Friday, April 19, 2013

బైరెడ్డి సీమ ఉద్యమం ప్రచ్ఛన్న సమైక్య ఉద్యమం-- పాణి

బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రతిరోజూ మాట్లాడుతున్నదాంట్లో తార స్థాయిలో తెలంగాణ వ్యతిరేకత తప్ప రాయలసీమ సమస్యల గురించి ఏమీ లేదు. ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. విడిపోతే రాయలసీమ ఇవ్వాలి అని తప్ప రాయలసీమకు ఇంతకాలం ఎవరి నుంచి అన్యాయం జరిగిందో, ప్రత్యేక రాయలసీమ ఎందుకు కావాలో ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు.

రాయలసీమ ప్రాంత పరిరక్షణ కోసం, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలులో ప్రారంభించిన మేల్కొలుపు దీక్ష ఈ రోజుతో ముగియనుంది. రాయలసీమ ప్రాంత సమస్యలపై ఆయన గతంలో కూడా ఇట్లాగే కొంత కాలం హడావిడి చేసినట్లు గుర్తు. అయితే ఈసారి ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని కూడా అందుకున్నారు. మంచిదే. ప్రత్యేక రాయలసీమ అనే నినాదం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో పీలగా కొంచెం వినిపించింది. మళ్లీ దాని ఊసు కనిపించలేదు. 1980లలో సీమ సమస్యలపై ఆందోళన జరిగినా అందులో ప్రత్యేక రాష్ట్ర నినాదం లేదు. ఈ ఆకాంక్షను చాలా కాలం తర్వాత రాయలసీమ విద్యావంతుల వేదిక బైటికి తీసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పోటీగా రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సమైక్య వాదం వీధుల్లో మురికి కాలువలాగా పోటెత్తినప్పుడు కొద్ది మంది ప్రజాస్వామికవాదులు రాయలసీమ విద్యావంతుల వేదికగా ఏర్పడ్డారు. గతంలో సీమ సమస్యలపై జరిగిన పోరాటాల్లోని అవగాహనకు పూర్తి భిన్నమైన వైఖరిని ఈ వేదిక తీసుకున్నది. దానికి సీమలోని సమైక్యవాదుల నుంచి తీవ్ర అభ్యంతరమే వచ్చింది.కొద్ది మంది ప్రజాస్వామికవాదుల నుంచి, ముఖ్యంగా దళిత బహుజన శ్రేణుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమలోని ఫ్యాక్షనిస్టులు పేదలను, దళిత బహుజనులను బతకనియ్యరని.. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఫ్యాక్షనిస్టులకు అప్పగించినట్టవుతుందని అన్నారు. దాని మీద వేదిక చాలా విశ్లేషణ ఇచ్చింది. శక్తి మేరకు దాన్ని నాలుగు జిల్లాల ఆలోచనాపరుల్లోకి తీసుకెళ్లింది. ఎమ్మార్పీఎస్ కూడా దీనికి గొంతు కలపడం వల్ల సహజంగానే ఆ నినాదానికి కొంచెం బలం వచ్చింది. రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక రాష్ట్రంలోనే ఉందని ప్రచారం చేయగలిగింది.

ఆ సమయంలో రాయలసీమ హక్కుల పోరాటం చేస్తున్న మంత్రి టీజీ వెంకటేశ్ అంత దాకా సమైక్య ఉద్యమ సారథిగా ఉంటూ హఠాత్తుగా ప్రత్యేక రాయలసీమ అనడం మొదలు పెట్టారు. తెలంగాణ ఇచ్చేటట్లయితే రాయలసీమ రాష్ట్రం కూడా ఇవ్వాలని గొడవ ప్రారంభించారు. గ్రేటర్ రాయలసీమ అనే కబ్జా వాదం ముందుకు తెచ్చారు. పనిలో పనిగా కొందరు రాయల తెలంగాణ కావాల్సిందే అని కూడా అన్నా రు. ఇది తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకమేగాక, సీమ అస్తిత్వాన్ని తుడిచిపెట్టేసే వాదన. ఆ కాలమంతా సీమ గురించి ఏమీ మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు ఏకంగా రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి దీక్షలకు దిగారు. ఒక విషయం మీద ఎవరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ ఏం మాట్లాడుతున్నారనేదే ముఖ్యం. గత నెలా నెలన్నరగా ఈ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లోగాని, ఈ దీక్షల సందర్భంగాగాని బైరెడ్డి విమర్శలన్నీ తెలంగాణ ఉద్యమం మీదనే. కేసీఆర్ గురించి ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే బైరెడ్డి రాయలసీమలో ఏ వర్గానికి చెందినవాడో తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వర్గానికి చెందిన వాడు.

