Sunday, June 9, 2013

సీమ తొలి కథా రచయిత్రులు పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ

1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు. ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ,డి. పాపమ్మలను చెప్పవచ్చు.


పరదేశీయుల రాకతో భారత సమాజంలోని అన్నిరంగాలలోనూ ఆధునిక భావాలు ప్రారంభ మయ్యాయి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ, ఆంగ్లభా షను ప్రవేశపెట్టడం, స్ర్తీ సంస్కరణలతో ఆధునికత మొదలైంది. దీనితో స్ర్తీకి గృహహింస నుండి, సంప్రదాయ ముళ్ళ పొదలనుండి, పురుషాధిక్యత నుండి కొంతవరకు రక్షణ ఏర్పడింది. అక్షరాభ్యాసం ద్వారా స్ర్తీలు కొన్ని ప్రాపంచిక విషయాలు తెలుసుకోగలిగారు. ఇదంతా 19వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దానికి కాస్తమెరుగైంది. నేడు అది పరిపూర్ణత చెందే దశకు చేరింది. ఇప్పటికీ స్ర్తీలు కొన్ని చోట్ల అణచివేతకు, దోపిడీకి గురవుతున్నప్పటికి స్ర్తీ సామాజిక స్థాయి, గౌరవం పెరిగిందనే చెప్పవచ్చును. అయితే ఆధునిక మహిళలు ఈ స్థాయికి రావడానికి అలనాటి తొలితరం స్ర్తీలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.స్ర్తీలు ఒకవైపు- కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త, తమ కడుపున పుట్టిన పిల్లలచే నిరాదరణకు గురౌతూ మరోవైపు తమ చుట్టూ ఉన్న సమాజంతో అణచివేతకు గురవుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు.

స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. పురుషులతో సమానంగా జైళ్ళలో మగ్గారు. సంఘసంస్కరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. అలాగే కలం పట్టి ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రాంతాలతో పోల్చితే కోస్తా ప్రాంతం ఆర్థికంగా పరిపుష్ఠి సాధించటంతో ఆధునిక సాహిత్యం అక్కడ కొంత ముందుగానే అడుగేసింది. అక్కడ పురుషులతో పాటు కొందరు స్ర్తీలు ఆధునిక సాహిత్యంలో కృషిచేశారు. కానీ రాయలసీమ సామాజిక నేపథ్యం అందుకు భిన్నం. రాయలసీమలో స్ర్తీలు పురుషుల శాసనాలకు లోబడి అణిగి మణిగి జీవిస్తుంటారు. నేటికి అనేకమంది గ్రామీణ నిరక్షరాస్య స్ర్తీల దుస్థితి ఇంతే. అయినా రాయలసీమ ఆధునిక సాహిత్య ప్రక్రియల నిర్మాణంలో స్ర్తీల తోడ్పాటును విస్మరించలేము.ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఒకటైన కథానిక మొట్టమొదట స్ర్తీ కలం నుండే వెలువడింది. 1902లో ‘బండారు అచ్చమాంబ’ రాసిన ‘ధన త్రయోదశి’ కథతో తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలైందని విమర్శకుల భావన. తరువాత అనేకమంది కథా రచయిత్రులు కథలు రాశారు.

ఆధారాలు లభిస్తున్నంతలో 1926లో రాయలసీమ కథా సాహిత్యం ప్రారంభం అయ్యింది. ఇదే క్రమంలో రాయలసీమ కథాసాహిత్య ప్రారంభంలో పురుషులతో పాటు స్ర్తీలు కూడా తమ వంతు కృషి చేశారు. వారిలో కస్తూరి వెంకటసుబ్బమ్మ, పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను చెప్పవచ్చు. అనంతపురానికి చెందిన కస్తూరి వెంకట సుబ్బమ్మ 1926లో ‘కథామంజరి’ పేరుతో పురాణ ఇతిహాసాల వస్తువులతో కూడిన కథల సంపుటి రాశారు. అందులో బలిచక్రవర్తి చరిత్రం, భీష్మోదయం, గరుడచరిత్రం వంటి కథలున్నాయి. రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు చేసిన తొలిప్రయత్నమిది. తరువాత ఆధునిక సామాజిక వస్తువును నేపథ్యంగా స్వీకరించి తొలి కథలు రాసినది- ప్రొద్దుటూరుకు చెందిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ. 1927 ఆగస్టు భారత కథానిధి మాసపత్రికలో వరకట్నం కేంద్రంగా పూండి చెల్లమ్మ ‘సీతాబాయి’ అనే కథ రాశారు. ఇందులో సీతాబాయి, ఆమె భర్త రామస్వామి తమ కూతురికి పెండ్లిచేయాలనుకుంటారు.

