Monday, March 18, 2013

ఆధునిక సాహిత్యంలో రాయలసీమ వెనుకబడలేదు

తవ్వా వెంకటయ్య
మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోల్చితే రాయలసీమ సాహిత్యంలో ఆధునికత చాలా ఆలస్యంగా ప్రవేశించిందని విమర్శకుల అభిప్రాయం. ఇది నిజమా, కాదా అనేది ఓ పరిశోధనాంశం. రాయలసీమ సాహిత్యం గురించి ప్రాంత ధృక్పథంతో ఆలోచించిన మొదటి విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆయన ‘ఈనాటి కడప జిల్లా స్థూల రేఖలు’ అనే వ్యాసంలో రాయలసీమలో ఆధునిక సాహిత్యం వెనుకబ డిందని పేర్కొంటూ అందుకు కారణాలను కూడా వివరించారు. సర్కారు ప్రాంతంలో ఆధునికత తొందరగా ప్రవేశించడం వల్ల అక్కడ ఆధునిక సాహిత్యం ముందుగా ప్రవేశించిందని రా.రా. అభిప్రాయపడ్డారు. అంతేగాక నూతన చారిత్రక శక్తులు కోస్తా జిల్లాల్లో ముందు తలెత్తడం వల్లనే ఈ వ్యత్యాసం ఏర్పడిందని, ప్రజాజీవితంలో విప్లవాత్మకమైన పరిణామాలు ముందు ఆ జిల్లాలలో ప్రారంభమయ్యాయని అన్నారు. ఆధునిక సాహిత్యం పుట్టుకకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే కారణమని అందరూ పేర్కొన్నారు.

ప్రసిద్ధ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం- సామాజిక సాంస్కృతిక విశ్లేషణ’ అనే గ్రంథంలో ‘ఆధునిక సాహిత్యం రాయలసీమలో ప్రారంభం కాకపోవడానికిగానీ, కోస్తా జిల్లాలలో ప్రారంభం అయ్యాక కూడా అది రాయలసీమకు విస్తరించకపోవడానికి గానీ- రాయలసీమ కవి పండితుల ప్రతిభారాహిత్యం ఎంత మాత్రం కారణం కాదు. కొత్తదనాన్ని గురించి ఆలోచించగల వాతావరణం రాయలసీమలో నిర్మాణం కాకపోవటమే అందుకు నిస్సందేహమైన కారణం’ అన్నారు. నాటి సామాజిక రుగ్మతల్ని నిర్మూలించే సాహిత్య ప్రయత్నం జరగలేదని, అందుకు ఆధునిక భావాలు ఏమాత్రం లేవని ఆయన అభిప్రాయం.

ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఆధునిక సాహిత్యం గురించి చెప్తూ, సమాజంలో ఆధునికత ప్రవేశించకుండా ఆధునిక సాహిత్యం రావడం అసాధ్యమన్నారు. ఆధునికత గురించి వివరిస్తూ, పారిశ్రామిక ప్రగతి, నీటిపారుదలాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి తద్వారా ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఆధునికత అన్నారు. జీవితంలోకి ఆధునికత ప్రవేశించకుండా మానసికంగా ఆధునికతలో పరిపూర్ణత సాధించలేమని, జీవితం నుంచి సాహిత్యాన్ని వేరుచేయలేమని అన్నారు. రాచపాళెం అభిప్రాయంలో సమాజ ఆర్ధికాభివృధ్ధే ఆధునిక సాహిత్యానికి ప్రేరణగా భావించాలి.

వీరేగాక, రాయలసీమకు చెందిన పలువురు నవ, కథా రచయితలందరూ- రాయలసీమలో ఆధునికత ఆలస్యంగా ప్రవేశించడంవల్లనే ఆధునిక సాహిత్యం వెనుకబడిందన్నారు. వీరి అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునికత ప్రజా జీవితం లోకి ప్రవేశిస్తే తప్ప ఆధునిక సాహిత్యం వ్యాపించిందనే విషయం అవగతమౌతుంది. అయితే ఇక్కడ తెలియవలసింది ఆధునికత అంటే ఏమిటనే విషయం.
ఆధునికత అనే పదం కాలానికి, స్వభావానికి సంబంధించినదిగా, 19వ శతాబ్దం తరువాత వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యంగా విమర్శకులు భావిస్తున్నారు. ఆధునిక శబ్దం కాలాన్ని సూచిస్తుందా, స్వభావాన్ని సూచిస్తుందా? అనే విషయం ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, రాచపాళెం అన్నట్టు పారిశ్రామిక ప్రగతి ఆధునికతకు మార్గం వేసింది. యూరోపియన్ల రాకతో భారత దేశంలో ఆధునిక భావాలు మొదలయ్యాయి. భారతీయ సాహిత్యంలోగానీ, తెలుగు సాహిత్యంలోగానీ ఆధునికతను తెలుసుకునే ముందు, ప్రపంచ ఆధునిక యుగ లక్షణాలను తడమాలి. ఆధునికత రూపు దిద్దుకుంది యూరప్‌ లోనే.

