Tuesday, February 26, 2013

1918లోనే సీమ తొలి కథ! - సంగిశెట్టి శ్రీనివాస్

1921లో చింతా దీక్షితులు రాసిన 'సుగాలీ కుటుంబం' కథనే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించిన తొలి కథగా రికార్డయ్యింది. ఇప్పుడాస్థానాన్ని 1918లో సౌందర్యవల్లి పత్రికలో అచ్చయిన 'కడపటి పైసా' కథ ఆక్రమిస్తుంది. దీని రచయిత పేరు ప్రచురింపబడలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు. 

ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం ఎవరి మూలాల్ని వాళ్లు వెతుక్కునేందుకు దోహదపడింది. ఈ చైతన్యం తోటి వారితో పోల్చుకొని తమ స్థానమెక్కడో లెక్కలేస్తోంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో మరీ ముఖ్యంగా కథా ప్రక్రియలో ఎవరి పాత్ర, స్థానం, దోహదం ఎట్లాంటిదో ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రాంతాల వారీగా పరిశోధనలు ప్రారంభ మయ్యాయి. ఈ కోవలోనే 'తొలి తెలుగు కథలు - భండారు అచ్చమాంబ' పుస్తకాన్ని నేను ప్రచురించాను. ఈ పుస్తక ప్రచురణతో అప్పటి వరకు తొలి తెలుగు కథకుడిగా నిర్ధారించబడ్డ గురజాడ అప్పారావు స్థానం మారింది. శ్రీకాకుళంలో 'కథా నిలయం' ఏర్పాటుతో మొత్తం తెలుగు కథల పరిశోధన తీరు మారింది. ఎంతో కాలంగా అందుబాటులో లేని అనేక అపురూపమైన కథలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అస్తిత్వ స్పృహ నుంచి కొనసాగించిన పరిశోధనలో తవ్వా వెంకయ్య '1941కి ముందూ సీమ కథ' పేరిట 'వివిధ' (21 జనవరి)లో వ్యాసం రాశాడు. 1926 జూన్ నాటి 'భారత కథానిధి' పత్రికలో 'మతభేదం', 'మీనాక్షి' కథలు రాసిన అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్టిలను తొలి రాయలసీమ కథలుగా/ కథకులుగా ఆయన అభిప్రాయ పడ్డాడు. మరింత పరిశోధన జరగాలని, 'సీమ తొలి కథా రచయిత ఎవరనేది' నిర్ధారణ జరగాలని కూడా అన్నాడు. దానికి స్పందనే ఈ వ్యాసం.


రెండు దశాబ్దాల క్రితం 'తెలంగాణ తెలుగు పత్రికలు' అనే అంశం మీద పరిశోధన చేస్తున్న క్రమంలో వివిధ గ్రంథా లయాల్లో అనేక పత్రికలను పరిశీలించడం జరిగింది. నా పరిశీలనలో తొలి రాయలసీమ కథ 1918లోనే ప్రచురిత మయినట్టు కనుగొన్నాను. ఈ కథ పేరు 'కడపటి పైసా'. ఇది 'సౌందర్యవల్లి' పత్రికలో ప్రచురితమయ్యింది. గాడిచర్ల రామా బాయమ్మ సంపాదకత్వంలో ఈ పత్రిక మద్రాసు నుంచి వెలువడింది. ఇందులో కథారచయిత పేరు పేర్కొనలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు. ఏది ఏమైతేనేమి ఇంతవరకు 1921లో చింతా దీక్షితులు రాసిన 'సుగాలీ కుటుంబం' కథనే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించిన తొలి కథగా రికార్డయ్యింది. ఇప్పుడా స్థానాన్ని 'కడపటి పైసా' కథ ఆక్రమిస్తుంది. ఈ సమాజంలో న్యాయంగా, నీతితో బతుకుట అసంభవమనీ అందువల్ల ఆత్మహత్య తప్ప పరిష్కారం లేదు అని తలంచిన పురుషోత్తమనాయుడు అనే వ్యక్తి తుంగభద్రలో దూకి ప్రాణాలర్పించాలని నిర్ణయించుకుంటాడు. అయితే తన ప్రక్కనున్న వ్యక్తి సిగరెట్టు తాగి పొగ వదలడంతో ఆ వాసనకు ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిలో కూడా సిగరెట్టు తాగాలనే బలమైన కోరిక కలుగుతుంది.

