Wednesday, April 17, 2013

విమర్శలో రారా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నసింగమనేని-ఆచార్య రాచపాళెం

సింగమనేని నారాయణ గారు సాహిత్యం గురించి సభలలో, సాహితీ మిత్రులతో చర్చించేది అపరిమితం. సాహిత్యం గురించి విమర్శ రాసేది పరిమితం. చర్చల ద్వారా సాహిత్య విమర్శను విస్తరిస్తూ విమర్శ రచన ద్వారా ఉత్తమ సాహిత్యాన్ని, అధమ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు సింగమనేని. ఆయన కథ, నవలా రచయిత. ఆయన విమర్శకూడా ఆరెండింటి మీదనే ఎక్కువ. కొల్లాయి గట్టితేనేమి?, జానకి విముక్తి వంటి నవలల మీద, చాసో రారా, రాజారాం మొదలైన కథకుల మీద సింగమనేని చేసిన విమర్శలో తెలుగు సాహిత్య విమర్శలోని ఆరోగ్యకర ధోరణి, నిబద్ధతకు నిదర్శనాలు. సమాజ సాహిత్యాల సంబంధాలపట్ల, సాహిత్య ప్రయోజనం పట్ల, సాహిత్య కారుల కర్తవ్యం పట్ల స్పష్టమైన అభిప్రాయాలు గల సింగమనేని సాహిత్య విమర్శలో నిక్కచ్చితనం కనిపిస్తుంది. 
సాహిత్యాన్ని గురించి అపారంగా చర్చిస్తూ సాహిత్య సృష్టిని, సాహిత్య విమర్శ సృష్టిని పరిమితంగా చేసే సింగమనేని, విమర్శలో కరుకుదనాన్ని ప్రదర్శించడంలో రారా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లనిపిస్తుంది. ఆయన విమర్శల్ని చదివితే ఆయన్ని మరో రారా అనాలనిపిస్తుంది. ఇలా అనిపించడానికి రెండు కారణాలున్నాయి. 1. సింగమనేని రారా లాగే పాఠకుడి దృష్టికోణం నుంచి రచనను అంచనా కట్టడం. ఏ రచనను విమర్శించినా అది పాఠకుని మీద ఎలాంటి ప్రభావంచూపిస్తుందో చెప్పడం. 2. రచనలో రచయితలో నచ్చిన అంశాన్ని ఎంత మక్కువతో చెబుతారో నచ్చని దాన్ని అంత కటువుగా చెప్పడం, రచయితలు ఎంత పేరుగలిగినవాళ్లైనా వ్యతిరేకించవలసి వచ్చినప్పుడు ఉపేక్షించకపోవడం.
రారా, సాహిత్యం పాఠకుని సంస్కారం మీద ప్రభావం చూపిస్తుందని బాగా ప్రచారం చేశారు. సింగమనేని ఆయన మార్గంలో ఈ అభిప్రాయాన్ని అనేక విమర్శ వ్యాసాలలో ప్రస్తావిస్తూ వచ్చారు. ” రారా కథలన్నీ చదివిన తరువార పాఠకుడి సంస్కార స్థాయి ఒక మెట్టయినా పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు (పాఠకుడి సంస్కారస్థాయిని పెంచే రారా కథలు)” (స్త్రీ వాద కథలు ముఖ్యంగా పురుష పాఠకులను చాలా డిస్టర్బ్ చేశాయి”) ( తెలుగు కథ, 1990 తరువాత) ” చాసోగారు ఎందుకు ‘పారేస్తాను నాన్నా’కథలో పన్నెండేళ్ల కృష్ణుడి అంతరంగం, ఆ తండ్రి సంఘర్షణ, ఆర్ధిక అసహాయత పాఠకుణ్ణి కలచి వేస్తాయి” (చాగంటి సోమయాజులు కథలు) ‘ కల్లేటి వంకా కథ లోని అనైతిక సంబంధాల చిత్రణనుసరించి చెబుతూ, వాటిని చదివిన “పాఠకులు మూర్చ పోవలసిందే” అంటారు. డా. వి. చంద్ర శేఖర రావు 2002లో రాసిన కథలలోని శిల్పాన్ని గురించి చెబుతూ” పిడికెడు విమర్శకుల మెప్పుకోసమే కథలు రాస్తూ అనంతమైన పాఠకుల్ని మరచి పోయారు, చంద్ర శేఖర రావు” అంటారు. (తెలుగు కథ 2002).
