Monday, June 3, 2013

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు

విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడాప్రచురితమ య్యాయి. అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, మీసరగండంరామాచార్యుల దంపతులకు విశ్వరూప శాస్త్రి 1915 అక్టోబర్‌ 21న జన్మించాడు. ప్రాథమిక విద్య తరిమెలలో పూర్తి చేసి, సంస్కృతాన్ని శంకరశర్మ వద్ద అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్‌’ను అందుకొని ‘విద్వాన్‌ విశ్వం’ అయ్యాడు. కాశీ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఖండ కావ్యాలపై పరిశోధన చేయడానికి వెళ్లి అనారోగ్య కారణాల రీత్యా వెనుదిరిగి వచ్చాడు.

ఆ విశ్వవిద్యాలయంలోనే తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్‌ రెడ్డిల సహచర్యంతో విద్వాన్‌ విశ్వంపై సామ్యవాద భావాలు ప్రభావం చూపాయి. 1935లో విరికన్నె లఘుకావ్యాన్ని రాసి నీలం సంజీవరెడ్డి వివాహ సందర్భంగా ఆవిష్కరించాడు. ‘పాపం, నా హృదయం, ఒకనాడు’ లఘు కావ్యాలతో పాటు, రాతలు గీతలు అనే పద్య సంకలనాన్ని ప్రచురించాడు. ‘ఆకాశవాణి’ అనే రహస్య పత్రిక ప్రచురణలో తన వంతు పాత్ర పోషించాడు.1938లో నవ్యసాహిత్యమాల స్థాపించి సామ్యవాద భావాలను ప్రచారం చేస్తూ ఎన్నో ప్రచురణలను వెలువరించాడు. 1945లో నవ్యసాహిత్య పరిషత్‌కు కార్యనిర్వాహకుడిగా కొనసాగాడు. 1945లో ‘మీజాన్‌’ పత్రికకు ఉప సంపాదకుడిగా పాత్రికేయ రంగంలో ప్రవేశించాడు. భారతి పత్రికలోనూ అనేక వ్యాసాలు రాశాడు. ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికకు 1952లో సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ‘మాణిక్యవీణ’ అనే శీర్షికను ఆకట్టుకొనేలా నడిపాడు.1956లో రాయలసీమ జీవన స్థితిగతులకు అద్దం పట్టే ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని వ్రాశాడు.

సంస్కృతంలోని రఘువంశం, శిశుపాలవధ, కాదంబరి, మేఘసందేశం, దశకుమారచరిత్ర మొదలైన ఎన్నో రచనలను తెలుగు వచన రచనలుగా అనువాదం చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంవారి రచనలకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు. విద్వాన్‌ విశ్వం 24 సంవత్సరాల వయస్సులో, అనంతపురం కేంద్రంగా 1926 నుండి పప్పూరి రామాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీసాధన’ వారపత్రికకు తొలి కథలు రాశాడు. విద్వాన్‌ విశ్వం తొలినాటి ఆలోచనాధోరణులకు ఈ కథలు అద్దంపడతాయి. 1939 ఆగస్టు12న ‘నా పెండ్లి సంబరం’ అనే కథలో, పెళ్ళీడు వచ్చిన అమ్మాయి పెళ్ళి సంబరం గురించి తమాషాగా, ఊహాలోకంలో కలలుకనే దశ నుండి అది ఒక అవసరంగా మారి, సర్దుబాటు చేసుకొనే మనస్థితిని తెలియజేస్తుంది. సరైన సంబంధం కోసం వేచి ఉండే క్రమంలో ఆ యువతిలో కలిగే మానసిక ఆందోళనల్ని ఈ కథ వివరిస్తుంది. జీవిత భాగస్వామి ఎంపికలో యువతి అభిప్రాయానికి స్థానం లేకపోవడాన్ని సూచిస్తూ ‘అతడెవరో యే సంగతో మా వాళ్ళు చెప్పారు.