క్లాసికల్ భాషలో చెప్పాలంటే ఇద్దరూ ఆయా ప్రాంతాల బూర్జువా వర్గానికి చెందినవారు. కాకపోతే దశాబ్దాలుగా భంగపడుతూ, పోరాడుతూ ఉన్న తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్ష గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణ ఎట్లా తెస్తారు? తెచ్చాక ఆయన ఆ రాష్ట్రాన్ని ఏం చేస్తారనే విషయంలో సందేహమే అక్కర్లేదు. అక్కడొక ఫక్తు బూర్జువా పాలన కొనసాగడం తప్ప వేరే అద్భుతం జరగదు. కాకపోతే పంపకాలు కొంచెం న్యాయంగా జరిగితే అక్కడి ప్రజలకు ఆ మేరకు మేలు జరుగుతుంది. అంతకు మించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డం ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవ సమస్య కాబట్టి తరతరాల ఆ కోరిక తీరుతుంది. ఆ రకంగా అవి చిన్నవేమీ కాదు. బైరెడ్డికి ఇవేవీ రుచించవు. సమైక్య రాష్ట్రంలోని ప్రాంతాలను, ప్రజలను దోచుకోవడానికి ఇప్పటిలా తెలంగాణ రాష్ట్రంలో వీలుకాదు. అదే ఆయన అభ్యంతరం. అదే ఆయన చేపట్టిన రాయలసీమ ఉద్యమ పరమార్థం. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా కేసీఆర్ తదితర తెలంగాణ నాయకులను విమర్శించడమేగాక ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఇవ్వనని గట్టి హామీ ఇస్తే తాను సీమ ఉద్యమం చేయనని దాపరికంలేకుండా ప్రకటించుకుంటున్నారు. ఆయన ప్రతిరోజూ మాట్లాడుతున్నదాంట్లో తార స్థాయిలో తెలంగాణ వ్యతిరేకత తప్ప రాయలసీమ సమస్యల గురించి ఏమీ లేదు.

ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. విడిపోతే రాయలసీమ ఇవ్వాలి అని తప్ప రాయలసీమకు ఇంతకాలం ఎవరి నుంచి అన్యాయం జరిగిందో, ప్రత్యేక రాయలసీమ ఎందుకు కావాలో ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. గత మూడు రోజుల దీక్షలో తెలంగాణ వ్యతిరేకత.. తన సాంస్కృతిక స్థాయికి తగిన భాషలో తెలంగాణ వాళ్లను తిట్టడం తప్ప మరో ముచ్చట లేదు. కనీసం ఇప్పటికి ఆయన నోటి వెంట శ్రీబాగ్ ఒడంబడిక ప్రస్తావనే రాలేదు. కర్నూలు రాజధానిని తెలంగాణ వాళ్లు ఎత్తుకపోయారనే ఊకదంపుడు ప్రసంగం తప్ప ఆ సందర్భంగాగాని, అంతక ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడుగాని సీమ ప్రయోజనాల కోసం జరిగిన ఎన్నెన్ని ఒప్పందాలు ఏమైపోయాయో ప్రస్తావనే లేదు. వాటిని కోస్తా పాలకులు ఎందుకు ఉల్లంఘించారో, వాటి వల్ల ఆ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో ఊసే లేదు. ఇవేవీ ఆయనకు తెలియవని అనడం కంటే- వాటిని ఉల్లంఘించి సీమను దుంపనాశనం చేసిన కోస్తా పాలకవర్గాల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం ఆయన ప్రారంభించిన రాయలసీమ ఉద్యమ వ్యూహాత్మక లక్ష్యం. రాయలసీమకు దశాబ్దాలుగా కోస్తా ప్రాంత పాలకులు అన్యాయం చేస్తున్నారని మాట వరసకు కూడా అనకుండా సీమను పరిరక్షిస్తానని ఉద్యమాలకు దిగడం ఎంత ధూర్తత్వం! రాయలసీమ వాళ్లకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను శతృవుగా చూపడం తప్ప ఈ ఆందోళనలో రాయలసీమ ప్రయోజనాలు ఇసుమంత కూడా లేవు.

