. భారతీయ ప్రజలు అటు పాశ్చాత్యసంస్కృతికి ఇటు హిందూ సంస్కృతికి మధ్య నలిగిపోయారు. చివరకు అధికారంలో ఉన్న పాశ్చాత్య సంస్కృతే ఎక్కువ ప్రభావం చూపింది. దీనికి తోడు మెకాలే, బెంటింగ్‌లు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్య భారతీయుల్ని ఆలోచింపచేసింది. కొన్ని కొత్త ప్రాపంచిక విషయాలు భారతీయులకు తెలిసొచ్చాయి. కాల్పానిక వాదం, మానవతా వాదం కవులకు, విద్యావంతులకు కొత్త చూపును కల్గించాయి. తత్ఫలితంగా ఆధునిక సాహిత్యం ఆవిర్భవించింది.
ఈ ప్రభావానికి మన తెలుగు కవులు పండితులు కూడా లోనయ్యారు. ఆధునిక సాహిత్యంవైపు ఆలోచనలు చేశారు. మన సంస్కృతిలో, సాహిత్యంలో మార్పులు అవసరమని భావించారు. దీనితో తెలుగు సాహిత్యంలో కొత్త సాహిత్య ధోరణి ప్రవేశించింది. యూరోపియన్‌ల రాకతో, వారు స్థాపించిన క్రైస్తవ మిషనరీలతో, వారు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్యావిధానంతో ఆధునికత వచ్చిందనుకుంటే, మిగిలిన తెలుగు ప్రాంతాలతోపాటు రాయలసీమలో కూడా ఆధునిక సాహిత్యం ప్రవేశించిందనే చెప్పాలి.

క్రీ.శ 1805లో రాయలసీమ ప్రాంతమైన జమ్మలమడుగులో ‘లండన్‌మిషనరీ సొసైటీ’ స్థాపితమయ్యింది. దీని ద్వారా వారు విద్యా వ్యాప్తి, మత ప్రచారం సాగించారు. క్రీ.శ. 1835లో స్థాపితమైన బాపిస్ట్‌సంఘం రాయలసీమ జిల్లాల్లో చురుగ్గానే పనిచేసింది. 1916లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఇది విద్యావ్యాప్తికి, అస్పృశ్యత నివారణకు కృషిచేసింది. క్రీ.శ.1900లో రాయలసీమలో 36 సాంఘిక సంస్థలున్నాయి. దీంతో కోస్తాప్రాంతంతో సమానంగా ఇక్కడ ప్రజలకు కూడా ఆధుని భావాలు పరిచయమయ్యాయి. అయినా రాయలసీమ వాసులు ఆధునికతలో వెనుకబడ్డారంటారు!
సమాజంలోకి ఆధునికత ప్రవేశించకుండానే 1872లో నరహరిగోపాలశెట్టి ‘శ్రీ రంగరాజచరిత్ర’ నవలను ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే కట్టమంచి రామలింగారెడ్డి 1899లో ‘కళాపూర్ణోదయం ప్రశంస’ అనే విమర్శను, ‘ముసలమ్మ మరణం’ అనే ఆధునిక కావ్యాన్ని ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే ధర్మవరం రామక్రిష్ణమాచార్లు, కోలాచం శ్రీనివాసాచార్లు ఇతోధికంగా ఆధునిక స్పృహతో నాటకాలు ఎలా రాయగలిగారు? ఆధునికత లేకుండానే రాయలసీమనుండి పత్రికలు వచ్చాయా? బళ్ళారినుండి 1835లో సత్యదూత, (దీనిని తొలితెలుగు పత్రికగా భావిస్తున్నారు), 1863లో శ్రీయక్షిణీ, 1875లో భారతి, కడప నుండి 1875లో ప్రబుద్ధాంధ్ర, కడప నుండి 1897లో ప్రభావతి- ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్య్రానికి పూర్వం దాదాపు యాభైకి పైగా పత్రికలు రాయలసీమనుండి వచ్చాయి. ఇవన్నీ రాయలసీమలో ఆధునికత ప్రవేశించకుండానే వచ్చాయా? నాగరాజు అనే పరిశోధకుడు ‘తొలి రాయలసీమ నవల’ అనే శీర్షికతో (సూర్య, 2013 జనవరి 28) 1950కి పూర్వం దాదాపు ఇరవైకి పైగా నవలలు రాయలసీమనుండి వచ్చాయని తేల్చాడు. 1926నుంచే రాయలసీమలో కథానికలు వచ్చాయి.

