Sunday, June 9, 2013

సీమ తొలి కథా రచయిత్రులు పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ

1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు. ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ,డి. పాపమ్మలను చెప్పవచ్చు.


పరదేశీయుల రాకతో భారత సమాజంలోని అన్నిరంగాలలోనూ ఆధునిక భావాలు ప్రారంభ మయ్యాయి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ, ఆంగ్లభా షను ప్రవేశపెట్టడం, స్ర్తీ సంస్కరణలతో ఆధునికత మొదలైంది. దీనితో స్ర్తీకి గృహహింస నుండి, సంప్రదాయ ముళ్ళ పొదలనుండి, పురుషాధిక్యత నుండి కొంతవరకు రక్షణ ఏర్పడింది. అక్షరాభ్యాసం ద్వారా స్ర్తీలు కొన్ని ప్రాపంచిక విషయాలు తెలుసుకోగలిగారు. ఇదంతా 19వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దానికి కాస్తమెరుగైంది. నేడు అది పరిపూర్ణత చెందే దశకు చేరింది. ఇప్పటికీ స్ర్తీలు కొన్ని చోట్ల అణచివేతకు, దోపిడీకి గురవుతున్నప్పటికి స్ర్తీ సామాజిక స్థాయి, గౌరవం పెరిగిందనే చెప్పవచ్చును. అయితే ఆధునిక మహిళలు ఈ స్థాయికి రావడానికి అలనాటి తొలితరం స్ర్తీలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.స్ర్తీలు ఒకవైపు- కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త, తమ కడుపున పుట్టిన పిల్లలచే నిరాదరణకు గురౌతూ మరోవైపు తమ చుట్టూ ఉన్న సమాజంతో అణచివేతకు గురవుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు.

స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. పురుషులతో సమానంగా జైళ్ళలో మగ్గారు. సంఘసంస్కరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. అలాగే కలం పట్టి ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రాంతాలతో పోల్చితే కోస్తా ప్రాంతం ఆర్థికంగా పరిపుష్ఠి సాధించటంతో ఆధునిక సాహిత్యం అక్కడ కొంత ముందుగానే అడుగేసింది. అక్కడ పురుషులతో పాటు కొందరు స్ర్తీలు ఆధునిక సాహిత్యంలో కృషిచేశారు. కానీ రాయలసీమ సామాజిక నేపథ్యం అందుకు భిన్నం. రాయలసీమలో స్ర్తీలు పురుషుల శాసనాలకు లోబడి అణిగి మణిగి జీవిస్తుంటారు. నేటికి అనేకమంది గ్రామీణ నిరక్షరాస్య స్ర్తీల దుస్థితి ఇంతే. అయినా రాయలసీమ ఆధునిక సాహిత్య ప్రక్రియల నిర్మాణంలో స్ర్తీల తోడ్పాటును విస్మరించలేము.ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఒకటైన కథానిక మొట్టమొదట స్ర్తీ కలం నుండే వెలువడింది. 1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు.

ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను చెప్పవచ్చు. అనంతపురానికి చెందిన కస్తూరి వెంకట సుబ్బమ్మ 1926లో ‘కథామంజరి’ పేరుతో పురాణ ఇతిహాసాల వస్తువులతో కూడిన కథల సంపుటి రాశారు. అందులో బలిచక్రవర్తి చరిత్రం, భీష్మోదయం, గరుడచరిత్రం వంటి కథలున్నాయి. రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు చేసిన తొలిప్రయత్నమిది. తరువాత ఆధునిక సామాజిక వస్తువును నేపథ్యంగా స్వీకరించి తొలి కథలు రాసినది- ప్రొద్దుటూరుకు చెందిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ. 1927 ఆగస్టు భారత కథానిధి మాసపత్రికలో వరకట్నం కేంద్రంగా పూండి చెల్లమ్మ ‘సీతాబాయి’ అనే కథ రాశారు. ఇందులో సీతాబాయి, ఆమె భర్త రామస్వామి తమ కూతురికి పెండ్లిచేయాలనుకుంటారు.

కట్నంగా ఇవ్వాల్సిన డబ్బు లేకపోవడంతో దిగాలుగా ఉంటారు. రామస్వామి కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉద్యోగి. అయినా ఆ జీతం పెళ్లికి చాలదు. రామస్వామి భార్య సీతాబాయి తన పుట్టింట నేర్చుకున్న వైద్యంతో తన ఇరుగు పొరుగు వారికి వైద్యం చేసి డబ్బు కూడబెడుతుంది. అలాగే కలెక్టర్‌ కూతురికి కూడా నయంకాని జబ్బును నయంచేసి రెండువేల రూపాయలు సంపాదిస్తుంది. ఆ డబ్బుతో కూతురు పెళ్లి ఘనంగా చేస్తారు. ఇందులో సీతాబాయి స్వయంకృషి వల్ల తను నేర్చుకున్న వైద్యంతో కూతురు పెళ్లి చేసింది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా సంపాదించగలరని, ఆర్థిక సంపాదనలో పురుషులకు స్ర్తీలు ఏమాత్రం తీసిపోరనే సందేశాన్ని అందించారు రచయిత్రి. మరో రచయిత్రి డి. పాపమ్మ రాసిన ‘అత్తగారు రేడియో తెలిసికొంటిరా’ అనే కథ 1927 నవంబరు భారత కథానిధి పత్రికలో ప్రచురితమైంది. ఇందులో చలపతి అనుమానంతో ఒక బిడ్డ పుట్టిన తరువాత తన భార్యను ఇంట్లోనుంచి గెంటేస్తాడు. భర్త నిరాదరణకు గురైన ఆమె ఒక బాలికల పాఠశాలను స్థాపిస్తుంది.

బాలికలకు విద్యనందిస్తుంది. కొందరికి ఉద్యోగం కూడా కల్పిస్తుంది. భర్తచెంత పెరిగిన తన కూతురికి పెళ్లి అవుతుంది. భర్త చెంత పెరిగినప్పటికీ కూతురిపై ప్రేమతో పెళ్లయిన తన కూతురికి, అల్లునికి ఆ స్కూల్లోనే ఉద్యోగాలిచ్చి వారిని పోషిస్తుంది. ఈ కథ స్ర్తీలందరికి ఆదర్శం. పురుషుడి నిరాదరణకు గురైన స్ర్తీ ఆ రోజుల్లో స్వశక్తితో ఒక పాఠశాలను స్థాపించడం సామాన్య విషయం కాదు. ఇందులో పురుషుల దయా దాక్షిణ్యాలపై కాకుండా స్ర్తీలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడాలని చెప్పినట్టయింది.ఈ సీమ కథారచయిత్రులలో కాలక్రమాన్ని బట్టి చూస్తే- 1926లో కథలు రాసిన కస్తూరి వెంకట సుబ్బమ్మను తొలి సీమ కథా రచయిత్రిగా భావించవలసి ఉంటుంది.

కానీ ఆమె కథలు పురాణ ఇతిహాసాలకు సంబంధించినవి కాబట్టి, 1927లో ఆధునిక సామాజిక వస్తువు నేపథ్యంగా కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను రాయలసీమ తొలి కథా రచయిత్రులుగా గుర్తించవచ్చు. తెలుగు కథాసాహిత్యం ప్రారంభంనుండి రచయిత్రులు తమ వంతు సాహిత్య కృషి నిర్విరామంగా చేస్తున్నారు. వారితో పాటుగా 1926-27 మధ్యకాలంలో ప్రారంభమైన రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. దీనితో మిగిలిన తెలుగు ప్రాంతపు రచయిత్రులకు రాయలసీమ స్ర్తీలు ఏ మాత్రం తీసిపోకుండా గొప్ప సామాజిక వస్తువులతో కథలు రాసినట్లయింది. వీరిని భావితరాల స్ర్తీలు స్పూర్తిగా స్వీకరించి గొప్ప రచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Monday, June 3, 2013

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడాప్రచురితమ య్యాయి. అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, మీసరగండంరామాచార్యుల దంపతులకు విశ్వరూప శాస్త్రి 1915 అక్టోబర్‌ 21న జన్మించాడు. ప్రాథమిక విద్య తరిమెలలో పూర్తి చేసి, సంస్కృతాన్ని శంకరశర్మ వద్ద అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్‌’ను అందుకొని ‘విద్వాన్‌ విశ్వం’ అయ్యాడు. కాశీ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఖండ కావ్యాలపై పరిశోధన చేయడానికి వెళ్లి అనారోగ్య కారణాల రీత్యా వెనుదిరిగి వచ్చాడు.

ఆ విశ్వవిద్యాలయంలోనే తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్‌ రెడ్డిల సహచర్యంతో విద్వాన్‌ విశ్వంపై సామ్యవాద భావాలు ప్రభావం చూపాయి. 1935లో విరికన్నె లఘుకావ్యాన్ని రాసి నీలం సంజీవరెడ్డి వివాహ సందర్భంగా ఆవిష్కరించాడు. ‘పాపం, నా హృదయం, ఒకనాడు’ లఘు కావ్యాలతో పాటు, రాతలు గీతలు అనే పద్య సంకలనాన్ని ప్రచురించాడు. ‘ఆకాశవాణి’ అనే రహస్య పత్రిక ప్రచురణలో తన వంతు పాత్ర పోషించాడు.1938లో నవ్యసాహిత్యమాల స్థాపించి సామ్యవాద భావాలను ప్రచారం చేస్తూ ఎన్నో ప్రచురణలను వెలువరించాడు. 1945లో నవ్యసాహిత్య పరిషత్‌కు కార్యనిర్వాహకుడిగా కొనసాగాడు. 1945లో ‘మీజాన్‌’ పత్రికకు ఉప సంపాదకుడిగా పాత్రికేయ రంగంలో ప్రవేశించాడు. భారతి పత్రికలోనూ అనేక వ్యాసాలు రాశాడు. ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికకు 1952లో సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ‘మాణిక్యవీణ’ అనే శీర్షికను ఆకట్టుకొనేలా నడిపాడు.1956లో రాయలసీమ జీవన స్థితిగతులకు అద్దం పట్టే ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని వ్రాశాడు.

