Tuesday, November 26, 2013

భౌగోళిక సమగ్రతే రాయలసీమకు రక్ష - లెక్కల వెంకటరెడ్డి

రాయల తెలంగాణ ప్రతిపాదన పాతదే. రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ నేతలు ప్రతిపాదనను తీసుకురాగా సీమ ప్రజానీకం దాన్ని ఆనాడే ఒక జోక్ కింద కొట్టిపారేసింది. కొందరు సీమ అభిమాన ధనులు మాత్రం ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా ఖండించారు. మరికొందరైతే దాన్ని తెర ముందుకు తెచ్చిన నేతలపై దుమ్మెత్తిపోసారు. అంతటితో సద్దుమణగవలసిన ప్రస్తావన ఇటీవలి కాలంలో తరచూ తెరపైకి వస్తూండడం రాయలసీమ చరిత్రను అధ్యయనం చేసిన నిష్ణాతులకు మింగుడు పడడం లేదు. రాయలసీమ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించే ప్రస్తావనను సీమ వాసులతో పాటు రాజకీయ పార్టీ కూడా మొన్నటి వరకూ స్వాగతించలేదు. అందువల్లనే రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాలమే అంశాన్ని వెంటనే తెరమరుగు చేస్తూ వస్తోంది.
రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు ముసాయిదాను రూపొందించేందుకు ఏర్పాటైన జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) విభజనకు సంబంధించిన 11 అంశాలను సూత్రీకరించి రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. తెలుగుదేశం మినహా ఆహ్వానాన్ని అందుకున్న మిగతా పార్టీలన్నీ జీవోఎం ముందు హాజరై తమ అభిప్రాయాలను వివరించాయి. కోవలో మజ్లిస్ పార్టీ తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ రాయల తెలంగాణను ఏర్పాటు చేయవలసిందిగా సూచించింది. అయితే సీమ మొత్తంగా కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలను మాత్రమే తెలంగాణలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరటం గమనార్హం! ఇది రెండు జిల్లాలకు చెందిన కొందరు అధికారపార్టీ నేతలు చేస్తున్న ప్రతిపాదనకు నకలు తప్ప ఇంకోటి కాదు. గతంలో కూడా ఒక సందర్భంలో మజ్లిస్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చింది. అయితే ఇప్పటిలా సీమ భూభాగాన్ని విభజించి రెండు జిల్లాలను మాత్రమే తెలంగాణతో కలపాలని చెప్పలేదు. మజ్లిస్ ఇలా వ్యవహరించటానికి కారణాలేమిటో అన్వేషించాలి.
మజ్లిస్ ఒకటి రెండు సందర్భాలలో రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చినప్పటికీ మొత్తానికి అది రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటోంది. విషయాన్ని మజ్లిస్ చాలా సందర్భాలలో స్పష్టం చేసింది. అందుకే సీపీఎం, వైఎస్ఆర్ పార్టీలతో పాటు మజ్లిస్ కూడా రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉందని మీడియా మధ్య తరచూ పేర్కొంటూ వచ్చింది. ఇటీవల జీవోఎం ముందు కూడా మొదటగా తాము రాష్ట్ర సమైక్యానికే ప్రాధాన్యం ఇస్తామని మజ్లిస్ నాయకులు చెప్పారు. విభజన అనివార్యమైన నేపథ్యంలో హైదరాబాద్ను యూటీ చేస్తే తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం మైనార్టీలకు తరచూ సమస్యలు తలెత్తుతాయని, అందువల్లే యూటీ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. హైదరాబాద్ను తెలంగాణలోనే ఉంచి అదనంగా కర్నూలు, అనంతపురం ప్రాంతాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటును కోరుతున్నట్లు వివరించారు.