గ్రీకు సంస్కృతిని యూరప్‌ నాగరికతకు మార్గదర్శకంగా భావిస్తాం. ‘కానిస్టాంట ్‌నోపుల్‌’ను గ్రీకు సంస్కృతికి నిలయంగా చెప్పుకుంటాం. క్రీ.శ 1453లో టర్కీ సుల్తాన్‌ కానిస్టాంట్‌ నోపుల్‌ పై దండెత్తి ఆక్రమించుకున్నాడు. దీంతో గ్రీకు పండితులు తమ సాహిత్యగ్రంథాలను తీసుకుని యూరప్‌కు పారిపోయారు. పారిపోయిన పండితులు తమ సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరణకు పూనుకున్నారు. ఈ ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ పని ఇటలీలో కానిస్టాంట్‌నోపుల్‌ పతనం కంటే ముందే జరిగింది. ఆనాటి రచయితలు పెట్రార్క్‌, డాంటే, భాకాషియో మొదలైనవారు తమ దేశాల ప్రాచీన సాహిత్యాన్ని చదవమని ప్రజల్ని ప్రేరేపించారు. అందుకోసం వారు అనేక నూతన పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. తమ ప్రజలు మాట్లాడే ప్రాంతీయభాషలోనే తమ రచనలు చేయడం ప్రారంభించారు. బైబిల్‌ను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. దీంతో మూఢనమ్మకాలు, మూఢాచారాలు తగ్గాయి. సాంస్కృతిక పునరుజ్జీవం ఫలితంగా నాటి యూరోపియన్‌లు ప్రతి విషయాన్ని తర్కించి, ప్రశ్నించి, పరిశోధించి శాస్ర్తీయ పద్ధతులద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. రాజకీయ, సామాజిక, మత రంగాలలోని ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాందిగా చెప్పవచ్చు.

యూరోపియన్‌ల రాకతో భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఆధునిక యుగభావాలు వెలిశాయి. యూరోపియన్‌లు క్రీ.శ 1498లో భారత్‌లో ప్రవేశించారు. కానీ వాస్తవంగా 1757 జూన్‌23న రాబర్ట్‌క్లైవ్‌ బెంగాల్‌పై సాధించిన విజయంతో భారతదేశంపై యూరోపియన్‌లు రాజకీయ అధికారాన్ని సాధించారు. దీనితో భారతీయులపై బ్రిటిష్‌వారి ప్రభావం ప్రారంభమైంది. భారతీయ ప్రజలు అటు పాశ్చాత్యసంస్కృతికి ఇటు హిందూ సంస్కృతికి మధ్య నలిగిపోయారు. చివరకు అధికారంలో ఉన్న పాశ్చాత్య సంస్కృతే ఎక్కువ ప్రభావం చూపింది. దీనికి తోడు మెకాలే, బెంటింగ్‌లు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్య భారతీయుల్ని ఆలోచింపచేసింది. కొన్ని కొత్త ప్రాపంచిక విషయాలు భారతీయులకు తెలిసొచ్చాయి. కాల్పానిక వాదం, మానవతా వాదం కవులకు, విద్యావంతులకు కొత్త చూపును కల్గించాయి. తత్ఫలితంగా ఆధునిక సాహిత్యం ఆవిర్భవించింది.
ఈ ప్రభావానికి మన తెలుగు కవులు పండితులు కూడా లోనయ్యారు. ఆధునిక సాహిత్యంవైపు ఆలోచనలు చేశారు. మన సంస్కృతిలో, సాహిత్యంలో మార్పులు అవసరమని భావించారు. దీనితో తెలుగు సాహిత్యంలో కొత్త సాహిత్య ధోరణి ప్రవేశించింది. యూరోపియన్‌ల రాకతో, వారు స్థాపించిన క్రైస్తవ మిషనరీలతో, వారు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్యావిధానంతో ఆధునికత వచ్చిందనుకుంటే, మిగిలిన తెలుగు ప్రాంతాలతోపాటు రాయలసీమలో కూడా ఆధునిక సాహిత్యం ప్రవేశించిందనే చెప్పాలి.