సంస్కృతంలోని రఘువంశం, శిశుపాలవధ, కాదంబరి, మేఘసందేశం, దశకుమారచరిత్ర మొదలైన ఎన్నో రచనలను తెలుగు వచన రచనలుగా అనువాదం చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంవారి రచనలకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు. విద్వాన్‌ విశ్వం 24 సంవత్సరాల వయస్సులో, అనంతపురం కేంద్రంగా 1926 నుండి పప్పూరి రామాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీసాధన’ వారపత్రికకు తొలి కథలు రాశాడు. విద్వాన్‌ విశ్వం తొలినాటి ఆలోచనాధోరణులకు ఈ కథలు అద్దంపడతాయి. 1939 ఆగస్టు12న ‘నా పెండ్లి సంబరం’ అనే కథలో, పెళ్ళీడు వచ్చిన అమ్మాయి పెళ్ళి సంబరం గురించి తమాషాగా, ఊహాలోకంలో కలలుకనే దశ నుండి అది ఒక అవసరంగా మారి, సర్దుబాటు చేసుకొనే మనస్థితిని తెలియజేస్తుంది. సరైన సంబంధం కోసం వేచి ఉండే క్రమంలో ఆ యువతిలో కలిగే మానసిక ఆందోళనల్ని ఈ కథ వివరిస్తుంది. జీవిత భాగస్వామి ఎంపికలో యువతి అభిప్రాయానికి స్థానం లేకపోవడాన్ని సూచిస్తూ ‘అతడెవరో యే సంగతో మా వాళ్ళు చెప్పారు.

కానీ నా చెవిలో అవేవీ దూరలేదు. యెటూ నేను పరీక్ష చేసి తగినవాడా? కాదా? అని తేల్చుకునే హక్కులేప్పుడు అవన్నీ తెలుసుకొనే లాభం! యెటూ మావారి మాటే కదా? యేదో ఒక ఆశ్రయం కోసం పరితపిస్తుండే లత యే చిన్న పుల్ల దొరికినా గట్టిగా నాలుగైదు చుట్లు చుట్టుకొని అల్లుకుపోవడానికెలా ఆతురపడుతుంటుందో అలా ఉంది నా మనసు’ అని యువతితో కథకుడు వెలిబుచ్చాడు. ఆగస్టు 26న రాసిన ‘మొగమహారాజు’ కథలో పురుషుల చేతిలో అమాయకులైన అమ్మాయిలు మోసపోతున్న వైనాన్ని చిత్రించాడు. ‘అమాయకులైన అమ్మాయిలకు’ ఈ కథను అంకితం చేశాడు. తల్లి, కొడుకు, కూతురుగల ఒక చిన్న బీద కుటుంబం ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉంటుంది. ఒక యువకుడు వారికి సహాయ సహకారాలందిస్తూంటాడు. ఆ యువకుడు పట్నానికి వలస వెళితే అతన్ని నమ్మి ఆ కుటుంబం కూడా వలస వెళుతుంది. పట్నంలో పాఠశాలలో కూతుర్ని చేర్పిస్తారు. ఆ యువకుడు అమ్మాయికి ట్యూషన్‌ చెప్పటం, అవసరమైనవి తెచ్చివ్వటం చేసేవాడు. ఆ అమ్మాయిపై ప్రేమ ఉన్నట్లు, భవిష్యత్తులో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు అందుకు అమ్మాయి తల్లి అనుమతించినట్లు ఆ యువకుడు ఒక సందర్భంలో తెలియజేస్తాడు.

అమ్మాయి అతని ప్రేమను నమ్మింది. ఇద్దరు మూడేళ్ళపాటు శరీరాలు స్వాధీనం తప్పి ప్రవర్తించారు. ఉద్యోగం రాగానే ఆ యువకుడు వేరే ఊరు వెళ్లిపోతాడు. అప్పటికే అమ్మాయి మూడు నెలల గర్భంతో ఉంటుంది. అతను వస్తాడని ఎదురు చూస్తుంటుంది. ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకుతుంది. ఆమెకు ప్రతి పిల్ల వెధవా ప్రేమ లేఖలు రాస్తుండటం చూసి ‘ఎంత నీచులో, ఆడవాళ్ళంటే అంత పశువులను కొన్నారా? అంగడిలొ అమ్మే వస్తువులనుకున్నారా?’ అని మధనపడుతుంది. చివరకు బడిమానేస్తుంది. ఆ యువకుడికి పెళ్లి కుదిరిందని తెలుసుకొని ‘అన్నయ్య భావి జీవితాన్ని, అమ్మ ఆందోళనను, కుటుంబ గౌరవాన్ని, ఆయన చేసిన అమానుషకృత్యాన్నీ, అర్థం లేని సంఘ మర్యాదలను, హృదయంలేని పశుప్రవృత్తిని, అమ్మాయిలలో ఉన్న వాంఛను కారణంగా చేసుకొని ఆత్మీయ తాత్కాలిక సౌఖ్యాన్ని పరిపూర్తి చేసకొనజూచే మగవాళ్ల స్వార్థపరతత్వాన్ని పురస్కరించుకొని వాని కోసం తనని తాను వంచించుకొని’ మరొకరిని పెండ్లి చేసుకుంటుంది.

ఆమెను ఆడిపోసుకుంటున్న జనాన్ని చూసి ఆమె మనసులో ‘ఎంత హృదయంలేనిదబ్బా ఈ ప్రపంచం. ఈపాడు ప్రపంచంలో యిన్ని ఘోరాలున్నాయని నాకు తెలీదు. మానవ హృదయాలు పూలగుత్తులనుకొన్నాను. కానీ ముండ్ల కంపలనుకోలేదు. మాటలకూ మనసుకూ సంబంధం లేదు. మానవ పశువులూ సంఘంలో మర్యాదకు లోటులేకుండా పెద్దమనుషులుగా ఉండొచ్చు. మనఃపూర్వకంగా మాలిమి చూపిన మనిషి వంచిస్తే, దిక్కు మొక్కులేని అమ్మాయి ఆశ్రయం కోసం విధిలేక, అర్థంలేని ఆర్థిక నీతులకు దాసురాలై, యింకొకరిని పెళ్లి చేసుకుంటే అందరికీ అపహాస్య భాజనం, అవినీతికరం కావడం. అందరూ నన్ననేవాళ్లే, ఆయన సంగతెవరికి కాబట్టింది? అన్ని నిందలూ ఆడవాళ్ళకే. ఆయన కేమమ్మా మగమహారాజు’ అనుకుంటున్నట్లు కథ ముగుస్తుంది.
మోసపోయిన స్త్రీ, మోసపుచ్చిన పురుషుడు- ఇద్దరి భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, స్త్రీకి అండగా నిలవాల్సిన వ్యవస్థ ఆమెను తప్పుపట్టి, పురుషుని చూసి చూడనట్లు వదిలేస్తే ద్వంద్వ వైఖరిని కథకుడు ఎత్తిచూపాడు. ఆనాడైన, ఈనాడైనా స్త్రీ పురుషులిరువురికి సమదృష్టి, సమన్యాయం అలవడనంత కాలం ఇలాంటి కథలు సజీవంగానే వుంటాయి.

1940 జనవరి 20న రాసిన ‘ఎందుకు ’ కథలో కటిక పేదరికంలో జీవిస్తున్న సమయంలో మనవడికి రోగం సోకటంతో కుమిలిపోయే ముసలమ్మ, అప్పులపాలైన రైతు, సొంత బిడ్డల ప్రేమకు నోచుకోని భూస్వామి, నిరుద్యోగుడైన యువకుడు, మోసపోయిన వేశ్యగా మారిన వితంతు మహిళ, ప్రజా ఉద్యమాలతో జైలుకు పోయి రాజకీయాలలో ఉన్న దంతా కోల్పోయిన నీతిగల నాయకుడు, పుస్తకాలు ప్రచురించుకొని అప్పుల పాలైన రచయిత- మొదలైన ఉపసన్నివేశాల ఆధారంగా సమాజంలో ఘోరాలు, నీచత్వం ఎందుకు జరుగుతున్నాయి? బాధలు ఎందుకు పడుతున్నారు? అంటూ ఈ కథలో ఆలోచింపజేస్తాడు రచయిత. వీటి గురించి ఆలోచించడం వృధా అనే మరీ పెద్దవాళ్లు కొందరు, ఆలోచించి ఎంత మంది తత్వవేత్తలు అడవులకెళ్ళారో అనే కాస్త హృదయంకల వారు కొందరు, స్వార్థపరతత్వాన్ని పరమోచ్ఛ స్థానానికి కొనిపోయే ధనతత్వంవల్ల జరుగుతోందని, ఇందుకు విరుగుడు మానవ సేవయే మాధవ సేవ అంటూ ఊరడింపు ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కొందరని- ఇలా పలు అభిప్రాయాల్ని రచయిత కథలో తెలియజేస్తాడు.

అంతిమంగా సంఘాన్ని మార్చడానికి పునర్మించడానికి వీలుందని ఆ ప్రయత్నంలో ఎన్నో ద్వేషాల్ని, అపహాస్యాల్ని, అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతమాత్రాన ప్రయత్నాన్ని మానుకోరాదని సూచిస్తాడు. ‘ఎందరో ఈ నిరాఘాట ధాటిలో పోతున్న సమాజ జగన్నాథ రథం క్రింద నలిగిపోలవలెను. ఎందరి రక్తంతోను ఈ భూమి తడిసిపోవలెను. ఎందరి ఆత్మలో పిశాచాలై ప్రపంచమంతా ప్రళయ తాండవం చేయవలెను. ఎందరి ఆలు, పిల్లలు అన్నంలేక మలమల మాడిపోవలెను. ఊఱికే మారుతుందా సంఘం. ఆ సమాజ శక్తికే బలికావలెను. అందుకు సర్వసన్నాహాలు చేసుకొని రంగంలోకి దుమికితీరవలెను. ఎందుకంటే ఆ బలికే, ఆ పొలికే’ అంటూ కథ ముగుస్తుంది. సమాజ మార్పుకై బలి అవుతూనే నూతన సమాజం కోసం పొలికి సిద్ధమవ్వాలనే విప్లవకర మార్గాన్ని ఈ కథలో రచయిత నిర్దేశం చేసాడు.శ్రీసాధన పత్రికలో కథానికలు రాసే ఉద్దేశంతో వ్రాయటం ప్రారంభించిన విద్వాన్‌ విశ్వం 1940, జనవరి 27 నుండి రాసిన ‘నీతులు, ఎక్కడికి, ఎక్కడున్నాము’ రచనలలో వ్యాస లక్షణాలు కనిపిస్తాయి.