రాయలసీమలోని రెండు జిల్లాల్లో ముస్లిం మైనార్టీలు గణనీయ సంఖ్యలో ఉన్నారని జిల్లాలను తెలంగాణలో కలిపితే తమ మైనార్టీల పరిస్థితి కాసింత మెరుగ్గా ఉంటుందని జీవోఎంకు మజ్లిస్ విశదీకరించింది. వాస్తవం ఏమైనప్పటికీ కేవలం మైనార్టీల ప్రయోజనాల కోసం ఒక ప్రాంత భూభాగాన్ని నిలువునా చీల్చాలని కోరడం హర్షించదగ్గ పరిణామం కాదు. ఇది సీమ చీలిక వాదులకు, వారిని ప్రేరేపిస్తున్న దుష్టశక్తులకు మరింత ఊతమిస్తుందని మజ్లిస్ నాయకులు గ్రహించకపోవడం విచారకరం. వారు రాయలసీమ భౌగోళిక రూపం, సంస్కృతీ సాంప్రదాయాలను పరిపాలనా క్రమ వ్యవస్థను పరిగణనలోనికి తీసుకోకపోవడమే అందుకు ప్రధాన కారణంగా భావించాలి.
మద్రాసు ప్రావిన్స్ నుంచి తెలుగువారంతా విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు రాయలసీమ సమగ్రంగానే తిరస్కరించింది. రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని సీమ యావత్తు తేల్చిచెప్పింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 40 ఏళ్ళ ముందు నుంచే సీమ మొత్తంగా ప్రత్యేక డిమాండ్స్తో తన సమగ్రతను చాటుకుంటూనే ఉంది. ప్రస్తుత రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమ యావత్తూ సమైక్యతకు కట్టుబడి ఉంది. విభజన అనివార్యమైతే తన సమగ్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ ప్రత్యేక రాయలసీమ కోసం సీమ గొంతుకలతో తన స్వరాన్ని వినిపించేందుకు సిద్ధంగానే ఉంది.
రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చిన సీమ నేతలు దాన్ని తీసుకురావటం వెనుక వారి వ్యాపార లావాదేవీలకు స్థానికత అంశం చేకూర్చుకోవడమే ప్రధానమైనప్పటికీ అదొక్కటే కారణంగా కనిపించడం లేదు. అదే కారణమైతే ప్రతిపాదన ఇంత వడివడిగా బలంగా అడుగులు ముందుకేసేది కాదు. కొన్ని పత్రికా కథనాలు తెలుపుతున్నట్లు కేంద్రం దురుద్దేశం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కుట్రపూరిత పథక రచన దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు బిల్లుకు మెజారిటీ అభిప్రాయాలు సాధించుకునేందుకు రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతంలోని సగం మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది. అంతేకాకుండా సీమ వాసులు ప్రత్యేక రాయలసీమ డిమాండ్ను తీసుకువచ్చి తలబొప్పి కట్టిస్తారనే భయం కూడా రాయల తెలంగాణలో భాగమౌతోంది.
రాయల తెలంగాణ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నట్లు హోం శాఖ వర్గాలు చెబుతూండడంపై వాదనలకు బలం కలిగిస్తోంది. అందుకే రెండు జిల్లాల కాంగ్రెసు నేతలు తమ ప్రతిపాదన సార్వజనీకమైనదని నమ్మబలుకుతున్నారు. మార్గంలో సదస్సులు సమావేశాలు జరిపేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు పార్టీ ఢిల్లీ పెద్దలు పరోక్ష ప్రోత్సాహమిస్తూ జిల్లాల కాంగ్రెసు నేతలు ఒకరొకరుగా మద్దతు ఇచ్చే విధంగా వారిని పురికొల్పుతున్నారు.
రాష్ట్ర విభజన అనివార్యమవుతున్నందున అనంతపురం, కర్నూలు జిల్లాలు సాగునీటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే తాము రాయల తెలంగాణప్రతిపాదన చేసినట్లు ప్రాంత అధికార పక్షనేతలు చెబుతున్నారు. అది సహేతుకంగా కనిపించడం లేదు. రాయలసీమకు సాగునీరు తుంగభద్ర, కృష్ణల నుంచే అందాలి.
