Wednesday, April 17, 2013

రాయలసీమ వ్యాసరచయిత్రులు- పి.వరలక్ష్మి

థ, నవల, నాటకం, వచన కవిత్వం లాగా వ్యాసం కూడా ఆధునిక ప్రక్రియ. వ్యాసం అనగానే ఆధునిక ఆలోచనలు, ఆధునిక భాష (వ్యావహారిక భాష) అని వెంటనే స్ఫురిస్తుంది. రాయలసీమలో మిగతా ప్రాంతాల కన్నా ఆధునికత ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. కారణం రాయలసీమ సామాజిక రాజకీయ స్థితిగతుల్లో వెతుక్కొవచ్చు. 1800 దాకా అస్థిరతతో, పాలెగాళ్ల కలహాలతో నలిగిపోయింది. గ్రామీణ ప్రాంతాలన్నీ పాలెగాళ్ల చిన్నచిన్న రాజ్యాలు కావడంవల్ల ఇక్కడ బలమైన ఫ్యూడల్ పునాదులున్నాయి. నేటికీ ఆ ఛాయలు బలంగా కనిపిస్తాయి. ఇటువంటి సాంఘిక రాజకీయ వాతావరణంలో మిగతా ప్రాంతాల వలె ఆధునిక విద్యావ్యవస్థ చాలా కాలం వరకు లేదు.
                     ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యను ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని 1813 లో ఒక ప్రయత్నం మొదలు పెట్టినా 1840,1850 ల  నాటి వరకు ప్రాధమిక విద్యకూడా అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు 1820 ల నాటికి మిగతా ప్రాంతాల్లో కాలేజీలు తగు సంఖ్యలో ఉండేవి. మద్రాసులో 1717 లోనే క్రిష్టియన్ మిషనరీలు పాఠశాలలు నడిపారు. రాయలసీమలో కులం పునాది కూడా చాలా బలమైనదే. కింది కులాల వారితో పాటు చదివించడానికి నిరాకరించి తమ పిల్లల్ని పాత సాంప్రదాయ పాఠశాలలకు పంపడం  చాలా కాలం వరకు సహజంగా జరిగేది. తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల కూడా ఎంతో మంది చదువు కొనసాగించలేక పోవడంతో పాఠశాలలు మూతబడ్డ స్థితీ ఉంది. ఇక స్త్రీ విద్య గురించి ఆలోచించే అవకాశమే లేదు. 1920 ల నాటికి  గానీ రాయలసీమ మొత్తానికి ఒక కళాశాల వచ్చింది లేదు. మరో వైపు కోస్తా ప్రాంతంలో 1930 ల నాటికే స్త్రీలు చదువుకొని రచనలు చేశారు. 1930ల్లో ఏడిదపు సత్యవతి “ఆత్మచరితం” అనే పుస్తకం రాశారు. సరళ గ్రాంథికంలో మంచి వచనంతో ఆ రోజుల్లోనే స్త్రీల సమస్యలపై, ముఖ్యంగా పాతివ్రత్యం వంటి ధర్మాలపై విమర్శలు సంధించారు. అట్లాగే గురజాడ “దిద్దుబాటు” కంటే ముందే బండారు అచ్చమాంబ కథల గురించి మనకు తెలుసు. ఇక్కడ స్త్రీలు సరిగా అక్షరాలు దిద్దక ముందే కోస్తా ప్రాంతంలో కనపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్లు మహిళా సమాజాలు నడిపారు. బ్రాహ్మణ కుటుంబాల్లో విద్యకు సంబంధించిన ఒక వాతావరణం ఉండేది. పాఠశాలలకు వెళ్ళి చదువుకోకపోయినా ఇంట్లోనే విద్య నేర్చుకొని రచనలు చేసిన వాళ్ళున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఏమైనా ఉండేదా అని పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది.
