Monday, April 8, 2013

రాయలసీమ పలుకుబడులు -జానుమద్ది హనుమచ్ఛాస్త్రి

డా. జానుమద్ది హనుమచ్చాస్త్రి 
భాషకైనా ప్రాంతీయ భేదాలు తప్పవు. తిరువాన్కూర్ మలయాళానికి కొచ్చిన్ మలయాళానికి ఎంతో తేడా వుంది. తిరువాన్కూర్ వారు మాట్లాడే భాష- కొన్ని పదాలు కొచ్చిన్ వారికి బూతుగా అర్థం అవుతాయి. కొచ్చిన్ వాళ్ళ భాష అనాగరికమైనదని తిరువాన్కూర్ వాళ్లు హాస్యం చేస్తారు. ఇలాగే మధుర, మద్రాసు తమిళ భాషలకు కూడా తేడాలు కద్దు. మధుర వాళ్లకు తమది ‘శన్దమిల్’ అని ఒక నిక్కు- వాస్తవానికి తమిళంలోని అపురూప కావ్యాలు మధుర ప్రాంతంలోనే బయలుదేరినవి.
అలాగే బెంగుళూరు దగ్గర కొందరు వైష్ణవులు వున్నారు. వాళ్లని ‘హెబ్బార్’ అయ్యంగార్లని పిలుస్తాము. వాళ్లు తమిళానికి పట్టించే అవస్థచూస్తే ఆ భాషపై జాలి కలుగుతుంది. ఇలాగే గదగ్, ధార్వాడ్ ప్రాంతీయ కన్నడానికి మైసూరు కన్నడానికి తేడా వుంది.
ధార్వాడ్ కన్నడంలో మహారాష్ట్ర పదాలు కొన్ని చేరాయి. వాళ్ల ఉచ్చారణలో కూడా కొంత మహారాష్ట్ర యాస కనిపిస్తుంది. తమది పరిశుద్ధమైన భాషయని మైసూరువాళ్ల డంభం. అట్లే తెలుగులో కూడా కొంత ప్రాంతీయ భేదాలు వున్నాయి.
ఒకసారి విశాఖపట్నం పోయినాము. ‘చిలగడ దుంపలు’, ‘ఆనపకాయలు’ అన్నారు. నాకు అర్థం కాలేదు. మళ్లీ తెలుసుకున్నాను. చిలగడదుంపలకు మా వైపు (రాయలసీమ) ‘గెనుసుగెడ్డ’లంటారు. ‘ఆనపకాయ’ అంటే ‘సొరకాయ’ అన్నమాట. రాజమండ్రి, తుని ప్రాంతాలలో తలకాయను ‘బుర్ర’ అంటారు.
రాయలసీమలోనూ బుర్ర శబ్దం వాడతారు. కానీ, దానికి ‘మెదడు’ అని అర్థం. అక్కడ ‘బుర్ర గోక్కున్నావా?’ అని అంటే ‘క్షౌరం చేసుకున్నావా?’ అని అర్థం.
అనంతపురం జిల్లా తెలుగు యితరులకు కొంచెం వింతగా కనపడుతుంది. అందులో కన్నడ పదాల యాజమాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ‘బిడ్లు, గుడ్లు’ అని యెగరేసి మాట్లాడుతుంటారు. అంటే బిడ్డలు అనీ, గుడ్డలు అని అర్థం. ‘ఏమప్పోలేసుగుండావు’ అంటారు. ‘లేసు’ అనేది ‘లెస్స’గా అనేదానికి రూపాంతరము. నేరుగా కన్నడ పదమది. ‘నామరేగితిని’ అంటారు. అంటే- కోపం చేసుకొన్నాను అని భావం. ఇలా రాయలసీమలోనే యితర ప్రాంతాలను అనంతపురం జిల్లా మాటలు కొంత తేడాగా వుంటాయి.
