Saturday, June 1, 2013

అనంతపురం జిల్లాలో ఆధునిక కథా వికసనం

1910లో పుట్టిన తెలుగు కథానిక 1940  తర్వాత గాని రాయలసీమ లోకి అడుగు పెట్టలేదు. అందుకు గల కారణాలు చాలా వున్నప్పటికీ, ప్రధాన కారణం ఇక్కడ ఆధునిక జీవితమే ఆలస్యంగా ఆరంభం కావటం ! మరొక కారణం రాయలసీమ రచయితలు, కవులు గ్రాంధిక భాషా వ్యామోహం నుంచీ, ప్రాచీన సాహిత్య వస్తు రూపాల నుండీ బయట పడక పోవటం.!
రాయలసీమలో ఒక భాగమైన అనంతపురం జిల్లాలో మరీ ఆలస్యంగా 1970 తర్వాత గాని ఆధునిక కథా వికసనం జరగలేదు. అయితే 1941 ప్రాంతాల్లోనే జి.రామకృష్ణ అనే ఒక సీనియర్ జర్నలిస్టు చిరంజీవి అనే పేరుతో గల్ఫిక లాంటి ఒక చిన్న కథను విజయవాణి అనే పత్రికలో ప్రచురించాడు. ఆయన అలాంటి చిన్న కథలను మరో నాలుగైదు రాసినప్పటికీ ఆయన రచనల ప్రభావం సమకాలికుల పట్ల లేకపోవటం వల్ల అనంతపురం జిల్లాలో కథానిక ప్రయాణం స్తబ్దతలో పడిందనే చెప్పాలి. ఆయన 1953 లో ఆంధ్ర ప్రభ వార పత్రికలో ప్రచురించిన ‘ గంజికోసరం’ అనే కథ మాత్రం  చాలా మంది దృష్టికి వచ్చింది. అప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్రంగా నెలకొన్న కరువును చిత్రించిన కథ అది. ఆ సంవత్సరం కరువు తీవ్రతను తట్టుకోవటానికి ప్రభుత్వం గంజికేంద్రాలను ఏర్పాటు చేసింది.కరువు కారణంగా ఊళ్లకు ఊళ్ళు వలస బాట పట్టినాయి. అలా వలస వెళ్ళిన ఒక కుటుంబం కథ ఈ ‘గంజికోసరం’. ఆ కుటుంబంలోని వారందరూ పనుల కోసం వలస వెళ్లగా . ఇంట్లో ఒక ముసలి అవ్వ, ఆమె కోడలు , మనవరాలు మాత్రం మిగులుతారు. రోజులు గడచే కొద్దీ వాళ్ళకు ఇంత  తిండి కూడా దొరకటం కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల వూరికి సమీపంలో వున్న గ్రామంలో “గంజికేంద్రం” ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఆ అవ్వ, ఆమె కోడలు , మనవరాలు గుక్కెడు గంజి కోసరం నాలుగైదు మైళ్ళు నడిచి ఆ గంజికేంద్రానికి చేరుకోవటం ఇందులోని కథ ! తీరా గంజికేంద్రానికి చేరే సరికి అది మూతపడివుంటుంది. అవ్వ నైరాశ్యం తోనూ, ఆగ్రహంతోనూ ప్రభుత్వాన్నీ, అధికారులనూ ‘దుమ్మెత్తి’ పోస్తూ శాపనార్థాలు పెడుతుంది . ఈ కథలోని కరువు అనే ఒక భయంకరమైన గడ్డు వాస్తవికత పాఠకులను జలదరింపజేస్తుంది.
ఈ కథ తర్వాత అనంతపురం జిల్లాలో ఆధునిక కథానిక స్తబ్ధతలో వడి పోయిందనే చెప్పాలి. “ఈ నాటి వరకూ మనకు లభించిన ఆధారాలను పరిశీలించి చూస్తే , అనంతపురం జిల్లాలో స్థానిక జీవిత  చైతన్యం సింగమనేని నారాయణ కథలతో ప్రారంభమయిందని చెప్పాలి.సింగమనేని మొదటి స్థానిక జీవిత చైతన్య కథ ‘జూదం’, 1978 లో ‘ప్రజాసాహితి’లో  ప్రచురితమైంది. రాయలసీమలో ప్రకృతి , రైతుతో ఆడే జూదం లాంటి వ్యవసాయాన్ని, విధి లేక మోస్తున్న రైతు  జీవితాన్ని ఈ కథ నిరాడంబరమైన శిల్పంతో చిత్రించింది అంటున్నారు సుప్రసిద్ధ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ( రాయల సీమలొ ఆధునిక సాహిత్యం… పుట 184  )  సింగమనేని రచయితగా మాత్రమే గాకుండా తన సహచర్యంతో , ఆలోచనాపరుడిగా , ఆ ప్రాంత రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేసాడు.1978 తర్వాత కథా రచన ప్రారంభించిన చిలుకూరి దేవపుత్ర , బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ కూడా పరస్పరం ప్రభావితం చేసుకున్నారు. ఈ ప్రభావ ప్రసరణం చాలా ఆరోగ్యకరంగా కొనసాగింది.” అంటున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ( అదే పుస్తకం – పుత 188).
