Sunday, December 24, 2017

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన సామినేని ముద్దునరసింహం నాయుడు తన వ్యాసాలను 'ప్రమేయాలు'గా పేర్కొన్నాడు. బందరు నుండి వెలువడే 'హితవాది' పత్రికలో 1842 నుండి 1847 వరకు ఇవి ప్రచురిత మయ్యాయి. 1862లో 'హితసూచిని' పేర అవి పుస్తకంగా  వెలువడినాయి. హేతువాద దృక్పథంతో, సంఘసంస్కరణ ఇతివృత్తంగా ఈ వ్యాసాలు కొన సాగాయి. లభిస్తున్న ఆధారాలలో తెలుగు వ్యాసరచయితలలో వీరు ప్రథములు. తరువాత తరాలకు మార్గదర్శకులు కూడా.
ఏదైనా ఒక విషయాన్ని వివరించి రాయటమే వ్యాసం. విషయ ప్రధానంగా, సులభంగా అర్థమయ్యేలా, సంగ్రహంగా రాయటం వ్యాస ప్రధాన లక్షణం. ఫ్రెంచ్‌ రచయిత మాంటెన్‌ 1571లో తాను రాసిన వచన రచనకు ఫ్రెంచ్‌భాషలో 'ఎస్సె' అని పేరు పెట్టాడు. ఫ్రాన్సిస్‌ బేకన్‌ దీనిని స్వీకరించి ఆంగ్ల సాహిత్యంలో ఈ ప్రక్రియను విస్తృతపరిచాడు.
తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన సామినేని ముద్దునరసింహం నాయుడు తన వ్యాసాలను 'ప్రమేయాలు'గా పేర్కొన్నాడు. బందరు నుండి వెలువడే 'హితవాది' పత్రికలో 1842 నుండి 1847 వరకు ఇవి ప్రచురిత మయ్యాయి. 1862లో 'హితసూచిని' పేర అవి పుస్తకంగా  వెలువడినాయి. హేతువాద దృక్పథంతో, సంఘసంస్కరణ ఇతివృత్తంగా ఈ వ్యాసాలు కొన సాగాయి. లభిస్తున్న ఆధారాలలో తెలుగు వ్యాసరచయితలలో వీరు ప్రథములు. తరువాత తరాలకు మార్గదర్శకులు కూడా.
విజయనగరానికి చెందిన పరవస్తు వెంకటరంగాచార్యులు 1872లో 'సంగ్రహం' పేరుతో వ్యాసాలు రాశాడు. భారతీయ మత, సాహిత్య అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. పోతం జానకమ్మ తన ఇంగ్లాండు పర్యటన గురించి వ్యాసరూపకంగా 1874లో 'ఆంధ్రభాషా సంజీవని' పత్రికలో వ్యాసాలు రాశారు. బెంగుళూరులో ఆంధ్రోపాధ్యాయులుగా ఉండిన జీయర్‌సూరి 1875లో వ్యాసాలను రాసి ' స్త్రీ కళాకల్లోలిని' పేర వ్యాససంపుటిని ప్రచురించాడు. స్త్రీల కు సంబంధించిన అంశాలే ఇందులో ప్రధానంగా ఉన్నాయి.

ఆధునిక వ్యాసనిర్మాణానికి నిర్ధిష్ట రూపం తీసుకువచ్చి సంఘసంస్కరణ, సమాజ చైతన్యం ఇతివృత్తాలుగా దాదాపు రెండువందలకుపైగా కందుకూరి వీరేశలింగం పంతులు వ్యాసాలు రాశాడు. 1875 నుండి 1879 వరకు వివిధ పత్రికలలో వీరి వ్యాసాలు 'ఉపన్యాసాలు' గా ప్రచురించారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, కందుకూరి వీరశలింగం గారి వ్యాసాలను విమర్శిస్తూ అనేక వ్యాసాలు రాశాడు. అవి 1910లో పుస్తకాలుగా వెలువడ్డాయి. ఫ్రాన్సిన్‌ బెకన్‌ ఉపన్యాసాలను 'బెకన్‌ ఉపన్యాసములు' గా 'కిళాంబి రామానుజచార్యులు' తెలుగు లో అనువాదం చేశారు. 1900 నుండి వ్యాసమనే పేరు తెలుగులో వాడుకలో ప్రారంభమైంది. 1901లో పి.ఎ.ప్రణతార్థి హరిశాన తన వ్యాస సంపుటికి 'వ్యాసమంజరి' అని 'వ్యాసం' పదాన్ని ప్రయోగించాడు.
    భాష, సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, సామాజికఅంశాలు తదితర విభిన్న రంగాలలో తొలితరం వ్యాసకర్తలుగా పైన పేర్కొన్నవారితో పాటు మానవల్లి రామకృష్ణ కవి, చిలుకూరి వీరభద్రారావు, కోరాడ రామకృష్ణయ్య, వేలూరి శివరామశాస్త్రి, వేదం వెంకటరామయ్య శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, బండారు తమ్మయ్య, గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ అప్పారావు, జయంతి రామయ్య, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కొమర్రాజు లక్ష్మణరావు, అచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ , నడుకుదుటి వీరరాజు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వేంకటరమణయ్య, కందూరి ఈశ్వరదత్తు, ఖండవల్లి లక్ష్మీ రంజనం, సురవరం ప్రతాపరెడ్డి, మట్నూరు కృష్ణారావు, చిలుకూరి నారాయణ రావు, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పప్పూరు రామాచార్యులు తదితరులెందరో కృషిచేశారు.
    1835 నుండి 'తెలుగు పత్రిక'లు ప్రారంభమయ్యాయి. తొలిదశలో మత, సాంప్రదాయ అంశాలకు పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. 19వ శతాబ్ధం చివరి దశ నుండి పత్రికలలో సంఘసంస్కరణ, భాష, సాహిత్య, చారిత్రక రాజకీయ, జాతీయోద్యమ తదితర అనేక అంశాలు వ్యాసాలుగా రావడానికి అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి.
తెలుగు సాహిత్యంలో వ్యాసాలు అనగానే అప్రయత్నంగా గుర్తుకు వచ్చేది పానుగంటి లక్ష్మీనరసింహారావు వారి 'సాక్షి వ్యాసాలు'. రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో 1865 సంవత్సరాన జన్మించిన పానుగంటి లక్ష్మీనరసింహారావు బి.ఏ.చదివి, ఉపాధ్యాయుడిగా, లక్ష్మీనరసాపురం ఎస్టేట్‌ దివాన్‌గా, పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా కొనసాగారు. నాటక రచయితగా తెలుగు సాహిత్యంలో వీరు ప్రముఖ స్థానం పొందారు. 1913లో తన నలభై ఎనిమిదో యేట 'సాక్షి వ్యాసాలు' ను 'సువర్ణలేఖ' వారపత్రికలో ప్రకటించడం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు అవి కొనసాగాయి. తిరిగి 1920,1922లలో, 1927,1933 సంవత్సరాలలో 'ఆంధ్రపత్రిక' సారస్వతానుబంధాలలో 'సాక్షి వ్యాసాలు' ప్రచురితమవుతూ వచ్చాయి.
    ఆంగ్లసాహిత్యంలో 'రిచర్డ్‌ స్టీల్‌' 1709 ఏప్రిల్‌ 12 నుండి 1711 జనవరి 2 దాకా రెండేళ్లపాటు వారానికి మూడు రోజులు 'టాట్లర్‌' వ్యాసాలను పత్రికగా కొనసాగిస్తూ ప్రచురించాడు.  తరువాత కాలంలో జోసెఫ్‌ అడిసన్‌తో కలిసి 1711 మార్చి 1 నుండి 1712 దాకా 'స్పెక్టేటర్‌' పేరున దినపత్రికగా వ్యాసాలను ప్రచురించారు. 1914లో స్టీల్‌తో సంబంధం లేకుండా అడిషన్‌ వారానికి మూడు రోజుల పాటు 'స్పెక్టేటర్‌' పత్రికను ఆరునెలల పాటు నడిపాడు. ఈ మొత్తం వ్యాసాలు ఎనిమిది సంపుటాలుగా తరువాత కాలంలో ప్రచురించ బడినాయి. ఆనాటి సాంఘిక దురాచారాలు, సామాజిక స్థితిగతులను ఇవి తెలియజేస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ఈ వ్యాసాలకు విశేషప్రధాన్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఈ వ్యాసాలు ప్రభావితం చేశాయి.
పానుగంటి లక్ష్మీనరసింహారావు కూడా ఈ వ్యాసాలతో ప్రభావితుడై 'స్పెక్టేటర్‌' పేరునే 'సాక్షి'గా అనువదించుకొని వ్యాసాలను ప్రచురించాడు. 'సాక్షి వ్యాసాల'లో తెలుగు దేశీయతే ప్రధాన జీవంగా కొనసాగాయి. గ్రాంధిక భాషలో సాగిన మొత్తం నూటాయాభై సాక్షి వ్యాసాలలో సంఘసంస్కరణ, మూఢవిశ్వాసాల ఖండన, దేశీయత, దేశాభ్యుదయం, లోకవ్యవహారాలు, భాషా,సాహిత్య, సాంస్కృతిక, సమకాలీన సమాజం తదితర అనేక అంశాలను అవి ప్రతిబింబిస్తాయి. అధిక్షేపంగా, వ్యంగ్యంగా, హాస్యాత్మకంగా ఇవి కొనసా గాయి. సాక్షి వ్యాసాలు ఉపన్యాసరూపకంగానూ, అయిదుగురు సాక్షి సంఘ సభ్యుల మధ్య సంభాషణల రూపంగాను, లేఖల రూపంగాను నడుస్తాయి. వ్యాసంలో ఉపన్యాసశైలి కొనసాగించటం వలన విషయంపట్ల పాఠకులలో మరింత ఆసక్తి కలిగించ వచ్చని ఆ పద్ధతిలో రాసి ఉండవచ్చు. పద్యం రాసినవాడే కవిగా గుర్తింపు పొందుతున్న ఆ రోజులలో గద్యం రాసి పండిత పామరుల చేత పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు మెప్పు పొందారు.
1917కు ముందు దాకా తెలుగు సాహిత్యంలో వ్యాసప్రక్రియ వికాసం పత్రికల ఆధారంగా ఆయా వ్యక్తులుగా చేసిన కృషిగా కనిపిస్తుంది. అందుకు భిన్నంగా 1917 ఆగస్టు 1 నుండి అనంతపురం పట్టణం కేంద్రంగా 'స్టూడెంట్స్‌ క్లబ్‌ అనంతపురం' పక్షాన విద్యార్థులు సమిష్ఠిగా 'వదరుఁబోతు' పేరున వ్యాసాలను  కరపత్రాల రూపంలో ప్రచురించడం ప్రారంభించారు. 1709లో 'రిచర్డ్‌ స్టీల్‌' ప్రచురించిన 'టాట్లర్‌' పేరును 'వదరుఁబోతు'గా అనువదించుకొని ఈ విద్యార్థులు  ప్రచురించారు. ''ఈ వ్యాసకర్తలు ఆ మొదటి  'సాక్షి' (1913) పేరును తెలిసియుండలేదని స్పష్టముగాఁ జెప్పవచ్చును .కావున 1917లో 'వదరుఁబోతు'  జననమునకు 'సాక్షి'తో నేసంబంధమును లేదనుట నిక్కము '' అని 1932లో పుస్తక రూపంలో వెలువడిన 'వదరుఁబోతు' పీఠికలో పేర్కొన్నారు. 1913 నాటి 'సువర్ణలేఖ' పత్రికలు వీరి దృష్టికి వచ్చి వుండక పోవచ్చు. ఒకవేళ వచ్చినా తప్పులేదు. 'సాక్షివ్యాసాలు' నలభైఎనిమిది సంవత్సరాల పండితుడు రాసినవి, పత్రిక ఆధారంగా వెలువడినవి. వదరుఁబోతు వ్యాసాలు ఇరవైలలోని విద్యార్థులు, యువకులు రాసి కరపత్రాల రూపంలో వెలువడినవి. దేని ప్రాధాన్యత దానిదే!. అదే పీఠికలో ''చేతడబ్బు ఎక్కువలేక, అధికారములేమియూ లేక యున్నవారు ఆ కాలములో పక్షమునకొకతూరి క్లుప్తముగా నాలుగైదు పుటల వ్యాసమును ముద్రింపించు భగీరథ ప్రయత్నమాపని, చేసినవారు తప్ప నితరులెఱుఁగలేరు. ఎట్లో కష్టపడి ముద్రింపించి వ్యాసములను కాలణాకొకటిగా వీధిలో అమ్మి, పోస్టు ఖర్చులు పెట్టుకొని బైటి కెందఱకో  ఉచితముగా పంపి, ఎన్నో ప్రతులు తిరిపెము పంచి, సుమారు రెండేండ్లకు మించి దీనిని నడిపి తుదకు సుప్రసిద్ధ కారణములచేత, వదరుఁబోతు వాయి మూసికొనెను'' అని పేర్కొన్నారు. దీనిని బట్టి వీరి శ్రమ అర్థమవుతుంది. 'సాక్షి','వదరుఁబోతు' వ్యాసకర్తలిరువురూ 'స్పెక్టేటర్‌, టాట్లర్‌' వ్యాసరచనల ధోరణికి ప్రభావితమైనవారే. చిన్నవయసులోని విద్యార్థులు, యువకులు సమిష్ఠిగా కరపత్రాల రూపంలో 'వదరుఁబోతు' వ్యాసాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తూ సమాజమార్పే ఆశయంగా కొనసాగించడం ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన అంశం.