ఇలాంటి అభిప్రాయాలన్నీ చదివినప్పుడు బాగా చదువుకున్న సాహిత్య విమర్శకుడు, సామాన్య పాఠకుని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారనిపిస్తుంది. రంగనాయకమ్మ, చంద్ర శేఖర రావు, గోపిని కరుణాకర్ వంటి రచయితలలోని గుణా గుణాలను నిజాయితీగా విశ్లేషించిన సింగమనేని నిబద్ధ విమర్శకుడు.
సింగమనేని సాహిత్య విమర్శనంతటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్యయనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసి వస్తాయి. సాహిత్య సృజన కైనా, సాహిత్య విమర్శకైనా ఆ అభిప్రాయాలు బాగా దోహదం చేస్తాయి. సామాజిక విమర్శకులలో కట్టమంచి నుంచి లెక్క వేసుకుంటే నాలుగు తరాల వాళ్లు కనిపిస్తారు. మార్క్సిజం స్పర్శ లేకుండా సమాజజీవితానికి సాహిత్యం దర్పణంగా, ప్రతిఫలనంగా భావించే కట్టమచి తరంలో రాళ్లపల్లి, పుట్టపర్తి వంటి వాళ్లూ వస్తారు. మార్క్సిజం తెలుగు వాళ్లకు పరిచయమైన తరువాత పునాది ఉపరితల సిద్ధాంతం ప్రకారం సాహిత్యం కళలో ఉపరితలాలుగా భావించే తరం శ్రీ శ్రీ, కొ. కు. ఎం. ఆర్. చంద్ర, పుచ్చల పల్లి వంటి వాళ్లది. ఆ సిద్ధాంతాలను మరింత స్పష్టతతో ముందుకు తీసుకు పోయిన తరం రారా, వల్లంపాటి, కేతు, కొలకలూరి, చేరా, వి. వి. , త్రిపురనేని మొదలైన వాళ్లు. అ తర్వాతి తరంలో వేణు, సింగమనేని, చెంచయ్య, తెలకపల్లి, ఎస్వీ, కాత్యాయని విద్మహే వంటి వాళ్లు ఉన్నారు. ఈ తరంలో మనకు దళిత బహుజన, మైనారిటీ, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వాలు తమదైన ప్రమాణాలతో తెలుగు సాహిత్యం లోకి, విమర్శలోకి ప్రవేశించాయి. సింగమనేని వీళ్లందరినీ అధ్యయనం చేశారు, చేస్తున్నారు.