అనంతపురం జిల్లా అనగానే, ఎవరికైనా వెంటనే స్ఫురించేది ‘కరువు ‘ – 150 సంII     కాలంలో65 కరువులను అనుభవించిన జిల్లా ఇది – రాష్టంలోనే విస్తర్ణంలో అతి పెద్ద జిల్లా అయివుండీ, సాగునీటి  విషయంలో , రాష్టంలో అతి అథమ స్థానంలొ వున్న జిల్లా ఇది, భారతదేశం మొత్తం మీద అత్యల్ప స్థానంలో వున్న జిల్లా  కూడా ఈ జిల్లానే, ధాత కరువు డొక్కల కరువు , గంజికరువు వంటి పేర్లతో అనంత జీవితం కరువు జీవితమే అయ్యింది. ప్రకృతి అననుకూలత ప్రభుత్వ నిర్లిప్తత అనంతరైతును ఆత్మ హత్య చేసుకునే దశకు నెట్టినాయి. అనంత రైతును వెంటాడుతున్న కరువును గురించి ఇక్కడి కవులు, రచయితలు మొన్నటి దాకా పట్టించుకోలేదు. సింగమనేని జూదం కథ వచ్చిన తరువాత సీమ కరువు చిత్రణను వారసత్వంగా ఈ జిల్లా రచయితలు అందుకున్నారు- అనంత రైతుల జీవితాల్లోని ప్రధాన పార్శ్వాలను తొలిసారిగా సింగమనేని ఆవిష్కరించారు. తరువాత వచ్చిన ప్రతిభావంతులైన కథకులు స్వామి, శాంతి నారాయణ , దేవపుత్ర , జి.ఆర్.మహర్షి, సడ్లపల్లి చిదంబర రెడ్ది , ఎస్.వి.ప్రసాద్, దీవెన లాంటి వారు ఆ వారసత్వాన్ని కొనసాగించినారు.
సింగమనేని విశిష్టమైన రైతాంగకథలెన్నో రాసినారు వాటిలొ జూదం, ఊబి , ఉచ్చు , విముక్తి , అడుసు. అగాథం . అలజడి , ఒక పయనం, యక్ష ప్రశ్నలు లాంటివి అనంతపురం జిల్లా రైతుల స్థితిగతులకు   దర్పణం పడతాయి. ఈ జిల్లా రైతాంగం నీటి ఎద్దడి భరించలేక , ఇష్టం వున్నా లేకపోయినా, శక్తి వున్నా లేకపోయినా దిగి, కూరుకుపోవటం అనివార్యమైపోయింది- అలా బోరింగు అన్న ప్రమాదకరమైన ఆకర్షణకు లోనై పరాజయం చెంది, దిగ్భ్రాంతుడైన రైతు కథ సింగమనేని’ ఊబి’.   ప్రకృతికి తోడు మార్కెట్ వ్యవస్థలోని దొపిడీ స్వభావం రైతు చుట్టూరా వలలా అల్లుకున్న విధానాన్ని గొప్పగా చిత్రించిన కథ ‘అడుసు’. తను పండించిన పంటకు ( చీనీ – బత్తాయి పళ్ళు ) తానే వెల నిర్ణయించలేని రైతు అసమర్థ ప్రతీకారంగా తోటనే నరికి వేయడం ఇందులోని కథాంశం, ముగింపులో  కాళీ పట్నం ‘యఙ్ఞం’ ను పోలిన ఈ కథ , మనకున్న ఉత్తమ కథల్లో ఒకటి . కృత్రిమత ఎంత మాత్రమూ లేని కథనం , ముగింపుకు అభిముఖంగా అంచలు అంచలుగా కథ నడిపిన చాతుర్యం , ఈ కథకు ఒక ప్రత్యేకతను తెచ్చాయి- ఇక్కడి కరువే, సింగమనేనితో ‘విముక్తి ‘కథ రాయించింది.  రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కరువు వల్ల భూములున్న వాళ్లకే భూమి భారంగా మారిన వైనాన్ని ఈ కథ చిత్రించింది. కరువు దౌష్ట్యాన్ని భరించలేక ఆత్మహత్యల పాలైన రైతాంగాన్ని ‘అలజడి’ కథ చిత్రిస్తే , వలస బాట పట్టిన రైతాంగ కుటుంబాలను ‘ఒక పయనం’ కథ నిరూపించింది.
