Saturday, April 20, 2013

భాష విషయంలో దారి తప్పుతున్నాం జాగ్రత్త! - డా.యం.వి.రమణారెడ్డి

ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 డా.యం.వి.రమణారెడ్డి
ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. ప్రామాణిక భాషలో కథ వ్రాసి, దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది.
మనకు హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహముంది. కొంతమంది ఆ విగ్రహాన్ని చూడగానే, ఈమె విజయవాడనుండో కాకినాడనుండో వచ్చిన ఆడమనిషి అనుకుంటున్నారే తప్ప, తల్లి అనే భావనతో చూడకపోవడం గమనిస్తే మనసు చివుక్కుమంటుంది. వాళ్ళు పరాయివాళ్ళయినా కాదు. తెలుగు బిడ్డలే. మరి వాళ్ళకు ఈ వికారం ఎందుకు కలిగింది? కుటుంబం నుండి విడిపోవాలనే భావన వాళ్ళకు కలిగింది కనుక. కలిసుంటామా విడిపోతామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్నదమ్ములు కలిసున్నా విడిపోయినా తల్లి మారదు.
విడిపోవాలనే భావం కలిగినంత మాత్రాన తల్లిని మార్చుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన ఇది వరకు ఎక్కడా వినలేదు. కలిసున్నా విడిపోయినా మనకు తల్లి మాత్రం ఒకటే ఉంటుందని చాటిచెప్పే విధంగా, తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన నా తమ్ముళ్ళను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడనుకున్నామే, ఈ రాజకీయప్రభాలు, ఈ ప్రాంతీయ విభేదాలు, ఇవి కలిగించే ప్రకంపనాలు, తెలుగు సాహిత్యాన్ని గూడా సోకినా యి. అది తప్పదు. అది మనకు ఇక్కడ కొత్తగా జరుగుతున్న విశేషమేంగాదు. ప్రపంచంలో అన్ని చోట్లా జరిగేదే. సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది.
తెలుగు సాహిత్యంగూడా మార్పును స్వీకరించింది. అనేకమంది రచయితలు, ముఖ్యంగా కథా రచయితలు, తమ ప్రాంతీయ మాండలికంలో రాయడం మొదలుపెట్టినారు. నిన్నా మొన్నటివరకూ ప్రామాణికభాషనే మనమంతా ఉపయోగించాం. కానీ, ఈ తరం రచయితలు దాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. రాజకీయాలు కానివ్వండి, ప్రాంతీయ మనస్తత్వం కానివ్వండి, కారణం ఏదైనా, నా ప్రాంతంలో వాడే మాండలికాన్నే నేను రాస్తాను, నా ప్రాంతంలో వాడే యాసలోనే రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు వ్రాయాల?-అనే పరిస్థితి వచ్చేసింది.
ఇంకొకరి భాష అంటే కోస్తావాళ్ళ భాష అనే అర్థంలో, ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను. ఎందుకు అనే వివరణకు పోయేముందు ఈ పరిస్థితి దాపురించడానికి దోహదం చేసిన కారణాలు కొద్దిగా చర్చించుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాటిల్లో మొదటిది మన కోస్తాసోదరుల ప్రవర్తన. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను.
రాయలసీమ ప్రాంతంలో తండ్రి తల్లిని ‘జేజి’ అంటారు. కోస్తాలో ‘నాయనమ్మ’ అంటారు. నాయనమ్మ అనేది తేలికైన రెండు పదాల కలయిక. చిన్నపిల్లలు, ఇంకా భాష సరిగారానిసమయంలో నాయనకు అమ్మకాబట్టి నాయనమ్మ అంటూ తేలిగ్గా వాళ్ళకు వాళ్ళు కూర్చున్నమాట. జేజి పదం అలా తయారైంది కాదు. అది తెలుగుభాష ప్రత్యేకతను సూచించే పదం. సంస్క¬ృతానికీ తెలుగుకూ ఉన్న తేడాను తెలియచేసే పదం. కుటుంబ సంబంధాలను విడివిడిగా, స్పష్టంగా తెలియజేసే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అత్త, కోడలు వంటి పదాలు సంస్కృతానికి లేవు. అవి తెలుగులోనే దొరుకుతాయి.