సింగమనేని సాహిత్యంలో వస్తువులోనే కాదు, శిల్పం లోను వాస్తవికత ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులను, ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువును అందకుండా అడ్డుకునే ప్రయోగాలను, పాఠకుడు ఊహించని మలుపులను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అందుకే ఆయన “స్పష్టమైన ప్రాపంచిక దృక్పధం ఉంటే మెలో డ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చునంటారు (రాయలసీమ కథా చిత్రం). సిద్ధాంతాలకోసం రచన చేయడాన్ని కొడవగంటిలాగే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామాజిక మూలాలు తవ్వి తీయాలి గాని, రచనలు సిద్ధాంతాలు వల్లించకూడదంటారు. రచయితలు సాధించదలచుకున్న ప్రయోజనం కోసం పాత్రల్ని బలిపెట్టకూడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే రచనలో పనిగట్టుకొని ఉపన్యాసాలివ్వడాన్ని, ఆరకంగా కళాధర్మాలను అతిక్రమించడాన్ని సింగమనేని పూర్తిగా తిరస్కరిస్తారు. శిల్ప మర్యాదాతిక్రమణను ఆమోదించని నిబద్ధత విమర్శకులు సింగమనేని. అందుకే ఆయనను క్లుప్తతకు మారుపేరైన చాసో అంటే మహా ఇష్టం. ” ఏ కథలో కూడా (చాసో) రచయిత ప్రవక్త స్థానంలో కూచోడు. “అని ప్రశంసించిందిందుకె. (చాగంటి సోమయాజులు కథలు). సినిమాలలో లాగే కల్పనా సాహిత్యంలో కూడా రచయితల ఆదర్శీకరణ అనే బలహీనతకు లోనై పాత్రల చైతన్య స్థాయికి విరుద్ధంగా పాత్రల్ను చిత్రిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మాటల్ని చెప్పించటం, అసంబద్ధమైన త్యాగాలను చెయ్యించడం వంటి వి చెయ్యిస్తారు. సింగమనేని ఈ అతి పాత్రీ కరణను వాస్తవికత విరుద్ధమైనదిగా భావిస్తారు. అందునే అల్లం రాజయ్య ‘అతడు’ కథలో మితిమీరిన వీరపూజను చూశారు. సింగమనేని (తెలుగు కథ 1990 తరువాత).
ఎంత విస్తృతంగా రచనలు చేసే వాళ్లైనా పునరుక్తులు చెయ్యడం, మూస ధోరణిలో పడిపోవడం ఉపేక్షించదగింది కాదని సింగమనేని భావన. సహజత్వం, అనివార్యత, వైవిధ్యం – ఇవి రచనకు ప్రాణ భూతమైన లక్షణాలుగా సింగమనేని భావిస్తారు. విశ్వసనీయత దెబ్బతింటే రచనా ప్రయోజనం దెబ్బతింటుందని ఆయన హెచ్చరిక చేస్తారు. రచనంతా చదివిన తరువాత రచనలో రచయిత ఏమిచెప్పదలుచుకున్నారో పాఠకుడికి తెలియకపోతే ఆ రచన దండగని కూడా సింగమనేని నిష్కర్షగా చెప్తారు. (తెలుగు కథ 2002).
సాహిత్య రచనలో రచయితలు సామాజిక సమస్యల్ని ఆవిష్కరించి పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి పరిష్కారాలను పాఠకులకే వదిలివేయాలి తప్ప పరిష్కారం చెప్పే భాధ్యతను రచయితలు తీసుకోరాదు అని భావించడంలో సింగమనేని 1935 -40 ల నాటి కొడవగంటి అభిప్రాయాన్ని సమర్ధిస్తారు. చాసో ను ఈ విషయంలో సింగమనేని బాగా మెచ్చుకుంటారు.
మంచి సాహిత్య పఠనం పాఠకుల్ని ప్రభావితం చేసి,వాళ్ళ సంస్కారంలో మార్పులు తీసుకొచ్చి,వాళ్ళను చెడ్డ సాహిత్య పఠన ప్రభావం నుండి కాపాడుతుందని సింగమనేని అబిప్రాయం. యుద్దనపూడి సులోచనారాణి ‘కీర్తి కీరీటాలు’ నవలను గురించి “ప్రజా వ్యతిరేక సాహిత్యాన్ని తిప్పికొట్టగల చైతన్యం పాఠకుడు సాధించినపుడు ఇలాంటి నవలలు తుక్కు కుండీలలోకి చేరుకుంటాయి”అని, రంగనాయకమ్మ “జానకి విముక్తి “నవలను గురించి పాఠకుల్ని భ్రమల్లో ముంచే రంగురంగుల ప్రేమలనుండి మన సాహిత్యం విముక్తి చెందాలి అన్న స్పూర్తినిస్తుందీ అని ఆయన వ్యాఖ్యానించడంలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది
సాహిత్యం భావ ప్రచారానికి బలమైన సాధనం అన్న అభిప్రాయంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. అయితే రారా లాగే ప్రచార వాఙ్మయమంతా సాహిత్యం కాదని సాహిత్యం లో ప్రచార గుణంతో పాటు కళాత్మకత అత్యంత ముఖ్య మైన భాగమని గట్టిగా నమ్ముతారు. తత్వోపదేశంకోసం శిల్ప మర్యాదలను అతిక్రమించరాదని ప్రభోదిస్తారాయన.