సామ్యవాద భావాలపై పాఠకులలో మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.1940, జనవరి 27న వ్రాసిన ‘నీతులు’ అనే రచన- సమాజానికి, వ్యక్తికీ ఉన్న సంబంధాన్ని చక్కగా ఒడిదొడుకులు లేకుండా జరిగేటట్లు చేయడం కోసం వేదాలు, కావ్యాలు, నీతికథలు, మతాలు మొదలుకొని రాజ్యాంగాలు, తత్వశాస్త్రాలవరకు ఆయా కాలాలలో ఉన్నాయి. సమాజ స్థితికి అనుగుణంగా సమరసతను చేకూర్చేటందుకై అవి కొంత వరకు ఉపయోగపడినాయని పూర్తిగా నెరవేరలేదని- ప్రారంభమవుతుంది.సమాజానికి, వ్యక్తికి సామరస్యాన్ని కలిగించే నీతి నియమాలు ఆదర్శాలు కావని అవి సాధనాలని, వాటిని ఆచరణలో పెట్టటానికి తగిన సమాజ నిర్మాణం జరగాలని అందుకు పరిసర పరిస్థితులు అనుగుణంగా ఉండాలని, ఒక వేళ ఆచరణలో లేనప్పుడు ఆ సిద్ధాంతాలు ఆడంబరాలుగానే మిగిలిపోతాయని కథకుడు వివరిస్తాడు.

ఒక భూస్వామికి అతని మనస్సులో ఏమాత్రం కూలివాని నోరుకొట్టాలని ఇష్టంలేకున్నా మన సమాజ విధానమే అతని శ్రమను దోచుకునేటట్లు చేస్తోందని తెలిపాడు. యంత్రప్రాయమైన ఆర్థిక నిర్మాణం, అస్థిరమైన స్వేచ్ఛా వ్యాపారం ఫలితంగా పోటీలు, దివాళాలు, పీడనలు, ధనకేంద్రీకరణలు, యుద్ధాలు, దేశ స్వతంత్రతకి భంగాలు కలుగుతాయి. పరిస్థితులలో మార్పులు తేకుండా భావవాదులు మనసులో మార్పులు తెచ్చుకున్నంత మాత్రానా ప్రపంచం ఏమాత్రం శాంతంగా ఉండదని వివరించాడు. ఒకరిని పీడించడానికి అనువయ్యే భౌతిక వాతావరణం లేకపోతే ఆ తరువాత మానసికంగా కూడా వ్యక్తుల్లో పరపీడనేచ్ఛ నశిస్తుంది. ఒక్కతూరే పోకపోవచ్చు కానీ ఆ కొత్త వాతావరణం కొన్నాళ్లలో మానసిక ప్రపంచంలోను ఈ దుర్గుణాలను తుడిచిపెట్టివేస్తుంది. పీడితులు, పీడకులు అనే భేదం, పరస్పర వైరుధ్యం పోయి వర్గరహిత సమాజం ఏర్పడిన తరువాత నీతి, నియమాలు కేవలం ఆదర్శాలుగా కాక ఆచరణలో ఉండేటట్లు చేయవచ్చని కథ ముగుస్తుంది.సామ్యవాద సిద్ధాంతంలోని మూలసూత్రాలన్నింటిని సమకాలీన సమాజానికి అనువర్తితం చేస్తూ సమర్థవంతంగా, సైద్ధాంతికంగా ఈ రచన సాగుతుంది.

ఫిబ్రవరి 3న వ్రాసిన ‘ఎక్కడికి’ రచనలో పాత కాలంలోనే అన్నీ ఉన్నాయనే భ్రమలు వదులుకొని, అందులోని మంచిని మాత్రమే స్వీకరించాలని, జీవన విధానంలో, సమాజ పరిణామక్రమంలో కొత్త ఆలోచనలకు, మార్పులకు స్థానం ఇవ్వాలని తెలియజేస్తుంది. ఫిబ్రవరి 10న వ్రాసిన ‘ఎక్కడున్నాము’? రచనలో ఆర్థిక, సామాజిక, విద్యారంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో తూలనాత్మకంగా వివరించాడు. సామ్రాజ్యతత్వ బంధనాల నుండి విడిపోయి సహకార పద్థతిపై దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకోవాలని అందరూ స్వరాజ్యం కోసం పోరాడాలని అప్పుడన్నీ సాధ్యమవుతాయని తెలియజేస్తుంది. విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయి. 
డా.ఆప్పిరెడ్డి హరినాథ రెడ్డి 
surya daily 03-06-2013

రాయలసీమ కవులకు న్యాయం జరిగిందా?

‘క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదు రాయలసీమలో’ అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు. ఈ రసజ్ఞత కవులదే! వారి సాహిత్య కృషి అనితర సాధ్యమైంది. ఒక పుట్టపర్తి, ఒక విద్వాన్ విశ్వం, ఒక పప్పూరు రామాచార్యులు, రాళ్లపల్లి కల్లూరు అహోబలరావు.. ఇలా ఎందరెందరో సాహితీ కృషీవలురు. ఇక విమర్శ పుట్టింది సీమగడ్డలోనే. కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్వ విచారం’ చాలా ముందుగానే వచ్చింది. రాళ్లపల్లి వేమన ఉపన్యాసాలు, రా.రా. విమర్శలు, కట్టమంచి, రా.రాల విమర్శ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎందరెందరో (ఇవి కొందరి పేర్లు మాత్రమే) సాహితీ కృషీవలులు సీమ సాంఘిక, భౌగోళిక, ప్రజల జీవన పార్శ్వాలను, కరువు, ఫ్యాక్షనిజం తదితర అంశాలపై కథలు, కవితలు, కావ్య విమర్శలు, ప్రాచీన ఆధునిక సాహిత్య సంప్రదాయ రచనలు చేసి లబ్దప్రతిష్ఠులయ్యారు. అయితే సీమలో పుట్టడం వల్లనో, వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలచేతనో.. సీమ రచయితలు, కవులు, కథకులు, సాహితీ విమర్శకులకు తగిన గుర్తింపు రాకపోగా... జ్ఞానపీఠం లాంటి అవార్డులకు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులకు (ఒకరో ఇద్దరో తప్ప) అనంతపురం కరువుజిల్లా వారికి.. అసలే లేవు. రావు. కారణాలు ఆ ప్రాంతపు అసమర్థులైన రాజకీయ నాయకులు.. సాహిత్య విలువలు తెలియని పాలకులు.. తెలంగాణ.. కోస్తా ప్రాంతాల మాదిరి పోరాట పటిమ, ఐక్యత లేదు. కాకాలు, బాకాలు ఊదే సంస్కృతికి భిన్నంగా.. ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వాలు, కరువును బాగా అనుభవించిన నేపధ్యంలో.. కోరికలు తక్కువగా ఉండటం.. ఇలా ఎన్నో కారణాలచేత సీమ కవులకు, రచయితలకు, విమర్శకులకు రావలసిన కీర్తిగాని, ‘పదవులుగాని, అవార్డులుగాని దక్కలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పటికి తెలుగువారికి రెండు జ్ఞానపీఠ అవార్డులు వస్తే.. అవి సీమేతర ప్రాంత కవులకు మాత్రమే వచ్చాయి. ఇది సీమకవులకు జరిగిన ద్రోహం కాదని ఎవరైనా అనగలరా? పోనీ అర్హులు లేరా? పదునాలుగు భాషల్లో పాండిత్యం సంపాదించి, శివ తాండవం జనప్రియ రామాయణం, పెనుగొండ లక్ష్మీలాంటి కావ్యాలు, అనువాదాలు.. విమర్శలు.. రాసిన పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ కృషికి ఎన్ని జ్ఞానపీఠాలు ఇస్తే సరిపోతుంది? ఆ రోజుల్లోనే వందకు పైగా కావ్యాలు, విమర్శలు.. ఇలా అనేక గ్రంథాలు రాసిన ఆ నిత్య సాహితీ కృషీవలునికి జరిగిన అన్యాయం తలుచుకుంటే.. ఒళ్ళు మండిపోతుంది. కేవలం కరువు సీమలో పుట్టడం వల్లనే.. ఆ కృషి బుగ్గిపాలయిందా? నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వెదుకల్లు సదాశివన్ లాంటి రాజకీయ ఉద్దండులు కూడా సీమ కవులకు అండగా నిలవకపోవడం, న్యాయం చేయకపోవడం దారుణం. పెనుగొండలో గగనమహల్ కేంద్రంగా అష్టదిగ్గజ కవులను కృష్ణదేవరాయలు ఎంతగానో ప్రోత్సహించారు. పెద్దన మనుచరిత్రలోని హిమాలయ పర్వత వర్ణన.. భట్టుమూర్తి వసుచరిత్రలోని కోలాహల పర్వతం (పెనుగొండ), శుక్తిమణి (చిత్రావతి) నదులు ఈ ప్రాంతంలోనివే అంటారు. ఇలాంటి ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రాంతాన్ని చిన్న వయసులోనే ‘పెనుగొండ’ లక్ష్మికావ్యంగా చిత్రించి.. సరస్వతీపుత్రునిగా పేరుపొందిన పుట్టపర్తికి జ్ఞానపీఠం దక్కకపోవడం దురన్యాయమే.. ఆనాడే కాదు ఈనాడు కూడా.. బాలల సాహిత్యం ‘అక్షర సైన్యం’లాంటి అభ్యుదయ కవిత్వం రాసి ‘కవి కాకి’గా పేరుపొందిన గొప్ప కవి కోగిర జై సీతారాంకు కనీసం బాలల అకాడమీ అవార్డు అయినా ప్రభుత్వంగాని.. సాహితీ సంస్థలు గాని ప్రకటించకపోవడం శోచనీయం. అటు కర్నాటకలో ఇప్పటికి 12 మంది కవులకు కథా రచయితలకు జ్ఞానపీఠ అవార్డులు దక్కాయంటే.. అక్కడ సాహితీ సృజనకారులకు ఎంతటి ప్రోత్సాహం లభిస్తుందో.. ఇట్టే మనం ఊహించవచ్చు. దౌర్భాగ్యం.. ఏమిటంటే.. అదే కర్నాటక సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా రచయితలకు కవులకు.. పెనుగొండలో (రాయల విడిది) పనిచేసిన కవులకు ఎలాంటి అవార్డులు (స్థాయికి తగిన) దక్కకపోవడం విడ్డూరం. సీమ రచయితల్లో బాగా నష్టపోయిన గొప్ప రచయిత పులికంటి కృష్ణారెడ్డి. సీమ చిన్నోడిగా గుర్తింపు పొంది సీమ కథల మాండలికాలను.. జానపద గేయాల (అమ్మి పాటలను) మాధుర్యాలను చిత్తూరు నుంచి చికాగో వరకు రుచి చూపించిన ఆ మహాకథకున్ని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాని.. ఇటు పేరొందిన సాహితీ సంస్థలు గాని గుర్తించి.. గౌరవించకపోవడం శోచనీయం. ఆయన రాసిన దళిత కథలు దళిత వాదం పుట్టకముందే వచ్చాయి. నండూరి ఎంకి పాటలకు ఏమాత్రం తీసిపోనివి పులికంటి అమ్మిగేయాలు. ఆయన కేవలం సీమ ప్రాంతం వాసి కావడంవల్లనే.. న్యాయం జరగలేదన్నది నూటికి నూరు శాతం నిజం. సాహిత్యపు పిచ్చితో రైల్వేలో మంచి ఉద్యోగం కూడా వదులుకున్న పులికంటి సాహితీ సేవలను తలచుకుంటే.. ఎంతో బాధ కలుగుతుంది. చివరకు ఆయనే తన పేరిట అవార్డులు ప్రకటిస్తూ.. సాహితీ సేవ చేశారు. కన్నడంలో ఎంతోమంది కథారచయితలకు జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు.
సీమలో సింగమనేని, డా.శాంతినారాయణ, బండి నారాయణస్వామి లాంటి వారికి కనీసం అకాడమీ అవార్డులు కూడా రాలేదు. సీమ కథకు దిశానిర్దేశం చేసిన సింగమనేని సీమ రైతులపై ఎన్నో కథలు రాశారు. పల్లేరు ముళ్ళు పేరుతో శాంతి నారాయణ అద్భుత కథా సంకలనం విడుదల చేశారు. బండి నారాయణస్వామి.. తెల్లదెయ్యం, వానరాలె లాంటి ఒక్కో కథకు.. ఒక్కో అవార్డు ఇవ్వవచ్చు. సీమ కరువును అనుభవించి, కడుపులు మండి.. గుండెలు రగిలి... పొగిలి.. కథలు.. కవితలు రాసిన సీమ కవులకన్నా ఏ ఆఫ్రికన్ కవి గొప్పవాడో.. ఏ అమెరికన్ రచయిత గొప్పవాడో.. దమ్మున్న సాహిత్యకారుడెవరైనా చెప్పగలడా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అవార్డు పుస్తకాల్లో.. ఇంతకన్నా సత్తా ఉన్నా.. పుస్తకాలేమిటో.. వాటి గొప్పతనమేమిటో.. చెప్పగలరా? కర్నాటక సరిహద్దులోనే హళెకన్నడ.. హొసగన్నతి- సంస్కృతులను.. భాషా మాండలికాలను.. ప్రజల జీవన విధానాలను చిత్రించిన కన్నడ రచయితలకు.. కర్నాటక సరిహద్దు రచయితలకు పెద్ద తేడా ఏమిటో ఏ యూనివర్సిటీ పరిశోధకులైనా నిగ్గు తేల్చగలరా?
  • - బిక్కి కృష్ణ, 9912738815
  • ANDHRA BOOMI 03-06-2013