అనంతపురం జిల్లా కరువు ప్రభావాన్ని , ప్రతిభా వంతంగా చిత్రించిన మరో కథకుడు శాంతి నారాయణ కరువులో వాన కోసం ఎదురు చూసి చూసి అనంత రైతు అనివార్యంగా అశాస్త్రీయ మూఢాచరాలకు పూనుకుంటాడు – ఈ దురాచారాలను శాంతినారాయణ ‘కల్లమయిపాయ ‘    కథలొ చిత్రించాడు- స్వతంత్ర భారత రాజకీయ ఆర్థిక విధానాలు, వ్యవసాయక భారత దేశంలోని రైతును నాశనం చేసి, దళారులను సంపన్నులను చేసిన దుర్మార్గం మీద కోపప్రదర్శనలే శాంతి నారాయణ వ్యవసాయ కథలు……….. అనంతరైతు జీవన శైలిని , ఆలోచనల్ని, ప్రకృతిలో  వచ్చే మార్పులు, అవి వ్యవసాయంపై చూపే ప్రభావం, వ్యవసాయ రంగాన్ని ఆవరించిన, అనేక ప్రభుత్వ సంస్థల తీరుతెన్నులు వంటి వాటిని, శాంతి నారాయణ అనుభవ పూర్వకంగా, పరిశీలనాత్మకంగా  తన    కథల్లో చిత్రించారు -’కల్లమయుపాయ’,  ‘పల్లేరు ముళ్ళు ‘ ,’రతనాల సీమలో’, ఈ పయనం ఎక్కడికి , దళారీ , ఎండమావులు  లాంటి అతడి కథలు, అనంతపురం జీవితంలోని వివిధ ముఖాలను, ఇతర ప్రాంతాల వారికి సమర్థవంతంగా పరిచయం చేశాయి. “ఈ పయనం ఎక్కడికి” అనే కథ , ప్రాంతీయ అసమానతల్ని విశ్లేషించినకథ, కోస్తా రాయలసీమల మధ్య భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధిలోని అసమానతల్ని ప్రశ్నించి, రాయల సీమలోని ఆర్థిక పరిస్థితులు కుటుంబ సంబంధాలలో తీసుకు వచ్చిన మార్పును ఈ కథ ప్రతిబింబించింది- నీట కరువు వల్ల వ్యవసాయం మూలపడటం, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు కుటుంబాలు కూలీలుగా పట్టణాలకు చేరుకోవడం , పొలాలు బీడుపడి పోవడం , పల్లెలు పాడుబడి పోవడం, అనంతపురం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పరిణామం, పట్టణాలకు వెళ్ళిన రైతులు కూలిపని చేసుకుని పస్తులు లేకుండా బతకగలుగుతున్నారు. పొలాలు అమ్మి, ఆ డబ్బును తెలివిగా పెట్టుబడిగా మార్చగలిగిన వారు పచ్చగానే బతుకుతున్నారు. ఈ పరిణామంలోని అనివార్యతను గుర్తించిన ఈ కథ భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను గురించి పాఠకునిలో అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతుంది.
అనంతపురం జిల్లా నిర్దిష్ట జీవితాన్ని స్థలకాలాల చైతన్యంతో అద్భుతంగా చిత్రించిన మరోకథకుడు ‘స్వామి’. స్వామి రాసిన “నీళ్ళు”. “వానరాలే”,  “సావుకూడు”, “బతుకువూబి” వంటి కథలు అనంతరైతు వ్యక్తిత్వాన్ని కరువు  ధ్వంసం చేసి , ఇక్కడి మానవ సంబంధాలను వికృతం చేస్తున్న తీరును ధ్వనిస్తాయి. కరువు ఇక్కడి ప్రజల సాధారణ కోర్కెలు కూడా తీర్చుకోలేని స్థితిని కల్పిస్తున్న వాస్తవాన్ని సావుకూడు ప్రతిఫలిస్తే , కరువు ఫలితమైన రైతు ఆర్థిక క్షీణత, ఆశాజీవి అయిన మనిషిని, ఆశలు లేని కట్టెగా మారుస్తున స్థితిని బతుకు “ఊబి” ప్రతిబింబిస్తున్నది. స్వామి రాసిన “నీళ్ళు” కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోకుండా ఉండలేం ! నీటి సమస్య గురించి ఎందరో రాసినప్పటికీ స్వామి తీసుకున్న కోణం వేరు ! నీటికీ అభివృద్ధికీ వున్న అవినాభావ సంబంధాన్ని ఈ కథలో రచయిత నిరూపిస్తాడు. గుక్కెడూ నీళ్ళుసైతం కరువైన దేశంలో మనం సాధించిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తాడు- వానల కోసం ఎదురు చూసే రైతుల కడగండ్లను “వానరాలే” కథ చెబుతుంది – “తెల్లదయ్యం” అన్న కథ  రాయలసీమ నేపథ్యం వున్న  అంతర్జాతీయ రాజకీయ కథ. మన వ్యవసాయం మీదా . గ్రామీణ జీవితం మీదా, ప్రపంచీకరణ దుష్ట విధ్వంస ప్రభావాన్ని ప్రతీకాత్మకంగా, మాంత్రిక వాస్తకత మార్గంలో ఈ కథ చిత్రిస్తుంది.
