
1926 జూన్‌లో ప్రచురించిన అయ్యగారి నరసింహమూర్తి ‘మత భేదం’ కథావస్తువు ఎంతో గొప్పగా కనబడుతోంది. వెంకటయ్య ఈ కథా శిల్పం గురించి కూడా కొంత వివరించి ఉంటే బావుండేది. కథావస్తువు మాత్రం స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. బొగ్గవరపు నాగ వరదయ్య శ్రేష్ఠి రాసిన ‘మీనాక్షి’ కథావస్తువు కూడా వితంతు పునర్వివాహం వంటి అవసరమైన సామాజిక ఆదర్శంతో ఉన్నది కావడం ఆనందదాయకం. 1926-30 మధ్య కాలంలో ‘భారత కథానిధి’ పత్రికలో నలభై సంచికలలో యాభై కథలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణం ఈ కథలన్నింటిని ఒక సంకలనంగా తీసుకు రావలసిన అవసరం ఎంతో ఉంది. తొలుత ఈ కథలు సంకలనంగా అందుబాటులోకి వస్తే పరిశీలన, అధ్యయనం, పరిశోధన తప్పకుండా ప్రారంభమవుతుంది.ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా- ఆంగ్ల వారపత్రిక తొలి భారతీయ ఎడిటర్ ఎ.ఎస్. రామన్. 1919 సంవత్సరంలో ప్రొద్దుటూరులో జన్మించిన ఇతను చాలా మంది భావించినట్టు తమిళుడు కాదు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త సి.వి. రామన్ స్ఫూర్తిగా అవధానం సీతారాముడనే తన పేరును ఎ.ఎస్. రామన్‌గా మార్చుకున్నారు.
దీనికి సి.వి. రామన్ ఆమోదం కూడా ఉంది. ఎ.ఎస్. రామన్ తండ్రి అవధానం కృష్ణ ముని ప్రొద్దుటూరు నుంచి ‘బ్రహ్మ నందిని’ అనే పత్రికను నడిపారనీ, దీనికి కావ్యకర్త రుర్భాక రాజశేఖర్ శతావధాని తోడ్పాటు ఉందని నార్ల వెంకటేశ్వరరావు షష్ఠిపూర్తి ప్రచురనణ ‘స్టడీస్ ఇన్‌ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం’ (1968) పుస్తకంలో ప్రముఖ పాత్రికేయుడు బిజెస్.ఆర్. కృష్ణ పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంపై సంతకం చేసినవారిలో ఒకరయిన అవధానం కృష్ణముని గాంధేయవాది. 2001లో ఎ.ఎస్. రామన్ మరణించిన సందర్భంలో వారి గురించి తెలుగు పత్రికలలో కొన్ని వ్యాసాలు వెలువడ్డాయి. దేవులపల్లి కృష్ణశాస్ర్తితో ఎంతో సాన్నిహిత్యంగల ఎ.ఎస్. రామన్ భారతి, ఆంధ్రపత్రిక, గృహలక్ష్మి వంటి పత్రికలలో తెలుగు రచనలు చేశారని అంటారు. అవధానం సీతారాముడు పేరుతో కొన్ని కథలు రాశారని చెబుతారు. ఆకాశవాణికి కూడా పలు తెలుగు రచనలు చేశారని చెబుతారు. ఇంగ్లీషు రచనల గురించి చెప్పనక్కరలేదు. భారతీయ కళలకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చిన సంపాదకుడుగా ఎ.ఎస్. రామన్‌కు గొప్ప పేరుంది. రామన్ రచించిన తెలుగు కథలను ఇప్పుడు వెలికి తీయవలసిన అవసరం ఎంతో ఉంది. రాయలసీమ కథల గురించి రాసినవారెవరూ ఎ.ఎస్. రామన్ పేరు పేర్కొన్న దాఖలాలు పెద్దగా లేవు.
శ్రీకాకుళంలో జన్మించిన చిలుకూరి నారాయణ రావు అనంతపురంలో స్థిరపడ్డారు. కర్నూలు జిల్లాలో జన్మించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1914లో ఆంధ్రదినపత్రిక అవతరించినప్పుడు తొలి సంపాదకుడు. ఈయన మూడేళ్ళపాటు సంపాదకత్వం నెరిపారు. అంతకు ముందు రాజమండ్రి, మదరాసులలో చదువుకుని బందరునుంచి వెలువడే ‘స్వరాజ్య’ పత్రిక 1908లో ‘విపరీత బుద్ధి’ అనే సంపాదకీయం రాసి తొలి రాజకీయ ఖైది అయ్యారు. ‘హిందూ’ పత్రికలో చాలా కాలం పుస్తక సమీక్షలు రాశారు గాడిచర్ల. అప్పట్లో అనంతపురం నుంచి పప్పు రామాచార్యులు నిర్వహించిన ‘సాధన’ పత్రిక దక్షిణ ఆంధ్రప్రాంతానికి వెలుగు బాసటగా సాగింది.బళ్ళారి రాఘవ, ధర్మవరం కృష్ణమాచార్యులు, బి.ఎన్. రెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి అమోఘమైన దిగ్ధంతులు జన్మించిన ప్రాంతం, కాలం ఇదే! వీరు రావడాన్జికి నేపథ్యం కానీ, వీరు కలిగించిన ప్రభావం కానీ స్వల్పంగా ఉండే అవకాశం ఉండదు. అయితే విశేష స్థాయిలో పరిశోధన జరిగితే కానీ అసలు వాస్తవం బయటపడదు. తవ్వా వెంకటయ్య వ్రాసిన వ్యాసం కలిగించిన ఆలోచనలు పంచుకోవాలనే ఈ వ్యాసం.
January 7, 2013 surya daily
No comments:
Post a Comment