కట్నంగా ఇవ్వాల్సిన డబ్బు లేకపోవడంతో దిగాలుగా ఉంటారు. రామస్వామి కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉద్యోగి. అయినా ఆ జీతం పెళ్లికి చాలదు. రామస్వామి భార్య సీతాబాయి తన పుట్టింట నేర్చుకున్న వైద్యంతో తన ఇరుగు పొరుగు వారికి వైద్యం చేసి డబ్బు కూడబెడుతుంది. అలాగే కలెక్టర్‌ కూతురికి కూడా నయంకాని జబ్బును నయంచేసి రెండువేల రూపాయలు సంపాదిస్తుంది. ఆ డబ్బుతో కూతురు పెళ్లి ఘనంగా చేస్తారు. ఇందులో సీతాబాయి స్వయంకృషి వల్ల తను నేర్చుకున్న వైద్యంతో కూతురు పెళ్లి చేసింది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా సంపాదించగలరని, ఆర్థిక సంపాదనలో పురుషులకు స్ర్తీలు ఏమాత్రం తీసిపోరనే సందేశాన్ని అందించారు రచయిత్రి. మరో రచయిత్రి డి. పాపమ్మ రాసిన ‘అత్తగారు రేడియో తెలిసికొంటిరా’ అనే కథ 1927 నవంబరు భారత కథానిధి పత్రికలో ప్రచురితమైంది. ఇందులో చలపతి అనుమానంతో ఒక బిడ్డ పుట్టిన తరువాత తన భార్యను ఇంట్లోనుంచి గెంటేస్తాడు. భర్త నిరాదరణకు గురైన ఆమె ఒక బాలికల పాఠశాలను స్థాపిస్తుంది.

బాలికలకు విద్యనందిస్తుంది. కొందరికి ఉద్యోగం కూడా కల్పిస్తుంది. భర్తచెంత పెరిగిన తన కూతురికి పెళ్లి అవుతుంది. భర్త చెంత పెరిగినప్పటికీ కూతురిపై ప్రేమతో పెళ్లయిన తన కూతురికి, అల్లునికి ఆ స్కూల్లోనే ఉద్యోగాలిచ్చి వారిని పోషిస్తుంది. ఈ కథ స్ర్తీలందరికి ఆదర్శం. పురుషుడి నిరాదరణకు గురైన స్ర్తీ ఆ రోజుల్లో స్వశక్తితో ఒక పాఠశాలను స్థాపించడం సామాన్య విషయం కాదు. ఇందులో పురుషుల దయా దాక్షిణ్యాలపై కాకుండా స్ర్తీలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడాలని చెప్పినట్టయింది.ఈ సీమ కథారచయిత్రులలో కాలక్రమాన్ని బట్టి చూస్తే- 1926లో కథలు రాసిన కస్తూరి వెంకట సుబ్బమ్మను తొలి సీమ కథా రచయిత్రిగా భావించవలసి ఉంటుంది.

కానీ ఆమె కథలు పురాణ ఇతిహాసాలకు సంబంధించినవి కాబట్టి, 1927లో ఆధునిక సామాజిక వస్తువు నేపథ్యంగా కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మలను రాయలసీమ తొలి కథా రచయిత్రులుగా గుర్తించవచ్చు. తెలుగు కథాసాహిత్యం ప్రారంభంనుండి రచయిత్రులు తమ వంతు సాహిత్య కృషి నిర్విరామంగా చేస్తున్నారు. వారితో పాటుగా 1926-27 మధ్యకాలంలో ప్రారంభమైన రాయలసీమ కథాసాహిత్యంలో స్ర్తీలు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. దీనితో మిగిలిన తెలుగు ప్రాంతపు రచయిత్రులకు రాయలసీమ స్ర్తీలు ఏ మాత్రం తీసిపోకుండా గొప్ప సామాజిక వస్తువులతో కథలు రాసినట్లయింది. వీరిని భావితరాల స్ర్తీలు స్పూర్తిగా స్వీకరించి గొప్ప రచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...