Wednesday, August 7, 2013

రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే కుట్ర !

రాయలసీమ అనే పదం.. రాయలసీమ సంస్కృతి అనేది ఇక పూర్తిగా తెరమరుగు కానుందా? నిరంతరం కరువు కాటకాలతో తల్లడిల్లుతూ ఉన్నా.. తనకంటూ సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ గురించి ఇక మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకునే రోజొస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల లెక్కల కుట్రలతో సీమను రెండు ముక్కలుగా విడగొట్టి.. తెలంగాణలో ఒక చెక్క.. ఆంధ్ర ప్రాంతంలో మరో చెక్క కలిపేయనుందా? అవుననే ధ్రవీకరిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు! జాతీయస్థాయిలో కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం నడుపుతున్న కుట్ర వల్ల.. సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన ఇప్పుడు ఆ ప్రాంతంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీస్తూ ఓట్లు, సీట్ల లెక్కలతో విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ గత కొద్ది రోజులుగా తెరవెనుక కసరత్తును ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు పార్టీ నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినదానికి
తలూపుతూ రాయలసీమను విభజించటానికి అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యున్నత స్థాయి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. అనంతపురం, కర్నూలు జిల్లాలను రాయలసీమ నుంచి విడదీసి తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక రచించిన ప్రణాళికను త్వరలోనే కార్యరూపంలోకి తేవాలని భావిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఒక ప్రాతిపదిక ఉండగా.. రాయలసీమ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేకుండా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. వారి అస్థిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసే అతిపెద్ద కుట్రకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే జీ హుజూర్ అంటూ సాగిలపడటంపై రాయలసీమ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఎవరూ అడగకుండానే... ఎవరినీ అడగకుండానే... దేశ చరిత్రలో ఎక్కడా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను సరిసమంగా పంచుతామన్న ప్రాతిపదికన రాష్ట్రాల విభజనగానీ విలీనంగానీ జరగలేదు. తొలిసారిగా కాంగ్రెస్ నాయకత్వం రాయలసీమ ప్రజలు ఏనాడూ కోరని, ఒక ప్రాతిపదిక లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి రాజకీయ క్రీడ సాగిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేసిన ప్రజలు సైతం.. రాయలసీమ ప్రాంతాన్ని విడదీసి అందులో కొంత ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని ఏనాడూ కోరలేదు. తెలంగాణ వాదులు కానీ, రాయలసీమ ప్రజలు కానీ ఏనాడూ అడగని, ఏమాత్రం అభిలషించని విధంగా.. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీమ జిల్లాలను కత్తిరించి తెలంగాణలో కలిపే కుట్రను ఇరు ప్రాంతాల ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటానికో.. కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకోవచ్చనో.. సీట్లు ఓట్ల లెక్కల ప్రాతిపదికన.. సుదీర్ఘ ప్రత్యేక సంస్కృతి కలిగిన ఒక ప్రాంతాన్ని అడ్డంగా చీల్చటానికి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే.. అందుకు కొందరు రాయలసీమ ప్రాంత నాయకులే మడుగులు వత్తుతూ తమ పబ్బం గడుపుకోవటానికి సాగిస్తున్న లాలూచీ రాజకీయాలపై ఆ ప్రాంత ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక భయంకరమైన నిర్ణయానికి రావటమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే... రాష్ట్ర విభజనపై ఓట్లు సీట్ల లెక్కలతో ముందుకెళుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆ క్రమంలోనే రాయలసీమ ప్రజల సెంటిమెంట్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదని తెలుస్తోంది. ఒకసారి పది జిల్లాలతో కూడిన తెలంగాణ అని.. మరోసారి రాయల తెలంగాణ అని.. ఇంకోసారి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమని.. ఇలా రకరకాల లీకులను ప్రచారంలో పెడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక మాత్రం పెద్ద తతంగమే నడిపిస్తోందని సమాచారం. రాయలసీమను విడగొట్టి రెండు జిల్లాలను తెలంగాణలో కలపటం ద్వారా తెలంగాణలో కేసీఆర్‌ను అదుపులో పెట్టవచ్చని.. మరో రెండు జిల్లాలను కోస్తాలో కలపటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని.. తద్వారా ఓట్లు, సీట్ల లెక్కల్లో తను రాజకీయ ప్రయోజనం పొందవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. కేవలం అందుకోసమే ఈ కుట్రను అమలు చేయబోతోందని తెలుస్తోంది. సీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు తమ రాజకీయ ప్రయోజనం కోసం.. రాయలసీమను విభజించటానికి హైకమాండ్ చెప్పినట్లు అంతర్గతంగా తలూపుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నట్టు పైకి కనపడుతూ లోలోన హైకమాండ్ ఆశించే దిశగా మిగిలిన నేతలను ఒప్పించే పనిని ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ ఆశించిందే ఆలస్యమన్నట్లు తెరవెనుక లాలూచీని మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎడారిగా మారే దారిలో: రాయలసీమ అన్నదే కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం. అందులోంచి ఆవిర్భవించిన తనదైన ప్రత్యేక సంస్కృతిని నిలుపుకున్న ప్రాంతం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలుగు ప్రజల ఐకమత్యం కోసం కర్నూలు రాజధానిని కోల్పోయిన విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు, పరిణామ క్రమంలోనూ ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు సైతం మిగులు జలాలపై ఆధారపడి మాత్రమే నిర్మించారు. రాయలసీమను విభజించటం ద్వారా మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఎడారిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కృష్ణా నదిలో నీటిపై హక్కూ దిక్కూ లేదు. పైన మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కింద కు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకే నీళ్లు దిక్కులేనప్పుడు నాగార్జునసాగర్ పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నదీ జలాలపై ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక చర్యలతో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయటం ద్వారా మిగులు జలాలు పూర్తిగా ప్రశ్నార్థకమవుతుండగా, ఆ మిగులు జలాలపై ఆధారపడిన గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవాలకు చుక్కనీరు కాదుకదా ఆ పథకాలన్నీ తెరమరుగు కాకతప్పని పరిస్థితి. ఇదే జరిగితే కాంగ్రెస్ మోసపూరితంగా రాయలసీమను విభజించటం.. మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల అస్థిత్వం కోల్పోయి, ప్రాంతాలన్నీ మరింత కరవు కాటకాల్లోకి నెట్టటమేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆ దిశగా ఒక్కో అడుగు: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల కమిటీ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణయే కాకుండా మిగతా డిమాండ్లను పరిశీలిస్తుందని సీడబ్ల్యూసీ నిర్ణయం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఢిల్లీలో తెరవెనుక రాయలసీమ విభజనపైనే ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. విభజించాలని డిమాండ్ చేసింది తెలంగాణ అయితే.. రాయలసీమను విభజించటమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి.. మొదట్లో ఆ సమస్య తలెత్తకుండా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తన పనిని చేసుకుంటూ పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో నియమించే కేంద్ర మంత్రుల కమిటీ ముందు కాంగ్రెస్ నేతలే ఈ ప్రాతిపదన పెట్టి దానికి సానుకూలత ఉన్నట్లుగా కుట్ర పూరితంగా చెప్పింది దాన్ని చొప్పించటానికి ఇప్పటికే పథకరచన పూర్తయినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్య రాష్ట్రం కోసం నడుస్తున్న ఉద్యమాలు చల్లారిన తర్వాత రాయలసీమను విభజించే అంశం తెరపైకి తెస్తారని ఏఐసీసీలోని అత్యున్నత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

 సీమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే..  

‘‘రాయలసీమను రెండు ముక్కలు చేసి తెలంగాణ లో విలీనం చేస్తే రాయలసీమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్లే. అనంతపురం, కర్నూలు రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏకమై కుట్ర పన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. రాయల తెలంగాణ వద్దు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే’’ 
- ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి
ఎస్కేయూ, అనంతపురం 
  ‘‘కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. అదేగాని జరిగితే రాయలసీమ తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. జలయజ్ఞంలో కోస్తా వారికి పులిచింతల, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేశారు. రాయలసీమలో మాత్రం ఎలాంటి భారీ ప్రాజెక్టులను పూర్తిచేయలేదు.
  
- ఎం.శ్రీరామిరెడ్డి, చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదలశాఖ మాజీ సలహాదారు (కడప)  
స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే ఈ ప్రతిపాదన కాంగ్రెస్ కేవలం తన స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే చేస్తోంది. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ కుట్రల వల్ల శ్రీశైలం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీరొచ్చే అవకాశం పూర్తిగా కోల్పోతుంది. మిగులు జలాలపై ఆధారపడిన గాలేరునగరి, హంద్రీనీవా, తెలుగుగంగ స్కీమ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. నీరొచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ చర్యల వల్ల రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. -ఎం.వి.మైసూరారెడ్డి (వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత)


నీతి నిజాయితీల కోసం పాటుపడిన న్యాయవాది పద్మనాభరెడ్డి.

న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి
న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి.

 హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని సమాజం కోల్పోయింది. 1931, మార్చి 18న అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో మధ్యతరగతి కుటుం బంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల వరకు మున్సిపల్ హైస్కూ లు, తాడిపత్రిలో చదివారు. 9, ఎస్‌ఎస్‌ఎల్‌సీ లండన్ మిషన్ హైస్కూల్, గుత్తిలో చదివారు.

  గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. 1953 లో లాయర్‌గా మద్రాస్ హైకోర్టులో నమోదు చేసుకు న్నారు. అక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి 1954లో గుం టూరు (ఆంధ్ర హైకోర్టు)లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 1956లో వచ్చారు.

 ‘‘నన్ను గుంటూరు కాలేజీలో చేర్పించిందీ, మద్రాసు లోని లా కాలేజీలో చేర్చించిందీ చిన్నపరెడ్డే. వారి ఇంట్లోనే నేను పెరిగాను. నా హైస్కూలు రోజుల నుంచి ఆయన నా గురువూ, మార్గదర్శకుడూనూ. ఇప్పుడు నేను ఏమైనా సాధించానంటే అదంతా ఆయన చలవే. జస్టిస్ చిన్నపరెడ్డి మమ్ములను ఎంత ప్రేమగా, అభిమానంగా చూశారో, దానంతటినీ నేను, నా కుటుంబ సభ్యులందరం ఎన్నటికీ మరిచిపోలేం. వాస్తవానికి నేను ఆయన లా ఛాంబర్‌లో 14 ఏళ్ల పాటు పనిచేశాను’’ అని జస్టిస్ చిన్నపరెడ్డిని గురించి చివరివరకు ఎంతో వినమ్రంగా చెప్పుకున్నారు పద్మనాభరెడ్డి.

 పద్మనాభరెడ్డి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. హైకోర్టులో అరవై వేలకు పైగా కేసులు వాదించారు. సాధారణ ప్రజలు, పేదలు హైకోర్టులో సీనియర్ లాయర్లను నియమించుకోలేరు. వాళ్ల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఫీజులు ఇవ్వలేని కేసులలో కూడా పద్మనాభరెడ్డి వాదించి గెలిపించారు. జైలులోని ముద్దాయిలు కార్డుముక్క రాసినా ఆయన స్పందించేవారు. కేసులో ముద్దాయి ధనికుడా, పేదవాడా అనే తేడా లేకుండా వాదించారు. ఆయన గురించి చెప్పడ మంటే ముద్దాయిలు, ఖైదీలు, కార్మికులు, పేదలు, న్యాయాన్యాయాల గురించి చెప్పడమే!

