Wednesday, April 17, 2013

ఇదిగో రాయలసీమ గడ్డ -డా.సి.నారాయణరెడ్డి

ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా                    //ఇదిగో//

పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు
చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోన                                                        //ఇదిగో//

హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
చరిత్రకెక్కిన ధరణి ఇది పదాలనే సర పదాల నడిపిన అన్నమయ్య కృతులు
ఇహపరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర సర్పగతులు
అలలైపొంగిన అవని ఇది                                                                       //ఇదిగో//

తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి
గాడిచర్ల కల్లూరి సదాశివం అబ్బూరి హంపన్న లింగన్న,
షేక్ బీర్ లబియాబి .. వందేమాతరం
ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా ఎందరెందరో
త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది                                              //ఇదిగో//

అంతనిచ్చెనంత నిరంతర విగస్వర వైభవంతో విరాజిల్లిన
రాయలసీమ మన రైతన్నల సీమ
ఈనాడు పుష్కల ముష్కల శక్తుల దురంతరాలతో అతలా
కుతలమవుతుంటే చూస్తూ ఉంటారా చూస్తూనే ఉంటారా

అయితే యువత ఉగ్రమించాలి నవత విప్లవించాలి
రాగొంతులా గర్జించే నాదమే మహోధ్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి

                                                                                                 రచన : డా.సి.నారాయణరెడ్డి 
                                                                                                                   చిత్రం : సీతయ్య
                                                                                          గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
                                                                                      

సీమ వెనకబాటుతనంపై శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన ఒక పత్రం

భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణకు బాటలు వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉండాలా? ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోవాలా అన్న పరిస్థితికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల కోట్లాది ప్రజలు ఎంత మాత్రం కారణం కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలను పెంచే విధానాలతో ప్రజల మధ్య వైరుధ్యాలను, విభేదాలను కల్పిస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని ఇన్నేళ్లు పాలించిన పాలకులు అందుకు పూర్తి బాధ్యులు. ఆ పాలకులే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలోని కొన్ని జిల్లాల వెనుకబాటుతనాన్ని రూపుమాపే పథకాలు చేపట్టకుండా, ప్రాంతీయ అసమానతలను శాశ్వతం చేశారు.

ప్రాంతీయ అసమానతలను, కరువు కాటకాలను, ప్రజల అసంతృప్తిని అవకాశంగా తీసుకొని వారిని రెచ్చగొడ్తున్న అవకాశవాద రాజకీయ పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం, పదవుల కోసం విద్యార్థులను, యువకులను ముందుంచి రాజకీయ యుద్ధం చేస్తూ వారిని బలిపెడ్తున్నారు. తమ వాదానికి మద్దతుగా శతాబ్దాల తెలుగు ప్రజల చరిత్రను, నాగరికతను, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని వక్రీకరిస్తూ, ప్రాంతాల వారీగా విభజిస్తూ, తప్పుడు సిద్ధాంతాల్ని ప్రతిపాదించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము.

ఒకనాడు విశాలాంధ్ర కోసం, ఆంధ్రుల ఐక్య త, ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీలు ఓట్లు, సీట్ల కోసం తమ మౌలిక విధానాలకు తిలోదకాలివ్వడం ఒక వాస్తవం. రాష్ట్ర విభజనను పరిష్కారంగా ఘోషిస్తున్న ఈ పార్టీలు, విభజనతోనే మొదలై మూడు ప్రాంతాలలో జరగబోయే తీవ్ర పరిణామాలను, సమస్యలను ఆలోచించడం లేదు.

edit.రాయలసీమ ప్రాంతం, ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, పరిణామాలను స్థూలంగా మీ దృష్టికి తెస్తున్నాము. సాహితీ, సమరాంగణ సౌర్వభౌముడుగా చరిత్రలో ప్రసిద్ధి పొంది, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు పేరుతో మా ప్రాంతం-కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు- పిలువబడటం మాకు గర్వకారణం.

రాయలవారి పాలనాకాలంలో రాయలసీమ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు (చెరువులు, కుంటలు, బావులు, కాలువలు), వ్యవసాయం, వాణిజ్యం, లలిత కళ లు, భవన నిర్మాణశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, రాజనీతిశా స్త్రం, యుద్ధవిద్యలు.. ఒకటేమిటి అన్ని రంగాలు, సమస్త కళ లూ వెల్లివిరిసిన కాలం. అప్పుడు రాయలసీమ రత్నాలసీమగా, కళలకు కాణాచిగా విలసిల్లింది.

తళ్లికోట యుద్ధం, పెనుగొండ ముట్టడి జరిగి విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత వరుసగా బహుమనీ సుల్తానులు, స్థానిక ప్రభువులు, నిజాం నవాబు, బ్రిటీషు ప్రభువులు పాలించారు. ఈ కాలమంతా రాజకీయ అస్థిరత, అరాచకం, దోపిడీలు, కరువులు విజృంభించి రాయలసీమలో రాజ్యమేలాయి. రాయలసీమకు రాళ్లసీమ, కరువు సీమ పర్యాపదాలైనాయి.