Saturday, June 1, 2013

అనంతపురం జిల్లాలో ఆధునిక కథా వికసనం

1910లో పుట్టిన తెలుగు కథానిక 1940  తర్వాత గాని రాయలసీమ లోకి అడుగు పెట్టలేదు. అందుకు గల కారణాలు చాలా వున్నప్పటికీ, ప్రధాన కారణం ఇక్కడ ఆధునిక జీవితమే ఆలస్యంగా ఆరంభం కావటం ! మరొక కారణం రాయలసీమ రచయితలు, కవులు గ్రాంధిక భాషా వ్యామోహం నుంచీ, ప్రాచీన సాహిత్య వస్తు రూపాల నుండీ బయట పడక పోవటం.!
రాయలసీమలో ఒక భాగమైన అనంతపురం జిల్లాలో మరీ ఆలస్యంగా 1970 తర్వాత గాని ఆధునిక కథా వికసనం జరగలేదు. అయితే 1941 ప్రాంతాల్లోనే జి.రామకృష్ణ అనే ఒక సీనియర్ జర్నలిస్టు చిరంజీవి అనే పేరుతో గల్ఫిక లాంటి ఒక చిన్న కథను విజయవాణి అనే పత్రికలో ప్రచురించాడు. ఆయన అలాంటి చిన్న కథలను మరో నాలుగైదు రాసినప్పటికీ ఆయన రచనల ప్రభావం సమకాలికుల పట్ల లేకపోవటం వల్ల అనంతపురం జిల్లాలో కథానిక ప్రయాణం స్తబ్దతలో పడిందనే చెప్పాలి. ఆయన 1953 లో ఆంధ్ర ప్రభ వార పత్రికలో ప్రచురించిన ‘ గంజికోసరం’ అనే కథ మాత్రం  చాలా మంది దృష్టికి వచ్చింది. అప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్రంగా నెలకొన్న కరువును చిత్రించిన కథ అది. ఆ సంవత్సరం కరువు తీవ్రతను తట్టుకోవటానికి ప్రభుత్వం గంజికేంద్రాలను ఏర్పాటు చేసింది.కరువు కారణంగా ఊళ్లకు ఊళ్ళు వలస బాట పట్టినాయి. అలా వలస వెళ్ళిన ఒక కుటుంబం కథ ఈ ‘గంజికోసరం’. ఆ కుటుంబంలోని వారందరూ పనుల కోసం వలస వెళ్లగా . ఇంట్లో ఒక ముసలి అవ్వ, ఆమె కోడలు , మనవరాలు మాత్రం మిగులుతారు. రోజులు గడచే కొద్దీ వాళ్ళకు ఇంత  తిండి కూడా దొరకటం కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల వూరికి సమీపంలో వున్న గ్రామంలో “గంజికేంద్రం” ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఆ అవ్వ, ఆమె కోడలు , మనవరాలు గుక్కెడు గంజి కోసరం నాలుగైదు మైళ్ళు నడిచి ఆ గంజికేంద్రానికి చేరుకోవటం ఇందులోని కథ ! తీరా గంజికేంద్రానికి చేరే సరికి అది మూతపడివుంటుంది. అవ్వ నైరాశ్యం తోనూ, ఆగ్రహంతోనూ ప్రభుత్వాన్నీ, అధికారులనూ ‘దుమ్మెత్తి’ పోస్తూ శాపనార్థాలు పెడుతుంది . ఈ కథలోని కరువు అనే ఒక భయంకరమైన గడ్డు వాస్తవికత పాఠకులను జలదరింపజేస్తుంది.
ఈ కథ తర్వాత అనంతపురం జిల్లాలో ఆధునిక కథానిక స్తబ్ధతలో వడి పోయిందనే చెప్పాలి. “ఈ నాటి వరకూ మనకు లభించిన ఆధారాలను పరిశీలించి చూస్తే , అనంతపురం జిల్లాలో స్థానిక జీవిత  చైతన్యం సింగమనేని నారాయణ కథలతో ప్రారంభమయిందని చెప్పాలి.సింగమనేని మొదటి స్థానిక జీవిత చైతన్య కథ ‘జూదం’, 1978 లో ‘ప్రజాసాహితి’లో  ప్రచురితమైంది. రాయలసీమలో ప్రకృతి , రైతుతో ఆడే జూదం లాంటి వ్యవసాయాన్ని, విధి లేక మోస్తున్న రైతు  జీవితాన్ని ఈ కథ నిరాడంబరమైన శిల్పంతో చిత్రించింది అంటున్నారు సుప్రసిద్ధ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ( రాయల సీమలొ ఆధునిక సాహిత్యం… పుట 184  )  సింగమనేని రచయితగా మాత్రమే గాకుండా తన సహచర్యంతో , ఆలోచనాపరుడిగా , ఆ ప్రాంత రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేసాడు.1978 తర్వాత కథా రచన ప్రారంభించిన చిలుకూరి దేవపుత్ర , బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ కూడా పరస్పరం ప్రభావితం చేసుకున్నారు. ఈ ప్రభావ ప్రసరణం చాలా ఆరోగ్యకరంగా కొనసాగింది.” అంటున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ( అదే పుస్తకం – పుత 188).
అనంతపురం జిల్లా అనగానే, ఎవరికైనా వెంటనే స్ఫురించేది ‘కరువు ‘ – 150 సంII     కాలంలో65 కరువులను అనుభవించిన జిల్లా ఇది – రాష్టంలోనే విస్తర్ణంలో అతి పెద్ద జిల్లా అయివుండీ, సాగునీటి  విషయంలో , రాష్టంలో అతి అథమ స్థానంలొ వున్న జిల్లా ఇది, భారతదేశం మొత్తం మీద అత్యల్ప స్థానంలో వున్న జిల్లా  కూడా ఈ జిల్లానే, ధాత కరువు డొక్కల కరువు , గంజికరువు వంటి పేర్లతో అనంత జీవితం కరువు జీవితమే అయ్యింది. ప్రకృతి అననుకూలత ప్రభుత్వ నిర్లిప్తత అనంతరైతును ఆత్మ హత్య చేసుకునే దశకు నెట్టినాయి. అనంత రైతును వెంటాడుతున్న కరువును గురించి ఇక్కడి కవులు, రచయితలు మొన్నటి దాకా పట్టించుకోలేదు. సింగమనేని జూదం కథ వచ్చిన తరువాత సీమ కరువు చిత్రణను వారసత్వంగా ఈ జిల్లా రచయితలు అందుకున్నారు- అనంత రైతుల జీవితాల్లోని ప్రధాన పార్శ్వాలను తొలిసారిగా సింగమనేని ఆవిష్కరించారు. తరువాత వచ్చిన ప్రతిభావంతులైన కథకులు స్వామి, శాంతి నారాయణ , దేవపుత్ర , జి.ఆర్.మహర్షి, సడ్లపల్లి చిదంబర రెడ్ది , ఎస్.వి.ప్రసాద్, దీవెన లాంటి వారు ఆ వారసత్వాన్ని కొనసాగించినారు.
సింగమనేని విశిష్టమైన రైతాంగకథలెన్నో రాసినారు వాటిలొ జూదం, ఊబి , ఉచ్చు , విముక్తి , అడుసు. అగాథం . అలజడి , ఒక పయనం, యక్ష ప్రశ్నలు లాంటివి అనంతపురం జిల్లా రైతుల స్థితిగతులకు   దర్పణం పడతాయి. ఈ జిల్లా రైతాంగం నీటి ఎద్దడి భరించలేక , ఇష్టం వున్నా లేకపోయినా, శక్తి వున్నా లేకపోయినా దిగి, కూరుకుపోవటం అనివార్యమైపోయింది- అలా బోరింగు అన్న ప్రమాదకరమైన ఆకర్షణకు లోనై పరాజయం చెంది, దిగ్భ్రాంతుడైన రైతు కథ సింగమనేని’ ఊబి’.   ప్రకృతికి తోడు మార్కెట్ వ్యవస్థలోని దొపిడీ స్వభావం రైతు చుట్టూరా వలలా అల్లుకున్న విధానాన్ని గొప్పగా చిత్రించిన కథ ‘అడుసు’. తను పండించిన పంటకు ( చీనీ – బత్తాయి పళ్ళు ) తానే వెల నిర్ణయించలేని రైతు అసమర్థ ప్రతీకారంగా తోటనే నరికి వేయడం ఇందులోని కథాంశం, ముగింపులో  కాళీ పట్నం ‘యఙ్ఞం’ ను పోలిన ఈ కథ , మనకున్న ఉత్తమ కథల్లో ఒకటి . కృత్రిమత ఎంత మాత్రమూ లేని కథనం , ముగింపుకు అభిముఖంగా అంచలు అంచలుగా కథ నడిపిన చాతుర్యం , ఈ కథకు ఒక ప్రత్యేకతను తెచ్చాయి- ఇక్కడి కరువే, సింగమనేనితో ‘విముక్తి ‘కథ రాయించింది.  రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కరువు వల్ల భూములున్న వాళ్లకే భూమి భారంగా మారిన వైనాన్ని ఈ కథ చిత్రించింది. కరువు దౌష్ట్యాన్ని భరించలేక ఆత్మహత్యల పాలైన రైతాంగాన్ని ‘అలజడి’ కథ చిత్రిస్తే , వలస బాట పట్టిన రైతాంగ కుటుంబాలను ‘ఒక పయనం’ కథ నిరూపించింది.