వేరే దారిలేదు. నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ రెండు జిల్లాలకే సంబంధించినవి కావు. అన్నీ కూడా తెలంగాణతో పాటు సీమ నాలుగు జిల్లాలకు ప్రతిపాదించబడినవి. తుంగభద్ర జలాలు సీమ వాటాలో సింహభాగం అనంతపురానికే కేటాయించినప్పటికీ అవి రాకపోవడం వల్లనో లేదా చాలకపోవడం వల్లనో కర్నూలు కడప కాలువకు (కె.సి.కెనాలు) కేటాయించిన నీటిలో 10 టీఎంసీలను అనంతపురానికి కేటాయించారు. ప్రస్తుత ప్రతిపాదనతో నీటిలో కొంత శాతం కోతకు గురౌతుంది. అలాగే కృష్ణా జలాల ఆధారంగా నిర్మించబడుతున్న - నిర్మించిన ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులు ప్రతిపాదిత సీమ ప్రాంతానికి మొత్తంగా నీరందించేవే కానీ రాయల తెలంగాణలో భాగమైనంత మాత్రాన అనంతపురం కర్నూలు జిల్లాలకే పరిమితం కావు.
ఒకవేళ తెలంగాణ వారి సహకారంతో ప్రాజెక్టుల సాగునీరు జిల్లాలకే పరిమితం చేసుకోవచ్చని భావిస్తే అది వారి అత్యాశే లేదా వారి అజ్ఞానమే అవుతుంది. పైగా రెండు జిల్లాలకు కానీ నాలుగు జిల్లాలకు కానీ ప్రాజెక్టులకు సజావుగా సాగునీరు రానిస్తారని తెలంగాణ వారిని విశ్వసించటానికి వీలులేదు. ఎందుకంటే కృష్ణానదిపై శ్రీశైలం ఎగువభాగాన ఉన్న జూరాల ద్వారా మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు నీరు తీసుకుపోయే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే జూరాల నుంచి 70 టీఎంసీల ఎత్తిపోతల నీటి పథకానికి జీవో జారీ అయ్యింది. అందువల్ల రెండు సీమ జిల్లాలకు ప్రత్యేకంగా జరిగేదేమీ ఉండదు. రాష్ట్రం యథాతధ స్థితి కొనసాగితే తప్ప సీమకు సాగునీరు సవ్యంగా అందదు. లేదా ప్రత్యేక రాయలసీమలో ప్రత్యేక హక్కు ఒడంబడికల ద్వారా సాగునీటిని సాధించుకునేందుకు వీలు కలుగుతుంది తప్ప రాయల తెలంగాణతో ఎవ్వరికీ మేలు కలుగదు.
రాయలసీమ అస్తిత్వానికి, వేలాది సంవత్సరాల దాని సమగ్ర చరిత్రకు తీవ్ర హాని తలపెట్టిన కేంద్రం దుశ్చర్యలను, దుర్మార్గాలను, కుట్రలను, కుయుక్తులను తిప్పికొట్టేందుకు రాయలసీమ సమాయత్తం కావాలి. అందుకు రాయల తెలంగాణ ప్రతిపాదిత నేతలే నడుం కట్టాలి. సీమ వాసులు ముక్త కంఠంతో తమ చారిత్రక నేపథ్యాన్ని ఎలుగెత్తి చాటాలి. చేజార్చుకున్న సాగునీటి అవకాశాన్ని పొందటం తమ హక్కుగా నేను స్వరం వినిపించి పోరాడి సాగునీరు సాధించుకోవాలి.
చివరగా ఒక మాట. తుది వరకు సమైక్య బాట నడిచిన సీమ తన వంతు పోరాటం సాగించాలి! సమైక్యం వీలుకాని పక్షంలో శ్రీబాగ్ ఒండబడిక అమలును కోరుదాం! అదీ కుదరకపోతే సీమ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భౌగోళిక చారిత్రక అవసరాలతో ముడివడియున్న పాత రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాతో కలిసి గ్రేటర్ రాయలసీమను సాధించుకోవాలి. అదే సీమ సమగ్ర చరిత్రకు ఘనమైన సత్కారం!
-
లెక్కల వెంకటరెడ్డి
రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ANDHRAJYOTHY 26-11-2003

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...