'వదరుఁబోతు' వ్యాసాల ప్రచురణలో క్రియాశీలక బాధ్యత, బరువు మోసింది పప్పూరు రామాచార్యుల వారు.1896 నవంబర్‌ 8న అనంతపురంలో  రామా చార్యులు జన్మించారు. ప్రాథమిక విద్య ఇక్కడే కొనసాగింది. తన బావగారైన కుంటిమద్ది రంగాచార్యులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాలలో  అధ్యాపకుడిగా  ఉద్యోగం చేస్తుండడంతో అక్కడ వారి ఇంటనే ఉంటూ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసారు. అప్పటికి రామాచార్యుల వయస్సు పదహేడు సంవత్సరాలు. తన బావగారి ద్వారా వీరేశలింగం పంతులుగారితో పప్పూరు రామాచార్యులవారికి కొంత పరిచయం కూడా ఉండేది. రాజమహేంద్ర వరంలోని సాహిత్య, సంఘసంస్కరణ తదితర అంశాల పట్ల కొద్దోగొప్ప పరిచయం రామాచార్యులకు కలిగి ఉంటాది. 1914-1916లలో ఇంటర్మీడి యట్‌ను మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో చదివాడు. పత్రికలు, ఆంగ్ల సాహిత్యం, దేశ వర్తమాన స్థితిగతుల పట్ల అవగాహన విస్తరించడానికి మద్రాసు వాతావరణం వీరికి తోడ్పడింది. 1916లో అనంతపురంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రారంభమైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తదితర పండితులు ఈ కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఉన్న ఊర్లోనే చదువుకోవచ్చని 1917లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బి.ఏ. కోర్సులో చేరాడు. ఈ సమయంలోనే తన ఇరవయ్యేవయేట పప్పూరు రామాచార్యులు తన సహచరులు, మిత్రులు, యువకుల సహకారంతో 'వదరుఁబోతు' వ్యాసాలను ప్రచురించడం మొదలు పెట్టారు.

పదిహేను రోజులకొకసారి 1/8 సైజులో నాలుగు పుటలుగా వదరుఁబోతు కరపత్రం వెలువడేది. కరపత్రం పైభాగానా క్రమసంఖ్య, తేది, వెలతో పాటు 'వదరుఁబోతు' అని ప్రధాన శీర్షిక ఉండేది. 'పబ్లిష్డ్‌ బై ... స్టూడెంట్స్‌ క్లబ్‌ అనంతపురం' అని ఉండేది. ప్రతి కరపత్రం ప్రారంభంలో ఆంధ్రభారతములోని...

గీ|| కార్యగతుల తెఱఁగుగల రూపుచెప్పిన

నధికమతులు దాని నాదరింతు

రల్పబుద్ధులైన యట్టివారలకది

విరసకారణంబు విషము వోలె'' అనే పద్యం ప్రచురించేవారు.

వదరుఁబోతు వ్యాసం చివరన ఆ వ్యాస రచయితలకు గుర్తుగా వారి పేర్లలోని ఒక అక్షరం సంకేతంగా ప్రచురించేవారు. వ్యాసం చివరలో వ్యాసాంశానికి అనువైన సూక్తియో, శ్లోకమో, పద్యపాదమో ప్రచురించేవారు. స్వామివిలాస ప్రెస్‌-అనంతపురం అని ప్రెస్‌వారి పేరు ఉండేది. ఇది వదరుఁబోతు కరపత్రం బాహ్య స్వరూపం.

మొత్తం రెండేండ్ల కాలంలో యాభై వ్యాసాలు ప్రచురించగా అందులో హిందూపురంలోని పక్కా గురురాయాచార్యుల వద్ద లభ్యమైన ఇరవై రెండు వ్యాసాలను 1932లో వదరుఁబోతు పుస్తకంగా సాధన ముద్రణాలయం పక్షాన ప్రచురించారు. పప్పూరు రామాచార్యులవారే ఈ ముద్రణాలయం నిర్వాహకుడు. అందులో ఇరవై వ్యాసాలు వదరుఁబోతు కరపత్రాలు కాగా రెండు వ్యాసాలు పినాకిని పత్రికలో ప్రచురితమైనవి ఉన్నాయి. ''కర్తలు స్థలాంతరములకుఁ బోయి కార్యాంతరములకుఁ జిక్కి పోవుటచేతను, ఒకతూరి వ్రాసి పంచి పెట్టుటచేత తాము తలపెట్టిన పనియైనది గావున నీవ్యాసములను భద్రపఱచి యుంచ వలసినంత యక్కర వారి కంతగా లేకపోవుట చేతను పై వ్యాసములలో ననేక ములు దుర్లభములైనవి'' అని పీఠికలో పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా  ఎంత ప్రయత్నించినా మిగతా ముప్పై వదరుఁబోతు వ్యాసాలు నాకు లభించలేదు. రాయలసీమలో స్వాతంత్య్రం  పొందేనాటికి దాదాపు యాభై పత్రికలు వెలువడినాయి. వాటిలో మనకు ఒకటిరెండు మాత్రమే లభ్యమవు తున్నాయి. కనీసం యాభై ఏళ్ల క్రిందట సీమవాసులు ప్రచురించిన పుస్తకాలు కూడా నేడు అలభ్యాలుగా ఉన్నాయి. వీటిపట్ల సీమవాసులు బాధ్యతగా వ్యవహ రించి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే గత కాలానికి సంబంధించిన ఎంతో విలువైన  సమాచారం  చేజేతులా పోగొట్టుకున్నవారమవుతాము. తమ వద్ద ఉన్న పాతపత్రికలు, పుస్తకాలు అటకలమీదికి ఎక్కించి బూజు, చెదలు పట్టించుట కంటే, గుప్తధనంగా దాచుకొనేకంటే వాటిని లోకానికి వెల్లడిచేయటం ద్వారా, వెల్లడించేందుకు ప్రయత్నించే పరిశోధకులకు తోడ్పడటం ద్వారా రాయలసీమకు మహోపకారం చేసిన వారవుతారు.

కరపత్రాలుగా వెలువడినప్పుడు వదరుబోతు వ్యాసాలకు శీర్షికలు లేవు.1932 ముద్రణలో చదువరులకు అనుకూలంగా ఉండేందుకు ప్రతి వ్యాసానికి శీర్షికలు ప్రకటించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక రాసారు. ప్రచురణ కర్తలు ఇచ్చిన సమాచారం మేరకు మొదటి కరపత్రాల సంఖ్య ప్రకారం, ఏడవ నెంబరు కరపత్రం 1917 నవంబర్‌ 1న వెలువడినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి మొదటి కరపత్రం 1917 ఆగస్టు 1న వెలువడి వుంటుంది. ఏడవ నెంబరు కంటే ముందువి నాలుగు, ఐదు, ఆరు మాత్రమే లభించాయి. ఒకటి, రెండు, మూడు కరపత్రాలు లభించలేదు. ఇరవైరెండవ కరపత్రం 1917 సంవత్సరం అని మాత్రమే పట్టికలో చివర ఇచ్చారు. ఈ కరపత్రం ఎనిమిదోవ నెంబరు 1917-11-15న దీపావళి సందర్భంగా ప్రకటించబడి వుంటుంది. మొత్తం యాభై కర పత్రాలలో ఇరవై మాత్రమే లభించాయి, మొదటి మూడు, పదహేనవ మరియు చివరి ఇరవైఆరు కరపత్రాలు లభించలేదు. చివరి కరపత్రం 1919 ఆగస్టు 30న వెలువడి ఉంటుంది.

1932 నాటి 'వదరుఁబోతు' పుస్తక పీఠికలో ''ఇదిగాక ఇంచు మించుగా నీ'వదరుబోఁతు' జన్మించిన కాలమందే గుంటూరు నుండి కాఁబోలు నొక్కరు ఇట్లే కొన్ని వ్యాసములు ప్రకటించుచుండిరి. వాని పేరు ప్రకృతము మఱచితిమి. ఎట్లో వారు మకుటముగా నుంచుకొని యుండిన ఈ క్రింది పద్యమొకటి జ్ఞప్తిలో నిలిచినది.

తే. 'ఉద్ధరించెద దేశమేనొక్కరుఁడనె

నిక్కమియ్యది చేయంగ నేర రొరులు

అనుచు విలియము పిట్టను నతఁడు పలికె;

అట్లెయందఱుఁ దలఁచిన నగును శుభము'.

గుంటూరు మిత్రు లొక్కరివద్ద నీ వ్యాసపత్రములు రెండుండఁగాఁ జూచియుంటిమిగాని యితరులీప్రాంతములలో నెవరును వాని నిదివఱకు కనియెఱుఁగరు. వినియెఱుఁగ రన్నను తప్పులేదు'' అని ప్రకటించారు. 1935 నాటి 'వదరుఁబోతు' పుస్తకం పునర్ముద్రణలో పై గుంటూరు వ్యాసపత్రాల సమాచారం తొలగించి ప్రచురించారు. ఆధారాలు లభించని సమాచారం రెండవ ముద్రణలో అవసరం లేదని భావించి ఉండవచ్చు. వీటిపై పరిశోధకులు దృష్టి పెడితే అవి కూడా లభించవచ్చు.

్జ్జ్జ

ఈ వ్యాసాలు పరోపకార గుణం, విలువలతో కూడిన విద్య, గ్రంథాలయాలు, కళాశాలల ఆవశ్యకత, దేశాభ్యుదయం, సహజస్వభావశక్తి విశిష్టత, స్వదేశీ వస్తూత్పత్తి, మూఢ మతభక్తి నిరసన, అనర్హగౌరవం, కీర్తికండూతి, ఆడంబర జీవనం, అనవసర ధనవ్యయం, పరాయిసంస్కృతి, పరాయి అనుకరణ వ్యతిరేకత, హాస్యం ఆవశ్యకత, సత్యసంధత, కవిత్వ నాటకతత్త్వం, తెలుగు సంస్కృత సాహిత్యాల వికాసం, ఇలా మానవ ప్రవృత్తికి, సమాజ పోకడలకు సంబంధించిన అనేక అంశాల నేపథ్యంగా 'వదరుఁబోతు' వ్యాసాలు సాగుతాయి.

    వ్యాసాంశానికి లోబడి ఏమాత్రం సంగ్ధిత లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం వీరి ప్రత్యేకత. ఆయా సందర్భాలలో కొన్ని వ్యాక్యాలను గమనిస్తే వీరి ప్రాపంచిక దృక్పథం అర్థమవుతుంది.