కేసీఆర్‌తో బైరెడ్డి ఏమైనా గొడవపడవచ్చు. వాళ్లిద్దరూ నిజంగానే సమ ఉజ్జీలు. కానీ తెలంగాణ వ్యతిరేకతే సీమ ప్రయోజనాల పరిరక్షణ అవుతుందా? రాయలసీమ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కూడా ఆలోచించాలి. విచిత్రమేమంటే నిజంగానే సీమ ప్రయోజనాలపట్ల అనురక్తి ఉంటే ఆయన దాడి చేయాల్సింది లగడపాటి వంటి కోస్తా పాలకులతో. కానీ బైరెడ్డి వాళ్ల ప్రస్తావన కూడా తీసుకరాడు. ఎందుకంటే ఆయన సీమ ఉద్యమం ప్రచ్ఛన్న సమైక్య ఉద్యమం. కోస్తా పాలకులతో సీమ ప్రాంతీయ బూర్జువావర్గం చెట్టాపట్టాలేసుకొని తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యం. ఈ మొత్తంలో ఘోరంగా వంచనకు గురవుతున్నది సీమ ప్రజలు. ఆ ప్రాంతానికి తరాతరాలుగా కోస్తా పాలకులు అన్యాయం చేస్తూ ఒక కన్ను పొడిచేస్తే ఇప్పుడు స్థానిక పాలకులు రెండో కన్ను కూడా పొడిచేస్తున్నారు. తెలంగాణ వేరైతే కృష్ణా నది నీటి పంపకం విషయంలో ఆ ప్రాంతం వాళ్లకు, రాయలసీమ వాళ్లకు మధ్య ప్రజాస్వామిక ఒప్పందాలు జరగాల్సి ఉంటుంది. ఈ ఇచ్చిపుచ్చుకొనే అవసరాలు సీమ ప్రజలకు తెలంగాణతోనే ఉంటాయి. ప్రత్యేక రాయలసీమ కోరేటట్టయితే ఇలాంటి విషయాల పట్ల చాలా దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. హైదారాబాదు వంటి విషయాల్లో కూడా సీమ ప్రజల భయ సందేహాలను తీర్చి, సీమ ప్రత్యేక రాష్ట్రానికి ఒక నగరం, రాజధాని ఎలా? ఉండే అవకాశం ఉందో చర్చించాల్సి ఉంటుంది. ఇట్లాంటి ప్రజాస్వామిక దృక్పథంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నప్పుడు తెలంగాణ ఎంత న్యాయమో అర్థమవుతుంది.

కానీ రాయలసీమకు తెలంగాణను శతృవుగా నిలబెట్టి బైరెడ్డి ఉద్యమం సాధించేదేమీ లేదు. ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. తమ ప్రాంతానికి ఇంత కాలం నష్టం చేస్తున్నది కోస్తా వాళ్లనీ, రేప్పొద్దున తెలంగాణ వచ్చాక సీమకు కోస్తా పాలకుల వల్లనే తీవ్ర నష్టాలు వస్తాయనీ, ఆందువల్ల ప్రత్యేక సీమ తప్పనిసరి అని తెలుసుకోవలసి ఉంది. తెలంగాణ వ్యతిరేక రాయలసీమ ఉద్యమం సారాంశంలో సమైక్య ఉద్యమమే అవుతుంది. ఈ దీక్షలు సమైక్య వాదుల మేలుకొలుపుగా తెలంగాణ వాళ్లు ఎట్లాగూ గుర్తించగలుగుతారు. సీమ ప్రాంతీయులు కూడా ఈ సమైక్య ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంది. ఇవేవీ సీమ ప్రజలకు తెలియవనుకొని ఉద్యమాన్ని నడపాలనుకోవడం నిజంగానే ఎంత తెంపరితనం!
- పాణి,  ఆంధ్ర జ్యొతి దినపత్రిక 10-08-2012

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...