క్రీ.శ 1805లో రాయలసీమ ప్రాంతమైన జమ్మలమడుగులో ‘లండన్‌మిషనరీ సొసైటీ’ స్థాపితమయ్యింది. దీని ద్వారా వారు విద్యా వ్యాప్తి, మత ప్రచారం సాగించారు. క్రీ.శ. 1835లో స్థాపితమైన బాపిస్ట్‌సంఘం రాయలసీమ జిల్లాల్లో చురుగ్గానే పనిచేసింది. 1916లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఇది విద్యావ్యాప్తికి, అస్పృశ్యత నివారణకు కృషిచేసింది. క్రీ.శ.1900లో రాయలసీమలో 36 సాంఘిక సంస్థలున్నాయి. దీంతో కోస్తాప్రాంతంతో సమానంగా ఇక్కడ ప్రజలకు కూడా ఆధుని భావాలు పరిచయమయ్యాయి. అయినా రాయలసీమ వాసులు ఆధునికతలో వెనుకబడ్డారంటారు!
సమాజంలోకి ఆధునికత ప్రవేశించకుండానే 1872లో నరహరిగోపాలశెట్టి ‘శ్రీ రంగరాజచరిత్ర’ నవలను ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే కట్టమంచి రామలింగారెడ్డి 1899లో ‘కళాపూర్ణోదయం ప్రశంస’ అనే విమర్శను, ‘ముసలమ్మ మరణం’ అనే ఆధునిక కావ్యాన్ని ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే ధర్మవరం రామక్రిష్ణమాచార్లు, కోలాచం శ్రీనివాసాచార్లు ఇతోధికంగా ఆధునిక స్పృహతో నాటకాలు ఎలా రాయగలిగారు? ఆధునికత లేకుండానే రాయలసీమనుండి పత్రికలు వచ్చాయా? బళ్ళారినుండి 1835లో సత్యదూత, (దీనిని తొలితెలుగు పత్రికగా భావిస్తున్నారు), 1863లో శ్రీయక్షిణీ, 1875లో భారతి, కడప నుండి 1875లో ప్రబుద్ధాంధ్ర, కడప నుండి 1897లో ప్రభావతి- ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్య్రానికి పూర్వం దాదాపు యాభైకి పైగా పత్రికలు రాయలసీమనుండి వచ్చాయి. ఇవన్నీ రాయలసీమలో ఆధునికత ప్రవేశించకుండానే వచ్చాయా? నాగరాజు అనే పరిశోధకుడు ‘తొలి రాయలసీమ నవల’ అనే శీర్షికతో (సూర్య, 2013 జనవరి 28) 1950కి పూర్వం దాదాపు ఇరవైకి పైగా నవలలు రాయలసీమనుండి వచ్చాయని తేల్చాడు. 1926నుంచే రాయలసీమలో కథానికలు వచ్చాయి.

ఇవన్నీ రాయలసీమలో ఆధునికత లేకుండానే జరిగాయా?
1879లో ఆంధ్ర ప్రాంతంలో వితంతు వివాహం జరక్కమునుపే, పి. ఆనందాచార్యులు, ధర్మవరం రామకృష్ణమా చార్యులు రాయల సీమలో వితంతువివాహాలను జరిపినట్లు 1872 ఆగస్టు ‘పురుషార్థప్రదాయిని’లో పేర్కొన్నారు. పారిశ్రామి ప్రగతికి ప్రతీకగా భావించే ఆధునిక రవాణామార్గమైన రైల్వేలైన్‌ ఏర్పాటు మొట్ట మొదట 1862లో రేణిగుంట నుండి పుత్తూరు మధ్యనే జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమలో కూడా ఆంగ్ల విద్యాసంస్థలు, పత్రికలు, సంఘసంస్కరణ సంస్థలు రాయలసీమ ప్రజల జీవితాల్ని కొంతవరకు ప్రభావితం చేశాయి. దీనితో పాతభావాలు, మూఢన మ్మకాలు బలహీనపడడం మొదలైంది. నూతనభావాలు మొదలయ్యాయి. మన సంస్కృతిని సంస్కరించాల్సిన అవసర ముందని గ్రహించారు. ఆధునిక సాహిత్య పోకడలు కోస్తాప్రాంతంతోపాటు రాయల సీమలోనూ ఆలస్యంగానైనా మొదల య్యాయి. కానీ విసృతంగా కొనసాగలేదు. పారిశ్రామిక ప్రభావం రాయలసీమలోనే మొదలైంది. కానీ అన్ని రంగాలలో వ్యాపించలేకపోయింది. రాయలసీమ నాయకులు కూడా స్వతంత్ర ఉద్యమంతో పాటు కొన్ని సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. కానీ కందుకూరి వంటి గొప్ప సంస్కర్తలు ఒక్కరైనా ఇక్కడ లేకపోయారు.