కోలారు ప్రాంతం తెలుగు యింకా చిత్రంగా వుంటుంది. ‘గూట్లో వునే్వ’ గూటిలో వున్నాయని అభిప్రాయం. ‘కూస్తాడు’ అంటే ‘పిలుస్తాడు’ అన్నమాట. ‘‘వాడు నిన్ను కూస్తాడు’’ అంటే - ‘‘వాడు నిన్ను పిలుస్తాడు’’ అని అర్ధం. ‘మరంత్యా’ ‘చేట తీసుకునిరా’ అని భావం. ఇలా కన్నడ పదాలు చేర్చి, పదాలు యెగరవేస్తూ మాట్లాడతారు. చిత్తూరు జిల్లా తెలుగు అదోరకం. ‘పూడ్చినాడు’ అంటే ‘పోయినాడని’ అర్థం. ‘సాపాటినావా?’ అంటే ‘్భంచేసినావా’ అని ప్రశ్న. ‘వారుదా పూడ్చెను’ అంటే- వాడు వెళ్లిపోయినాడని అర్థం. ఈ ‘దా’ అనేది తమిళం నించి దిగుమతి. తమిళంలో దీనికి ఒక అర్థం నిర్ణయం వున్నది. ‘తాన్’ అంటే ‘తానే’ అని అర్థం. ‘ఆనందాన్’ వారే చిత్తూరు ‘దా’కు మాత్రం వాళ్లే అర్థం చెప్పాలి.
అది కల్పవృక్షంలా పనిచేస్తుంది. కొంతవరకు కడప జిల్లాలో స్వచ్ఛమైన తెలుగు కనపడుతుంది. అందులో కూడా కొంత ఉర్దూ ప్రభావం వుంది. ‘వేమ్’ అనడానికి ‘బేమ్’ అంటారు. ఈ ‘చ’కారానికి ‘బ’కారాము- ఉర్దూ (ప్రభావము) ‘యాకన’ అంటే యొక్క రూపాంతరం. ‘గణుమాడుకొనడము’ అంటే- ‘నిందించుకొవడము’ అని అభిప్రాయం.
కడప జిల్లా వాళ్లు వాళ్లు మాట్లాడే కొన్ని అశ్లీల పదాలు- వాళ్లకు అశ్లీలంగానే తోచనే తోచవు. సర్వసాధారణంగా వాడేస్తూంటారు. కొన్ని పదాలు చాలా కాలం క్రిందట పోతన్న వాడిన ‘దొబ్బు’ పదాన్నిబట్టి, ఈయన రాయలసీమ వాడని కొందరు పండితులు వాదించుకొన్నారు.
పోతన్నలో మరియొక పదం కూడా వుంది. ‘సంతన’- ఇది కూడా అచ్చంగా రాయలసీమ పదమే. అంటే- ‘‘ఇంట్లో యెవరూ చేసేవారు లేర’ని అర్థం.
ఉత్తరాదిలో ‘పోవాలి’ ‘కావాలి’ అంటారు. రాయలసీమలో ‘పోవాల’ ‘రావాల’ అంటారు. చిత్తూరులో యధాప్రకారం ‘పూర్చినాడు’ ‘వచ్చిడిసినాడు’ అంటారు. ‘కన్యాశుల్కం’లోని కొన్ని తెలుగు మాటలు మాకు అర్థమే కావు.
ఆయన (గురజాడ) రాసినవంతా విజయనగర భాష. కడప జిల్లాలో కొళాయిల దగ్గర ఆడవాళ్ళు ప్రబంధాల్లోని మాటలు వాడుతుంటారు. ‘‘ముదిమది తప్పు’’ అని, ‘‘ముదిమది తప్పింద్యా’’ అంటారు. అంటే ‘వయస్సుయి’ ‘అస్తావిస్తం’(్ఛదస్తం) పట్టిందా అని భావం. ‘పందేకాడు అయినావు’ అంటే పెద్దపాలెగాడన్నమాట. ‘పచ్చిగా మాట్లాడటం’ యేమైనా మరుగు లేకుండా అనే అర్థంలో వాడ్తారు.
కొన్ని రాయలసీమ మాటలు పాతవేయందు కొత్తగా కనబడతాయి. ‘మినుముల’ను రాయలసీమలో ‘వుద్దులు (ఉద్దిబేడలు)’ అంటాం. ఇవి తమిళం నుంచి వచ్చిన శబ్దం. ‘పురల్’ అంటే ‘దొర్లుట’ అని శబ్దార్థం. అలాగే, మా ‘తెంకాయ’ లేక ‘టెంకాయ’ వారికి ‘కొబ్బరికాయ’, తెన్ అంటే దక్షిణం. దక్షిణ సముద్ర ప్రాంతాల్లో కొబ్బరికాయలు యెక్కువగా పండుతాయి. కాబట్టి దానికా పేరు వచ్చింది. కాలక్రమేణా ‘తెంకా’ టెంకాయ’ అయ్యింది. అరవలు ‘తెన్’ అనే వాడ్తారు. ‘తెన్’ అంటే ‘టెంకాయ’ అనే వ్యవహారము.