ఆంధ్ర మహాసభల చర్చల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేయాలని కోస్తాంధ్ర ప్రతినిధులు ప్రతిపాదిస్తే, సీమ నాయకులు, ప్రతినిధులు అంగీకరించక తమ అభ్యంతరాలను తెలుపుతూ వచ్చారు. మద్రాసు రాష్ట్రంలో అరవల పెత్తనంతో సీమ ప్రజలు విసిగిపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అభిజాత్యంతో వ్యవహరించే కోస్తాంధ్ర నాయకుల ఆధిపత్యం వస్తుందని, విశ్వవిద్యాలయం ఏర్పాటు, రాజకీయ పదవులు, ఉద్యోగాలు, నీటి వనరుల పంపకంలో జరిగిన అన్యాయాలు, భాషాపరమైన చిన్నచూపు మున్నగు అంశాలను సీమ విషయంలో వివక్షతలను, మోసాలను ప్రస్తావించారు.

1937 అక్టోబర్‌లో బెజవాడలో జరిగిన ఆంధ్రమహాసభ రజతోత్సవ సభకు సీమ నుంచి 30 మంది ప్రతినిధులు హాజరై సీమ ప్రజల వాణిని బలంగా, నిర్మొహమాటంగా వినిపించారు. కోస్తాంధ్ర వారితో కలిసి ఒక రాష్ట్రంలో ఉండాలంటే రాయలసీమకు 'ప్రత్యేక రక్షణలు' కావాలని స్పష్టంగా వివరించారు. ఫలితంగా రెండు ప్రాంతాల నాయకులతో 'సౌహార్ద్ర సంఘం' ఏర్పాటు చేసి, రాయలసీమ ప్రాంతంలో పర్యటించి అభిప్రాయాలను సేకరించారు.

కాశీనాథుని నాగేశ్వరరావు ఇల్లు 'శ్రీబాగ్'లో రెండు ప్రాంతాల నాయకులు, బాధ్యతగల పెద్దలు సమావేశమై ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది 'శ్రీబాగ్' ఒప్పందంగా పిలువబడుతున్నది. సీమ ప్రజలు ఎంతో విలువైందిగా భావిస్తున్న ఈ ఒప్పందం పాలకులు, రాజకీయ పార్టీలు, ఇతర రెండు ప్రాంతాల నాయకుల దృష్టిలో చిత్తుకాగితమయింది. ఒప్పందాన్ని నమ్మిన సీమ ప్రజలను వారు నట్టేట ముంచారు. అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురై దేశంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం గా, కరువు సీమగా మిగిలిపోయింది.

వివిధ జాతుల సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో మూడు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆంధ్రజాతి వివిధ రాజవంశాల పాలనలో భిన్న జాతుల సాంగత్యంతో, ఎన్నో మతాల, సంస్కృతుల ప్రభావంతో తనదైన ఒక వినూత్న, సంస్కృతిని సంతరించుకొన్నది. ప్రాచీన భాషా యోగ్యతను సంపాదించుకొన్న తెలుగుభాషకు రెండు వేల ఏళ్ల మౌఖిక, లిఖిత సాహిత్య చరిత్ర ఉంది.

రాజులు, రాజ్యాలు మారినా, సంస్కృతం, ప్రాకృతం, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, ద్రావిడ భాషలైన తమిళ, కన్నడ భాషా సాహిత్యాల సంపర్కం, సాహిత్యం ప్రభావంతో తెలుగు భాష మరింతగా తేజరిల్లింది. వివిధ ప్రాంతాలలో తెలుగు భాష కొత్త యాసలతో సొబగులు దిద్దుకొంది. ప్రాంతీయ, స్థానికమైన వైవిధ్యం, ఉచ్ఛారణలు, యాసలు ఎన్ని ఉన్నా తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతి, భాష ఒకటే.

దేశంలో ఆర్థిక అసమానతలకు తోడు, రాష్ట్రంలో ప్రాంతీ య అసమానతలు ఉన్నాయి. ఒక ప్రాంతం వెనుకబాటుతనాన్ని నిర్ధారించే అంశాల్లో-సగటు వర్షపాతం, నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయం, పరిశ్రమలు, అక్షరాస్యతా శాతం, రవాణామార్గలు, వినియోగమవుతున్న విద్యుత్తు, విద్య, ఉద్యోగాలు ప్రధానమైనవి. ఈ ప్రాతిపదికపై రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా అనేక మంది నిపుణుల కమిటీలు తమ నివేదికలో నిర్ధారించా యి.

రాయలసీమను వరుస కరువుల బారి నుంచి శాశ్వతం గా కాపాడి సస్యశ్యామలం చేయడానికి 20వ శతాబ్దంలో నియమించిన అన్ని కమిటీలు తమ నివేదికల్లో నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించాలని స్పష్టమైన ప్రతిపాదనలు చేశాయి. అందులో 1905-06లో మెకంజీ పథకం (సిద్ధేశ్వరం-గండికోట ప్రాజెక్టు) 36 లక్షల ఎకరాల సాగు, ప్లానింగ్ కమిషన్ అనుమతి పొందిన 1951లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం తయారు చేసిన కృష్ణా-పెన్నేరు ప్రాజెక్టు రిపోర్టు (రాయలసీమలో 7.2 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు సాగు), 1953లో ఖోస్లా కమిటీ నివేదిక ప్రధానమైనవి.

