Wednesday, April 17, 2013

సీమ వెనకబాటుతనంపై శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన ఒక పత్రం

భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణకు బాటలు వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉండాలా? ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోవాలా అన్న పరిస్థితికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల కోట్లాది ప్రజలు ఎంత మాత్రం కారణం కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలను పెంచే విధానాలతో ప్రజల మధ్య వైరుధ్యాలను, విభేదాలను కల్పిస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని ఇన్నేళ్లు పాలించిన పాలకులు అందుకు పూర్తి బాధ్యులు. ఆ పాలకులే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలోని కొన్ని జిల్లాల వెనుకబాటుతనాన్ని రూపుమాపే పథకాలు చేపట్టకుండా, ప్రాంతీయ అసమానతలను శాశ్వతం చేశారు.

ప్రాంతీయ అసమానతలను, కరువు కాటకాలను, ప్రజల అసంతృప్తిని అవకాశంగా తీసుకొని వారిని రెచ్చగొడ్తున్న అవకాశవాద రాజకీయ పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం, పదవుల కోసం విద్యార్థులను, యువకులను ముందుంచి రాజకీయ యుద్ధం చేస్తూ వారిని బలిపెడ్తున్నారు. తమ వాదానికి మద్దతుగా శతాబ్దాల తెలుగు ప్రజల చరిత్రను, నాగరికతను, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని వక్రీకరిస్తూ, ప్రాంతాల వారీగా విభజిస్తూ, తప్పుడు సిద్ధాంతాల్ని ప్రతిపాదించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము.

ఒకనాడు విశాలాంధ్ర కోసం, ఆంధ్రుల ఐక్య త, ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీలు ఓట్లు, సీట్ల కోసం తమ మౌలిక విధానాలకు తిలోదకాలివ్వడం ఒక వాస్తవం. రాష్ట్ర విభజనను పరిష్కారంగా ఘోషిస్తున్న ఈ పార్టీలు, విభజనతోనే మొదలై మూడు ప్రాంతాలలో జరగబోయే తీవ్ర పరిణామాలను, సమస్యలను ఆలోచించడం లేదు.

edit.రాయలసీమ ప్రాంతం, ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, పరిణామాలను స్థూలంగా మీ దృష్టికి తెస్తున్నాము. సాహితీ, సమరాంగణ సౌర్వభౌముడుగా చరిత్రలో ప్రసిద్ధి పొంది, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు పేరుతో మా ప్రాంతం-కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు- పిలువబడటం మాకు గర్వకారణం.

రాయలవారి పాలనాకాలంలో రాయలసీమ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు (చెరువులు, కుంటలు, బావులు, కాలువలు), వ్యవసాయం, వాణిజ్యం, లలిత కళ లు, భవన నిర్మాణశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, రాజనీతిశా స్త్రం, యుద్ధవిద్యలు.. ఒకటేమిటి అన్ని రంగాలు, సమస్త కళ లూ వెల్లివిరిసిన కాలం. అప్పుడు రాయలసీమ రత్నాలసీమగా, కళలకు కాణాచిగా విలసిల్లింది.

తళ్లికోట యుద్ధం, పెనుగొండ ముట్టడి జరిగి విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత వరుసగా బహుమనీ సుల్తానులు, స్థానిక ప్రభువులు, నిజాం నవాబు, బ్రిటీషు ప్రభువులు పాలించారు. ఈ కాలమంతా రాజకీయ అస్థిరత, అరాచకం, దోపిడీలు, కరువులు విజృంభించి రాయలసీమలో రాజ్యమేలాయి. రాయలసీమకు రాళ్లసీమ, కరువు సీమ పర్యాపదాలైనాయి.

ఆంధ్ర మహాసభల చర్చల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేయాలని కోస్తాంధ్ర ప్రతినిధులు ప్రతిపాదిస్తే, సీమ నాయకులు, ప్రతినిధులు అంగీకరించక తమ అభ్యంతరాలను తెలుపుతూ వచ్చారు. మద్రాసు రాష్ట్రంలో అరవల పెత్తనంతో సీమ ప్రజలు విసిగిపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అభిజాత్యంతో వ్యవహరించే కోస్తాంధ్ర నాయకుల ఆధిపత్యం వస్తుందని, విశ్వవిద్యాలయం ఏర్పాటు, రాజకీయ పదవులు, ఉద్యోగాలు, నీటి వనరుల పంపకంలో జరిగిన అన్యాయాలు, భాషాపరమైన చిన్నచూపు మున్నగు అంశాలను సీమ విషయంలో వివక్షతలను, మోసాలను ప్రస్తావించారు.