 ప్రతి క్రిమినల్ అప్పీలు కేసులో సుమారు 100 పేజీల నుంచి వెయ్యి పేజీలకుపైగా రికార్డు ఉంటుంది. తనకున్న అపరిమిత పరిజ్ఞానంతో అన్ని పేజీలను స్కాన్ చేసి అందులో మూడో, నాలుగో అంశాల మీద కేసును తీసుకొచ్చి కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలు, నిపుణుల అభిప్రాయాలు, సాక్ష్యుల సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను ఎత్తి చూపేవారు. వీటితో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను జోడించేవారు. ఇంత పరిజ్ఞానం ఉన్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగా మన కళ్లముందు, మనతో కలిసి ఉండటం ఆయనకే చెల్లింది. ఆయన నిగర్వి, గర్వపడేవాళ్లను అసహ్యించుకునేవారు. ఏనాడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడి గినా ఓపిగ్గా, వివరంగా తెలియజేసేవారు. ఎంత తీరికలేని పనిలో ఉన్నా అడిగినవారికి నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఏ గ్రామంలోనైనా, జైలులోనైనా క్రిమినల్ కేసుల మీద చర్చ జరిగిందంటే పద్మనాభరెడ్డి పేరు చర్చకు వచ్చేది.

 అధికారంలో ఉన్న పార్టీ ప్రజలనే కాదు ప్రతిపక్షాల నాయకులను కూడా పి.డి. కుట్ర కేసులు పెట్టి, జైలులోకి నెట్టడం ఈ రోజుల్లో మాదిరే, ఆరోజుల్లోనూ సర్వసాధా రణంగా మారిపోయింది. ఏ రాజకీయ పార్టీతో సంబం ధంలేకుండా ఆయన కేసులు వాదించారు. ప్రభుత్వ సర్వీ సులలో ఉన్న ప్రముఖులు, ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక కాలంలో కేసుల కోసమో, సలహాల కోసమో ఆయనను సంప్రదించిన వారే. ఎంతో ఓపికగా వాళ్లు చెప్పింది విని, రికార్డులు పరిశీలించి వాళ్లకు సలహాలిచ్చారు. ఆయన సలహా తిరు గులేనిది. దాన్ని వాళ్లు పాటించేవారు. ఒక్కోసారి కోర్టుకు అనుమానం వచ్చినా ఆయననే సంప్రదించేవారు. రాష్ట్రం లో వేలాది మంది న్యాయవాదులు, ప్రజలు, కొందరు న్యాయమూర్తులు ఆయనంటే అభిమానంతో ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత వేలాది మంది ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనం.

 ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు ఉద్యమకార్య కర్తలు, ప్రజలు చనిపోతుంటారు. ఎన్‌కౌంటర్లలో పోలీసు లకు కనీసం పెల్లెట్ల గాయాలైనా కావు. ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు పోలీసుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? వద్దా? అనే ప్రశ్న హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకువచ్చింది. కోర్టు పద్మనాభరెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమించింది. ‘‘ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, పోలీసుల మీద కేసు నమోదుచేయాల్సిందే. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపా మని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలి. కేసు రిజి స్టర్ చేయకుండా పోలీసులే తీర్చునివ్వడం చట్టవ్యతిరేకం’’ అని ఆయన వాదించారు. ఆయన వాదనలను కోర్టు అంగీకరించింది. సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.

 అత్యవసర పరిస్థితికి ముందు నుంచే అనధికారి కంగా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగింది. పట్టుబడిన వారిని కాల్చిచంపడం, చిత్రహింసలకు గురిచేయడం, కేసులలో ఇరికించి జైళ్లలో నిర్బంధించడం పరిపాటైంది. మొదటిసారి రాష్ట్రంలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మండ్ల సుబ్బారెడ్డి తదితరులపై హైదరాబాద్ కుట్రకేసును రాజ్యం బనాయించింది. ఆ తర్వాత కానూ సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, తేజేశ్వరరావు, సొరెన్‌బోస్ తదితరులపై పార్వతీపురం కుట్రకేసు పెట్టింది. రెండు కేసులలో ట్రయల్ కోర్టులు కొంత మందికి శిక్షలు విధించాయి. అప్పీళ్లు హైకోర్టుకు వచ్చాయి. హైకో ర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. పార్వతీపురం కుట్ర కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. హైదరా బాద్ కుట్ర కేసులో నెలరోజులు పద్మనాభరెడ్డి వాదిం చారు. హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. కోర్టు నుంచి బయ టకు వచ్చీరాగానే హృదయం ద్రవించి ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నాగిరెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమా నమని చెప్పు కునేవారు.

 విద్యార్థి దశ నుంచి ఏ ఉద్యమాలలో ఆయన పాల్గొన లేదు. అయితే వామపక్ష భావజాలమంటే మొగ్గు చూపే వాడినని ఆయనే చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయన న్యాయవ్యవస్థకు, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో తోడ్పాటునందించారు. మన రాష్ట్రంలో నక్సలైటు ఉద్య మం మొదలైనప్పుడు ప్రజల హక్కుల అణచివేత పెరి గింది. రాజకీయ ఖైదీల కోసం డిఫెన్స్ కమిటీ రావి సుబ్బా రావు ప్రేరణతో ఏర్పడింది. ఆయన నాయకత్వంలో పత్తిపాటి వెంకటేశ్వర్లు, బి.పి.జీవన్‌రెడ్డి, కన్నాభిరాన్, మనోహర్‌రాజ్ సక్సేనా, పద్మనాభరెడ్డి కమిటీ సభ్యులుగా ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం హైకోర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. రావి సుబ్బారావు చనిపోయిన తర్వాత డెమోక్రటిక్ లాయర్స్ ఫోరంకు ఆయనే ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అదే సంఘం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్‌గా మారింది. చివరివరకు ఆయనే ఆ సంఘానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

 రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండటం నేరం కాదని జస్టిస్ చిన్నపరెడ్డి ఎన్నో చరిత్రాత్మక తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇచ్చారు. రాజ్యం మాత్రం ఇప్పటికీ రాజ కీయ విశ్వాసాలను నేరంగానే పరిగణిస్తోంది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించి వాదించిన కేసుల కారణంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆయనకు వ్యతిరేకంగా ఇవ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జిగా నిమాయకం రద్దయింది. జస్టిస్ కృష్ణయ్యర్, చిన్నపరెడ్డి, భగవతి వంటి వారు లాయర్స్ యూనియన్‌లో నాయకులుగా ఉండి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఈ వాస్తవాన్ని ఇం టెలిజెన్స్ నివేదిక తొక్కిపెట్టింది. పద్మనాభరెడ్డి జడ్జి అయి ఉంటే ప్రజలకు మరెంతో న్యాయం చేసి ఉండేవారు.

 క్లయింట్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడనే దాంతో లాయర్‌కు నిమిత్తం లేదు. నిషిద్ధ పార్టీకి చెందిన వాడైనా, రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాడైనా కోర్టును ఆశ్ర యించవచ్చు. వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు ను పొందవచ్చు. న్యాయం చేయమని కోరి వచ్చినప్పుడు తన విధి నిర్వహించడమే న్యాయవాది బాధ్యత. అదే సూత్రాన్ని ఆయన పాటిస్తూవచ్చారు.

 కేసు త్వరగా పరిష్కరించడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అమలుకు నోచుకోలేదు. టాలెంట్ ఉన్న సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించి మరికొన్ని కొత్త కోర్టులు ఏర్పాటు చేయటం వలన పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంచివే. రిటైర్డ్ జడ్జీలను ఈ కోర్టులలో నియ మిస్తే వారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులు త్వరగా తీర్పులిచ్చినా అప్పీలు కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అప్పీలులో కొన్ని కేసులు గెలుస్తున్నాయి. దీర్ఘకాలం కేసులు పెండింగ్‌లో ఉండటం, నిందితులు జైలులో ఉండటం వలన వాళ్ల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితి, ఆర్థికస్థితి నాశనమయ్యే అవకాశం ఉందని ఆయన భావించేవారు.

 మీ అరవై సంవత్సరాల అనుభవాలను, సమాజానికి మీరిచ్చే సందేశాలను నమోదు చేస్తే బాగుంటుందని కోరినప్పుడు మే నెలలో పూర్తి చేస్తానన్నారు. న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి, నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపా డవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్య యనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండ లివ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. ఆయనో విజ్ఞానఖని. ఆయన మరణం ప్రజలకు ముఖ్యంగా పీడిత వర్గాలకు తీరని లోటు. పీడిత పక్షపాతి పద్మనాభరెడ్డికి జోహార్లు.    
న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి.
(SAKSHI DAILY)

- వి. నారాయణరెడ్డి
 న్యాయవాది

Sunday, August 4, 2013

తెలంగాణ రాష్ట్రంతోపాటు రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి: శ్రీరామిరెడ్డి

కడప, ఆగస్టు 4: రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ తీర్మానం తర్వాత
శ్రీరామి రెడ్డి 
దేశంలో 14 ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తెలుస్తున్నారు. ఇదే సీమ ప్రజలకు సరైన సమయం. దేశంలోని ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, గోవా, మిజోరాం, త్రిపుర తదితర రాష్ట్రాల కంటే రాయలసీమ అన్ని విధాల పెద్దది. కావున ప్రస్తుత ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసి దానిని సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నీటి పారుదల శాఖ మాజీ సలహాదారు, రాయలసీమ అభ్యుదయ సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీరామిరెడ్డి  అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రజలు ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమ ఘట్టంలో ఉన్నారని, సీమ ప్రజల మనోభావాలు, హృదయఘోష ఏ పార్టీలకు పట్టడం లేదని  తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో శ్రీరామిరెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య వైభవ పతనం తర్వాత పాలకుల నిర్లక్ష్యం, నిరాధరణ మూలంగా సీమ ప్రజలు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాయలసీమను విభజించి ఒక ప్రాంతాన్ని తెలంగాణలో, మరొకటి ఆంధ్రలో కలపాలనుకోవడం శతాబ్దాల భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అస్థిత్వవాన్ని రూపు మాపి శాశ్వతంగా నామరూపాలు లేకుండా భూస్థాపితం చేయడమేనన్నారు. 2014లో జరగబోయే ఎన్నికలలో అధిక సీట్లు సంపాధించాలన్న దురాశతో ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాయలసీమ ప్రజలు రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా చైతన్యవంతులైతే తప్ప వారికి రాజకీయ, రాజ్యాంగ భద్రత, జీవిత ప్రమాణాలు పెంపొందించుట తగు విధాన కార్యాచరణ జరుగుతుందని నమ్మలేమన్నారు. నీరు, విద్యుచ ్ఛక్తి, పరిశ్రమలు, ఉద్యోగాలు తదితర విషయాలలో సీమకు నాటినుంచి నేటి వరకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ వారికి రాష్ట్రం, కోస్తాకు పోలవరం ప్రాజెక్టు , కానీ రాయలసీమకు మొండిచెయ్యి చూపిస్తున్నారన్నారు. 18 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు కొంత నికర జలాలు వస్తాయనుకోవడం భ్రమేనన్నారు. విద్యుచ్ఛక్తి విషయంలో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు తప్ప మరే ప్రాజెక్టు సీమలో లేవన్నారు. దేశంలోనే అపారంగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఇంతవరకు ఏ ఒక్క భారీ పరిశ్రమను స్థాపించలేదన్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ఎక్కువ వెనుకబడిన ప్రాంతమని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో అం కిత భావంతో పాల్గొంటున్నారని అయితే ఉద్యమ ఫలితం ఎలా ఉంటుందో తెలియదన్నారు. కేంద్రం హైదరాబాద్‌ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరిస్తే కోస్తా ప్రజలు ఉద్యమాన్ని విరమించవచ్చన్నారు. అప్పుడు సీమ ప్రజలను కోస్తాంధ్రతో ఉంచుతారా? లేక రెండుగా చీల్చి తెలంగాణ, ఆంధ్రలో కలుపుతారా? రెండుగా చీల్చితే సీమ ఉనికే నాశనమవుతుందన్నారు. 