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నీటి వనరులు ముఖ్యం. సాగునీరు, విద్యుచ్ఛక్తి-వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాథమిక అవసరాలు. సీమ అత్యల్ప వర్షపాత ప్రాంతం. భూగర్భజలాలు తక్కువ. కృష్ణా, పెన్నా నదుల నీరే శరణ్యం. నదీ జలాల లభ్యత: గోదావరి 1493.02 టి.ఎం.సిలు, కృష్ణా 811.80 టి.ఎం.సిలు, పెన్నా 98.82 టి.ఎం.సిలు, నాగావళి 49.11 టి.ఎం.సిలు, వంశధార 14.11 టి.ఎం.సిలు, ఇతర నదులు 278.83 టి.ఎం.సిలు. ఇందులో గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవహించే నీరు మొత్తం రాష్ట్ర నదీ జలాల్లో లభ్యత 84 శాతం.

రాయలసీమ వాటా: రాష్ట్రంలోని పెద్ద జీవనదులైన గోదావరి, కృష్ణా నదుల నీటిలో- 1) గోదావరి నుంచి తెలంగాణ, కోస్తా ప్రాంత జిల్లాలకు. 2) కృష్ణా నది నుంచి తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంత జిల్లాలకు ఉపయోగించవచ్చు. 3) రాయలసీమకు మాత్రం కేవలం కృష్ణానదీ జలాలే ఏకైక ఆధారం. 4) పెన్నా నది నీరు అనంతపురం, కడప జిల్లాలకు తక్కువగా, దిగువ జిల్లా నెల్లూరుకు ప్రధానంగా వినియోగమవుతున్నది. 1976లో ప్రకటించిన బచావత్ అవార్డు ప్రకారం రాష్ట్రానికి కృష్ణానది వాటా 800 టి.ఎం.సిలు. బచావత్ తీర్పు ప్రకారం మూడు ప్రాంతాల మధ్య నీటి పంపకం కోస్తాంధ్ర 377.44 టి.ఎం.సిలు. తెలంగాణ 266.86 టి.ఎం.సిలు. రాయలసీమ 122.70 టి.ఎం.సిలు. ఆవిరి ద్వారా నష్టం 33.00 టి.ఎం.సిలు.

రాయలసీమ పరిస్థితి ఇది కాగా, తెలంగాణ, కోస్తా ప్రాంత రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, నీటిపారుదల మేధావులు రాయలసీమ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కృష్ణా నదీ జలాలను పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటి (44 వేల క్యూసెక్కులకు) పెంచి దోచుకొని పోతున్నాడని నిత్యం అసత్య ప్రచారం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సీమలో నిర్మించబడిన, నిర్మాణంలో వున్న సాగునీటి ప్రాజెక్టులకు ముఖద్వారం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు (రిజర్వాయర్) కాదు. అది 3 ప్రాజక్టులకు కృష్ణానదీ జలాలను క్రమబద్ధంగా నీరు వదిలే రెగ్యులేటర్ మాత్రమే.

దీనిద్వారానే 1). యస్.ఆర్.బి.సి (19) 2). తెలుగుగంగ (44) 3). గాలేరు-నగరి (38) 4). తుంగభద్ర నుండి కె.సి.కెనాల్‌కు ఇచ్చే 10 టిఎంసిలు మొత్తం 111 టిఎంసిలు వదలాలి. ఇందులో చెన్నై నగరానికి 15 టిఎంసిలు + 29 టిఎంసిలు మిగులు జలాలు-44 తెలుగుగంగ ద్వారా వస్తాయి. అంటే 111-44=67 టిఎంసిలు మాత్రం పంపే యీ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించే, దోచుకుపోయే అవకాశం ఎక్కడుంది? రాజధాని: 1956 నుండి పరిశ్రమలు, వ్యాపారాలు, ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, రాజకీయాలు... కారణాలతో లక్షలాది ప్రజలు సీమ, కోస్తా నుండి హైద్రాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ఐ.టి.సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, పత్రికారంగం, సినిమా పరిశ్రమ, విద్యాసంస్థలు బహుముఖంగా విస్తరించాయి. 1955లో 12 లక్షలు వున్న జనాభా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు వుంది. ఇందులో 1/3 వంతుకు పైగా సీమ, కోస్తా నుండి వచ్చిన వారున్నారు. హైదరాబాద్ ఆంధ్ర ప్రజలందరి ఐక్యరాజధాని. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే ప్రజల, ఉద్యోగుల, మైనారిటీ మతస్థుల, ప్రజాప్రతినిధుల, పార్టీలు, సంస్థల అభిప్రాయా లు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా హైదరాబాద్ గురించి నిర్ణయం తీసుకోవాలి.


                                                                                                                      - బి.పాండురంగారెడ్డి
                                                                                                         అధ్యక్షులు, రాయలసీమ పార్టీ
                                                                             (శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన పత్రం సంక్షిప్త పాఠం)
                                                                                 ఆంధ్రజ్యోతి దినపత్రిక (05/05/2010)సౌజన్యంతో..