''సుగుణ దుర్గుణములకు లింగ వ్యవస్థ యుండదు'',

''క్షుద్రజంతువులును తమ భోక్తను దప్ప యితర మృగములను ద్వేషింపవు. మనుజుఁడన్ననో స్వభావము చేతనే సర్వజంతువులను ద్వేషించును''.

''సంఘమునకుఁ జెఱుపుఁ గలిగించు కార్యములనే గదా వారు నరక హేతువు లగు పాపకార్యములనుట. మనకుఁ జేతనైనంత మట్టున కితరులకు మేలు చేయుచు, సంఘమున కేవిధమగు కీడుఁగలిగింపక నలుగురిలో సజ్జనుఁడని పించుకొన్నచో''

''భావనా శిల్పముల నెఱంగక వ్రాయఁబడు కవితకును గవితయను పేరు చెల్లునేని,యిఁక ప్రపంచమున నూటికి నూరువంతులు కాళిదాసులే యగుదురు గదా? అపుడాడిన మాటలన్నియు నాశుధారలై పాడిన పాటలెల్ల ప్రబంధము లగును''

''అన్ని నీతి శాస్త్రములయు, అన్ని ధర్మశాస్త్రములయు, అన్ని మతగ్రంథములయు సార మీ సత్యసంధతమే. అది లేక యుండెనా మానవుఁడెంత పండితుఁడైనను, ఎంత యాచారవంతుఁడైనను ఏవగింపఁదగిన వాఁడే. 'సత్యము సర్వశ్రేయో మూల'మని పెద్దలే నుడివి యున్నారు''

''యోగ్యత ననుసరించి గౌరవము తనంత రావలయుఁగాని, కొలఁదికి మీఱి యపేక్షించినంత రాదనుట ధ్రువము''

''తెలియని మతములకై యర్థముకాని గ్రంథములఁ జదివి రానిపోని స్వర్గసుఖమున కర్రులు సాచుటకన్న మనయింట మనయూర, మన దేశమున, మన సంఘమున, మన జీవితముల నుపయుక్త ములుగఁ జేయుట మిగుల ముఖ్యమని నాయాశయము ''

''సామాన్య ధర్మములలో రుచిలేక విశేషధర్మము లెఱుఁగక యందు నిందుఁ గొఱగాని యవివేకులగు చదివినవారికన్న నపండితుఁడేమేలని ప్రపంచ తత్వవేత్తల మతము''

''ధనమును మితిలేక వెచ్చించి బాణములగొని తమ ధనుర్విద్యనంతయు నాపయింబెట్టి తగులఁబెట్టినచో వీరికేమి ఫలము? నాకై పాడు చేసిన ద్రవ్యమున  సగబాలుతో నూరూర మంచి గ్రంథాలయములగునే? ఇట్టి ధనమంతయు ప్రోగుచేసినచో నొక గొప్ప జాతీయకళాశాల యేర్పడదా? దేశము బాగుపడదా? ఏమి మౌర్ఖ్యమిది! ఆ బాణములైన తమంత జేసికొను శక్తి వీరికి లేదే ? ఏ జపానుతల్లియో, ఏచీనా సోదరుఁడో, తయారుచేసి వీరికి భిక్ష మివ్వవలసి యుండుటకైన వీరు సిగ్గుపడరు గదా''!

ఈ విధంగా తామనుకున్న భావాలను, నమ్మిన సత్యాలను గొంకు జంకు లేకుండా ప్రకటించడం అనాటికి గొప్ప విషయమే.

ఈ వ్యాసాలు ఉత్తమ పురుషలోను, ఆత్మస్వగతంగా చెబుతున్నట్లు, సర్వసాక్షి దృష్టికోణంగా, సందేశాత్మకంగాను కొనసాగుతాయి. వ్యాసాల ఎత్తు గడలో, విషయచర్చలో,

ఉపపత్తుల సమీకరణలో, ముగింపులలో ఇలా అన్ని సందర్భాలలో నిర్మాణ నైపుణ్యం భావితరాలు అనుసరించదగ్గవి.వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకొనేవారికి నమూనాగా ఈ వ్యాసాలు తోడ్పడుతాయి. అందుకే 1950వ దశకంలో ఉన్నతపాఠశాలల తెలుగు పాఠ్యపుస్తకాలలో 'వదరుఁబోతు' వ్యాసాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి దాకా పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 'వదరుఁబోతు' వ్యాసాల పీఠిక పాఠ్యాంశంగా ఉండింది.

''సుమారు రెండేండ్లకు మించి దీనిని నడిపి తుదకు సుప్రసిద్ధ కారణములచేత వాయి మూసుకొనెను'' అని పీఠికలో ప్రచురించారు. అలాంటి సుప్రసిద్ధ కారణములు పరిశోధకులు ఆలోచించాలి. పత్రిక నిర్వహణ వ్యయం కష్టమవటం, వ్యాసకర్తలైన విద్యార్థులు చదువులో నిమగ్నం కావటం, వ్యాసకర్తలు ఉద్యోగాలలో కొనసాగుతుండటం, ఈ వ్యాసాలపట్ల ఆనాటి ప్రభుత్వాల నిఘా ఇలా కారణాలేవైనా ఉండవచ్చు. చివరి పత్రికలు లభించివుంటే మరింత సమాచారం దొరికేది. ఎట్టకేలకు 1919 ఆగస్టు 30కి 'వదరుఁబోతు' వాయి మూగబోయింది.

'వదరుఁబోతు' ప్రచురణకరైన పప్పూరు రామాచార్యులు 1920లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగానే అనంతపురం కలెక్టర్‌ కచేరిలో చిన్న ఉద్యోగం వచ్చింది. స్వతంత్య్రంగా జీవించాలన్న ఉద్దేశంతో 1921 మార్చి నెలలో ఆ ఉద్యోగం మానివేసారు. ఉద్యోగమైతే మానివేశారుగానీ ఆ తరువాత ఏపని చేయడానికి అవకాశాలు దొరకలేదు. కైప సుబ్రహ్మణ్యశర్మ గారి తోడ్పాటుతో ఇల్లూరు గ్రామంలోని నీలం చిన్నపరెడ్డి కుమారులకు చదువు నేర్పడానికి బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్లకు ఆ గ్రామ కరణం ఐతరాజు నరసప్ప మరియు కైప సుబ్రహ్మణ్యంలతో కలిసి 1922 సెప్టెంబర్‌ 16న 'పినాకిని' పేరున పత్రికను అనంతపురం కేంద్రంగా ప్రచురించడానికి పప్పూరు రామాచార్యులు సిద్ధమయ్యారు. ఆ పత్రికకు 'స్వరాజ్యోదయం' అనే పేరు పెట్టాలని చర్చకు రాగా 'స్వరాజ్యోదయం అనే పేరు కంటే దత్తమండలాలకన్నిటికీ జీవప్రధాయిని అయిన పినాకిని (పెన్నానది)'' పేరు మీదనే పత్రిక నిర్వహిం చాలని రామాచార్యులు చొరవ తీసుకున్నారు.

ఆనాటికే రాయలసీమ ప్రాంతం ఔన్నత్యం, అస్తిత్వానికి సూచకంగా ఈ పేరు ఉంచటం ఆయనకీ ప్రాంతంపట్ల ఉన్న అభిమానం, బాధ్యతను తెలియజేస్తాయి.  'వదరుఁబోతు' వ్యాసాలు ఎంత సార్వజనీనమైనప్పటికీ అందులో స్థానీయ అంశాలు కూడా కనిపిస్తాయి. పినాకిని, కరువుల, జొన్నంబడి, కొర్రకూటికి తదితర ప్రస్తావనలు ఈ ప్రాంత జీవితంతో ముడిపడినవే. 'వదరుఁబోతు' వ్యాసాల పరంపరలోనే పినాకిని పత్రికలో 1922లో రెండు వ్యాసాలను ప్రచురించారు. అవి కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మరిన్ని వ్యాసాలు పినాకినిలో ప్రచురించి ఉంటారు. ఆ పత్రిక అలభ్యంగా ఉంది. 1920లో ఆదోని కేంద్రంగా సి.శ్రీనివాసరావు సంపాదకత్వంలో 'అరుణోదయం' పత్రిక, 1922లో అనంతపురం కేంద్రంగా అనంతగిరి వీరనార్యకవి సంపాద కత్వంలో  'బాలభారతి', 1925లో అనంతపురం కేంద్రంగా యం.సుందరమ్మ సంపాదకత్వంలో 'భారత మహిళ', 1927లో పత్తికొండ కేంద్రంగా వనం శంకరశర్మ సంపాదకత్వంలో 'ఇంద్రావతి' తదితర పత్రికలు రాయలసీమ ప్రాంతంలో వెలువడినాయి.  ఈ పత్రికలలో 'వదరుఁబోతు'  కోవ వ్యాసాలు ప్రచురించి వుండే అవకాశముంది. పరిశోధకులు అలభ్యాలుగా ఉన్న ఆ పత్రికలను అధ్యయనం చేయాల్సి ఉంది.

పినాకిని పత్రిక మూడున్నరేళ్ల పాటు కొనసాగి నిర్వహణ వైరుధ్యాలవల్ల 1926 మార్చి నాటికి ఆగిపోయింది. పినాకిని పత్రిక దూరం కావటం కన్నబిడ్డకు దూరమైనంత బాధగా ఉందని పప్పూరు రామాచార్యులు వాపోయారు.  పినాకిని పేరునే పత్రికను నడపాలని ఎంతో ప్రయత్నించినా చట్టరీత్యా అది సాధ్యపడ లేదు. ఎట్టకేలకు తన ముప్సైయ్యోవ యేట తాను సంపాదకుడుగా, తన  మిత్రుడైన కర్నమడకల రామకృష్ణమాచార్యులు సహాయ సంపాదకుడుగా 'సాధన' పత్రికను వారపత్రికగా పన్నెండు పుటలతో ప్రచురించడం ప్రారంభించారు. 'వదరుబోతు'లో లాగే ప్రతి సాధన పత్రిక సంచికలోనూ భారతంలోని 'కార్య గతుల' పద్యం ప్రచరరించేవారు. 1972 దాకా నిర్విఘ్నంగా 46 సంవత్సరాల పాటు పప్పూరు రామాచార్యులు సాధన పత్రికను నడిపారు.

'వదరుబోతు' స్ఫూర్తితో అదే పంథాలో సాధన పత్రికలో విభిన్న వ్యాసాలకు విశేష ప్రాధాన్యతనిచ్చారు. పత్రికలో వార్తలు అరభాగం వుంటే వ్యాసాలు అరభాగముండేవి. సాక్షివ్యాసాలను అనుసరించి ఆదోనిలోని కొందరు యువకులు 'ఆదోని పురాణసంఘం'గా ఏర్పడి 1928 ఫిబ్రవరి 2 నుండి రాసిన మూడు వ్యాసాలను 'సాధన' పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు. ఈ వ్యాసాలు ఆనాటి స్త్రీల పరిస్థితులు, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, విధ్వంసమ వుతున్న విలువల గురించి తెలియజేస్తాయి. ఈ వ్యాసాలను కూడా ఈ పుస్తకంలోని అనుబంధంలో ఇవ్వడం జరిగింది. పప్పూరు రామాచార్యులు జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రాయలసీమ బాగోగుల కోసం వందల వ్యాసాలను సాధన పత్రికలో రాసాడు. రాసినవాళ్లవి ప్రచురించారు.ఈ ప్రాంత ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి పాటుపడ్డారు. ఈ విధంగా 'వదరుబోతు' జననంలోనూ, 'వదరుబోతు' కరపత్రాలను రాయడంలోను, ప్రచురణలలోను, వదరుబోతును పుస్తకంగా ప్రచురించడంలోనూ, వదరుబోతు స్ఫూర్తిని పినాకిని, సాధన పత్రికలలో కొనసాగించడంలోనూ పప్పూరు రామాచార్యులకు విడదీయరాని బంధం ఉంది. పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు 1986 సంవత్సరంలో 'వదరుఁబోతు'ను ప్రచురించారు.