అనంతపురం జిల్లా కరువు ప్రభావాన్ని , ప్రతిభా వంతంగా చిత్రించిన మరో కథకుడు శాంతి నారాయణ కరువులో వాన కోసం ఎదురు చూసి చూసి అనంత రైతు అనివార్యంగా అశాస్త్రీయ మూఢాచరాలకు పూనుకుంటాడు – ఈ దురాచారాలను శాంతినారాయణ ‘కల్లమయిపాయ ‘    కథలొ చిత్రించాడు- స్వతంత్ర భారత రాజకీయ ఆర్థిక విధానాలు, వ్యవసాయక భారత దేశంలోని రైతును నాశనం చేసి, దళారులను సంపన్నులను చేసిన దుర్మార్గం మీద కోపప్రదర్శనలే శాంతి నారాయణ వ్యవసాయ కథలు……….. అనంతరైతు జీవన శైలిని , ఆలోచనల్ని, ప్రకృతిలో  వచ్చే మార్పులు, అవి వ్యవసాయంపై చూపే ప్రభావం, వ్యవసాయ రంగాన్ని ఆవరించిన, అనేక ప్రభుత్వ సంస్థల తీరుతెన్నులు వంటి వాటిని, శాంతి నారాయణ అనుభవ పూర్వకంగా, పరిశీలనాత్మకంగా  తన    కథల్లో చిత్రించారు -’కల్లమయుపాయ’,  ‘పల్లేరు ముళ్ళు ‘ ,’రతనాల సీమలో’, ఈ పయనం ఎక్కడికి , దళారీ , ఎండమావులు  లాంటి అతడి కథలు, అనంతపురం జీవితంలోని వివిధ ముఖాలను, ఇతర ప్రాంతాల వారికి సమర్థవంతంగా పరిచయం చేశాయి. “ఈ పయనం ఎక్కడికి” అనే కథ , ప్రాంతీయ అసమానతల్ని విశ్లేషించినకథ, కోస్తా రాయలసీమల మధ్య భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధిలోని అసమానతల్ని ప్రశ్నించి, రాయల సీమలోని ఆర్థిక పరిస్థితులు కుటుంబ సంబంధాలలో తీసుకు వచ్చిన మార్పును ఈ కథ ప్రతిబింబించింది- నీట కరువు వల్ల వ్యవసాయం మూలపడటం, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు కుటుంబాలు కూలీలుగా పట్టణాలకు చేరుకోవడం , పొలాలు బీడుపడి పోవడం , పల్లెలు పాడుబడి పోవడం, అనంతపురం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పరిణామం, పట్టణాలకు వెళ్ళిన రైతులు కూలిపని చేసుకుని పస్తులు లేకుండా బతకగలుగుతున్నారు. పొలాలు అమ్మి, ఆ డబ్బును తెలివిగా పెట్టుబడిగా మార్చగలిగిన వారు పచ్చగానే బతుకుతున్నారు. ఈ పరిణామంలోని అనివార్యతను గుర్తించిన ఈ కథ భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను గురించి పాఠకునిలో అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతుంది.
అనంతపురం జిల్లా నిర్దిష్ట జీవితాన్ని స్థలకాలాల చైతన్యంతో అద్భుతంగా చిత్రించిన మరోకథకుడు ‘స్వామి’. స్వామి రాసిన “నీళ్ళు”. “వానరాలే”,  “సావుకూడు”, “బతుకువూబి” వంటి కథలు అనంతరైతు వ్యక్తిత్వాన్ని కరువు  ధ్వంసం చేసి , ఇక్కడి మానవ సంబంధాలను వికృతం చేస్తున్న తీరును ధ్వనిస్తాయి. కరువు ఇక్కడి ప్రజల సాధారణ కోర్కెలు కూడా తీర్చుకోలేని స్థితిని కల్పిస్తున్న వాస్తవాన్ని సావుకూడు ప్రతిఫలిస్తే , కరువు ఫలితమైన రైతు ఆర్థిక క్షీణత, ఆశాజీవి అయిన మనిషిని, ఆశలు లేని కట్టెగా మారుస్తున స్థితిని బతుకు “ఊబి” ప్రతిబింబిస్తున్నది. స్వామి రాసిన “నీళ్ళు” కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోకుండా ఉండలేం ! నీటి సమస్య గురించి ఎందరో రాసినప్పటికీ స్వామి తీసుకున్న కోణం వేరు ! నీటికీ అభివృద్ధికీ వున్న అవినాభావ సంబంధాన్ని ఈ కథలో రచయిత నిరూపిస్తాడు. గుక్కెడూ నీళ్ళుసైతం కరువైన దేశంలో మనం సాధించిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తాడు- వానల కోసం ఎదురు చూసే రైతుల కడగండ్లను “వానరాలే” కథ చెబుతుంది – “తెల్లదయ్యం” అన్న కథ  రాయలసీమ నేపథ్యం వున్న  అంతర్జాతీయ రాజకీయ కథ. మన వ్యవసాయం మీదా . గ్రామీణ జీవితం మీదా, ప్రపంచీకరణ దుష్ట విధ్వంస ప్రభావాన్ని ప్రతీకాత్మకంగా, మాంత్రిక వాస్తకత మార్గంలో ఈ కథ చిత్రిస్తుంది.
ఇతివృత్తాల ఎంపికలో స్వామి ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదు – తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని తను దగ్గరగా చూసిన విషయాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకున్నాడు – రాయలసీమలోని చాలా మంది రచయితలతో పోల్చి చూసినపుడు స్వామి చాలా వస్తు వైవిధ్యమున్న కథా రచయిత. తన చుట్టూ వున్న జీవితాన్ని గురించి సరైన ఎరుక, కథా వస్తువును ఎన్నుకోవడంలో చాతుర్యం, దాన్ని కథగా అల్లుకోవడంలో చక్కని శిల్ప పరిఙ్ఞానమున్న రచయిత స్వామి. అనంతపురం జిల్లా గ్రామీణ వ్యావసాయిక జీవితాన్నీ, రైతు వ్యావసాయిక సంక్షోభాల్నీ , కరువు కారణంగా ఛిత్రమౌతున్న కుటుంబ సంబంధాల్నీ స్వామి తన కథల్లో అత్యంత వాస్తవికంగా చిత్రించాడు.
అనంత కథకులు అనంత రైతు కష్టాలకు కేవలం ప్రకృతినే దోషిగా నిలబట్టే బలహీనతకు లోను కాలేదు చాలా కథల్లో ప్రకృతితో పాటు వ్యాపారవ్యవస్థను రచయితలు తీవ్రంగా విమర్శకు పెట్టారు. స్వతంత్ర భారత పెట్టుబడిదారీ వర్గం భారత రైంతాంగాన్ని ఎలా నట్టేట ముంచి తన మేడలు కట్టుకుంటుందో ,అనంతపురం జిల్లా వ్యవసాయ జీవితం ఆధారంగా చెప్పగలిగారు.అంతే గాదు , పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు నిర్ణయించే హక్కు, ఆయా ఉత్పత్తి దారుల కున్నట్టు , వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం మీద అనంత కథకులు ఆలోచనలు రేకత్తించగలిగారు. కొన్ని కథల్లోనైనా రైతులు తమ మూలుగుల్ని ఇటూ కరువు ,అటు దళారీ వ్యవస్థ పీల్చి పిప్పిగా చేస్తుంటే , రాజకీయ వ్యవస్థ బాధ్యతా రహితంగా ప్రవర్తించడమేగాక, తానూ రైతుకు శత్రువుగా మారడాన్ని విమర్శకు పెట్టారు.
గత ఆరేడు సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.రైతుల ఆత్మహత్యలు మొదలయినాయి. ఈ ప్రాదేశికత నుండి, ఇక్కడి కథకులు ఈ జిల్లా కరువు కథలను విస్తృతంగా రాశారు. కొత్తతరం కథకులు ఈ వాతావారణం నుండే పుట్టుకొచ్చారు- ఎన్.వి.ప్రసాద్, చిలుకూరి దీవెన, హిదయతుల్లా, జి.బాషా ,షరీఫ్ లాంటి కొత్త కథకులు రాసిన కథల్తో ఇనుపగజ్జెల తల్లి అను పేరుతో అనంత కరువు కథల సంకలనం, ఈ దశలోనే వెలువడింది.