మన భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించే పదాల్లో జేజి అనే పదం కూడా ఒకటి. అందువల్ల అది మనం పోగొట్టుకోవడానికి కూడా వీల్లేని మేలిమి. అలాంటి పదా న్ని చులకన చేసి ‘జేజి ఏమిటండీ జేజి. చక్కగా నాన మ్మా అని పలకలేరా?’ అంటూ ముఖం చిట్లించుకుంటారు కోస్తా సోదరులు. వెంటనే మనం చిన్నబోతాం. మనం కూడా ‘నానమ్మ ఏంటండీ నానమ్మ. చక్కగా జేజి అని పలకలేరా?’ అని అడగచ్చు. కానీ అడగలేం. ఎందుకంటే నా భాష తప్పేమో అనే గిలి మనను వెనక్కు లాగుతుంది. నాది ప్రామాణిక భాష కాదు అనే మానసిక బానిసత్వం మననుజవాబు చెప్పే పరిస్థితిలో లేకుండా గొంతునొక్కేస్తుంది.
ఇలాంటి పోట్లు కోస్తా సోదరుల చేతుల్లో ఇతర ప్రాంతాల రచయితలూ సామాన్యులూ లెక్కలేనన్ని సార్లు అనుభవించారు. ఈ పరిస్థితి ఇలావుంటే, పుండుమీద కారం చల్లినట్టు చేస్తున్నాయి తెలుగుసినిమాలు. రౌడీకి రాయలసీమ యాస, విదూషకునికి తెలంగాణ యాస, హీరోకు కోస్తా యాస ఉపయోగించడం సినిమా రచయితలకు అలవాటైపోయింది. ఇక సినిమా కథలందామా, ఏదోవొక ఫైన్‌మార్నింగ్‌ ఆ రచయిత తలకాయలో ఒక క్రైమ్‌ కథ మొలుస్తుంది. అది ఏ ప్రాంతంలో జరిగినట్టు తడుతుందంటే రాయలసీమలో జరిగినట్టు తడుతుంది.
ఆ మొలిచిన కథకీ, రాయలసీమ వాస్తవిక జీవితానికీ ఏ మాత్రం పొత్తుండదు. ఆ రచయిత రాయలసీమలో గడపటానికి తన జీవితంలో అర్ధరోజైనా కేటాయించి ఉండడు. అతనికి రాయలసీమజీవితం తెలియదు, భాష తెలియదు, సంస్క¬ృతీ తెలీదు. కోస్తా యాజమాన్యాల గుత్తాధిపత్యంలో నడిచే పత్రికల ద్వారా సంపాదించిన తప్పుడు సమాచారంతో రాయలసీమను ఊహించి తన బుర్రలో పుట్టిన క్రైమ్‌నంతా రాయలసీమమీద రుద్దుతాడు. ప్రతినిత్యం అంతపెద్ద తెరమీద, అంత విస్తృతమైన మీడియాలో రాయలసీమ పేరుబెట్టి అడ్డమైన వాచకాలు వాగుతూంటే చూసేవాళ్ళకు ఎలాగుంటుందండీ? వాస్తవంగా అది రాయలసీమ జీవితాన్ని ప్రతిబించేదే అయితే మనకు సంతోషమే! రాయలసీమ సంస్కృతినో, బాధలనో ప్రతిబింబించేదైతే సంతోషమే. కానీ అలా జరగడం లేదు.
ఉద్దేశపూర్వకంగా రాయలసీమను కించపరిచే పద్ధతి లో తయారైన సినిమాను అంతపెద్ద తెరమీద చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండెల్లో మండుతుంది. కాబట్టి, అందరికిలాగే మన రచయితలకు కూడా మండింది.వాళ్ళ భాషలో నేనెందుకు వ్రాయాలి. నా భాషలోనే, నా ప్రాంతంలోనే వాడే మాండలికంలోనే నేను వ్రాయాలి-అనే పట్టుదల పెరిగింది. ఈ వాదన తో నేను పూర్తిగా ఏకీభవించలేనని ఇది వరకే సూచించాను. ఎందుకంటే మనం ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణికభాషను ఎవడో కోస్తావాడు వచ్చి ఇది నా భాష అంటూ దొమ్మీగా లాక్కుపోతుంటే చూసి ఊరుకోటానికి నేను సిద్ధంగా లేను.