1937 అక్టోబర్‌లో బెజవాడలో జరిగిన ఆంధ్రమహాసభ రజతోత్సవ సభకు సీమ నుంచి 30 మంది ప్రతినిధులు హాజరై సీమ ప్రజల వాణిని బలంగా, నిర్మొహమాటంగా వినిపించారు. కోస్తాంధ్ర వారితో కలిసి ఒక రాష్ట్రంలో ఉండాలంటే రాయలసీమకు 'ప్రత్యేక రక్షణలు' కావాలని స్పష్టంగా వివరించారు. ఫలితంగా రెండు ప్రాంతాల నాయకులతో 'సౌహార్ద్ర సంఘం' ఏర్పాటు చేసి, రాయలసీమ ప్రాంతంలో పర్యటించి అభిప్రాయాలను సేకరించారు.

కాశీనాథుని నాగేశ్వరరావు ఇల్లు 'శ్రీబాగ్'లో రెండు ప్రాంతాల నాయకులు, బాధ్యతగల పెద్దలు సమావేశమై ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది 'శ్రీబాగ్' ఒప్పందంగా పిలువబడుతున్నది. సీమ ప్రజలు ఎంతో విలువైందిగా భావిస్తున్న ఈ ఒప్పందం పాలకులు, రాజకీయ పార్టీలు, ఇతర రెండు ప్రాంతాల నాయకుల దృష్టిలో చిత్తుకాగితమయింది. ఒప్పందాన్ని నమ్మిన సీమ ప్రజలను వారు నట్టేట ముంచారు. అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురై దేశంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం గా, కరువు సీమగా మిగిలిపోయింది.

వివిధ జాతుల సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో మూడు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆంధ్రజాతి వివిధ రాజవంశాల పాలనలో భిన్న జాతుల సాంగత్యంతో, ఎన్నో మతాల, సంస్కృతుల ప్రభావంతో తనదైన ఒక వినూత్న, సంస్కృతిని సంతరించుకొన్నది. ప్రాచీన భాషా యోగ్యతను సంపాదించుకొన్న తెలుగుభాషకు రెండు వేల ఏళ్ల మౌఖిక, లిఖిత సాహిత్య చరిత్ర ఉంది.

రాజులు, రాజ్యాలు మారినా, సంస్కృతం, ప్రాకృతం, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, ద్రావిడ భాషలైన తమిళ, కన్నడ భాషా సాహిత్యాల సంపర్కం, సాహిత్యం ప్రభావంతో తెలుగు భాష మరింతగా తేజరిల్లింది. వివిధ ప్రాంతాలలో తెలుగు భాష కొత్త యాసలతో సొబగులు దిద్దుకొంది. ప్రాంతీయ, స్థానికమైన వైవిధ్యం, ఉచ్ఛారణలు, యాసలు ఎన్ని ఉన్నా తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతి, భాష ఒకటే.

దేశంలో ఆర్థిక అసమానతలకు తోడు, రాష్ట్రంలో ప్రాంతీ య అసమానతలు ఉన్నాయి. ఒక ప్రాంతం వెనుకబాటుతనాన్ని నిర్ధారించే అంశాల్లో-సగటు వర్షపాతం, నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయం, పరిశ్రమలు, అక్షరాస్యతా శాతం, రవాణామార్గలు, వినియోగమవుతున్న విద్యుత్తు, విద్య, ఉద్యోగాలు ప్రధానమైనవి. ఈ ప్రాతిపదికపై రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా అనేక మంది నిపుణుల కమిటీలు తమ నివేదికలో నిర్ధారించా యి.

రాయలసీమను వరుస కరువుల బారి నుంచి శాశ్వతం గా కాపాడి సస్యశ్యామలం చేయడానికి 20వ శతాబ్దంలో నియమించిన అన్ని కమిటీలు తమ నివేదికల్లో నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించాలని స్పష్టమైన ప్రతిపాదనలు చేశాయి. అందులో 1905-06లో మెకంజీ పథకం (సిద్ధేశ్వరం-గండికోట ప్రాజెక్టు) 36 లక్షల ఎకరాల సాగు, ప్లానింగ్ కమిషన్ అనుమతి పొందిన 1951లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం తయారు చేసిన కృష్ణా-పెన్నేరు ప్రాజెక్టు రిపోర్టు (రాయలసీమలో 7.2 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు సాగు), 1953లో ఖోస్లా కమిటీ నివేదిక ప్రధానమైనవి.