ఇతివృత్తాల ఎంపికలో స్వామి ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదు – తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని తను దగ్గరగా చూసిన విషయాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకున్నాడు – రాయలసీమలోని చాలా మంది రచయితలతో పోల్చి చూసినపుడు స్వామి చాలా వస్తు వైవిధ్యమున్న కథా రచయిత. తన చుట్టూ వున్న జీవితాన్ని గురించి సరైన ఎరుక, కథా వస్తువును ఎన్నుకోవడంలో చాతుర్యం, దాన్ని కథగా అల్లుకోవడంలో చక్కని శిల్ప పరిఙ్ఞానమున్న రచయిత స్వామి. అనంతపురం జిల్లా గ్రామీణ వ్యావసాయిక జీవితాన్నీ, రైతు వ్యావసాయిక సంక్షోభాల్నీ , కరువు కారణంగా ఛిత్రమౌతున్న కుటుంబ సంబంధాల్నీ స్వామి తన కథల్లో అత్యంత వాస్తవికంగా చిత్రించాడు.
అనంత కథకులు అనంత రైతు కష్టాలకు కేవలం ప్రకృతినే దోషిగా నిలబట్టే బలహీనతకు లోను కాలేదు చాలా కథల్లో ప్రకృతితో పాటు వ్యాపారవ్యవస్థను రచయితలు తీవ్రంగా విమర్శకు పెట్టారు. స్వతంత్ర భారత పెట్టుబడిదారీ వర్గం భారత రైంతాంగాన్ని ఎలా నట్టేట ముంచి తన మేడలు కట్టుకుంటుందో ,అనంతపురం జిల్లా వ్యవసాయ జీవితం ఆధారంగా చెప్పగలిగారు.అంతే గాదు , పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు నిర్ణయించే హక్కు, ఆయా ఉత్పత్తి దారుల కున్నట్టు , వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం మీద అనంత కథకులు ఆలోచనలు రేకత్తించగలిగారు. కొన్ని కథల్లోనైనా రైతులు తమ మూలుగుల్ని ఇటూ కరువు ,అటు దళారీ వ్యవస్థ పీల్చి పిప్పిగా చేస్తుంటే , రాజకీయ వ్యవస్థ బాధ్యతా రహితంగా ప్రవర్తించడమేగాక, తానూ రైతుకు శత్రువుగా మారడాన్ని విమర్శకు పెట్టారు.
గత ఆరేడు సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.రైతుల ఆత్మహత్యలు మొదలయినాయి. ఈ ప్రాదేశికత నుండి, ఇక్కడి కథకులు ఈ జిల్లా కరువు కథలను విస్తృతంగా రాశారు. కొత్తతరం కథకులు ఈ వాతావారణం నుండే పుట్టుకొచ్చారు- ఎన్.వి.ప్రసాద్, చిలుకూరి దీవెన, హిదయతుల్లా, జి.బాషా ,షరీఫ్ లాంటి కొత్త కథకులు రాసిన కథల్తో ఇనుపగజ్జెల తల్లి అను పేరుతో అనంత కరువు కథల సంకలనం, ఈ దశలోనే వెలువడింది.
అనంతపురం జిల్లా అనగానే కరువుతో పాటు గుర్తుకొచ్చేది ఇక్కడి ఫాక్షన్ రాజకీయ ముఠా కక్షలు – ఈ జిల్లా జీవితంలో ఇది ఒక చిన్న పార్శమే అయినప్పటికీ , అది స్పష్టించిన ప్రకంపనలు ఈ జిల్లా అభివృద్ధిని సంక్షోభంలొ పడదోసినాయి. ఒకప్పటి గ్రామ సంబంధమైన పార్టీలు, తర్వాతి కాలంలో రాజకీయం రంగు పులుపుకొని, ఫాక్షన్ గా పరిణమించటాన్ని ఇక్కడి కథలు అక్షర బద్ధం చేశారు. చిలుకూరి దేవపుత్ర రాసిన “సమిధలు”, “ఆయుధం”, స్వామి కథ “నడక”, శాంతి నారాయణ కథ “గర్భస్రావం”, సింగమనేని కథలు “అనంతం”, “ఫిరంగిలో జ్వరం” లాంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు -అనంతపురం జిల్లాలో ఫాక్షన్ పోరాటాలలోని ఆధిపత్య భావజాలానికీ, ఈనాటి అంతర్జాతీయ రాజకీయాలలోని ఆధిపత్య భావజాలానికీ మధ్య ఉన్న సమాంతర లక్షణాలను సింగమనేని “ఫిరంగిలో జ్వరం” కథ చిత్రించటానికి ప్రయత్నించింది! దేవపుత్ర రాసిన “సమిధలు”, “ఆయుధం” కథలు ఇక్కడి ఫ్యూడల్ పెత్తందారీ మనస్తత్వానికీ , దళితుల దైన్యానికీ మధ్య సంబంధాన్ని వాస్తవికంగా చిత్రించాయి! ఫాక్షన్ నాయకులకు ఆయుధాలుగా ఎవరు, ఎందుచేత మారుతున్నారో , స్వామి రాసిన “నడక” కథ చిత్రించింది! ఇక్కడి ఫాక్షన్ పోరాటాన్ని చూపిస్తూ శాంతి నారాయణ రాసిన “గర్భస్రావం” కథలో ఫాక్షన్ కుటుంబాలకు చెందిన స్త్రీలు అనుభవించే మానసిక, శారీరిక హింస దృశ్యమానమవుతుంది.
