Friday, July 5, 2013

అస్తిత్వ ముప్పులో రాయలసీమ - చెన్నా గోవింద్

అయిపోయింది.. అంతా అయిపోయింది. రాయలేలిన రతనాల సీమను.. తెల్లదొరలకు నిజాం నవాబు అప్పగించిన దత్త మండలాలను.. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కోస్తాలో కలిసి, విశాలాంధ్రలో విలీనమై, సమైక్యంగా ఉన్న రాయలసీమను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం అడ్డంగా తెగనరికేందుకు సిద్ధమవుతోంది. రాయల గడ్డగా పేరొంది జగద్విఖ్యాతమైన రాయలసీమ అస్తిత్వానికి ఇప్పుడు ఎసరొచ్చింది. తెలుగుజాతిని, తెలుగు మాట్లాడే వారందరినీ విడగొట్టాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లున్నది. తెలంగాణ ఇచ్చేస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వేడి తగ్గడమే కాకుండా, రాజకీయంగానూ పార్టీని బలోపేతం చేసినట్లవుతుందని భావించిందేమో.. అసలే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీది ఏ అడ్డానో తెలియక సతమతమవుతున్నాయి. రాయల తెలంగాణ ఇచ్చేస్తే ఎక్కడ నుంచి ఎవరు బరిలో దిగాలో.. ఏ పార్టీ ఎక్కడ శాశ్వతమో కూడా చెప్పలేని పరిస్థితి. కేంద్రం నిర్ణయంపై ఏ పార్టీకి సంతృప్తి లేకపోవచ్చు. అలాగని బయటకు గట్టిగా చెబుతాయా అంటే కూడా చెప్పలేని గందరగోళ వాతావరణం.. ఏళ్ల తరబడి నాన్చి నాన్చి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు సన్నద్ధమయ్యారు న్యూఢిల్లీ పెద్దలు.

అన్ని రాజకీయ పార్టీలను , ఉద్యమ పార్టీలను టైం చూసి కొట్టింది కేంద్రం. తెలంగాణ ఇచ్చినా, గిచ్చినా అంతా తమదే బాధ్యతన్నట్లు వ్యవహరించి, ఇప్పుడు హోల్‌సేల్‌గా నూటికి నూరు మార్కులు కొట్టే సేందుకు కాంగ్రెస్ సై అంటోంది. ఇందుకోసం ఏ పార్టీ నుంచైనా, ఎక్కడినుంచి సమస్య మొదలైనా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేంద్రంలో చక్రం తిప్పే పెద్దలు పెద్ద కసరత్తే చేసినట్లున్నారు. కానీ పెద్దలకేం తెలుసు పిల్లల కష్టాలన్నట్లు.. ఢిల్లీలో కూర్చొని కబుర్లు చెప్పే నేతలకు సీమ కష్టాలేం తెలుసు? సీమ వాసుల అస్తిత్వమేం తెలుసు? రగిలిపోతున్న రాయలసీమ జనం ఎవరితో తమ గోడు చెప్పుకోవాలో తెలియని దారుణ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితమే పురుడుపోసుకుంది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉద్యమాలు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అది వారి హక్కు కూడా. కేంద్రంపై ఎంతవరకు ఒత్తిడి తేవాలో అంతా తెచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా రాయల తెలంగాణ అనే అంశంతోనే.. తెలంగాణ ప్రజలను శాంతింప జేసేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడును కంట్రోల్ చేసేందుకు, టిడిపిని అదుపు చేసి, జగన్‌ను మదుపు చేసేందుకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు, ఆ ప్రాంతంలో పార్టీ ప్రభావం తగ్గకుండా ఉండేందుకు, కేంద్రం అనేక కోణాల్లో చర్చోపచర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు.

కానీ మధ్యలో ఈ రాయల తెలంగాణ ఏంటి? ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను సృష్టించడమేనా పెద్దల నిర్ణయమంటే .. పది జిల్లాల తెలంగాణకు రెండు జిల్లాలు, ఆంధ్రకు మరో రెండు జిల్లాలను ఇవ్వడం అంటే చీల్చడమే కాదూ? ఇదెంతవరకు సమంజసం? రాయలసీమ అంటే అంత చిన్న చూపా? ఒక ప్రాంతాన్ని విడగొట్టడం, చేతికొచ్చినట్లు మ్యాపులు గీయడం అంటే అంత ఈజీనా.. ఇటు రెండు జిల్లాలు, అటు రెండు జిల్లాలని పంచడానికి అన్న దమ్ముల ఆస్తి గొడవలా? రాయలసీమ అంటే అసలే నాలుగు జిల్లాలు.. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం పరిస్థితి నేటికి దారుణమే.. ఎంతో మంది ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని ఇచ్చిన రాయలసీమను ఇప్పుడు రంపపుకోత కోయడం తగునా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు.. చంద్ర బాబు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా వైఎస్ రెండు సార్లు సీ ఎం అయినా సీమకు ఒరిగిందేమీ లేదు. వారి వారి జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చుకున్నా.. పూర్తి స్థాయిలో వాళ్ల జిల్లాలను కూడా అభివృద్ధి పర్చుకోలేదనే చెప్పొచ్చు. ఇక కర్నూలు, అనంతపురంది ఎలాంటి పరిస్థితో చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాల తరబడి రాయలసీమలో విషం చిమ్మన ఫ్యాక్షనిజం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కోలుకోలేని దెబ్బ తీసింది. చిత్తూరుజిల్లా పర్లేదననుకున్నా, అదీ అంతంత మాత్రమే. సీమలో నీటి వనరులు లేవు. ఉపాధి అవకాశాలు లేవు. ఆపద్బాంధవుల్లాంటి నేతలూ లేరు.