Wednesday, July 24, 2013

శ్రీశైలం (నీలం సంజీవరెడ్డి సాగర్) ప్రాజెక్టు పునాదికి యాభై ఏళ్లు.

ఆధునిక దేవాలయంగా పిలిచే శ్రీశైలం (నీలం సంజీవరెడ్డి సాగర్) ప్రాజెక్టుకు పునాది వేసి నేటికి యాభై ఏళ్లు. 1963 జులై 24న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా పునాది రాయి పడిన ఈ ప్రాజెక్టు 1984 నాటికి అన్ని రకాలా పూర్తయి రాష్ట్రానికి విద్యుత్తు కాంతులను వెదజల్లడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగు నీరందించి రైతులకు జీవనాధారంగా మారింది. విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్మాణం ప్రారంభించినా తర్వాత బహుళార్థక సాధక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించింది. ప్రారంభంలో నిర్మాణానికి ఆటుపోట్లు ఎదురైనా ఇంజినీర్ల పట్టుదల, అంకితభావంతో 1982 నాటికే నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టారు. 1984 నాటికి గేట్లు సహా అన్నిరకాల నిర్మాణాలను పూర్తి చేసుకొని వినియోగంలోకి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టడంతో అప్పటి ఇంజినీర్లు ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతకు పెద్దపీట వేయడం వల్ల 2009లో వచ్చిన కనీవినీ ఎరుగని వరదకు శ్రీశైలం ఎదురొడ్డి నిలిచింది. డ్యాం నుంచి నీటిని విడుదలచేసే సామర్థ్యానికి రెండింతలు వరద రావడంతో కట్టకు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన వ్యక్తమైనా నాణ్యతతో చేపట్టిన నిర్మాణం ఇంజినీర్లు గర్వపడేలా చేసింది.

లో పునాది వేసినా వెంటనే పనులు ప్రారంభం కాలేదు. నది స్వభావాన్ని బట్టి నీటిని మళ్లించి పనులు ప్రారంభించడానికి అవసరమైన పరిశోధనే నాలుగేళ్లకు పైగా జరిగింది. డ్యాం నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి సమీపంలో పాతాళగంగ ఉండటం, అక్కడ నుంచి వరద ప్రవాహం వేగంగా ఉండటంతో నీటిని ఎలా మళ్లించాలన్నదానిపైనే సుదీర్ఘ కసరత్తు జరిగింది. చివరకు ప్రముఖ ఇంజినీర్ కె.ఎల్.రావు మార్గదర్శకంలో కాంక్రీట్ కాఫర్‌డ్యాంలు నిర్మించి పనులు చేపట్టారు. మొదట సాగర్‌లో పని చేస్తున్న కూలీలను మళ్లించి పనులు చేపట్టినా శ్రీశైలం వద్ద నది స్వభావాన్ని బట్టి సాధ్యం కాలేదు. మొదట కొందరు గుత్తేదారులకు అప్పగించిన పనులను కూడా తొలగించి 1974 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ చేపట్టింది. అప్పటికి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు, పగలు, రాత్రి తేడా లేకుండా చేసిన కఠోర శ్రమ ఫలితమే భారీ వరదకు తట్టుకొని నిలబడటానికి కారణమని అక్కడ పని చేసిన ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయం. 1984లో నిర్మాణం పూర్తయినప్పటి నుంచి అటు విద్యుత్తు, ఇటు సాగు, తాగునీటికే కాకుండా వరద నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకోవడంలో కూడా శ్రీశైలం జలాశయం కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1670 మెగావాట్ల విద్యుదుత్పత్తితోపాటు నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు తగ్గట్లుగా నీటిని విడుదల చేయడం, పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ, కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు, చెన్నై తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తోంది. వీటితో పాటు మిగులు జలాల ఆధారంగా చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, కల్వకుర్తి తదితర భారీ ప్రాజెక్టులన్నీ శ్రీశైలం మీదనే ఆధారపడి ఉన్నాయి. శ్రీశైలం నిర్మాణానికి మొదట రూ.39.97 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. తర్వాత కాంక్రీటు ఆనకట్టగా మార్చిన తర్వాత ఈ అంచనాలో మార్పులు చోటు చేసుకొని, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.523.91 కోట్లకు చేరింది.
పూడికతో కోల్పోయిన సామర్థ్యం
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పూడిక వచ్చి చేరడంతో శ్రీశైలం నీటినిల్వ సామర్థ్యంలో మూడో వంతు కోల్పోయింది. ఏటా పెరుగుతున్న పూడికుతోడు, 2009లో వచ్చిన భారీ వరద కారణంగా శ్రీశైలం నిల్వ సామర్థ్యాన్ని బాగా కోల్పోయింది. ఈ ప్రాజెక్టులో నిల్వ ప్రారంభమైనప్పుడు సామర్థ్యం 308 టీఎంసీలు. 1997లో నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం జరగ్గా 263.63 టీఎంసీలుగా తేలింది. ఏడాదికి 0.5 శాతం కంటే ఎక్కువ పూడిక చేరితే ప్రమాదమే. అయితే ఈ ప్రాజెక్టులో 0.82 శాతం ఉన్నట్లు తేలింది. 2009లో కృష్ణానదికి అత్యధిక వరద వచ్చింది. శ్రీశైలానికి వెయ్యేళ్లలో ఒకసారి 20.20 లక్షల క్యూసెక్కుల వరద (గరిష్ఠ వరద ప్రవాహం) రావచ్చని 2006లో జరిగిన అధ్యయనంలో తేలగా, 2009 అక్టోబరులోనే 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. గరిష్ఠ స్థాయి నీటి మట్టాన్ని దాటి నిల్వ చేశారు. ఈ వరదల సమయంలోనే ఎక్కువ పూడిక వచ్చి చేరినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించి మూడు దశాబ్దాలు దాటగా, 93 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. అంటే ఏడాదికి మూడు టీఎంసీలకు పైగా సామర్థ్యాన్ని కోల్పోయినట్లు. ఒకవైపు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండగా, మరోవైపు దీనిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోంది.