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నీటి వనరులు ముఖ్యం. సాగునీరు, విద్యుచ్ఛక్తి-వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాథమిక అవసరాలు. సీమ అత్యల్ప వర్షపాత ప్రాంతం. భూగర్భజలాలు తక్కువ. కృష్ణా, పెన్నా నదుల నీరే శరణ్యం. నదీ జలాల లభ్యత: గోదావరి 1493.02 టి.ఎం.సిలు, కృష్ణా 811.80 టి.ఎం.సిలు, పెన్నా 98.82 టి.ఎం.సిలు, నాగావళి 49.11 టి.ఎం.సిలు, వంశధార 14.11 టి.ఎం.సిలు, ఇతర నదులు 278.83 టి.ఎం.సిలు. ఇందులో గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవహించే నీరు మొత్తం రాష్ట్ర నదీ జలాల్లో లభ్యత 84 శాతం.

రాయలసీమ వాటా: రాష్ట్రంలోని పెద్ద జీవనదులైన గోదావరి, కృష్ణా నదుల నీటిలో- 1) గోదావరి నుంచి తెలంగాణ, కోస్తా ప్రాంత జిల్లాలకు. 2) కృష్ణా నది నుంచి తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంత జిల్లాలకు ఉపయోగించవచ్చు. 3) రాయలసీమకు మాత్రం కేవలం కృష్ణానదీ జలాలే ఏకైక ఆధారం. 4) పెన్నా నది నీరు అనంతపురం, కడప జిల్లాలకు తక్కువగా, దిగువ జిల్లా నెల్లూరుకు ప్రధానంగా వినియోగమవుతున్నది. 1976లో ప్రకటించిన బచావత్ అవార్డు ప్రకారం రాష్ట్రానికి కృష్ణానది వాటా 800 టి.ఎం.సిలు. బచావత్ తీర్పు ప్రకారం మూడు ప్రాంతాల మధ్య నీటి పంపకం కోస్తాంధ్ర 377.44 టి.ఎం.సిలు. తెలంగాణ 266.86 టి.ఎం.సిలు. రాయలసీమ 122.70 టి.ఎం.సిలు. ఆవిరి ద్వారా నష్టం 33.00 టి.ఎం.సిలు.

రాయలసీమ పరిస్థితి ఇది కాగా, తెలంగాణ, కోస్తా ప్రాంత రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, నీటిపారుదల మేధావులు రాయలసీమ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కృష్ణా నదీ జలాలను పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటి (44 వేల క్యూసెక్కులకు) పెంచి దోచుకొని పోతున్నాడని నిత్యం అసత్య ప్రచారం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సీమలో నిర్మించబడిన, నిర్మాణంలో వున్న సాగునీటి ప్రాజెక్టులకు ముఖద్వారం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు (రిజర్వాయర్) కాదు. అది 3 ప్రాజక్టులకు కృష్ణానదీ జలాలను క్రమబద్ధంగా నీరు వదిలే రెగ్యులేటర్ మాత్రమే.

దీనిద్వారానే 1). యస్.ఆర్.బి.సి (19) 2). తెలుగుగంగ (44) 3). గాలేరు-నగరి (38) 4). తుంగభద్ర నుండి కె.సి.కెనాల్‌కు ఇచ్చే 10 టిఎంసిలు మొత్తం 111 టిఎంసిలు వదలాలి. ఇందులో చెన్నై నగరానికి 15 టిఎంసిలు + 29 టిఎంసిలు మిగులు జలాలు-44 తెలుగుగంగ ద్వారా వస్తాయి. అంటే 111-44=67 టిఎంసిలు మాత్రం పంపే యీ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించే, దోచుకుపోయే అవకాశం ఎక్కడుంది? రాజధాని: 1956 నుండి పరిశ్రమలు, వ్యాపారాలు, ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, రాజకీయాలు... కారణాలతో లక్షలాది ప్రజలు సీమ, కోస్తా నుండి హైద్రాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ఐ.టి.సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, పత్రికారంగం, సినిమా పరిశ్రమ, విద్యాసంస్థలు బహుముఖంగా విస్తరించాయి. 1955లో 12 లక్షలు వున్న జనాభా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు వుంది. ఇందులో 1/3 వంతుకు పైగా సీమ, కోస్తా నుండి వచ్చిన వారున్నారు. హైదరాబాద్ ఆంధ్ర ప్రజలందరి ఐక్యరాజధాని. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే ప్రజల, ఉద్యోగుల, మైనారిటీ మతస్థుల, ప్రజాప్రతినిధుల, పార్టీలు, సంస్థల అభిప్రాయా లు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా హైదరాబాద్ గురించి నిర్ణయం తీసుకోవాలి.


                                                                                                                      - బి.పాండురంగారెడ్డి
                                                                                                         అధ్యక్షులు, రాయలసీమ పార్టీ
                                                                             (శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన పత్రం సంక్షిప్త పాఠం)
                                                                                 ఆంధ్రజ్యోతి దినపత్రిక (05/05/2010)సౌజన్యంతో..

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...