Friday, August 30, 2013

రాయల తెలంగాణా జె.సి, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, టి.జి.వెంకటేశ్‌ ల పిచ్చి ప్రేలాపన

రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని 2009 డిసెంబరులో ప్రకటన వచ్చి నప్పుడు, విభజనను సి.డబ్ల్యూ.సి కేంద్ర ప్రభుత్వ సమన్వయ కమిటీ అంగీకరించినట్లు 2013 జూలై 30న ప్రకటన వెలువడినపుడు సమైక్య రాష్ట్రమే కావాలనిఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. విచిత్రంగా కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగతమని చెప్పి రాయల తెలంగాణా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆధ్యులో-అల్పులో తెలియదు గానీ జె.సి.దివాకర రెడ్డి, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, టి.జి.వెంకటేశ్‌ మొదట ఈ ప్రస్తావన తెచ్చారు. కొంత అటు ఇటుగా, యం.ఐ.యం. కూడా దీన్ని నెత్తి కెక్కించుకొంది. విభజన అంశాన్ని ఎలా పరిష్కరించాలి? హైదరాబాద్‌ సమస్య ఏమిటి? నీటి పంపకాలస్థితి ఎలా? అన్న వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో పడిపోయిన కాంగ్రెసు హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వంలోని మరుగుజ్జులు రాయల తెలంగాణ అయితే ఎట్లా ఉంటుంది? పూర్తిగా కాకపోయినా కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపి 12 జిల్లాలతో తెలంగాణా ఇస్తే ఎలా ఉంటుంది? అని పిచ్చి ప్రేలాపనలు, చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని దివాకర్‌ రెడ్డి రోజూ అదే పాటపాడుతున్నారు. తెలంగాణావాదులు మీరు మాతో వద్దు అంటూ ఉంటే కాదు వెంటపడుతాం అంటున్నారు.

రాయలసీమ విశిష్ట సంస్కృతి - ప్రత్యేకతలు: సీమాంధ్ర పదప్రయోగమే రాయలసీమ ఆస్థిత్వాన్ని మరుగున పర్చుతుంటే ఇక రాయలతెలంగాణా అంటున్నవారు ముందు రాయలసీమ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? దాని విశిష్టత, ప్రత్యేకత ఏమిటి అన్న దాన్ని తెలుసుకుంటే ఇలా మాట్లాడరు.7వ శాతబ్దం నాటి తూర్పు చాళుక్యుల పాలన చూచినా, 15వ శతాబ్దం నాటి విజయనగర రాజుల పాలన చూచినా, బ్రిటిష్‌ ఇండియాలో నైజాం పాలన చూచినా, కంభం పాటి సీనియర్‌ ఆంధ్రుల చరిత్ర -సంస్కృతి చూచినా, సురవరం ప్రతాప్‌రెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూచినా రాయల సీమ ప్రత్యేకతలు, ప్రజల మద్య ఉన్న ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయ సంగీత, సాహిత్య ఆదాన -ప్రదానాలు, ప్రకృతి పరమైన సారూప్యతలు, సామీప్యతలు, పరాయి పాలకుల దోపిడీ, పీడనలు, పాలెగాండ్ర ఏలుబడులు, పౌరాణిక, ఆధ్యాత్మకతల ఉమ్మడి సంస్కృతి అర్ధమవుతుంది.
