Monday, December 9, 2013

కె.సభా కంటే ముందే చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన

' సూర్య ' అక్షరం పేజీలో 2013 నవంబర్‌ 11 న చిత్తూరు జిల్లా కథానిక పేరుతో శిబ్బాల ప్రకాష్‌ చిత్తూరు జిల్లా కథ ప్రారంభ, కొనసాగింపు, చరిత్ర వివరించే వ్యాసం రాశారు. ఆయన తన వ్యాసంలో కథానిక నిర్వచనం, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మధ్య కథానిక స్వరూపం కథానిక ఆవిర్భావం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. బాగుంది. కానీ, రాయలసీమ కథాచరిత్రను గురించి చెప్పకుండా ఉండడం కొంత వెలితిగా అనిపించింది. ఒక్క రాయలసీమలోనే గాక ఆంధ్రదేశంలోనే చిత్తూరు జిల్లాది ఒక ప్రత్యేక స్థానం. భౌగోళికంగా, రాజకీయ చిత్ర పటంలో, భాషలో వైవిద్యం కలిగి ఉంది. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానిక, నవల, విమర్శలలో తనదైన గుర్తింపు పొందిన జిల్లా చిత్తూరు.

చిత్తూరు జిల్లా కథానిక గురించి మాట్లాడితే- తెలుగు కథా సాహిత్యంలో గొప్ప కథకులుగా చెప్పుకోదగిన కొందరు కథకులు ఈ జిల్లాకు చెందినవారే. వారిలో కె. సభా, మధురాంతకం రాజారాం, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, పులికంటి క్రిష్ణారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటివారు ఉన్నారు. అయితే, రాయలసీమ కథా ప్రారంభం కె. సభాతో జరిగిందని విమర్శకుల అభిప్రాయం. ఈ ప్రభావం వలననే ప్రకాష్‌ కూడా కె. సభానే చిత్తూరు జిల్లా ప్రారంభ కథకులుగా పేర్కొన్నారు. ఇదే పత్రికలో (సూర్య- అక్షరం) 2012 డిసెంబర్‌ 31న ‘తొలి రాయల సీమ కథ’ పేరుతో రాయలసీమ కథాసాహిత్యం గురించి వ్యాసం వచ్చింది. రాయలసీమలో కె. సభాకంటే ముందు- చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన జరిగింది. ఆ కథకులలో ఎమ్‌.వి. పాపన్న గుప్త, చింతా నరసింహా రెడ్డి, టి.కె. రంగస్వామి అయ్యంగార్‌, మామిడి రుక్మిణమ్మ, పూతలపట్టు శ్రీరాములరెడ్డి లను పేర్కొనవచ్చు.

ఈ కథకులు చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా చెప్పుకుంటున్న కె. సభా కంటే ముందే ఆదర్శవంతమైన కథావస్తువులతో కథలు రాశారు. పైన పేర్కొన్న కథకులందరూ భారత కథానిధి మాసపత్రికలో 1927 లోనే కథారచన సాగించారు. చిత్తూరు జిల్లా తొలి కథ ‘శారద’ కథకుడు యమ్‌. వి.పాపన్న గుప్త- 1927 జనవరి, హైమావతి 1928, మలి కథలు- ‘సుందరి’ మామిడి రక్మిణమ్మ- 1927జనవరి; ‘ప్రేమానుబంధం’ చింతా నరసింహారెడ్డి-1927 జూలై; ‘ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర’ పూతల పట్టు శ్రీరాములరెడ్డి- 1928 డిశెంబర్‌; ‘నా చిట్టి తల్లి’ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌-1929 నవంబర్‌. ఈ కథలన్నీ 1926లో ప్రొద్దుటూరు నుండి వెలువడిన భారత కథానిధి పత్రికలో ముద్రితమైనవే. వీరిలో కొందరు కథకులనే విషయం సాహిత్య ప్రపంచానికి ఇంతవరకూ తెలియక పోవడం మన దురదృష్టం. వీరు కాక విద్వాన్‌ నెత్తం నరసింహులు కూడా హాస్య కథావళి పేరుతో 1965లో హాస్య కథలు రాశారు. ఆయన తప్ప తక్కిన పై వారందరూ కె. సభాకంటే ముందే చిత్తూరు జిల్లా కథా సాహిత్యానికి కృషిచేసినవారే. పై వారు రాసిన కథలను ఒకటి రెండింటిని పరిశీలిస్తే- 1927ప్రాంతంలోనే చిత్తూరు జిల్లాలో ఎంతటి ఆదర్శమైన కథాసాహిత్యం వెలువడిందో అర్ధమవుతుంది.