ప్రేమ విషయంలోనే కాదు ,ప్రజల జీవితంలో ఏపార్శ్వం పట్లనైనా రచయితలు పాఠకులలో భ్రమలు పెంచరాదన్నది సింగమనేని ధృడమైన అభిప్రాయం. అందుకే ఆయన కాల్పనిక సాహిత్యంలో ఈ బలహీనతను పెంచే రచయితల్ని వ్యతిరేకించారు. పాఠకుల్ని వాస్తవికతా మార్గంలో నడిపించే రచయితల్ని ప్రశంసించారు. కేతు విశ్వనాధ రెడ్డి గారి కథల్ని గురించి చెబుతూ అవి “రంగుల ప్రపంచం నుండి వాస్తవిక ప్రపంచంలోకి పాఠకున్ని నెట్టుతాయి”అనడం ఈ దృష్టితోనే (కేతు విశ్వనాధ రెడ్డి కథలు,ఒక సమీక్ష).
పాఠకులను ఏడిపించి వాళ్లకు కన్నీళ్లు తెప్పించడం సాహిత్య కర్తవ్యం కాదని కొడవగంటి అభిప్రాయం. సామాజిక వాస్తవికత పట్ల, మానవ కార్యం పట్ల అవగాహనకలిగించే క్రమంలో దుఃఖాన్ని వర్ణించడం అవసరమయినా స్త్రీల దుఃఖాన్ని చావుల్ని వర్ణించిపాఠకుల్ని ఏడిపించడం సాహిత్యం ద్వారా సమాజానికి నష్టం చేయడమేనన్నది ఆయన అభిప్రాయం. సింగమనేని ఆతానులో పోగే గనుక ఆ అభిప్రాయాన్నే కలిగియున్నారు. చెడుపట్ల అయిష్టత, కోపం, వ్యతిరేకత కలిగించడమే రచయిత చేయవలసిన పని అనిన సింగమనేని చావును వర్ణించి పాఠకులకు కన్నీళ్లు తెప్పించడం చాసో దృక్పధం కాదు. అని తీర్మానించడంలోని అంతరార్ధమిదే.
రచనలో రచయితలు ఎన్ని కల్పనలు చేసినా ఎన్ని పాత్రలను, సంఘటనలను, సన్నివేశాలను సృష్టించినా వాటి మధ్య అంతర్గత ఐక్యత ఉండాలి. రచయిత రచన మొత్తమ్మీద ప్రతిపాదింప దలుచుకున్న ప్రధాన ప్రయోజనానికి అవి దోహదం చెయ్యాలి. ఇది ప్రాచీన సంప్రదాయ భారతీయ అలంకారికులనుండీ,కట్టమంచి విశ్వనాధ, రారా, కొకుల మీదుగా నేటి దాకా అందరూ చెబుతున్నదే. బహుశా సాహిత్య లోకంలో ప్రాచీనులు ఆధునికులు సంవధించిన ఏకైకాంశం ఇదేననుకుంటాను. సింగమనేని ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. రచయితకుండే మూఢవిశ్వాసాలను పరోక్షంగా పాఠకుడి బుర్రలోకి ఎక్కించాలని ప్రయత్నించే రచయితలకు కొదవలేదు. శిల్పంతో పాఠకులలోకి చాలా చెడును ఎక్కించవచ్చు. అందుకే వస్తువులోనైనా, శిల్పంలోనైననా రచయితలు చేసే కల్పలనను, ప్రదర్శించే విన్యాసాలకు సామాజిక ప్రయోజనం దెబ్బతినని ఐక్యత, అర్ధం, పరమార్ధం ఉండాలని సింగమనేని కోరుకుంటారు. బెజ్జారపు రవీందర్ ” నిత్య గాయాల నది ” కథలోని లోపాన్ని చూపిస్తూ ” వక్త వ్యాఖ్యల మధ్య ఐక్యత లేక పోవటం ఈ కథలోని బలహీనత” అన్నదిందుకే. (కథ 2002).