ఈ సంవత్సరానికి 'వదరుఁబోతు' వందేళ్లు నిండిన సందర్భంగా నేటికీ ఆ వ్యాసాల ఆవశ్యకత ఉందని భావిస్తూ, నేటి విద్యార్థులకు, యువతకు మహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ 1932, 1935ల నాటి 'వదరుఁబోతు'  పుస్తక ప్రతుల ఆధారంగా ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాను. ఈ పుస్తక అనుబంధంగా పప్పూరు రామాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వదరుఁబోతు తొలి ముద్రణల ముఖచిత్రాలు, కరపత్రాలప్రతులు, ఆదోని పురాణసంఘం వ్యాసాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షివ్యాసాలలోని 'కర్నూలులోని కాటకం' వ్యాసాన్ని, రిచర్డ్‌స్టీల్‌-టాట్లర్‌, జోసఫ్‌ అడిసన్‌-స్పెక్టేటర్‌ ప్రతులను చేర్చడమైనది.

('వదరుబోతు' వ్యాస సంపుటి ముందుమాట నుండి సంక్షిప్తంగా)

Friday, April 14, 2017

విద్వాన్‌ విశ్వం గారి "పెన్నేటి పాట"కు శ్రీరాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి పీఠిక


రాయలసీమ నేడు అఖండాంధ్ర దేశములోని ఒక విశిష్టఖండముగా ఏర్పడియుండుటకు దాని యిప్పటి దరిద్రావస్థ
ముఖ్యకారణము. మైసూరు పర్వతాల అధిత్యకా భాగమై, అడుగడుగునను పెద్ద చిన్న కొండలు అడవులు కలిగి, ఎన్నో చిన్న పెద్ద నదుల వెల్లువలచే చల్లఁదనము కొల్ల పంటలు గలిగి, అపారమైన గోధనమును బోషించుచు సర్వసమృద్ధమై యొకానొకప్పు డుండినది. ఎన్నో చిన్నపెద్ద రాజ్యములకు రాజధానులకు చోటిచ్చిన దీ సీమ. పరిగి, హేమావతి, రాయదుర్గము, గుత్తి, పాగొండ, బళ్ళారి, మడకసిర, మధుగిరి మొదలగునవి అట్లుండగా, విజయనగరపు చక్రవర్తులకు వేసవికాలమందలి చలువరాజధానిగా ఎంతో కాల మాశ్రయ మిచ్చిన పెనుగొండ - ఘనగిరి, ఇందలిది. రామరాజభూషణుని నోరూరించిన 'దాడిమలతా లలితాంగు'లు, ఆకాలపు 'జటిల ద్రాక్షాగుళుచ్ఛంబులు' నేడును అక్కడ పుణ్యవంతులు చవిచూడవచ్చును. షష్టిపూర్తి చేసుకొన్న ఆ సీమవా రందరికి అక్కడి ప్రాచీన సమృద్ధిలో కొంతభాగ మైనను చిన్నతనమున అనుభవమునకు వచ్చియుండును. మఱి వారు దానిని మఱువలేరు.
ఆ వైభవ పరిశేషము క్రమముగా మావంటివారి కన్నుల యెదుటనే అంతర్ధానమైనది. అక్కడి లెక్కలేని చెఱువులలో ఎన్నో తెగిపోయినవి. ఉన్నవి ముప్పాతిక పూడిపోయినవి. మైసూరు రాజ్యమువారు పైనుండి దిగివచ్చు నదులకు వంకలకు చెఱువులు గట్టుకొని ఊట నడ్డగించుటచే నదులకు వాననీరు తప్ప వేఱునీరు లేకపోయినది. 'సరవ' అను పేర అంతర్గామినిగా శాఖోపశాఖలుగా ప్రవహించుచుండిన సరస్వతి వట్టి యిసుకపాతరగా మాఱినది. అందందు సహజముగా ఎగజిమ్ముచుండిన 'తలపరిగలు' - నీటిబుగ్గలు, వట్టివాయి విడుచుకొని క్రమముగ మన్నుమూసి కొన్నవి. అడవులన్నియు వంటచెఱకులై పొగబాఱి పోయినవి. పశుసంపద కటికవారి పాడైపోయినది. ఇఁక మనుష్యుల మాట చెప్పనేల? ఆంగ్లేయుల దొరతనములో ఈ సీమ యెన్నివిధముల ఎండవచ్చునో అన్నివిధములను ఎండినది; ఎండింపఁబడినది. ప్రజల పరవశత, అధికారుల అలక్ష్యము, ఇరుగు పొరుగులవారి స్వార్థపరత, వీనికి తోడు దైవము దయదప్పుట. ఇన్ని కలిసి నేటి రాయలసీమ రూపుగొన్నది. మఱి తోడి ఆంధ్రులే అధికారము అవకాశము గలిగినప్పుడు గూడ ఈసీమ యోగక్షేమములను గమనింపలేదు. సరిగదా, మీదుమిక్కిలి ఇది రాళ్ళసీమయని, అరణ్యమని, ఇక్కడివారికి చదువుసంతలు లేవని, వారు అనాగరకులని పరిహాసమును ఆక్షేపమును జేసినవారును కొంద రుండిరి. నేడును లేకపోలేదు. ఇది 'క్షతే క్షారమివాసహ్యం' అన్నట్లయినది ఆ సీమవారికి. ఇది ముఖ్యకారణముగా ఈ ఆంధ్రఖండమునకు 'రాయలసీమ' అని విభిన్ననామమును తాము ఇతరాంధ్రులతో చేరియుండ లే మనుభావము ఇందలి ప్రజలకును గలిగి వ్యాపించినది. ఆంధ్రరాష్ట్ర సాధనకు ఇది అడ్డుదగులు నేమోయను తీవ్రభయమును ఉండెడిది. కాని కొందఱు దూరదృష్టిగల మహనీయుల ప్రయత్నముచేత అట్లు జరుగలేదు. మా రాళ్ళపల్లికి సమీపమందలి పేరూరు అను గ్రామమువద్ద మల్పుదిరుగు పెన్నేటినడ్డగించి చెఱువు కట్టవలెనను భావము సర్కారువారికి ఏ మహనీయుడో సుమారు 55 సంవత్సరాలకు ముందు కలిగింపగా, ఆ పని మొన్న మొన్నటిదాకా రూపెత్తలేదని, నేటికిని పూర్తి కాలేదని తెలిసికొన్నవారికి ఈసీమ దైన్యమును, దీని గమనించిన సహృదయులకుఁ గలుగు నిర్వేదమును కొంత అర్థము కాగలవు.
నామిత్రులు విద్వాన్‌ శ్రీవిశ్వంగారి అట్టి తీవ్రనిర్వేదమే ఈ పెన్నేటి పాటగా పరిణమించినది. వాల్మీకి తనకు గలిగిన శోకము శ్లోకమయినదని చెప్పుకొన్నాడు. కాని వాల్మీకి మనుష్యత్వపరభాగమైన మహర్షిత్వమును సాధించుకొన్న మహాతపస్వి. కనుక అతని శ్లోకములలో మూలమైన శోకము ఎక్కువగా ప్రతిఫలించలేదు. శాంతి, దాంతి, శౌర్యము, వివేకము, దయ, ధర్మము, వింతలు, వినోదములు, ఇత్యాది భావములే యెక్కువగా నుండి ఆయన రచన ప్రశాంత మధురమైనది. విశ్వంగారిది మానవహృదయము. ఊహకన్న, భావనకన్న అనుభవమే మూలాధారముగా వెడలిన పరవశ రచన వీరి 'పాట.' నిర్వేదము తీవ్రమైనప్పుడు అన్ని నియమాలను చెల్లాచెదరుచేయు వేసటగా పనిచేయును. అది యీ 'పాట'లో కవిగారిని ఎన్నో ఆటలాడించినది.
ఈ దేశమునందలి ప్రాచీనవైభవము అంతయు ఒక దృశ్యముగా కన్నులకు దట్టి ఈ కావ్యతాండవమునకు నాందిగా ఒక సీసము ఒక గీతము మెఱుపు దీగవలె మిఱుమిట్లు గొల్పుచు కవిగారి కలమున మెఱసిపోయినది. ఉత్తరక్షణమందే
        "కోటిగొంతుల కిన్నెర మీటికొనుచు
        కోటిగుండెల కంజరి కొట్టుకొనుచు"
'నేఁటి రాయలసీమ కన్నీటిపాట' స్వచ్ఛందవృత్తముతో వెలువడినది. అందు ప్రతిఫలించినది 'పీనుగులపెన్న', 'వట్టియెడారి', 'నక్కబావలు', 'నాగుబాములు', 'బొంతగద్దలు', 'రేణగంపలు', 'పల్లేరుగాయలు', 'తుమ్మతోపులు' ఇత్యాది అసంఖ్యసామగ్రితో విశ్వంగారి కవితా విరూపాక్షుడు తాండవించినాడు; భాష, అర్థము, భావము, ఛందస్సు అన్నియు ఆ తాండవమునకు ప్రక్కవాద్యాలు వాయించినవి. 'పిన్పాట' పాడినవి; ఒక మాటలో, ఒక చేయూపులో, ఒక తలయాడింపులో, ఒక తిరుపులో ఈ నటరాజు రాయలసీమలోని భూతభవజ్జీవితమునందలి చిన్నపెద్ద ఖండికలెన్నో విసరివైచినాడు.
ఈ దృష్టికి - ఈ సృష్టికి కథ యనావశ్యకము. అసాధ్యముగూడ. రంగడు ఒక పెద్ద రైతుకు ఏకపుత్రుడు. ఆ తండ్రి 'పెగ్గిలు' బ్రతుకులో కొడుకుకు మిగిలిన ఆస్తిపాస్తు లన్నియు వాని శరీరమొకటే. వాని చిన్న యిల్లాలు గంగమ్మ. ఆ 'గంతకు తగిన బొంత.' కాని ఆ రెంటిలోను ఎంతో ఒద్దిక, మార్దవము, సామరస్యము గలదు. ఇద్దఱికిని ఆయిద్దఱు తప్ప వెనుక ముందుల వా రెవరును లేరు. గడ్డియో, కట్టెలో దొరికినది అడవినుండి మోపుగట్టుకొనివచ్చి వచ్చినంత కమ్ముకొను కూలిపని రంగనిది. ఇరుగుపొరుగువారింట వడ్లో, అటుకులో దంచి నూకలో తవుడో తెచ్చుకొను నాలిపని గంగమ్మది. ఈ యిద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, కవుడులేని నడత, అంతులేని దారిద్ర్యము, విసుగుకొనుటకును వీలులేని కాయకష్టము. ఇరుగుపొరుగువారి నిస్సహాయత, చేతనైన వారి యుదాసీనత, ఈనడుమ గంగమ్మ గర్భము, దోహదము విశ్రాంతి లేక ఆ పిల్ల పడు కష్టములను చూచి చేయున దేమియులేక రంగడు 'సమాధిగతుండగు యోగిబోలె స్తబ్ధుడై' యుండుట - వారి భవిష్యత్తును గూర్చి పెద్దగా ధ్వనించు ప్రశ్న - ఇదే ఇందలి వస్తువు. కడపట
        'హృదయమా! మానవుడు నిన్‌ బహిష్కరించె!'
        'చచ్చె నీ లోకమున మనస్సాక్షి యనుచు
        నెత్తి నోరిడి కొట్టుకోనిండు నన్ను!'
అని భరతవాక్యము పాడినారు కవిగారు!
కాని ఇంతనిస్సహాయమైన నిర్వేదమునందును కావ్యపు కమనీయత యెంతో యున్నది. దానికి ఆ పెన్నేటి 'నీటిలో కమ్మదనము లూరు చుండును' అను అంతస్తత్వమును కవిగారు మఱవకుండుటయే కారణము.
        "గుండె జలదరింపజేయు రండతనము డుల్చివేయు
        ఖండితవాదిని జేయును దండితల్లి సు మ్మీ నది!"
        "నిండుమనసు నిజాయతీ - దండిచేయి ధర్మదీక్ష
        పండువయసు పట్టుదలా - పండించును గుండెలలో."
అను నమ్మకము వీరి కావ్య కామనీయకబలమునకు చేయూత. ఇతర సీమలవారికీ గుణములు ఎంతవఱకు ఉన్నవి. ఆదేశాలలో దరిద్రదేవత ఏరీతులలో తాండవించుచున్నది, అను చింత, చర్చ, ప్రకృతవిషయము కాదు. పై గుణములు రాయలసీమవారి కేమాత్రముండినను వారు మరల చేతరించుకోగలరు. 'సమానానా ముత్తమశ్లోకో అస్తు' అను వైదిక మంగళాశంస యెట్లున్నను 'సమానానాం సమాన శ్లోకో అస్తు' అనుకో గలిగిరేని రాయలసీమవాసులు ఎవరికిని తలవంచ బనిలేదు. ఆ నారు పైరగు కాలము వచ్చినది. పంటగూడ ఎంతో దూరమున లేదు.
శ్రీ విశ్వంగారి వివిధ విస్తృత వాఙ్మయసేవను చవిచూచుచున్న తెలుగువారు ఈ చిన్నికావ్యమునందలి పెద్ద హృదయమునకు తప్పక స్వాగతమిత్తురు.

