Wednesday, September 18, 2013

రాష్ట్రం విడిపోతే రాయలసీమ ఎడారి -ఎం.కె.కుమార్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో,సమైక్య వాదులతోపాటు ముఖ్యమంత్రి రాష్ట్రంవిడిపోతే రాయ లసీమ
ఎడారి అవుతుందని ప్రకటించారు. నిజానికి ఇప్పటికే రాయలసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి పాలకులు కారణంగాని రాష్ట్రం విడిపోవడం కాదు. తెలంగాణ విడిపోతున్న సందర్భంలోనూ, రాయలసీమకు రావాల్సిన, అందవలసిన నీటి వనరుల గురించి ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరితో రాయలసీమ రాజకీయ నాయకులు ముందు కు కదలడంలేదు. దేశంలో మొత్తం సాగుభూమి185 మిలియన్‌ హెక్టార్లుకాగా, అందులో 65 మిలియన్‌ హెక్టార్లు క్షామపీడిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని క్షామపీడిత ప్రాంతాల్లో 4.5 మిలియన్‌ హెక్టార్ల సాగుభూమి ఉండగా అందులో 3 మిలియన్‌ హెక్టార్లు,రాయలసీమాలోనూ,1.5మిలియన్‌ హెక్టార్లు తెలంగాణాలోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో రాయల సీమ 29.86 శాతముంది. రాష్ట్ర జనాభాలో 11.5 శాతం ప్రజానీకం సీమలో ఉంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. సముద్రమట్టం నుండి ఈ ప్రాంతం 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సగటు వర్షపాతం 858 మి.మీ ఉంది. రాయలసీమలో 800 మి.మీకన్నా తక్కువ వర్షపాతమే నమోద వుతుంది. అందువల్లే ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉంది. ఈ వర్షపాతం రాయలసీమలో ప్రధానంగా పండిస్తున్న వేరు శనగ, కొర్రజొన్నల పంటలకు కనీస స్థాయిలో కూడా చాలడం లేదు. సాలీనా 30 శాతానికి  మించి పంటలు పండించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. రాయలసీమలో ఖరీఫ్‌ పంటకాలంలో కురిసే వర్షపాతం కేవలం 365.8 మి.మీ మాత్రమే.ఇది కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి కంటే తక్కువగా అనంతపురం జిల్లాలో వార్షిక వర్షపాతం 544 మి. మీగా ఉంది. రాయలసీమలో ఎక్కువ భూమి ఎర్రనేలలుగానూ, తక్కువగా నల్లరేగడి భూములున్నాయి. ఎర్రనేలలు తేమను ఎక్కువగా నిలువచేసుకోలేవు. నేలసారం కూడా తక్కువ స్థాయి లో ఉంటుంది. రాష్ట్రంలో ఉపరితలం నీటి వనరులు 2746 టిఎమ్‌సిలు, భూగర్భజల వనరులు 1140 టిఎంసిలగానూ ఉందని అంచనా వేసారు. ఇందులో ఉపరితల నీటి వనరుల్లో గోదావరి నుంచి 1495, కృష్ణా నుండి 811 టిఎంసిలు వస్తుం దని అంచనా. రాష్ట్రంలో 113.4 లక్షల హెక్టార్ల (284 లక్షల ఎకరాలు) భూమి సాగులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి పై నీటి వనరులు మూడు ప్రాంతాల వారికీ సామా నంగా అందుబాటులోకి తీసుకురాగలిగితే 118 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించవచ్చునని నిపుణులు పేర్కొంటు న్నారు. 5వ పంచవర్ష ప్రణాళిక నాటికి నీటిపారుల సౌకర్యాల అభివృద్ధిలో కోస్తాలో 26.79 లక్షల హెక్టార్లకంటే, తెలంగా ణాలో 15.25 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 6.50 లక్షల హెక్టార్లే ఉంది. ఇదికూడా ఈ మధ్యకాలంలో 30 శాతానికిపైగా తగ్గింది. దీన్నిబట్టి రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి అసమానతలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి.రాయలసీమపట్ల వివక్ష ఇప్పటికే కొనసాగుతోంది. నీటివనరుల అభివృద్ధి జరుగనంత కాలం ఆ ప్రాంతం అభివృద్ధి చెందదనేది చారిత్రక సత్యం.