అనంతపురం జిల్లా అనగానే కరువుతో పాటు గుర్తుకొచ్చేది ఇక్కడి ఫాక్షన్ రాజకీయ ముఠా కక్షలు – ఈ జిల్లా జీవితంలో ఇది ఒక చిన్న పార్శమే అయినప్పటికీ , అది స్పష్టించిన ప్రకంపనలు ఈ జిల్లా అభివృద్ధిని సంక్షోభంలొ పడదోసినాయి. ఒకప్పటి గ్రామ సంబంధమైన పార్టీలు, తర్వాతి కాలంలో రాజకీయం రంగు పులుపుకొని, ఫాక్షన్ గా పరిణమించటాన్ని ఇక్కడి కథలు అక్షర బద్ధం చేశారు. చిలుకూరి దేవపుత్ర రాసిన “సమిధలు”, “ఆయుధం”, స్వామి కథ “నడక”, శాంతి నారాయణ కథ “గర్భస్రావం”, సింగమనేని కథలు “అనంతం”, “ఫిరంగిలో జ్వరం” లాంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు -అనంతపురం జిల్లాలో ఫాక్షన్ పోరాటాలలోని ఆధిపత్య భావజాలానికీ, ఈనాటి అంతర్జాతీయ రాజకీయాలలోని ఆధిపత్య భావజాలానికీ మధ్య ఉన్న సమాంతర లక్షణాలను సింగమనేని “ఫిరంగిలో జ్వరం” కథ చిత్రించటానికి ప్రయత్నించింది! దేవపుత్ర రాసిన “సమిధలు”, “ఆయుధం” కథలు ఇక్కడి ఫ్యూడల్ పెత్తందారీ మనస్తత్వానికీ , దళితుల దైన్యానికీ మధ్య సంబంధాన్ని వాస్తవికంగా చిత్రించాయి! ఫాక్షన్ నాయకులకు ఆయుధాలుగా ఎవరు, ఎందుచేత మారుతున్నారో , స్వామి రాసిన “నడక” కథ చిత్రించింది! ఇక్కడి ఫాక్షన్ పోరాటాన్ని చూపిస్తూ శాంతి నారాయణ రాసిన “గర్భస్రావం” కథలో ఫాక్షన్ కుటుంబాలకు చెందిన స్త్రీలు అనుభవించే మానసిక, శారీరిక హింస దృశ్యమానమవుతుంది.
ఈ జిల్లాకే చెందిన సీనియర్ రచయిత తిమ్మనచర్ల రాఘవేంద్రరావు, కరువు కథలనీ, ఫాక్షన్ కథలనూ విస్తారంగా రాసినారు. ఆ౦యన ఇటీవల వెలువరించిన “కరువు కురిసిన ధాత్రి” అన్న కథల సంపుటిలో అనంతపురం జిల్లా గ్రామీణ వ్యావసాయిక దైన్యం అంతా దట్టంగా పరచుకున్న నల్లమబ్బుల్లా దర్శనమిస్తుంది- వీరు రాసిన కెంపు అన్న ఫాక్షన్ కథ గ్రామ జీవితంలో రెండు బలమైన భూస్వామ్య ఆధిపత్య వర్గాల మధ్య నలిగిన పేదవర్గాల కన్పిస్తాయి.
ఇక్కడి కథకులంతా అనంత కరువునూ, ముఠాకక్షలను గురించి మాత్రమే కథలు రాస్తారన్న ఒక అపోహ విమర్శక వర్గాలలో లేకపోలేదు. ఇక్కడి కథకులు, స్త్రీల సమస్య గురించీ విద్యావ్యవస్థ గురించీ, కుటుంబ జీవితం గురించీ, దళితుల అణచివేత గురించీ , వస్తువ్యామోహ సంసృతి గురించీ మానవ  సంబంధాలలో డబ్బు పాత్ర గురించీ, వైవాహిక వ్యవస్థ లోని అమానవీయ లక్షణాల గురించీ, జీవన తాత్వికత గురించి విస్తారంగా కథలు రాసినారు.
అంతే కాదు చక్కని హాస్య వ్యంగ్య కథలు పండించిన కథకులు కూడా ఈ జిల్లాలో ఉన్నారు.
జి.ఆర్.మహషి పేరు చెప్పగానే , విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్ స్కాలర్ల దయనీయ , అభాగ్య జీవితాన్ని వర్ణించే “శంకరం అనే ఆర్.ఎస్. కథ ” చాలా మందికి గుర్తు వస్తుంది. విషాదకరమైన హాస్యం, వ్యంగ్యం, మన విశ్వ విద్యాలయాల్లో కొన్ని శాఖల నిరర్థక అస్తిత్వం, ఈ కథలో బలంగా వచ్చిన మాట నిజమే , కాని మహర్షి దాని కంటే గొప్ప కథల్ని రాశాడు. వాటిలో ముఖ్యమైనవి “మావూరి మహావైద్యగాడు”, ” నన్ను క్షమించు కన్నా” , “విధ్వంస దృశ్యం ” లాంటి కథలు. తన ప్రాంత జీవిత సమస్యల్ని గురించి లోతైన పరిఙ్ఞానం వున్న రచయిత మహర్షి ! ఇతడు మరింత విస్తృతంగా రాయవలిసిన రచయిత కూడ !
మరొక యువ కథకుడు ఎస్.వి.ప్రసాద్ ఇతడి ‘వ్యసనం’ అన్న కథ, అనంతపురం జిల్లాలో రైతుకు వ్యవసాయం వ్యసనంగా మారటంతో , చివరకు ఆత్మహత్య అంచుల వరకూ, ఒక రైతు యువకుడు వెళ్ళిన వైనాన్ని ఈ కథ భీభత్సంగా చిత్రిస్తుంది. ఈ కథలో ఇతడు అనుసరించిన శిల్పం ఇతన్ని అగ్రశ్రేణి కథా రచయితల సరసన నిలబెట్టింది. ఇతడు రాసిన “పేపరోపీలియో, పరిశోధక పత్రం” సునిశితమైన హాస్యంతో నిండి మన సంస్కారంలోని లోపాల్ని బలంగా ఎత్తి చూపుతాయి.
ఇటీవలే కథా రచన ప్రారంభించిన యువ కథయిత్రి చిలుకూరి దీవెన. సీరియస్ కథల్తో పాటూ పెక్కు వ్యంగ్య కథలను కూడా రచించిన వారు – మాతృ భాషా ప్రాధాన్యతను వెల్లడించే చక్కని కథలనెన్నో, హాస్య స్పర్శతో పండించినారు కూడా!
ఇక్కడి కథకులు ఇతర ప్రాంతాల రచయితల కంటే భిన్నమైన కోణంలో దళిత కథలు రాయటం ఒక విశేషం. కేవలం వాదం నుండీ పుట్టుకొచ్చినవి కాకుండా, జీవితం నుండీ పుట్టుకొచ్చినవి ఇక్కడి దళిత కథలు ! శాంతి నారాయణ  రెండు కథల్లో దళిత జీవన చిత్రణ చేశారు. స్వాతంత్యం సిద్ధించి దశాబ్దాలు గడచినా , భారతీయ గ్రామాల్లొ ఇంకా సజీవంగా ఉంటున్న దళిత వివక్షకు “జీవనాడులు ఉక్కుపాదం” అనే కథలు నిలువెత్తు దర్పణాలు. దళితుల పల్లెల్లో ఎదుర్కొంటున్న వివక్షను , “జీవనాడులు” ప్రదర్శిస్తే , వాళ్ళు  పట్టణాల్లో ఎదుర్కోంటున్న వివక్షను, “ఉక్కుపాదం” ప్రతిఫలిస్తున్నది.దళితుల పెళ్లి ఊరేగింపుని , ఊల్లోకి రానీయకుండా అవమానించి, తమ ఆధిక్యతను చాటుకుని, దళితుల సాంఘీక పరిమితుల్ని నిర్ణయించే దుర్మార్గాన్ని “జీవనాడులు” విమర్శనాత్మకంగా ప్రతిబింబించింది! దళితులు అధికారంలో భాగస్వాములైనా, పట్టాణాల్లో సైతం బాడుగ ఇల్లు దొరకని నిజాన్ని ఉక్కుపాదం ప్రదర్శిస్తుంది.
విద్వాన్ దస్తగిరి రాసిన ‘నే నేర్చిన అనుభవం ‘ అనంత జిల్లా కథానికల్లో మరో దళిత కథ ! ఇది ఒక దళిత ఉపాధ్యాయిని కథ !ఓబులేసు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ , తాను దళిత వాడలో వుంటూ వాళ్లను చైతన్య వంతులుగా చేయటానికి పూసుకుంటే, ఆ వూరి భూస్వామ్య వర్గం అతన్ని బదిలీ చేయించే ప్రయత్నం చేస్తుంది. దళిత ఉపాద్యాయుల సాంఘీక స్థితిలో ఏమీ మార్పు లేదని సింగమనేని నారాయణ, ‘మకర ముఖం’  కథ నిరూపిస్తుంది చదువులు , ఉద్యోగాలూ లభించి దళితులు ఆర్థికంగా నిలదొక్కుకున్నా, సాంఘీకంగా సాంస్కృతికంగా . అవమానకర స్థితిలోనే ఉన్నారని చాటి చెబుతుంది ఈ కథ ! అగ్రవర్ణాలు నడిపే ప్రైవేటు విద్యాసంస్థలో, దళిత ఉపాద్యాయినికి జరిగే అన్యాయాన్ని విస్పష్టం చేస్తుంది. స్వామి రచించిన ‘ఒక హెచ్.సరస్వతి కథ’! ఆధునిక నాగరిక జీవితంలో సైతం, వీడని సాంఘీక పీడనను ఈ కథ రుజువు చేస్తుంది! స్వామి  రాసిన “ప్రశాంతం” అనే మరోకథ ఒక దళిత మహిళా ఉద్యోగి ఎదుర్కొనే అస్పృశ్యత సమస్యను ప్రతిబింబిస్తుంది.