రాయలసీమలో ఆధునిక రచనకు దోహదం చేసింది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రభావమే కావొచ్చు. ఉన్న సామాజిక చట్రంలోనే తనంతట తానుగా చైతన్యం పొందే వ్యక్తి ఆధునికతకు ఎంతవరకు దోహదం చేస్తాడు, అట్లాగే సామాజిక ఉద్యమాల పాత్ర ఎంత అన్న పరిశీలన ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్గ చైతన్యంతో వచ్చిన సాహిత్యం ఎంతో అంచనా వేయగలిగితే రాయలసీమ వంటి  ప్రాంతాల సామాజిక రాజకీయ స్థితి గతుల్ని, సాహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చేమో.
నా పరిశీలన కున్న పరిమితిని కూడా చెప్పుకోవాలి. “వ్యాసం” అనగానే సామాజిక రాజకీయార్ధిక, విషయాల్ని అర్ధం చేసుకుంటూ చేసే వ్యాఖ్యానం, విశ్లేషణకే పరిమితమయ్యి అటువంటి రచనల కోసం వెతగ్గా నిరాశే మిగిలింది. అన్ని పత్రికలూ కలుపుకుని నెలకు దాదాపు రెండు వేల వరకు వ్యాసాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. రాయలసీమ రచయిత్రుల వ్యాసాలు చాలా పరిమితంగానే ఉండటం వల్ల ఎక్కువగా సాహిత్య పరిశోధన, విమర్శ వ్యాసాలే లభించడం వల్ల నేననుకున్న ఫ్రేం వర్కులో ఇవి ఇమడలేక పోయాయి. ఏదైమైనా సామాజిక అంశాల మీద రోజువారీ ప్రతిస్పందనలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా రాయలసీమ రచయితలదీ అదే పరిస్థితి. ఇదిలా ఉంటే రాయలసీమలో విమర్శ బాగా అభివృద్ధి చెందింది. రచయిత్రుల్లో పరిణతి చెందిన విమర్శకులు ఉన్నారు.
రాయలసీమలో పద్య సాహిత్యం మీద  అవధానాల మీద మోజు ఇప్పటికీ బాగానే ఉంది. 2008 లో కర్నూలు నుండి వెలువడిన రెండు పుస్తకాలు ఆశావాది ప్రకాశరావు కవిత్వంపై, అవధానం పై వచ్చిన సమీక్షలు ఒక ఉదాహరణ.                డా|| శాంతమ్మ ఈ రెండిటితో పాటు భారతావలోకనం, మహిళా దర్శనం వంటి అనేక వ్యాసాలు సాంప్రదాయ దృష్టితో రాశారు. మహాభారతంలో స్త్రీ పాత్రలు అన్న అంశంపై పరిశోధన చేశారు. శాంతమ్మ గారి భాష ఈ యుగంలో కూడా గ్రాంథిక వాసనలతో ఉంటుంది. “అన్ని వేదాల్లోనే ఉన్నాయష స్త్రీల అణిచివేత కూడా” అన్న అంశంమీద ప్రసాదినీ దేవిగారు ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాలను తీసుకొని స్త్రీల పై అణిచివేత ఎలా మొదలైంది అన్న విషయాన్ని వివరించారు. వీరు ఇంకా మను దృష్టిలో మగువ, విలువల చెరలో మహిళ  అన్న వ్యాసం రాశారు. తిరుపతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ యమ్. విజయలక్ష్మి గారు భాషా శాస్త్రాల మీద చాలా మంచి పరిశోధన చేశారు. 1997 నుండి అనేక వ్యాసాలు ప్రచురించడమే కాక ఎన్నో యు.జి.సి. సెమినార్లలో ప్రసంగించారు. భాషకు సంబంధించి 35 పరిశోధన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. మరొక విశేషమేమిటంటే వీరు తెలుగు జాతీయాల, తెలుగు జాతీయ పర్యాయపదాల నిఘంటువులను నిర్మించారు. నిఘంటువును నిర్మించిన మొదటి భారతీయ మహిళగా (లెక్సికోగ్రాఫర్) రికార్డుల్లో కెక్కారు. “జానపద గేయగాథల్లో స్త్రీ” పైన వీరు చేసిన పరిశోధన ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో జానపదాల్లో స్త్రీ స్వరూప చిత్రణ, స్వభావ చిత్రణ, కుటుంబ జీవితం, సాంస్కృతిక జీవితం వంటి అంశాల వివరాలు నమోదు చేశారు.