నాకు తెలిసి మనం ఉపయోగిస్తున్న ప్రామాణికభాషను యధాతథంగా వాడుతున్న జిల్లా ఒక్కటైనా నాకు కోస్తాలో కనిపించలేదు. జిల్లా జిల్లాకూ యాసమారుతుంది. వ్యవహారశైలి మారుతుంది. ఐతే, ఒక్క విషయం మనం అంగీకరించకతప్పదు. మనం ఉపయోగించే ప్రామాణికభాష కోస్తా వ్యవహారానికి దగ్గరగా ఉండటం వాస్తవం. దానికి చారిత్రిక కారణాలు చాలా ఉన్నాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నామాండలికానికి కూడా హోదాకావాలనే పట్టుదల పెరిగింది. మంచిదే. ఆ ప్రయత్నం మొదలెట్టండి. వాడిదొద్దు వీడిదొద్దు అనుకంటూ ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటే నష్టం తప్ప లాభముండదు.
అలాకాకుండా అచ్చమైన తెలుగుపదాలకోసం గ్రామసీమల్లో వెదకండి. పాశ్చాత్యనాగరికతకు దూరంగా ఉండే గ్రామసీమల్లో వెదకండి. సామాన్యమైన మానవ సంబం« దాలు, దినసరి వ్యవహారాలు నెరపటానికి అవసరమైన పదాలు ప్రతిభాషకూ ఉంటాయి, మనకూ ఉన్నా యి. అలాంటి పదాలు వెదికి తీయండి. అపభ్రంషంగా మారిన పదాలు ఉంటే వాటిని సంస్కరించండి. అప్పుడు మాండలికపదాల భాండాగారం తయారౌతుంది. రాయలసీమ గ్రామాల్లో, తెలంగాణ గ్రామా ల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణికభాషలో చేరేట్టు చూడండి. దానివల్ల తెలుగుభాష పరిధి పెరుగుతుంది. తెలుగు భాష విస్తృతమౌతుంది.
అయితే, ఆ దిశగా మన కృషి ఏ మేరకు జరుగుతూందంటే, దాదాపు జరగడం లేదనే చెప్పుకోవాలి. ప్రాంతీయ ప్రాముఖ్యత కావాలని కోరుకొనే రచయితలు ఎన్నుకుంటున్నది ఆ ప్రాంతంలో వాడే మాండలిక పదాలు కాదు, మాండలిక యాస మాత్రమే. అదైనా అందరికీ చేతనౌతూందా? పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకు తప్ప, మిగతావారికి అదిగూడా చేతకావడం లేదు. ఎందుకు చేతగాదంటే, ఏ పల్లెటూర్లో ఆ యాసవాడుతున్నారో, ఆ పల్లెతో నీ బొడ్డు తెగిపోయింది. కానీ, నా మాండలికంలో రాయాలనే కుతి పెరిగింది.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. అది వ్రాయటానికి ఏం చేస్తున్నావ్‌? మొట్టమొదట నువ్వు అలవాటుపడిన ప్రామాణిక భాషలో కథ వ్రాసి, ఆ తరువాత దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. దానివల్ల, కథలో అనవసరమైన కృత్రిమత్వం చోటుచేసుకుంటూందే తప్ప, యాస కుదరటం లేదు. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది. ప్రాంతీయ ప్రాముఖ్యతకోసం యాసను కోరుకుంటున్నాం గదా. మరి నువ్వు కలగనే ప్రాంతానికంతా ఒకే యాసలేదే.
రాయలసీమ తీసుకుంటే చిత్తూరులో ఒక యాస, కడపలో మరో యాస, అనంతపురంలో ఒక యాస, కర్నూలుది మరోయాస. ఒకే జిల్లాలో కూడా ఐదారు రకాల యాసలు మనకు కనిపిస్తాయి. కడపయాసలో రాసింది పక్కనున్న చిత్తూరు, అనంతపురాలకు చదవడమే కష్టమౌతుంది. దానివల్ల పాఠకుల సంఖ్య కుదించుకుపోతుంది. పాఠకుల సంఖ్య తగ్గితే ఆ సాహిత్యం వల్ల సమకూరే ప్రయోజనం ఎంత అనేది నా సందేహం. కాబట్టి, మనం ఒక దిశగా చెయ్యవలసిన ప్రయాణాన్ని మరో దిశగా, చేరవలసిన గమ్యానికి సరిగ్గా వ్యతిరకమైన దిశగా చేస్తున్నామేమోనని నా అనుమానం.