నిర్వహణ లోపాలు వెలుగులోకి: కృష్ణానదిపై అతి ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీశైలం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి జలయజ్ఞం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాజెక్టులో పని చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్.ఇలు, ఇ.ఇలు ఎక్కువగా ఇన్‌ఛార్జిలే. 2009లో భారీ వరద వచ్చినపుడు గేట్లు మొరాయించాయి. ఓ గేటు లేపడానికి కూడా సాధ్య పడలేదు. ఈ ప్రాజెక్టుకు 12 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంది. గేట్ల నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన త్రివేణి స్ట్రక్చరల్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ సంస్థ సకాలంలో పూర్తి చేయక పోవడంతో సగం గేట్లను మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్‌కు అప్పగించారు. ఈ సంస్థ అన్ని గేట్లను పూర్తి చేసింది. 2009లో భారీ వరద వచ్చి గేట్ల నిర్వహణ సమస్య అయినపుడు 1984లో తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ తరపున గేట్లను అమర్చడాన్ని సమన్వయం చేసిన కన్నయనాయుడు సహాయాన్ని నీటి పారుదల శాఖ తీసుకొంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం దాటడంతో రోడ్ బ్రిడ్జికి వైబ్రేషన్ మొదలైందని, ఆ సమయంలో ప్రాణాలకు తెగించి గేటును తెరిచామని నాటి అనుభవాలను ఆయన వివరించారు. డ్యాం, గేట్ల నిర్వహణలో ఉన్న లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం 2009 వరద సమయంలో స్పష్టంగా బయటపడ్డాయి. రివర్స్ స్లూయిస్ వద్ద అత్యవసర గేటు దెబ్బతిన్నా మరమ్మతు చేయలేదు. అప్పటి భారీ వరదకు దెబ్బతిన్న వాటిని కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. గేట్ల నిర్వహణ, గ్యాలరీ, డ్యాం నిర్వహణకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
ఫలితం దక్కని నిర్వాసితులు
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 117 గ్రామాలను ఖాళీ చేయించగా, ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 65, కర్నూలు జిల్లాలో 52 ఉన్నాయి. 21,037 కుటుంబాలకు చెందిన వారు నిర్వాసితులయ్యారు. 84,756 ఎకరాల భూమిని కోల్పోయారు. నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. మూడేళ్లుగా అధికారులు గట్టి ప్రయత్నం చేసి ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చినా, ఇంకా ఉద్యోగాలు రాని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నిర్వాసితులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
స్వర్ణోత్సవాలను పట్టించుకోని ప్రభుత్వం
శ్రీశైలం నిర్మాణానికి శంకుస్థాపన చేసి జులై 24కు యాభై సంవత్సరాలవుతున్నా స్వర్ణోత్సవాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు రావడంతో కాస్తా ఆలస్యంగా నీటి పారుదల శాఖ స్పందించింది. ఈ నెల 24న కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినా, వరదల కారణంగా కాస్తా ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వర్ణోత్సవాల నిర్వహణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఘనంగా నిర్వహిస్తామని శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కృష్ణారావు 'ఈనాడు'కు తెలిపారు.
గర్వంగా ఉంది
శ్రీశైలం నిర్మాణంలో పాలుపంచుకొన్నందుకు ఎంతో గర్వపడుతున్నా. 2009లో వూహించని విధంగా భారీ వరద వచ్చినా డ్యాంకు ఏమీ కాలేదు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే జరిగింది. మొదట రాతి కట్టడం నిర్మించాలని నిర్ణయించారు. కానీ నిర్మాణ స్థలాన్ని, నది స్వభావాన్ని బట్టి కాంక్రీటు డ్యాంగా చేపట్టాలని ప్రతిపాదనలు సవరించారు. ప్రభుత్వం అంగీకరించింది. ఇంజినీర్లంతా విలువలకు కట్టుబడి నాణ్యతలో రాజీ పడకుండా పని చేయడం వల్ల దాని ప్రభావం 2009లో వచ్చిన వరదల్లో స్పష్టంగా కనిపించింది.
- శ్రీశైలం నిర్మాణంలో పాలుపంచుకొన్న ఇంజినీర్ తిరుపతిరెడ్డి

ఇంజినీర్ల అంకితభావానికి నిదర్శనం
శ్రీశైలం నిర్మాణం ఇంజినీర్ల అంకిత భావానికి నిదర్శనం. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పని చేసిన 17 సంవత్సరాలు మరిచిపోలేనివి. శ్రీశైలానికి భారీ వరద వచ్చినపుడు డ్యామ్‌కు ఏమవుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాం. ఆ ప్రాజెక్టుతో మాకున్న బంధం అలాంటిది. ఇంజినీర్లే కాకుండా అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారు. నిర్మాణ క్రమంలో సుమారు 120 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
-సుబ్బరంగయ్య
1963
-ఈనాడు దినపత్రిక (24-07-2013) సౌజన్యం తో..