దళిత స్త్రీ దృక్కోణం నుండి స్త్రీ వాద సాహిత్యాన్ని సమీక్షించిన అరుదైన విమర్శకులు కొలకలూరి మధుజ్యోతి గారు, నీలి మేఘాల్ని సమీక్షిస్తూ స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి, ఆమెకు మొదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి, ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. అని చెలం చెప్పిన దానిలో మూడో వ్యాక్యమే స్త్రీవాద కవిత్వమంతా అంటారు. ఆమె అనుభవమెన్ని రకాలుగా ఉందనేది “నీలిమేఘాలు” కవితా సంపుటి స్పష్టీకరించింది అంటారు. మరో చోట దళిత స్త్రీ జీవిత కోణాలు ఎన్నో వ్యక్తం కావలసి ఉన్నదని, దానికోసం దళిత రచయిత్రులు కృషి చేయాలని, అప్పుడే సంపూర్ణ దళిత స్త్రీ రూపం, ఆకాంక్షలు తెలుస్తాయంటారు. రచయిత్రుల కథల్ని సమీక్షిస్తూ దళితేతర స్త్రీల రచనల్లో దళిత స్త్రీల సమస్యలు, ఆరాటాలు, ఆవేదనలు తక్కువగా ప్రతిపాదితమైనాయని, దళిత సాహిత్యం విశేషంగా విస్తరించినా ఈ దశ నుండి లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుందని అంటారు. నూతన దశాబ్ది చైతన్యాన్ని పురోగతిని దళిత స్త్రీకి అందివ్వగలిగితే ఈ దేశం పురోగతి సాధించినట్టే అని మధుజ్యోతి గారు ప్రకటిస్తారు. “ఎల్లి” నవలలను విశ్లేషిస్తూ ఎరుకల జీవితంతో స్త్రీకి సముపార్జించే శక్తిగా గుర్తింపు ఉందని, మారు మనువు చేసుకునే అవకాశం కూడా ఉన్నదని అయితే ఇవి స్త్రీల పరిధిలో లేక పురుషాధిపత్యం కింద ఉన్నాయంటూనే సభ్య సమాజం వీటి నుండి నేర్చుకోవలసింది ఉన్నదంటారు.
1950-60 ల  కడప జిల్లా  అరసం (రారా,సోదుం సోదరులు) ప్రభావంతో వచ్చిన సంజీవమ్మ గారి విమర్శా వ్యాసాలు, సామాజిక వ్యాసాలు చెప్పుకోదగ్గవి. అభ్యుదయ, విశాలాంధ్ర పత్రికల్లో అనేక సామాజికాంశాల మీద వ్యాసాలు రాస్తుంటారు. “సమాజ పురోగమన చరిత్రకు సాహితీ వికాస చరిత్రను అన్వయించి పరిశీలించడం మార్క్సిజం నేర్పింది” అంటారు సంజీవమ్మ గారు. విమర్శ గురించి చెప్తూ “రచన మానవీయ సంస్కృతిని పెంచేదిగా, హృదయ సంస్కారాన్ని ఇచ్చేదిగా ఉందో లేదో చెప్పాలి. ఇది తేల్చడానికి విమర్శకునికి స్పందించే మనసు, పరిశీలించే, విశ్లేషించే నిశితమైన బుద్దీ రెండూ ఉండాలి” అంటారు. “స్త్రీ వాద సాహిత్యాన్ని పురుషులే ఎక్కువగా చదవాలని, అప్పుడే వారు సలసల కాగే స్త్రీల మనసును చదవగలుగుతారు” అని స్త్రీ వాద సాహిత్య ప్రాశస్త్యాన్ని చెప్తూ చలం స్త్రీ స్వేచ్ఛను ఒక కోణం నుండి చూస్తే నేటి స్త్రీ వాదం దాన్ని ఎన్నో కోణాల నుండి చెప్పింది అంటారు. సంజీవమ్మ గారి నిశితమైన విమర్శ కథల్లో అనవసర పద ప్రయోగాల్ని ఎత్తి చూపెడుతుంది. సానుభూతిని సంపాదించే పద ప్రయోగాలు అసలే వద్దని, సున్నితమైన భావాలు కథా గమనంలో ఇమిడి పోవాలంటారు. విశ్వనాధ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ విశ్వనాధ గొప్ప పండితుడని అయితే ఫ్యూడల్ సంస్కృతిని సమర్ధించడంలో ఆయన  పాండిత్యం, కష్టం అన్నీ నష్టమైపోయాయంటారు.