ఈ జిల్లాకే చెందిన సీనియర్ రచయిత తిమ్మనచర్ల రాఘవేంద్రరావు, కరువు కథలనీ, ఫాక్షన్ కథలనూ విస్తారంగా రాసినారు. ఆ౦యన ఇటీవల వెలువరించిన “కరువు కురిసిన ధాత్రి” అన్న కథల సంపుటిలో అనంతపురం జిల్లా గ్రామీణ వ్యావసాయిక దైన్యం అంతా దట్టంగా పరచుకున్న నల్లమబ్బుల్లా దర్శనమిస్తుంది- వీరు రాసిన కెంపు అన్న ఫాక్షన్ కథ గ్రామ జీవితంలో రెండు బలమైన భూస్వామ్య ఆధిపత్య వర్గాల మధ్య నలిగిన పేదవర్గాల కన్పిస్తాయి.
ఇక్కడి కథకులంతా అనంత కరువునూ, ముఠాకక్షలను గురించి మాత్రమే కథలు రాస్తారన్న ఒక అపోహ విమర్శక వర్గాలలో లేకపోలేదు. ఇక్కడి కథకులు, స్త్రీల సమస్య గురించీ విద్యావ్యవస్థ గురించీ, కుటుంబ జీవితం గురించీ, దళితుల అణచివేత గురించీ , వస్తువ్యామోహ సంసృతి గురించీ మానవ  సంబంధాలలో డబ్బు పాత్ర గురించీ, వైవాహిక వ్యవస్థ లోని అమానవీయ లక్షణాల గురించీ, జీవన తాత్వికత గురించి విస్తారంగా కథలు రాసినారు.
అంతే కాదు చక్కని హాస్య వ్యంగ్య కథలు పండించిన కథకులు కూడా ఈ జిల్లాలో ఉన్నారు.
జి.ఆర్.మహషి పేరు చెప్పగానే , విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్ స్కాలర్ల దయనీయ , అభాగ్య జీవితాన్ని వర్ణించే “శంకరం అనే ఆర్.ఎస్. కథ ” చాలా మందికి గుర్తు వస్తుంది. విషాదకరమైన హాస్యం, వ్యంగ్యం, మన విశ్వ విద్యాలయాల్లో కొన్ని శాఖల నిరర్థక అస్తిత్వం, ఈ కథలో బలంగా వచ్చిన మాట నిజమే , కాని మహర్షి దాని కంటే గొప్ప కథల్ని రాశాడు. వాటిలో ముఖ్యమైనవి “మావూరి మహావైద్యగాడు”, ” నన్ను క్షమించు కన్నా” , “విధ్వంస దృశ్యం ” లాంటి కథలు. తన ప్రాంత జీవిత సమస్యల్ని గురించి లోతైన పరిఙ్ఞానం వున్న రచయిత మహర్షి ! ఇతడు మరింత విస్తృతంగా రాయవలిసిన రచయిత కూడ !
మరొక యువ కథకుడు ఎస్.వి.ప్రసాద్ ఇతడి ‘వ్యసనం’ అన్న కథ, అనంతపురం జిల్లాలో రైతుకు వ్యవసాయం వ్యసనంగా మారటంతో , చివరకు ఆత్మహత్య అంచుల వరకూ, ఒక రైతు యువకుడు వెళ్ళిన వైనాన్ని ఈ కథ భీభత్సంగా చిత్రిస్తుంది. ఈ కథలో ఇతడు అనుసరించిన శిల్పం ఇతన్ని అగ్రశ్రేణి కథా రచయితల సరసన నిలబెట్టింది. ఇతడు రాసిన “పేపరోపీలియో, పరిశోధక పత్రం” సునిశితమైన హాస్యంతో నిండి మన సంస్కారంలోని లోపాల్ని బలంగా ఎత్తి చూపుతాయి.
