Tuesday, February 26, 2013

1941కి ముందూ సీమ కథ-- తవ్వా వెంకటయ్య

బండారు అచ్చమాంబ మొదలు గురజాడ దాకా పురిటి నొప్పులు పడ్డ తెలుగు కథ 1910 నాటికి ఒక సలక్షణమైన రూపాన్ని సంతరించుకుంది. నూరేళ్ల తెలుగు కథాశిల్పంలో వాస్తవిక శిల్పమే సర్వ పాఠక ఆమోదాన్ని పొందింది. కథానిక ప్రారంభం నుండి నేటి దాకా అనేక పరిణామాత్మక మార్పులను చవిచూసిన కథ వాస్తవికతకు భంగం కలిగించని రీతిలో అనేక రూపాల్ని సంతరించుకుంది.


భారతదేశంలో మొదటి కథానిక 1805లో పశ్చిమ బెంగాల్‌లో 'తాతాఇతిహాస్' పేరిట చండీచరణ్ రచించాడు. కానీ తెలుగులో మాత్రం 1910లో గురజాడ వారి 'దిద్దుబాటు' పేరుతో తొలి కథానిక వచ్చిందని మొన్నటిదాకా విమర్శకుల అభిప్రాయం. కానీ బండారు అచ్చమాంబ రచించిన 'ధనత్రయోదశి' అనే కథానిక 1902 నవంబర్‌లో 'హిందూ సుందరి' పత్రికలో వచ్చింది. కనుక అదే తొలి కథానిక అని ఇటీవల స్థిరపడింది. మొత్తంగా చూస్తే 1902-10 మధ్యకాలంలో తొలి తెలుగు కథానిక రూపుదిద్దుకొంది.

మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు రాయలసీమలో కథానిక పుట్టుక కొన్ని దశాబ్దాలు వెనుకబడిందని, అందుకు రాయలసీమ కోస్తా ప్రాంతం కంటె ఆర్థికంగా వెనకబడి ఉండడమే కారణమని విమర్శకుల అభిప్రాయం. రాయలసీమ సాహిత్యం గురించి ప్రాంతీయ దృక్పథంతో ఆలోచించిన మొదటి విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి మొదలు నేటి విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వరకు అందరూ కోస్తా ప్రాంతం కంటే రాయలసీమ కథా సాహిత్యం కొన్ని దశాబ్దాలు వెనుకబడిందన్నారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, శాంతి నారాయణ, మధురాంతకం రాజారాం, కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ వంటి సాహిత్యకారులందరూ వివిధ సందర్భాలలో రాయలసీమ తొలి కథా చర్చ చేశారు.

అందరిలోనూ 'తొలి తెలుగు కథ దిద్దుబాటు (1910) తర్వాత మూడు దశాబ్దాల వరకు రాలయసీమలో కథా రచన జరగలే'దనే భావన వ్యక్తమైంది. 1941లో విజయవాణి పత్రికలో వచ్చిన రామకృష్ణ రాసిన 'చిరంజీవి' కథ తొలి రాయలసీమ కథానికగా విమర్శకులందరిచే గుర్తింపు పొందింది. అయితే రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి 'అనంత కథకుల దళిత కథనం' (ఆంధ్రభూమి, 26 అక్టోబర్ 1999) అనే వ్యాసంలో రాయలసీమ తొలి కథానికను ప్రస్తావిస్తూ 'రాయలసీమలో కథానిక సంబంధించి 1940 ప్రాంతాలలో పురిటి నొప్పులు మొదలైనా 1950 తరువాతనే సలక్షణమైన కథానిక పుట్టింది. ఆధారాలు లభిస్తున్నంతలో 1941 'విజయవాణి' పత్రికలో వచ్చిన జి.రామకృష్ణ రాసిన 'చిరంజీవి' కథ తొలి రాయలసీమ కథ' అన్నారు. 'ఆధారాలు లభిస్తున్నంతలో' అనడం వల్ల తొలి రాయలసీమ కథా చర్చ పూర్తి కాలేదన్న స్పృహ ధ్వనిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర ప్రాంతాలలో పోల్చి చూసినప్పుడు రాయలసీమలో కథానిక చాలా వెనకబడిందనేది విమర్శకుల అభిప్రాయంగా భావించవచ్చు. 1910 నుంచి 1940 మధ్య సీమలో వెలువడిన పత్రికలు కూడా కథానికను ఆదరించలేదని విమర్శకులన్నారు.

20వ శతాబ్దంలో సీమ నుంచి శంకర విజయం (1910), పినాకిని (1922), మాతృసేవ (1924), భారత మహిళ (1925), భారతజ్యోతి (1940) వంటి పత్రికలు వచ్చినా, అవి ఏవీ సీమలో కథానికను ప్రోత్సహించలేదు. సీమ గురించి మొట్టమొదటి కథ రాసింది చింతా దీక్షితులు (సుగాలి కుటుంబం - 1921). ఈయన సీమ వాసి కాదు. కానీ సీమ ప్రాంతపు కరువు గురించి కథ రాసింది ఈయనే. తర్వాత అనంతపురానికి చెందిన జర్నలిస్టు జి.రామకృష్ణ 'చిరంజీవి' కథానిక ప్రచురితం అయ్యింది. ఇప్పటివరకు రాయలసీమ తొలి కథకులుగా జి.రామకృష్ణ (అనంతపురం), కె. సభా (చిత్తూరు), భారతం నాధమునిరాజు (కడప) సముద్రపు శ్రీ మహావిష్ణువు (కర్నూలు)లను సాహిత్యలోకం గుర్తిస్తుంది.