Wednesday, April 2, 2014

సీమ విషాదమూ,నవ వాల్మీకులూ- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

1985లో కేవలం ఒకటి రెండు తాండాలలో మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే వ్యభిచార నరక కూపంలో ఇరుక్కుపోవడం జరిగింది. అలా ప్రారంభమైన ఈ వ్యవహారం తరువాత కాలంలో వందల గ్రామాలకు విస్తరించింది... అమాయకులైన అమ్మాయిలను పశువులను సంతలో కొన్నట్లుగా ఇరవై వేలకో, ముప్పై వేలకో కొని వ్యభిచార గృహాలకు సాగనంపడం మొదలైంది.  

తీవ్ర కరువులకు గురవుతుండడంతో వేరే ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితులలో తెలిసి కొందరు, తెలియకుండా కొందరు ఇందులోకి ప్రవేశించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.రాయలసీమలో దశాబ్దాల కాలం నుంచి పట్టి పీడిస్తున్న సమస్య కరువు. ఈ ప్రాంతం పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి రావడంతో పంటలు నమ్మశక్య ంగా పండుతాయనే ఆశ లేదు. ఇక్కడి చాలామంది రైతులకు బావుల క్రింద ఒక ఎకరానికి మించి పొలం ఉండదు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో బావులు ఎండిపోయి కనీసం ఒక ఎకరాకైనా నీళ్లు అందవు. వర్షాధారమైన పం టగా వేరుశెనగ మాత్రమే సాగుచేసుకొని జీవనం సాగించాలి. ఒక సంవత్సరం పండితే నాలుగు సంవత్సరాలు వరుస కరువులతో పెట్టిన పెట్టుబడులూ రాక వడ్డీలు చెల్లించలేక దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్న సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. బుట్ట చేతపట్టుకొని నగరాలకు ఉపాధికై వలసబాట పట్టాల్సి వస్తోంది. అక్కడ అంతో ఇంతో పొందే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. కొన్నేళ్ల క్రితం పనుల కాలంలో మాత్రం పల్లెల్లో వుండి, మిగతా కాలమంతా నగరాలలోనే పనులు చేసుకొనేవారు. నేడు పల్లెలను, పంటలను పూర్తిగా వదిలేసి పట్టణాలలోనే చాలీచాలని బతుకులీడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో ఈ పరిణామం 1980లలో మొదలై తరువాత దశాబ్దకాలంలో పూర్తిగా పాదుకుంది.