ఇటీవలే కథా రచన ప్రారంభించిన యువ కథయిత్రి చిలుకూరి దీవెన. సీరియస్ కథల్తో పాటూ పెక్కు వ్యంగ్య కథలను కూడా రచించిన వారు – మాతృ భాషా ప్రాధాన్యతను వెల్లడించే చక్కని కథలనెన్నో, హాస్య స్పర్శతో పండించినారు కూడా!
ఇక్కడి కథకులు ఇతర ప్రాంతాల రచయితల కంటే భిన్నమైన కోణంలో దళిత కథలు రాయటం ఒక విశేషం. కేవలం వాదం నుండీ పుట్టుకొచ్చినవి కాకుండా, జీవితం నుండీ పుట్టుకొచ్చినవి ఇక్కడి దళిత కథలు ! శాంతి నారాయణ  రెండు కథల్లో దళిత జీవన చిత్రణ చేశారు. స్వాతంత్యం సిద్ధించి దశాబ్దాలు గడచినా , భారతీయ గ్రామాల్లొ ఇంకా సజీవంగా ఉంటున్న దళిత వివక్షకు “జీవనాడులు ఉక్కుపాదం” అనే కథలు నిలువెత్తు దర్పణాలు. దళితుల పల్లెల్లో ఎదుర్కొంటున్న వివక్షను , “జీవనాడులు” ప్రదర్శిస్తే , వాళ్ళు  పట్టణాల్లో ఎదుర్కోంటున్న వివక్షను, “ఉక్కుపాదం” ప్రతిఫలిస్తున్నది.దళితుల పెళ్లి ఊరేగింపుని , ఊల్లోకి రానీయకుండా అవమానించి, తమ ఆధిక్యతను చాటుకుని, దళితుల సాంఘీక పరిమితుల్ని నిర్ణయించే దుర్మార్గాన్ని “జీవనాడులు” విమర్శనాత్మకంగా ప్రతిబింబించింది! దళితులు అధికారంలో భాగస్వాములైనా, పట్టాణాల్లో సైతం బాడుగ ఇల్లు దొరకని నిజాన్ని ఉక్కుపాదం ప్రదర్శిస్తుంది.
విద్వాన్ దస్తగిరి రాసిన ‘నే నేర్చిన అనుభవం ‘ అనంత జిల్లా కథానికల్లో మరో దళిత కథ ! ఇది ఒక దళిత ఉపాధ్యాయిని కథ !ఓబులేసు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ , తాను దళిత వాడలో వుంటూ వాళ్లను చైతన్య వంతులుగా చేయటానికి పూసుకుంటే, ఆ వూరి భూస్వామ్య వర్గం అతన్ని బదిలీ చేయించే ప్రయత్నం చేస్తుంది. దళిత ఉపాద్యాయుల సాంఘీక స్థితిలో ఏమీ మార్పు లేదని సింగమనేని నారాయణ, ‘మకర ముఖం’  కథ నిరూపిస్తుంది చదువులు , ఉద్యోగాలూ లభించి దళితులు ఆర్థికంగా నిలదొక్కుకున్నా, సాంఘీకంగా సాంస్కృతికంగా . అవమానకర స్థితిలోనే ఉన్నారని చాటి చెబుతుంది ఈ కథ ! అగ్రవర్ణాలు నడిపే ప్రైవేటు విద్యాసంస్థలో, దళిత ఉపాద్యాయినికి జరిగే అన్యాయాన్ని విస్పష్టం చేస్తుంది. స్వామి రచించిన ‘ఒక హెచ్.సరస్వతి కథ’! ఆధునిక నాగరిక జీవితంలో సైతం, వీడని సాంఘీక పీడనను ఈ కథ రుజువు చేస్తుంది! స్వామి  రాసిన “ప్రశాంతం” అనే మరోకథ ఒక దళిత మహిళా ఉద్యోగి ఎదుర్కొనే అస్పృశ్యత సమస్యను ప్రతిబింబిస్తుంది.