ఇవేమీ పట్టించుకోకుండా నేను, నా రాజకీయ-ఆర్థిక భవిష్యత్‌, నా ఆస్థులు, నా కులం రాజకీయాలు, మా మత రాజకీయాలు మాత్రమే మనగలగాలని పాకులాడే సంకుచితులు మాత్రమే ఇలాంటి అశాస్త్రీయమైన, అసహేతుకమైన, ఆచరణ యోగ్యం కాని మతిలేని ప్రతిపాదనలు తెరపైకి తెస్తారు. నవంబరు 17-18 తేదీల్లో నంద్యాలలో కడప కోటి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఈ ప్రాంతానికి రాయలసీమ పేరు పెట్టాలని చిలుకూరి నారాయణరావు ప్రతిపాదించారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
''వదరుబోతు'' పత్రికాసంపాదకులు పప్పూరి రామాచార్యులు, గుత్తి కేశవపిళ్ళే, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, టి.యస్‌.రామక్రిష్ణా రెడ్డి మొదలైన మొదటితరం నాయకులూ, రాళ్ళపల్లి, గడియారం వెంకట శేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణా చార్యులు, విద్వాన్‌విశ్వం, తిరుమల రామచంద్ర లాంటి కవులు, విద్వాంసులు రాయలసీమ అన్న పేరుకు విస్తృత ప్రచారం కల్పించారు. గతంలో హిరణ్యక రాష్ట్రం, ములికినాడు, రేనాడు పేర్లు కల్గిన ఈ ప్రాంత ఆధునిక చరిత్రలో రాయలసీమగా స్థిరపడింది. గత చరిత్ర అంతా కాకపోయినా విజయనగర రాజుల కాలం నుండి నేటి వరకూ రాయలసీమ చరిత్రను పరికిస్తే ఎన్నో సారూప్యతలు, ఉమ్మడి సంస్కృతులు అవగతమవుతాయి. ఆ విషయాలన్నింటిని చెప్పడం ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. రాయలసీమ ఉమ్మడి సంస్కృతిని ధ్వంసం చేయవద్దు అని చెప్పేటంత వరకే పరిమితం.
1882లో బళ్ళారి నుండి విడిపోయి అనంతపురం జిల్లా ఏర్పడింది. 1910లో కడప జిల్లాలోని కదిరి, ముదిగుబ్బ, నల్లమడ, యస్‌.పి.కుంట, తలపుల, నల్ల చెరువు, ఓడి చెరువు, తదితర ప్రాంతాలను అనంతపురం జిల్లాలో కలిపారు. తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలోని చిత్తూరు, చంద్రగిరి, పలమనేరు ప్రాంతాలను, అలాగే కడప జిల్లాలోని వాయల్పాడు, మదనపల్లి లాంటి తూర్పు కనుమల ప్రాంతాన్ని కలిపి 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో బళ్ళారి కర్నాటకలోకి పోయింది. ఇదే కాలంలో కాందనోల్‌ అనే ప్రాంతం కర్నూలుగా స్థిరపడింది. బ్రిటిష్‌ కాలం నుండి కె.సి.కెనాలు కడప-కర్నూలు జిల్లాలను కలిపి అనుసంధానం చేస్తూనే ఉన్నది. క్రిష్ణా, పెన్నాల సంగమంగా కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. బళ్ళారి, గుంతకల్లు, గుత్తి, కడప, సిద్దవటంల నుండి నెల్లూరు జిల్లాతో పెనవేసుకొని పెన్నా నది ప్రవహిస్తున్నది. స్త్రీ నడుంకు బిగించిన వడ్డాణం మాదిరిగా పెన్నానది గుత్తికోట, గండికోట, సిద్దవటం కోట గోడలను పరుచుకొని పారుతూ సాగర సంగమం చేస్తున్నది. పెన్నానదికి కర్నూలు జిల్లా నంద్యాలపై భాగం నుండి వచ్చే వక్కిలేరు, కందూనదులు, సగిలేరు (మార్కాపురం) చిత్రావతి (అనంతపురం -కర్నాటక) బాహుదా, మాండవ్యాలు కలిసే చెయ్యేరు (చిత్తూరు -కడప) చిత్తూరు -కడపల మీదుగా సాగే పాపాగ్ని నదితో సహా అన్నీ కూడ పెన్నకు ఉపనదులే.