కడపజిల్లాకే చెందిన మరొక విమర్శకురాలు కిన్నెర శ్రీదేవి గారు అరసం ప్రవేశపెట్టిన ఒరవడిని అందిపుచ్చుకున్న మూడోతరం రచయిత్రుల్లో ఒకరు. ఓల్గా రచనల్ని విశ్లేషిస్తూ ఓల్గా “రాజకీయ కథ”ల్లో పితృస్వామిక మూలాలను ప్రశ్నించగలిగారని అదే “ప్రయోగం” దగ్గరికి వచ్చేసరికి నిర్మాణ రాహిత్యాన్ని, అంతర్గత స్వేచ్ఛాభావాన్ని, సమాజానికి అతీతమైన జీవితానందాన్ని ప్రతిపాదించారని విమర్శించారు. అయితే కేతు విశ్వనాధ రెడ్డి కథల్ని పరిచయం చేస్తూ “మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే” అన్న సూత్రం రచయితకు తెలుసు అంటూ చాలా మందిలానే మార్క్సిజాన్ని అపరిపక్వంగా సూత్రీకరించారు. అట్లాగే త్రిపుర కథల్ని సమీక్షిస్తూ మనిషి నిర్మించుకున్న యంత్రం మనిషిపైనే ఆధిపత్యం చలాయిస్తూ మానవ విలువల పతనానికి దారితీస్తున్నది అంటారు. ఉత్పత్తి సంబంధాలను, ఉత్పత్తి శక్తుల మీద పెట్టుబడి గుత్తాధిపత్యాన్ని అర్ధం చేసుకోగలిగితే పెట్టుబడిదారీ సంస్కృతి విధ్వంసక రూపాన్ని, సమాజంపై దాని ప్రభావాన్ని అంచనా వేయగలిగితే ఇటు సూత్రీకరణలు రావు.
అంతగా గుర్తింపు పొందక పోయినా, రాసింది కొన్ని వ్యాసాలే అయినా కె. సునందగారిది అద్భుతమైన వచనం. “కథలు కబుర్లు” అని ఇటీవల విడుదలైన వీరి పుస్తకంలో కథలు, కవిత్వంతో పాటు రచయిత సొంత అనుభవాలు, ప్రతిస్పందనలతో 12 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. “అమ్మ” నవల, నటి సావిత్రి అభినయం, రిటైర్మెంట్ జీవితం, క్లాస్ రూం కబుర్లు. ఇట్లా ఎన్నో విభిన్న అంశాలపై పాఠకులతో పంచుకున్న భావాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. పుస్తకం రూపంలో ఒక చోట కూర్చితే గాని పట్టించుకోని ఉదాసీనత వల్ల ఇంకెంతో మంది రచయిత్రుల్ని గుర్తించలేకపోవడం తేలిగ్గా క్షమించే నేరం కాదు. ఆ రకంగా ఇది చాలా అసంపూర్ణ పరిశీలన. కుసుమకుమారి గారి “సామైక వ్యాసాలు” పుస్తకం, “సాహిత్యం స్త్రీ చైతన్యం” కూడా నాకు లభించలేదు. అట్లాగే ప్రసాదిని దేవి గారి వ్యాసాల్ని సేకరించలేక పోయాను.
ఉర్ధూ విదూషీమణుల చరిత్రల్ని మనకు పరిచయం చేస్తున్న ఫాతిమ హుసేన్ గారు కూడా రాయలసీమ (కడప) వారే. వీరి వ్యాసం “స్త్రీ జాతి శిరోభూషణం బక్షీబేగం కడపోత్సవాల సావనీర్ లో ప్రచురించబడింది. కడప జిల్లాకు చెందిన పుట్టపర్తి నాగ పద్మిని గారు సంగీత సాహిత్య స్రవంతి, సాహితీ మంజూష , మదర్ థెరిస్సా, మహిళా నోబెల్ గ్రహీతలు వంటి వ్యాసాలు రాశారు. అట్లాగే స్త్రీ సమస్యలపై, మూడనమ్మకాలపై వ్యాసాలు రాసిన పసుపులేటి పద్మావతమ్మ కూడా కడప జిల్లాకు చెందిన రచయిత.