చిలకూరి దేవపుత్ర దళిత వివక్షను ప్రశ్నించే ఎన్నో కథలు రాసారు- ఆయన రాసిన “విలోమం” కథలో ఏవో అవసరాలను దృష్టిలో వుంచుకొని దళితురాలిని పెళ్ళాడినా, అగ్రవర్ణబుద్ధి మారకపోవటాన్ని చూడవచ్చు ! దేవపుత్ర రాసిన “సమిధలు” ,”ఆయుధం” కథల్లో కూడా రెండు భూస్వామ్య వర్గాల మధ్య బలి అయ్యే దళితుల్ని  చూడవచ్చు ! దళితుల స్థితిగతుల్ని , సాంఘీక దృక్పథంతోనే గాక రాజకీయ దృక్పథంతో కూడా చర్చించాడు – రిజర్వేషన్ల కోటాలో ఒక దళితుడు గ్రామసర్పంచ్ అయినప్పటికీ, భూస్వామి చెప్పుచేతల్లో ఉండక తప్పని వైనాన్ని దేవపుత్ర ‘ఊడలమర్రి ‘ కథలో ప్రదర్శిస్తాడు. పునాది మారని వ్యవస్థలో వచ్చే పైపై మార్పు వికృతంగా  వుంటుందని ఈ కథ చెబుతుంది- అనంత కథా రచయితలు రాసిన ఈ కథలు దళిత సమస్యను , ఆర్థిక రాజకీయ సాంఘీక , సాంస్కృతిక పార్శ్వాల నుంచి ప్రతిఫలిస్తున్నాయి. ఈ కథల్లో వాద దృష్టి కాకుండా సామాజిక జీవన దృక్కోణం వుండటం , ఇక్కడి రచయితల లోకవృత్త పరిశీలనకు దృష్టాంతాలు! దళిత వాదం సాహిత్యంలో ప్రవేశించక మునుపే , ఇక్కడి కథకులు ,చక్కని దళిత కథలు రాయటం విశేషం!
ఇక్కడి కథకులు పట్టణ మధ్యతరగతి జీవితాల గురించి, విద్యావ్యవస్థలోని భ్రష్ట కోణాల గురించి,వివాహ వ్యవస్థలో డబ్బు పాత్రను గురించి, మధ్యతరగతి ఆర్థిక హింస గురించి ఎన్నోకథలు రాసినారు – స్త్రీల వ్యక్తిత్వాలను నిరూపించే కథలను సైతం రాసినారు – సింగమనేని రాసిన ‘వాసంత తుషారం ‘,” నీకూ నాకూ మధ్య”, “నిశీధి” , “నిషిద్ధం” కథల్లోని స్త్రీ పాత్రలు అద్భుత వ్యక్తిత్వ సౌందర్యానికి ప్రతీకలు. కొత్త జీవితానుభవాలకు , కొత్త ఆత్మ విశ్వాసానికి ప్రతినిధులు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాస్తుందని గురజాడ ప్రకటించిన విశ్వాసాన్ని వాస్తవం చేసిన పాత్రలు అవి. సమాజంలో చోటు చేసుకున్న నూతన భావాలను, ప్రవర్తనను ఆ కథలు మన ముందు ఉంచుతాయి.
శ్రామిక స్త్రీలను చిత్రించిన శాంతి నారాయణ , ‘బొమ్మా బొరుసు ‘ “నిర్ణయం”, “శాలిని” కథల్లో మధ్య తరగతి నూతన స్త్రీని సృష్టించారు. కులాల హద్దులు దాటి, పురుషాధిపత్య సంకెళ్లను ఛేదించి పునర్వివాహం చేసుకున్న సీతాలక్ష్మి కథ “నిర్ణయం” – “శాలిని” అన్న మరో కథలో  చదువుకొని సమాన ఆర్థిక సాంఘీక హోదా గలిగిన స్త్రీ పురుషుల మధ్య కూడా వరకట్న పిశాచం నృత్యం చేస్తున్న తీరును, విమర్శనాత్మకంగా  చిత్రించారు . పెళ్ళి ఒక్కటే ఆడదానికి జీవితాశయం కాదని, దానికి మించిన స్త్రీ వ్యక్తిత్వముందని ‘శాలిని’ కథలో శాలిని నిరూపిస్తుంది.
ఇక్కడి కథకులు తమ కథల్లో ఈ జిల్లా సహజమైన నిసర్గమైన మాండలిక భాషను ఉపయోగించి నుడికారపు వాస్తవికతను జీవం పొశారు…. భాష కోసమే మాండలికాన్ని, ఇక్కడి ఏకథకుడూ ఉపయోగించలేదు. ఇక్కడి కథకులు మాండలిక భాషా వాదులు కాదు జీవితం ఎంత నిసర్గంగా స్వచ్ఛంగా ఉంటుందో , జీవితంలొ ప్రవహించే భాష కూడా అంత నిసర్గమని , సహజమని ఇక్కడి కథకులు భావించారు.వీర మాండలికం రాసి పాఠకులను ఇబ్బంది పెట్టే లౌల్యానికి ఇక్కడి కథకులు గురి కాలేదు. సడ్లపల్లె చిదంబరరెడ్డి అనే కథకుడు, కర్ణాటక సరిహద్దున గల పల్లెలో జీవిస్తూ , కన్నడ తెలుగు మిశ్రితమైన మణి ప్రవాళ మాండలికాన్ని ఎంతో అందంగా తన కథల్లొ ఉపయోగించినారు. స్వామి మాండలికం మరొక ప్రత్యేకమైన శైలిని కల్గినది. అతడే చెప్పుకున్నట్టు అతనిది పట్టణ మాండలికం. పల్లె మాండలికం కంటే కొంచెం భిన్నమైనది.శాంతి నారాయణ మాండలికం కొంత ఇబ్బంది కల్గించే  శైలిని కలిగి వున్మప్పటికీ మారుమూల గ్రామాలలోని వృత్తి గత మాండలికాన్ని  శక్తి వంతంగా ఉపయోగపెట్టుకున్నారు. భాష విషయంలో సింగమనేని నారాయణది మధ్యే మార్గం, మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి, కథకూ, కథనానికీ వుండవలిసిన తేడాను జాగ్రత్తగా పాటించాడు. ఇక్కడి కథకులలో చాలా మంది , పాత్రల సంభాషణలకు మాత్రమే ఎక్కువగా మాండలికాన్ని ఉపయోగించటం గమనించవచ్చు.