సీమను కలిపి ఉంచే మరో ప్రకృతి సారూప్యం-సామీప్యత నల్లమల, ఎర్రమల, శ్రీశైల పర్వతసానువులు. ఇవి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను తాకుతూ వ్యాపించి ఉన్నాయి. అలాగే శేషాచలపర్వతాలు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను చుట్టి కప్పివేసి ఉన్నాయి. తూర్పు -పడమటి కనమల మద్య చీలిన భూభాగం -ఒకే పాలనా విభాగం క్రింద ఉన్న సీమ ప్రాంతానికి సంగీత -సాహిత్య కళారంగాల్లో కూడా విడదీయరాని బాంధవ్యం - అనుబంధం ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల భువన విజయంలో రాటు దేలిన ఉద్దండ పండితులు అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన్న, అయ్యల రాజు రామభద్రుడు మొదలగు వారంతా రాయలసీమ జిల్లా వారే. వారి ప్రబంధ సాహిత్యానికి ప్రేరణ, భూమిక రాయలసీమ ఉమ్మడి సంస్కృతే. ఇక త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య పదకవితలు సీమ ప్రజల సహజ సంపదల తీపి గుర్తులు చెప్పనలవి కాదు. ప్రజల వ్యవహారిక తెలుగు బాషా సాహిత్యంలోకి సంగీతాన్ని చొప్పించిన దిట్టలు. రాయలసీమ నుడికారాలను తేట తెలుగులో పాటలు అల్లిన వారు. బహు బాషా కోవిధుడు, శివతాండవ కృతికర్త పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండలో పుట్టి -ప్రొద్దుటూరు లో పెరిగి -కడపలో తనువు చాలించి నా ''మంచివారలు మావారు- మానధనులు'' అన్నా ''ఇచ్చటి చిగురు కొమ్మలకైనను చేవ యుండు'' అని చెప్పి సీమ ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటారు. చిత్తూరు జిల్లాలో పురుడు పోసుకొని కోస్తాలో మొగ్గతొడిగి, మైసూరు రాష్ట్రంలో ప్రభలు కొల్పి యమ్‌ యన్‌ రారు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, నెహ్రూ లాంటి రాజనీతిజ్ఞుల చేత శెహభాష్‌ అనిపించుకొన్న కట్టమంచి రామలింగారెడ్డి, కళా పూర్ణోదయం లోని రాయలసీమ రైతాంగ వర్ణనలు మరచిపోగలమా? దువ్వూరి రామిరెడ్డి ''నేడ కేగితవమ్మా కోయిలా యమ్మలాడి నీ రసార్ధ్ర కంఠంబెత్తి గానామృతం జల్లుమా'' అని రైతులను, కూలీలను వారు చేసిన కాయకష్ఠం నుంచి ఉపశమనం పొందడానికి చెప్పిన ప్రకృతి సుందర సోయగాల ఉమ్మడి వారసత్వాన్ని వద్దనుకొందామా? సాహిత్యంలో తెలుగు జాతి గర్వించ దగ్గ మేధావి, మార్కిస్టు విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్యల అభ్యుదయ కోణాన్ని వదిలేద్దామా? జిడ్డు క్రిష్ణమూర్తి, వేమన, వీరబ్రహ్మాం బోధనలూ, తెలుగుజాతి ఐక్యత కొరకు, ''మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మముగన్న తల్లికి మంగళారుతులు'' అన్న శంకరంబాడి సుందరా చార్యులను ఎక్కడకు పంపిద్దాం? పద్య కవులు తిరుపతి వెంకట కవులను విస్మరిద్దామా? గడియారం వెంకట శాస్త్రి, రాళ్ళ పల్లి అనంత క్రిష్ణ శర్మలను ఎక్కడ కలిపేద్దాం? విద్వాన్‌విశ్వం మహోజ్వల కావ్యం ''తెన్నేటి పాట''కు రాళ్ళపల్లి వారు ముందు మాట రాస్తూ నేడు ఆఖిలాంధ్రప్రదేశ్‌లో ''మా రాయలసీమ ఒక ప్రత్యేక చారిత్రక కళాఖండం'' అని వక్కాణించారు. రాయలసీమ కరువు కథలను ప్రపంచానికి చాటిచెప్పిన కేతు విశ్వనాధరెడ్డి, సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారాం, తరిగొండ వెంగమాంబ, శ్రీపాద పినాకపాణి తదితరుల సాహిత్య సేద్యం నుంచి జాలువారిన సీమ ఉమ్మడి కళా సంస్కృతులను విడదీయడం నేరం కాదా?. సినిమా రంగం ద్వారా కె.వి.రెడ్డి, బి.యన్‌.రెడ్డి, చక్రపాణి గార్లు రాయలసీమ ఉమ్మడి సంస్కృతిలోంచి వచ్చిన భాషా మాండలికాలను, యాసలను, వైవిధ్య భరితమైన ఉమ్మడి కుటుంబ జీవితాన్ని తెలుగు సమాజానికి అందించిన మంచి సంస్కారాన్ని విడదీయడం భావ్యమా? రాయల తెలంగాణ ఆచరణ యోగ్యం కాదు. కానేరదు కూడా. నీటి వనరులు, భూగర్భ ఖనిజ సంపదలు అటవీ సంపదల విషయంలో ఒక జిల్లాతో ఇంకో జిల్లా ముడివడి పెనవేసుకొని ఉన్నాయి. విడదీయడం ఎవ్వరికీ ప్రయోజనం కాదు. కాదని మూర్ఖంగా విడగొట్టినా ప్రాంతాల మద్య నిత్య కలహాలు రాజుకుంటూనే వుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పాలనాపరంగా ఒకటిగా ఉన్నా -తెలంగాణా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలు వాటి ప్రత్యేకతలతో విశిష్ట సంస్కృతులతో, ఆచార వ్యవహారాలతో ప్రత్యేకంగానే కొనసాగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో ప్రాచుర్యంలో ఉన్న అట్లతద్దె, తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు. తెలంగాణా జానపద జీవితంతో ముడిపడిన సమ్మక్క -సారక్క జాతరలు, రాయలసీమలోని గంగజాతరలు కోస్తా ఆంధ్రలో లేవు. అలాంటప్పుడు రాయలసీమను రెండుగా చీల్చి ఒక భాగాన్ని కోస్తా సంస్కృతిలో, ఇంకో భాగాన్ని తెలంగాణ సంస్కృతిలో కలపాలని చూడడం అవివేకం.