ఇవన్నీ రాయలసీమలో ఆధునికత లేకుండానే జరిగాయా?
1879లో ఆంధ్ర ప్రాంతంలో వితంతు వివాహం జరక్కమునుపే, పి. ఆనందాచార్యులు, ధర్మవరం రామకృష్ణమా చార్యులు రాయల సీమలో వితంతువివాహాలను జరిపినట్లు 1872 ఆగస్టు ‘పురుషార్థప్రదాయిని’లో పేర్కొన్నారు. పారిశ్రామి ప్రగతికి ప్రతీకగా భావించే ఆధునిక రవాణామార్గమైన రైల్వేలైన్‌ ఏర్పాటు మొట్ట మొదట 1862లో రేణిగుంట నుండి పుత్తూరు మధ్యనే జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమలో కూడా ఆంగ్ల విద్యాసంస్థలు, పత్రికలు, సంఘసంస్కరణ సంస్థలు రాయలసీమ ప్రజల జీవితాల్ని కొంతవరకు ప్రభావితం చేశాయి. దీనితో పాతభావాలు, మూఢన మ్మకాలు బలహీనపడడం మొదలైంది. నూతనభావాలు మొదలయ్యాయి. మన సంస్కృతిని సంస్కరించాల్సిన అవసర ముందని గ్రహించారు. ఆధునిక సాహిత్య పోకడలు కోస్తాప్రాంతంతోపాటు రాయల సీమలోనూ ఆలస్యంగానైనా మొదల య్యాయి. కానీ విసృతంగా కొనసాగలేదు. పారిశ్రామిక ప్రభావం రాయలసీమలోనే మొదలైంది. కానీ అన్ని రంగాలలో వ్యాపించలేకపోయింది. రాయలసీమ నాయకులు కూడా స్వతంత్ర ఉద్యమంతో పాటు కొన్ని సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. కానీ కందుకూరి వంటి గొప్ప సంస్కర్తలు ఒక్కరైనా ఇక్కడ లేకపోయారు.

కోస్తాప్రాంతంలో సంప్రదాయకవులు ఆధునిక సాహిత్యాన్ని అంతసులభంగా అంగీకరించలేదు. ఇదే సమయంలో కందుకూరి రాసిన ‘సరస్వతి నారద విలాపము’ కొంతసంచలనం కలిగించింది. ఆధునిక సాహిత్యప్రక్రియలకు కందుకూరే ఆద్యుడు. తర్వాత ఆధునిక సాహిత్యానికి రాయప్రోలు, గురజాడ మార్గదర్శకులుగా చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తొలి స్వీయ చరిత్ర, తొలి నాటకం, తొలి కథానిక, భాషాఉద్యమం, పత్రికలు వంటివన్నీ కోస్తాప్రాంతంలోనే మొదటవచ్చాయి. దీని ఆధారంగా మిగిలిన తెలుగుప్రాంతం కంటే కోస్తాప్రాంతం ఆధునిక సాహిత్యంలో ముందుందనేది విమర్శకుల అభిప్రాయం.
రాయలసీమవాసులు కూడా తాము ఆధునిక సాహిత్యంలో వెనుకబడి పోయామని మానసికంగా అంగీకరిస్తున్నారు. ఇది బాధాకరం.

నాటి రాయలసీమవాసులు కూడా ఆధునిక సాహిత్య ప్రక్రియల్ని అందిపుచ్చుకున్నారు. మన ముందు తరాల రాయలసీమకవులు, రచయితలు చేసిన ఆధునిక సాహిత్య కృషిని మనం గౌరవించాల్సి ఉంది. ఈ వ్యాసప్రధాన ఉద్దేశ్యం రాయలసీమ ఆధునిక సాహిత్యాన్ని ప్రాంతదృష్టితో చూడటమే. సంప్రదాయ సాహిత్యంలో ఓ వెలుగు వెలిగిన రాయలసీమ కవులు, పండితులు అంత సులభంగా ఆధునిక సాహిత్యం వైపు తమ దృష్టిని మళ్ళించలేకపోయారు. ఎందుకలా జరిగింది అనే విషయంపై కూడా లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. వారి సాహిత్య వారసులుగా దాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మనపై ఉంది. సమగ్రంగా ప్రాంత దృష్టితో సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. అంతే తప్ప ఇది మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోటీపడడం కోసం మాత్రం కాదు.
ఆధునిక సాహిత్యంలో కోస్తా ప్రాంత ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇది నూరుపాళ్ళు నిజం. అలాగని ఆధునికత రాయలసీమలో చాలా ఆలస్యంగా ప్రవేశించిందనడం అవాస్తవం.రాయలసీమలో ఆధునిక ప్రక్రియలు కొంతలో కొంత వెనుకబడ్డాయి తప్ప మరీ వెనుకబడలేదు. పత్రికలను స్థాపించడంలోనూ, ఆధునిక సాహిత్యవిమర్శలో, నవలా రచనలో, కధానికా రచనలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంలో రాయలసీమ వాసులు స్పందించారు.మరింతలోతుగా సమగ్రంగా ప్రాంతీయ దృక్పథంతో పరిశోధన జరిగితే రాయలసీమ ఆధునిక సాహిత్యం ప్రస్ఫుటంగా వెలుగులోకివస్తుంది. 
March 18, 2013, Surya daily 19-03-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...