భూములున్న రైతుల పరిస్థితి ఇలా వుంటే, భూములు ఏమాత్రం లేని నిరుపేద రైతు కూలీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వ్యవసాయ పనులు ఆధారం లేకపోవడం చేత, నిరంతర అభద్రతతో, వలసలతో జీవితం గడిపాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, రాయచోటి పరిసర ప్రాంతాలు పూర్తిగా కొండగుట్టలతో కూడి వుంది. అతి తక్కువ వ్యవసాయ యోగ్యమైన భూములతోనే జీవనం కొనసాగించాల్సి ఉంది. పైన పేర్కొన్న పరిస్థితులకు ఈ ప్రాంతం అద్దం పడుతుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ భాగం గిరిజన తాండాలు ఉన్నాయి. ఇక్కడి మొత్తం జనాభాలో వారు దాదాపు పది శాతం వరకూ ఉంటారు. వారిలో ఏ కొద్ది కుటుంబాలకు మాత్రమే కొంత వ్యవసాయ భూమి ఉంటుంది. మిగతావారు వ్యవసాయ కూలీలుగా, అడవి ఆధారంగా, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తారు. విద్యకు దూరంగా, మూఢనమ్మకాలతో వారి జీవితం ముడిపడి ఉంటుంది. సీమలో ఏర్పడే కరువుల ప్రభావం మిగతా వారికన్నా వీరినే అధికంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పట్టణాలకు వలసలు పోయి బతుకీడ్చడం ఒక ఎత్తైతే, దీనికి భిన్నంగా మహానగరాలలో ఈ ప్రాంతంలోని ప్రత్యేకించి కొన్ని గిరిజన కుటుంబాలలో, బలహీన వర్గాలలో నుంచి యువతులు వేశ్యా గృహాలకు అమ్ముడుపోయే పరిస్థితులు దాపురించడం అమానవీయం.
1985లో కేవలం ఒకటి రెండు తాండాలలో మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే ఇలాంటి నరక కూపంలో ఇరుక్కుపోవడం జరిగింది. అలా ప్రారంభమైన ఈ వ్యవహారం తరువాత కాలంలో వందల గ్రామాలకు విస్తరించింది. తొలిదశలో ఢిల్లీ, ముంబయి, పూణే తదితర ప్రాంతాలలో వేశ్యా గృహాలకు వెళ్లినవారే తరువాత కాలంలో ఘర్‌వాలీలుగా (వేశ్యాగృహాల నిర్వాహకులు) మారిపోయారు. వారికి మరింత మంది యువతులు అవసరం ఉండడంతో ప్రతి గ్రామంలోనూ బ్రోకర్లను, ఏజెంట్లను ఉంచి మాయమాటలతో, ఉపాధి చూపిస్తామనే ఆశతో, మోసపుచ్చటంతోను ఇలా పలురకాల ప్రలోభాలకు గురిచేసి, అమాయకులైన అమ్మాయిలను పశువులను సంతలో కొన్నట్లుగా ఇరవై వేలకో, ముప్పై వేలకో కొని వ్యభిచార గృహాలకు సాగనంపడం మొదలైంది. తీవ్ర కరువులకు గురవుతుండడంతో వేరే ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితులలో తెలిసి కొందరు, తెలియకుండా కొందరు ఇందులోకి ప్రవేశించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రకంగా బలైన వారిలో ఎక్కువ భాగం గిరిజన యువతులు కావడం ఆలోచించాల్సిన విషయం. వీరి భాష హిందీ భాషను పోలి ఉండడం, రూపంలో అందంగా ఉండడం, వీటన్నింటికి మించి వారి అమాయకత్వం ఆసరాగా ఈ సమస్యలోకి వారు ఎక్కువ భాగస్వాములు కావటానికి అవకాశం ఏర్పడింది. ఇలా వెళ్లిన వారు ఐదారు సంవత్సరాలకే అనేక వ్యాధులకు గురై, శరీరం కృశించి తిరిగి సొంత పల్లెలకు వెనుదిరుగుతారు. అప్పటికే ఎయిడ్స్ బారినపడిన వారు అతి తక్కువ కాలంలోనే మృత్యువుతో పోరాటం మొదలవుతుంది. వేశ్యాగృహాల నుంచి తిరిగి వచ్చేవారి ప్రభావంతో మామూలుకన్నా ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తృతంగా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించి కబళిస్తోంది. ఈ దశాబ్దకాలంలో ఈ ప్రాంతం నుంచి వివిధ నగరాలలోని వేశ్యా గృహాలకు రెండు వేల మంది దాకా వెళ్లి వుంటారని స్వచ్ఛంద సంస్థల అంచనా. ఐదు వందల మందిదాకా మృత్యువాత పడివుంటారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ముప్పై మంది దాకా ఘర్‌వాలీలు, వంద మంది దాకా బ్రోకర్లు ఈ అమాయక యువతుల శరీరాలతో వికృత వ్యాపారం చేసి లక్షాధికారులయ్యారు.
వైయుక్తికంగా ఈ సమస్య ప్రారంభమై ఒక సామాజిక జాఢ్యంగా పరిణామం చెందింది. అన్ని నగరాలలోనూ వ్యభిచార గృహాలు ఉండడం సహజం. అందులో వేరువేరు నేపథ్యాలతో ఆ వృత్తిలోకి ప్రవేశించడం మామూలే. కానీ వ్యవసాయాధారిత నేపథ్యం, సంప్రదాయ గ్రామీణ జీవితంలోని, ప్రత్యేకించి ఒక ప్రాంతంలో, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఈ సమస్య బారిన పడుతుండడం, దాని ప్రతిఫలనాలను అనుభవిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఈ సమస్య పట్ల సామాజిక బాధ్యత గల ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం సమస్య కొంత తగ్గుముఖం పట్టింది. అయినా ఆ మూలాలు ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదు.
సమకాలీన సమాజ సమస్యల పట్ల సాహిత్యకారులు ఎంతో మహత్తర బాధ్యతతో సమస్య స్వరూపస్వభావాల్ని, పరిణామాలను ముందుగా విశ్లేషించి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని కవులు, రచయితలు, కళాకారులు, వ్యాసకర్తలు వారి పరిధిలో వారు ఈ సమస్య పట్ల చైతన్యం కలిగించేందుకు గతంలో వివిధ రూపాలలో కొంతమందైనా ప్రయత్నం చేశారు. అలా వెలువడిన సాహిత్యాన్ని ఇందులో పరిశీలిద్దాం...
-కవిత్వం
-వ్యాసరచయిత 2004, నవంబర్ 1న రాసిన 'అనంతసుఖం' అనే కవిత ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా సంచికలో ప్రచురితమైంది. అందులో కరువులు, కక్షలు, రైతుల ఆత్మహత్యలు మొదలైన సమస్యలు ప్రస్తావించడంతో పాటు ఈ ప్రాంత యువతులు వేశ్యా గృహాలకు అమ్ముడుపోయి, నలిగిపోతున్న తీరును సూచిస్తూ...
'గతుకు కరువుతో/ శీలం వేలంగా/ కామాంధ గృహాలలో కేళిగా/ మదినలిగిన అమానుషత్వంతో/ గన్నేరు పుష్ప నేస్తాలుగా/ వాడుతున్న మల్లెలను కాపాడలేరా'... అని ప్రశ్నిస్తాడు. కరువుల కారణంగా యువతులు శరీరాలను అమ్ముకొనే పరిస్థితి రావడం, చివరకు ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకడంతో వారు మరణం అంచులకు చేరుకోవటాన్ని 'గన్నేరు పుష్పనేస్తాలు'గా ప్రతీకం చేశాడు. వాడుతున్న ఆ మల్లెలను కాపాడాలని కోరటం ఇందులో కనిపిస్తుంది.
- కవితలోనే చివరలో... 'శోకమే శ్లోకంగా/ ఈ అరుపుల ఆర్తిని/ ప్రతిధ్వనించే పత్రాలకై/ నవవాల్మీకులమైనప్పుడే/ అనంత సుఖం'... అని ఈ సమస్య పట్ల కవులు, రచయితలు చేపట్టాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు.
2006 ఫిబ్రవరిలో ప్రచురితమైన 'సీమనానీలు' అనే నానీల కవితా సంపుటిని 'ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి' వెలువరించారు. సీమ జీవితంలోని అనేక పార్శ్వాలను ఈ నానీలు ప్రతిబింబించాయి. అందులో వేశ్యాగృహాలకు తరలిపోతున్న -ప్రాంత యువతుల సమస్యలపై... 'కరువా/ నీకెంత శక్తే/ పరువాన్ని సైతం/ అంగడిపాలు చేశావ్!'.. అని ఈ సమస్యకు మూలకారణం కరువని కవి సూత్రీకరించాడు. 'కదిరి నుంచి/ రైలు బయలుదేరిందా?/ బొంబాయి గాలులు/ వీస్తున్నాయి చూడు!'... నానీలో కదిరి పరిసర ప్రాంతాలలో ఈ సమస్య విస్తరించటాన్ని సూచించాడు. 'రైలు తిరిగొచ్చిందే/ కదిరికి/ ఆమె/ పాజిటివ్వేమో చూడండి!'.. నానీలో వేశ్యాగృహాల నుంచి తిరిగొచ్చేవారు ఎయిడ్స్ బారిన పడుతుండటాన్ని తెలియజేశాడు. ఈ విధంగా రాచపాళెం ఈ సమస్య స్వరూపాన్ని స్థూలంగా నానీలతో వ్యక్తీకరించాడు.
2008 మార్చి 16న 'విజయస్వప్నం' పత్రికలో 'బిక్కి కృష్ణ' రాసిన 'దగ్ధగీతం' కవిత ప్రచురితమైంది. పేదరికంతో యువతులు వేశ్యాగృహాల పాలవుతున్న వాస్తవం జీర్ణించుకోలేక రాసిన కవితగా కవి ప్రకటించాడు.
'హృదయం దుఃఖాగ్ని పుష్పం/ నయనం కురుస్తున్న అశ్రుమేఘం/ కరువు శిల్పి చెక్కిన వేశ్య జీవితం/ నిత్యం రగులుతున్న అగ్ని సరస్సు/ ఓ కవి! ఎలా రాస్తావు ఆమె కావ్యం?'... అంటూ వేశ్యాగృహాలలో బలవుతున్న స్త్రీల హృదయవిదారక పరిస్థితులను దృశ్యమానం చేశాడీ కవి. 'ఓ కవి! ఆమె ఆకలికి శీలం అమ్ముకుంది/ కరువు తోడేలు కొరికిన మేక పిల్ల ఆమె!'... అంటూ కరువు, ఆకలికి ఈ ప్రాంత స్త్రీలు తలొగ్గిపోవాల్సి వస్తుందని తెలియజేస్తాడు. దుఃఖాన్ని ఎదుర్కోవటానికి మానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి రావటాన్ని తెలియజేస్తూ... 'దుఃఖానికి మానం లేదు' అని దుఃఖిస్తాడు కవి.
పై పత్రికలోనే ఉద్దండం చంద్రశేఖర్ రాసిన 'జాలిప్రశ్న' కవితలో... 'ఇళ్ళంతా బాధల సాలేగూడైనప్పుడు/ నా ఒళ్ళంత చీకటికి అప్పగించి/ మెల్లగా కళ్లు మూసుకుంటాను!/ తెల్లారే సరికి అది గాయాల పురిటిల్లు./ ఆకలిచేత అత్యాచారం చేయబడిన/ గాయాల సమాధి నేను'... అంటూ బాధలు, ఆకలి కుటుంబాన్ని ఆవరించినపుడు ఆ వృత్తిలోకి దిగి ఆమె గాయాల పురిటిల్లుగా, గాయాలసమాధిగా మారటాన్ని చిత్రించాడు.
'వంటిపైకెగబాకే సర్పాల స్పర్శల్ని/ పంటి బిగువుతో మౌనంగా భరిస్తున్నదాన్ని!/ ఎండిన పేగులను తడిచేసుకోవడానికి/ ఎయిడ్స్ శాల్తీలను నిర్భయంగా/ కౌగలించుకుంటున్న దాన్ని!'... అని ఆ సందర్భంలో ఏర్పడే శారీరక బాధను, శరీరాన్ని ఆవరించే ఎయిడ్స్ వ్యాధిని కవి తెలియజేశాడు.
'నా పాలిండ్లను పీల్చిపిప్పిచేశారు/ పాలకోసం విలపించే నా బిడ్డకు/ ఏమని జవాబు చెప్పాలిప్పుడు?'.. అని కవి వ్యక్తీకరించినతీరు హృదయాన్ని కలచివేస్తుంది.
'అమ్మా మళ్లీ బొంబాయి కెళతావా?/ బుజ్జిగాడి జాలి ప్రశ్న!'...లో జీవిత పోరాటానికి ఆ మార్గం తప్ప వేరేదారి లేకపోవటాన్ని సూచిస్తుంది.
-కథా సాహిత్యం
2000 నవంబరులో 'జి. నిర్మలారాణి' రాసిన 'గాజుకళ్ళు' కథ 'ప్రజాసాహితి'లో ప్రచురితమైంది. ఈ కథలో కరువుకు తాళలేక పదేళ్ళ క్రితం ఊరు వదిలిపోయి పొట్టనింపుకోవడానికి దొంగగా మారిన నాగప్ప తిరిగి ఊరొస్తాడు. దొంగతనాలు మాని వస్తే ఇక్కడి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఊరి స్వరూపం మారిపోయి ముసలివాళ్ళు, పిల్లలు మాత్రమే ఉంటారు. తినటానికి తిండిలేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తుంటారు.
నాగప్ప చెల్లెలు లక్ష్మి, తల్లితో 'వాళ్ళు మనుషులు కాదమ్మా, రాక్షసులు! మనుషుల్ని పీక్కుతినే దెయ్యాలకట్లా వాళ్ళు గిరాకితో సరిగ్గా నడుచుకోలేదని యజమానురాలు చావగొడుతుంది. నేనింక చావలేనమ్మా. యాటికైనా పారిపోదాం! అదీ కాకుంటే ఇంత విషంతాగి సచ్చిపోదాం'. అంటూ హృదయాన్ని తూట్లు పొడిచేలా ఏడుస్తూ చెబుతున్న ఆమె మాటల్ని నాగప్ప వింటాడు. నాగప్పకు పరిస్థితి అర్థమవుతుంది. 'ఇట్లాంటి బ్రతుకు బ్రతికే బదులు చావకూడదూ?' అని తనలో తాను నాగప్ప ఆలోచించుకుంటాడు. కానీ తనే పరిస్థితుల్లో దొంగగా మారింది గుర్తుకు తెచ్చుకొని 'తాను చావలేకనే కదా, కడుపుకూటి కోసం చిల్లర దొంగతనాలు చేసింది. ఎవరైనా అంతేనేమో! నీతి నియమాలు పట్టుకుని, కూర్చుంటే కడుపెట్లా నిండాల? తమలాటోళ్ళు బతకేదెట్లా. వళ్ళమ్ముకునే స్థితికి వచ్చినాదంటే జీవితం ఎంతగా చితికిపోయి వుండాలా' అని ఆలోచిస్తూ కృంగిపోతాడు.
ఆ రాత్రినే లక్ష్మి, కుళ్ళాయప్పతో లేచిపోతుంది. బంగారమ్మ అయిదు వేల రూపాయలకు లక్ష్మిని కొని ఉంటుంది. బొంబాయి నుంచి మద్రాసుకు లక్ష్మిని తీసుకువెళుతున్న క్రమంలో ఆరోజున ఊరికి వచ్చి ఉంటారు. ఆ సమయంలోనే లక్ష్మి ఇలా పారిపోవటంతో బంగారమ్మకు ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతోచక లక్ష్మి తల్లి ఆలోచనలో పడిపోతుంది. ఎక్కడైనా అయిదు వేల రూపాయలు తెమ్మని నాగప్పకు చెబుతుంది. నాగప్పకు అది శక్తికి మించిన పని. నాగప్ప తల్లి ఏడుస్తూ ఊరకైపోతుంది. లక్ష్మిని తీసుకెళ్లేందుకు బంగారమ్మ మనుషులు వస్తారు. 'మా లక్ష్మీకి ఖాయలా అయి పట్నం పోయినదన్నా, మళ్లీ రాదు? మద్రాసుకు నేను వస్తాను పదండి' అని ఆమె ముందుకు అడుగు వేసింది. నాగప్ప తాను ఏమి విన్నాడో అర్థం కాక, అయోమయంగా తల్లి ముఖంలోకి చూశాడు. 'వట్టిపోయిన ఆకాశం మాదిరి ఆమె కళ్ళలో చుక్కనీరు లేదు.' అని కథ ముగుస్తుంది.
ఈ కథలో కరువు కారణంగా ఏర్పడిన పరిస్థితులు కుటుంబ వ్యవస్థను ఎంత ఛిన్నాభిన్నం చేస్తాయో తెలియజేస్తుంది. జీవనం కోసం స్త్రీలు ఎలాంటి అమానవీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ కథలో చిత్రితమైంది. క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితుల పట్ల ఎంతో అవగాహన ఉంటేకానీ ఇలాంటి కథను రచయితలు చిత్రించలేరు.
2004లో 'వేంపల్లి గంగాధర్' రాసిన 'మైనం బొమ్మలు' కథ ఆంధ్రభూమిలో ప్రచురితమయింది. ఆ సంవత్సరం ఆటా పోటీలలో ఈ కథ బహుమతిని పొందింది. ఈ కథలో చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన పద్మ, ఆమె తమ్ముడు వినోద్, తండ్రి చాటున తాండాలో నివసిస్తుంటారు. పదహారేళ్ల వయసులోనే పద్మను ఆమె తండ్రి 'పూణా బూమ్మ'కు అమ్మేస్తాడు. జరుగుబాటుకాక అదేబాటలో ఆ తాండాలోని యువతులంతా పూణే చేరతారు. తాండా బోసిపోతుంది. తమ్ముని చదువుకోసం పద్మ ఒక్కో రూపాయి కూడబెట్టి హాస్టలుకు పంపుతుంది. వాళ్ల నాన్న ప్రతి నెలా హాస్టలుకూ వెళ్లి డబ్బుకోసం గొడవ చేసేవాడు. చివరకు కొడుకు చదువు మాన్పించి, ట్రాక్టరు పనికి పంపితే డబ్బులు వస్తాయనుకుంటాడు. హాస్టలు వార్డెను వినోద్‌ను వాళ్ళ నాన్న బారి నుంచి కాపాడతాడు. అన్నీ తానై, హాస్టలు వార్డెనే వినోద్‌కు సహాయంగా నిలుస్తాడు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు, ఎంతవరకైనా చదవమని తమ్మునికి పద్మ ఉత్తరం రాస్తుంది. అక్క ఇచ్చిన తోడ్పాటుతో పెద్ద చదువులు చదివి వినోద్ అమెరికాలో స్థిరపడతాడు.
పాతిక సంవత్సరాల తరువాత తన తాండాను, తన జీవితాన్ని నిలబెట్టిన పద్మక్కను చూద్దామని వినోద్ వస్తాడు. వినోద్ కారు పద్మక్క ఉన్న గుడిసె దగ్గరికి చేరుతుంది. నిర్జీవ దేహంతో కరిగిపోయిన మరబొమ్మగా, మంచుబొమ్మగా చివరకు మైనపు బొమ్మగా మారిన పద్మక్కను చూస్తాడు.
ఆమె 'తాండాను చూసి, జీవం పోయమని' వినోద్‌ను కోరుతుంది. తాండాలో అందరికీ వినోద్ ఉపాధి కల్పిస్తాడు. 'పూణా బూమ్మ' తన వెంట వచ్చేవారెవరూ లేరని తిట్టుకుంటూ ఒంటరిగా పూణేకు వెనుదిరుగుతుంది. కరువులు, పేదరికం, అవిద్య, అజ్ఞానం కారణాల వలన విరిసీ విరియని ఆడపిల్లల జీవితం మైనం బొమ్మలుగా మారడానికి వీలులేదని రచయిత కథను ముగిస్తాడు.
బాధ్యతగా ప్రవర్తించాల్సిన తల్లిదండ్రులు డబ్బు కోసం తమ బిడ్డలను అమ్ముకునే దారుణ పరిస్థితిని ఈ కథ తెలియజేస్తుంది. యువతులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమని ఈ కథలో సూచితమయింది. ఈ కథంతా కవితాత్మకంగా నడుస్తుంది. వేంపల్లి గంగాధర్ 2007 జూన్‌లో 'పూణే ప్రయాణం' అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు. క్షేత్ర స్థాయిలో వేశ్యా గృహాలలో బలైన బాధితుల వ్యక్తిగత అధ్యయన కథనాలను అందులో వివరించాడు.
-వ్యాసరచయిత 'సీమకు మరో సామాజిక జాఢ్యం' అనే శీర్షికన 2008 మార్చి 16న 'విజయస్వప్నం' సంచికలో సీమ నుంచి వేశ్యాగృహాలకు వెళుతున్న యువతుల సమస్య నేపథ్యాన్ని, కారణాల్ని, విస్తృతిని, ప్రభావాల్ని, పరిష్కారాల్ని విశ్లేషిస్తూ పరిశోధనాత్మక నివేదికను రాశాడు.
సమకాలీన ఈ సమస్యపై, పైన పేర్కొన్న ప్రక్రియలలో కొంతైనా సాహిత్యం వెలువడింది. రచయితలు మరింత సునిశిత పరిశీలనతో వేశ్యా గృహాలలోని సీమ యువతుల ఇతివృత్తమై నవలా రూపంలో వెలువడితే పాఠకులకు సమస్యపట్ల పూర్తిస్థాయి అవగాహనకు వీలుంటుంది. పాటలు, నాటక రూపాలలో ఈ సమస్యపై సాహిత్యం వెలువడి, సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ప్రదర్శించి, బాధితులలో చైతన్యం తీసుకురాగలిగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి
Andhrajyothy, Vividha- 31 march 2014.