Friday, April 12, 2013

తుమ్మెదలున్నాయేమిరా.! పచ్చ చత్రి,.. కోడి పిల్లో..జానపద గేయాలు

01-తుమ్మెదలున్న యేమిరా ...
అతడు : తుమ్మేదలున్న యేమిరా... దాని కురులు
కుంచెరుగుల పైన - సామంచాలాడెవేమిరా
ఆమె : ఏటికి పోరా శాపల్‌ తేరా - బాయికి పోరా నీళ్లు తేరా
బండకేసి తోమర మగడ - సట్టికేసి వండర మగడా
శాపల్‌ నాకు శారూ నీకూరా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్‌ నాకు శారూ నీకూరా || తుమ్మేద ||
ఆమె : కూలికి బోరా కుంచెడు తేరా - నాలికి పోరా నల్దుం తేరా
వచ్చాబోతా కట్టెల్‌ తేరా - కట్టెల్‌ నీకు కమ్మల్‌ నాకూ రా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా... బంగారం మగడా
కట్టెల్‌ నీకు కమ్మల్‌ నాకూ రా || తుమ్మేద ||
ఆమె : రోలూ తేరా రోకలి తేరా - రోటికాడికి నన్నెత్తకపోరా
కులికి కులికి దంచర మగడ - శాటల కేసి సెరగర మగడ
బియ్యం నాకు... తవుడూ నీకూరా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా... బంగారం మగడా
బియ్యం నాకు... తవుడూ నీకూరా || తుమ్మేద ||
ఆమె : రెడ్డీ యేమో దున్నను పాయ - రెడ్డీసాని ఇత్తను పాయె
నాల్గూ కాళ్ల కుందేల్‌ పిల్లా నగుతా నగుతా సంగటి తెచ్చె
సంగటి నాకు - సూపుల్‌ నీకురా || తుమ్మేద ||
ఒల్లోరె మగడా! బల్లారం మగడా... బంగారం మగడా
సంగటి నాకు - సూపుల్‌ నీకురా || తుమ్మేద ||


02-పచ్చ చత్రి సేతబట్టి కిర్రు సెప్పులేసుకుని ...
. పచ్చ చత్రి సేతబట్టి కిర్రు సెప్పులేసుకుని ...
కట్టమింద పోతాఉంటేరో - నా కొడకా మానందిరెడ్డీ
నువు కలకటేరనుకొంటిరో ...
2. మల్లు పంచ కట్టుకోని - నల్లకోటు యేసుకోని
సందు యెంట పోతాఉంటేరో ... నా కొడకా మానందిరెడ్డీ ...
రాజా మానందిరెడ్డీ ... నువు సందమామనుకొంటిరో ...
3. నున్నంగ తల దువ్వి - నూగాయ జడ యేసి 2
పడమటీదిన పోతాఉంటెరో ... నా కొడకా మానందిరెడ్డీ ...
రాజా మానందిరెడ్డీ ... నువు పాలెగాడనుకొంటిరో ...
4. పచ్చి పసుపుకొమ్ము వంటిది నీ భార్య 2
నీ మాటలనుకోని శానా దుక్కమురో
నా కొడకా మానందిరెడ్డీ - అయ్యా మానందిరెడ్డీ ...
నీకిలలో బత్తెము తీరేనా ...
5. వచ్చీ పోయే దావలోనా - దానిమ్మ సెట్టుకింద
ఎండి కుచ్చ నేల బడితెరో ... నా కొడకా మానందిరెడ్డీ ...
ఏటుకే తెగ నరికిరో ...




03-కోడి పిల్లో ... అబ్బో కోడి పిల్ల ...
కోడి పిల్లో ... అబ్బో కోడి పిల్ల ...
ఆ మాటలంటదే - అలాగ నంటిదే
ఆమెయిన అంటదే - ఆ లయ్య పడ్తదే - కోడిపిల్ల
పాట: ఆ మాటలంటదే - అలాగనంటిదే
ఆమెయిన అంటదే - ఆ లయ్య పడ్తదే - కోడిపిల్ల
కోసీ కొయ్యంగనే - కోడికూత మానేసి
కైలాసం నేను పోయినానంటదే || ఆమాట ||
తుంటకట్టె తీసుకోని తరింగిరిం కొడ్తాంటే
భూమి భూలోకమంత తిరిగినానంటదే || ఆమాట ||
దిబ్బమిందిక్కొంచబోయి 2 - బొచ్చుగిచ్చు ఈకుతాంటె 2
సిలంకూరు సిన్నప్ప సెవరం సేసినానంటదే || ఆమాట ||
పొయికాడ కొంచబోయి - తిప్పి తిప్పి కాలుచ్చాంటే 2
సాకిరేవు పోయికాడ సలి మంటలంటదే 2 || ఆమాట ||
మిద్దె ప్కకు కొంచబోయి - రుద్దిరుద్ది కడుగుతాంటె 2
కాశీగంగలోన జలకమాడ్తి నంటదే 2 || ఆమాట ||
మొద్దుమిందికి కొంచబోయి - తుంటల్‌గింటల్‌ సేత్తాంటె 2
కోడి పందెమాటగాడు ఆరె జివిరె నన్నదే 2 || ఆమాట ||
మిర్యాలు గిర్యాలు మసాల నూర్తాంటె 2
పునుగు జవ్వాది నేను పూసుకున్యానంటదే 2 || ఆమాట ||
ఒక్క గంటెడు కూర కూటి పైన పోసుకుంటె 2
మల్లె పరుపు పైన పండుకున్నానంటదే 2 || ఆమాట ||
ఎంకలన్ని కొంచబోయి దిబ్బమీద పోచ్చాంటె 2
అదుగో నాదొక్కటి - వైకుంఠమన్నదే 2 || ఆమాట ||