ఒకసారి యెప్పుడో బెజవాడలో నేను ‘కళ్ళ అద్దాలు’ అంటే ఒకాయన నవ్వినాడు. ‘కళ్ళజోడు’ అనాలట. వానికి కళ్లే లేనట్లు. ఇలాంటి వెక్కిరింతలు అన్నీ ధనమదంతోనే, అధికారమదంతోనో వచ్చే పిచ్చి చేష్ఠలు. ఇంకా రాయలసీమ వ్యవహారాలు వేలకు వున్నాయి.
అన్నమయ్య సాహిత్యాన్ని చూస్తే- పశ్చిమాంధ్ర పదాలు కొన్ని వేలకు చిక్కుతాయి. దీనికి కారణం ఏమిటి? మఖ్యంగా ప్రబంధ సాహిత్యమంతా రాయలసీమలో పుట్టిందే. ఒక్కమాటతో చెప్పితే రాయలసీమ లేకుంటే- ఒక్క భారతం తప్ప తెలుగుకు యేమీ మిగలదు. సహృదయంతో రుూ సత్యాన్ని అంగీకరించాలి.
క్షేత్రయ్య పాటలో ‘పామిడి, గుర్రం’ అనే ఒక ప్రయోగమున్నది. అన్నమయ్య కూడా ‘పామిడీతురగమని’ వాడినాడు. పామిడితురగమని వాదం, పామిరి అనంతపురం జిల్లాలోనిది. అది విజయనగర కాలంలో గుర్రపు దండుకు ఒక స్కంధావారము. (స్వేదము, తూకం వేసే చోటు). ఇలా ఎన్నో వున్నాయి. అరవవాళ్లు ‘మనుచరిత్ర’ అంటే ‘అరవ’ అనే పదము వస్తుంది. ‘అళువపట్టు’ అంటాం- అంటే హఠం అన్నమాట. ‘అళువ’ అన్నది ఒక జంతువు. ఆ జంతువు చాలా చిన్న తాబేలువలె వుంటుంది. మేమంతా దానిపైభాగమంతా చిన్న చిప్పలు. ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకుంటాయి. అంటే గట్టిగా పట్టుకొంటుంది. ఆ చిప్పలలో ఏదేని కాలు పడినా గోవిందా!
ఒకసారి పెనుకొండలో పెద్దపులి ఆళువపైన కాలుపెట్టింది. అది బిగుసుకొంది. ఆ పెద్దపులి అరిచి అరిచి చచ్చింది. ఈ జంతువును ఉత్తరాదిలో ఏమంటారో తెలియదు. మా (రాయలసీమ)వైపు ‘ఆళువ పట్టు’ అని ప్రసిద్ధము. చెప్పాలంటే యిలాంటివి చాలా వున్నాయి.
(పై వ్యాసం పుట్టపర్తివారు దాదాపు 30 ఏళ్ళ క్రితం రాశారు. ఆ వ్యాసం ఎపుడో ఆంధ్రప్రభ దినపత్రికలో వేశారు. ఆ వ్యాసం జిరాక్స్ ప్రతి నా కవిలెకట్టలో వుంటే ఎత్తి రాయించాను. అందలి అక్షరాలు సరిగా కానరావు)

                                                                                     -జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ

Andhrabhoomi Daily  

09/04/2013


No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...