సామాజిక ఆచరణతో పాటు, అందులో భాగంగా సమకాలీన సామాజిక స్థితిగతుల్ని, స్త్రీ సమస్యల్ని వ్యాసాలుగా రాసిన విష్ణుప్రియ గారు గతంలో మహిళా మార్గం ఎడిటర్ గా పనిచేశారు. లేడీస్ బోగీలో పురుషుల చొరబాటు దగ్గరినుండి ఉద్యమంలో భాగస్వాములైన స్త్రీలపై రాజ్యం అమలు చేసే హింస వరకు అనేక అంశాలపై స్పందిస్తూ ఎన్నో వ్యాసాలు రాసారు. అట్లాగే విప్లవ రచయితల సంఘం సభ్యురాలు శశికళ గారు ఎన్నో పుస్తక సమీక్షలు, వ్యాసాలు రాశారు. శశికళ గారికి కథా రచయితగానే ఎక్కువ గుర్తింపు ఉంది. కాల గర్భంలో కలిసిపోయిన త్యాగాల చరిత్రను కొత్తకోణంలో ఆవిష్కరించాలంటూ ముస్లిం మహిళల సాహస గాధలను పరిచయం చేసినా, అటు అనంతపురం ఇటు మహబూబ్ నగర్ కరువు పల్లెలను పరామర్శించినా, దళితస్త్రీ విముక్తికి అ, ఆ లు దిద్దిన సావిత్రీబాయి ఫూలేను ఆవిష్కరించినా చరిత్రను, సామాజిక చలనాల్ని ఎంత అర్ధవంతంగా విశ్లేషిస్తారో అంతే సున్నితంగా పాఠకుల హృదయాల్ని స్పర్శిస్తారు. శశికళ గారి ప్రోత్సాహంతో అనంతపురం లో వి.సుభాషిణి, నాగరత్న వంటి వారు ఇటీవలే వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అనంతపురానికే చెందిన కోడూరి గిరిజ, కోడూరి అరుణ తమ ఉపాధ్యాయ వృత్తిలోని అనుభవాలను, పాఠశాల విద్యార్ధుల సాదకబాదకాలను దినపత్రికల్లో రాస్తున్నారు. “ప్రియదర్శిని” లో వీరి వ్యాసాలు ప్రచురితమైనాయి.
కథా రచయితగా ప్రసిద్ధి చెందిన నిర్మలా రాణి గారు కూడా అనేక వ్యాసాలు రాశారు. 1995 లో మద్దూరు దళిత స్త్రీల భూపోరాట విజయాల్ని వారి త్యాగాలకు, వారి మనో నిబ్బరానికి గుర్తింపుగా చెప్తూ పోరాట క్రమాన్నంతా వివరించారు నిర్మలారాణి. అనంతపురం జిల్లా కరువు ప్రాంతాలను పర్యటించి అక్కడ నడిచే గాయాలవంటి ప్రజల దుఃఖాన్ని కథల, వ్యాసాల రూపంలోకి  అనువదించారు నిర్మలారాణి గారు. స్త్రీ ఆర్ధిక స్వేచ్ఛ, సమానత్వం గురించేగాక ఉరిశిక్ష వంటి అనాగరిక అవశేషాలను హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ వ్యాసాలు రాశారు.
రచయిత్రుల వ్యాసాలను గురించిన పై పరిచయం “కడప మనలో మనం” రచయిత్రుల సమావేశం కోసం చాలా పరిమితమైన కాల వ్యావధిలో సేకరించగలిగిన వ్యాసాలకు సంబంధించినదే. ఇంకా చేయవలసిన అధ్యయనం చాలానే ఉంది.
                                                                                                                          -  పి.వరలక్ష్మి
. ప్రాణహిత.ఆర్గ్ సౌజన్యంతో..   

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...