చిలకూరి దేవపుత్ర దళిత వివక్షను ప్రశ్నించే ఎన్నో కథలు రాసారు- ఆయన రాసిన “విలోమం” కథలో ఏవో అవసరాలను దృష్టిలో వుంచుకొని దళితురాలిని పెళ్ళాడినా, అగ్రవర్ణబుద్ధి మారకపోవటాన్ని చూడవచ్చు ! దేవపుత్ర రాసిన “సమిధలు” ,”ఆయుధం” కథల్లో కూడా రెండు భూస్వామ్య వర్గాల మధ్య బలి అయ్యే దళితుల్ని  చూడవచ్చు ! దళితుల స్థితిగతుల్ని , సాంఘీక దృక్పథంతోనే గాక రాజకీయ దృక్పథంతో కూడా చర్చించాడు – రిజర్వేషన్ల కోటాలో ఒక దళితుడు గ్రామసర్పంచ్ అయినప్పటికీ, భూస్వామి చెప్పుచేతల్లో ఉండక తప్పని వైనాన్ని దేవపుత్ర ‘ఊడలమర్రి ‘ కథలో ప్రదర్శిస్తాడు. పునాది మారని వ్యవస్థలో వచ్చే పైపై మార్పు వికృతంగా  వుంటుందని ఈ కథ చెబుతుంది- అనంత కథా రచయితలు రాసిన ఈ కథలు దళిత సమస్యను , ఆర్థిక రాజకీయ సాంఘీక , సాంస్కృతిక పార్శ్వాల నుంచి ప్రతిఫలిస్తున్నాయి. ఈ కథల్లో వాద దృష్టి కాకుండా సామాజిక జీవన దృక్కోణం వుండటం , ఇక్కడి రచయితల లోకవృత్త పరిశీలనకు దృష్టాంతాలు! దళిత వాదం సాహిత్యంలో ప్రవేశించక మునుపే , ఇక్కడి కథకులు ,చక్కని దళిత కథలు రాయటం విశేషం!
ఇక్కడి కథకులు పట్టణ మధ్యతరగతి జీవితాల గురించి, విద్యావ్యవస్థలోని భ్రష్ట కోణాల గురించి,వివాహ వ్యవస్థలో డబ్బు పాత్రను గురించి, మధ్యతరగతి ఆర్థిక హింస గురించి ఎన్నోకథలు రాసినారు – స్త్రీల వ్యక్తిత్వాలను నిరూపించే కథలను సైతం రాసినారు – సింగమనేని రాసిన ‘వాసంత తుషారం ‘,” నీకూ నాకూ మధ్య”, “నిశీధి” , “నిషిద్ధం” కథల్లోని స్త్రీ పాత్రలు అద్భుత వ్యక్తిత్వ సౌందర్యానికి ప్రతీకలు. కొత్త జీవితానుభవాలకు , కొత్త ఆత్మ విశ్వాసానికి ప్రతినిధులు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాస్తుందని గురజాడ ప్రకటించిన విశ్వాసాన్ని వాస్తవం చేసిన పాత్రలు అవి. సమాజంలో చోటు చేసుకున్న నూతన భావాలను, ప్రవర్తనను ఆ కథలు మన ముందు ఉంచుతాయి.
శ్రామిక స్త్రీలను చిత్రించిన శాంతి నారాయణ , ‘బొమ్మా బొరుసు ‘ “నిర్ణయం”, “శాలిని” కథల్లో మధ్య తరగతి నూతన స్త్రీని సృష్టించారు. కులాల హద్దులు దాటి, పురుషాధిపత్య సంకెళ్లను ఛేదించి పునర్వివాహం చేసుకున్న సీతాలక్ష్మి కథ “నిర్ణయం” – “శాలిని” అన్న మరో కథలో  చదువుకొని సమాన ఆర్థిక సాంఘీక హోదా గలిగిన స్త్రీ పురుషుల మధ్య కూడా వరకట్న పిశాచం నృత్యం చేస్తున్న తీరును, విమర్శనాత్మకంగా  చిత్రించారు . పెళ్ళి ఒక్కటే ఆడదానికి జీవితాశయం కాదని, దానికి మించిన స్త్రీ వ్యక్తిత్వముందని ‘శాలిని’ కథలో శాలిని నిరూపిస్తుంది.
ఇక్కడి కథకులు తమ కథల్లో ఈ జిల్లా సహజమైన నిసర్గమైన మాండలిక భాషను ఉపయోగించి నుడికారపు వాస్తవికతను జీవం పొశారు…. భాష కోసమే మాండలికాన్ని, ఇక్కడి ఏకథకుడూ ఉపయోగించలేదు. ఇక్కడి కథకులు మాండలిక భాషా వాదులు కాదు జీవితం ఎంత నిసర్గంగా స్వచ్ఛంగా ఉంటుందో , జీవితంలొ ప్రవహించే భాష కూడా అంత నిసర్గమని , సహజమని ఇక్కడి కథకులు భావించారు.వీర మాండలికం రాసి పాఠకులను ఇబ్బంది పెట్టే లౌల్యానికి ఇక్కడి కథకులు గురి కాలేదు. సడ్లపల్లె చిదంబరరెడ్డి అనే కథకుడు, కర్ణాటక సరిహద్దున గల పల్లెలో జీవిస్తూ , కన్నడ తెలుగు మిశ్రితమైన మణి ప్రవాళ మాండలికాన్ని ఎంతో అందంగా తన కథల్లొ ఉపయోగించినారు. స్వామి మాండలికం మరొక ప్రత్యేకమైన శైలిని కల్గినది. అతడే చెప్పుకున్నట్టు అతనిది పట్టణ మాండలికం. పల్లె మాండలికం కంటే కొంచెం భిన్నమైనది.శాంతి నారాయణ మాండలికం కొంత ఇబ్బంది కల్గించే  శైలిని కలిగి వున్మప్పటికీ మారుమూల గ్రామాలలోని వృత్తి గత మాండలికాన్ని  శక్తి వంతంగా ఉపయోగపెట్టుకున్నారు. భాష విషయంలో సింగమనేని నారాయణది మధ్యే మార్గం, మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి, కథకూ, కథనానికీ వుండవలిసిన తేడాను జాగ్రత్తగా పాటించాడు. ఇక్కడి కథకులలో చాలా మంది , పాత్రల సంభాషణలకు మాత్రమే ఎక్కువగా మాండలికాన్ని ఉపయోగించటం గమనించవచ్చు.
అనంతపురం జిల్లా స్థానికులు గాక పొయినప్పటికీ, ఇక్కడ స్థిరపడి , చిరకాలంగా కథలు రాస్తున్న వారిలో ముఖ్యులు డాక్టర్ కేతు బుచ్చి రెడ్డి , జి. నిర్మలారాణి, ఆర్. శశికళ , జయలక్ష్మీరాజ్, షహనాజ్ బేగం గార్లు, వీరు ఈ జిల్లా జీవన శైలిని పుణికి పుచ్చుకుని, ఇక్కడి స్థానిక జీవిత చైతన్యంతో ఎన్నో చక్కని కథలు రాశారు. డాక్టర్ కేతు బుచ్చిరెడ్డి గారు వస్తు వైవిధ్యం గల రచయిత. “ముత్యాలు_ రత్నాలు” పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. జి.నిర్మలారాణి గారు ఇక్కడి జీవన పరిస్ఠితులను గమనించి, జిల్లాలో పర్యటించి, ఇక్కడి కరువుకు ఆర్థ్రమై, కాటేసిన కరువు వంటి కథలు రాశారు . ఆర్. శశికళ గారు విద్యారంగంలొ పని చేస్తూ , విరసం సభ్యురాలిగా వుంటూ సామాజిక వైరుధ్యాలను బలంగా పట్టుకొని, సరళమైన భాషలో , నిరాడంబరమైన శైలిలో ఎన్నో కథలు రాసినారు. జయలక్ష్మీరాజ్ గారు హాస్య వ్యంగ్య కథకురాలిగా సుప్రసిద్ధులు ఈ జిల్లా జీవిత స్పర్శతో ఎన్నో కథలు రాసినారు. షహనాజ్ బేగం గారు ముస్లిం మహిళా జీవితాల్లోని సంక్లిష్టతల్ని కథలుగా కూర్చిన వారు . వీరంతా ఈ జిల్లా జీవితంతో తాదాత్మ్య్తత చెంది, ఇక్కడి పరిస్థితుల పట్ల అనుకంపన గలిగిన ఉన్నత మనస్కులు.
అనంత కథకు నేడు తెలుగుకథా సాహిత్యంలో ఆమోదయోగ్యమైన విశిష్టస్థానం ఉన్నది! ఇక్కడి కథకులందరూ , మట్టి వాసనను అనుభవించిన వారు. నేల మీద పాదాలు మోపి నడుస్తున్నవారు ! అతివాద ధోరణులకూ, అవాస్తవిక చిత్రణలకూ, కేవల కాల్పనిక సృజనకూ, అలవాటు పడిన వాళ్ళు కారు ! ఇక్కడ కథా రచన వ్యాపారమయం కాలేదు! ఏ పత్రిక స్వభావానికి తగిన విధంగా, ఆ పత్రికకు కథలు రాసి పంపె వెర్రి పీనుగులు కారు. సామాజిక సంస్కార తృష్ణ కలిగిన వారు . వస్తువు వల్లా మాత్రమే కాదు, కళాత్మకంగా , విశ్వసనీయత లోపించకుండా , క్లుప్తత పాటిస్తూ , సంయమనంగా, కథలు రాయటం వల్లనే అనంత కథను ఈనాడు  పాఠకులూ, విమర్శకులూ ఆహ్వానిస్తు న్నారు ! తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేయటంలో అనంత కథకుల పాత్ర ఎంతో విస్పష్టమైనదీ , విశాలమైనదీనూ!
-సిరి
వ్యాసరచనకు ఉపకరించిన గ్రంధాలు:
1.రాయలసీమలో ఆధునిక సాహిత్యం-  వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
2.కథాంశం   – రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
3.సమయము – సంధర్భము —  సింగమనేని నారాయణ
(www.pranahita.org)

అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట....


సాక్షి 01-06-2013 
ఈనాడు 01-06-2013
కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత విలువైన వజ్రాల ముడిపదార్థాల(కింబర్ లైట్లు) నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2012 లో గుర్తించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రము, ఉరవకొండ మండలం లత్తవరం, లత్తవరం తండా, వజ్రకరూరు మండలం పరిధిలోని పామిడి రోడ్డు సమీపంలో కింబర్ లైట్లను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. బెంగళూరులో ఇటీవల జరిగిన 10వ అంతర్జాతీయ వజ్రానే్వషణ సదస్సుకు హజరైన దక్షిణాఫ్రికా శాస్తవ్రేత్తలు, జియాలజిస్టులతో కూడిన 30 మంది సభ్యుల బృందం బుధవారం వజ్రకరూరు మండల పరిధిలో గుర్తించిన పైపు-1, పైపు-2, లత్తవరం సమీపంలోని పైపు-3, పైపు-4 లను పరిశీలించింది. దీంతోపాటు ఉరవకొండ మండల పరిధిలోని లత్తవరం, లత్తవరం తండాల సమీపంలో కింబర్‌లైట్లను సైతం ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందంలోని ఓ శాస్తవ్రేత్త మాట్లాడుతూ సర్వేలో రాయలసీమ జిల్లాల్లోని 50 కింబర్‌లైట్లను గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలోని లత్తవరం, లత్తవరం తండా పరిసర ప్రాంతాల్లోని కింబర్లకు సంబంధించిన 3400 మెట్రిక్ టన్నుల మట్టిని సేకరించి వజ్రకరూరులోని వజ్రానే్వషణ కేంద్రం పరిశీలించామన్నారు. దీంట్లో దాదాపు 12 వజ్రాలు లభ్యమైనట్లు తెలిపారు. కళ్యాణదుర్గం సమీపంలోని తిమ్మసముద్రం వద్ద అత్యంత విలువైన వజ్ర నిక్షేపాల కింబర్ లైట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట..... అంటూ ఆంధ్రదేశ సౌభాగ్య సంపద గురించి ఘంటసాల గొంతునుంచి జాలువారే పాటవిని పులకరించను తెలుగువారు వుండరు. ఇది కేవలం కవి కల్పితం కాదు అక్షర సత్యం అంటున్నారు జియాలజిస్టులు. భారతదేశానికి ఘనకీర్తి తెచ్చిపెట్టిన అద్భుతమైన వజ్రాలన్నీ  రాయలసీమ గనుల నుంచి వెలికితీసినవే అని పరిశోధకులు ఘంటాపధంగా చెబుతున్నారు. గోల్కొండ రాజ్యంలో భాగమైన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా గనుల నుంచి పలు ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలను తవ్వితీశారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన కోహినూర్‌ వజ్రం, గ్రేట్‌ మొఘల్‌, పిట్‌, ఓర్లాఫ్‌, హోప్‌, నిజామ్‌, అక్బర్‌ షా, దరియా - ఎ - నూర్‌ తదితర వజ్రాలను ఈ గనుల నుంచే వెలికితీశారని పరిశోధకులు చెబుతున్నారు. 16 నుంచి 19వ శతాబ్దం వరకు జరిపిన తవ్వకాల్లో ఈ అమూల్యమైన వజ్రాలు బయటపడ్డాయి. అయితే అత్యంత విలువైన ఈ వజ్రాలన్నీ ఇప్పుడు పరుల సొమ్ము అయ్యాయి. కోహినూరు వజ్రం బ్రిటన్‌ రాణి కిరీటంలో చేరింది. మొఘల్‌ వజ్రం జాడే తెలియడం లేదు. పిట్‌ వజ్రం పారిస్‌ లోని అపోలో గ్యాలరీలో వుంది. ఓర్లాఫ్‌ రష్యాలో, హోప్‌ అమెరికాలో వున్నాయి. అమూల్యమైన భారతీయ వజ్రసంపద ఇలా పరాయి దేశాలపాలు కావడం నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్‌ లోని ఈ నాలుగు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్‌ లోని పన్నా ప్రాంతం అమూల్యమైన వజ్రాలకు నిలయంగా వున్నదని పరిశోధకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో కొల్లూరు, గొల్లపల్లి, బనగానపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల గనులుండేవని ప్రతీతి. దశాబ్దాల కాలంగా వజ్రాలవేటను నిలిపివేసిన ప్రభుత్వం ఇటీవలే మళ్ళీ ఆ అంశంపై కన్నేసింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు... కృష్ణా జిల్లాలోని గనుల్లో తవ్వకాలు జరిపే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఎనిమిది అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. అమూల్యమైన వజ్రాల సంపదను తవ్వితీయాలనేది సత్సంకల్పమే. అయితే గతంలో మాదిరిగా రాజుల సొమ్ము రాళ్ళ పాలయినట్లు వజ్రాలు పరాయి వాళ్ళ చేతుల్లోకు పోకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాల కర్తవ్యం

Sunday, May 5, 2013

రాయలసీమ కథాసాహిత్య చరిత్రలో ‘భారత కథానిధి’పత్రిక

యోగివేమన విశ్వ విద్యా లయం 2006 సంవత్సరంలో ప్రారంభమై బోధనతో పాటు, 2010 నుంచి పరిశోధనను కూడాప్రారంభించింది.ఈవిశ్వ విద్యాలయంలోని అనేక శాఖలు పోటీలు పడి పరిశోధనలు చేస్తు న్నాయి. అధ్యాపకులు ఒకవైపు తమ సొంత పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణలో నిమగ్నమౌతూ, మరో వైపు తమ పరిశోధక విద్యార్ధుల చేత విలువైన పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ కృషిలో తెలుగు శాఖ కూడా పాలు పంచుకుంటున్నది.2010లో మొదటి బ్యాచ్‌ పరిశోధక విద్యార్ధులు చేరగానే అధ్యాపకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సాహిత్య ప్రక్రియను తీసుకొని అందులో వచ్చిన రాయలసీమ సాహత్యం మీద పరిశోధన చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా నలుగురు పరిశోధకులకు రాయలసీమలో నుండి ఆధునిక కాలంలో వచ్చిన సంప్రదాయ కవిత్వం, రాయలసీమ నవల, రాయలసీమ కథానిక, రాయలసీమ సాహిత్య విమర్శ- అనే అంశాలను ప్రారంభంనుండి 1950 వరకు ఇచ్చారు. కథానికకు మాత్రం 1980 వరకు కాలపరిమితి నిర్ణయించారు. ఇప్పటి దాకా వచ్చిన తెలుగు సాహిత్య చరిత్రలో రాయలసీమ సాహిత్యానికి పెద్దగా స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు యోగివేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ సాహిత్యం మీద జరుగుతున్న పరిశోధనలలో- ఇప్పటిదాకా పరిశోధకులు, విమర్శకులు గుర్తించని అనేక నవలలు, కథానికలు, విమర్శనా వ్యాసాలు, పద్యకావ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే రాయలసీమ నుండి రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుగేళ్ళు ప్రచురితమై ఆగిపోయిన కొన్ని పత్రికలూ వెలుగులోకి వస్తున్నాయి. 
తెలుగు కథానికకు రాయలసీమనుండి వేదికగా పనిచేసిన ‘భారత కథానిధి’ అనే మాస పత్రిక ఒకటి.ఈ పత్రికకుఈ
పత్రిక 1926 జూలై నుండి 1930 ఆగస్టు వరకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రచురితమైంది. ఈ పత్రికకు పైడిమర్రి పిచ్చయ్య చౌదరి వ్యవస్థాపకులు, ఎన్‌. రామ సుబ్బయ్య శ్రేష్ఠి ప్రకాశకులు, సి. నరసరాయ శాస్త్రి ప్రధాన సంపాదకులు. ఈ నాలుగేళ్ళలో ఈ పత్రిక 40 సంచిలను తీసుకొచ్చింది. 1813లో ప్రారంభమైన ‘ఆర్య వైశ్య పుస్తక భాండాగారము’ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో నడిచే ‘శ్రీ కన్యకా పరమేశ్వరి’ ముద్రణాలయం నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రారంభ సంచికనుంచి కథలకు పెద్దపీట వేసింది. ఈ పత్రిక ప్రారంభించినప్పటినుండి పత్రిక నిలిచిపోయేవరకు, ఈ పత్రిక మొదటి పేజీలో భారతంనుండి స్వీకరించిన ఒక ఆటవెలది పద్యాన్ని ముద్రించారు. అది- ఆ.వె. 
నీతిలేని వాని నిందించు లోకులు లేదు సేగిలాతి లేకయున్నం/ గాన మానవుండు పూనిక నయవిద్య గడనసేయ మొదలగడంగవలయు- (భారతం) ఈ పత్రిక వెలుగులోకి రావడం వలన కలిగిన ప్రయోజనం ఏమిటంటే-
రాయలసీమ కథానిక 1941లో ప్రారంభమైందని, అంతకు ముందు రాయలసీమ నుంచి కథానికలు రాలేదని విద్వాంసులలో ఉన్న అభిప్రాయం సవరించుకోవడానికి అవకాశం రావడం. భారత కథానిధి పత్రిక 1926 జూలైలో ప్రారంభమైనప్ప టినుంచి కథానికకు ప్రముఖ స్ధానం ఇచ్చింది. ఈ పత్రికలో ఇటు రాయల సీమ కథకులు అటు ఇతర ప్రాంత కథకులు కూడా తమ కథలను ప్రచురించుకొని తెలుగు కథను అభివృద్ధిచేశారు. ఈ పత్రికలో దాదాపు 30 మందికి పైగా కథారచయితలు దాదాపు 115 కథలు రాశారు.

కులం, మతం, స్ర్తీ వివక్ష, కన్యాశుల్కం, వరకట్నం, నీతి, ఆధ్యాత్మికం, సంప్రదాయం, అధికారుల అవినీతి మొదలైన అన్ని అంశాలపై కథలు వెలువడ్డాయి. నాటి కథారచయితలలో అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్ఠి, వెల్లాల మైసూరయ్య, యం.వి. పాపన్న గుప్త, దోమావెంకటస్వామిగుప్త, హెచ్‌. మహ్మద్‌ వియ్యాక్‌, పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ, పూతలపట్టు శ్రీరాములరెడ్డి, రూపావ తారం శేషశాస్ర్తి, మాలేటి వెంకటరావు, వి. వసంతరావు, కిదాంబి రామచంద్రాచార్యులు, అవధానం సుందరం, కైప శేష శాస్త్రి, సి. విశ్వేశ్వర శర్మ, వి. భాస్కరరావు, కందాల శేషాచార్లు, ఎస్‌. దస్తగిరి మొదలైన ఎందరో రాయలసీమ, రాయలసీమేతరులు కథలు రాశారు. వీరిలో కొందరికి తెలుగు సాహిత్యంలో స్థానం ఉండకపోవచ్చు.

కానీ ఎందరినో ‘భారత కథానిధి’ సంపాదకులు, వ్యవస్థా పకులు కథారచనకు ప్రోత్సహించి వారిచే గొప్ప కథలు ప్రపంచానికి అందించారు.భారత కథానిధి పత్రికను పరిశీలించిన పిదప ఆధారాలు లభిస్తున్నంతలో తొలి రాయలసీమ కథా సాహిత్యానికి ఇంతగా తోడ్పడిన పత్రిక మరొకటి లేదని అర్థం అవుతుంది. ప్రొద్దుటూరులో నేటికీ 1813నాటి ‘శ్రీ ఆర్యవైశ్య పుస్తక భాండాగారము’ నడుస్తోంది. ఎందరో సంప్రదాయ కవులు కూడా ఈ పత్రికలో ఆధునిక భావాలతో కథలు రాశారు. రాయలసీమ కథాసాహిత్య చరిత్రలో ‘భారత కథానిధి’ మాసపత్రిక వెలుగులోకి రావడం ఓ చారిత్రక విజయం
పైడిమర్రి పిచ్చయ్య చౌదరి వ్యవస్థాపకులు, ఎన్‌. రామ సుబ్బయ్య శ్రేష్ఠి ప్రకాశకులు, సి. నరసరాయ శాస్త్రి ప్రధాన సంపాదకులు. ఈ నాలుగేళ్ళలో ఈ పత్రిక 40 సంచిలను తీసుకొచ్చింది. 1813లో ప్రారంభమైన ‘ఆర్య వైశ్య పుస్తక భాండాగారము’ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో నడిచే ‘శ్రీ కన్యకా పరమేశ్వరి’ ముద్రణాలయం నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రారంభ సంచికనుంచి కథలకు పెద్దపీట వేసింది. ఈ పత్రిక ప్రారంభించినప్పటినుండి పత్రిక నిలిచిపోయేవరకు, ఈ పత్రిక మొదటి పేజీలో భారతంనుండి స్వీకరించిన ఒక ఆటవెలది పద్యాన్ని ముద్రించారు.

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...