స్వాతంత్య్రానికి ముందు సీమ నుంచి వచ్చిన చాలా పత్రికలు కథానికను ఆదరించలేదు. ఇది వాస్తవమే. అయితే అలాగనీ అసలు కథానికను ప్రోత్సహించిన పత్రికలే సీమలో లేవనడం సత్యదూరం. నాకు లభించినంత వరకు 'భారత కథానిధి' మాసపత్రిక కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి 1926 జూలై నుండి 1930 ఆగస్టు వరకు వెలువడింది. 40 సంచికలు వెలువడ్డాయి. వీటిల్లో దాదాపు 50 కథలు వచ్చాయి. వీటిని 25 మంది కథకులు రాశారు. వీరిలో ఎక్కువమంది సీమవాసులు కాగా కొందరు సీమేతరులు.

సీమ తొలి కథకులుగా చెప్పబడుతున్న జి.రామకృష్ణ, కె.సభా, భారతం నాదమునిరాజుల కంటే ముందు చాలామంది రచయితలున్నారు. వారినందర్నీ భారత కథానిధి పత్రిక పరిచయం చేసింది. అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్యశ్రేష్ఠి, వెల్లాల మైసూరయ్య, భూతపురి నారాయణస్వామి, దోమా వెంకటస్వామి గుప్త, యం.వి.పాపనగుప్త, హెచ్.మహబూబ్ వియ్యూక్, రూపావతారం శేషశాస్త్రి, అవధానం సుందరం, ఆలూరి శేషాచార్లు, యాలేటి వేంకటరావు మొదలైన రచయితలెందరో కథలు రాశారు. వీరంతా నాటి సమకాలీన సామాజిక అంశాలపై కథలు రాశారు.

ఇంతవరకు జరిగిన పరిశోధనలో తొలి సీమ కథకులుగా అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్యశ్రేష్ఠి లను గుర్తించవచ్చు. నరసింహమూర్తి 1926 జూన్ 'భారత కథానిధి' పత్రికలో 'మతభేదం' అన్న కథ రాశారు. ఇది పూర్తిగా కడప జిల్లా పెండ్లిమర్రి పరిసరాలకు సంబంధించింది. ఇందులో మాధవరాయుడు, వెంకటసుబ్బమ్మల కొడుకు నాగరాజు కోడలు సుగుణవతి. ఓ రోజు నాగరాజుకు తీవ్ర జ్వరం వచ్చి లేవలేని స్థితిలో ఉంటాడు. సుగుణవతి తన భర్తకు వైద్యం చేయించాలని ఆ ఊరి సాహెబును తీసుకొస్తుంది. సుగుణవతి అత్త వెంకటసుబ్బమ్మ సాహెబును లోనికి రానియ్యదు. తాము బ్రాహ్మణులమని సాహెబులను రానివ్వమంటుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో సుగుణవతి అత్తను ఎదిరించి తోసివేసి తనకు మతాలు ముఖ్యం కాదని తన భర్త ప్రాణాలు ముఖ్యమని చెప్పి సాహెబుతో తన భర్తకు వైద్యం చేయిస్తుంది.

ఇక నాగవరదయ్యశ్రేష్ఠి కథ 'మీనాక్షి' 1926లో అదే పత్రికలో వచ్చింది. ఇందులో మీనాక్షికి పన్నెండేళ్లకు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. మీనాక్షి భర్త అనారోగ్యంతో చనిపోతాడు. మేనమామ కృష్ణారావు సంఘసంస్కారి. సంఘంలో బాలవితంతువులకు పెళ్లిళ్లు చేయిస్తుంటాడు. అటువంటి మంచి పని తానే చెయ్యాలని తన కొడుకు నరసింహారావుకు తన చెల్లెలు కూతురైన మీనాక్షిని ఇచ్చి పెండ్లి చెయ్యాలని ఆలోచిస్తాడు. మీనాక్షిని, తన చెల్లెల్ని పెళ్లికి బలవంతం చేసి కర్నూలు నుంచి మద్రాసుకు తీసుకుపోతాడు. అక్కడ నుంచి మీనాక్షి పెళ్లి వద్దని చెప్పి ఇంటికి వస్తుంది. తన మాట వినకపోవటంతో కృష్ణారావు ఇక ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోతాడు.

పై రెండు కథల్లోని కథావస్తువులు, కథాశిల్పం ఏ ఆధునిక కథలకు తీసిపోవు. కాలక్రమాన్ని బట్టి చూస్తే ఈ రెండింటిని రాయలసీమ తొలి కథలుగా ఆ కథకుల్ని తొలి సీమ కథకులుగా గుర్తించవచ్చు.
1941నాటి జి.రామకృష్ణ కంటే ముందు వచ్చిన కథలపై, కథా రచయితల ప్రాంతాలపై మరింత పరిశోధన చేయాల్సి వుంది. అనంతరం సీమ తొలి కథారచయిత ఎవరనేది నిర్ధారణ చేయాల్సి వుంది. పరిశోధన జరుగుతూ వుంది...
- తవ్వా వెంకటయ్య
పరిశోధకులు, తెలుగుశాఖ, యోగివేమన యూనివర్సిటీ

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...