001-జయ మంగళం నిత్య శుభ మంగళం (వరుస పాట)

రాగం : మధ్యమావతి
తాళం : ఖండూపతాళం
పల్లవి: జయ మంగళం నిత్య శుభ మంగళం
చ|| ఆ సంకనొక బిడ్డ ఈ సంకనొక బిడ్డ
కడుపులో నొకబిడ్డ కదలాడగా
ఆరు సోళ్ళు బియ్యమొండి మూడు సోళ్ళు
పప్పొండి సాలక మా వదిన సట్లు నాకె || జయ ||
చ|| అప్పుకొక పల్లెంబు పప్పు కొక పల్లెంబు
కూరనారకోక్క గుండు పల్లెంబు
అప్పులోడిచ్చి సెప్పుతో కొడతాంటె
అప్పుడే మా బావ పప్పు కేడ్చే || జయ ||
చ|| వెలికొండకు పోయి ఏపినారతెచ్చి
సన్నంగ సన్నంగ తలుగు పేడి
గంపెడు గడ్డెయంగ గాట్ల కట్టేయంగ
ఘనమైన పెండ్లి కూతురనీకారతి || జయ ||
చ|| నూగులు నుసి బట్టె గానుగలు గసి బట్టె
పెండ్లి కొడుకు నెత్తికి పేలు బట్టే
పెండ్లి కొడుకు సిన్నాయన పేలు బట్టాబోయి
గంజి గుంతలో బడి గుంజులాడే || జయ ||
చ|| పల్లె పల్లె తిరిగి పట్నాలన్ని తిరిగి
ముల్లోకములు తిరిగి నిన్ను దెచ్చే
మూతి మూడొంకరలు నడ్డి నాల్గొంకరలు
ముచ్చటైన పెండ్లి కూతుర నీకారతీ || జయ ||
చ|| ఆ వీధి నొక కుక్క ఈ వీధి నొకకుక్క
నట్ట నడి వీధిలో నల్లకుక్క
మూడు కుక్కలు కలిసి ముచ్చటా లాడంగ
మూలనున్న పెండ్లి కొడుకు మూతినాకే || జయ ||
చ|| మంగళం మంగళం మా బావ నెతికి
సూరులో ఉండేటి సుంచెలుకకు
మంగళం మంగళం మా వదిన కొప్పుకి
గుంతలో ఉండేటి గొండ్రుకప్పకూ || జయ ||

Monday, April 8, 2013

'' సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!

.
డప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లె లో పెద్ద రైతు కుటుంబంలో రాజగోపాల్ రెడ్డి జన్మించారు.
మాసీమ రాజగోపాల్ రెడ్డి
న్యాయవాద విద్యను అభ్యసించిన రాజగోపాల్ రెడ్డి “మాసీమ” పేరుతో పక్షపత్రికను స్థాపించి సోషలిస్టు భావజాలంతో ప్రజాసమస్యలను, రాయలసీమ వాసుల కన్నీటి కడగండ్లను వెలుగులోకి తెచ్చేందుకు అవిశ్రాంతంతంగా కృషి చేశారు.
 ఎమర్జెన్సీ కాలంలో ” మాసీమ”  పత్రికను ఆయుధంగా మలచి ప్రభుత్వ దమననీతి పై సమరం సాగించారు.  యెమర్జెన్సీలో ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా తన పత్రిక సంపాదకీయపు పేజీని ఖాళీ గా ఉంచుతూ ఆ ఖాళీ పేజీకి ” సత్యం వధ..ధర్మం చెర” అనే శీర్షికను పెట్టారు. యెమర్జెన్సీలో ప్రజల బాధలకు దోసిళ్ళు పడుతూ వ్యాసాలను ప్రచురించారు. మాసీమ పత్రికలో వచ్చే రాతలపై కినుక వహించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం “మాసీమ” అరెస్టు చేసి 18 నెలల పాటు ముషీరాబాదు సెంట్రల్ జైలులో నిర్భంధించిం ది.
 శ్రీయుతులు జానుమద్ది హనుమచ్చాస్త్రి, పి.రామ కృష్ణా రెడ్డి , ముండ్ల  నారాయణ రెడ్డి సహకారంతో  ’మాసీమ” ను ఒక శక్తివంతమైన పత్రికగా తీర్చిదిద్దారు. జానుమద్ది సంపాదకత్వంలో ” మాసీమ కవులు” అనే  గ్రంథాన్ని ప్రచురించారు.   తాను జైలులో ఉంటూ వీరి సాయంతో పత్రికను నడిపారు.
 రెండు దశాబ్దాల కిందట ఉవ్వెత్తున ఎగిసిపడిన రాయలసీమ ఉద్యమంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి, డాక్టర్  ఎంవీ మైసూరా రెడ్డి, డాక్టర్ ఎంవీ రమణా రెడ్డి , సి.హెచ్. చంద్ర శేఖర రెడ్డి, ఎం.జె.సుబ్బరామి రెడ్డి తదితరులతో కలసి ప్రధాన భూమికను పోషించారు.

