Friday, August 30, 2013

రాయలసీమ ప్రాథమ్యం నీళ్ళు! నీళ్ళు! నీళ్ళు! - బండి నారాయణస్వామి

రాజధానిని నిర్మించుకోవచ్చు కానీ, నీళ్ళను నిర్మించుకోలేం.
నేడు నడుస్తున్న లేదా నడుపుతున్న ఉద్యమాల వెనక సిద్ధాంతాలు లేవు. తాత్విక భూమికలు లేవు. త్యాగాలు లేవు; అయితే ఆకాంక్షలూ లేకపోతే ఆగంతమూ తప్ప! రాచరికంలో యథారాజా తథాప్రజా చెల్లుబాటు అయింది కానీ, ఎన్నికల వ్యవస్థలో యథాప్రజా తథారాజా అనేదే చెల్లుబాటు అవుతుంది.
రాజశేఖర రెడ్డి, టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడూ సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేశారు. చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడూ సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశానికి ఓట్లేశారు. తెలంగాణ ఇస్తే అడ్డుకోబోమని చెప్పిన వైకాపాకు కూడా సీమాంధ్ర ప్రజలు ఉప ఎన్నికల్లో ఓట్లేశారు. కానీ హైదరాబాద్ విషయం వచ్చేటప్పటికి సీమాంధ్ర ప్రజల ఆసక్తులు మారిపోయాయి. విభజన క్రమంలో హైదరాబాదు రెవెన్యూలో వాటా అడిగితే తప్పులేదు. కొత్త రాజధాని కోసం కేంద్రాన్ని ప్యాకేజీ కోరితే తప్పులేదు. కానీ హైదరాబాదును అడ్డం పెట్టుకుని సమైక్యవాదులు రాయలసీమ నీటి ప్రాథమ్యాన్ని విస్మరించడం విషాదకరం.

ముఖ్యంగా అనంతపురం సాగునీటి సమస్యను అనంతపురం సమైక్యవాదులు విస్మరించడం దారుణం. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నది పట్టణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. ఉద్యమంలో ఏ తరగతి ప్రజలు పాల్గొంటారో ఆ వర్గపు ఆకాంక్షలే ప్రతిఫలించడం ఒక నైజమే కావచ్చు. కానీ కడుపు నిండిన వాడు మిఠాయి కోరుకోవడం కన్నా కడుపు నిండని వాని పక్షం వహించడం మానవ న్యాయం. ఆ మానవ న్యాయాన్ని పట్టణ మధ్యతరగతి ఉద్యమకారులు తమ పల్లెటూరి రైతుల నీటి ఆకాంక్షల పట్ల ప్రదర్శించవలసిన అవసరమొచ్చింది.


అది సమైక్యాంధ్ర కానీ, ప్రత్యేక రాయలసీమ కానీ, రాయల తెలంగాణ కానీ...! ఏ విభజన అయినా, ఉద్యమమైనా సాగునీటి కేంద్రంగానే సాగవలసిన చారిత్రక సందర్భం ఇప్పుడు తారసపడింది. డెబ్బై శాతానికి చెందిన రైతుల నీటి సమస్యను ఉద్యమ ప్రాథమ్యంగా స్వీకరించి, హైదరాబాదు ఆకాంక్షను రెండవ ఆసక్తిగా గుర్తించినప్పుడే రాయలసీమ గడ్డకు న్యాయం జరుగుతుంది. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకున్నట్లవుతుంది. అలా కాకుండా హైదరాబాదు మాత్రమే ఏకమంత్రమన్నట్లు ఉద్యమిస్తే రాయలసీమ రైతుకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం.

భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన అనంతపురం పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంటే; పదహైదేళ్ళ తరువాత ఎలా ఉంటుందో ఊహించుకుంటే మరింత భయంకరంగా ఉంటుంది. అనంతపురం రైతుకు కావాల్సిన నూరు టీఎంసీల నీటి గురించి పోరాటానికి ఇదే సరైన సందర్భం. ఈ విభజన సందర్భాన్ని నీటి పోరాటానికి అన్వయం చేయలేని ఉద్యమకారులు భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతారు? నీళ్ళే నాగరికత అంటాడు ఒక అనంతపురం రచయిత.


భవిష్యత్తులో చరిత్రహీనులు కాకుండా తమను తాము కాపాడుకోవాలంటే ఉద్యమకారులు అనంతపురం నీళ్ళ గురించి డిమాండు చెయ్యక తప్పదు. కేంద్ర ప్రభుత్వం నుంచీ, ట్రిబ్యునల్స్ నుంచీ హామీలు, వాగ్దానాలు పొందేవరకూ ఉద్యమించక తప్పదు. తుంగభద్రలో ఎనభై శాతం నీటికి బదులు ఎనభై శాతం విద్యుత్తును కోరుకున్నాం. ఆ రకంగా విద్యుత్తేమో రాష్ట్రానికి అంతకీ చెందితే, నీళ్ళు లేని నష్టమేమో రాయలసీమ మాత్రమే భరించవలసి వచ్చింది. ఇదీ రాయలసీమ రైతుకు జరిగిన మోసం. ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి ఇదే సరైన చారిత్రక సందర్భం. పట్టణవాసులు తమ ప్రయోజనాల కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ తమకు అన్నం పెట్టే రైతు ప్రయోజనాలను పట్టించుకోకపోతే గ్రామ వివక్షకు పాల్పడిన వాళ్ళం అవుతాం. చరిత్ర క్షమించదు. పట్టణ వాసులు నీళ్ళు లేకపోతే డబ్బుతో కొనుక్కుని తాగుతారు. కానీ రైతులు ఎన్ని నీళ్ళను కొని వరి మడులు తడపగలరు? ఎన్ని నీళ్ళను కొని వేరుశనగ పండించగలరు?

పట్టణ ప్రజలారా! విద్యావంతులారా! మన ఉద్యమ ఫలాలను మొదట మన రాయలసీమ రైతులకే దక్కనిద్దాం. అనంతపురం జిల్లాకు నీటి కళ తెచ్చి మన అన్నదాత రుణం తీర్చుకుందాం. సమైక్యాంధ్రలో ఉంటే అనంతపురానికి నీళ్ళు వస్తాయా? సీమాంధ్ర వస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా? ప్రత్యేక రాయలసీమ వస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా?... లేక కర్ణాటకలో కలిస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా?
నీళ్ళు! నీళ్ళు! నీళ్ళు! అదే మన ప్రాథమ్యం. ఏ ఉద్యమమైనా నీటి ప్రాతిపదికగా మాత్రమే చేద్దాం!

రాజధానిని నిర్మించుకోవచ్చు కానీ, నీళ్ళను నిర్మించుకోలేం.
                                                                                                  - బండి నారాయణస్వామి

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...