తుంగభద్ర, పెన్నా బేసిన్‌లు, కృష్ణా బేసిన్‌లో కలసి ఉన్నాయి. తుంగభద్ర -పెన్నాబేసిన్‌లు సీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు వరకూ విస్తరించింది. శ్రీ శైలం నికర, మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు 1) కె.సి.కెనాలు కడప, కర్నూలుకు పారుదల ఇస్తున్నది. 2) యస్‌.ఆర్‌.బి.సి కూడా అంతే. కర్నూలు జిల్లాలోని అవుకురిజర్వాయరు నిండి-అక్కడి నుండి గోరకల్లు-దాని తర్వాత గండికోటకు నీళ్ళు రావాలి. 3) హంద్రీ -నీవా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు పారుదల సౌకర్యాన్ని ఇస్తుంది. 4) గాలేరు -నగరి, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు, 5) తెలుగు గంగ -కర్నూలు జిల్లా వెలిగొండ, అటుతర్వాత బి.మఠం దాని తర్వాత సోమశిలనుంచి చిత్తూరు జిల్లాలకు పారుదల కల్పిస్తుంది. మరి సీమలో రెండు జిల్లాలు ఒక రాష్ట్రంలో, రెండు జిల్లాలు ఇంకోక రాష్ట్రంలో ఉంటే ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? ఒకే రాష్ట్రంలో ఉండగానే కర్నాటక, మహారాష్ట్రల పేచీలతో తగవునుడుస్తూ ఉంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో కోస్తా -తెలంగాణాతో తగవునడుస్తూ ఉంటే, ఇక రాయల తెలంగాణా అయితే ఏ బావిలో దూకాలో? విధూషక పాత్ర పోషించే కాంగ్రెస్‌ నాయకులకే ఎరుక.
చరిత్రలో సీమకు 1937 నుంచి 1956 వరకూ జరిగిన అన్యాయం, (శ్రీబాగ్‌ వడంబడిక, విశ్వవిద్యాలయం, రాజధాని) ఆ తర్వాత క్రిష్ణా -పెన్నార్‌కు బదులుగా సిద్దేశ్వరం -గండికోట ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం పరిశీలిస్తే -సీమ రెండు రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతే జరిగే అరిష్ఠం అంతా ఇంతాకాదు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను తిరిగేస్తే దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి కోట్ల విజయ భాస్కర రెడ్డి, నారాచంద్రబాబు నాయుడు, వైయస్‌.రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డిలే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. అయినా సీమకు వొరిగిందేమీలేదు. కుడి -ఎడమల దగాతప్ప. సీమలో నివసిస్తున్న 1,51,74,908 ప్రజలకు వొనగూడే ప్రయోజనం శూన్యం. పైపెచ్చు సంఘటితంగా పోరాడే శక్తి, బలంగా వినిపించే గొంతుకలు మూసుకపోవడం, రేణాటిపౌరుషం, సీమ ఆత్మాభిమానం అడుగంటిపోవడం జరుగుతుంది. సీమవాసులు ఈ కుయుక్తులను తప్పకుండా ప్రతిఘటించాలి.
-జి.ఓబులేసు, సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...