కానీ నా చెవిలో అవేవీ దూరలేదు. యెటూ నేను పరీక్ష చేసి తగినవాడా? కాదా? అని తేల్చుకునే హక్కులేప్పుడు అవన్నీ తెలుసుకొనే లాభం! యెటూ మావారి మాటే కదా? యేదో ఒక ఆశ్రయం కోసం పరితపిస్తుండే లత యే చిన్న పుల్ల దొరికినా గట్టిగా నాలుగైదు చుట్లు చుట్టుకొని అల్లుకుపోవడానికెలా ఆతురపడుతుంటుందో అలా ఉంది నా మనసు’ అని యువతితో కథకుడు వెలిబుచ్చాడు. ఆగస్టు 26న రాసిన ‘మొగమహారాజు’ కథలో పురుషుల చేతిలో అమాయకులైన అమ్మాయిలు మోసపోతున్న వైనాన్ని చిత్రించాడు. ‘అమాయకులైన అమ్మాయిలకు’ ఈ కథను అంకితం చేశాడు. తల్లి, కొడుకు, కూతురుగల ఒక చిన్న బీద కుటుంబం ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉంటుంది. ఒక యువకుడు వారికి సహాయ సహకారాలందిస్తూంటాడు. ఆ యువకుడు పట్నానికి వలస వెళితే అతన్ని నమ్మి ఆ కుటుంబం కూడా వలస వెళుతుంది. పట్నంలో పాఠశాలలో కూతుర్ని చేర్పిస్తారు. ఆ యువకుడు అమ్మాయికి ట్యూషన్‌ చెప్పటం, అవసరమైనవి తెచ్చివ్వటం చేసేవాడు. ఆ అమ్మాయిపై ప్రేమ ఉన్నట్లు, భవిష్యత్తులో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు అందుకు అమ్మాయి తల్లి అనుమతించినట్లు ఆ యువకుడు ఒక సందర్భంలో తెలియజేస్తాడు.

అమ్మాయి అతని ప్రేమను నమ్మింది. ఇద్దరు మూడేళ్ళపాటు శరీరాలు స్వాధీనం తప్పి ప్రవర్తించారు. ఉద్యోగం రాగానే ఆ యువకుడు వేరే ఊరు వెళ్లిపోతాడు. అప్పటికే అమ్మాయి మూడు నెలల గర్భంతో ఉంటుంది. అతను వస్తాడని ఎదురు చూస్తుంటుంది. ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకుతుంది. ఆమెకు ప్రతి పిల్ల వెధవా ప్రేమ లేఖలు రాస్తుండటం చూసి ‘ఎంత నీచులో, ఆడవాళ్ళంటే అంత పశువులను కొన్నారా? అంగడిలొ అమ్మే వస్తువులనుకున్నారా?’ అని మధనపడుతుంది. చివరకు బడిమానేస్తుంది. ఆ యువకుడికి పెళ్లి కుదిరిందని తెలుసుకొని ‘అన్నయ్య భావి జీవితాన్ని, అమ్మ ఆందోళనను, కుటుంబ గౌరవాన్ని, ఆయన చేసిన అమానుషకృత్యాన్నీ, అర్థం లేని సంఘ మర్యాదలను, హృదయంలేని పశుప్రవృత్తిని, అమ్మాయిలలో ఉన్న వాంఛను కారణంగా చేసుకొని ఆత్మీయ తాత్కాలిక సౌఖ్యాన్ని పరిపూర్తి చేసకొనజూచే మగవాళ్ల స్వార్థపరతత్వాన్ని పురస్కరించుకొని వాని కోసం తనని తాను వంచించుకొని’ మరొకరిని పెండ్లి చేసుకుంటుంది.

ఆమెను ఆడిపోసుకుంటున్న జనాన్ని చూసి ఆమె మనసులో ‘ఎంత హృదయంలేనిదబ్బా ఈ ప్రపంచం. ఈపాడు ప్రపంచంలో యిన్ని ఘోరాలున్నాయని నాకు తెలీదు. మానవ హృదయాలు పూలగుత్తులనుకొన్నాను. కానీ ముండ్ల కంపలనుకోలేదు. మాటలకూ మనసుకూ సంబంధం లేదు. మానవ పశువులూ సంఘంలో మర్యాదకు లోటులేకుండా పెద్దమనుషులుగా ఉండొచ్చు. మనఃపూర్వకంగా మాలిమి చూపిన మనిషి వంచిస్తే, దిక్కు మొక్కులేని అమ్మాయి ఆశ్రయం కోసం విధిలేక, అర్థంలేని ఆర్థిక నీతులకు దాసురాలై, యింకొకరిని పెళ్లి చేసుకుంటే అందరికీ అపహాస్య భాజనం, అవినీతికరం కావడం. అందరూ నన్ననేవాళ్లే, ఆయన సంగతెవరికి కాబట్టింది? అన్ని నిందలూ ఆడవాళ్ళకే. ఆయన కేమమ్మా మగమహారాజు’ అనుకుంటున్నట్లు కథ ముగుస్తుంది.
మోసపోయిన స్త్రీ, మోసపుచ్చిన పురుషుడు- ఇద్దరి భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, స్త్రీకి అండగా నిలవాల్సిన వ్యవస్థ ఆమెను తప్పుపట్టి, పురుషుని చూసి చూడనట్లు వదిలేస్తే ద్వంద్వ వైఖరిని కథకుడు ఎత్తిచూపాడు. ఆనాడైన, ఈనాడైనా స్త్రీ పురుషులిరువురికి సమదృష్టి, సమన్యాయం అలవడనంత కాలం ఇలాంటి కథలు సజీవంగానే వుంటాయి.