సిగరెట్టు కోసం కర్నూలు పట్టణంలోని వీధులన్నీ తిరిగి తన దగ్గరున్న 'కడపటి పైసా'తో సిగరెట్టు కొనుక్కొని తాగుతూ ఉండగా అతని తాత కనబడి అతన్ని ఇంటికి తీసుకెళ్లడంతో కథ ముగుస్తుంది. ఈ కథలోని వర్ణన ఏ ఆధునిక కథకు కూడా తీసిపోదు. "వాసన ముక్కుకెక్కినది. పూర్వపుటభ్యాసము స్మరణాపథము నాక్రమిం చినది. అంతట నాపురుషోత్తమ నాయడు "ఆహా! ఇది లంక పొగాకుతో నవీనముగా మన మద్రాసు వైశ్యసోదరులు సిద్ధము చేసి యమ్ముచుండు సరస్వతి సిగరెట్టు సువాసన. అరరే, దీని నింకొకమారు స్వయముగా పీల్చి యనుభవింపక దేహత్యాగము చేయనగునా. అయిన, ఏల-కడపటి పైసా ఇంకను రొండిన నున్నది గదా!'' అని చెప్పుకొస్తాడు. అలాగే కథలో కర్నూలు పట్టణంలోని కుమ్మర వీధి, పెద్దవీధి, అక్కడి వక్కలాకుల దుకాణము గురించి కూడా వివరించాడు.

సీమ కథ గురించి ఇప్పటికే రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సింగమనేని నారాయణ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వేంపల్లి గంగాధర్ తదితరులు అనేకసార్లు చర్చలు చేశారు. మొదట కె.సభా ను తొలి సీమ కథకుడిగా భావించారు, అనంతరం 1941లో 'చిరంజీవులు' కథ రాసిన జి.రామకృష్ణకు 'తొలి కథకుడి' హోదాను ఇచ్చారు. ఇప్పుడు అయ్యగారి నరసింహ మూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్టి గురించి తవ్వా వెంకయ్య వెలుగులోకి తెచ్చాడు.

సౌందర్యవల్లి పత్రికలో 'కడపటి పైసా' రచన దగ్గర కానీ, ఇండెక్స్‌లో గానీ ఎక్కడా కథకుడి పేరు లేదు. ఈ కథను పత్రిక సంపాదకురాలు రామాబాయమ్మ భర్త, గతంలో మాతృసేవ పత్రికను నడిపించిన జాతీయోద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఆయన అంతకుముందు టాల్‌స్టాయ్ కథకు అనుసరణగా 'మూర్ఖరాజు' కథను రాసిండు కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు కర్నూలు వాడే కావడం కూడా పరిగణనలోకి తీసుకో వాలి. వేంపల్లి గంగాధర్, తవ్వా వెంకయ్యలు చెప్పిన శంకర విజయం (1910), పినాకిని (1922), మాతృసేవ (1924), భారత మహిళ (1925), భారత కథానిధి (1926), సాధన (1926), భారతజ్యోతి (1940) పత్రికలు పూర్తిగా అందుబాటు లోకి వచ్చినట్లయితే 1930కి ముందటి రాయలసీమ కథల గురించి మరింత లోతైన పరిశీలన, పరిశోధన చేయడానికి అవకాశముంటుంది.

వీటికి తోడు చిత్తూరు నుంచి 1937లో 'తెనుగు తల్లి' పత్రిక కుమారదేవ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో కూడా ప్రతి నెలా 'చిన్ని కత' శీర్షికన కథల్ని అచ్చేశారు. అలాగే 'భారత కథానిధి' పత్రికలో అయ్యగారి నరసింహమూర్తితో పాటు బైరెడ్డి గంగారెడ్డి (విశ్వాసపాత్రులు), పి.రామచంద్రరావు (పులిగోరు), సీతాభాయి (పూండి చెల్లమ్మ), ఘడియారం శ్రీరాములు (పంకజాక్షి) తదితర కథలు కూడా అచ్చయ్యాయి. ఈ కథలన్నీ అందుబాటులోకి వస్తేగానీ తొలితరం తెలుగు కథలు, రాయసీమ కథల గురించి విశ్లేషణ చేయడానికి, వ్యాఖ్యానించ డానికి, విమర్శ చేయడానికి వీలుపడదు. అందుకే తెలంగాణ తొలితరం తెలుగు కథల మాదిరిగా 'రాయలసీమ తొలితరం కథలు' అందుబాటులోకి తెచ్చినట్లయితే రాష్ట్రావతరణకు ముందటి కథ గురించి, అందులో ప్రతిఫలించిన ఆనాటి సమాజం గురించి తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ఈ పరిశోధన, ప్రచురణ పని నిరంతరం కొనసాగాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...