కె.సి.కెనాల్ ఆయకట్టుదారుల సంఘం ఏర్పాటు చేయడంలో అగ్రభాగాన నిలవడమే కాకుండా తన జీవిత పర్యంతం కె.సి.కాలువ రైతాంగ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే వచ్చారు. 30 ఏళ్లుగా కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తూ వచ్చారు. రాయలసీమకు కృష్ణా జలాల సాధన కోసం కమ్యూనిస్టులతో పోరాటం చేయడానికీ ఆయన వెనుకాడలేదు .ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత కార్యాలయం ఎదుట ఉద్యమం చేసే ప్రక్రియకు జిల్లాలో మొట్ట మొదట శ్రీకారం చుట్టింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మాసీమను జిల్లా ఉద్యమ పితామహుడిగా పేర్కొనడం అతిశయోక్తి కాదు.
 ” మాసీమ” ఒక దశలో ప్రత్యక్ష రాజకీయాల్లొకి రావాలనుకున్నారు. 1978, 1983లో రెండుసార్లు కడప ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి రంగారెడ్డి (కాంగ్రెస్) చేతిలో కేవలం 700 ఓట్లతో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో ఎస్.వి.యూనివర్సిటీ స్థాపనకు, కడపలో రేడియో కేంద్రం ఏర్పాటుకు, కడప రైల్వే స్టేషన్ అభివృద్ధికీ పోరాటాలు నిర్వహించారు.
 కడప జిల్లా రచయితల సంఘం ఏర్పాటులో “మాసీమ” కృషి మరువలేనిది.  స్టూడెంట్ సోషలిస్టు క్లబ్‌లను స్థాపించారు. సోషలిస్టు పార్టీలో రెండుసార్లు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. కడప పట్టణ అభివృద్ధి కోసం ‘కడప సేవా సమితి’ని స్థాపించి ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు ఉద్యమ నాయకులు రామమనోహర్ లోహియా, ఎన్‌సీ గంగిరెడ్డి, భుజంగరావు వంటి నాయకులతో కలిసి పనిచేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషిం చారు. అప్పుడు ఒకటిన్నర నెలపాటు జైలు జీవితం గడిపారు. 1964లో అదనపు భూమి శిస్తు కోసం రైతులతో కలిసి ఉద్యమం నడిపి నెలపాటు జైలుకెళ్లారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత కార్యాలయం ఎదుట ఉద్యమం చేసే ప్రక్రియకు జిల్లాలో మొట్ట మొదట శ్రీకారం చుట్టింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మాసీమను జిల్లా ఉద్యమ పితామహుడిగా పేర్కొనడం అతిశయోక్తి కాదు. నిరాహార దీక్ష చేసి 1993లో ఏపీ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న లింగంపల్లె వాటర్ వర్క్స్‌ను కడప మున్సిపాలిటీ పరమయ్యేలా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ‘ఛలో ఆస్పత్రి’ ఆందోళనకు నాయకత్వం వహించారు. సమకాలిన రాజకీయాల్లో ఇమడలేక కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి(80) గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..