ఇదేదో కొత్త ప్రయోగమని మనం మొదలెట్టామే, ఈ మాండలిక ప్రయోగం చాలా చాలా పురాతనమైనది. బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకరకంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. అందులో 43రకాల ఉచ్చారణా తేడాలు ఉన్నాయి. బెర్నార్డ్‌ షా రచించిన ‘పిగ్మ్యాలియన్‌’ నాటకం చదివితే కొంతవరకూ తెలిసొస్తుంది. ‘డయలెక్ట్స్‌’తో వేగలేక వాళ్ళు కూడా చివరకు ‘ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌’ పేరుతో ప్రామాణిక భాషను రూపొందించుకునే అవసరం కలిగింది. చారిత్రికంగా అది తప్పనిపరిస్థితి. ఈపరిణామాలను గమనించకుండా ఇప్పుడు మనం ఒక ఎమోషనల్‌ మూడ్‌లో మాండలిక తెలుగును ఉద్ధరించటానికి మారుగా, మాండలిక యాసకోసం పాకులాడుతున్నాం.
కాబట్టి, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, ఒక ప్రామాణికభాష అవసరాన్ని గుర్తించ వలసిందిగా సభకు విజ్ఞప్తిచేస్తూ- ఆ ప్రామాణిక భాష కోస్తాదా, రాయలసీమదా, తెలంగాణదా లేక అందరికీ సమ్మతమైన మరొకటా అనేది తరువాతి సంగతి. ముందు తెలుగుభాష బతికుంటే కదా నీ మాం డలికమా, నా మాండలికమా అని తేల్చుకోవాల్సిన సమస్య ఉత్పన్నమయ్యేది! తెలుగు వ్యాకరణం పేరుతో మనం బోధించే పుస్తకాలను చూస్తే, మన భాష స్థాయి ఏమిటో మనకు కనువిప్పు కలుగుతుంది.
పదాలను విభజించినప్పుడు మనకు మొట్టమొదట తారసపడేది ‘తత్‌ సమము’. తత్‌ అంటే ఏమిటో మీకందరికీ బాగా తెలుసు. సంస్కృతానికి సమానమైన పదానిది మన తెలుగు వ్యాక రణంలో మొదటిస్థానం. ఆ తరువాతది ‘తత్‌ భవము’. అంటే సంస్కృతంనుండి పుట్టిన పదానిది ద్వితీయ స్థానం. నువ్వు అచ్చతెనుగు అనుకుంటున్నావే, దానికి నీ వ్యాకరణంలో ఇచ్చింది మూడోస్థానం. నువ్వు విప్లవాత్మకంగా భావిస్తున్నావే, ఆ మాండలికం నాల్గవస్థానంలో గ్రామ్యంగా ముచ్చటించబడి, సాహి త్యానికి అనర్హమైన భాషగా వెలివేయబడింది. మరి ఆ వ్యాకరణాన్నే భావితరాలకు బోధిస్తున్నాం. ఇకపోతే నిఘంటువులు.
అవి పేరుకు మాత్రమే తెలుగు నిఘంటువులు. పాత గ్రాంధికభాషా సాహిత్యాన్ని ముం దేసుకుని, ఆ పురాతన కవులు వాడిన సంస్కృతపదాలకు అర్థం చెప్పడం, ఉదాహరణలు చూపడం తప్ప తెలుగు వాసనే వాటికి లేదు. మరి చుట్టూ ఇన్ని తప్పులు పెట్టుకుని, వాటిని సవరించే ప్రయత్నం చేయ కుండా, నా తెలుగో నా తెలుగో అని పేద అరుపులు అరిస్తే ప్రయోజనం ఏముంది? ఈ ఆధునిక యుగం లో ముందుకు పోవటానికి నీ భాషకు ఇప్పటిదాకా సరైన నిఘంటువు లేదు, సరైన వ్యాకరణం లేదు, దానికి తోడు ప్రామాణిక భాషను గూడా లేకుండా చేసుకోవడం మంచిదో కాదో సభికులే ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను.
(వివిధ, 11 ఫిబ్రవరి 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...