1940 జనవరి 20న రాసిన ‘ఎందుకు ’ కథలో కటిక పేదరికంలో జీవిస్తున్న సమయంలో మనవడికి రోగం సోకటంతో కుమిలిపోయే ముసలమ్మ, అప్పులపాలైన రైతు, సొంత బిడ్డల ప్రేమకు నోచుకోని భూస్వామి, నిరుద్యోగుడైన యువకుడు, మోసపోయిన వేశ్యగా మారిన వితంతు మహిళ, ప్రజా ఉద్యమాలతో జైలుకు పోయి రాజకీయాలలో ఉన్న దంతా కోల్పోయిన నీతిగల నాయకుడు, పుస్తకాలు ప్రచురించుకొని అప్పుల పాలైన రచయిత- మొదలైన ఉపసన్నివేశాల ఆధారంగా సమాజంలో ఘోరాలు, నీచత్వం ఎందుకు జరుగుతున్నాయి? బాధలు ఎందుకు పడుతున్నారు? అంటూ ఈ కథలో ఆలోచింపజేస్తాడు రచయిత. వీటి గురించి ఆలోచించడం వృధా అనే మరీ పెద్దవాళ్లు కొందరు, ఆలోచించి ఎంత మంది తత్వవేత్తలు అడవులకెళ్ళారో అనే కాస్త హృదయంకల వారు కొందరు, స్వార్థపరతత్వాన్ని పరమోచ్ఛ స్థానానికి కొనిపోయే ధనతత్వంవల్ల జరుగుతోందని, ఇందుకు విరుగుడు మానవ సేవయే మాధవ సేవ అంటూ ఊరడింపు ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కొందరని- ఇలా పలు అభిప్రాయాల్ని రచయిత కథలో తెలియజేస్తాడు.

అంతిమంగా సంఘాన్ని మార్చడానికి పునర్మించడానికి వీలుందని ఆ ప్రయత్నంలో ఎన్నో ద్వేషాల్ని, అపహాస్యాల్ని, అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతమాత్రాన ప్రయత్నాన్ని మానుకోరాదని సూచిస్తాడు. ‘ఎందరో ఈ నిరాఘాట ధాటిలో పోతున్న సమాజ జగన్నాథ రథం క్రింద నలిగిపోలవలెను. ఎందరి రక్తంతోను ఈ భూమి తడిసిపోవలెను. ఎందరి ఆత్మలో పిశాచాలై ప్రపంచమంతా ప్రళయ తాండవం చేయవలెను. ఎందరి ఆలు, పిల్లలు అన్నంలేక మలమల మాడిపోవలెను. ఊఱికే మారుతుందా సంఘం. ఆ సమాజ శక్తికే బలికావలెను. అందుకు సర్వసన్నాహాలు చేసుకొని రంగంలోకి దుమికితీరవలెను. ఎందుకంటే ఆ బలికే, ఆ పొలికే’ అంటూ కథ ముగుస్తుంది. సమాజ మార్పుకై బలి అవుతూనే నూతన సమాజం కోసం పొలికి సిద్ధమవ్వాలనే విప్లవకర మార్గాన్ని ఈ కథలో రచయిత నిర్దేశం చేసాడు.శ్రీసాధన పత్రికలో కథానికలు రాసే ఉద్దేశంతో వ్రాయటం ప్రారంభించిన విద్వాన్‌ విశ్వం 1940, జనవరి 27 నుండి రాసిన ‘నీతులు, ఎక్కడికి, ఎక్కడున్నాము’ రచనలలో వ్యాస లక్షణాలు కనిపిస్తాయి.