రాసింది పరిమిత విమర్శ అయినా ఆరోగ్య కరమైన, నేటికి కావలసిన ఆలోచనలు కలిగున్న సాహిత్య విమర్శకులు సింగమనేని. ఆయనది ప్రగతిశీల కొడవగంటి, రారాల మార్గం.
సమాజం పట్ల తనకొక భాద్యత ఉన్నది అని భావించే విమర్శకులెవరూ విమర్శకు రచనే తప్ప రచయిత అతని స్థలకాలాలు, ప్రమాణాలు కావు అని వాదించరు. అనిబద్ధ సాంప్రదాయ విమర్శకులు మాత్రమే అలా వాదిస్తారు. సింగమనేని రచనను ఒక సామాజిక భాధ్యతగా భావించే రచయిత, విమర్శకుడు గనక రచనను స్థలకాల బద్ధమైన మానవ జీవిత ప్రతిఫలనంగా భావిస్తారు గనక, రచయిత జీవితంతో ముడి పెట్టే రచనను విశ్లేషిస్తారు. అలాగే రచయిత స్థలకాలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొల్లాయి గట్టి తేనేమి ( మహీధర రామమోహన రావు ) నవల మీద రాసిన వ్యాసంలో గొప్ప రాజకీయచారిత్రక నవలగా నిర్వచిస్తూ ఆ నవల కథాకాలాన్ని రచనా కాలాన్ని సమన్వయించుకొన్నారు.
ఒక రచయితను గురించో , ఒక రచనను గురించో విమర్శరాయడం చాలా సులువు. ఒక ప్రాంతపు సాహిత్యాన్ని, ఒక కాలపు సాహిత్యాన్ని మొత్తంగా గాని, ఒక ప్రక్రియను గాని విశ్లేషించడం కష్టం. ఈ కష్టమైన పనిని సింగమనేని ” రాయలసీమ కథా చిత్రం” ‘తెలుగు కథ – 1990 తరువాత’, ‘తెలుగు కథ 2002’ వంటి వ్యాసాలలో చేసి చూపించారు. విస్తృతమైన అధ్యయనం, శాస్త్రీయమైన విశ్లేషణ, విజ్ఞానాత్మక సమన్వయం, ఆలోచనాత్మక సూత్రీకరణలు ఇలాంటి విమర్శకు చాల అవసరం. సింగమనేని విమర్శలో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి.
సులభమైన భాషలో, సుందరమైన శైలిలో అభిప్రాయ ప్రకటన, అవసరమైనప్పుడు పదునైన వాక్య నిర్మాణం సాహిత్య విమర్శకు మేలు చేస్తాయి. సింగమనేనిలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. పంటికింది రాళ్లలా పడికట్టు పదాలు లేని భాష సింగమనేనిది. సరళమైన వాక్యాలు, చక్కని తర్కం, సమాజం పట్ల సాహిత్యం పట్ల మక్కువతో కూడిన వివరణ సింగమనేని విమర్శ శైలిని పాఠకులను ఆకర్షిస్తుంది.
సాహిత్య విమర్శ ఎదిగిందా అని రచయితలు, సాహిత్యం ఎదిగిందా? అని విమర్శకులు అప్పుడప్పుడు కుస్తీకి దిగుతుంటారు. ఇవి అనవసరం. వస్తున్న విమర్శను చదువుకొని జల్లెడ పట్టుకుంటే చాలు. అలా జల్లెడ పట్టితే సింగమనేని విమర్శ ఎదుగుతున్న తెలుగు సాహిత్య విమర్శకు ఒక తార్కాణం గా నిలుస్తుంది.
సింగనేనిది వాస్తవికతావాద విమర్శ. అది కొడవగంటి, రారాల మార్గం
-ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి  
ప్రాణహిత.ఆర్గ్ సౌజాన్యంతో.. 

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...