Monday, January 13, 2014

జె.పి. చెప్పిన అభిప్రాయంతో నైనా రాయలసీమ నేతలంతా కళ్ళు తెరవాలి!

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని లోక్ సత్తా నేత జె.పి. చెప్పిన అభిప్రాయంతో నైనా రాయలసీమ నేతలంతా కళ్ళు తెరవాలి. రాయలసీమ విషయంలో "ఎద్దు పుండు కాకికి ముద్దా..?" అన్నట్లు వ్యవహరిస్తున్న పత్రికలూ,  ప్రసార మాధ్యమాలూ తమ ధోరణిని ఇకనైనా మార్చుకోవాలి.  జె.పి గారికి రాయలసీమ ప్రజల ధన్యవాదాలు..!
 -ఈనాడు 14-01-2014

Tuesday, December 31, 2013

సీమ భవితవ్యంపై నీలినీడలు - లెక్కల వెంకటరెడ్డి

రాష్ట్ర విభజన అంశం శరవేగంతో దూకుసువెళ్తూ చరమాంకంలో ప్రవేశించింది. జిఓఎం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పలు దఫాలుగా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు సూచనలు సేకరించి తనదైన శైలిలో విభజన బిల్లు ముసాయిదాను రూపొందించింది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలతో అది పార్లమెంటుకు చేరి ఆమోదం పొందడంతో చట్టరూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో జి.ఓ.ఎం. కాని దాని ముందటి ఆంటోని కమిటీ గాని విభజన అంశాలపై విస్తృత చర్చలు జరిపినట్లు చెప్పుకున్నప్పటికీ అదంతా కాంగ్రెస్‌ అధినేత్రి కనుసన్నల్లోనే జరిగిందనేది తిరుగులేని వాస్తవం! బిల్లు రూపకల్పన గాని, ముసాయిదాపై జరిగిన ఉత్తుత్తి చర్చగాని అధినేత్రి అభీష్ఠం మేరకే సాగింది. ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే!నామ్‌కే వాస్తేగా జరిగిన ఈ విభజన బిల్లు మొత్తం వ్యవహారంలో రాయలసీమ గురించి ఎలాంటి చర్చ జరుగకుండా పోయింది. కనీసం దాని ఊసైనా చర్చల్లో రాకుండా పోవడమనేది రాయలసీమ వాసులకు మింగుడుపడని అంశం! ముసాయిదా చర్చల్లో నామమాత్రంగానైనా పాలుపంచుకున్న రాజకీయ శక్తులు, వ్యక్తులు రాయలసీమ అంశాన్ని ప్రస్తావించకపోవడం, ముసాయిదాగా మూలవిరాట్టు అయిన అధినేత్రి కూడా ఆ అంశాన్ని స్పృశించకపోవడాన్ని రాయలసీమ బిడ్డలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వివక్ష ధోరణి రాయలసీమ ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని వారు భావిస్తున్నారు. అంతేగాకుండా చాపక్రింద నీరులా సీమ భవిష్యత్తు పై నీలినీడలు కమ్ముకొస్తున్నాయనే దానికి ఇది ఒక సంకేతమని వారు తలుస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రం అవతరణ కాని, విశాలాంధ్ర ఆవిర్భావం కాని రాయలసీమ ప్రజల అనన్యసామాన్య త్యాగనిరతితోనే సాధ్యం అయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సులభంగా జరుగలేదు. దాని వెనుక దశాబ్దాల ఉద్యమ పోరాటం ఉంది. రాయలసీమ వాసుల సహకారం లేనిదే ఆంధ్రోద్యమం ప్రారంభం కాలేదు. రాయలసీమ వాసుల విశ్వాసాన్ని చూరగొనేందుకు కోస్తాంధ్రులు ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నారు. లెక్కకుమించి ఎత్తులు, ప్రయత్నాలు చేశారు. చివరకు వారికి ఇష్టంలేకపోయినా గత్యంతరం లేని పరిస్థితులలో శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకొనకతప్పలేదు. మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌ భవనంలో 1937 నవంబర్‌ 16న జరిగిన ఈ ఒడంబడిక అప్పుడూ -ఇప్పుడూ ఏనాడూ ఆవగింజంత కూడా అమలుకాలేదు. అయితే ఆనాటి ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని చారిత్రక పట్టణం కర్నూలు రాజధాని కాగలిగింది. కోస్తాంధ్రుల తీవ్ర నిరసనల మధ్య రాజధాని నగరం కాగలిగిన కర్నూలు దాన్ని మూన్నాళ్ళముచ్చటగా మూడేళ్ళ వరకే పొందగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావంతో దాన్ని హైదరాబాద్‌ తన్నుకుపోయింది. ఈ మూన్నాళ్ళ ముచ్చటైన రాజధాని హోదా తప్ప శ్రీబాగ్‌ ఒడంబడిక ద్వారా రాయలసీమ ఇతర ఎలాంటి ప్రయోజనం పొందలేదు. కాగా సాగునీటి విషయంలో అయితే ఒప్పందం ఘోరంగా ఉల్లంఘించబడింది. ఈ ఒప్పందంలోని అంశాలలో సగమైనా అమలై ఉంటే రాయలసీమ ఇంతటి ఘోర వెనుకబాటుతనానికి గురై ఉండేదికాదు.
శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ప్రస్తావించడం నాటి ఆంధ్ర రాష్ట్రం అవతరణలో అప్పటి తరం రాయలసీమ నేతల గణనీయ పాత్రను, వారి త్యాగశీల ఉదార స్వభావాన్ని గుర్తు చేయడానికే! కొన్ని ప్రధానమైన నిర్ణయాలలో సీమ ప్రజలు ద్వితీయశ్రేణి పేరిటగా పరిగణించబడ్డారు కూడా! ఆంధ్ర అనే పదం దానికి కోస్తా నాయకులు అర్థం పర్థం లేని వాదనలు లేవదీసి ప్రాథమిక దశలోనే దాన్ని త్రోసిపుచ్చారు. అయినా ఆంధ్ర రాష్ట్ర సాధనకు రాయలసీమ వాసులు మనస్ఫూర్తిగా సహకరించారు. అందుకు శ్రీబాగ్‌ ఒడంబడిక కంటే తెలుగు ప్రజల ఐక్యతా ఆకాంక్ష ప్రధాన కారణమై నిలిచింది. రాష్ట్ర విభజన అంశం బలంగా రూపుదిద్దుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సీమవాసులు సమైక్య ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషించారు. గత ఆగస్టు నుండి మహోగ్రంగా సాగిన సమైక్య ఉద్యమం కోస్తాలో కంటే రాయలసీమలోనే ఉధృతంగా సాగిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు పత్రికల కథనాలు. టీవీ ఛానెళ్ళ ప్రసారాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సమైక్యంలో సీమకు ఎలాంటి ప్రయోజనం కలుగకపోయినా విడిపోతే కోస్తాంధ్రుల కుట్రలకు మరింత బలికావాల్సి ఉంటుందనేది సీమవాసుల అభిప్రాయం! అందుకు ఆంధ్ర రాష్ట్రంలోని అనుభవాలే వారిని ఆలోచింపచేస్తున్నాయి. అంతేగాకుండా ఒక ఉదాత్త భావజాలంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ చీలికకు గురై భావోద్వేగ అనుభూతులను అదృశ్యం చేసుకోకూడదనే తపన కూడా ఒక ప్రధాన కారణం! విభజన చర్చలు ఊపందుకొని నెలల తరబడి చర్చలు జరిగిన సందర్భంలో విడిపోయే పక్షంలో రాయలసీమ విషయం ఏమిటనేది చర్చల్లో పొరపాటున కూడారాలేదు. ఆ మార్గంలో ఆంటోని కమిటీ గాని, జిఓయం గాని చర్చలకే అవకాశమివ్వలేదు. అసలు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో తెలంగాణా, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ ఒకటున్నదనే స్పృహే కలుగలేదు. సీమాంధ్రలో దాన్ని మిళితం చేసి రాయలసీమ ప్రాంతాన్నే తెరమరుగుచేశారు. చాలామంది రాయలసీమ ప్రజాప్రతినిధులు కేంద్రానికి, కోస్తాంధ్రులకు ఊడిగం చేసేందుకే సిద్ధపడ్డారు తప్ప శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో రాయలసీమ వెనుకబాటును గుర్తించలేదు. విడిపోతున్న భాగానికి తెలంగాణా మిగిలిన భాగానికి సీమాంధ్రగా ఇప్పటికే నామకరణం వారికి వారే చేసుకున్నారు. సీమాంధ్ర స్థానంలో రాయలసీమ నేతలు గతంలో సూచించిన విధంగా రాయలాంధ్ర పేరును సూత్రప్రాయంగా నైనా ఎత్తకపోవడం కోస్తావారి కుత్సితబుద్ధికి నిదర్శనం కాక మరేమిటి పైగా సీమాంధ్ర అనే పేరుకు రాయలసీమ పేరులోని ఆఖరు పదాన్ని తీసుకొని ఆంధ్ర పదానికి ముందు కలిపామని ఒక వికృత వివరణ అదే నిజమని అనుకుంటే కోనసీమ, దివిసీమ లాంటి కోస్తా ప్రాంతాలలోని ఆఖరు పదం మాటేమిటి ఆంటోని కమిటీ ముందు గాని, జిఓఎం ముందుగాని రాజకీయ పార్టీలు చేసిన సూచనలు, సమర్పించిన నివేదికల్లో రాయలసీమ ఊసే కనిపించదు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు విభిన్న ప్రాంతాలలో రాయలసీమ ఒకటి అనే విషయం కూడా ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపూ ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలదే చర్చ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో, అది ఆంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందే దశలో రాయలసీమ అవసరం ఎంతో కన్పించింది. రాయలసీమ నిరంతరం చర్చల్లో ఉండేది. వారి త్యాగాలకు గాలంవేసి రాయలసీమ నేతలను ఆపద్భాంధవులుగా చూసుకున్నారు. ఆ అవసరం ఎప్పుడో తీరిపోయింది. ఇప్పుడా అవసరం ఎటుచూసినా కన్పించడంలేదు. అందుకే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో రాయలసీమను, సీమవాసులను కరివేపాకుగా మార్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోలవరం, భద్రాచలంపై జరిగిన మొత్తం చర్చలో రాయలసీమ పై ఆవగింజంత కూడా చర్చ రాకపోవడం అసంబద్ధమైన పరిణామం! రాయలసీమ అస్థిత్వాన్ని, చరిత్రను ధ్వంసం చేసే విధంగా భారీ స్థాయిలో క్యాబినెట్‌ సమావేశం వరకు తీసుకుపోయిన రాయలసీమ ప్రతిపాదనలోని రాయల పద ధ్వనిని భరించడం రాయలసీమ వాసులకు గుండెలపై సమ్మెటపోటు లాంటిది. అంతకంటే నిలువునా అగ్నికి ఆహుతి కావడం వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. విభజన తర్వాత మిగిలిన భూభాగానికి రాయలాంధ్రగా మార్పు చేయాలని ఆలోచించకపోవడం అవగాహన లోపం కాదు. రాజధాని ప్రాంత గుర్తింపుకు సం బంధించి ఇప్పటికీ వచ్చిన రెండు మూడు ప్రతిపాదనలలో సీమ ప్రాంతం లేకపోవడం యాధృచ్ఛికం కాదు. నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నగరం సీమప్రాంతం లోనిదే అనే విషయం మరిచిపోయారా పోలవరానికి జాతీయ హోదా ప్రధానమైనప్పుడు సీమలోని సాగునీటిప్రాజెక్టులకు నీటి కేటాయింపు ప్రధానం కాదా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2013 లో రాయలసీమను భాగంగా పేర్కొనకపోవడమటుంచి కనీసం ప్రస్తావన కూడా లేకపోవటం రాయలసీమి చరిత్రను ప్రాంత వైశిష్ట్యాన్ని సీమ త్యాగనిరతిని సమాధిచేయటమే! రాయలసీమ భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా యివ్వని రాష్ట్ర విభజన రాయలసీమకు శాపగ్రస్తమే! విభజన అనివార్యంగా కనిపిస్తోన్న ఈస్థితి రాయలసీమ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపనుంది. కోస్తాంధ్రులతో రాయలసీమవాసులు కలిసి జీవించవలసి వస్తే శ్రీబాగ్‌ ఒడంబడిక పూర్తిస్థాయిలో అమలుకు ఒత్తిడి తీసుకురావాలి. అది సాధ్యం కానప్పుడు పాత రాయలసీమ ప్రాంతంతోపాటు ఇతర భౌగోళిక సారూప్య ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు సీమవాసులు,సీమఉద్యమసంస్థలు సీమ రాజకీయ పార్టీలు, నాయకులు నడుంకట్టి ఉద్యమించాలి.
-లెక్కల వెంకటరెడ్డి 
రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు
Andhra Prabha daily (31-12-2013)