ఇజ్రాయిల్‌లో నెగేవ్‌ ఎడారిలో, అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారిలో ఆ దేశాల వారు పచ్చని పంటలను పండించి వ్యవసా యాన్ని అభివృద్ధి చేసారు. మనదేశంలో థార్‌ ఎడారిలో అతి తక్కువ వర్షపాతం 220 మి.మీ భాక్రానంగల్‌ ప్రాజెక్టులో నీటిని,సట్లేజ్‌ నదీ జలాలను రాజస్థాన్‌ కాలువ ద్వారా ఈ ఎడా రికి మళ్లించే ప్రయత్నం వల్ల 31.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. కరువులసీమగా ప్రసిద్ధిగాంచిన రాయల సీమలో 1876-78లో వచ్చినధాతు కరువువల్ల ఈ ప్రాంతంలో 1/3వంతు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1952-53లో వచ్చిన కురువుకు వేలల్లో ప్రజలు చనిపోయారు. రాష్ట్రంలోని 61కరువు ప్రాంతాల్లో 39 రాయలసీమలోనే ఉన్నాయి.  రాయ లసీమలో ప్రధానంగా పెన్నా, తుంగభద్ర, కృష్ణానదుల పరీవా హక ప్రాంతాల్లో ఉంది. పెన్నా పరీవాహక ప్రాంతం 56,750 చ.కి.మీ ఉండగా రాయలసీమలో 47,140 చ.కి.మీ నెల్లూరు జిల్లాలో 4,500 చ.కి.మీ ఉంది. పెన్నాలో లభ్యమయ్యే 75 శాతం విశ్వసనీయ నీటి లభ్యత ప్రకారం 123టిఎంసిలు లభిస్తే అందులో 33 టిఎంసిలు రాయలసీమ, 90టిఎంసిలు నెల్లూరు జిల్లాకు కేటాయించారు. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా పెన్నాలో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంత విస్తీర్ణం 28,179 చ.కి.మీ కర్ణాటకలో 19, 142,ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో 9,037చ.కి.మీ ఉంది. 75 శాతం వార్షిక నీటి లభ్యత ఆధారంగా 480 టిఎంసీలు తుంగభద్ర నుండి వస్తే దాన్ని కృష్ణా నీటి వివాదం ట్రిబ్యునల్‌ రాయలసీమకు 122.7 టిఎంసీలను కేటాయించింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర,కర్ణాటక,ఆంధ్రద్రపేశ్‌లో ఉంది.
బచావత్‌ ట్రిబ్యునల్‌ 1973, 1976లలో తన తొలి, తుది నివేదికను సమర్పించాయి. దీని ప్రకారం కృష్ణానదిలో ఉన్న నికరజలాలు 2060 టిఎంసిలేనని పేర్కొంటూ మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఆంధ్రప్రదేశ్‌కు 800 టిఎంసిల నీటిని కేటాయించాలని పేర్కొంది. మనరాష్ట్రంలో రాయలసీమకు 122.7, కోస్తా ఆంధ్రకు 377.44, తెలంగాణాకు 266.86 టిఎంసిలను కేటాయించారు. రాయలసీమకు 110 టిఎంసిలు మాత్రమే అందుతున్నాయి. ఇది 1937 నాటి శ్రీబాగ్‌ ఒప్పందా నికి పూర్తి వ్యతిరేకమైనది. మొత్తంగా కృష్ణ, తుంగభద్ర, పెన్న, ఇతర చిన్న నదుల ద్వారా రాయలసీమకు 167 టిఎంసిల ఉప రితలజలాలు లభ్యమవుతున్నాయి. రాయలసీమలో భూగర్భ జలం 216 టిఎంసిల వరకు ఉండొచ్చని భూగర్భజల విభాగం అంచనా వేసింది. ఇందులో 50శాతం (108టిఎంసి)లు మాత్ర మే వినియోగంలోకి తీసుకురావచ్చని అభిప్రాయపడింది. ఉపరి తల భూగర్భజల నుంచి వస్తున్న 275 టిఎంసిలవల్ల 75 లక్షల ఎకరాల సాగుభూమి అవసరాలకు మాత్రమే ఉపయోగపడు తుంది. అది కూడా ఈ మధ్యకాలంలో35శాతం తగ్గిపోయింది.
రాయలసీమలో కరువు సమస్యమను తీర్చడానికి 1901లో సర్‌కోలిన్‌ సి.స్కాట్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ కృష్ణా, పెన్నా బేసిన్లను కలిపి కాల్వలను తవ్వాలని సిఫార్సు చేసింది. మెకంజీ పథ కాన్ని అసలు అమలు చేయలేదు. 1927లో దత్తమండల జిల్లా నీటి పారుదల సంఘం సంగమేశ్వరం వద్ద కృష్ణానది మీద ఒక రిజర్వాయర్‌ నిర్మించి, ఆ నీళ్లను పెన్నా నది ద్వారా రాయలసీ మకు తరలించి 13 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందించాలని ప్రతిపాదించారు. అలాగే 1952 సంయుక్త మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది మీద సిద్దేశ్వరం రిజర్వాయర్‌ను నిర్మించి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందించాలని కృష్ణా -పెన్నేరు పథకంలో సూచించారు. 1953లో ఖోస్లా కమిటీ కూడా కె.సి. కెనాల్‌ను 6000 క్యూసెక్కుల నీరు సరిపోయేటట్టు మార్చి కృష్ణా మీద సిద్దేశ్వరం డ్యామ్‌ నిర్మించాలని సిఫార్సు చేసింది. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు నీటి మళ్లింపు విష యంలో ప్రధమ ప్రాధాన్యత నివ్వాలని పేర్కొన్నారు. ఈ పథకా లన్నీ బుట్టదాఖలైనాయి. మరి ఇన్నిసంవత్సరాలు తెలుగప్రజలు సమైక్యరాష్ట్రంలో ఉన్నప్పటికీ రాయలసీమకు ఎందుకుతీరని అన్యాయం జరిగిందే సమైక్యవాదులు జవాబుచెప్పాలి.