Friday, July 5, 2013

అస్తిత్వ ముప్పులో రాయలసీమ - చెన్నా గోవింద్

అయిపోయింది.. అంతా అయిపోయింది. రాయలేలిన రతనాల సీమను.. తెల్లదొరలకు నిజాం నవాబు అప్పగించిన దత్త మండలాలను.. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కోస్తాలో కలిసి, విశాలాంధ్రలో విలీనమై, సమైక్యంగా ఉన్న రాయలసీమను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం అడ్డంగా తెగనరికేందుకు సిద్ధమవుతోంది. రాయల గడ్డగా పేరొంది జగద్విఖ్యాతమైన రాయలసీమ అస్తిత్వానికి ఇప్పుడు ఎసరొచ్చింది. తెలుగుజాతిని, తెలుగు మాట్లాడే వారందరినీ విడగొట్టాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లున్నది. తెలంగాణ ఇచ్చేస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వేడి తగ్గడమే కాకుండా, రాజకీయంగానూ పార్టీని బలోపేతం చేసినట్లవుతుందని భావించిందేమో.. అసలే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీది ఏ అడ్డానో తెలియక సతమతమవుతున్నాయి. రాయల తెలంగాణ ఇచ్చేస్తే ఎక్కడ నుంచి ఎవరు బరిలో దిగాలో.. ఏ పార్టీ ఎక్కడ శాశ్వతమో కూడా చెప్పలేని పరిస్థితి. కేంద్రం నిర్ణయంపై ఏ పార్టీకి సంతృప్తి లేకపోవచ్చు. అలాగని బయటకు గట్టిగా చెబుతాయా అంటే కూడా చెప్పలేని గందరగోళ వాతావరణం.. ఏళ్ల తరబడి నాన్చి నాన్చి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు సన్నద్ధమయ్యారు న్యూఢిల్లీ పెద్దలు.

అన్ని రాజకీయ పార్టీలను , ఉద్యమ పార్టీలను టైం చూసి కొట్టింది కేంద్రం. తెలంగాణ ఇచ్చినా, గిచ్చినా అంతా తమదే బాధ్యతన్నట్లు వ్యవహరించి, ఇప్పుడు హోల్‌సేల్‌గా నూటికి నూరు మార్కులు కొట్టే సేందుకు కాంగ్రెస్ సై అంటోంది. ఇందుకోసం ఏ పార్టీ నుంచైనా, ఎక్కడినుంచి సమస్య మొదలైనా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేంద్రంలో చక్రం తిప్పే పెద్దలు పెద్ద కసరత్తే చేసినట్లున్నారు. కానీ పెద్దలకేం తెలుసు పిల్లల కష్టాలన్నట్లు.. ఢిల్లీలో కూర్చొని కబుర్లు చెప్పే నేతలకు సీమ కష్టాలేం తెలుసు? సీమ వాసుల అస్తిత్వమేం తెలుసు? రగిలిపోతున్న రాయలసీమ జనం ఎవరితో తమ గోడు చెప్పుకోవాలో తెలియని దారుణ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితమే పురుడుపోసుకుంది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉద్యమాలు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అది వారి హక్కు కూడా. కేంద్రంపై ఎంతవరకు ఒత్తిడి తేవాలో అంతా తెచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా రాయల తెలంగాణ అనే అంశంతోనే.. తెలంగాణ ప్రజలను శాంతింప జేసేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడును కంట్రోల్ చేసేందుకు, టిడిపిని అదుపు చేసి, జగన్‌ను మదుపు చేసేందుకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు, ఆ ప్రాంతంలో పార్టీ ప్రభావం తగ్గకుండా ఉండేందుకు, కేంద్రం అనేక కోణాల్లో చర్చోపచర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు.

కానీ మధ్యలో ఈ రాయల తెలంగాణ ఏంటి? ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను సృష్టించడమేనా పెద్దల నిర్ణయమంటే .. పది జిల్లాల తెలంగాణకు రెండు జిల్లాలు, ఆంధ్రకు మరో రెండు జిల్లాలను ఇవ్వడం అంటే చీల్చడమే కాదూ? ఇదెంతవరకు సమంజసం? రాయలసీమ అంటే అంత చిన్న చూపా? ఒక ప్రాంతాన్ని విడగొట్టడం, చేతికొచ్చినట్లు మ్యాపులు గీయడం అంటే అంత ఈజీనా.. ఇటు రెండు జిల్లాలు, అటు రెండు జిల్లాలని పంచడానికి అన్న దమ్ముల ఆస్తి గొడవలా? రాయలసీమ అంటే అసలే నాలుగు జిల్లాలు.. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం పరిస్థితి నేటికి దారుణమే.. ఎంతో మంది ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని ఇచ్చిన రాయలసీమను ఇప్పుడు రంపపుకోత కోయడం తగునా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు.. చంద్ర బాబు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా వైఎస్ రెండు సార్లు సీ ఎం అయినా సీమకు ఒరిగిందేమీ లేదు. వారి వారి జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చుకున్నా.. పూర్తి స్థాయిలో వాళ్ల జిల్లాలను కూడా అభివృద్ధి పర్చుకోలేదనే చెప్పొచ్చు. ఇక కర్నూలు, అనంతపురంది ఎలాంటి పరిస్థితో చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాల తరబడి రాయలసీమలో విషం చిమ్మన ఫ్యాక్షనిజం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కోలుకోలేని దెబ్బ తీసింది. చిత్తూరుజిల్లా పర్లేదననుకున్నా, అదీ అంతంత మాత్రమే. సీమలో నీటి వనరులు లేవు. ఉపాధి అవకాశాలు లేవు. ఆపద్బాంధవుల్లాంటి నేతలూ లేరు.