Thursday, December 19, 2013

తప్పదు ప్రత్యేక రాయలసీమ - బండి నారాయణస్వామి

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?... సీమాంధ్ర కాదు. రాయల తెలంగాణ కాదు. మరి ప్రత్యేక రాయలసీమా? ఔను! మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!

సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ వేర్పాటువాదానికి వ్యతిరేకమైన ఉద్యమం. ప్రపంచంలో ఉద్యమాలు అనేకం ఉన్నాయి గానీ సమైక్యాంధ్ర వంటి ప్రతి ఉద్యమం ఎక్కడా కనబడదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేకుండా, తెలంగాణ ఉద్యమం ఉంటుందిగానీ, తెలంగాణ ఉద్యమం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి అస్తిత్వం లేదు. స్వీయ అస్తిత్వమున్న తెలంగాణ ఉద్యమానికీ స్వీయ అస్తిత్వం లేని సమైక్యాంధ్ర ఉద్యమానికీ మధ్య చాలా అంతరాలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో విడిపోవాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక ఆత్మగౌరవ సమస్య ఉంది. తెలంగాణ ఉద్యమం గతకాలపు నేలమాళిగల్లో దాగిన తెలంగాణ చారిత్రక ఘటనలెన్నిటినో వెలికితీసింది. రైతాంగ సాయుధ పోరాటం, పటేల్ పట్వారీలూ, రజాకార్లూ, నిజాం పాలన, హైదరాబాద్ స్టేట్ మీద పోలీసు చర్య మొదలైన అనేక చారిత్రక అంశాల్ని కొత్త వెలుగులో పునర్మూల్యాంకనం చేసింది. ఆధునిక విద్య విస్మరిస్తున్న స్థానిక సంస్కర్తల్నీ, కవుల్నీ, పోరాట యోధుల్నీ తెలంగాణ ప్రజలకు పునఃపరిచయం గావించింది. భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, కొమురం భీం, సమ్మక్కసారక్క వంటి చరిత్రాత్మక వ్యక్తుల్ని, వారి జ్ఞాపకాల్నీ పచ్చపచ్చగా చిగుర్లెత్తించింది. తెలంగాణ కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ, సామాజిక వాగ్గేయకారుల్నీ కదం తొక్కించింది. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, పండగలూ పబ్బాలూ అన్నిటినీ గర్వంగా తలెత్తి చాటుకుంది.

ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే తెలంగాణ ఉద్యమ కాలాన్ని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంగా అంచనా వేయొచ్చు. (ప్రత్యేక తెలంగాణలో కూడా ఈ పునరుజ్జీవనం కొనసాగేనా?)
సమైక్యాంధ్ర ఉద్యమంలో కలిసుండాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక సెంటిమెంటు ఉన్నా అంతకంటే అమితంగా విడిపోవడంలో ఎదురయ్యే నష్టాలే ఉద్యమ ప్రాధాన్యం వహించాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్థానికత సున్నా కావడం వల్ల గాంధీ నెహ్రూల వేషధారణలకు పరిమితం కావడం తప్ప మనదైన స్థానిక ఉద్యమ సంస్కృతిని నిర్మించుకోలేకపోయింది. అటు రాయలసీమ ముఖమూ తొడుక్కోలేక ఇటు కోస్తాంధ్ర ముఖమూ తొడుక్కోలేక రెండిటికీ చెడిన రేవడిగా మారి, స్థానికంగా ఆర్థిక చారిత్రక సాంస్కృతిక లోతుల్ని కోల్పోయింది. సమైక్య ఉద్యమానిది ప్రాదేశిక ప్రత్యేకత లేని టోకు దృష్టి మాత్రమే! ఒక్కమాటలో చెప్పాల్సివస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని యథాతథవాద ఉద్యమంగా అంచనా వేయొచ్చు.

సమైక్య ఉద్యమం ఒక గుంజ చుట్టూ తిరిగే విసర్రాయి మాదిరి హైదరాబాదు చుట్టూనే గిరగిరా తిరుగుతూ వచ్చింది. ఇందులో కోస్తా మధ్యతరగతి, సీమ మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కాంక్ష వ్యక్తమైనప్పటికీ, బైటికి వ్యక్తంకాని రాయలసీమ గ్రామీణ సమస్య ఒకటుంది. అది నీళ్ళ సమస్య! రాయలసీమలోని డెబ్బై శాతం గ్రామీణ ప్రజల జీవిక సమస్య!! ఈ సమస్య కోస్తా రైతాంగ ప్రజలకు లేదు (కోస్తా ప్రాంతాలకు కూడా నీటి కష్టాలు లేవా అని తర్కించే వాళ్ళను చూస్తే ఆకులోడూ ఏడ్చేదే! ఉప్పోడూ ఏడ్చేదే అనే సామెత గుర్తుకొస్తుంది). సమైక్య ఉద్యమంలోని సీమ, కోస్తాలు ఈ సాగునీటి సమస్య దగ్గరే మౌలికంగా విడిపోతాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీమ, కోస్తాలు మానసిక ఆవరణంలో కూడా విడిపోతున్నాయి. రాయలసీమ నాయకులు జరిగిపోయిన చరిత్రను కెలికి శ్రీబాగ్ ఒడంబడిక(1937, నవంబర్ 16)లోని రాయలసీమ రాజధాని జిల్లాను బైటికి తీసి చూపేసరికి కోస్తా నాయకులు ఎగతాళిగా నవ్వి పక్కకు తప్పుకున్నారు. పైగా రాయలసీమలోని రాజధాని గురించి చారిత్రక వాగ్దానాన్ని తప్పించుకోవడానికి (అట్లా తప్పుకోవడం వాళ్ళకు మామూలే) ఎత్తులు వేయడం కూడా ప్రారంభించారు. సీమలోని నీటి సమస్యను మిషగా చూపి, అందుకు విరుగుడు అన్నట్లు అనంతపురం, కర్నూలు రెండు జిల్లాలనూ తెలంగాణలో కలిపేయడాన్ని బలపరిచారు. ఇంక రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక బాధ్యత కోస్తాకు ఉండదు కదా అని వారి పన్నాగం. ఇది అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుంది గానీ, తాము రెండు పంటలకు మారుగా ఒక పంటకు పారబెట్టుకుని, మరో పంటకు భూగర్భ జలాల మీద ఆధారపడితే రాయలసీమకు కనీసం తాగు నీరు ఇవ్వొచ్చు కదా అన్న బాధ్యతా బుద్ధి మాత్రం వీళ్ళకుండదు.

రాయలసీమలోని పట్టణ మధ్యతరగతికీ, పల్లెల రైతాంగానికీ ఆసక్తులలో తేడా ఉంది. పట్టణ మధ్యతరగతి సమైక్య ఉద్యమం హైదరాబాదు దగ్గర ఆగిపోతే, పల్లెల్లోని రైతాంగం మాత్రం సాగునీటి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది. తమకు సాగునీరు రావడానికి ఎవరైతే అడ్డుపడరో వాళ్ళతో కలిసి ఉండడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు.

అది సీమాంధ్ర అయితేనేంగాక!
రాయల తెలంగాణ అయితేనేంగాక!!
... కానీ విషాదమేమిటంటే రాయలసీమ ఆసక్తులను మన్నించి కలుపుకోవడానికి అటు కోస్తాంధ్ర సిద్ధంగా లేదు ఇటు తెలంగాణ కూడా సిద్ధంగా లేదు. ఆశ్చర్యకర పరిణామమేమిటంటే; తుంగభద్ర నీళ్ళు వస్తాయంటే అనంతపురం రైతు ప్రజలు కర్ణాటకలో కలిసిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. తెలంగాణ పోరాటానిది స్థానిక సంస్కృతిని రక్షించుకునే ఆత్మగౌరవ పోరాటమైతే; కేవలం బతకడం కోసమే తమ సంస్కృతిని ఫణంగా పెట్టడానికైనా సిద్ధపడిన జీవికపోరాటం రాయలసీమ రైతులది!
సమైక్యాంధ్రలో రాయలసీమ మాత్రమే ఎక్కువ వెనకబడటానికి గల కారణాల్లో వర్షాభావమూ, భూగర్భ జలాలే కాకుండా ఒక రాజకీయ కారణం కూడా ప్రధానంగా ఉంది.
తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే, రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు తక్కువ. కోస్తాంధ్రలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు ఇంకా తక్కువ. ఈ క్రమంలో; ఆంధ్రప్రదేశ్‌ను ఏ ముఖ్యమంత్రి పరిపాలించినా ఎమ్మెల్యే స్థానాలు అధికంగా ఉన్న ప్రాంతపు ఆసక్తులకే తన రాజకీయ లబ్ధి కోసం పెద్దపీట వెయ్యక తప్పదు. అదే జరిగింది. నీలం సంజీవరెడ్డి పరిపాలించినా, చంద్రబాబు నాయుడు పరిపాలించినా, రాజశేఖర రెడ్డి పరిపాలించినా, ఇంకా ఏ రాయలసీమ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండినా; కోస్తాంధ్ర తెలంగాణ ప్రయోజనాలవైపే వాళ్ళు మొగ్గు చూపక తప్పింది గాదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

మైనారిటీ రాయలసీమ-
సీమాంధ్రలో చేరినా మళ్ళీ అదే వివక్షే!
రాయల తెలంగాణలో చేరినా మళ్ళీ అదే వివక్షే!!
అందుకే ఇప్పుడు కావలసింది
సీమాంధ్ర కాదు.
రాయల తెలంగాణ కాదు.
మరి ప్రత్యేక రాయలసీమా?
ఔను!
మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!
- బండి నారాయణస్వామి

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...