అనంతపురం జిల్లా స్థానికులు గాక పొయినప్పటికీ, ఇక్కడ స్థిరపడి , చిరకాలంగా కథలు రాస్తున్న వారిలో ముఖ్యులు డాక్టర్ కేతు బుచ్చి రెడ్డి , జి. నిర్మలారాణి, ఆర్. శశికళ , జయలక్ష్మీరాజ్, షహనాజ్ బేగం గార్లు, వీరు ఈ జిల్లా జీవన శైలిని పుణికి పుచ్చుకుని, ఇక్కడి స్థానిక జీవిత చైతన్యంతో ఎన్నో చక్కని కథలు రాశారు. డాక్టర్ కేతు బుచ్చిరెడ్డి గారు వస్తు వైవిధ్యం గల రచయిత. “ముత్యాలు_ రత్నాలు” పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. జి.నిర్మలారాణి గారు ఇక్కడి జీవన పరిస్ఠితులను గమనించి, జిల్లాలో పర్యటించి, ఇక్కడి కరువుకు ఆర్థ్రమై, కాటేసిన కరువు వంటి కథలు రాశారు . ఆర్. శశికళ గారు విద్యారంగంలొ పని చేస్తూ , విరసం సభ్యురాలిగా వుంటూ సామాజిక వైరుధ్యాలను బలంగా పట్టుకొని, సరళమైన భాషలో , నిరాడంబరమైన శైలిలో ఎన్నో కథలు రాసినారు. జయలక్ష్మీరాజ్ గారు హాస్య వ్యంగ్య కథకురాలిగా సుప్రసిద్ధులు ఈ జిల్లా జీవిత స్పర్శతో ఎన్నో కథలు రాసినారు. షహనాజ్ బేగం గారు ముస్లిం మహిళా జీవితాల్లోని సంక్లిష్టతల్ని కథలుగా కూర్చిన వారు . వీరంతా ఈ జిల్లా జీవితంతో తాదాత్మ్య్తత చెంది, ఇక్కడి పరిస్థితుల పట్ల అనుకంపన గలిగిన ఉన్నత మనస్కులు.
అనంత కథకు నేడు తెలుగుకథా సాహిత్యంలో ఆమోదయోగ్యమైన విశిష్టస్థానం ఉన్నది! ఇక్కడి కథకులందరూ , మట్టి వాసనను అనుభవించిన వారు. నేల మీద పాదాలు మోపి నడుస్తున్నవారు ! అతివాద ధోరణులకూ, అవాస్తవిక చిత్రణలకూ, కేవల కాల్పనిక సృజనకూ, అలవాటు పడిన వాళ్ళు కారు ! ఇక్కడ కథా రచన వ్యాపారమయం కాలేదు! ఏ పత్రిక స్వభావానికి తగిన విధంగా, ఆ పత్రికకు కథలు రాసి పంపె వెర్రి పీనుగులు కారు. సామాజిక సంస్కార తృష్ణ కలిగిన వారు . వస్తువు వల్లా మాత్రమే కాదు, కళాత్మకంగా , విశ్వసనీయత లోపించకుండా , క్లుప్తత పాటిస్తూ , సంయమనంగా, కథలు రాయటం వల్లనే అనంత కథను ఈనాడు  పాఠకులూ, విమర్శకులూ ఆహ్వానిస్తు న్నారు ! తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేయటంలో అనంత కథకుల పాత్ర ఎంతో విస్పష్టమైనదీ , విశాలమైనదీనూ!
-సిరి
వ్యాసరచనకు ఉపకరించిన గ్రంధాలు:
1.రాయలసీమలో ఆధునిక సాహిత్యం-  వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
2.కథాంశం   – రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
3.సమయము – సంధర్భము —  సింగమనేని నారాయణ
(www.pranahita.org)

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...