గోదావరి జలాలు సుమారు 1480 టిఎంసిలుంటే అందులో రాయలసీమకు 200 టిఎంసిల నికరజలాల కేటాయింపు కూడా లేదు.జూరాల ప్రాజెక్టుపై హక్కును కూడా రాయలసీమ పోగొ ట్టుకోవాల్సి వస్తోంది. రాయలసీమలోని కరువుప్రాంతం దృష్టి లో పెట్టుకునే బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కుఎక్కువ టిఎం సిలను కేటాయించిందనే వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందే నిర్మించిన కర్నూలు - కడప కాలువ వాటా 40 టిఎం సిలు, తుంగభద్ర కాలువల ద్వారా వచ్చిన వాటా 62 టిఎంస ిలు కూడా బచావత్‌ అవార్డు ప్రకారం ఇచ్చిన 122.70 టిఎంసి లలో కలిసివున్నాయి.మరి రాయలసీమకు ఒరిగిందేమిటో రాయ లసీమ నాయకులు సమాధానం చెప్పాలి. 1983లో ప్రారంభ మైన తెలుగుగంగా పథకం ద్వారా చెన్నై నగరానికి ఐదు టిఎం సిలు (ఆంధ్రద్రేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు వాటాప్రకారం) 3.21 లక్షల ఎకరాలకు రాయలసీమలోని పంటలకు సాగునీరు కల్పించాలని ఉద్దేశించారు. తెలుగుగంగా కాలువ శ్రీశైలం జలా శయం నుండి 29, కృష్ణానది నికర జలాల నుండి 15 టిఎం సిలను తీసుకుంటుంది.ఈ కాలువ పొడవు 408కి.మీగా ఉంది.
1989లో ప్రారంభమైన హంద్రి -నీవా పథకం ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. శ్రీశైలం జలాశయం ఉపరితల భాగం లో కర్నూలు జిల్లాలోని మాల్యాల గ్రామం వద్ద ప్రధాన కాలు వగా ప్రారంభమై 740 కి.మీ ప్రవహించి చిత్తూరు జిల్లాలోని నీవా నదిలో కలుస్తుంది. శ్రీశైలం రిజర్వాయరులోని వరదనీటి నుండి 40 టిఎంసిలను కేటాయించారు. దీనిద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేసారు. 19 89లో ప్రారంభించిన మరో పథకం గాలేరు -నగరి సుజల స్రవంతి. శ్రీశైలం రిజర్వాయరు నుంచి 38 టిఎంసిల వరదనీరు కేటాయింరు.  మొదట్లో 18 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు రూప కల్పన చేసి, తర్వాత 8కే కుదించారు. గోరుకల్లు వద్ద ప్రారం భమై నగరి వద్ద కుశస్థలి నదిలో కలుస్తుంది. అలాగే శ్రీశైలం రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో నందికొట్కూరు దగ్గరలోని పోతిరెడ్డిపాడు అనే గ్రామం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం జరిగింది. దీన్నుండే తెలుగు గంగా, గాలేరు -నగరి, హంద్రి - నీవాల నుండి రాయలసీమకు కేటాయించిన 102 టిఎంసిలు రావాల్సిఉంది. దీని నిర్మాణం 11,500 క్యూసెక్కు లుగా నిర్ధారించారు. అన్ని పథకాలకు శ్రీశైలం రిజర్వాయర్‌ నుండే నీటిని తీసుకురావాల్సి ఉన్నందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచాల్సి ఉంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ అడుగుభాగం మట్టం 841 అడుగులు. శ్రీశైలం రిజర్వాయర్‌ నిండితే, లెవల్‌ 885 అడుగులు. నిజానికి కనీస ట్రేడౌన్‌ లెవల్‌ 834 అడుగులు ఉండాలని జి.వో 69 చెప్తుంది. రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచడానికి కోస్తా,తెలంగాణ నాయ కులు ఒప్పుకోవడంలేదు. తెలంగాణ విడిపోతున్న చారిత్రక సందర్భంలో సమైక్య రాష్ట్రంలో మన నీటి వాటాను కోల్పోయిన నేపథ్యంలో రాయలసీమ నీటి వాటా గురించి కచ్చితంగా అడ గాల్సిన అవసరం రాయలసీమ ప్రజలకు ఎంతైనా ఉంది.
Vaartha daily 17-09-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...