ఎమ్‌.వి. పాపన్న గుప్త రాసిన ‘శారద’ కథలో మూఢనమ్మకాలతో కూడిన సంప్రదాయాలు ప్రసాద రావు ప్రాణాలు ఎలా బలితీసున్నాయో తెలుపుతుంది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన శారదకు తల్లి కాంత లక్షుమ్మ ప్రసాదరావు కొడుకు క్రిష్ణారావుతో పెళ్ళిచేస్తుంది.ప్రసాదరావు పూర్వాచార పరాయణుడు. చెడ్డ నక్షత్రంలో కోడలిని కాపురానికి తెచ్చుకో కూడదని- కొడుకు కోడలు కలిసి ఉండకూడదని ఆక్షేపిస్తాడు. క్రిష్ణారావు బి.ఎ. చదువుకున్నాడు. తహశీల్దార్‌ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ నిర్వహణలో వేరే ఊరులో ఉంటాడు. పెళ్ళై రెండు సంవత్సరాలైంది. తండ్రి మాట ప్రకారం భార్యను తెచ్చుకోలేదు. తండ్రికి చెప్పకుండా ఓరోజు అత్తగారింటికి పోతాడు. తాను పూర్వాచారముల మన్నించువాడను కాదని వెంటనే తన వెంట శారదాను పంపవలయును- అని తన అత్తగారితో చెప్పి భార్యను తెచ్చుకొని కాపురం చేస్తుంటాడు.

ఈ విషయం తెలిసిన తండ్రి ప్రసాదరావు తన మాట వినకుండా శారదను తెచ్చుకున్నందుకు కోపంతో- ‘ఇక నీ గతి నీది, నా గతి నాది, లోక నింద పడజాలను గాన నేను పాషానణము గొని ఈ లోకంను బాయుచున్నాను’ అని ఉత్తరం రాసి ఆత్మహ త్య చేసుకుంటాడు. ఎందుకూ పనికిరాని సంప్రదాయాలకు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోయే వారికి ప్రసాదరావు ప్రతినిధి. మూఢనమ్మకాలను విస్మరించి సమాజాన్ని ముందుకు తీసుకుపోయేవారికి ప్రతినిధి క్రిష్ణారావు. భారత దేశంలో బాల వితంతువుల సమస్యకు బాల్య వివాహాలే కారణం అనే విషయం చర్చగా సాగే కథ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌ రాసిన ‘నా చిట్టి తల్లి’. ‘బ్రాహ్మణులలో కోమటి వారలలో ఉన్నంత మంది చిన్న వయసులోని ముండ మోపులు కాపువారిలో లేరు. ఇందుకు కారణము చిన్నతనపు పెళ్ళిళ్ళే. అందుకే శారద బిల్లు. అది ఇప్పుడు చట్టమైంది. ఇం మనకు బాగుం డును- అని సుందరి ఒక సన్యాసితో చెపుతుంది.

సుందరి ఆ సన్యాసే తన తండ్రి అని తెలుసు కుంటుంది. వితంతువైన సుందరి- అందుకు కారణం, తాను చిన్ననాడే పెళ్ళి చేసుకోవడంగా తండ్రికి చెబుతుంది.తరువాత తండ్రి కూతుర్లు ఒకరినొకరు తెలుసుకుంటారు. 1928-1929 మధ్య వచ్చిన శారదా చట్టం చిత్తూరు జిల్లా కథకులపైన ప్రభావం చూపిందనడానికి ఈ కథ సాక్ష్యం.చింతా నరసింహారెడ్డి 1927లో రాసిన ప్రేమానుబంధంలో ఆర్థిక సంబంధాలు మనుషులను ఎలా దూరం చేస్తాయో తెలుపుతుంది. ఒక అమాయకుడైన దళితుని కథ పూతల పట్టు శ్రీరాముల రెడ్డి రాసిన- ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర. తరువాత మరో చరయిత్రి మామిడి రుక్మిణమ్మ రాసిన- సుందరి- కథ. ఈ కథలన్నీ 1944లో కథారచన ప్రారంభించిన కె. సభా కంటే ముందే జరిగిన కథా రచనలు. కాలక్రమంగా పరిశీలిస్తే ఆధారాలు లభిస్తున్నంత వరకూ ఎమ్‌.వి. పాపన్న గుప్తా చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా, శారద కథ చిత్తూరు జిల్లా తొలి కథగా గుర్తించవలసి ఉంది.
-తవ్వా వెంకటయ్య 
December 9, 2013, Andhrajyothy daily "vividha".

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...