సమైక్యాంధ్ర అంటే తెలంగాణ వాళ్లు భగ్గు మంటారు. ప్రత్యేక తెలంగాణ అంటే సమైక్యమే ముద్దని కొందరు లేస్తారు. రాయల తెలంగాణ అంటే ఎవరి మనసులూ కరగడం లేదు ఎందుకో? ఎవరి సేఫ్టీ వారు చూసుకుని రాయల సీమను ఎలా విడగొట్టినా తమకేమవుతుంది.. తాము మాత్రం పొలిటికల్‌గా బాగున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రజల మనస్తత్వాలకు, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు విలువనిచ్చే నేత, రాయలసీమ నేలపై లేనే లేడని ఇప్పుడు సీమజనానికి బాగా అర్థమవుతోంది. కేంద్రం రాయల తెలంగాణ అంటే నోరు పెగలడం లేదు. బెల్లంకొట్టిన రాయిలా ఎవరికివారు సైలెంట్‌గా ఉండి రాయల తెలంగాణ నిర్ణయం రైటే అన్నట్లు సంకేతాలిస్తున్నారు. రాళ్లసీమను కూడా దండుకుని కోట్లు కూడగట్టుకున్న నాలుగు జిల్లాల నేతల గుండెలు అంత బండబారి పోయాయి! లేక ఆస్తులు కాపాడుకునేందుకు కేంద్ర నిర్ణయానికి మద్దతిస్తున్నారా? తుంగభద్ర పక్కనే ఉన్నా అనంతపురం వాసులకు తాగడానికి నీళ్లుండవు. కర్నూలు నడిబొడ్డున కృష్ణ ప్రవహించినా, అనుకున్నమేరకు పంటలుండవు. పీనిగల ఏరుగా ప్రసిద్ధికెక్కిన పెన్నా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఏడాదికి రెండు పంటలు సర్వసాధారణం.

చాలా చోట్ల మూడు పంటలు కూడా చేతికొస్తాయి. వరదొచ్చినా, వానరాకున్న వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది వారి అదృష్టం కావచ్చు. కృష్ణా, గోదావరి కరుణ కావొచ్చు. ఏడాదికి ఒక పంట పండితే చాలురా దేవుడా అనుకునే రాయలసీమలో భూదేవిని నమ్ముకుని, నట్టేట మునిగిన రైతుల గోడు వినేదెవరు? అనంతపురం జిల్లాలో పెద్ద పంట అంటే వేరుశనగే .. కర్నూలులో వరి, మామిడి. కడపలో వరి, అక్కడక్కడా వాణిజ్యపంటలు. ఆ మూడు జిల్లాల కంటే కాస్త ఎక్కువగా ఏదైనా పండుతుందంటే అది చిత్తూరు జిల్లాలోనే. ఫ్యాక్షనిజాన్ని అడ్డుపెట్టుకుని నేతలు ఎదిగారే కానీ, పంటలు నమ్ముకొని బాగుపడిన రైతులు రాయలసీమలో చాలా తక్కువ. ఇది ఎవరైనా ఎరిగిన సత్యం. 2014లో ముఖ్యమంత్రి కావాలని వేల కిలో మీటర్లు నడిచి, ప్రజల వద్దకు వెళ్ళిన చంద్రబాబు, ఉత్తరాఖండ్ ఉదంతంపై ఆగమేఘాల మీద స్పందించి అండగా నిలిచిన చంద్రబాబు ఒక్కరే ఇప్పుడు రాయలసీమకు పెద్ద దిక్కు. ఎందుకంటే సమైక్యరాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారో.. అనేది అందరికంటే ఆయనకే పెద్ద పరీక్ష. ఆయన తీసుకునే నిర్ణయం, రాయల తెలంగాణపై కేంద్రానికి ఇచ్చే అభిప్రాయంపైనే నలిగిపోతున్న నాలుగు జిల్లాల భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇక జైల్లో ఉన్నా జెరూసలేంలో ఉన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక నిర్ణయంతో ఉన్న జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ తరఫున ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తారో ఆయనకే తెలియాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం దెబ్బ తినకుండా ఉండేందుకు సీమాంధ్రలో ఆదరణ ఉన్న జగన్‌ను, మరోసారి ముఖ్యమంత్రి కావాలని సర్వశక్తులూ ఒడ్డుతున్న చంద్రబాబునూ దెబ్బ తీయాలనే ఒకే అంశంతో రాయల తెలంగాణను తెరమీదికి తెచ్చి.. టీఆర్ఎస్‌ను అట్నుంచీ నరుక్కొచ్చి, ఆ పార్టీని క్రాస్‌రోడ్స్‌లో నిలబెట్టి నయా పొలిటికల్ గేమ్ (కొత్త రాజకీయ క్రీడ) కు తెర లేపారు. 2014లో రాహుల్‌ను ఎలాగైనా ప్రధాన మంత్రి పీఠంపై కూర్చో బెట్టేందుకు, నరేంద్ర మోడీ హవాను తట్టుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు కొల్లగొట్టడంపైనా దృష్టి సారించి.. ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఏది ఏమైనా రాయలసీమకు మాత్రం తీరని ద్రోహం జరుగుతుంది. ఇద్దరు నేతలను నిలువరించేందుకు ఇంత దారుణానికి ఒడిగట్టడం న్యాయమా? రాష్ట్రాన్ని విభజించేందుకు ఏ మాత్రం సంబంధంలేని రాయలసీమను అడ్డంగా తెగనరకడం సమంజసమా? రాయలసీమ జనులారా, ఆలోచిస్తున్నారా?

-చెన్నా గోవింద్ Andhra Jyothy 06-07-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...