రాయలసీమ పలుకుబడులు -జానుమద్ది హనుమచ్ఛాస్త్రి

డా. జానుమద్ది హనుమచ్చాస్త్రి 
భాషకైనా ప్రాంతీయ భేదాలు తప్పవు. తిరువాన్కూర్ మలయాళానికి కొచ్చిన్ మలయాళానికి ఎంతో తేడా వుంది. తిరువాన్కూర్ వారు మాట్లాడే భాష- కొన్ని పదాలు కొచ్చిన్ వారికి బూతుగా అర్థం అవుతాయి. కొచ్చిన్ వాళ్ళ భాష అనాగరికమైనదని తిరువాన్కూర్ వాళ్లు హాస్యం చేస్తారు. ఇలాగే మధుర, మద్రాసు తమిళ భాషలకు కూడా తేడాలు కద్దు. మధుర వాళ్లకు తమది ‘శన్దమిల్’ అని ఒక నిక్కు- వాస్తవానికి తమిళంలోని అపురూప కావ్యాలు మధుర ప్రాంతంలోనే బయలుదేరినవి.
అలాగే బెంగుళూరు దగ్గర కొందరు వైష్ణవులు వున్నారు. వాళ్లని ‘హెబ్బార్’ అయ్యంగార్లని పిలుస్తాము. వాళ్లు తమిళానికి పట్టించే అవస్థచూస్తే ఆ భాషపై జాలి కలుగుతుంది. ఇలాగే గదగ్, ధార్వాడ్ ప్రాంతీయ కన్నడానికి మైసూరు కన్నడానికి తేడా వుంది.
ధార్వాడ్ కన్నడంలో మహారాష్ట్ర పదాలు కొన్ని చేరాయి. వాళ్ల ఉచ్చారణలో కూడా కొంత మహారాష్ట్ర యాస కనిపిస్తుంది. తమది పరిశుద్ధమైన భాషయని మైసూరువాళ్ల డంభం. అట్లే తెలుగులో కూడా కొంత ప్రాంతీయ భేదాలు వున్నాయి.
ఒకసారి విశాఖపట్నం పోయినాము. ‘చిలగడ దుంపలు’, ‘ఆనపకాయలు’ అన్నారు. నాకు అర్థం కాలేదు. మళ్లీ తెలుసుకున్నాను. చిలగడదుంపలకు మా వైపు (రాయలసీమ) ‘గెనుసుగెడ్డ’లంటారు. ‘ఆనపకాయ’ అంటే ‘సొరకాయ’ అన్నమాట. రాజమండ్రి, తుని ప్రాంతాలలో తలకాయను ‘బుర్ర’ అంటారు.
రాయలసీమలోనూ బుర్ర శబ్దం వాడతారు. కానీ, దానికి ‘మెదడు’ అని అర్థం. అక్కడ ‘బుర్ర గోక్కున్నావా?’ అని అంటే ‘క్షౌరం చేసుకున్నావా?’ అని అర్థం.
అనంతపురం జిల్లా తెలుగు యితరులకు కొంచెం వింతగా కనపడుతుంది. అందులో కన్నడ పదాల యాజమాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ‘బిడ్లు, గుడ్లు’ అని యెగరేసి మాట్లాడుతుంటారు. అంటే బిడ్డలు అనీ, గుడ్డలు అని అర్థం. ‘ఏమప్పోలేసుగుండావు’ అంటారు. ‘లేసు’ అనేది ‘లెస్స’గా అనేదానికి రూపాంతరము. నేరుగా కన్నడ పదమది. ‘నామరేగితిని’ అంటారు. అంటే- కోపం చేసుకొన్నాను అని భావం. ఇలా రాయలసీమలోనే యితర ప్రాంతాలను అనంతపురం జిల్లా మాటలు కొంత తేడాగా వుంటాయి.
కోలారు ప్రాంతం తెలుగు యింకా చిత్రంగా వుంటుంది. ‘గూట్లో వునే్వ’ గూటిలో వున్నాయని అభిప్రాయం. ‘కూస్తాడు’ అంటే ‘పిలుస్తాడు’ అన్నమాట. ‘‘వాడు నిన్ను కూస్తాడు’’ అంటే - ‘‘వాడు నిన్ను పిలుస్తాడు’’ అని అర్ధం. ‘మరంత్యా’ ‘చేట తీసుకునిరా’ అని భావం. ఇలా కన్నడ పదాలు చేర్చి, పదాలు యెగరవేస్తూ మాట్లాడతారు. చిత్తూరు జిల్లా తెలుగు అదోరకం. ‘పూడ్చినాడు’ అంటే ‘పోయినాడని’ అర్థం. ‘సాపాటినావా?’ అంటే ‘్భంచేసినావా’ అని ప్రశ్న. ‘వారుదా పూడ్చెను’ అంటే- వాడు వెళ్లిపోయినాడని అర్థం. ఈ ‘దా’ అనేది తమిళం నించి దిగుమతి. తమిళంలో దీనికి ఒక అర్థం నిర్ణయం వున్నది. ‘తాన్’ అంటే ‘తానే’ అని అర్థం. ‘ఆనందాన్’ వారే చిత్తూరు ‘దా’కు మాత్రం వాళ్లే అర్థం చెప్పాలి.
అది కల్పవృక్షంలా పనిచేస్తుంది. కొంతవరకు కడప జిల్లాలో స్వచ్ఛమైన తెలుగు కనపడుతుంది. అందులో కూడా కొంత ఉర్దూ ప్రభావం వుంది. ‘వేమ్’ అనడానికి ‘బేమ్’ అంటారు. ఈ ‘చ’కారానికి ‘బ’కారాము- ఉర్దూ (ప్రభావము) ‘యాకన’ అంటే యొక్క రూపాంతరం. ‘గణుమాడుకొనడము’ అంటే- ‘నిందించుకొవడము’ అని అభిప్రాయం.
కడప జిల్లా వాళ్లు వాళ్లు మాట్లాడే కొన్ని అశ్లీల పదాలు- వాళ్లకు అశ్లీలంగానే తోచనే తోచవు. సర్వసాధారణంగా వాడేస్తూంటారు. కొన్ని పదాలు చాలా కాలం క్రిందట పోతన్న వాడిన ‘దొబ్బు’ పదాన్నిబట్టి, ఈయన రాయలసీమ వాడని కొందరు పండితులు వాదించుకొన్నారు.