సమైక్యాంధ్ర అంటే తెలంగాణ వాళ్లు భగ్గు మంటారు. ప్రత్యేక తెలంగాణ అంటే సమైక్యమే ముద్దని కొందరు లేస్తారు. రాయల తెలంగాణ అంటే ఎవరి మనసులూ కరగడం లేదు ఎందుకో? ఎవరి సేఫ్టీ వారు చూసుకుని రాయల సీమను ఎలా విడగొట్టినా తమకేమవుతుంది.. తాము మాత్రం పొలిటికల్‌గా బాగున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రజల మనస్తత్వాలకు, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు విలువనిచ్చే నేత, రాయలసీమ నేలపై లేనే లేడని ఇప్పుడు సీమజనానికి బాగా అర్థమవుతోంది. కేంద్రం రాయల తెలంగాణ అంటే నోరు పెగలడం లేదు. బెల్లంకొట్టిన రాయిలా ఎవరికివారు సైలెంట్‌గా ఉండి రాయల తెలంగాణ నిర్ణయం రైటే అన్నట్లు సంకేతాలిస్తున్నారు. రాళ్లసీమను కూడా దండుకుని కోట్లు కూడగట్టుకున్న నాలుగు జిల్లాల నేతల గుండెలు అంత బండబారి పోయాయి! లేక ఆస్తులు కాపాడుకునేందుకు కేంద్ర నిర్ణయానికి మద్దతిస్తున్నారా? తుంగభద్ర పక్కనే ఉన్నా అనంతపురం వాసులకు తాగడానికి నీళ్లుండవు. కర్నూలు నడిబొడ్డున కృష్ణ ప్రవహించినా, అనుకున్నమేరకు పంటలుండవు. పీనిగల ఏరుగా ప్రసిద్ధికెక్కిన పెన్నా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఏడాదికి రెండు పంటలు సర్వసాధారణం.

చాలా చోట్ల మూడు పంటలు కూడా చేతికొస్తాయి. వరదొచ్చినా, వానరాకున్న వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది వారి అదృష్టం కావచ్చు. కృష్ణా, గోదావరి కరుణ కావొచ్చు. ఏడాదికి ఒక పంట పండితే చాలురా దేవుడా అనుకునే రాయలసీమలో భూదేవిని నమ్ముకుని, నట్టేట మునిగిన రైతుల గోడు వినేదెవరు? అనంతపురం జిల్లాలో పెద్ద పంట అంటే వేరుశనగే .. కర్నూలులో వరి, మామిడి. కడపలో వరి, అక్కడక్కడా వాణిజ్యపంటలు. ఆ మూడు జిల్లాల కంటే కాస్త ఎక్కువగా ఏదైనా పండుతుందంటే అది చిత్తూరు జిల్లాలోనే. ఫ్యాక్షనిజాన్ని అడ్డుపెట్టుకుని నేతలు ఎదిగారే కానీ, పంటలు నమ్ముకొని బాగుపడిన రైతులు రాయలసీమలో చాలా తక్కువ. ఇది ఎవరైనా ఎరిగిన సత్యం. 2014లో ముఖ్యమంత్రి కావాలని వేల కిలో మీటర్లు నడిచి, ప్రజల వద్దకు వెళ్ళిన చంద్రబాబు, ఉత్తరాఖండ్ ఉదంతంపై ఆగమేఘాల మీద స్పందించి అండగా నిలిచిన చంద్రబాబు ఒక్కరే ఇప్పుడు రాయలసీమకు పెద్ద దిక్కు. ఎందుకంటే సమైక్యరాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారో.. అనేది అందరికంటే ఆయనకే పెద్ద పరీక్ష. ఆయన తీసుకునే నిర్ణయం, రాయల తెలంగాణపై కేంద్రానికి ఇచ్చే అభిప్రాయంపైనే నలిగిపోతున్న నాలుగు జిల్లాల భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇక జైల్లో ఉన్నా జెరూసలేంలో ఉన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక నిర్ణయంతో ఉన్న జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ తరఫున ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తారో ఆయనకే తెలియాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం దెబ్బ తినకుండా ఉండేందుకు సీమాంధ్రలో ఆదరణ ఉన్న జగన్‌ను, మరోసారి ముఖ్యమంత్రి కావాలని సర్వశక్తులూ ఒడ్డుతున్న చంద్రబాబునూ దెబ్బ తీయాలనే ఒకే అంశంతో రాయల తెలంగాణను తెరమీదికి తెచ్చి.. టీఆర్ఎస్‌ను అట్నుంచీ నరుక్కొచ్చి, ఆ పార్టీని క్రాస్‌రోడ్స్‌లో నిలబెట్టి నయా పొలిటికల్ గేమ్ (కొత్త రాజకీయ క్రీడ) కు తెర లేపారు. 2014లో రాహుల్‌ను ఎలాగైనా ప్రధాన మంత్రి పీఠంపై కూర్చో బెట్టేందుకు, నరేంద్ర మోడీ హవాను తట్టుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు కొల్లగొట్టడంపైనా దృష్టి సారించి.. ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఏది ఏమైనా రాయలసీమకు మాత్రం తీరని ద్రోహం జరుగుతుంది. ఇద్దరు నేతలను నిలువరించేందుకు ఇంత దారుణానికి ఒడిగట్టడం న్యాయమా? రాష్ట్రాన్ని విభజించేందుకు ఏ మాత్రం సంబంధంలేని రాయలసీమను అడ్డంగా తెగనరకడం సమంజసమా? రాయలసీమ జనులారా, ఆలోచిస్తున్నారా?

-చెన్నా గోవింద్ Andhra Jyothy 06-07-2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...