కోస్తాప్రాంతంలో సంప్రదాయకవులు ఆధునిక సాహిత్యాన్ని అంతసులభంగా అంగీకరించలేదు. ఇదే సమయంలో కందుకూరి రాసిన ‘సరస్వతి నారద విలాపము’ కొంతసంచలనం కలిగించింది. ఆధునిక సాహిత్యప్రక్రియలకు కందుకూరే ఆద్యుడు. తర్వాత ఆధునిక సాహిత్యానికి రాయప్రోలు, గురజాడ మార్గదర్శకులుగా చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తొలి స్వీయ చరిత్ర, తొలి నాటకం, తొలి కథానిక, భాషాఉద్యమం, పత్రికలు వంటివన్నీ కోస్తాప్రాంతంలోనే మొదటవచ్చాయి. దీని ఆధారంగా మిగిలిన తెలుగుప్రాంతం కంటే కోస్తాప్రాంతం ఆధునిక సాహిత్యంలో ముందుందనేది విమర్శకుల అభిప్రాయం.
రాయలసీమవాసులు కూడా తాము ఆధునిక సాహిత్యంలో వెనుకబడి పోయామని మానసికంగా అంగీకరిస్తున్నారు. ఇది బాధాకరం.

నాటి రాయలసీమవాసులు కూడా ఆధునిక సాహిత్య ప్రక్రియల్ని అందిపుచ్చుకున్నారు. మన ముందు తరాల రాయలసీమకవులు, రచయితలు చేసిన ఆధునిక సాహిత్య కృషిని మనం గౌరవించాల్సి ఉంది. ఈ వ్యాసప్రధాన ఉద్దేశ్యం రాయలసీమ ఆధునిక సాహిత్యాన్ని ప్రాంతదృష్టితో చూడటమే. సంప్రదాయ సాహిత్యంలో ఓ వెలుగు వెలిగిన రాయలసీమ కవులు, పండితులు అంత సులభంగా ఆధునిక సాహిత్యం వైపు తమ దృష్టిని మళ్ళించలేకపోయారు. ఎందుకలా జరిగింది అనే విషయంపై కూడా లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. వారి సాహిత్య వారసులుగా దాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మనపై ఉంది. సమగ్రంగా ప్రాంత దృష్టితో సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. అంతే తప్ప ఇది మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోటీపడడం కోసం మాత్రం కాదు.
ఆధునిక సాహిత్యంలో కోస్తా ప్రాంత ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇది నూరుపాళ్ళు నిజం. అలాగని ఆధునికత రాయలసీమలో చాలా ఆలస్యంగా ప్రవేశించిందనడం అవాస్తవం.రాయలసీమలో ఆధునిక ప్రక్రియలు కొంతలో కొంత వెనుకబడ్డాయి తప్ప మరీ వెనుకబడలేదు. పత్రికలను స్థాపించడంలోనూ, ఆధునిక సాహిత్యవిమర్శలో, నవలా రచనలో, కధానికా రచనలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంలో రాయలసీమ వాసులు స్పందించారు.మరింతలోతుగా సమగ్రంగా ప్రాంతీయ దృక్పథంతో పరిశోధన జరిగితే రాయలసీమ ఆధునిక సాహిత్యం ప్రస్ఫుటంగా వెలుగులోకివస్తుంది. 
March 18, 2013, Surya daily 19-03-2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...