పోతన్నలో మరియొక పదం కూడా వుంది. ‘సంతన’- ఇది కూడా అచ్చంగా రాయలసీమ పదమే. అంటే- ‘‘ఇంట్లో యెవరూ చేసేవారు లేర’ని అర్థం.
ఉత్తరాదిలో ‘పోవాలి’ ‘కావాలి’ అంటారు. రాయలసీమలో ‘పోవాల’ ‘రావాల’ అంటారు. చిత్తూరులో యధాప్రకారం ‘పూర్చినాడు’ ‘వచ్చిడిసినాడు’ అంటారు. ‘కన్యాశుల్కం’లోని కొన్ని తెలుగు మాటలు మాకు అర్థమే కావు.
ఆయన (గురజాడ) రాసినవంతా విజయనగర భాష. కడప జిల్లాలో కొళాయిల దగ్గర ఆడవాళ్ళు ప్రబంధాల్లోని మాటలు వాడుతుంటారు. ‘‘ముదిమది తప్పు’’ అని, ‘‘ముదిమది తప్పింద్యా’’ అంటారు. అంటే ‘వయస్సుయి’ ‘అస్తావిస్తం’(్ఛదస్తం) పట్టిందా అని భావం. ‘పందేకాడు అయినావు’ అంటే పెద్దపాలెగాడన్నమాట. ‘పచ్చిగా మాట్లాడటం’ యేమైనా మరుగు లేకుండా అనే అర్థంలో వాడ్తారు.
కొన్ని రాయలసీమ మాటలు పాతవేయందు కొత్తగా కనబడతాయి. ‘మినుముల’ను రాయలసీమలో ‘వుద్దులు (ఉద్దిబేడలు)’ అంటాం. ఇవి తమిళం నుంచి వచ్చిన శబ్దం. ‘పురల్’ అంటే ‘దొర్లుట’ అని శబ్దార్థం. అలాగే, మా ‘తెంకాయ’ లేక ‘టెంకాయ’ వారికి ‘కొబ్బరికాయ’, తెన్ అంటే దక్షిణం. దక్షిణ సముద్ర ప్రాంతాల్లో కొబ్బరికాయలు యెక్కువగా పండుతాయి. కాబట్టి దానికా పేరు వచ్చింది. కాలక్రమేణా ‘తెంకా’ టెంకాయ’ అయ్యింది. అరవలు ‘తెన్’ అనే వాడ్తారు. ‘తెన్’ అంటే ‘టెంకాయ’ అనే వ్యవహారము.
ఒకసారి యెప్పుడో బెజవాడలో నేను ‘కళ్ళ అద్దాలు’ అంటే ఒకాయన నవ్వినాడు. ‘కళ్ళజోడు’ అనాలట. వానికి కళ్లే లేనట్లు. ఇలాంటి వెక్కిరింతలు అన్నీ ధనమదంతోనే, అధికారమదంతోనో వచ్చే పిచ్చి చేష్ఠలు. ఇంకా రాయలసీమ వ్యవహారాలు వేలకు వున్నాయి.
అన్నమయ్య సాహిత్యాన్ని చూస్తే- పశ్చిమాంధ్ర పదాలు కొన్ని వేలకు చిక్కుతాయి. దీనికి కారణం ఏమిటి? మఖ్యంగా ప్రబంధ సాహిత్యమంతా రాయలసీమలో పుట్టిందే. ఒక్కమాటతో చెప్పితే రాయలసీమ లేకుంటే- ఒక్క భారతం తప్ప తెలుగుకు యేమీ మిగలదు. సహృదయంతో రుూ సత్యాన్ని అంగీకరించాలి.
క్షేత్రయ్య పాటలో ‘పామిడి, గుర్రం’ అనే ఒక ప్రయోగమున్నది. అన్నమయ్య కూడా ‘పామిడీతురగమని’ వాడినాడు. పామిడితురగమని వాదం, పామిరి అనంతపురం జిల్లాలోనిది. అది విజయనగర కాలంలో గుర్రపు దండుకు ఒక స్కంధావారము. (స్వేదము, తూకం వేసే చోటు). ఇలా ఎన్నో వున్నాయి. అరవవాళ్లు ‘మనుచరిత్ర’ అంటే ‘అరవ’ అనే పదము వస్తుంది. ‘అళువపట్టు’ అంటాం- అంటే హఠం అన్నమాట. ‘అళువ’ అన్నది ఒక జంతువు. ఆ జంతువు చాలా చిన్న తాబేలువలె వుంటుంది. మేమంతా దానిపైభాగమంతా చిన్న చిప్పలు. ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకుంటాయి. అంటే గట్టిగా పట్టుకొంటుంది. ఆ చిప్పలలో ఏదేని కాలు పడినా గోవిందా!
ఒకసారి పెనుకొండలో పెద్దపులి ఆళువపైన కాలుపెట్టింది. అది బిగుసుకొంది. ఆ పెద్దపులి అరిచి అరిచి చచ్చింది. ఈ జంతువును ఉత్తరాదిలో ఏమంటారో తెలియదు. మా (రాయలసీమ)వైపు ‘ఆళువ పట్టు’ అని ప్రసిద్ధము. చెప్పాలంటే యిలాంటివి చాలా వున్నాయి.
(పై వ్యాసం పుట్టపర్తివారు దాదాపు 30 ఏళ్ళ క్రితం రాశారు. ఆ వ్యాసం ఎపుడో ఆంధ్రప్రభ దినపత్రికలో వేశారు. ఆ వ్యాసం జిరాక్స్ ప్రతి నా కవిలెకట్టలో వుంటే ఎత్తి రాయించాను. అందలి అక్షరాలు సరిగా కానరావు)

                                                                                     -జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ

Andhrabhoomi Daily  

09/04/2013


గండికోట గుండె విప్పిన గ్రంథం


వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...