సామ్యవాద భావాలపై పాఠకులలో మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.1940, జనవరి 27న వ్రాసిన ‘నీతులు’ అనే రచన- సమాజానికి, వ్యక్తికీ ఉన్న సంబంధాన్ని చక్కగా ఒడిదొడుకులు లేకుండా జరిగేటట్లు చేయడం కోసం వేదాలు, కావ్యాలు, నీతికథలు, మతాలు మొదలుకొని రాజ్యాంగాలు, తత్వశాస్త్రాలవరకు ఆయా కాలాలలో ఉన్నాయి. సమాజ స్థితికి అనుగుణంగా సమరసతను చేకూర్చేటందుకై అవి కొంత వరకు ఉపయోగపడినాయని పూర్తిగా నెరవేరలేదని- ప్రారంభమవుతుంది.సమాజానికి, వ్యక్తికి సామరస్యాన్ని కలిగించే నీతి నియమాలు ఆదర్శాలు కావని అవి సాధనాలని, వాటిని ఆచరణలో పెట్టటానికి తగిన సమాజ నిర్మాణం జరగాలని అందుకు పరిసర పరిస్థితులు అనుగుణంగా ఉండాలని, ఒక వేళ ఆచరణలో లేనప్పుడు ఆ సిద్ధాంతాలు ఆడంబరాలుగానే మిగిలిపోతాయని కథకుడు వివరిస్తాడు.

ఒక భూస్వామికి అతని మనస్సులో ఏమాత్రం కూలివాని నోరుకొట్టాలని ఇష్టంలేకున్నా మన సమాజ విధానమే అతని శ్రమను దోచుకునేటట్లు చేస్తోందని తెలిపాడు. యంత్రప్రాయమైన ఆర్థిక నిర్మాణం, అస్థిరమైన స్వేచ్ఛా వ్యాపారం ఫలితంగా పోటీలు, దివాళాలు, పీడనలు, ధనకేంద్రీకరణలు, యుద్ధాలు, దేశ స్వతంత్రతకి భంగాలు కలుగుతాయి. పరిస్థితులలో మార్పులు తేకుండా భావవాదులు మనసులో మార్పులు తెచ్చుకున్నంత మాత్రానా ప్రపంచం ఏమాత్రం శాంతంగా ఉండదని వివరించాడు. ఒకరిని పీడించడానికి అనువయ్యే భౌతిక వాతావరణం లేకపోతే ఆ తరువాత మానసికంగా కూడా వ్యక్తుల్లో పరపీడనేచ్ఛ నశిస్తుంది. ఒక్కతూరే పోకపోవచ్చు కానీ ఆ కొత్త వాతావరణం కొన్నాళ్లలో మానసిక ప్రపంచంలోను ఈ దుర్గుణాలను తుడిచిపెట్టివేస్తుంది. పీడితులు, పీడకులు అనే భేదం, పరస్పర వైరుధ్యం పోయి వర్గరహిత సమాజం ఏర్పడిన తరువాత నీతి, నియమాలు కేవలం ఆదర్శాలుగా కాక ఆచరణలో ఉండేటట్లు చేయవచ్చని కథ ముగుస్తుంది.సామ్యవాద సిద్ధాంతంలోని మూలసూత్రాలన్నింటిని సమకాలీన సమాజానికి అనువర్తితం చేస్తూ సమర్థవంతంగా, సైద్ధాంతికంగా ఈ రచన సాగుతుంది.

ఫిబ్రవరి 3న వ్రాసిన ‘ఎక్కడికి’ రచనలో పాత కాలంలోనే అన్నీ ఉన్నాయనే భ్రమలు వదులుకొని, అందులోని మంచిని మాత్రమే స్వీకరించాలని, జీవన విధానంలో, సమాజ పరిణామక్రమంలో కొత్త ఆలోచనలకు, మార్పులకు స్థానం ఇవ్వాలని తెలియజేస్తుంది. ఫిబ్రవరి 10న వ్రాసిన ‘ఎక్కడున్నాము’? రచనలో ఆర్థిక, సామాజిక, విద్యారంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో తూలనాత్మకంగా వివరించాడు. సామ్రాజ్యతత్వ బంధనాల నుండి విడిపోయి సహకార పద్థతిపై దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకోవాలని అందరూ స్వరాజ్యం కోసం పోరాడాలని అప్పుడన్నీ సాధ్యమవుతాయని తెలియజేస్తుంది. విద్వాన్‌ విశ్వం తొలి దశ కథలు, రచనలలో స్త్రీల మానసిక ప్రపంచాన్ని, స్త్రీలపట్ల పురుషులకు ఉన్న వివక్షలపై నిరసనను, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆకాంక్షను తెలియజేస్తాయి. సమ సమాజ నిర్మాణానికై సామ్యవాద సిద్ధాంతాల ఆవశ్యకతలు ఆయన రచనలలో కనిపిస్తాయి. శ్రీసాధన పత్రికలో విద్వాన్‌ విశ్వం కవితలు, అనువాద కథలు, సామాజిక రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయి. 
డా.ఆప్పిరెడ్డి హరినాథ రెడ్డి 
surya daily 03-06-2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...